– గోపరాజు విశ్వేశ్వరప్రసాద్‌

‘‌వృక్షాన్ని నువ్వు రక్షిస్తే, అది నిన్ను రక్షిస్తుంది’ అంటుంది భారతీయ ధర్మం. అలాంటి వృక్షాల మహా సమూహమే అడవి. అడవి అంటే భారతీయులకి ఓ ఆకుపచ్చ సంద్రం కాదు. ఆయాచితంగా సంపదనిచ్చే ఖజానా కాదు. అడవంటే జ్ఞాన నిలయం. తపోభూమి. అడవంటే ఆరోగ్య ప్రదాయిని. ఔషధుల ఖని. ఒక్క మాటలో చెప్పాలంటే అడవి భారతీయ ఆత్మ. జీవితాన్ని నాలుగు భాగాలు చేసుకుంటే అందులో ఒక భాగానికి వానప్రస్థాశ్రమం అన్న పేరు పెట్టి, అడవిలో తమని తాము  భాగం చేసుకున్నారు భారతీయులు. ఈ అద్భుత చింతనను గతం గూటిలోకి నెట్టడం సరికాదు. ఇప్పుడు అడవులకు మనిషి చేస్తున్న చేటును ఆపాలంటే ఆ భావన ఉపయోగపడుతుందని ఆశిద్దాం. అడవిని రక్షించుకోవాలన్న నినాదం ఈ క్షణం నుంచి ప్రతి గుండె లయ కావాలి. లేదంటే రేపన్నరోజు ఆ గుండె కొట్టుకోవడం కష్టమవుతుంది. అడవి లుప్తమైతే మంచి గాలి ఉండదు. అడవి నరికితే భూమి ధ్వంసమవుతుంది. చెట్లు నరికితే పర్యావరణం నాశనమవుతుంది. వీటన్నిటికి స్పందించేది నీ గుండె, నా గుండె, మనందరి గుండెలు. అడవిని రక్షించుకోవడం ధార్మిక విషయమే కాదు. శాస్త్రబద్ధం కూడా. కాని వనాల మీద భారతీయులు పెంచుకున్న భావనకు వేళ్లు విజ్ఞానశాస్త్రంలో ఉన్నాయి.

చెట్టును కూల్చడమంటే హత్యతో సమానం. ఒక అడవిని నిర్మూలించడమంటే ఒక జాతి మీద జరిగిన సామూహిక హననం కాదా! చెట్టుకు అనుభూతులుంటాయి. చెట్టుకు వ్యక్తీకరణలుంటాయి. వైర్లెస్‌ ‌సిగ్నలింగ్‌, ‌మైక్రోవేవ్‌ ఆప్టిక్స్ ‌శాస్త్రవేత్త సర్‌ ‌జగదీశ్‌ ‌చంద్రబోస్‌ ‌వంటి మహా శాస్త్రవేత్త చెప్పిన అద్భుత సత్యమిది. చెట్టుకు అనుభూతులు ఉంటాయని ఆయన నిరూపించారు. లండన్‌ ‌రాయల్‌ ‌సొసైటీలో 1901లో ఏర్పాటు చేసిన ప్రదర్శనలో రుజువు చేశారు. జంతువులకు వలెనే మొక్కలకీ నాడీ వ్యవస్థ ఉంటుందని చెప్పారాయన. వాటికి హాని జరిగితే మౌనంగా రోదిస్తాయి కూడా. వాటిని నిర్మూలించుకోవడం అంటే మానవాళి తనను తాను నిర్మూలించుకోవడమే.

పచ్చదనం మీద కక్ష

అడవులు స్వచ్ఛమైన గాలినిస్తాయి. వాతావరణాన్ని ఆహ్లాదకరంగా మారుస్తాయి. పర్యావరణ సమతుల్యాన్ని కాపాడతాయి. ఉపాధినిస్తాయి. జీవజాలానికి ఆశ్రయమిస్తాయి. సకాలంలో వానలు కురిపిస్తాయి. భూగర్భ జలాల పరిరక్షణ, కర్బన ఉద్గారాల తగ్గింపు, వాతావరణ మార్పుల నియంత్రణలో అడవులు విశేషమైన పాత్ర పోషిస్తాయి.

కానీ రానురాను ఆధునికత, అభివృద్ధి, ప్రజావసరాలు, పట్టణీకరణ పేరుతో విచక్షణా రహితంగా వనాల నరికివేత సాగిపోతోంది. ఇది ఏ ఒక్క దేశానికో, రాష్ట్రానికో పరిమితం కాలేదు. ప్రపంచవ్యాప్తంగా కళ్లకు కడుతున్న దుష్పరిణామం. పచ్చదనం మీద మనిషి కక్ష కట్టినట్టే వ్యవహరిస్తున్నాడు. దీనివల్ల కలిగే అనర్థాలు విపరీతంగా ఉంటున్నాయి. వాయు కాలుష్యం పెరిగిపోతోంది. స్వచ్ఛమైన గాలి కరవవుతోంది. వన్యప్రాణులు ఆహారం కోసం వనాలు వదలి పల్లెలు, పట్టణాలకు తరలుతున్నాయి. పంటలను ధ్వంసం చేస్తున్నాయి. ప్రజలను భయపెడు తున్నాయి. దాడులు చేస్తున్నాయి. రుతుపవనాలు క్రమం తప్పుతున్నాయి. వర్షాలకు విఘాతం కలుగుతోంది. అయితే కుంభవృష్టి, లేకపోతే అనావృష్టితో యావత్‌ ‌భూ మండలం తల్లడిల్లుతోంది. విశ్వవ్యాప్తంగా అడవుల క్షీణత మానవాళి మనుగడను ముప్పులోకి నెడుతోంది. చెట్లు తరిగేకొద్దీ కరవులు, తుపాన్లు, వరదలు, వాతావరణ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇవి ప్రజలకు సవాళ్లను విసురుతున్నాయి.

ఏటా నాశనమయ్యే అడవి ఎంతో తెలుసా?

 ఐక్య రాజ్య సమితి అంచనా ప్రకారం ఏటా దాదాపు కోటీ ఇరవై లక్షల హెక్టార్ల అటవీ విస్తీర్ణం హరించుకుపోతోంది. వనాల క్షీణత, జలవనరులతో పాటు వాతావరణ మార్పులపై, జీవనోపాధులపై ఇది తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. 12 నుంచి 20 శాతం వరకు కర్బన ఉద్గారాలకు అడవుల క్షీణతే కారణం. ఈ పరిస్థితిని అధిగమించేందుకు 2012 నవంబరులో ఐక్యరాజ్య సమితి నడుంబిగించింది. అడవులను కాపాడాల్సిన, వాటిని విస్తరించాల్సిన అవశ్యకతను వివరించేందుకు, ప్రజల్లో అవగాహన, చైతన్యం కలిగించేందుకు ఏటా మార్చి 21న అంతర్జాతీయ అటవీ సంరక్షణ దినోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. ఆ మేరకు 2013 నుంచి ఏటా ఒక కొత్త సరికొత్త ఆలోచనతో ప్రపంచ దేశాలు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి.

కాపాడలేకపోతున్న ‘కంపా’

కానీ అడవుల రక్షణ కాగితాల మీదే విస్తరిస్తున్నది. అనేక దేశాలు అంతర్జాతీయ అటవీ దినోత్సవాన్ని మొక్కుబడిగా నిర్వహిస్తుండటంతో ఆశించిన ఫలితాలు రావడం లేదు. పాలకులలో చిత్తశుద్ధి లేక వనాల నరికివేతకు అడ్డుకట్ట పడటం లేదు. కొత్తగా వనాల పెంపకం తూతూ మంత్రంగా సాగుతోంది. మొక్కలు నాటేందుకు వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నామని పాలకులు గొప్పలు చెప్పుకుంటున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఆ మేరకు ఫలితాలు కనపడటం లేదన్నది చేదు నిజం. జలాశయాలు, వివిధ ప్రాజెక్టులు, రహదారుల నిర్మాణం, విస్తరణ, ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాలకు ఏటా పెద్దయెత్తున వనాలను వినియోగిస్తుండటంతో అవి కుచించుకుపోతున్నాయి. ఈ పరిస్థితిని అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం కొన్నేళ్ల క్రితం ‘కంపా’ పథకాన్ని తెరపైకి తీసుకువచ్చింది. కాంపన్సేటరీ అఫారెస్టేషన్‌ ‌మేనేజ్‌మెంట్‌, ‌ప్లానింగ్‌ అథారిటీ (ప్రత్యమ్నాయ వనీకరణ నిధి ప్రణాళిక సంఘం)కి సంక్షిప్త రూపమే ‘కంపా’. కోల్పోయిన అటవీ భూమి మేరకు ప్రత్యామ్నాయంగా అడవులను పెంచడం ఈ పథకం ప్రధాన ఉద్దేశం. దీనికింద 27 రాష్ట్రాలకు కేంద్రం 2019లో రమారమి రూ. 47వేల కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులను ప్రత్యమ్నాయ అటవీ పెంపకం, వన్యప్రాణుల సంరక్షణ, అడవుల్లో అగ్ని ప్రమాదాల నివారణ తదితరాలకు వెచ్చించాల్సి ఉంటుంది. అటవీ భూములను పారిశ్రామిక అవసరాలకు బదలాయిస్తే, ఆ మేరకు అడవుల పెంపకం చేపట్టాలన్న ఆలోచనతో ‘కంపా’ పథకం రూపుదిద్దుకుంది. పథకం లక్ష్యాలు సమున్నతమే. కానీ ఆచరణ అంతంత మాత్రం. వివిధ ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయ లోపం, కాగితాలపై లెక్కలు, క్షేత్రస్థాయిలో లోపాల కారణంగా అడవుల పెంపకం కార్యక్రమం నత్తనడకన నడుస్తోంది.

ఆవాసం కోల్పోయి…

ఈ మధ్య అడవి జంతువులు గ్రామాల మీద పడుతున్నాయి. నష్టం చేస్తున్న మాట నిజం. ఏనుగులు చేలను, తోటలను నాశనం చేస్తున్నాయి. పులులు, చిరుతపులులు గ్రామ శివార్లలో ఉండే ఆవులనీ, గేదెలనీ చంపి తింటున్నాయి. ఎలుగులు, కొండ చిలువలు ఎక్కడ బడితే అక్కడ కనిపిస్తున్నాయి. వాటి నివాసం కనుమరుగైపోతోంది. తినడానికి ఆహారం కరవైపోతోంది. అది మనిషి దుర్మార్గపు ఫలితం. వాటి తప్పు కాదు. అడవుల నరికివేత వల్ల అనేక అనర్థాలు చోటు చేసుకుంటున్నాయి. ఆఖరుకు గుక్కెడు నీరూ కరవైంది. చిన్నపాటి చెరువులు, కుంటలు, కాలువలు అడుగంటిపోయాయి. వన్యప్రాణులు అడవులను వీడి జనావాసల్లోకి వస్తున్నాయి. ఇటీవల కాలంలో ఈ బెడద అధికమైంది. చిత్తూరు, శ్రీకాకుళం జిల్లాల్లోని అటవీ ప్రాంతాల నుంచి ఏనుగులు సమీప పంట పొలాలకు వచ్చి తింటున్నాయి. వరి, చెరకు, మామిడి తోటలు వాటికి ఆహారంగా మారుతున్నాయి. కొన్నిచోట్ల ఏనుగులు దాహార్తి తీర్చుకునేందుకు వచ్చి బావుల్లో పడిపోతున్నాయి. చిరుతలు, పులులు సైతం క్షుద్భాధను తీర్చుకునేందుకు జనావాసాలకు వచ్చి గేదెలు, ఆవులు, మేకలు, గొర్రెలను కబళించడం పరిపాటైంది. జనావాసాలకు వచ్చే వన్య ప్రాణులను బంధించడం అటవీశాఖ అధికారులకు పెద్ద సవాల్‌గా మారింది.

వనాల విస్తీర్ణం తగ్గడానికి పోడు వ్యవసాయం కూడా కొంతవరకు కారణం. అభివృద్ధి పేరుతో విచక్షణారహితంగా అడవులను ధ్వంసం చేయడం, నదీగమనాలను మళ్లించడం, నీటి వనరులను విచ్చలవిడిగా వాడటం వైపరీత్యాలకు దారితీస్తోంది. కొండలను, గుహలను తొలచి, భారీ సొరంగాలను తవ్వి విద్యుత్‌ ‌ప్రాజెక్టులను నిర్మిస్తుండటంతో ప్రకృతి సమతుల్యం దెబ్బతిని అనర్థాలు చోటుచేసు కుంటున్నాయి. ఇటీవలి ఉత్తరాఖండ్‌ ‌వరదలకు ఇదే కారణం. అడవులు జీవ వైవిధ్యానికి మారుపేరుగా నిలుస్తాయి. ఇక్కడ అనేక రకాల జంతుజాలాలు మనుగడ సాగిస్తాయి. దాదాపు అరవై వేల చెట్ల జాతులు ఉన్నయాని అంచనా. ఈ వైవిధ్యమే మానవాళికి మేలు చేస్తుంది.

ముప్పయ్‌ ‌మూడు శాతం అడవి ఏది?

ఇప్పుడు ఆ వైవిధ్యాన్ని ధ్వంసం చేసుకుని ఒక మహా విపత్తుకు మానవాళి చేరువైంది. దీని గురించిన హెచ్చరికలు దశాబ్దాల క్రితమే మొదలైనాయి.  కానీ దాని నుంచి రక్షించడానికి తీసుకున్న చర్యలు ఏమిటి? గత ఆరేళ్లలో దేశవ్యాప్తంగా అటవీ విస్తీర్ణంలో పెరుగుదల ఒక శాతాన్ని మించలేదు. ఇది వాస్తవం. నాలుగేళ్ల క్రితం కేంద్ర సర్కారు వెల్లడించిన వివరాల మేరకు దేశంలో మొత్తం అడవుల విస్తీర్ణం రమారమి 7,08,278 చదరపు కిలోమీటర్లు. అంటే భారతావని భౌగోళిక ప్రాంతంలో దాదాపు 21 శాతం. ఇది ఇప్పుడు 27 శాతానికి చేరిందని సర్కారీ గణాంకాలు చెబుతున్నప్పటికీ, పర్యావరణ నిపుణులు మాత్రం ఇందుకు భిన్నమైన గళాన్ని వినిపిస్తున్నారు. 2009-15 మధ్యకాలంలో దేశవ్యాప్తంగా అడవుల విస్తీర్ణం పెరుగుదల 1.29 శాతమే కావడం గమనార్హం. 1952 నాటి జాతీయ అటవీ విధానం 33 శాతం విస్తీర్ణంలో అడవులు ఉండాలని నిర్దేశిస్తుండగా అది 21 శాతాన్ని అధిగమించడం కనాకష్టంగా మారింది. ఇప్పటికీ ఈ లక్ష్యాన్ని చేరుకోవడం నేటికీ ఎండమావిని తలపిస్తోంది. పారిస్‌ ఒప్పందం ప్రకారం 2030 నాటికి 250 కోట్ల నుంచి 300 కోట్ల టన్నుల కార్బన్‌ ‌డై ఆక్సైడ్‌కు సమానమైన ఉద్గారాలను తగ్గించేందుకు దేశంలో అటవీ విస్తీర్ణాన్ని పెంచుతామని భారత్‌ 2015‌లో పేర్కొంది. నిర్దేశిత 33 శాతం అటవీ విస్తీర్ణం లక్ష్యసాధన నేటికీ కలగానే మిగిలింది. అదే సమయంలో భారత్‌ ‌కన్నా అనేక చిన్నదేశాలు స్ఫూర్తిదాయకంగా ముందుకు సాగుతుండటం గమనార్హం. పొరుగున ఉన్న చిన్న దేశం భూటాన్‌లో 71 శాతం అడవులు ఉన్నాయి. అయిదు దశాబ్దాల కాలంలో దక్షిణ కొరియా అటవీ విస్తీర్ణం రెట్టింపైంది. ఇప్పుడక్కడ 64 శాతం పైగా భూభాగం పచ్చదనం సంతరించుకుంది. గతంలో 21 శాతం అడవులకే పరిమితమైన కోస్టారికాలో నేడు 52 శాతం విస్తీర్ణంలో అడవులు విస్తరించాయి. టాంజానియాలో 52 శాతానికి విస్తరించింది. మనకన్నా ఎంతో చిన్న దేశాల స్ఫూర్తిమంతమైన విజయగాథల నుంచి భారత్‌ ‌నేర్చుకోవలసింది ఎంతో ఉంది.

వెలవెలబోతున్న వన మహోత్సవం

భూమి మీద దాదాపు 31 శాతం మేరకు విస్తరించిన అడవులపై దాదాపు 300 కోట్ల మంది ప్రజానీకం ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడి జీవిస్తోంది. వృక్ష సంపదతో పాటు జీవవైవిధ్యానికి నెలవైన అడవులు భూమిపై 80 శాతం జంతుజాలా నికి, కీటక జాతులకు ఆవాసంగా ఉన్నాయి. మానవ జీవనంలో అడవుల ప్రాధాన్యాన్ని గుర్తించిన ప్రభుత్వం తొలిరోజుల్లో ఆ దిశగా అడుగులు వేసింది. 1950లో నాటి కేంద్ర వ్యవసాయ, ఆహార శాఖమంత్రి డాక్టర్‌ ‌కె.ఎం. మున్షీ వన మహోత్సవం కార్యక్రమాన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి ఏటా ఈ కార్యక్రమాన్ని పెద్తయెత్తున నిర్వహిస్తున్నా ఆశించిన ఫలితాలు మాత్రం సమకూరడం లేదు. నిధులు మాత్రం భారీగా ఖర్చవుతున్నాయి. పర్యావరణ మంత్రిత్వశాఖ పరిధిలోని జాతీయ అటవీ సర్వే సంస్థ 1987 నుంచి రెండేళ్లకోసారి ఉపగ్రహ ఛాయా చిత్రాల ద్వారా అడవుల పరిస్థితిని ప్రజల ముందు ఉంచుతోంది. అయితే ఈ సంస్థ లెక్కల్లో కచ్చితత్వం కొరవడిందన్న వాదన ఉంది.

 తెలుగు రాష్ట్రాలలోను అంతంత మాత్రమే

 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అడవుల పెంపకానికి వివిధ కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ ఆశించిన ఫలితాలకు ఇప్పటికీ ఆమడ దూరంలోనే ఉన్నాయి. అడవుల సంరక్షణ, వాటి విస్తీర్ణం పెంపకం ద్వారా వాతావరణ మార్పులను, సవాళ్లను ఎదుర్కొనవచ్చు. ఇందుకోసం ఉద్దేశించిన ‘గ్రీన్‌ ఇం‌డియా’ పథకం నిర్దేశించిన లక్ష్యాలకు చేరువ కాలేకపోయింది. ఈ పథకం కింద పదేళ్ల కాలంలో రూ. 60వేల కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించారు. అయితే ఆ మేరకు నిధుల కేటాయింపులు లేకపోవడంపై పార్లమెంటరీ స్థాయి సంఘం ఆక్షేపణ వ్యక్తం చేసింది. ఈ సంఘం సూచనలు, సలహాలకు మన్నన కొరవడింది.

ఏపీ సర్కారు ‘వనం-మనం’ పేరుతో, తెలంగాణ సర్కారు హరితహారం పేరుతో ముందుకు సాగుతు న్నాయి. ఈ కార్యక్రమాలను మరింత వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది. ఏపీ ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాల ఫలితంగా రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం కొద్దిమేరకు పెరిగింది. 2019 డిసెంబరు నాటి గణాంకాల ప్రకారం కర్ణాటకలో 1025 చదరపు కిలోమీటర్లు, ఏపీలో 990, కేరళలో 823 చదరపు కిలోమీటర్లతో మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. గత ఏడాది జూన్‌లో ఆరో విడత హరితహారం కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. జంగల్‌ ‌బచావో- జంగల్‌ ‌బఢావో (అడవులను కాపాడదాం- అడవులను విస్తరిద్దాం) కార్యక్రమాన్ని చేపట్టింది. కోతుల బెడదను నివారించేందుకు ప్రత్యేకంగా గుర్తించిన 37 రకాల మొక్కల జాతులను అటవీ ప్రాంతాల్లో నాటాలని నిర్ణయించింది. కేవలం మొక్కలను నాటడమే కాకుండా, వాటిని కాపాడే బాధ్యతను ప్రతిఒక్కరూ చేపట్టాలని నిర్ణయించింది. రాష్ట్రంలో ఉన్న 24 శాతం అడవులను 33 శాతానికి పెంచే లక్ష్యంతో ఆరో విడత హరితహారం కార్యక్రమాన్ని పెద్దయెత్తున ప్రారంభించారు. మొత్తం 20 కోట్ల మొక్కలను నాటాలన్నది లక్ష్యం. 2015 నుంచి 2020 వరకు తెలంగాణలో 151.78 కోట్ల మొక్కలను నాటినట్లు అంచనా.

కేరళ  విధానం భేష్‌

‌వనాల సంరక్షణకు కేరళ సర్కారు కొత్త విధానాన్ని ప్రకటించింది. నాలుగైదు బీట్లు, రెండు మూడు సెక్షన్లకు కలిపి ఒక అటవీ స్టేషన్‌ను ఏర్పాటు చేశారు. ఈ విధానం కేరళలో మంచి ఫలితాలను తెచ్చిపెట్టింది. అడవుల సంరక్షణలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. వాననీటిని ఒడిసి పట్టేందుకు ప్రకృతి ప్రసాదించిన వనరులు అడవులు. వీటి ప్రభావం భూమి పైభాగం కంటే చెట్ల వేళ్లు, ఒండ్రు మట్టితో కలగలిసిన అంతర్భాగంలోనే అధికంగా ఉంటుంది. అడవులు వాననీటిని నేలపై మట్టి పొరల ద్వారా సంగ్రహించి భూగర్భ జలాల అభివృద్ధికి దోహద పడతాయి. ఈ భూగర్భ జలాలను అవసరమైనప్పుడు తాగు, సాగునీటి అవసరాలకు వినియోగించుకోవచ్చు.

అటవీ శాఖలో ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేయక పోవడం, అడవుల్లో తరచూ ఏర్పడే కార్చిచ్చులను అరికట్టలేకపోవడం వల్ల భూమిపై ఒండ్రు తగ్గిపోతుంది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు అడవుల్లో కందకాలను తవ్వాల్సిన అవసరం ఉంది. అటవీ భూముల ఆక్రమణ, చెట్ల నరికివేతను నివారించాలి. కేవలం మొక్కలను నాటడంతోనే సరిపెట్టకుండా వాటిని బతికించడంపై శ్రద్ధ చూపడం తప్పనిసరి. మొక్కలను నాటి, వాటిని కాపాడే విద్యార్థులకు మార్కుల పద్ధతిని ప్రవేశపెట్టాలి. నాటిన మొక్కలను జియో ట్యాగింగ్‌ ‌చేసి సంరంక్షించడం అవసరం. వనాలను సంరక్షించడం, వాటిని విస్తరించడంలో కొందరు వ్యక్తులు, సంస్థలు చేస్తున్న ప్రయత్నాలు అభినందనీయం. ఒకపక్క వనాల నరికివేతను అడ్డుకుంటూ, మరోపక్క వనాల విస్తీర్ణం పెంపుదలకు ప్రతిఒక్కరూ పాటుపడాల్సిన అవసరం ఉంది. ఇది ఏ ఒక్కరి బాధ్యతో కాదు. సమష్టి బాధ్యత. మొక్కల పెంపకం ద్వారా పరోక్షంగా ముందుతరాల వారికి మేలు చేస్తున్నామన్న విషయాన్ని గ్రహించాలి. మన పిల్లలకు సంపద ఇవ్వకున్నా మంచి పర్యావరణాన్ని అందించాల్సిన బాధ్యత ఉంది.

పరిపూర్ణమైన పల్లె అంటే…

పల్లె పరిపూర్ణం కావాలంటే మూడు రకాల వనాలలో ఏదో ఒకటి ఉంటేనే సాధ్యమంటుంది వేద సంస్కృతి. అవి మహావనం, శ్రీవనం, తపోవనం. చెట్లు, వాటి సాంద్రతను బట్టి ఆ వనం ఏదో నిర్ణయించేవారు. అడవుల పరిరక్షణ ఐదుగురు పెద్దలతో కూడిన పంచాయతీ స్వీకరించేది. గ్రామానికి ఒక వనంతో పాటు, గ్రామంలోని ప్రతి ఇల్లు చిన్న వనంలా ఉండాలన్న నిబంధన ఉంది. వీటితో పాటు ప్రతి పల్లెలో ఐదు రకాల చెట్లు అనివార్యంగా ఉండాలి. పంచవటి అంటే అదే. అవి మళ్లీ పంచభూతాలకు ప్రతీకలే. అంటే ఇంటి చుట్టూ చెట్లు పెంచుకోవాలి. వరాహమిహిరుడి బృహత్కథ (క్రీ.శ. 700) చెట్టుకీ, చెరువుకీ ఉన్న బంధం గురించి ప్రస్తావించింది. చెరువుల నిర్మాణం ఎలా ఉండాలో, వాటి గట్టున ఏఏ చెట్లు ఉండాలో కూడా తెలియచేశాడాయన. మర్రి, మామిడి, తాటి వంటి చెట్లు ఉండాలట. అశోక చక్రవర్తి పదునాలుగు ప్రముఖ శాసనాలలో రెండోది రోడ్లపక్క చెట్లు నాటడం, ఖాళీ జాగాలలో పళ్లచెట్లు నా•డం అనివార్యం చేశాడని చెబుతుంది. భారతవర్షంలో మొక్కకూ మతానికీ బంధం కలపడంలో గొప్ప ఆశయమే ఉంది. ఔషధీ లక్షణాలు ఉన్న కొన్ని చెట్లనీ, మొక్కలనీ దైవంతో సమంగా చూడమని చెబుతారు. రావి చెట్టుకు అలాంటి మర్యాద కనిపిస్తుంది. ఉపనిషత్తులు, గీత కూడా ఆ వృక్షాన్ని గౌరవించమని చెబుతాయి.సింధు నాగరికతలో కూడా అశ్వత్థ వృక్షాన్ని పూజించడం కనిపిస్తుంది. చాతుర్మాస దీక్షలో ఉండగా (నాలుగు మాసాలు, జూలై నుంచి అక్టోబర్‌) ‌చెట్లను పూజిస్తారు. అప్పుడు వాటి మీద దేవతలు నివసిస్తారని ప్రతీతి. అవసరమైతేనే చెట్టు కొడతారు. కొట్టడానికి ముందు ఆ వృక్షాన్ని క్షమాపణలు కోరే కొన్ని మంత్రాలు కూడా పఠిస్తారు. ఇక తులసి మొక్కను ప్రతి పెరడులోని నాటుకుని హిందువులంతా పూజిస్తారు. నక్షత్ర వనాలు మరొక అంశం. అంటే ఏ నక్షత్రంలో పుట్టిన వారు ఆ నక్షత్రానికి సంబంధించిన చెట్టును రక్షిస్తూ ఉండాలి.

చెట్లు సంఘజీవులు

పీటర్‌ ‌హొల్లెబెన్‌ ‌రాసిన ది హిడెన్‌ ‌లైఫ్‌ ఆఫ్‌ ‌ట్రీస్‌లో ఇలాంటి విషయాలు చెప్పారు. చెట్లు తమలో తాము సమాచారం పంపుతాయి. ఆఫ్రికాలో పెరిగే గొడుగు ఆకారంలో ఉండే అకాసియస్‌కు జిరాఫీలు తన ఆకులు తింటే ఇష్టం ఉండదట. అందుకే జిరాఫీ తినకుండా ఆ మొక్కలు ఆకుల్లోకి క్షణాలలో ఒక రకమైన విషపదార్థాన్ని సృష్టించుకుంటాయి. ఈ విషయాన్ని ఆ మొక్కకు వంద గజాల పరిధిలో ఉన్న ఆ జాతి మొక్కలు గ్రహించి, అదే పనిచేస్తాయి. అందుకే మొక్కలు, చెట్లు కూడా సంఘజీవులేనని ఈ జర్మనీ శాస్త్రవేత్త అంటారు. మొక్కల సంఘ జీవనం మనుషుల సంఘ జీవనం మధ్య ఎన్నో పోలికలు ఉన్నాయి. ఏ చెట్టుకు ఆ చెట్టే అడవి కాలేదు. కాబట్టే తన జాతికి చెందిన పక్క చెట్టుకి, ఆఖరికి పోటీదారుకి కూడా అవకాశం ఉన్న చెట్టు అన్నీ అందిస్తుంది. ఆ విధంగా పర్యావరణ సమతుల్యాన్ని పరిరక్షించి వేడిమి నుంచి, ఇతర ప్రతికూలతల నుంచి వాటిని అవి రక్షించుకుంటాయని అంటారు హుల్లెబెన్‌. అసలు ఏ చెట్టుకు ఆ చెట్టు వేరు వేరు యూనిట్లుగా ఉండిపోతే చిరకాలం బతికే అవకాశమే ఉండదంటారాయన. అందులో విస్తుపోయే అంశాలు చాలా చెప్పారాయన.

ఫారెస్ట్ ‌మ్యాన్‌ ఆఫ్‌ ఇం‌డియా

అడవుల అభివృద్ధికి ఎనిమిదో దశకంలో అసోమ్‌కు చెందిన జాదవ్‌ ‌పయెంగ్‌ ‌చేసిన సేవలు ప్రశంసనీయం. పట్టుదలగా పనిచేసిన ఆయన ఏకంగా దాదాపు 1300 ఎకరాల అడవిని నూతనంగా సృష్టించారు. ఇది వాస్తవం. ఆయన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2015లో జాదవ్‌ను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. నాటి రాష్ట్రపతి ప్రణబ్‌ ‌ముఖర్జీ నుంచి ఈ గౌరవాన్ని పొందారు. 2012లో జేఎన్‌టీయూ ఆయనను ఫారెస్ట్ ‌మ్యాన్‌ ఆఫ్‌ ఇం‌డియా బిరుదుతో సత్కరించింది. ప్రతి విద్యార్థి ఏటా కనీసం రెండు మొక్కలైనా నాటాలని, వాటి సంరక్షణలో క్రియాశీల భాగస్వామి కావాలని ఆయన సూచించారు. దీనివల్ల భావిపౌరుల్లో పర్యావరణంపై అవగాహన, చైతన్యం కలుగుతుందన్నది ఆయన భావన.

మన చెట్ల రామయ్య

 ఖమ్మం జిల్లా రెడ్డిపల్లికి చెందిన దరిపల్లి రామయ్య దాదాపు కోటి మొక్కలను నాటి చరిత్ర సృష్టించారు. ఆయన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం వనజీవి రామయ్యను ‘పద్మశ్రీ’ పురస్కారంతో సత్కరించింది. 2017లో నాటి రాష్ట్రపతి ప్రణబ్‌ ‌ముఖర్జీ నుంచి పురస్కారాన్ని అందుకున్నారు. ఆయనకు చెట్ల రామయ్య, వనజీవి రామయ్యగా పేరుంది. మొక్కల పెంపకంలో మమేకం కావడంతో ఆయన వనజీవి రామయ్యగా గుర్తింపు పొందారు.

వృక్ష వైద్యుడు

 కేరళకు చెందిన పర్యావరణ ప్రేమికుడైన కె.బిను మనుషుల్లాగే మొక్కలకు కూడా వ్యాధులు, జబ్బులు సోకుతాయని వాటిని నివారించేందుకు తగిన చికిత్స చేస్తే అవి మళ్లీ మాములు స్థితికి వస్తాయని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు. దీనిని ఆచరణలో చూపించారు. కొట్టాయం జిల్లాలోని ఓ దేవాలయంలో గల 150 ఏళ్ల నాటి చెట్టు పిడుగుపాటుకు గురై కొంతభాగం కాలిపోయింది. తన చికిత్సతో దానికి ప్రాణం పోశారు బిను. బిను ముందుగా చెట్టు కాలిన భాగాన్ని శుభ్రం చేశారు. ఆవుపాలు, పేడ, ఎండుగడ్డి, మట్టి, నెయ్యి, తేనె, అరటిపండు, చెదపుట్టల బురద మిశ్రమం తయారు చేశారు. దాన్ని దెబ్బతిన్న చెట్టు భాగంలో రాశారు. దాన్ని కాటన్‌ ‌వస్త్రంతో కప్పి ఉంచారు. రోజూ పాలు, నీళ్లతో కాటన్‌ ‌బ్యాండేజిని తడిపారు. ఆరు నెలల్లో ఆ చెట్టు కాలిన భాగం మానింది. చివరకు పచ్చగా చిగురించింది. ఈ ప్రయత్నం, ప్రయోగం స్ఫూర్తిదాయకంగా నిలిచింది. అప్పటినుంచి ఆ ప్రాంత ప్రజలు బిను సేవలను పొందున్నారు.

వ్యాసకర్త : సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE