ఫిబ్రవరి 12 దయానంద జయంతి సందర్భంగా

మూఢాచారాలు సనాతన ధర్మాన్ని కబళిస్తున్న తరుణంలో ఆ పతనం గురించి ఆలోచించాడా బాలుడు. సత్యాన్వేషణ కోసం యుక్తవయసు ఆరంభంలో ఇల్లు విడిచి వెళ్లాడు. ధర్మాన్నీ, వేదాలనూ అధ్యయనం చేశాడు. సనాతన ధర్మంలో, వేదాల్లో ఎలాంటి వివక్ష, అంటరాని తనం లేవని గ్రహించాడు. వేదాల వైపు మరలండి అని ఆ మహనీయుడు ఇచ్చిన పిలుపు ఒక తరాన్ని కదిలించింది. అందరికీ వేదాధ్యయనం, అంటరానితనం నిర్మూలన, వితంతు పునర్వివా హాలు, మళ్లీ సొంత మతంలోకి రావాలనుకున్న వారి కోసం శుద్ధి ఉద్యమాలు, గోవధ నిషేధం కోసం ఉద్యమించాడు. 1857 మొదటి స్వాతంత్య్ర సంగ్రామం వెనుక ఆయన స్ఫూర్తి ఉంది. ఆర్యసమాజాన్ని స్థాపించి కృణ్వంతో విశ్వమార్యం అనే పిలుపునిచ్చారు. ఆయనే మహర్షి దయానంద సరస్వతి.


శివరాత్రి పర్వదినాన ఉపవాసం ఉన్న భక్తులు రాత్రి శివాలయం చేరుకున్నారు. పూజలు, భజనలు చేస్తూ జాగారం చేస్తున్నారు. వీరిలో తండ్రితో కలిసి వచ్చిన పద్నాలుగేళ్ల మూల శంకర్‌ ‌కూడా ఉన్నాడు. అందరూ క్రమంగా నిద్రలోకి జారుకున్నారు. మూల శంకర్‌కు నిద్రపట్ట లేదు. గర్భాలయంలో జరిగిన ఘటన అతన్ని ఆశ్చర్యపరచింది. ఒక ఎలుక శివలింగంపై తిరుగుతూ అక్కడ ఉన్న నైవేద్యాన్ని తినేసింది. మూల శంకర్‌ ‌మదిలో ఒక ప్రశ్న ఉదయించింది. ‘రాక్షసులు, దుష్టులను సంహరించే త్రిశూలధారి అయిన పరమ శివుడు ఒక ఎలుకను ఎందుకు ఉపేక్షించాడు?’. వెంటనే తండ్రిని నిద్రలేపి ఇదే ప్రశ్న అడిగాడు. భగవంతుని గురించి అలా మాట్లాడకూడని కోపగించుకున్నాడా తండ్రి. అదే మూల శంకర్‌ను సత్యాన్వేషణకు ప్రేరేపించింది.

బాల్యంలోనే సత్యాన్వేషణ

ఫిబ్రవరి 12, 1824న (విక్రమనామ సంవత్సరం 1881 పాల్గుణ కృష్ణపంచమి) గుజరాత్‌ ‌కఠియావాడ్‌ ‌ప్రాంతంలోని ఠంకారా గ్రామంలో జన్మించాడా బాలుడు. తల్లిదండ్రులు శుద్ద చైతన్య, కర్సన్‌ ‌దాస్‌ ‌తివారీ ఆ చిన్నారికి మూలశంకర్‌ ‌తివారీ అనే పేరు పెట్టారు. ఎనిమిదో ఏట ఉపనయనం, గాయత్రీ మంత్ర దీక్ష జరిగింది. తన 18వ ఏట చెల్లెలు కలరాతో చనిపోవడం చూసిన తర్వాత చావును మనిషి ఎందుకు జయించలేక పోతున్నాడని ప్రశ్నించుకున్నాడు. అదే సమయంతో సమాజంలో ధర్మం పేరుతో జరుగుతున్న మోసాలకు కలత చెందాడు.

మూల శంకర్‌కు 22 ఏళ్లు వచ్చాయి. వివాహం చేసి కుటుంబ బాధ్యతలు అప్పగించాలని తండ్రి నిర్ణయం. కానీ సత్వాన్వేషణతో తపిస్తున్న ఆ యువకునికి ఐహిక సుఖ బంధాలు ఇష్టం లేదు. కాశీ వెళ్లి వ్యాకరణం, జ్యోతిషం, వైద్యం చదువు కోవాలని నిర్ణయించుకున్నాడు. 1846లో ఇంటి నుంచి పారిపోయాడు.

మూల శంకర్‌కు మార్గమధ్యలో కొందరు సాధువులు కలిస్తే తన అన్వేషణ గురించి చెప్పాడు. ఆధ్యాత్మిక చింతన కోసం ప్రయత్నిస్తున్న నీకు ఇవన్నీ ఎందుకంటూ అతని ఆభరణాలు దోచుకున్నారు. మూల శంకర్‌ అనేక ప్రాంతాలు తిరిగి సిద్దాపూర్‌ ‌చేరుకున్నాడు. శుద్ధ చైతన్య పేరుతో సన్యాస జీవితం ప్రారంభించాడు. ఒకరోజు మూల శంకరను వెతుకుతూ తండ్రి కర్సన్‌దాస్‌ అక్కడకు చేరుకున్నాడు. కుమారుని బలవంతంగా వెంట తీసుకొని ఇంటికి బయలు దేరాడు. మార్గ మధ్యలో ఒకచోట తండ్రి నిద్రపోతున్న సమయంలో మళ్లీ పారిపోయాడు మూల శంకర్‌.

‌విరజానంద దర్శనం

మూల శంకర్‌ ‌తన ప్రయాణంలో ఎంతో మంది యోగులు, మహర్షులను కలసి అనేక విద్యలు నేర్చుకున్నాడు. మధురలో మహర్షి విరజానంద సరస్వతిని కలిసిన తర్వాత జీవితం మలుపు తిరిగింది. విరజానంద దగ్గర వేదోప నిషత్తులను నేర్చకున్నాడు. మూల శంకరునిపై ప్రేమతో విరజానంద పెట్టిన పేరు దయానంద సరస్వతి. రుగ్మతలతో బాధపడుతున్న మన సమాజానికి వేద సందేశాన్ని అందించి చైతన్య పరచాలని ఆ గురువు సూచించాడు. అదే గురుదక్షిణ.

హిందూ సమాజ జాగరణ

బ్రిటిష్‌ ‌పాలనలోని భారతదేశంలో హిందువులు బానిసత్వానికి తోడుగా అనేక సామాజిక రుగ్మతలతో బాధపడుతున్నారు. ప్రపంచానికి జ్ఞానభిక్ష పెట్టిన దేశం, సనాతన ధర్మం ఇప్పుడు స్వీయ నాశనం దిశగా వెళ్లడాన్ని చూసి చలించిపోయాడు దయానందుడు. ఈ దురావస్థల నుంచి బయటకు తీసుకురావడం ఎలా అని ఆలోచించారు. ఈ ప్రయత్నంలో మార్చి1, 1867లో ‘పాఖండ ఖండిని’ పతాకాన్ని ఆవిష్కరించారు. దురాచారాలపై పోరాటం ప్రారంభించారు. ఈ సంస్కరణలు నాటి బ్రాహ్మణ పూజారులు, పండితులకు ఆందోళన కలిగించాయి. అయితే ప్రతి ఒక్కరితో ఎంతో ఒపికగా చర్చించి ఒప్పించే వారాయన. తన పర్యటనలో స్వామిజీ ఎంతోమంది శిష్యులను సమకూర్చుకున్నారు.

ఆర్యసమాజ్‌ ‌స్థాపన

హిందూ సమాజంలో అజ్ఞానం, మూఢ నమ్మకాలు, అంధ విశ్వాసాలతో కూడిన విగ్రహారాధన, జంతుబలులు, అంటరానితనం, సతీ సహగమనం, బాల్య వివాహాలు, వరకట్నం లాంటి దురాచారాలకు కారణం సనాతన ధర్మ మూలాలను మరవడమేనని చెప్పారు దయానంద. హైందవ సమాజాన్ని వేదమార్గం వైపు తీసుకెళ్లడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందు కోసం ప్రారంభమైంది ‘ఆర్యసమాజ్‌’.

10 ఏ‌ప్రిల్‌ 1875‌న, బొంబాయిలో దయానంద ‘ఆర్యసమాజ్‌’ ‌స్థాపించారు. ఆర్యులు అంటే శ్రేష్టులు. శ్రేష్టులతో కూడిన సమాజ నిర్మాణమే ఆర్యసమాజ్‌. ‌కృణ్వంతో విశ్వమార్యం అనేది ప్రధాన నినాదం. భగవంతుడు నిరాకారుడని చాటింది ఆర్యసమాజం. సర్వ వ్యాపకుడైన భగవంతునికి విగ్రహారాధన వద్దని చెప్పారు దయానంద. చతుర్వేదాలు అందరికీ ప్రామాణికాలని చెప్పి, ప్రతి ఒక్కరూ వీటిని అధ్యయనం చేయాలని పిలుపిచ్చారు. ఇందులో స్త్రీ, పురుష వివక్షత లేదు. అగ్ర, నిమ్న కులాల తేడా లేదు. అన్నివర్గాలు యజ్ఞోపవీత ధారణ, గాయత్రీ పఠనం, యజ్ఞం చేయవచ్చని ప్రోత్సహించారు. స్త్రీ, పురుష భేదం లేకుండా అన్ని కులాల వారు పౌరోహిత్యం చేయవచ్చని పిలుపునిచ్చిన దయానంద, దీన్ని ఆచరణలో చూపించి సంచలనం సృష్టించారు. వితంతు వివాహాలను స్వాగతించారు. కులాంతర వివాహాలకు ఆర్యసమాజ్‌ ‌మారు పేరుగా నిలిచింది. ఆర్యసమాజ్‌ ఆధ్వర్యంలో దేశంలో పలు చోట్ల పాఠశాలలు ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా బాలికా విద్యపై ప్రత్యేక దృష్టి పెట్టారు.

శుద్ధి ఉద్యమాలు

ఆర్యసమాజం చేపట్టిన కార్యక్రమాల్లో శుద్ధి ఉద్యమాలు చాలా ప్రాచుర్యం పొందాయి. ఆ రోజుల్లో మతం మారిన హిందువులను తిరిగి స్వధర్మంలోకి తీసుకు రావడం ఒక సంచలనం. వీరికి మంత్ర దీక్ష ఇచ్చి యజ్ఞం చేయించి తిరిగి హిందువులుగా మారినట్లు ప్రకటిస్తారు. శుద్ధి ఉద్యమం ఫలితంగా ఇస్లాం, క్రైస్తవ మతాల్లో చేరిన ఎంతోమంది హిందూ సోదరులు తిరిగి హిందువులుగా మారారు. ఒకసారి మతం మారిన హిందువు తిరిగి స్వధర్మంలోకి రాలేడు అనే భ్రమను ఆర్యసమాజ్‌ ‌దూరం చేసింది.

సత్యార్థ ప్రకాశ్‌

‌దయానంద తన బోధనలను ‘సత్యార్థ ప్రకాశ్‌’‌లో పొందుపరిచారు. 1874లో రాసిన ఈ గ్రంథంలో 13 భాగాలున్నాయి. ఉత్తమ, ఆదర్శమానవునిగా జీవించేందుకు అనుసరించాల్సిన విధానాలను, వైదిక విధులను సూచించారు. సనాతన వైదిక ధర్మం విశిష్టతను సత్యార్థ ప్రకాశంలో చాటి చెప్పారు దయానంద. ఇతర మతా గుణగణాలను విశ్లేషించారు. వాటిలోని దురాచారాలను ఎండగట్టారు. సత్యార్థ ప్రకాశ్‌ ‌కొన్ని వర్గాలను ఆందోళనకు గురి చేసింది. దీన్ని నిషేధించాలంటూ బ్రిటిష్‌ ‌ప్రభుత్వానికి ఎన్నో వినతులు వెళ్లాయి.

నిర్యాణం

సత్యమే ప్రమాణంగా ప్రచారం చేసిన దయానంద ఎంతోమందికి కంట్లో నలుసుగా మారారు. పూజలు, కర్మకాండల పేరిట జరిగే దోపిడీని అరికట్టేందుకు చేసిన ప్రయత్నాలతో స్వధర్మంలోనే కొన్ని వర్గాలు కక్షగట్టాయి. ఎన్నోసార్లు విషప్రయోగాలు జరిగినా హఠయోగం ద్వారా ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. 1883లో జోధ్‌పూర్‌ ‌మహారాజా ఆహ్వానం మేరకు అతిథిగా వెళ్లారు దయానంద. అక్కడి ప్రత్యర్థులు వంటవాడికి లంచం ఇచ్చారు. రాత్రి అతడు విషం కలిపి ఇచ్చిన పాలు తాగిన స్వామీజీ అస్వస్థతకు గురయ్యారు. వంటవాడు పశ్చాత్తాపపడి, తప్పును చెప్పుకున్నాడు. దయానందుడు అతడిని క్షమించడమే కాదు, విషయం తెలిస్తే ప్రమాదం అని చెప్పి కొంత డబ్బు ఇచ్చి వెంటనే ఎక్కడికైనా వెళ్లిపోమని పంపేశారు. మహారాజు వైద్యుని పిలిపించినా, అప్పటికే పరిస్థితి విషమించింది. అక్టోబర్‌ 30, 1883 (‌దీపావళి)న ఓంకార నాదంతో మహా సమాధి పొందారు స్వామీజీ.

దయానంద జీవించింది 59 ఏళ్లే. కానీ ఆయన చూపించిన మార్గం విప్లవంలా విస్తరించింది. తర్వాత పండిట్‌ ‌లేఖ్‌రామ్‌, ‌స్వామి శ్రద్ధానంద తదితర మహనీయులు ఆర్యసమాజ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారు. ప్రారంభంలో పంజాబ్‌, ‌హర్యానా, ఢిల్లీ, సౌరాష్ట్ర, ముంబై ప్రాంతాలకే పరిమితమైన ఆర్య సమాజ ఉద్యమం క్రమంగా దేశమంతటా విస్తరించింది. అమెరికా, కెనడా, బ్రిటన్‌, ఆ‌స్ట్రేలియా, గయానా, మెక్సికో, నెదర్లాండ్‌, ‌కెన్యా, టాంజానియా, దక్షిణాఫ్రికా, మారిషస్‌, ‌సింగపూర్‌, ‌హాంకాంగ్‌, ‌పాకిస్తాన్‌, ‌బర్మా తదితర దేశాలకు ఆర్యసమాజం వ్యాపించింది.

స్వాతంత్య్ర పోరాటంలో పాత్ర

దేశ దుస్థితికి బ్రిటిష్‌ ‌పాలన కూడా కారణమని గుర్తించారు దయానంద. సంపూర్ణ స్వరాజ్యం రావాలని చాటి చెప్పారు. 1857 ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామంలో తెరవెనుక పాత్రను పోషించారు. గోవధ నిషేధం కోసం బ్రిటిష్‌ ‌వారి మీద ఒత్తిడి తెచ్చారు. దయానంద ఆర్యవీర్‌ ‌దళ్‌ ‌ప్రారంభించి యోగ, ఆత్మరక్షణ శిక్షణ ఇప్పించారు. లాలా లజపత్‌రాయ్‌, ‌రాంప్రసాద్‌ ‌బిస్మిల్‌, ‌చంద్రశేఖర్‌ ఆజాద్‌, ‌వీర్‌ ‌సావర్కర్‌, ‌మేడం కామా, మదన్‌లాల్‌ ‌దింగ్రా, మహాదేవ్‌ ‌గోవింద్‌ ‌రానడే, స్వామి శ్రద్ధానంద, శ్యాంజీ కృష్ణవర్మ లాంటి స్వాతంత్య్ర సమరయోధులు ఆర్యసమాజ్‌తో స్ఫూర్తిని పొందినవారే.

హైదరాబాద్‌ ‌విమోచనలో

హైదరాబాద్‌ ‌సంస్థాన విముక్తిలో ఆర్యసమాజ్‌ ‌పాత్ర చాలా ఉంది. 1892లో స్వామి నిత్యానంద సరస్వతి హైదరాబాద్‌ ఆర్యసమాజ్‌ ‌శాఖను ప్రారంభించారు. 1901లో సికింద్రాబాద్‌ ‌శాఖ ప్రారంభమైంది. అప్పట్లో దీన్‌దార్‌ అం‌జుమన్‌ అనే సంస్థ నిజాం ప్రోద్భలంతో పెద్ద ఎత్తున మతాంతీ కరణలకు పాల్పడేది. ఆర్యసమాజ్‌ ‌వీటిని ధైర్యంగా ఎదుర్కొని శుద్ధి ఉద్యమాలను నిర్వహించింది. ఆర్యసమాజ్‌ ‌నేత పండిత రామచంద్ర దెహల్వీ అంజుమన్‌ ‌కార్యకలాపాలను ఎండగట్టారు. దీంతో నవాబు సంస్థానంలో ఆర్యసమాజ్‌ ‌కార్యక్రమాలపై నిఘా పెట్టారు. సత్యార్థ ప్రకాశ్‌ను నిషేధించారు.

హైదరాబాద్‌లో ఆర్యసమాజ్‌ ‌రాజకీయ, సాంఘిక ఉద్యమాలను పెద్ద ఎత్తున చేపట్టింది. స్వేచ్ఛ, మత, భాషాపరమైన హక్కుల కోసం ఆర్యప్రతనిధి సభ, ఆర్య రక్షా సమితిల ఆధ్వర్యంలో 8 సత్యాగ్రహాలు జరిగాయి. ఈ సత్యాగ్రహాల్లో 40 వేల మంది జైలుకు వెళ్లారు. ఆర్‌ఎస్‌ఎస్‌ ‌స్థాపకులు డాక్టర్‌ ‌హెడ్గేవార్‌ ‌సూచన మేరకు భయ్యాజీ దాణే, వామన హెడ్గేవార్‌ ‌తదితర స్వయంసేవకులు ఈ సత్యాగ్రహాల్లో పాల్గొన్నారు. స్వామి రామానందతీర్థ, పండిత నరేంద్ర, యశ్వంతరావు జోషి, కేశవరావ్‌ ‌కోరట్కర్‌, ‌వినాయకరావు విద్యాలంకార్‌, ‌వందే మాతరం రామచంద్రరావు, పండిత గోపదేవ శాస్త్రి తదితరులు ఎందరినో ఆర్యసమాజ్‌ అం‌దించింది. చివరి నిజాం పాలకుడు మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ ‌మీద బాంబు విసిరిన నారాయణరావు పవార్‌ ఆర్యసమాజీయుడే. హైదరాబాద్‌తో పాటు తెలంగాణ లోని పలు జిల్లాల్లో ఇప్పటికీ ఆర్యసమాజ్‌ ‌శాఖలు పని చేస్తున్నాయి.

– క్రాంతిదేవ్‌ ‌మిత్ర,  సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE