– డా. హిమన్షు కె. చతుర్వేది
స్వతంత్ర పోరాట చరిత్రలో దేశ ప్రజల ప్రగాఢమైన ‘స్వరాజ్య’ భావనను ప్రతిబింబించే చౌరీచౌరా వంటి సంఘటనలను ‘అల్లరి మూకల విధ్వంసం’, ‘సరైన ప్రణాళిక లేకుండా కొద్దిమంది చేసిన దుస్సాహసం’, ‘దారితప్పిన యువత చేసిన ఆగడాలు’ అంటూ అభివర్ణించడం, వాటి గురించిన సత్యాలను మరగుపరచడం ఎందుకు జరిగిందో మనం ఆలోచించాలి.
చరిత్రకు అనేక సాంకేతిక నిర్వచనాలున్నా సూటిగా, సరళంగా చెప్పాలంటే చరిత్ర అంటే పుస్తకాలలో చెప్పిన, అభివర్ణించిన సంఘటనల ఆధారంగా ప్రజల మనసుల్లో ఒక భావనను, అభిప్రాయాన్ని ఏర్పర్చడమని చెప్పుకోవచ్చు. అంటే చారిత్రక కథనాలు తరతరాల అభిప్రాయాలను తీర్చిదిద్దుతాయని చెప్పవచ్చు. అందువల్ల తప్పుడు, అసత్య పూరిత కథనాలు, వ్యాఖ్యానాలు క్రమంగా సత్యాలుగా స్థిరపడిపోయి, చారిత్రక దుర్వ్యఖ్యానానికి, తరతరాల ప్రజలను తప్పుదారి పట్టించడానికి కారణమవుతాయి. ఇలా జాతి చరిత్రను, ప్రజల అభిప్రాయాలను పెడదోవ పట్టిస్తున్న ఈ అసత్యాలు ప్రచారం కావడానికి కొందరి సైద్ధాంతిక దురభిప్రాయాలు, పక్షపాత ధోరణే కారణమని తెలుస్తోంది. ప్రజల మనసుల నుంచి వలసవాద ధోరణులను, సిద్ధాంతాల ప్రభావాన్ని తొలగించడం చాలా కష్టమైన పని. మొదట దుర్వ్యఖ్యానానికి గురైన చారిత్రక సంఘటనల వెనుక ఉన్న నిజమైన సంఘటనలు, సత్యాలను వెలికి తీయాలి. తరువాత మాతృభూమి కోసం సర్వస్వం త్యాగం చేసిన అమరవీరులకు సముచిత స్థానం కల్పించాలి. దీనిని బట్టి చూస్తే మన స్వతంత్ర పోరాట చరిత్రలో చాలా భాగం సరిచేయవలసి ఉందని అర్ధమవుతుంది. ఎందుకంటే పక్షపాత ధోరణితో అందులోని అనేక విషయాలు, సంఘటనలను నమోదు చేయకుండా పూర్తిగా పక్కకు పెట్టేయడమో, తప్పుగా వ్యాఖ్యా నించడమో జరిగింది. వలసవాదపాలన మన దేశ సంస్కృతిని ఏమాత్రం ప్రభావితం చేయలేక పోయింది. స్వతంత్ర పోరాటం రాజకీయ, పాలనా స్థాయిలోనే జరిగిందన్నది అనేక ముఖ్యమైన సంఘటనలు చూస్తే అర్థమవు తుంది. చౌరీచౌరా అలా దుర్వ్యఖ్యానానికి గురైన సంఘటనల్లో ఒకటని చెప్పక తప్పదు. దానిని అల్లరి మూకల హింసాత్మక సంఘటనగా అభివర్ణించడం నిజాన్ని పూర్తిగా కప్పిపుచ్చడమే అవుతుంది. ఈ విషయాన్ని మరింత స్పష్టం చేస్తూ డా. బిబి కుమార్ (ఛైర్మన్, ఐసిఎస్‌ఎస్‌ఆర్, 2016) ఎన్‌సిఇఆర్‌టి పుస్తకాలు కొన్ని రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తయారు చేశారు. అవి అరాచక ధోరణులను ప్రోత్సహించే విధంగా ఉన్నాయి’ అని అన్నారు. 1960లో ఢిల్లీలోని రాజకీయ ప్రాబల్యం కలిగిన మేధావులు కొందరు స్వతంత్ర పోరాట చరిత్రను రాసే ప్రాజెక్ట్‌ను ప్రారంభిస్తూ అందులో పాల్గొనవలసిందిగా ప్రముఖ చరిత్రకారుడు ప్రొ.ఆర్.సి. ముజుందార్‌ను కోరినప్పుడు ఆయన అందుకు తిరస్కరించారు. అందుకు కారణం ఆ ప్రాజెక్ట్ వెనుక ఇటువంటి కొన్ని రాజకీయ ప్రయోజనాలు, లక్ష్యాలు ఉండటమే.
మొత్తం మీద చూస్తే విప్లవకారుల ప్రయత్నాలు, మాండలే, కాలాపానీ (అండమాన్) జైల్లోలో దేశభక్తులను నిర్బంధించడం, అమరవీరుల బలిదానాలు, వలసవాద ప్రభుత్వం అనుసరించిన అమానుషమైన, క్రూరమైన పద్ధతులను కొందరు వ్యతిరేకించడం వంటి సంఘటనల గురించిన సత్యాలు దాచివేసి, దుర్వ్యాఖ్యలు చేశారన్నది స్పష్టమవుతుంది. దేశ స్వాతంత్య్రం కోసం పోరాడినవారి పేర్లను కూడా చరిత్ర పుటల నుంచి మాయం చేశారు. చౌరీచౌరా కూడా అలా మసిపూసిన సంఘటనల్లో ఒకటి. జాతీయ ఉద్యమంపై చెప్పుకోదగిన ప్రభావం చూపిన ఈ సంఘటన గురించిన అసలు నిజాలు వెలికితీయడం చాలా అవసరం. అందుకు ఎంతో పరిశోధన అవసరం.
చౌరీచౌరాను ఎలా చూడాలి?
అది కొద్దిమంది అల్లరి మూక చేసిన హింసా? లేక సాధారణ ప్రజానీక సామ్రాజ్యవాద ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన పోరాటంలో భాగమా? లేక జలియన్ వాలాబాగ్ దురంతానికి సమాధానంగా వచ్చిన స్వరాజ్య తిరుగుబాటుకు ప్రతీక? దురదృష్టవశాత్తు చౌరీచౌరాను అల్లరి మూకల అరాచకమని, దాని వల్లనే సహాయనిరాకరణోద్యమం ఆగిపోయిందని చిత్రీకరించారు. దానివల్ల వచ్చేసిందనుకున్న స్వరాజ్యం కాస్త దూరంలోనే ఆగిపోయిందని చెప్పారు! కాబట్టి చౌరీచౌరా గురించి నిజాలు తెలుసుకునేందుకు అసలు సహాయనిరాకరణోద్యమానికి ప్రేరణ, మూలం ఏమిటి అనే ప్రశ్న వేసుకుందాం. 1857 తరువాత దేశ ప్రజానీకాన్ని నిర్ఘాంతపరచిన, తీవ్ర ఆగ్రహానికి గురిచేసిన సంఘటన జలియన్ వాలా బాగ్ దురంతం. అదే మళ్లీ 1922 ఫిబ్రవరి 4న చౌరీచౌరాలో పునరావృతమయింది. ఆ రోజున స్థానికులపై పోలీసులు అకృత్యాలకు పాల్పడ్డారు. పోలీసుల హింసకు నిరసనగా నిరాయుధులైన ప్రజలు శాంతియుతంగా ప్రదర్శన చేశారు. కానీ హఠాత్తుగా వారిపై పోలీసులు కాల్పులు జరిపారు. అందులో ముగ్గురు అమాయకులు చనిపోయారు. సామ్రాజ్యవాద ప్రభుత్వపు అరాచక, అమానుష చర్యకు ప్రజల్లో ఆగ్రహం పెల్లుబికింది. చివరికి సహాయ నిరాకరణోద్యమం రద్దయింది. కానీ ప్రజలు తిరగబడటం వల్ల చౌరీచౌరాలో జరిగిన పోలీసు హింస జలియన్ వాలాబాగ్ దురాగతం వంటిదేననే విషయం మరుగునపడిపోయింది.
చౌరీచౌరా పోలీస్ స్టేషన్ తగలబెట్టిన సంఘట నను అటు మీడియా, ఇటు కాంగ్రెస్ ఖండించాయి. చాపెకర్ సోదరులను సమర్ధిస్తూ రాసినందుకు కొంతకాలం క్రితం ‘కల్’ అనే పత్రిక సంపాదకుడు ఎస్‌వి పరాంజపేను జాతీయ సమావేశాలకు హాజరుకావడానికి వీలులేదని నిషేధం విధించిన జాతీయ కాంగ్రెస్ చౌరీచౌరా గురించి ఇలా స్పందించడం వింతేమీ కాదు. అసలు చౌరీచౌరా సత్యాన్ని తెలుసుకునేందుకు నాలుగు కాల ఖండాలను పరిశీలించి, అర్ధం చేసుకోవాలి. మొదటిది 1919 ఫిబ్రవరి 4. బ్రిటిష్ ప్రభుత్వం స్థానికులను క్రూరంగా హింసించింది. ఆనాడు ప్రజలు ఎదుర్కొన్న హింస, అకృత్యాల గురించి ఎక్కడా రికార్డ్ లేదు. ఆనాడు ప్రభుత్వ హింసను ఎదుర్కొన్న వారి మూడవతరం వారిని ప్రత్యక్షంగా కలిసి మాట్లాడితే కొన్ని విషయాలు తెలిశాయి. ఆనాటి దారుణకాండకు సంబంధించిన కొద్దిపాటి సమాచారం కూడా మనల్ని నిర్ఘాంత పరుస్తుంది. అంతటి దారుణమైన పరిస్థితుల్లో చౌరీచౌరా ప్రజలకు మద్దతుగా ఎవరూ నిలబడలేదు.
చౌరీచౌరా రెండవ కాలఖండం గోరఖ్‌పూర్ కోర్ట్‌లో విచారణ జరిగిన నాటిది. విచారణ ప్రారంభం కావడానికి ముందే అటు కాంగ్రెస్, ఇటు ఖిలాఫత్ కమిటీ ప్రజలను దోషులుగా నిర్ధారించే శాయి. 1922 ఫిబ్రవరి 9న విడుదల చేసిన ప్రకటనలో చౌరీచౌరా ఘటనలో పాల్గొన్న ప్రజలకు తమ మద్దతు, సానుభూతి ఏమాత్రం ఉండవంటూ స్పష్టం చేశాయి. తిరుగుబాటును తీవ్రంగా ఖండించి, అందులో పాల్గొన్నవారిని సామాజిక నేరస్తులుగా ముద్రవేశాయి. ఈ ప్రకటనలు, ఖండనలు చౌరీచౌరా విచారణపై ఎలాంటి ప్రభావం చూపాయో వేరుగా చెప్పనక్కరలేదు. ఊహించినట్లుగానే 1923 జనవరి 9న తుది తీర్పును వెలువరించిన న్యాయమూర్తి హెచ్ ఈ హోమ్స్ తన 430 పేజీల తీర్పులో 172 మంది విప్లవకారులను దోషులుగా ప్రకటిస్తూ, వారందరికి ఉరి శిక్ష విధించాడు.
చౌరీచౌరా మూడవ కాలఖండంలో ఉరి శిక్షకు గురైన విప్లవకారుల సంఖ్య 172 అయితే 19 మంది పేర్లు మాత్రమే ఆ తరువాత బయటకు వచ్చాయి. సంఘటనపై కోర్ట్ విచారణ ప్రారంభం కావడానికి ముందే విప్లవకారులను సమర్థించిన వారిని సామాజికంగా బహిష్కరించారు. ఇదే సమయంలో బాబా రాఘవదాస్ అనే జాతీయవాది రంగంలోకి వచ్చారు. జలియన్ వాలాబాగ్ దురంతాన్ని ఖండిస్తూ ఉపన్యాసాలు ఇచ్చినందుకు ఆయనకు ప్రభుత్వం జైలు శిక్ష విధించింది. అందువల్లనే ఆయన చౌరీచౌరా సంఘటన జరిగినప్పుడు జైలులో ఉన్నారు. జైలు నుండి విడుదల అయిన తరువాత బాబా రాఘవదాస్ చౌరీచౌరాలో పాల్గొన్న వారి కుటుంబాలను కలిసి, పరామర్శించి న్యాయ సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు. తీర్పు వెలువరించిన సెషన్స్ కోర్ట్ దానిని సవాలు చేస్తూ హైకోర్ట్‌లో పిటిషన్ దాఖలు చేయడానికి కేవలం వారంరోజులు మాత్రమే గడువు ఇచ్చింది. దీనితో బాబా రాఘవదాస్ బాధితుల తరఫున వాదించ వలసిందిగా మోతీలాల్ నెహ్రూను కోరారు. కానీ సమయం చాలా తక్కువగా ఉన్నదనే కారణంతో మోతీలాల్ అందుకు ఒప్పుకోలేదు. అప్పుడు రాఘవదాస్ మరో దారిలేక చాలాకాలం క్రితమే ప్రాక్టీస్ వదిలిపెట్టిన మదన్ మోహన్ మాలవ్యాను కలిశారు. చౌరీచౌరా బాధితులకు ఎంతో అన్యాయం జరిగిందని తెలుసుకున్న మాలవ్యా అలహాబాద్ హైకోర్ట్‌లో వారి తరఫున వాదించడానికి ఒప్పు కున్నారు. అలా చౌరీచౌరా బాధితులకు అంతకుముందు లేని మద్దతు బాబా రాఘవదాస్, మాలవ్యాల రూపంలో కొంత లభించింది.
చౌరీచౌరా నాల్గవ కాలఖండంలో హైకోర్ట్‌లో మహామనా మదన్ మోహన్ మాలవ్యా బాధితుల తరఫున వినిపించిన వాదనలను తీసుకోవచ్చును. చౌరీచౌరా ప్రజలు ముందస్తు ప్రణాళిక ప్రకారం హింసకు పాల్పడలేదని, ముఖ్యంగా పోలీస్ స్టేషన్‌ను తగులబెట్టాలని వారు అనుకోలేదని మాలవ్యా కోర్టుకు తెలియజేశారు. అనవసరంగా పోలీసులు రెచ్చగొట్టడం, కొద్దిమంది ప్రాణాలు కోల్పోవడం వల్లనే ప్రజలు తిరగబడ్డారని తెలిపారు. చౌరీచౌరా సంఘటన తరువాత శాంతియుత ప్రదర్శనలను చెదరగొట్టడానికి కూడా గాలిలో కాల్పులు జరపరాదని బ్రిటిష్ ప్రభుత్వం పోలీసులకు కఠినమైన ఆదేశాలు జారీచేసిన సంగతి ఇక్కడ గమనార్హం. అంతేకాదు చౌరీచౌరాకు తరువాత పోలీసుల కాల్పుల సంఖ్య గణనీయంగా తగ్గడం చూస్తే ఈ సంఘటన బ్రిటిష్ పాలకులపై ఎంతటి ప్రభావం చూపిందో అర్ధమవుతుంది.
హైకోర్ట్‌లో విచారణ సాగుతున్న సమయంలోనే బాబా రాఘవదాస్ 1923 ఫిబ్రవరి 11న చౌరీచౌరా ప్రజల మనోబలాన్ని పెంచడానికి, సెషన్స్ కోర్ట్ తీర్పు పట్ల నిరసన తెలపడానికి ఒక బహిరంగ సభ ఏర్పాటు చేశారు. చివరికి హైకోర్ట్ తన తీర్పును వెలువరిం చింది. కేవలం 19 మందికి మాత్రమే ఉరిశిక్ష ఖరారు చేసింది. అందులో ఇద్దరు అప్పటికే సహజమరణం పొందారు. సామ్రాజ్యవాద ప్రభుత్వపు అకృత్యాల వల్లనే ప్రజల్లో తిరుగుబాటు వచ్చిందని మాలవ్యా చేసిన వాదనలు ఫలితాన్నిచ్చాయి. అంతేకాదు దేశ ప్రజానీకం ప్రభుత్వ అకృత్యాలను మౌనంగా భరించరనే బలమైన సందేశాన్ని కూడా చౌరీచౌరా పాలకులకు వినిపించింది. మొత్తం మీద చౌరీచౌరా సంఘటన జలియన్ వాలాబాగ్ దురంతానికి ప్రజలు ఇచ్చిన సమాధానంగా చెప్పుకోవచ్చును. స్వతంత్ర పోరాట చరిత్రలో దేశ ప్రజల ప్రగాఢమైన ‘స్వరాజ్య’ భావనను ప్రతిబింబించే చౌరీచౌరా వంటి సంఘటనలను ‘అల్లరి మూకల విధ్వంసం’, ‘సరైన ప్రణాళిక లేకుండా కొద్దిమంది చేసిన దుస్సహసం’, ‘దారితప్పిన యువత చేసిన ఆగడాలు’ అంటూ అభివర్ణించడం, వాటి గురించిన సత్యాలను మరగుపరచడం ఎందుకు జరిగిందో మనం ఆలోచించాలి. దేశభక్తులను సామ్రాజ్యవాద చరిత్రకారులు ‘అల్లరి మూక’గా అభివర్ణించడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. కానీ స్వాతంత్య్రం వచ్చిన తరువాత రాసిన చరిత్ర పుస్తకాల్లో కూడా వారిని ‘అల్లరి మూకలు’, ‘సరైన ప్రణాళిక లేకుండా దుస్సాహసం చేసిన కొద్దిమంది’, ‘దారితప్పిన యువత’ అని వర్ణించడమే దురదృష్టకరం.
ఇలా ఎందుకు జరిగిందంటే స్వాతంత్య్రం వచ్చిన తరువాత జరిగిన చరిత్ర రచన కూడా సామ్రాజ్య వాదుల ధోరణినే అనుసరించడం, దానినే కేంబ్రిడ్జ్ మేధావులు, నయా సంప్రదాయవాద మేధావులు సమర్ధించడం వల్ల. చౌరీచౌరా విషయంలో కొందరిది స్వార్ధ రాజకీయ ప్రయోజనాలను ఆశించిన విపరీతపు ధోరణి అని చెప్పడానికి మరొక తార్కాణం ఏమిటంటే వీరే 1946లో బ్రిటిష్ ప్రభుత్వం ఆజాద్ హింద్ ఫౌజ్ సైనికులపై జరిపించిన విచారణను సమర్ధిం చారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఇదే బాబా రాఘవదాస్‌తో సహా కొందరు ఆ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన పోలీసుల స్మృత్యర్ధం ఏర్పాటు చేసిన స్తంభాన్ని కూల్చివేయడానికి ప్రయత్నించారు. ఎందుకంటే వారికి ఆ స్తంభం సామ్రాజ్యవాద పాలకుల అమానుష అకృత్యాలకు గుర్తు. విచిత్రమేమి టంటే 1990 వరకు పోలీసు శాఖ ఆ పోలీసుల స్మృత్యర్ధం ఒక కార్యక్రమం నిర్వహిస్తూ ఉండేది!
(రచయిత గోరఖ్‌పూర్ విశ్వవిద్యాలయంలో చరిత్ర, శాఖల అధిపతిగా పనిచేశారు. జాతీయ చారిత్రక పరిశోధన సంస్థ సభ్యులు)
అను : కేశవనాథ్