ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు తమ ప్రాంతీయ ప్రయోజనాల కోసం, ఉమ్మడి లక్ష్య సాధన కోసం కూటములుగా ఏర్పడ్డాయి. జి-7, జి-8, జి-20, ఆసియాన్ (అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఆసియా నేషన్స్), సార్క్ (సౌత్ ఆసియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోపరేషన్), బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా), షాంఘై కో ఆపరేషన్ కౌన్సిల్ (ఎస్‌సీసీ), బిమ్స్ టెక్ వంటి కూటములు ఈ కోవలోనివే. కాలక్రమంలో వీటిలో కొన్ని బలోపేతమయ్యాయి. తద్వారా అంతర్జాతీయ వ్యవహారాల్లో లబ్ధి పొందాయి. మరికొన్ని బలహీనమయ్యాయి. ఫలితంగా నష్టపోయాయి. ఇంకొన్ని కాలగర్భంలో కలసిపోయాయి. తాజాగా కొత్త కూటములు ఆవిర్భవించాయి. వాటిలో క్వాడ్ (క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్-చతుర్భుజ భద్రతా చర్చలు) కూటమి ప్రధానమైనది. ఇందులో అమెరికా, జపాన్, భారత్, ఆస్ట్రేలియా భాగస్వాములు. ఈ కూటమి దేశాల అధినేతలు నరేంద్ర మోదీ (భారత్), జో బైడెన్ (అమెరికా), స్కాట్ మోరిసన్ (ఆస్ట్రేలియా), యోషిహిదే సుగా (జపాన్)ల వర్చువల్ సమావేశం ఇటీవల జరిగింది. హిందూ మహాసముద్రం- పసిఫిక్ మహాసముద్రం (ఇండో-పసిఫిక్) ప్రాంతంలో అన్ని దేశాలకు సమానమైన హక్కులు ఉండాలని, యావత్ మానవాళికి సవాల్‌గా మారిన కరోనా మహమ్మారి కట్టడిలో కలసి పని చేయాలని సభ్య దేశాల అధినేతలు నిర్ణయించారు.
క్వాడ్‌కు సుదీర్ఘ చరిత్రే ఉంది. క్వాడ్ ఏర్పాటు ఆలోచనకు 2000 దశకంలోనే బీజం పడింది. 2004 డిసెంబరులో హిందూ మహాసముద్రంలో సంభవించిన సునామీతో ఇండో-పసిఫిక్ ప్రాంతం కకావికలమైంది. దీంతో ఈ ప్రాంతంలో సహాయక చర్యల నిమిత్తం కలసి పనిచేయాలని అప్పట్లో భారత్, జపాన్, అమెరికా, ఆస్ట్రేలియా నిర్ణయించాయి. 2007లో నాటి భారత ప్రధాని మన్మోహన్ సింగ్, అప్పటి అమెరికా ఉపాధ్యక్షుడు డిక్ చెనీ, జపాన్ ప్రధాని షింజో అబే, ఆస్ట్రేలియా ప్రధాని జాన్ హోవార్డ్ ఈ ఆలోచనను మరింత ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించారు. తరవాత కొంతకాలం పాటు ఈ ఆలోచన ఆగిపోయింది. తిరిగి 2017లో పునరుత్థానం చెందింది. గత ఏడాది సభ్య దేశాల విదేశాంగ మంత్రుల జమావేశం జరిగింది. దానికి అనుశీలనగానే తాజాగా సభ్యదేశాల అధినేతల సమావేశం జరిగింది. కూటమిలోని నాలుగు దేశాలు సంపూర్ణ ప్రజాస్వామ్య దేశాలు కావడం గమనార్హం. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో ఆధిపత్యం కోసం చైనా రకరకాల ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో, దూకుడుగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో క్వాడ్ అధినేతల నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. భవిష్యత్తులో ఈ ప్రాంతంలో ఎదురయ్యే సవాళ్లను సమర్థంగా, కలసికట్టుగా ఎదుర్కోవాలని, సానుకూల ఆలోచనతో ముందుకు సాగాలని నిర్ణయించారు. ఈ ప్రాంతంలో స్వేచ్ఛాయుత నౌకాయానానికి ఎలాంటి అవరోధాలు ఉండరాదని, అంతర్జాతీయ చట్టాలకు లోబడి భద్రతా పరిస్థితులు ఉండాలని అధినేతలు పిలుపునిచ్చారు. కరోనా వ్యాక్సిన్లు, వాతావరణ మార్పులు, సాంకేతిక పరిజ్ఞానం వంటి అంశాలకు సంబంధించి మూడు కార్యాచరణ కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దేశీయంగా తయారు చేసిన 46.3 కోట్ల డోసుల టీకాల ఎగుమతికి చైనా సిద్ధపడుతున్న తరుణంలో వంద కోట్ల డోసులను ఇండో-పసిఫిక్ ప్రాంతంలోని 24 దేశాలతో పాటు ఇతర దేశాలకూ అందించడానికి క్వాడ్ ప్రణాళిక సిద్ధం చేయడం విశేషం. అమెరికా పరిజ్ఞానం, అమెరికా, జపాన్ల ఆర్థిక సాయం, ఆస్ట్రేలియా కల్పించే రవాణా సదుపాయలతో వచ్చే ఏడాది చివరి నాటికి వంద కోట్ల డోసుల టీకాల తయారీ కార్యక్రమాన్ని భారత్ చేపట్టనుంది. 5జి సాంకేతికత, కృత్రిమ మేథ, సైబర్ స్పేస్‌లో ప్రమాణాల నిర్ధారణకు కార్యాచరణ బృందాలను ఏర్పాటు చేశారు.
ప్రపంచ జల రవాణాకు కీలకమైన హిందూ మహాసముద్రం-పసిఫిక్ మహాసముద్రం (ఇండో – పసిఫిక్) ప్రాంతంపై అన్ని తీర దేశాలకు సమానమైన హక్కులు ఉన్నాయని, ఆయా దేశాలు స్వేచ్ఛగా రాకపోకలు సాగించడానికి అవకాశాలు ఉండాలని అమెరికా అధినేత జో బైడెన్ సమావేశంలో విస్పష్టంగా వ్యాఖ్యానించారు. ఈ ప్రాంత సుస్థిరత కోసం సభ్య దేశాలతో కలసి పనిచేసేందుకు అమెరికా సిద్ధంగా ఉందని ఆయన ప్రకటించారు. ఇండో- పసిఫిక్ ప్రాంతం ఆంక్షల రహితంగా ఉండటం క్వాడ్ దేశాల సమున్నత భవితవ్యానికి ఎంతో అవసరమని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశం అంతర్జాతీయ చట్టాలకు, సార్వజనీన విలువలకు, స్వేచ్ఛాయుత వాణిజ్యానికి కట్టుబడి ఉండాలని పిలుపునివ్వడం ద్వారా బైడెన్ పరోక్షంగా చైనాకు చురకలు వేశారు. ఇరుగు పొరుగు దేశాలతో పాటు భారత్‌తోనూ సరిహద్దు వివాదాలకు చైనా కాలు దువ్వుతున్న నేపథ్యంలో బైడెన్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించు కున్నాయి. ఈ సమావేశం సభ్య దేశాలకే కాక యావత్ ప్రపంచానికి ఎన్నో శుభ సంకేతాలను పంపిస్తుందని భారత ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. కరోనా వైరస్‌ను నివారించే వ్యాక్సిన్ తయారీ, పర్యావరణ పరిరక్షణ, సరికొత్త ఆవిష్కరణలపై చర్చలతో సమావేశం ప్రయోజనాత్మకంగా సాగిందని ఆయన తెలిపారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, సుస్థిరతలు, సంపదల అభివృద్ధికి సభ్య దేశాలు కలసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య విలువలే నాలుగు దేశాలను ఒకచోట చేర్చాయని అన్నారు.
‘క్వాడ్’ కూటమిలో నాటోయేతర దేశం భారత్ ఒక్కటే కావడం గమనార్హం. చైనాతో సరిహద్దు వివాదాలు గల ఏకైక దేశం కూడా భారతే. భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వాన్ని వ్యతి రేకిస్తున్న ఏకైక దేశం కూడా చైనానే కావడం ఆలోచించదగ్గ విషయం. నిన్నటి తూర్పు లద్దాఖ్ ప్రతిష్టంభన, మొన్నటి డొక్లాం వివాదం నేపథ్యంలో బీజింగ్ నుంచి నేరుగా ఇబ్బదుంలు ఎదుర్కొనేది కూడా భారతే. అందువల్ల క్వాడ్ కూటమిలో భారత్ కీలకపాత్ర పోషించాల్సి ఉంది. ఇందుకు ఇతర దేశాలూ మద్దతు ఇవ్వాల్సి ఉంది. హిందూ మహా సముద్ర ప్రాంతంలో పట్టు సాధించేందుకు భారత్ కూడా కొంత చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రాంతంలోని మారిషస్, సీషెల్స్, మాల్దీవుల్లో అవసరమైన చోట్ల నిఘా కేంద్రాలను ఏర్పాటు చేసుకోవాలి. మారిషస్‌లో ఈ మేరకు ఇప్పటికే పనులు మొదలయ్యాయి. మాల్దీవులుతో భారత్ సంబంధాలు ప్రస్తుతం మెరుగ్గానే ఉన్నాయి. గతంలోని యమీన్ సర్కార్ దూరం పాటించినప్పటికి ప్రస్తుత ఇబ్రమీం సర్కార్ భారత్‌తో సన్నిహితంగానే ఉంటోంది. ఎనిమిదో దశకం చివర్లో నాటి మౌమెన్ అబ్దుల్ గయూమ్ సర్కార్‌పై తిరుగుబాటును భారత సైనికులు తిప్పికొట్టిన సంగతి తెలిసిందే. తిరుగుబాటును ఎదుర్కొనేందుకు గయూమ్ భారత్ సాయం కోరగా తక్షణం స్పందించింది.
కూటమిలోని మిగిలిన మూడు దేశాలకు అంతర్జాతీయ వ్యవహారాల్లో తప్ప, ప్రత్యేకంగా చైనాతో ప్రత్యక్ష వివాదాలు ఏమీ లేవు. అనేక అంతర్జాతీయ వ్యవహారాల్లో అమెరికాను చైనా సవాల్ చేస్తోంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఒకప్పటి సోవియట్ యూనియన్ (ప్రస్తుత రష్యా) పాత్రను ఇప్పుడు చైనా పోషిస్తోంది. అమెరికాను అడుగడుగునా అడ్డుకుంటూ దాని ఆధిపత్యానికి సవాల్ విసురుతోంది. అందువల్ల ఆసియాలో బీజింగ్ దూకుడును నియంత్రించేందుకు భారత్ సహకారం క్వాడ్ కూటమికి ఎంతో అవసరం. భారత్‌ను బలోపేతం చేయడం ద్వారా, మద్దతు నివ్వడం ద్వారా బీజింగ్ దూకుడుకు అడ్డుకట్ట వేయవచ్చు. వాస్తవానికి జో బైడెన్ తొలుత ఇండో-పసిఫిక్ ప్రాంతం గురించి పెద్దగా పట్టించుకోలేదు. కానీ బాధ్యతలు చేపట్టిన తరవాత మనసు మార్చు కున్నారు. ఫిబ్రవరిలో జరిగిన కూటమి దేశాల విదేశాంగ మంత్రుల సమావేశంలో దీనిపై స్పష్టత ఇచ్చారు. ప్రపంచంలో మూడో వంతుకు పైగా సరకు రవాణా జరిగే జలమార్గంపై రాజీపడే ప్రసక్తి లేదని సంకేతాలు ఇచ్చారు. వైట్‌హౌస్‌లోకి అడుగిడిన వెంటనే ఇండో – పసిఫిక్ సమన్వయకర్త పదవిని ఏర్పాటు చేశారు బైడెన్. తూర్పు ఆసియా, పసిఫిక్ వ్యవహారాల్లో నిపుణుడైన కర్ట్ క్యాంప్ బెల్‌ను ఈ పదవిలో నియమించారు. బరాక్ ఒబామా హయాంలో చైనా కట్టడికి అనుసరించిన వ్యూహాన్ని తెరవెనక నడిపించింది క్యాంప్ బెల్ కావడం గమనార్హం. తరవాత రోజుల్లో ట్రంప్ ఇదే విధానాన్ని కొనసాగించారు. దీన్నే ఇండో-పసిఫిక్ వ్యూహంగా పేర్కొన్నారు. కూటమిని విస్తరించేందుకు బైడెన్ ప్రయత్నిస్తున్నారు. కొన్ని ఐరోపా దేశాలను కూడా ఇందులో చేర్చుకునే అవకాశం ఉంది. బ్రిటన్ ఇప్పటికే ఆసక్తి చూపుతోంది. దక్షిణ చైనా సముద్రంలో సెంకాకు దీవులకు సంబంధించి చైనాతో జపాన్‌కు విభేదాలు ఉన్నాయి. యావత్ దక్షిణ చైనా సముద్రం తనదేనని బీజింగ్ మొండిగా వాదిస్తోంది. ఈ విషయంలో అంతర్జాతీయ ట్రైబ్యునల్ తీర్పును సైతం బేఖాతరు చేస్తూ బీజింగ్ ముందుకు వెళ్లడం దాని తెంపరి తనానికి నిదర్శనం. ఆస్ట్రేలియాకు కూడా బీజింగ్‌తో కొన్ని ఇబ్బందులు లేకపోలేదు. ఆస్ట్రేలియాను బీజింగ్ అనేక విషయాల్లో, ముఖ్యంగా ఆర్థికంగా ఇరుకున పెడుతోంది. ఈ పరిస్థితుల్లో చైనాను అడ్డుకోవడానికి క్వాడ్ తరహా కూటమి ఆవశ్యకత ఎంతైనా ఉంది.
ప్రస్తుతం కరోనా కారణంగా కూటమి దేశాల అధినేతలు ముఖాముఖీ సమావేశం కాలేకపోయారు. ఈ ఏడాది చివరి నాటికి ప్రత్యక్షంగా సమావేశం కావాలని నిర్ణయించడం వారి చిత్తశుద్ధికి నిదర్శనం. క్వాడ్ ముందున్న లక్ష్యాలను చేరుకోవడం అంత తేలికేమీ కాదు. వీటిని సాధించడం కోసం ఆసియాన్, హిందూ మహాసముద్ర ప్రాంత దేశాలు, పసిఫిక్ దేశాలతో కలసి పనిచేయాలని నిర్ణయించారు. తమతో కలసివచ్చే ఏ దేశంతో అయినా పనిచేసేందుకు సిద్ధమని ప్రకటించారు. కేవలం కూటమి దేశాల ప్రయోజనాలకే పాటుపడటం దీని లక్ష్యం కాదు. వాతావరణ మార్పుల వల్ల కలిగే దుష్ఫలితాలను నివారించడం, అంతర్జాతీయ భద్రతకు కట్టుబడటం, అన్ని దేశాల హక్కులను కాపాడటం, ప్రజాస్వామ్యాన్ని ప్రోత్సహించడం, అంతర్జాతీయ జలాల్లో అన్ని దేశాల నౌకలు ఎలాంటి అడ్డంకులు లేకుండా సంచరించడం వంటి కార్యక్రమాలను చేటపట్టడం క్వాడ్ దేశాల అధినేతల లక్ష్యం. కూటమి దేశాలు సంపూర్ణ ప్రజా స్వామ్య దేశాలు. ఈ దేశాల్లో క్రమం తప్పకుండా ఎన్నికలు జరుగుతాయి. ప్రజాస్వామ్య బద్ధంగా, శాంతియుతంగా అధికార మార్పిడి జరుగుతుంది. నాయకులు ఎవరైనా తమ విధానాలు, పాలన ద్వారానే ప్రజల మద్దతు పొందగలుగుతారు. ఏకపక్ష విధానాలకు, వ్యవహారశైలికి తావులేదు.
క్వాడ్ దేశాల అధినేతల సమావేశంపై బీజింగ్ పుల్లవిరుపు వ్యాఖ్యలు చేయడంలో వింతేమీ లేదు. క్వాడ్ అధినేతలు ప్రత్యక్షంగా ఎక్కడా తమ ప్రసంగాల్లో చైనా పేరును ప్రస్తావించనప్పటికీ కూటమి సమావేశంపై విమర్శలు చేయడం దానికే చెల్లింది. కూటమి లక్ష్యాలకు వక్రభాష్యాలు చెప్పడం ద్వారా తన అక్కసును వెళ్లగక్కింది. క్వాడ్‌ను ఆసియా ‘నాటో’గా అభివర్ణించ డంతో పాటు బ్రిక్స్, షాంఘై సహకార సంఘాలకు భారత్ గుదిబండగా మారిందని నోరు పారేసుకుంది. సభ్యదేశాల సమావేశం పరస్పర సహకారం కోసమే జరగాలని, మూడో దేశాన్ని లక్ష్యంగా చేసుకోరాదని బీజింగ్ సుద్దులు చెప్పడం దానికే చెల్లింది. అమెరికా నాయకత్వంలోని సైనిక కూటమి అయిన నాటో (నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్)కు, పరస్పర ప్రయోజనాల కోసం ఆవిర్భవించిన ‘క్వాడ్’కు పోలిక తేవడం అర్థరహితం. ప్రచ్ఛన్న యుద్ధకాలంలో ఏర్పాటైన నాటోకు ఇప్పటి కూటమికి పొంతనే లేదు. ఆ మాట కొస్తే నాటి సోవియట్ యూనియన్ నాయకత్వంలో ‘వార్సా’ సైనిక కూటమి ఏర్పాటైన విషయాన్ని మరచి పోరాదు. వాస్తవ పరిస్థితులను ఉద్దేశ పూర్వకంగా విస్మరించి అసత్యాలను ప్రచారం చేయడంలో బీజింగ్‌కున్న ఆసక్తి గురించి అందరికీ తెలిసిందే. అందువల్ల చైనా స్పందన గురించి పెద్దగా పట్టించుకో వలసిన అవసరం లేదు. లక్ష్య సాధన కోసం చిత్తశుద్ధితో, అకుంఠిత దీక్షతో ముందుకు సాగడమే క్వాడ్ ముందున్న తక్షణ కర్తవ్యం. కూటమిలో తమ దేశాలతో పాటు అంతర్జాతీయ సమాజానికి ఎలా మేలు చేయడమన్నదే వాటి ఆలోచనగా ఉండాలి.
– గోపరాజు విశ్వేశ్వరప్రసాద్, వ్యాసకర్త : సీనియర్ జర్నలిస్ట్