– గోపరాజు విశ్వేశ్వరప్రసాద్
ఇరుగు పొరుగు దేశాలతో సత్సంబంధాలన్నది చైనా చరిత్రలో లేనే లేదు. ఇచ్చిపుచ్చుకునే విధానానికి బీజింగ్ ఎప్పుడూ ఆమడ దూరమే. ఏకపక్షంగా, మొండిగా, అహంకారపూరితంగా, కుట్రపూరితంగా వ్యవహరించడం దాని నైజం. ‘బతుకు-బతికించు’ విధానం దానికి ఏమాత్రం సరిపడదు. ఈ దేశం, ఆ దేశం అన్న తేడా లేకుండా దాదాపు అన్ని ఇరుగు పొరుగు దేశాలతో బీజింగ్ వ్యవహరించే శైలి ఇదే. ఇక భారత్ అంటే బీజింగ్‌కు ఒళ్లుమంట. ఒళ్లంతా కారం రాసుకున్నట్లుంటుంది. భారత్‌ను ఇరుకున పెట్టడానికి, ఇబ్బంది పెట్టడానికి, బలహీన పరచడానికి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఇది దశాబ్దాల చరిత్ర. ఆరంభం నుంచి చైనా తీరు ఇదే. వాస్తవాధీన రేఖ వద్ద ఏడాదిగా కొనసాగుతున్న ఉద్రిక్తతలు ఇప్పుడిప్పుడే ఉపశమిస్తున్న తరుణంలో సరిహద్దులో సరికొత్త చిచ్చుకు తెరలేపింది చైనా. బ్రహ్మపుత్ర నది నీటిని బిగపట్టే ప్రయత్నానికి పావులు కదుపుతోంది. తద్వారా భారత్‌కు చిక్కులు కల్పించనుంది. ఒక్క భారత్ మాత్రమే కాదు, బ్రహ్మపుత్ర దిగువనున్న బంగ్లాదేశ్‌కూ ఇబ్బందులు కలుగనున్నాయి. ఈ నదిపై భారీ జలవిద్యుత్ కేంద్రం నిర్మాణానికి ప్రతిపా దించడం ద్వారా భారత్ ప్రయోజనాలకు దెబ్బతీయనుంది.
చైనాలోని టిబెట్ స్వయంపాలిత ప్రాంతం నుండి భారత్‌లోని అరుణాచల్‌ప్రదేశ్, అసోంలలో ప్రవహించే బ్రహ్మపుత్ర నదిపై భారీ జలవిద్యుత్ కేంద్రం నిర్మాణానికి చైనా పార్లమెంట్ ఆమోదం తెలిపింది. బ్రహ్మపుత్ర నది దిగువ భాగంలో అరుణాచల్‌ప్రదేశ్‌కు అత్యంత సమీపంలో దీనిని నిర్మించనున్నారు. చైనా అభివృద్ధి పేరుతో మొత్తం 60 ప్రాజెక్టులకు సంబంధించిన ప్రతిపాదనలతో 14వ పంచవర్ష ప్రణాళికను ఆ దేశ పార్లమెంట్ నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ ఆమోదించింది. ఇందులో బ్రహ్మపుత్ర జలవిద్యుత్ కేంద్రం నిర్మాణం కూడా ఉంది. గత ఏడాది కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా (సిపిసి) ఆమోదించిన బ్లూప్రింట్‌ను పార్లమెంట్ ఎలాంటి సవరణలు లేకుండా ఆమోదించింది. దేశ అధినేత జిన్‌పింగ్, ప్రధాని లీకెకియాంగ్, సుమారు రెండువేల మంది కీలక నాయకులు కాంగ్రెస్ సమావేశాలకు హాజరయ్యారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన పార్టీ ప్రముఖులు బ్రహ్మపుత్రపై వివాదాస్పద ప్రాజెక్టు నిర్మాణానికి ఆమోదం తెలిపారు. ఈ ఏడాదే దీని నిర్మాణాన్ని ప్రారంభించనున్నట్లు కమ్యూనిస్టు పార్టీ టిబెట్ అటానమస్ రీజియన్ డిప్యూటీ చీఫ్ చెడల్హా వెల్లడించారు. ప్రాజెక్టుకు సంబంధించిన పర్యావరణ, ఇతర సాంకేతిక అనుమతులు యుద్ధప్రాతిపదికన మంజూరు కానున్నాయి. దీనికి సంబంధించి ‘దక్షిణ చైనా మార్నింగ్ పోస్టు’ ఇటీవల ఓ కథనాన్ని ప్రచురించడం గమనార్హం. అంటే ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన నిర్ణయం ఎప్పుడో జరిగింది. ఇప్పుడు అధికారికంగా ప్రకటించారు.
ఉమ్మడి నదీజలాల పంపిణీకి సంబంధించి అంతర్జాతీయంగా కొన్ని సంప్రదాయాలు, స్థిరమైన విధానాలు ఉన్నాయి. వీటిని తుంగలోకి తొక్కి ప్రాజెక్టుపై ఏకపక్షంగా ప్రకటన చేసింది బీజింగ్. సాధారణంగా ఇరు దేశాల మీదుగా ప్రవహించే నదీజలాల పంపకం, నదులపై తాగు, సాగునీరు, జలవిద్యుత్ కేంద్రాల నిర్మాణం చేపట్టాలని ఏ దేశమైనా నిర్ణయిస్తే ముందు సంబంధిత దేశాలకు ఆ విషయాన్ని తెలియజేయాలి. వాటి అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలి. ఉభయులకూ ఎలాంటి నష్టం జరగకుండా చర్చలు జరపాలి. ముఖ్యంగా నదికి ఎగువ దేశాలపై ఈ బాధ్యత ఉంది. బ్రహ్మపుత్ర విషయంలో చైనా దీనిని పూర్తిగా విస్మరించింది. బ్రహ్మపుత్ర ఒక్క భారత్‌కు సంబంధించిన విషయమే కాదు, ఇది భారత్ నుంచి బంగ్లాదేశ్‌లోకి ప్రవహించి అక్కడ బంగాళాఖాతంలో సంగమిస్తుంది. చైనా నుంచి భారత్‌లోని అరుణాచల్‌ప్రదేశ్‌లోకి తొలుత బ్రహ్మపుత్ర అడుగిడుతుంది. ఈ లోపల నదిపై పెద్దగా ప్రాజెక్టులు లేవు. అరుణాచల్‌ప్రదేశ్ నుంచి అసోంలోకి ప్రవహిస్తుంది. ఈ రాష్ట్రంలో బ్రహ్మపుత్ర ఎక్కువ దూరం ప్రవహిస్తుంది. ఇక్కడ నుంచి బంగ్లాదేశ్‌లోకి అడుగుపెడుతుంది. బ్రహ్మపుత్రపై అసోం పూర్తిగా ఆధారపడింది. ఈ నది ఆధారంగా చిన్నా చితకా ప్రాజెక్టులు ఉన్నాయి. రాష్ట్ర తాగునీరు, సాగునీరు అవసరాల్లో సింహభాగం బ్రహ్మపుత్ర నది తీరుస్తుంది. సాధారణ రోజుల్లో బ్రహ్మపుత్ర జలాలతో రైతులు బంగారం పండిస్తారు. ఒక్కోసారి వరదలు చుట్టుముట్టినప్పుడు బ్రహ్మపుత్ర రాష్ట్రంలో భీతావహ పరిస్థితిని సృష్టిస్తుంది. స్థూలంగా చూస్తే బ్రహ్మపుత్ర నదితో అసోం అనుబంధం విడదీయలేనిది. ఇంతటి విస్తీర్ణ నేపథ్యం ఉన్నప్పటికి తమ దేశంలో ఈ నదిపై నిర్మించే జలవిద్యుత్ కేంద్రం నిర్మాణానికి సంబంధించి చైనా మాట మాత్రంగా కూడా భారత్‌కు ముందస్తు సమాచారం అందించలేదు. పత్రికల్లో వార్తల ఆధారంగానే మన ప్రభుత్వం ఈ విషయం తెలుసుకుంది. ఉభయ దేశాల మీదుగా ప్రవహించే నదీ జలాలకు సంబంధించి అంతర్జాతీయంగా నెలకొన్న దౌత్య సంప్రదాయాలను బీజింగ్ ఉద్దేశ పూర్వకంగానే విస్మరించిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి చైనాకు తమ అభ్యంతరాలను, ఆక్షేపణాలను తెలియజేసేందుకు భారత్ కరసత్తు చేస్తోంది. ఒక్క భారత్‌కే కాదు, దిగువనున్న బంగ్లాదేశ్‌కు సైతం చెప్పాలన్న విషయాన్ని విస్మరించింది చైనా. జరుగుతున్న పరిణామాలను బంగ్లాదేశ్ నిశితంగా గమనిస్తోంది. తన అభ్యంతరాలను తెలియజేసేందుకు సిద్ధమవుతోంది.
చైనాలోని స్వయంప్రతిపత్తి ప్రాంతమైన టిబెట్ నుంచి బ్రహ్మపుత్ర ప్రస్థానం ప్రారంభమవుతుంది. ఈ నదిని అక్కడ ‘యార్లంగ్ సాంగ్‌పా’ అని వ్యవహరిస్తారు. భారత్‌లో దీనిని బ్రహ్మపుత్ర అని పిలుస్తారు. ఈ నది దాదాపు 2900 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. ప్రతిపాదిత జలవిద్యుత్ కేంద్రం ప్రపంచంలోనే అతిపెద్ద జలవిద్యుత్ కేంద్రం. బ్రహ్మపుత్ర ఎగువ భాగంలో చైనా ఇప్పటికే అనేక ప్రాజెక్టులను నిర్మించింది. ఇప్పుడు తాజా ప్రాజెక్ట్‌ను నది దిగువ భాగంలో నిర్మించనుంది. అంటే మన దేశంలోని అరుణాచల్‌ప్రదేశ్‌కు అత్యంత సమీపంలో ఈ ప్రాంతం ఉంటుంది. 60 గిగా వాట్ల సామర్థ్యం గల ఈ ప్రాజెక్టు పూర్తయితే దిగువన గల భారత్‌కు నీటి కొరత ఏర్పడుతుంది. ఇక వరదలు, తుపాన్ల వంటి సమయాల్లో గేట్లు ఎత్తేసినప్పుడు వరద నీటి వల్ల భారత్‌లోని వివిధ ప్రాంతాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉంది. అదే సమయంలో అనావృష్టి, కరవు కాటకాలు ఎదురైతే దిగువనున్న భారత్ తాగు, సాగునీటికి కొరతను ఎదుర్కొనే ప్రమాదం ఉంది. భారత్ దిగువన ఉన్న బంగ్లాదేశ్ కూడా ఈ పరిస్థితిని ఎదుర్కోవాల్సి ఉంటుంది.
బ్రహ్మపుత్ర ప్రపంచంలోని అతిపెద్ద నదుల్లో ఒకటి. సముద్ర మట్టానికి దాదాపు అయిదువేల మీటర్ల ఎత్తులో ప్రవహిస్తుంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన నదిగా పేరుగాంచింది. కాలుష్యం తద్వారా భూతాపం రోజురోజుకి పెరిగిపోతున్న తరుణంలో 2060 నాటికి కర్బన ఉద్గారాలను కనిష్ట స్థాయికి తగ్గించుకోవాలని చైనా లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా జలవిద్యుత్ కేంద్రాల నిర్మాణంపై దృష్టిసారించింది. ప్రాజెక్టు నిర్మాణాన్ని టిబెట్ పర్యావరణవేత్తలు వ్యతిరేకిస్తున్నారు. బ్రహ్మపుత్ర నదిని టిబెట్ ప్రజలు ‘డోర్జీ పాగ్మో’ అనే దేవత శరీరంగా భావిస్తారు. అందుకే నదిని ప్రజలు పూజిస్తారు. టిబెట్ సంస్కృతీ సంప్రదాయాల్లో ఈ నదికి ప్రాధాన్యముంది.
హిమానీనదాల్లో జన్మించిన నదుల్లో బ్రహ్మపుత్ర ఒకటి. చైనాలోని ‘యాంగ్జీ’ నదిపై నిర్మించిన త్రీగోర్జెస్ డ్యామ్ ప్రపంచంలోని భారీ జలవిద్యుత్ ప్రాజెక్టుల్లో ఒకటిగా పేరుగాంచింది. ఇప్పుడు బ్రహ్మపుత్రపై నిర్మించనున్న భారీ జలవిద్యుత్ కేంద్రం త్రిగోర్జెస్ కంటే మూడురెట్లు అధికంగా విద్యుత్‌ను ఉత్పత్తి చేయనుంది. ఈ ప్రాజెక్టు వల్ల దాదాపు 14వేల మంది ప్రజలు నిరాశ్రయులు అవుతారని అంచనా. భారీ ప్రాజెక్టు నిర్మాణాల వల్ల ప్రకృతి సమతుల్యం దెబ్బతిని పర్యావరణ సమస్యలు ఏర్పడతాయని పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టిబెట్ ప్రాంత సహజ వనరులను కొల్లగొట్టి ఈ ప్రాంత అభివృద్ధిని విస్మరిస్తుందని ఇక్కడి ప్రజలు ఆరోపిస్తున్నారు. పరోక్షంగా ఇక్కడి వనరులను చైనా ప్రయోజనాలకు తాకట్టు పెడుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఏ రంగంలో అయినా భారీ ప్రాజెక్టులు పర్యావరణ సమస్యలు తెచ్చి పెడతాయని ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్న తరుణంలో బ్రహ్మపుత్రపై భారీ ప్రాజెక్టు నిర్మాణం వల్ల ఆశించిన ప్రయోజనాలు సమకూరవన్న అభిప్రాయాలు వివిధ వర్గాల నుంచి వ్యక్తమవు తున్నాయి. ఇక్కడి సహజ వనరుల ఆధారంగా వివిధ రంగాల్లో భారీ ప్రాజెక్టులను చేపడుతున్న చైనా ఈ ప్రాంత అభివృద్ధికి, మౌలిక సౌకర్యాల కల్పనకు పాటుపడటం లేదన్న విమర్శలు టిబెట్ ప్రజల నుంచి వినపడుతున్నాయి. టిబెట్‌పై తన హక్కులను మరింత పటిష్టం చేసుకునే చర్యల్లో భాగంగానే ఇలాంటి ప్రాజెక్టుల నిర్మాణానికి ముందుకు వస్తుందన్న విమర్శలను తోసిపుచ్చలేం. వాస్తవాధీన రేఖ వద్ద ఉద్రిక్తతలు సృష్టించడంలో, అరుణాచల్‌ప్రదేశ్‌ను భారత్‌లో అంతర్భాగంగా గుర్తించబోమని ప్రకటించడం, ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి, ప్రధాని పర్యటనలపై అభ్యంతరాలను వ్యక్తంచేయడం, నదీ జలాలపై ఏకపక్షంగా వ్యవహరించడం, అంతర్జాతీయ వేదికలపై భారత్‌ను ఒంటరి చేసేందుకు ప్రయత్నించడం ద్వారా చైనా అనేక సందర్భాల్లో తన సంకుచితబుద్ధిని చాటుకుంటోంది. ఐరాస భద్రతా మండలిలో భారత్ శాశ్వత సభ్యత్వానికి అమెరికా, రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్ మద్దతు ఇస్తుండగా అయిదో శాశ్వత సభ్యత్య దేశమైన చైనా అడ్డుపుల్ల వేస్తుండటం తెలిసిందే. శ్రీలంక, నేపాల్, పాకిస్తాన్ వంటి దేశాలను భారత్‌కు వ్యతిరేకంగా రెచ్చగొడుతుండటం తెలిసిందే. తాజాగా కరోనా మహమ్మారి వ్యాప్తికి కారకురాలైన చైనా దాని నియంత్రణకు మిత్ర దేశాలకు వ్యాక్సిన్ అందించలేకపోయింది. అదే సమయంలో భారత్ కరోనా టీకాను ఉత్పత్తి చేయడమే కాకుండా, అంతర్జాతీయంగా వివిధ దేశాలకు ఉచితంగా సరఫరా చేస్తోంది. దాయాది దేశమైన పాకిస్తాన్‌కి కూడా టీకాను అందించేందుకు భారత్ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. తాజాగా ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భద్రతకు సంబంధించి ‘క్వాడ్’ దేశాలు (చతుర్భుజ కూటమి) సమావేశం కావడం చైనాకు కంటగింపుగా మారింది. ఇందులో భారత్, జపాన్, అమెరికా, ఆస్ట్రేలియా సభ్యత్వం కలిగి ఉన్నాయి. తనను వ్యతిరేకంగా ఈ కూటమి జట్టు కట్టిందని బీజింగ్ అనుమానిస్తోంది. తాజా పరిణామాల నేపథ్యంలో భారత్ మరింత అప్రమత్తం కావాల్సి ఉంది. న్యూఢిల్లీ విదేశాంగ విధానం మరింత రాటుదేలాల్సి ఉంది. చైనా జలవిద్యుత్ ప్రాజెక్టులపై అభ్యంతరాలను పకడ్బందీగా వినిపించాలి. బీజింగ్ ఏకపక్ష పోకడలను బలంగా ఎండగట్టాలి!
వ్యాసకర్త : సీనియర్ జర్నలిస్ట్