ఎంత చిన్నదైనా పెద్దదైనా చరిత్ర పాఠాలు విస్మరించడం తగదు. కొవిడ్‌ 19 ‌మహమ్మారి కూడా ఇదే రుజువు చేస్తోంది. 1919 నాటి కరోనా సంబంధిత వ్యాధి మూడు దశలలో వచ్చింది. అలాంటి ప్రమాదం ఇప్పుడూ ఉందని కొందరు విజ్ఞులు ముందే హెచ్చరించారు. చారిత్రక, వైజ్ఞానిక ఆధారాలతో, ప్రమాణాలతో వారు చెప్పినట్టే రెండో దశను ఇప్పుడు చూస్తున్నాం. మహమ్మారి మళ్లీ విజృంభిస్తూ కొత్తరూపంలో ప్రమాద ఘంటికలు వినిపిస్తోంది. గత మూడు వారాలుగా దేశ వ్యాప్తంగా ప్రమాదకర స్థాయిలో కొవిడ్‌ ‌కేసులు పెరుగుతున్నాయి. మహారాష్ట్ర పరిస్థితి మరీ భయానకం. కొన్ని రాష్ట్రాల్లో మరోసారి ఆంక్షలు ప్రారంభమయ్యాయి. కరోనా టీకా వచ్చిన తర్వాత ప్రజల్లో నిర్లక్ష్యం పెరిగిపోయి, ఆంక్షలను పాటించడం లేదని కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్‌ ఆం‌దోళన వ్యక్తం చేయడం సబబే. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో రెండో దశ గురించి అప్రమత్తం చేశారు.

వ్యాక్సిన్‌ ‌వచ్చిందన్న ఆనందం ఆవిరయ్యే పరిస్థితి వచ్చింది. కేసులు ఐదు నెలలుగా క్షీణించినట్టు కనబడినా కొన్ని వారాలుగా మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. రోజూ వేలాది కేసులు నమోదవుతున్నాయి. గతేడాది వచ్చిన వైరస్‌ ‌తగ్గిపోగా, కొత్త స్ట్రెయిన్‌ ‌వేరియంట్లు కల్లోలం సృష్టిస్తున్నాయి. అమెరికా, బ్రిటన్‌, ‌బ్రెజిల్‌, ఇటలీ తదిర దేశాల్లో, యూరప్‌లో ఈ ప్రభావం అధికంగా కనిపిస్తోంది. భారత్‌నూ భయపెడుతోంది. మూడు రకాల కొత్త వేరియంట్స్‌ను కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ కనుగొంది.

దేశంలోని 8 రాష్ట్రాల్లో వైరస్‌ ‌మళ్లీ విజృంభి స్తోందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. మహారాష్ట్ర, తమిళనాడు, పంజాబ్‌, ‌మధ్యప్రదేశ్‌, ‌ఢిల్లీ, గుజరాత్‌, ‌కర్ణాటక, హర్యానా, కేరళ రాష్ట్రాల్లో కోవిడ్‌ ‌కేసులు పెరుగుతున్నాయని వెల్లడించింది. మహారాష్ట్రతో పాటు ముంబై పరిస్థితులు ఆందోళన కరంగా మారాయి. దేశ వ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో సగానికి పైగా అక్కడే ఉన్నాయి. లాక్‌డౌన్‌ ‌తర్వాత ఆర్థిక ఇబ్బందుల నుంచి ప్రజలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ఇలాంటి సమయంలో మళ్లీ కరోనా కేసులు పెరగడం, ఇప్పటికే పలు రాష్ట్రాలు కోవిడ్‌ ఆం‌క్షలు విధించడంతో మళ్లీ ఆందోళన మొదలైంది.

కొత్త రకం కరోనా కారణాలు

వేగంగా వ్యాపించే కరోనా వైరస్‌ ‌రకాల్లోని స్పైక్‌ ‌ప్రొటీన్లు చాలా స్థిరంగా ఉంటున్నాయని అమెరికా శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఇన్‌ఫెక్షన్ల ఉద్ధృతిని పెంచడానికి ఇవే కారణమవుతున్నాయి. బోస్టన్‌ ‌చిల్డ్రన్‌ ‌హాస్పిటల్‌ ‌శాస్త్రవేత్తలు కరోనాపైన కొమ్ము ఆకృతిలో ఉండే స్పైక్‌ ‌ప్రొటీన్‌ ‌తీరుతెన్నులను లోతుగా పరిశీలించారు. బ్రెజిల్‌, ‌దక్షిణాఫ్రికా, బ్రిటన్‌ ‌రకం కరోనా వైరస్‌లలో కనిపించిన డీ614జీ ఉత్పరివర్తన కారణంగా ఈ ప్రొటీన్‌లో వచ్చిన మార్పులను గమనించారు. చైనాలోని ఊహాన్‌లో మొదట వెలుగు చూసిన మూల వైరస్‌లోని స్పైక్‌ ‌ప్రొటీన్‌ ‌కన్నా ఇది మరింత స్థిరంగా ఉంటోందన్నారు. కొన్నిసార్లు ఈ స్పైక్‌ ‌ప్రొటీన్లు ముందే తమ ఆకృతిని మార్చు కుంటుందని, ఫలితంగా మానవ కణంతో సంధానం కావడానికి ముందే అది విడిపోతుందని చెప్పారు. ఉదాహరణకు మూల వైరస్‌లో 100 స్పైక్‌లు ఉన్నాయనుకుందాం. ఆకృతిపరంగా ఉన్న అస్థిరత వల్ల వాటిలో 50 శాతం మాత్రమే క్రియాశీలంగా ఉంటాయి. కొత్త రకాల్లో మాత్రం 90 శాతం స్పైక్‌లు చురుగ్గా ఉంటాయి. అవి దృఢంగా మానవ కణాలతో అనుసంధానం కాకపోయినప్పటికీ సదరు వ్యక్తిలో ఇన్‌ఫెక్షన్‌ ‌కలిగించే సామర్థ్యాన్ని ఎక్కువగా కలిగి ఉంటాయి. ఈ నేపథ్యంలో ఉత్పరివర్తన చెందిన స్పైక్‌ ‌ప్రొటీన్‌ను నిలువరించేలా టీకాలను రీడిజైన్‌ ‌చేయాలని పరిశోధనలో పాలుపంచుకున్న బింగ్‌ ‌చెన్‌ ‌సూచించారు.

రోజువారీ కేసులు 50 వేలు

తాజాగా దేశంలో రోజువారీ నమోదయ్యే కొవిడ్‌ ‌కేసులు 50 వేలకు, మరణాలు 200లకు వచ్చేశాయి. మరణాలు మార్చి 21 నాటికి నాటి గణాంకాల ప్రకారం ఇప్పటి వరకూ దేశవ్యాప్తంగా 1,16,46,081 కోట్ల మంది వైరస్‌ ‌బారినపడగా, 1,59,967 మంది మృత్యుఒడికి చేరుకున్నారు. 1.11 కోట్ల మందికి పైగా బయటపడగలిగారు. రికవరీ రేటు 95.96 శాతానికి తగ్గింది. 3,34,646 మంది వైరస్‌తో బాధపడుతుండగా.. క్రియాశీల రేటు 2.66 శాతానికి చేరింది. పాజిటివ్‌ ‌కేసుల్లో రికవరీలు సగం కంటే తక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది.

రోజువారీ కేసుల్లో సగానికి పైగా, 30 వేలపై చిలుకు మహారాష్ట్రలో నమోదవుతున్నాయి. ఇక్కడ మొత్తం పాజిటివ్‌ ‌కేసుల సంఖ్య 24లక్షల మార్కును దాటింది. 53,399 మంది ప్రాణాలు వదిలారు. ముంబయిలో పరిస్థితి మరీ దారుణం. తర్వాత పుణె, నాగ్‌పుర్‌, ‌ఠాణే, నాసిక్‌ ‌జిల్లాల్లో కేసులు ఎక్కువగా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలోనూ కరోనా విస్తరిస్తోంది. రెండు వారాలుగా కేసులు పెరుగు తున్నాయి. మహారాష్ట్ర తర్వాత వరుసగా పంజాబ్‌, ‌కేరళ, కర్ణాటక, గుజరాత్‌ ‌రాష్ట్రాల్లో ఎక్కువగా కేసులు నమోదువుతున్నాయి.

తెలంగాణ విద్యా సంస్థల్లో..

తెలంగాణ లోని విద్యాసంస్థల్లో కరోనా కలకలం రేపుతోంది.. గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు కొవిడ్‌ ‌బారిన పడుతున్నారు. వివిధ జిల్లాల్లోని విద్యాకేంద్రాల్లో మూడు రోజుల వ్యవధిలో వందల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం పెద్దమండవ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, నిర్మల్‌ ‌జిల్లా ముథోల్‌లోని గిరిజన బాలికల గురుకుల పాఠశాల, నాగర్‌కర్నూల్‌ ‌పరిధిలోని ఉయ్యాలవాడ జ్యోతిబాఫూలే గురుకుల పాఠశాల, నాగోలు జడ్పీ ఉన్నత పాఠశాల, మైనారిటీ బాలికల పాఠశాల, హయత్‌నగర్‌లోని గురుకుల పాఠశాలలో కేసులు వెలుగు చూడటంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలకు మరోసారి సెలవులు ప్రటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనేక ప్రైవేటు కాలేజీలు, హాస్టళ్లలో కొవిడ్‌ ‌కేసులు వెలుగు చూస్తున్నా వార్తలు బయటకు రానీయకుండా కట్టడి చేస్తున్నారు. మరోవైపు తెలంగాణలో కొవిడ్‌ ‌కేసుల పెరుగుదలకు పొరుగు రాష్ట్రాల నుంచి రాకపోకలే కారణమని ప్రభుత్వం భావిస్తోంది. సరిహద్దు జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు.

మరోసారి ఆంక్షలు తప్పవా?

దేశంలో కరోనా వైరస్‌ ‌విజృంభణ మొదలై ఇప్పటికే ఏడాది పూర్తయ్యింది. వైరస్‌ ‌కట్టడి చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం గత ఏడాది మార్చి 22న దేశ వ్యాప్తంగా ‘జనతా కర్ఫ్యూ’ విధించిన విషయం తెలిసిందే. ఆ రోజు సాయంత్రం దేశ ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చి చప్పట్లు, గంటలతో సానుభూతి తెలియజేశారు. ఆ తర్వాత మార్చి 25వ తేదీ నుంచి యావత్‌ ‌దేశం పూర్తి లాక్‌డౌన్‌లోకి వెళ్లింది. దుకాణాలు, పాఠశాలలు, కార్యాలయాలు, మాల్స్, ‌సినిమా హాళ్లతో పాటు రైల్వేలు, విమానా శ్రయాలన్నీ మూతపడ్డాయి. వైరస్‌ ‌తీవ్రత దృష్ట్యా ఈ లాక్‌డౌన్‌ ‌మే 31వరకు కొనసాగింది. అనంతరం పలు దఫాల్లో కేంద్ర ప్రభుత్వం ఆంక్షలను సడలిస్తూ వచ్చింది. పరిస్థితులు కాస్త కుదుట పడిన తర్వాత దేశమంతా తిరిగి సాధారణ స్థితి వచ్చింది.

రెండోదశ మొదలు కావడంతో పలు రాష్ట్రాలు మరోసారి ఆంక్షలు విధిస్తున్నాయి. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, ‌గుజరాత్‌, ‌పంజాబ్‌ ‌రాష్ట్రాల్లో రాత్రిపూట కర్ఫ్యూతో పాటు స్థానికంగా లాక్‌డౌన్‌ ఆం‌క్షలు అమలు చేస్తున్నాయి. నాగ్‌పూర్‌ ‌జిల్లాలో మార్చి 15 నుంచి 21 వరకు మహారాష్ట్ర సర్కారు ఆంక్షలు విధించింది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌, ‌భోపాల్‌, ‌జబల్‌పూర్‌ ‌నగరాల్లో ఒక్కరోజు లాక్‌డౌన్‌ ‌విధించారు. రాజస్థాన్‌ ‌లోని 8 నగరాల్లో రాత్రివేళ కర్ఫ్యూ విధించారు.

కొవిడ్‌ ‌వ్యాప్తికి కారణాలు ఇవే..

గత ఏడాది కరోనా వైరస్‌ ‌ప్రారంభ సమయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు భారత వైద్య ఆరోగ్య శాఖ అనేక మార్గదర్శకాలు సూచించింది. మాస్కులు ధరించడం, సానిటైజర్‌ ‌వినియోగం, భౌతికదూరం వంటి నిబంధనలతో పాటు పెళ్లిళ్లు, విందులు, వినోదాలు, సామాజిక కార్యక్రమాలకు, ప్రయాణాలకు కొంత కాలం దూరంగా ఉండడం వంటివాటిని ప్రజలు పాటించారు. కానీ వ్యాక్సిన్‌ ‌వచ్చిన తర్వాత ప్రజల్లో నిర్లక్ష్యం పెరిగింది. నిబంధనలు గాలికి వదిలేశారు. ప్రభుత్వాలు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నాయి. కొవిడ్‌ ‌పరీక్షలు తగ్గించాయి. చాలా సంస్థలు ఉద్యోగులను విధిగా ఆఫీసులకు రావాలని సూచిస్తున్నాయి.

గతంలో వలెనే మోదీ కొన్ని సూచనలు చేశారు. అవసరమైన చోట్ల మైక్రో కంటైన్‌మెంట్‌ ‌జోన్‌లు ఏర్పాటుపై దృష్టిసారించాలన్నారు. రెండో దశ తీవ్రం కాకుండా సత్వర, నిర్ణయాత్మక చర్యలు చేపట్టాలన్నారు. కరోనాపై పోరాటం ద్వారా భారత్‌ ‌సాధించిన ఆత్మవిశ్వాసం నిర్లక్ష్యానికి దారితీయరాదన్నారు. అలాగే ఆంధప్రదేశ్‌, ‌తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో 10 శాతం టీకాలు వృథా అయ్యాయని ప్రధాని ఆందోళన వ్యక్తం చేయడం, దీనిపై సమీక్షించుకోవాలని కోరడం తెలిసిందే. కరోనా మరణాలు అతి తక్కువగా ఉన్న దేశాల్లో భారత్‌ ఒకటని ప్రధాని మోదీ గుర్తు చేశారు.ఈ దశలో ఆ పేరు పోగొట్టుకోకూడదు. అలాగే కొవిడ్‌ ‌పరీక్షల్లో 70 శాతం ఆర్టీ-పీసీఆర్‌ ‌టెస్ట్‌లే చేయాలన్నారు ప్రధాని. కేరళ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, ‌యూపీలను ప్రస్తావిస్తూ యాంటీజెన్‌ ‌పరీక్షలపై ఆధారపడొద్దని సూచించారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే దేశంలో రానున్నరోజులు చాలా ప్రమాదకరంగా మారతాయని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ ఆం‌దోళన వ్యక్తంచేశారు.

వేగవంతంగా టీకాల పంపిణీ

వాస్తవం చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వం కొవిడ్‌ ‌నిరోధానికి తనవంతు కృషి చేస్తూనే ఉన్నది. అందులో భాగంగానే దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ ఊపందు కుంది. నిత్యం దాదాపు 25లక్షల కరోనా వ్యాక్సిన్‌ ‌డోసులను పంపిణీ చేస్తున్నారు. ఇప్పటి (మార్చి 21) వరకు 4కోట్ల 46 లక్షల డోసులను అందించారు. వీటిలో 3 కోట్ల 71లక్షల మందికి తొలి డోసులను అందించగా, 74లక్షల మందికి రెండు డోసులను ఇచ్చినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతానికి భారత్‌లో ఈ రెండు సంస్థల టీకాలను మాత్రమే వినియోగించేందుకు ప్రభుత్వ అనుమతి ఉంది. సీరమ్‌ ‌కంపెనీ.. నెలకు 7 కోట్ల కోవిషీల్డ్ ‌డోసులను తయారు చేస్తోండగా, భారత్‌ ‌బయోటెక్‌ ‌నెలకు దాదాపు 40 లక్షల కోవాగ్జిన్‌ ‌డోసులను ఉత్పత్తి చేస్తోంది

వీలైనంత త్వరగా కరోనాను కట్టడి చేసేందుకు ప్రభుత్వం మరో 12 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ ‌డోసుల కోసం సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇం‌డియా(ఎస్‌ఎస్‌ఐ), ‌భారత్‌ ‌బయోటెక్‌లకు ఆర్డర్‌ ఇచ్చింది. జూలై చివరి నాటికి 30 కోట్ల మందికి కరోనా టీకాలు వేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఓవైపు దేశంలో వ్యాక్సిన్‌ ‌పంపిణీ ముమ్మరంగా కొనసాగిస్తోన్న కేంద్ర ప్రభుత్వం, మరోవైపు విదేశాలకూ కూడా సరఫరా చేస్తోంది. కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం ఇప్పటివరకు దాదాపు 10 కోట్ల 50లక్షల టీకాలను ఎగుమతి చేసింది. అంతర్జాతీయ సంస్థలతో కలసి వ్యాక్సిన్‌ను తయారు చేసి కరోనా నుంచి ప్రపంచాన్ని భారత్‌ ‌కాపాడిందని అమెరికా శాస్త్రవేత్త పీటర్‌ ‌హాట్జ్ అన్నారు.

 టీకాతో 8-10 నెలలు రక్షణ

 టీకాతో 8-10 నెలల పాటు మంచి రక్షణ లభిస్తుందని ఎయిమ్స్ ‌డైరెక్టర్‌ ‌గులేరియా చెప్పారు. వ్యాక్సిన్‌ ‌వల్ల దేశంలో పెద్ద దుష్ప్రభావాలేమీ వెలుగు చూడలేదని పేర్కొన్నారు. మొదటి డోసు టీకా తీసుకున్న నాలుగు వారాలకు (28 రోజులు) రెండో డోసు తీసుకోవాలి. రెండో డోసు తీసుకున్న 28 రోజుల తర్వాతే వైరస్‌ను ఎదుర్కొనే యాంటీబాడీలు తయారవుతాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. తాజాగా కోవిషీల్డ్ ‌వ్యాక్సిన్‌ ‌రెండో డోసు విషయంలో కేంద్రం గడువు పెంచింది. ప్రస్తుతం కోవిషీల్డ్ ‌తొలివిడతకు, రెండోవిడతకు 4 వారాల అంతరం ఉంది. దీన్ని 8 వారాల వరకు పెంచాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సూచించింది. రెండు డోసుల మధ్య 8 వారాల అంతరం విధించాలని కేంద్రం భావిస్తోంది.

About Author

By editor

Twitter
YOUTUBE