– సత్యనారాయణ చిత్తలూరి

శ్రీగిరిరాజు ధర్మసంరక్షణ పరిషత్తు కథల పోటీలో ప్రత్యేక బహుమతి పొందినది

ఒకరకంగా తనకీ, నాకూ పెద్ద తేడా ఏమీ లేదనిపిస్తోంది. బాల్కనీలోంచి చూస్తే కత్తిరించిన ఒక పెద్ద నీలం రంగు ముక్కలా కనిపిస్తుంది ఆకాశం నాకు. తనకి మాత్రం వంటింటి కిటికీలోంచి చిన్న నీలం రంగు ముక్కలా కనిపిస్తుంది. బాల్కనీ గోడమీద కొలువుదీరిన పూలకుండీలు నన్నల్లుకుపోయే గాలిని పరిమళభరితం చేస్తాయి. తన చుట్టూ ఉన్న గాలి కూడా రకరకాల రుచుల పరిమళమే. అప్పుడప్పుడూ చికాకులో పడ్డప్పుడు, మాడువాసనలు కూడా తనని చుట్టుముట్టి ఉక్కిరిబిక్కిరి చేస్తాయనే విషయం బాల్కనీ దాకా విస్తరించిన వాసనను బట్టి గ్రహింపు కలిగేది నాకు.

ఒకసారి వాళ్లాయననుకుంటాను. అరవటం కూడా వినబడింది. పెళ్లయిన కొత్తలో మాడు వాసనొచ్చినా, ఆయన అరుపులు మాత్రం వినిపించేవి కావు. చిలుకా గోరింకాల్లా కనిపించే వాళ్లు. చిలకా గోరింకలంటే గుర్తొచ్చింది. తనొక శుభ ముహుర్తం లోనే ఈ ఇంట్లోకడుగు పెట్టిందనుకుంటాను. తనొచ్చి చేరిన కొద్ది రోజులకు నేనొచ్చాను. నిజానికి నన్నూ తనే ఇక్కడికి చేర్చింది. నేనూ, నా జతగాడు. ఆ రోజులు హాయిగానే గడిచాయి.

తను ఇటు కేసి రానపుడు కూడా పెద్ద నీలం రంగు ముక్క అందంగానే కనబడేది. అక్కడ విరిసిన ఇంద్రధనుస్సు చువ్వల సందుల్లోంచి మా ఇద్దరి మీదికి ప్రసరించి గిలిగింతలు పెట్టినట్టుండేది. నా జతగాడికి మాత్రం దూరంగా కనిపించే అడవిలోనికి స్వేచ్ఛగా ఎగిరిపోవాలనే ఆరాటంగా ఉండేది. ఎన్నాళ్లయినా ఇద్దరం ఎగిరిపోయి స్వేచ్ఛగా బతకాలనేవాడు.

ఏమైందో ఏమో! ఒకరోజు తుపాను రాత్రి తెల్లవారటంతోనే నా జతగాడి బతుకు కూడా తెల్లారిపోయింది. కంటికిమింటికి ఏకధాటిగా ఏడ్చాను. తను కూడా జతగాడ్ని కోల్పోయిన నా పరిస్థితికి కన్నీటి పర్యంతమైంది. అప్పటి నుంచి బాల్కనీ చూరుకు ఒంటరిగా వేలాడటమే నా ఉనికైంది.

తను మాత్రం ఇల్లంతా తిరుగుతున్నట్టే అనిపించినా, వంటింట్లోనే ఎక్కువగా గడుపుతూ ఉండేది. పిల్లలను శుభ్రంచేస్తూ, లాలపోస్తూ, రోగాలకు నొప్పులకు సకల సేవలు చేస్తూ, పిల్లలు పెద్దాళ్లయి పెళ్లీడు కొచ్చినా, వంటింటినుంచి తను పెద్దగా బయటపడ్డ దాఖలా లేదు. తన జతగాడు ఇంట్లోనే ఉన్నా తన మనసులో లేనట్లే కనిపించేది. ఎందుకో అర్థమయ్యేది కాదు. ఎప్పుడైనా నన్ను కనిపెట్టుకుని ఉండటంలో ముందే ఉండేది. ఎంత పని ఒత్తిడిలో ఉన్నా ఉదయమూ సాయంత్రమూ నన్నోసారి పలకరించి వెళ్లందే తన మనసు కుదుటపడేది కాదు.

తనొచ్చి నా చువ్వల ఇంటిని తట్టినపుడు నాకూ అట్లాగే ఉండేది. రోజులో ఎక్కువభాగం తన వంటింటివైపు తిరిగి చూడటం నాకిష్టంగా ఉండేది. తను నా వైపు రావటం గమనిస్తే, ఆనందంతో రెక్కలిప్పి అటూ ఇటూ తిరిగేదాన్ని. నా జతగాడ్ని కోల్పోయాక తను నావైపు ఎక్కువసార్లు ఏకాగ్రత కనపర్చటం కాస్త ఉపశమనంగా ఉండేది. తను రావటంలేదని తెలిసినపుడు తలెత్తి పెద్ద నీలంరంగు ముక్క కేసి చూపు సారించి జతగాడ్ని ఊహించు కుంటూ కళ్లు తడి చేసుకోవటం అలవాటయింది. పూలకుండీల్లోని ఎర్ర గులాబీలు గాలికి ఊగుతూ కొంత గాయాన్ని మానుపుతున్నట్టుండేవి.

ఎప్పుడైనా బుద్ధి పుట్టినప్పుడు పిల్లలు కూడా వచ్చి పలకరించటం ఆనందంగానే ఉండేది. ఎక్కువసార్లు నన్ను అల్లరి చేయటానికి ప్రయత్నించి నపుడు మాత్రం విపరీతమైన కోపమొచ్చేది. లోపల అడ్డంగా అమర్చిన తీగ మీద అసహనంగా తిరిగేదాన్ని. ముక్కుతో నిలువుతీగల్నీ, అడ్డతీగల్ని గట్టిగా కరిచిలాగేదాన్ని. ఒక చిన్న కప్పులో పెట్టిన నీటిని కాలితో తన్నేదాన్ని. తినటానికి పెట్టిన ఏదో పండును ముక్కుతో కసిగా కొరికి పిల్లల వైపు విదిలించేదాన్ని. అవన్నీ నా విన్యాసాలుగా పరిగణించి పిల్లలు ఎగతాళిగా నవ్వటం నా కోపానికి ఆజ్యం పోసేది. నా తీగలమధ్యకి ఏదో కర్రపుల్లను చొనిపి నన్ను పొడవటం నాకు బాధగా ఉండేది. ఈ దృశ్యం చూసిన తను తీవ్రంగా మందలించేది. దూరం జరిగిపోయి ఇంట్లోకి పరిగెత్తేవాళ్లు పిల్లలు. తీగల్లో ఇరుక్కున్న కర్రపుల్లను తొలగించి నాకేమీ కాలేదని నిర్ధారణ చేసుకున్నాక ఊపిరి పీల్చుకునేది తను. ఒలికిపోయిన ప్లాస్టిక్‌ ‌కప్పును మళ్లీ శుభ్రమైన నీటితో నింపేది. తాజా పళ్లను లోపలపెట్టి తినమని సైగ చేసేది. తన మీదున్న గౌరవంతో పండును కొరికేదాన్ని. అప్పుడు తన కళ్లల్లో మెరిసే మెరుపు పిల్లల ఆకతాయితనాన్ని ఇట్టే మరిచిపోయేలా చేసేది. నా ఆనందాన్ని తెలియజేస్తూ రెక్కలు టపటప లాడించేదాన్ని.

నా రెక్కల విస్తరణకు సరిపడే జాగా కాదని పించింది ఈ ఇనుప తీగల అల్లిక. రెక్కలు మరింత విశాలం చేసుకుని నా జతగాడ్ని వెతుక్కుంటూ నీలం రంగు ఆకాశంలో కలిసిపోవాలని చాలాసార్లని పించేది. తన ఒంటరితనాన్ని పోగొట్టే మంచి స్నేహితురాల్ని నేనేనని తెలిసి, నా ప్రయత్నాన్ని విరమించేదాన్ని. నా ఇంటిని శుభ్రంచేసే క్రమంలో చాలాసార్లు పంజరం తలుపు తెరిచేపెట్టేది. తుర్రుమని ఎగిరిపోవాలని బలంగా అనిపించేది. తనకు ఒంటరితనాన్ని మిగిల్చి పారిపోవటం ఇన్నేళ్ల నా పక్షి సావాసంలో ఎందుకో ఇష్టముండేది కాదు. ఇప్పుడు తనకి నేనే జతగాడ్ని. తనకు ఏ చిన్నబాధ కలిగినా బాల్కనీలోకే పరుగెత్తుకుంటూ వచ్చేది. తన దుఃఖభారాన్నంతా నన్ను చూస్తూ దించుకొనేది. బాల్కనీలో నా ఎదురుగా నిలబడి పెద్ద నీలంరంగు ఆకాశం ముక్కను చూడటమే తనకి బాగా ఇష్టమని నాకు త్వరలోనే అర్థమైంది. నాతో కలిసి వీక్షించటం తనకు బాగా ఇష్టంగా ఉండేది.

వంటింటి కిటికీలో చిన్న నీలంరంగును తనతో కలిసి వీక్షించేందుకు తన జతగాడు రావాలని చాలా బలంగా కోరుకుంటుంది. అతను మాత్రం తనకు కావాల్సిన ఆహార పదార్థాలకోసం ఆర్డర్లు ఇస్తూనో, పేపరులో వార్తలు చదువుతూనో, పిల్లలతో ఆటల్లో గడుపుతూనో ఉండేవాడు.

ఈ మధ్య ఎందుకో ఇంటిల్లిపాదీ నెలల తరబడి ఇంట్లోనే గడుపుతున్నారు. మనవళ్లిద్దరూ బడికి వెళ్లటం మానేశారు. కొడుకులూ, కోడళ్లూ ఆఫీసుకెళ్లటం మానేశారు. పెళ్లయిన కొత్తలో తరచుగా వంటింట్లోకి ప్రవేశించి సరదాపడే అతని అలవాటు మనవళ్లతో కలిసి ఆడుకోవటానికే బాగా అలవాటు పడిపోయింది. కొన్నిగంటలు మాత్రం హాల్లో కూర్చుని పిల్లలు కంప్యూటర్లో ఏదో పాఠాలు వింటున్నట్టుండేది. తన పిల్లలేమో కోడళ్లతో కలిసి ఆఫీసుకు సంబంధించిన పనేదో ఇంట్లోంచి చేస్తున్నట్టే అర్థమైంది.

తన పని విధానంలో మాత్రం ఎలాంటి మార్పూలేదు. గత రెండు మూడు నెలలుగా పనిభారం బాగా పెరిగినట్టనిపిస్తోంది. నా వైపు అంత తరుచుగా రావటం తగ్గించటం వల్ల ఊహించగలిగాను. ఎప్పటికంటే ఎక్కువగా వంటింట్లో బాగా బిజీ అయింది. రకరకాల రుచుల వాళ్ల గొంతెమ్మ కోరికలన్నీ వంటింట్లోనే ఎక్కువభాగం గడిపేలా చేస్తున్నాయి. వండటం, కడగటం, మళ్లీ వండటం. పాత్రలవే కానీ, వంటలు విరివిగా మారుతున్నాయి. చాకిరీ విపరీతంగా పెరిగింది. ఎవరి పనిలో వాళ్లు బిజీగా ఉన్నట్టు కంప్యూటర్‌ ‌ముందు నటిస్తున్నారేమో అనిపించేది. బాల్కనీలోంచి కళ్లు తిప్పి క్షుణ్ణంగా హాలంతా పరిశీలించేదాన్ని. ఎవరికివాళ్లు బెడ్రూమ్‌ల్లో దూరి తలుపులేసుకున్నపుడు తప్ప, మిగతా విషయాలన్నీ స్పష్టంగానే కనిపించేవి. తన పనిలో సహాయం చేసే వాళ్లెవరూ లేరని మాత్రం అర్థమైంది.

ఎప్పుడూ తనొక మాటంటూ ఉండేది. ‘‘చిన్నప్పటి నుంచీ నాకీ చాకిరీ తప్ప లేదు. గంపెడు ఆడపిల్లల తల్లి పెంపకంలో నా కడగొట్టు బాల్యమంతా సొంతిం ట్లో పనిమనిషిలానే గడిచింది. నేను పక్క మీదినుంచి లేవగానే ఎవరైనా వేడి వేడి కాఫీ చేతికందిస్తే బాగుండని ఎంతో ఆశపడేదాన్ని. పొద్దున్నే నాకు నచ్చిన అల్పాహారాన్ని నా ముందు పెట్టి, కొసరి కొసరి తినిపించే అమ్ముంటే ఎంత హాయిగా ఉంటుంది అనుకునేదాన్ని. పెళ్లయి ఈ ఇంట్లోకడుగు పెట్టినతర్వాత ఆయనగారు స్వయంగా తన చేత్తో కాఫీ కలిపి నా బెడ్‌ ‌దగ్గరకు తీసుకొచ్చి అందిస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది అనిపించేది. అప్పుడప్పుడూ వంటింట్లోకి దూరి వెనకనుంచి కౌగిలించుకుని మెడ వంపులో నులి వెచ్చని శ్వాసనే కాదు, ఒక రోజంతా నా కోసమే వేడి వేడి పదార్థాలు తయారు చేసి ప్రేమగా వడ్డిస్తే ఎంత ఆనందంగా ఉంటుంది. ఇట్లాంటి నా కోరికలన్నీ తీరని కోరికలుగానే మిగిలిపోయాయి. పిల్లలు పెద్దాళ్లయినా, నా ప్రపంచం చిన్నదిగానే ఉండిపోయింది. అందులోంచి ఇన్నేళ్లు గడిచినా వంటిల్లు మాత్రం తొలగి పోలేదు.’’ అని ఒకరోజు ఎంతగానో వాపోయింది తను.

గత వారం రోజులుగా, సుడిగాలిలా ఇలా వచ్చి అలా వెళ్లిపోతుందేగానీ ఎప్పటిలా నా వైపు తేరిపార చూస్తూ, నాతో ప్రేమగా నాలుగు మాటలు చెప్పటం మర్చిపోయింది. ఈ రోజేమైందో తెలియదు. ఎర్రబడ్డ కళ్లను తుడుచుకుంటూ చేతిలో ఉన్న జామపండును నా పంజరం తలుపులు కొద్దిగా తెరిచి లోపలికి నెట్టింది. మునుపైతే వెంటనే ముక్కుతో పొడిచి ఆహారం పట్ల నా సమ్మతిని తెలియజేసేదాన్ని. తీగ మీద నుంచి ఇంచుకూడా కదల్లేదు. అలిగానని అర్థమైందో ఏమో!

 ‘‘ఏం చిట్టీ? ఏమైంది? నిన్ను సరిగా పట్టించు కోవటం లేదని కోపమా? ఏం చేయను చెప్పు. గమనిస్తూనే ఉన్నావుగా. అందరూ ఇంటిపట్టునే తిష్ట వేయటం వల్ల నాకెంత చాకిరీ పెరిగిందో. ఇల్లు ఊడవం, అంట్లు తోమటం బట్టలుతకటం. పొడివస్త్రాలను ఇస్త్రీ చేసి వార్డ్ ‌రోబులో సర్దటం. ఇంట్లోనే ఉన్నా ఉదయం స్నానాలు, సాయంత్రం స్నానాలు. పూట పూటకూ రకరకాల వంటలు. మనవళ్లూ, మనవరాళ్లకు స్నానాలు చేయించి, బట్టలు మార్చటం, ఆన్‌ ‌లైన్‌ ‌క్లాసుల్లో ఇచ్చిన బండెడు హోమ్‌ ‌వర్కును దగ్గరుండి చేయించటం నాకే పట్టటం, సరిగా చేయకపోతే నేనే పేజీలకు, పేజీలు రాసి పెట్టి ‘మా మంచి నానమ్మా’ అనిపించుకోవటం, ఒకటా? రెండా? కాళ్లకి చక్రాలు కట్టుకుని హాల్లోకి, వంటింట్లోకి, వాష్‌ ‌రూంలోకి, బాల్కనీలోకి రంగుల రాట్నంలా తిరుగుతూనే ఉన్నాను. వర్క్‌ఫ్రమ్‌ ‌హోమంటూ ఇంటిల్లిపాది పని విధానం మారినా, వర్క్ ‌ఫ్రమ్‌ ‌వంటిల్లే నా పని విధానంగా మిగిలి పోయింది. నీకు తెలియందేముంది చిట్టీ? నాతోపాటే ఈ ఇంట్లోకడుగు పెట్టినదానివి’’ అని దీర్ఘంగా నిట్టూర్చిచ్చింది తను.

‘‘నడుమ నా ఆకలి దప్పికల్నీ గమనిస్తూ, పసిపిల్లలా నాకూ చాకిరీ చేయటంలోనూ నీ శ్రమే కదా ఉంది.’’ అని మనసులోనే అనుకుంటూ ‘‘అవును.. అవును.’’ అనే మాటను మాత్రం చిలుక పలుకులా పైకనేయగలిగాను. ఆ ఒక్క పలుకుతో తన ముఖంలో చాలా కాలానికి చిరునవ్వు మెరిసింది. కనీసం నేనైనా తన చాకిరీని గుర్తించగలిగాననే సంతృప్తి.

 ఇంటిల్లిపాది కోసం ఇంట్లో అంతగా రెక్కలు ముక్కలు చేసుకుంటున్నా తనకు దక్కవలిసినంత గౌరవం దక్కుతుందా? తన కష్టాన్ని గుర్తించక పోయినా ఫర్వాలేదు. తన గొడ్డు చాకిరీని టేకిట్‌ ‌గ్రాంటెడ్‌గా తీసుకుని. ‘‘అన్నీ తెచ్చి పెట్టాక వండి పెట్టటానికేమినొప్పి? అయినా నువ్వేమైనా ఉద్యోగం చేసి ఊళ్లేలేదేమన్నా ఉందా? ఇంట్లో ఉండే పనేగా?’’ బాల్కనీలో పేపరు చదువుకుంటూ అలవోకగా ఆయనన్న మాటలకు నా గుండెనే రంపంతో కోసినంత పనైంది. పంజరం తలుపులోకి చేయి దూర్చి నా ప్లాస్టిక్‌ ‌గిన్నెలో నీళ్లు సర్దుతున్న తను స్థాణువులా నిలబడిపోయింది. గిన్నెలో పడాల్సిన నీటి ధార తన కళ్లల్లోంచి రాలిపడుతోంది. మౌనంగా పంజరం తలుపు మూసి హాల్లోకి పరుగెత్తుకెళ్లింది. వంటింటి తలుపు శబ్దం ధడేల్మని వినబడింది. ఏమీ జరగనట్టు పేపరులోంచి తలెత్తి హాలు వైపు, నా వైపు చూశాడతను. రెక్కలు గట్టిగా విదిలించి, ముక్కుతో ఇనుప చువ్వను కసిగా కొరికి నా నిరసనను తెలిపాను. గతుక్కుమని తలదించుకుని పేపరులో ముఖం చాటేసుకున్నాడు.

గంపెడు చాకిరీని నెత్తినేసుకుని లేచింది మొదలు, రాత్రి పొద్దు పోయేదాకా హాల్లోకి, వంటింట్లోకి తిరిగే అలుపెరుగని రంగులరాట్నమే తను. ఇంతా చేసి పక్క మీదికి చేరితే, ‘‘ఎంతసేపూ పిల్లల అవసరాలు చూడటమేగానీ, ఇంట్లో నేనొకడినున్నాను. నాకో అవసరముంటుందీ అనే ఆలోచనుందా నీకసలు?’’ చింత చచ్చినా పులుపు చావని మాటలు గుండెను బుల్లెట్లయి జల్లెడ చేస్తాయి. ఉన్న పళంగా నడుం వాల్చిన పక్క అంపశయ్యలా మారిపోతుంది. పక్కనున్న పెనిమిటి పక్కలోనే బల్లెమై గుచ్చుకున్న ట్లుండేది. ఎన్ని నిద్రపట్టని రాత్రులు బాల్కనీలో నీ ఎదురుగా కరిగిపోయాయి. నీకు తెలియదా చిట్టీ? అంటూ నిన్న తాను చెప్పినప్పుడు ఏడుపొచ్చింది.

ఈ రోజు పొద్దున్నే నా పంజరం తలుపును ఎప్పటిలాగే తెరిచి పెట్టిందనుకున్నాను. నాకిష్టమైన జామపండునొకదాన్ని అరచేతిలో పెట్టుకుని బయటకు రమ్మన్నట్లు సైగ చేసింది. నాకు ఆనందంతోపాటూ, అంతులేని ఆశ్చర్యం కలిగింది. తలుపు తెరిచినపుడల్లా ఎగిరి పోయి నీలంరంగు పెద్ద ముక్కలో కలిసి పోవాలన్న నా బలమైన కోరిక ఇపుడెందుకో బలహీనపడింది. కాలు కదపటం కూడా కష్టంగా అనిపిస్తోంది. రెక్కలు మరీ. కొన్ని క్షణాలు తటపటా యించాను. తలెత్తి తనవైపు చూసాను. బయటకొచ్చేయమన్నట్లు మళ్లీ సైగచేస్తూ నవ్వుతోంది తను. మూసి ఉన్న హాలు తలుపుల వైపు వెనక్కి తిరిగి చూస్తూ ఎవరూ బాల్కనీ కేసి రావటం లేదని నిర్ధారించుకుంది. మళ్లీ నవ్వుతూ సైగ చేసింది బయటకు రమ్మన్నట్లుగా.

అరచేతిలోని జామపండును ఎత్తి చూపుతూ ‘‘నీకిష్టమైన పండు కదా. ఎంత ఎర్రగా దోరగా పండి ఉందో చూశావుగా. మనవళ్ల దృష్టికందకుండా నీకోసమే దాచి పెట్టి తెచ్చాను. ఇంద తీసుకో’’ అంటూ తన చేతి వేళ్లతో పైకెత్తి పట్టింది.

జామపండు నిగనిగలు నా నోరూరిస్తున్నాయి. పూలకుండీలోని మొక్కలు పూలతో స్వాగతం పలుకుతున్నాయి. ఉన్నట్టుండి బాల్కనీలో కలకలం. ఎక్కడినుంచొచ్చారో మా జాతి నేస్తగాళ్లు. బాల్కనీ ఇనుప రెయిలింగ్‌ ‌మీద బిలబిలమంటూ వాలిపోయారు. వాటి రెక్కలగాలికి పూలమొక్కలు ఊగుతున్నాయి. ఊహించని ఈ పరిణామాన్ని ఆశ్చర్యచకితయై చూస్తోందామె. రెండు రోజుల ముందునుంచే పక్కనే ఉన్న అడవిలోంచి మా జాతి నేస్తాలిలా దండు కట్టి బాల్కనీలోకి ప్రవేశిస్తూ నా పంజరం చుట్టూ సందడి చేయటం నాకు తెలుసు. పంజరంలోంచి ఎలాగైనా బయటపడమని, నన్ను తమతో కూడా తీసుకెళ్లటానికే మేమొచ్చామని నన్ను ఆహ్వానిస్తున్నట్టుగా నా చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ గడిపేవి. పనిఒత్తిడిలో వంటింట్లోనే మగ్గుతూ ఇదంతా గమనించలేదు తను.

మాయదారి పురుగేదో మనుషులందర్నీ ఇండ్లల్ల్లోనే కట్టిపడేసిందట. వీధులూ, నగరాలూ, పల్లెలూ మనుష సంచారం లేక నిర్మానుష్యమయి పోయాయి. అడవి జంతువులకు, పశువులకూ, పక్షులకూ పూర్తి స్వేచ్ఛ లభించింది. దాని ఫలితమే బాల్కనీలోకి నా నేస్తగాళ్ల ప్రవేశం. నా పంజరం చుట్టూ గిరికీలు కొడుతూ నానా సందడి చేస్తున్న నా జాతి నేస్తగాళ్లను చెదరగొట్టకుండా నన్ను ప్రేమగా బయటకు ఆహ్వానిస్తున్న తన ఉద్దేశం నాకర్థమైంది. కానీ మనసంతా అలుముకున్న దిగులేదో నా రెక్కలకు సంకెళ్లు వేస్తోంది. మెల్లగా గెంతి తన చేతి మీద వాలాను. జామ పండు వైపోసారి చూసి, తన ముఖం వైపు తల తిప్పాను. అదే చిరునవ్వు మెరుపులా తన ముఖంలో. నేను వాలినచేతిని నోటి దగ్గరగా వాల్చు కుని నా చిలుక ముక్కుపై తన్మయంతో ముద్దుపెట్టింది. జామపండును ఇష్టంగా నోట కరుచుకుని నా నేస్తగాళ్ల సమూహం వైపు ఎగిరాను. కత్తిరించిన పెద్ద నీలం రంగు ముక్కలా ఉన్న ఆకాశం మరింత విశాలమవు తోంది. బాల్కనీ చిన్నదవుతోంది. తన ప్రేమ వల్ల నా పంజరం తలుపులు తెరుచుకున్నాయి. కానీ తన పంజరం తలుపులే ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియని దిగులు మాత్రం, నా జతగాడి వియోగ మంత దుఃఖంగా ఉంది నాకు.

About Author

By editor

Twitter
YOUTUBE