– రాజేష్‌ ‌ఖన్నా

వాకాటి పాండు రంగరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది

‘‘ప్రేమలేని కవితలల్లి, ప్రేమరాని కథల లొల్లితో జీవితమొక నాటకమని, విధి రాతొక బూటకమని, వింతల్ని చూపేదో కటకమని, తాను ముఖ్యమనుకొన్న తనువుని మన్నుగా చేసిందో కరోనా అణువు. కరుణలేని కరోనా నిర్లక్ష్యంగుంటే నిలువునా, అజాగ్రత్తగుంటే అట్టడుగునా పాతేస్తుంది. లేచిందే లేడికి పరుగుమల్లె రోగమొచ్చాక ఆరోగ్యంపై ఆరాటమెందుకు?

అయినా మనిషి మారడు, అలాగనీ తన వంతుని కోరడు. ఎవరికో అమాయకులకి రోగాన్ని అంటించి పోతాడు. చివరికి తనవాళ్లక్కూడా బిగిస్తాడా ఉరితాడు. మనిషి చదువుకొన్న మూర్ఖుడు, పరులహితాన్ని కోరని దౌర్భాగ్యుడు. తన కళ్లముందే మనుషులు పిట్టల్లా రాలుతున్నా బాధితుల, బంధువుల అర్తనాదాల్ని వింటున్నా నిర్లక్ష్యంతో మనిషి బయ•కి రాకుండా మానడు. మారని మనిషి కోసం కరోనా మారదు. మానవలోకానికి విపత్తు మిగిలించక మానదు…’’

‘అబ్బబ్బా! ఏమి సాహిత్యం!! ఏమి భావం!!! తెలుగు భాషకున్న అందమే వేరు. కవి, రచయిత లెవరైనా కానీ వాళ్లు రాసిన తెలుగు చదువుతుంటే తేనె తాగుతున్నంత హాయిగా ఉంటుంది…’ అని మనసులో అనుకొంటూ అక్కడి పనిఒత్తిడిని తట్టుకోడానికి తాను చదువుతున్న తెలుగు కవితని మూసేసిన డాక్టర్‌ ‌గోపి భారంగా నిట్టూరుస్తూ తన పక్కనున్న కిటికీ గుండా బయటకి చూశాడు.

అంతలోనే ఆ కిటికీ పక్కనే ఏదో పడిన శబ్దం రావడంతో గోపి ఉలిక్కిపడి కుర్చీలోంచి లేచి చూశాడు. ఎవరో ఒకమ్మాయి అచేతనంగా నేలపై పడిపోయి కనిపించింది. ఆ శబ్దం విన్న వెంటనే అక్కడున్న ఐటిబిపి దళంలోని ఆఫీసర్స్ అం‌తా అక్కడికి చేరుకొన్నారు. కంగారు పడిపోయిన గోపి బయటికి రాబోయాడు.

కానీ అప్పటికే ఆ యువతిని లోపలికి తీసుకొచ్చి బెడ్‌మీద పడుకోబెట్టారు. ఆ హఠాత్పరిణామానికి నోరెళ్లబెట్టిన గోపి అలాగే చూస్తుండిపోయాడు. ‘‘డాక్టర్‌’’ అని అక్కడున్న వారు పిలిచేసరికి గోపి తేరుకొని వడివడిగా ముందుకు నడిచి, ఆ అమ్మాయికి కావాల్సిన వైద్యం అందించాడు.

ఐటిబిపి రక్షణదళం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఢిల్లీలోని చావ్లా క్యాంపు కరోనా క్వారంటైన్‌ ‌సెంటర్‌లో ఇటలీ నుండి వచ్చిన మూడొందల అరవై ఆరు మందిలో దాదాపు తొంభైమందిని పద్నాలుగు రోజుల నిర్బంధంలో ఉంచారు. అందులో పూనమ్‌ ‌పాథక్‌ అనే వైద్య విద్యార్థిని ఆత్మహత్య ప్రయత్నం చేసింది. అదృష్టవశాత్తు అక్కడి భద్రతా అధికారి అసిస్టెంట్‌ ‌కమాన్డెంట్‌ అనురాగ్‌ ‌ఠాకూర్‌ ‌చొరవతో తృటిలో ప్రాణాపాయ స్థితి నుండి బయటపడింది. అంతందమైన అమ్మాయి ఎందుకు చావాలనుకుందో అర్థం కాక తలపట్టుకొన్నాడు అనురాగ్‌.

అతనికి ఆ కరోనా క్వారంటైన్‌ ‌సెంటర్‌ ‌విధులు నిర్వర్తించడం ఇష్టం లేకపోయినా తన పైఅధికారుల ఒత్తిడి మేరకే మొక్కుబడిగా అక్కడి విధుల్లో చేరాడు. కారణం, తాను పెళ్లి చేసుకుందామంటే తన ఉద్యోగాన్ని చూసి పిల్లనివ్వడానికి చాలామంది ముందుకు రాలేదు. ఆ నిరాశతోనే అతనికి తన ఉద్యోగమంటే కాస్త ఏహ్యతాభావం ఏర్పడింది. తన కిందిస్థాయి అధికారులు చాలామంది అక్కడే ఉండటంతో తాను అవసరమైనప్పుడు తప్పితే తన ఆఫీసునుండి బయటికి రావటం లేదు. కానీ ఆ అమ్మాయి అలా ఆత్మహత్యకి పాల్పడటంతో అతనికి ఏంచేయాలో అర్ధం కాలేదు. కానీ ఆమె అందానికి పిచ్చోడైపోయిన అనురాగ్‌.. ఆమె కథేమిటో తెలుసుకోవాలనుకున్నాడు.

పూనమ్‌ ఆత్మహత్య చేసుకోడానికి గల కారణం ఆమె మానసికంగా క్రుంగిపోవడమేనని ప్రాథమిక విచారణలో తేలింది. ఆమె ఒక నెలరోజుల క్రితమే మహార్టాలోని తన సొంతూరు సతారాకి చైనా నుండి వచ్చి, వెళ్లింది. తాను తిరిగి వెళ్లగానే వుహాన్‌లో మృత్యువు కరోనా రూపంలో వీరవిహారం చేయ సాగింది. దాంతో వెంటనే అక్కడి యూనివర్సిటీలన్నీ సెలవులు ప్రకటించాయి. తాను అక్కడినుండి స్వదేశానికి తిరుగు ప్రయాణం కోసం చాలా కష్టపడాల్సి వచ్చింది. ఇంట్లో వాళ్లు కూడా కసురు కోవడం మొదలుపెట్టారు. వద్దని చెప్పినా వినకుండా వెళ్లిపోయావు. ఇప్పుడేం చేయాలి అని సూటిపోటి మాటలు తప్పితే తన బాధని అర్ధం చేసుకోవడానికి కుటుంబ సభ్యులెవరూ ముందుకు రాలేదు. దాంతో ఆమె కాస్తా బెదిరిపోయింది.

భారత ప్రభుత్వం, చైనాలోని వుహాన్‌ ‌నగరంలో దారుణమైన పరిస్థితుల్లో చిక్కుకొన్న భారతీయుల్ని ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తీసుకొచ్చి మంటేసారులో కొందరిని, చావ్లా క్యాంపులో మరికొందరిని ఉంచింది. అలాగనీ అక్కడున్న వాళ్లందరికీ కరోనా కచ్చితంగా వచ్చిందని ఎవరూ చెప్పలేరు, అలాగే రాలేదని కూడా ఎవరూ చెప్పలేరు. కనీసం పద్నాలుగు రోజులు ఆగాలి. అప్పుడే ఆ కరోనా వైరస్‌ ‌ప్రభావం బయట పడుతుంది. దాంతో తమకి కరోనా కచ్చితంగా వస్తుందేమోనన్న భయంతో చాలామంది బిక్కుబిక్కు మంటూ ప్రాణాల్ని అరచేతిలో పట్టుకొని వణికిపోయారు.

అనురాగ్‌ ‌ఠాకుర్‌కి పూనమ్‌ ఆత్మహత్య చూసు కొనేంత పిరికిదానిలా కనిపించలేదు. కానీ ఆమెని ప్రేరేపించిన విషయాలు వేరే ఉన్నాయని గమనించిన డాక్టర్‌ ‌గోపి, భద్రతా అధికారి అనురాగ్‌ ‌ఠాకూర్‌ ‌కలిసి అసలు కారణం చెప్పమని అడిగారు. ఆమె తన గురించి చెప్పడానికి ముందుగా సంశయించింది. దాంతో అనురాగ్‌ ‘‘‌పూనమ్‌!… ‌మీరిలాంటి అఘాయిత్యానికి పాల్పడటానికి గల కారణాన్ని కచ్చితంగా చెప్పాల్సిందే. లేకపోతే మీ మీద ఆత్మహత్యాయత్నం చేసినందుకు కేసు పెట్టాల్సి ఉంటుంది. ఒక ప్రాణాన్ని తీసే హక్కు గానీ, తీసుకొనే హక్కుగాని ఈ దేశ చట్టాల ప్రకారం ఎవరికీ లేదు…’’ అని కాస్త కటువుగా మాట్లాడేసరికి పూనమ్‌ ‌తన కథా, కారణాలు చెప్పడానికి సిద్ధపడింది.

‘‘మా సొంతూరు మహారాష్ట్రలోని సతారా. మెడిసిన్‌ ‌చదవడానికనీ చైనా వెళ్లాను. నా పెళ్లి దగ్గర పడుతున్న సమయంలో కూడా ఒకసారి పరీక్షల నిమిత్తం నేను చైనాకి వెళ్లాల్సివచ్చింది. అప్పటికే ఇంట్లో అందరూ ఆ సమయంలో వెళ్లొద్దని వారించారు కూడా. అక్కడ నాకేం జరుగుతుందిలే, నేను పైగా డాక్టర్ని కదా అనుకొన్నాను. నా తిరుగుప్రయాణాన్ని ఎంతో సులువుగా ఊహించుకున్నా. నేను అక్కడికెళ్ల గానే కరోనా వైరస్‌ ‌మూడవ దశనుండి నాలుగవ దశకి చేరేసరికి భయంతో బెంబేలెత్తిపోయాను.

నేను ఇప్పుడిప్పుడే దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడుతున్నాను. ఆ విషయం మా కుటుంబంలో తెలియగానే నన్ను చేసుకోబోయేవాడు పెళ్లిని రద్దు చేసుకోవడమే కాకుండా నన్ను ఇక్కడే చావమన్నాడు. మా ఇంట్లో వాళ్లు కూడా నన్ను అర్ధం చేసుకోవట్లేదు. వద్దని చెప్పినా వెళ్లావు, ఇప్పుడు అనుభవించు అంటున్నారు. ఒక ఆడపిల్లకి ఇంతకి మించిన నరకం ఏముంటుంది? నాకు పెళ్లి జరిగితే ఇకమీదట నేను చదువుకొనే అవకాశాన్ని కోల్పోతానేమోనన్న భయంతో చివరిగా ఉన్న పరీక్షలు రాద్దామని వెళ్లాను.

కానీ కరోనా నా మీద కనికరం చూపకుండా, పరీక్షలు కూడా రాయనివ్వకుండా అక్కడినుండి తరిమేసింది. నాకు డాక్టరవ్వాలని చిన్నప్పటినుండి ఎంతో కోరిక. కానిప్పుడది తీరకుండానే నేను చనిపోతానేమోనన్న భయం నన్ను వెంటాడుతోంది.

ఇదిలా ఉండగా, నాకు కాబోయే మామగారి క్కూడా జ్వరం రావడంతో అది నా వల్లనే వచ్చిందని నన్ను దారుణంగా తిట్టారు. నేను నెలక్రితం వచ్చాను. నా వల్ల కరోనా వాళ్లందరికీ వస్తే ఇప్పటికే తేలి పోయేది. కానీ ఎవరికీ ఏం కాలేదు. కాబోయే మామయ్యకి కేవలం జ్వరం రాగానే అది కరోనానే అని భయపడి నానా హంగామా సృష్టించారు. నన్ను చేసుకోబోయేవాడు మా నాన్నని చంపేద్దామనే వచ్చావా అని తిట్టాడు.

మా తల్లిదండ్రుల్ని కూడా నానా రకాలుగా దూషించారు. మా ఊర్లో కూడా మా ఇంట్లో వాళ్లందరిని ఎవరూ కలవడానికి ముందుకు రావట్లేదు. ఎప్పుడూ కోలాహలంగా, కలగొల్పుగా మాట్లాడిన బంధువులతో బ్రతికిన మా తల్లిదండ్రులు ఒక్కసారిగా అలా వెలివేసినవారిలా బ్రతకడానికి భయపడి పోయారు. అంతా నా వల్లనే జరిగిందని నన్ను దూషిస్తున్నారు. నన్ను అనుక్షణం దూషించ లేక, వాళ్లల్లో వాళ్లు నరకం అనుభవిస్తున్నారు.

ఒంట్లో ప్రాణముండి కూడా జీవచ్చవాల్లా వాళ్లు బ్రతకలేకపోయారు. నేను మళ్లీ చైనా వెళ్లకుండా అక్కడే ఉంటే బాగుండేదేమో. చివరి పరీక్షలు అయిపోతే ఒక పనైపోతుందను కొన్నాను.

కానీ నేను తీసుకొన్న నిర్ణయం నా జీవితాన్నే తలక్రిందులు చేస్తుందని ఊహించలేకపోయాను. ఇప్పుడు నా పరిస్థితిని చక్కదిద్దుకొనే మార్గం నాకు కనిపించట్లేదు. అమ్మ నాన్న కన్నీళ్లను చూశాకా నా మనసులో రేగిన అలజడిని నేను తట్టుకోలేక పోతున్నాను.

నేను ఇప్పుడు ఇంటికి వెళ్లినా నన్ను అనుమానం గానే చూస్తారు. నా వల్ల ఎవరికైనా ఆపద వస్తుందనే భయంతోనే బ్రతుకుతారు. నాకు మల్లే చాలామంది ఇలాగే ఇంట్లో వాళ్లు ఎంతగా చెప్తున్నా వినకుండా నిర్లక్ష్యంగా బయట తిరుగుతూ, సరదా కోసం స్నేహితుల్ని కలుస్తూ ఎందరికో భారం అవ్వడానికి బజార్‌లో బలాదూరుగా తిరుగుతున్నారు.

నేను కూడా అందరిలాగే అనుకొన్నాను. ఏదో తప్పు చేస్తేనే వచ్చే ఎయిడ్స్ ‌లాంటి వ్యాధి కాదిది. కొద్దిపాటి నిర్లక్ష్యం చాలు. ఆ ఒక్కరూ ఎంతో మందికి తనకి తెలియకుండానే అంటించేస్తారు. వాళ్లు కూడా వాళ్లకి తెలియకుండా ఇంకొంతమందికి అంటిస్తారు. ఇప్పుడైతే వందల్లో ఉన్నారు కాబట్టి, ఆస్పత్రుల్లో చికిత్సనందిస్తూ ఎలాగో ప్రభుత్వం ఆదుకొంటోంది. అదే వేలల్లో, లక్షల్లో అయితే వాళ్లందరికీ ఎక్కడంటూ చికిత్స నందించగలరు? వైద్య సదుపాయాల విషయంలో మిగతా దేశాలతో పోలిస్తే మనదేశం చాలా వెనుకబడి ఉంది. పైగా అధిక జనాభా, పేదరికం, జనాల్లో నిర్లక్ష్య వైఖరి కారణంగా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి దేశానికి మరమ్మత్తులు చేసుకొనేలోపే మాడిమసైపోయే ప్రమాదం ఉంది.

నిర్లక్ష్యం హద్దులు దాటితే నిలకడలేని ప్రాణాలు సరిహద్దులు దాటుతాయి. దేశం అతలాకుతలం అవుతుంది. ప్రజల్లో భయాందోళనలు పెరిగి పోతాయి. దేశ ఆర్థికవ్యవస్థ క్షీణిస్తుంది. ఏ ఇతర కారణాల వల్లనైనా దగ్గు, జ్వరం వచ్చినా వాళ్లని కూడా అనుమానించడం మొదలవుతుంది. కొంత మంది భయంతోనే చనిపోతారు. ఇదంతా జరిగేది ఒక్కరి నిర్లక్ష్యం వల్లనే కావచ్చు.

ఆ ఒక్కరు పరోక్షంగా దేశద్రోహి అవుతాడు. కాలానుగుణంగా దేశ సంస్కృతి, ఆచారాలు విదేశీ సంస్కృతి వల్ల కలుషితమైతేనే తమ దేశం, తమ సంస్కృతి అని గగ్గోలుపెట్టే దేశభక్తులంతా కరోనా విషయంలో కొద్దిపాటి నిర్లక్ష్యం చేసినా, వాళ్లంతా అతిపెద్ద దేశద్రోహులకిందే లెక్క. నమ్మేది ఏ మతమైనా, పూజించేది ఏ దేవుడినైనా ఇలాంటి పరిస్థితిల్లో కూడా మతం గొప్పా, మా దేవుడు గొప్పా…. ఎదుటివారి దేవుడి వల్లనే ఇలా జరుగు తోంది అని పోట్లాడే దేవుడి భక్తులంతా దేశభక్తు లవ్వగలరా?

నిజమైన దేశభక్తులెవరంటే, ఇలాంటి ఆపత్కాలిక పరిస్థితుల్లోనూ ప్రభుత్వ ఉత్తర్వుల్ని తుచ తప్పకుండా పాటించేవారు మాత్రమే. వైథ్య, రక్షణ సిబ్బంది, నిస్వార్ధంగా ప్రభుత్వాదేశానుసారం పనిచేసేవారు మాత్రమే ఇప్పటి పరిస్థితిలో నిజమైన దేశభక్తులు. వాళ్లంతా ప్రాణాలకి తెగించి పనిచేస్తున్నారు.

కానీ చాలామంది నాలాగే, దేశభక్తంటే తమ దేవుడు, మతం గురించి మాట్లాడటమే అను కొంటారు. కానీ ప్రభుత్వ ఉత్తర్వుల్ని పాటించడం అనుకోరు. తనకేమైనా ఫర్వాలేదు కానీ, ‘తమ సొంతదేశ పౌరుల్ని ఎలాగైనా కాపాడాలనుకొనే తపనకి మించిన దేశభక్తి ఎక్కడుంటుంది. నేను నా స్వార్థం వల్ల కరోనా వైరస్‌ ‌నాకు ఉందనే అనుమానం వచ్చినా కూడా నా దేశానికొచ్చి పెద్ద ద్రోహం చేశాను. అందుకే నాకు బ్రతికే అర్హత లేదను కున్నాను…’’ అని పూనమ్‌ ‌చెప్తుంటే అనురాగ్‌ ‌మౌనంగా ఆమెనలా చూస్తుండిపోయాడు.

‘‘మీరు చెప్పిందాంట్లో చాలా విషయం ఉందండి. కానీ ఆత్మహత్య చేసుకు నేంతైతే లేదు. కరోనా వచ్చినంత మాత్రాన కచ్చితంగా ప్రాణాలు పోతాయని ఎందుకను కోవాలి. ఆ వ్యాధి నుంచి కోలుకొనే అవకాశాలు కూడా చాలానే ఉన్నాయి కదా.

మీరు కాబోయే డాక్టర్‌. ‌మీరే ఇలా అధైర్యపడితే ఎలా? మీ అమ్మానాన్నల గురించి ఒక్కసారైనా ఆలోచించారా? మీరు పోయాక వాళ్ల కన్నీళ్లని ఎవరు తుడవాలి…’’ అని అనురాగ్‌ ఆమెని శాంత పర్చబోయాడు.

డాక్టర్‌ ‌గోపి మళ్లీ తన చేతిలో ఉన్న కవితల పుస్తకాన్ని తెరిచి నిర్బంధంలో ఉన్న మిగతా వారి దగ్గరికి వెళ్లిపోయాడు. పూనమ్‌ ఏడుస్తుండటం చూసి అనురాగ్‌ ‌తట్టుకోలేకపోయాడు. ఆమెనెలాగైనా ఓదార్చాలనుకొన్నాడు. అంత అందమైన అమ్మాయి ఏడవటం అతనికి మింగుడుపడలేదు.

‘‘నాకే ఇలా ఎందుకు జరిగింది. ఇక నన్నెవరు పెళ్లి చేసుకొంటారు. నాకు కాబోయేవాడు వేరే అమ్మాయిని చూసుకొన్నాడు. అప్పటివరకు అతను ప్రేమించిన అమ్మాయిని ఒప్పుకోని వాళ్ల కుటుంబీకు లందరూ నాకిలా జరగ్గానే, ఆ అమ్మాయిని సంతోషంగా ఒప్పుకొన్నారు. పోనిలే, నా వల్ల వాళ్లిద్దరి ప్రేమైనా గెలిచింది. అదే నాకు చివరిగా మిగిలిన సంతోషం…..’’ అని పూనమ్‌ ఏడుస్తుంటే…

‘‘మీరు అనుకుంటే ఇంకో సంతోషం కూడా దొరుకుతుంది. కరోనా వచ్చినంత మాత్రాన చావే పరిష్కారం కాదు. దాని నుండి బయటపడటానికి సంకల్పం ఉంటే చాలు. మీలాగే నేను కూడా చాలా సార్లు చనిపోదామనుకొన్నాను. నేను చేసే ఉద్యోగం నచ్చక చాలామంది అమ్మాయిలు నన్ను పెళ్లిచేసుకోమ నని వెళ్లిపోయారు. ఇప్పుడు మీ పరిస్థితి, నా పరిస్థితి ఒకేలా ఉన్నాయి. మనమిద్దరం ఒకే పడవలో ఒంటరిగా ప్రయాణం చేస్తున్నాం. మీకిష్టమైతే కలిసి ప్రయాణం చేద్దాం. అంటే, మీకు అభ్యంతరం లేకపోతే, మిమ్మల్ని నేను పెళ్లి చేసుకుంటానండి. మిమ్మల్ని మహారాణిలా చూసుకుంటాను..’’ అని అనురాగ్‌ ‌గద్గదస్వరంతో అన్నాడు.

అతని మాటలకి ఆశ్చర్యపోయిన ఆమె పెదాల మీద అప్రయత్నంగా ఏదో అంతులేని చిరునవ్వు తళుక్కున మెరిసింది. అంతలోనే డాక్టర్‌ ‌గోపి వచ్చి, ‘‘ఎందుకమ్మా… ప్రాణాలు తీసుకోవాలనుకొన్నావు. నీకు కరోనా నెగటివ్‌ ‌వచ్చింది. నీకు వచ్చింది మామూలు జ్వరమే అయినా ఈ పద్నాలుగు రోజులు డాక్టర్ల పర్యవేక్షణలోనే ఉండటం మంచిది. ఎందుకంటే నీవన్నట్లు బయట జనాలు ఊరికనే భయపడతారు. నిన్ను జ్వరం తగ్గేవరకూ ప్రత్యేకమైన గదిలో ఒంటరిగా ఉండే వెసులుబాటు కల్పిస్తాను…’’ అని చెప్పేసరికి ‘‘థ్యాంక్యూ డాక్టర్‌…. ‌థ్యాంక్యూ సో మచ్‌…’’ అని పూనమ్‌ ‌కన్నీళ్లు తూడ్చుకొంది.

‘‘అయ్యో!.. పూనమ్‌ ‌మీరిప్పుడెందుకు ఏడుస్తున్నారు?’’ అని అనురాగ్‌ ‌తమాషాగా అడిగాడు.

‘‘ఈ అనుమానం వల్ల అన్నీ పోగొట్టుకున్నాను… నా అదృష్టం బాగుండి నాకు నెగటివ్‌ ‌వచ్చింది. ఒకవేళ పాజిటివ్‌ ‌వచ్చి ఉంటే బాధ్యత లేకుండా బలాదూర్‌గా తిరిగానని అనేవారు. ఒక రకంగా ప్రభుత్వానికి భారమయ్యేదానిని..’’ అని కన్నీళ్లు తుడ్చుకొంటూ లోలోపల్నుండి తన్నుకొస్తున్నా ఏడుపును అదుపు చేసుకొంటూ వాపోయింది.

అనురాగ్‌ ‌సలహా మేరకు వెంటనే పూనమ్‌ ‌సతారాలో ఉన్న తన తల్లిదండ్రులకి ఫోన్‌ ‌చేసింది.

‘‘అమ్మా! నాకు కరోనా వైరస్‌ ‌సోకలేదు. నాకు వచ్చింది మామూలు జ్వరమేనని రిపోర్ట్ ‌వచ్చింది. నా పెళ్లి రద్దయ్యిందని బాధపడకండి. మీకు అంతకంటే మంచి అల్లుడు దొరికాడు. ఆయన నా పక్కనే ఉండి నా బాగోగులు చూసుకొన్నారు. చాలా మంచివాడు. నాకు జ్వరం తగ్గాక ఇక్కడే కొన్నాళ్లు డాక్టరుగా నిస్వార్థమైన సేవలందించాలనుకొంటు న్నాను. కరోనా భయంతో కొంతమంది డాక్టర్స్ ‌సెలవు మీద వెళ్లిపోయారు.’’ అని పూనమ్‌ ‌తన తల్లితో చెప్తున్న మాటలు విన్నాక అనురాగ్‌ ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.

‘‘మీ సంకల్పం చాలా గొప్పది. అందుకే రెండంత స్తుల నుండి దూకినా కూడా చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు. కరోనా వచ్చిందనుకొని జీవితమే పోయిందనుకొన్న మీకు కరోనా కూడా రాలేదు. మీ ప్రేమ ముందు కరోనా ఏంటి… ఏ భూతం కూడా ఏమి చేయలేదు… ఇంతకీ మీ ఇంట్లో వాళ్లు నాతో పెళ్లంటే ఒప్పుకొంటారా…’’ అని దీనంగా అడుగుతున్న అనురాగ్‌ ‌వైపు చూసి అవునన్నట్లుగా సిగ్గుపడుతూ తలూపింది.

అంతలోనే డాక్టర్‌ ‌గోపి వచ్చి..

‘‘కరోనా ముందు అన్ని దేశాలు మోకరిల్లి ప్రాధేయపడుతుంటే, కరోనా మాత్రం మీ ప్రేమ ముందు చతికిలా పడిపోయింది. ప్రేమ ముందు కరోనానే ఏంటి ఏదైనా ఓడిపోవాల్సిందే. నా జీవితం లోనే మొదటిసారిగా చూసిన వింతైన ప్రేమకథ మీది.

ఓ అనుమానం, మరో అవమానం కలగలిసి మీ ప్రేమని కరోనా ముందు దీటుగా నిలబెట్టాయి.

‘కరోనా- ఓ ప్రేమకథ’ అని చెప్పుకొంటుంటే నాకు, వినేవాళ్లందరికి కాలక్షేపంగున్నా మీ కథ అందరికీ ఓ కనువిప్పవుతుందని ఆశపడుతున్నాను. మీ పెళ్లికి నన్ను పిలుస్తారని ఆశిస్తున్నాను…’’ అని వెళ్లిపోయాడతను. అతని మాటలు విన్నాక పూనమ్‌, అనురాగ్‌ ఒకరి కళ్లల్లో కొకరు చూసుకొంటూ భారంగా ఊపిరి పీల్చుకొని నవ్వుకొన్నారు.

About Author

By editor

Twitter
YOUTUBE