– ప్రవల్లిక

‘‘నా మాట ఇనుకో బిడ్డా… ఇప్పుడైతేనే బాగుంటది. నీ జీవితం సక్కగుంటది.’’ అంటూ భివారాబాయి గాంగేకి నచ్చచెప్పబోయింది తల్లి కమలాబాయి.

‘‘నాకు అప్పుడే పెళ్లి వద్దు. జట్టుగాళ్లతో ఆడుకోని.’’ అంటూ ఏడుస్తూ చెప్పింది పదమూడేళ్ల భివారాబాయి.

‘‘నీ దోస్తుగాళ్లకు కూడా సేసేస్తారు మనువు. ఇది మన ఆచారం. ఎక్కడకు పోతుండావని? నీ అత్తమ్మ కాడికేగా. నిన్ను బాగా సూసుకుంటది. నీ బావకీ నువ్వంటే సానా ఇట్టము. మామూ ఈ ఈడుకే మనువాడాము. సక్కగుండలా?! నా మాటిని వల్లక మూడుముళ్లేయించుకో.’’ అంటూ చెప్పింది కమలాబాయి.

మహారాష్ట్ర బీడ్‌ ‌జిల్లాలోని మరాట్వాడా గ్రామం అది. ఆ గ్రామంలో నాగరిక ప్రపంచానికి దూరంగా బ్రతుకుతున్న అమాయకపు వలస కూలీలు అధికం.

రెక్కాడితే గాని డొక్కాడని బ్రతుకులు వారివి. ఆ గ్రామంలో స్కూల్‌ ఉన్నా పిల్లలు చదువుకోవటానికి వెళ్లేది తక్కువ. కారణం ఆ గ్రామస్తులు ఆరు నెలలు షుగర్‌ ‌బెల్ట్‌గా పేరు పొందిన పశ్చిమ మహారాష్ట్రలో చెరుకు కోతకు వెళ్లిపోతారు. ఆరు నెలలు అక్కడే ఉంటారు. అందువల్ల పిల్లలకు చదువులు ఉండవు.

అలాంటి కుటుంబంలో పుట్టింది గాంగే.

చిన్నతనం నుండే గాంగే ఆలోచనలు ప్రత్యేకంగా ఉండేవి. చదువుకోవాలని మంకు పట్టు పడితే తప్పని పరిస్థితుల్లో దూరపు బంధువు అయిన రామవ్వ ఇంట్లో ఉంచి చదివించారు, ఆమె తల్లిదండ్రులు. కానీ ఇప్పుడు గాంగే ఎంత మొండి పట్టు పట్టినా వినకుండా పెద్దలు అందరూ కలిసి షిండేకి గాంగేకి పెళ్లి చేసేసారు.

చంపాపాండే భివారాబాయికి అత్తయినా అమ్మలా చూసుకొంది. ఆమె చల్లని నీడలో భివారా పుట్టింట్లో ఉన్నట్టే గడిపేసింది.

అక్టోబర్‌ ‌నెల వచ్చింది. అందరూ చెరుకు కోతలకు బయలుదేరారు.

‘‘భివారా గుడ్డలు సర్దుకో.. నిన్నూ నాతో పాటు తీసుకుపోతా’’ అన్నాడు షిండే.

‘‘అదెక్కడికి రాదు. ఇప్పటినుంచే ఆ కట్టాలు ఎందుకు? నువ్వు పోయి రా.’’ కొడుకును ఉద్దేశించి అన్నది చంపాపాండే.

‘‘కూర్సొని తింటానికి నా బాబు ఏమి పోడు భూములు ఇయ్యలేదు. నీకు తెల్దేటి మన ఇంటి ఎవ్వారం?’’ అన్నాడు కోపంగా షిండే.

‘‘నీ పిచ్చి గానీ ఆళ్లు దీనిని ఇప్పుడు పనిలో ఎట్టుకుంటారా ఏటి? ఆడకు తీసుకెళ్లి దాని బతుకు ఆగం సేయడం దేనికి? పిల్లలు పుట్టినాక ఎటూ పోక తప్పదు. మన అవుసరాలు అలాంటివి’’ అంది చంపాపాండే.

వారి సంభాషణల సారం పూర్తిగా అర్థం కాకపోయినా అత్త తన మంచి కోరుతుందన్న ఆలోచనతో ‘‘అత్త సెప్పినట్టు ఇందాం. నువ్వు వెళ్లు. అందాకా ఉన్నదాంతో సరి పుచ్చుకుందాం లే.’’ అని సర్ది చెప్పి భర్త షిండేను పంపించింది భివారాబాయి.

 *   *   *

భివారాబాయి ఇద్దరు పిల్లల తల్లి అయ్యింది.

ఓ రోజు…..

‘‘హాస్పిటల్‌కి వెళ్దాం పద’’ భివారాబాయిని ఉద్దేశించి అన్నాడు షిండే.

‘‘దేనికి, నా ఆరోగ్గెం బానే ఉంది గా!’’ ఆశ్చర్యంగా అడిగింది భివారా.

‘‘నీ గర్భసంచి తీసేయడానికి.’’ చెప్పింది చంపా.

‘‘దాన్నెందుకు తీసేయడం! నాకంతా బానే ఉందిగా అత్తా!’’ అంది భివారా.

‘‘అది ఉంటే ఆళ్లు పనిలో ఎట్టుకోరు.’’ అంది చంపాపాండే.

‘‘దానికి, పనికి సంబంధం ఏంటి?’’ అమాయకంగా అడిగింది భివారా.

‘‘అదంతా మన కర్మ. ఆడవాళ్లు బయట జేరినప్పుడు సెలవు ఇవ్వాల్సి వస్తుందని. ఆళ్లు ఆడాళ్లని పనిలో ఎట్టుకోరు. అది (గర్భసంచి) తీసేసామంటేనే ఎట్టుకుంటారు. రాత్రి, పగలు సాకిరీ సేయాలి. నలతగా ఉండి సెలవడిగితే జరిమానా కట్టాల.’’ అంటూ వాపోయింది చంపాపాండే.

 ‘‘ఇది అన్యాయం కదత్తా. ఎలా ఊరుకున్నారు అందరూ?’’ అంది భివారా.

‘‘మరి ఏటి సేయాల? పేదవాడి కోపం పెదవికి సేటు. మన కాడే పని దొరికేది. అది కూడా ఆరు నెలలే ఉంటది. ఆ పైకంతోనే సంవత్సరం అంతా గడుపుకోవాలి. పని కట్టమైనా కూటి కోసం పోక తప్పదు’’ అంది చంపాపాండే.

‘‘అలా గర్భసంచి తొలగించుకుంటే చాలా ప్రాబ్లమ్స్ ‌వస్తాయి అత్తా’’ అంది భివారా.

 ‘‘వచ్చినా తప్పదుగా! మనం ఒక్కళ్లమే కాదుగా.. మన బీడ్‌, ఉస్మానాబాద్‌, ‌సాంగ్లీ, షోలాపూర్‌ ‌జిల్లాలో ఉన్న ఆడోళ్లు అందరూ ఇలాగే సేసుకుంటున్నారు’’ అంది చంపాపాండే.

‘‘నేను తీయించుకోను. ఇక మీదట ఎవర్నీ తీయించుకోనివ్వను.’’ కచ్చితంగా చెప్పింది భివారా.

‘‘ఏటే ఆ మొండి మాటలు. నా మాట ఇనవే.’’ దీని మాటలకేం ప్రమాదం ముంచుకొస్తుందో అని భయపడుతూ అంది చంపాపాండే.

పోనీలే అమ్మ దాని మాట ఎందుకు కాదనాలి, సూద్దాం.. ఏటి జరుగుతుందో భార్యకు సపోర్టుగా నిలబడుతూ అన్నాడు షిండే.

సరే నీకు ఇట్టమైతే నాకేం? అలాగే కానీ అంది చంపాపాండే.

అత్త అనుమతి తీసుకొని భర్తతో కలిసి పశ్చిమ మహారాష్ట్ర వెళ్లింది భివారా.

అక్కడ కూలీలకి సరైన వసతులు లేకపోవడం, చెరుకు చేల దగ్గర గుడారాలు వేసుకోవటం, ఆడవారికి మరుగుదొడ్లు లేక ఇబ్బందులు పడటం, కొందరు ఆడవాళ్లను దూరంగా రాత్రి పనికి పురమాయించి బలాత్కరించడం, పైకి చెప్పుకోలేని వారి బాధలు గ్రహించింది భివారా.

గర్భసంచి తొలగించుకున్న వాళ్లకు వీపు, మెడ, మోకాలు భాగాల్లో నొప్పులు వస్తున్నాయని, నిరంతరం తల తిరుగుతూ ఉంటోందని, చిన్న దూరం కూడా నడవలేకపోతున్నారని వారి మాటల ద్వారా విని తెలుసుకుంది భివారా.

కోత పని పూర్తయ్యాక మహిళలు అందరినీ సమీకృతం చేసింది ఓరోజు.

‘‘మన సమస్యలను మనమే పరిష్కరించుకోవాలి. ఐకమత్యంతో ఉంటే దేనినైనా సాధించగలం. మనకి సరైన గృహాలు లేక ఈ పొలాల గట్లలో గుడారాలు వేసుకుని మరుగు లేక మనం పడే అవస్థలు మనకే తెలుసు. అంతేకాదు కొంతకాలం పోతే మన ఊరు, పేర్లు కూడా మరుగునపడి ‘గర్భసంచి లేని స్త్రీలు ఉన్న పల్లె’ అని పిలుస్తారు. ఈ ఉపద్రవాల నుంచి మనం బయటపడాలంటే మనకు ఒకటే మార్గం. మనమందరం కలిసికట్టుగా ఉండి ఉద్యమించడం. మన మగవాళ్లను కూడా పనికి పోనీయకుండా ఆపేయాలి. వారు చచ్చినట్టు మన కండిషన్లకు ఒప్పుకుంటారు.’’ అని ఉపన్యసించింది భివారా.

‘‘నువ్వు చెప్పింది రైటే కానీ, మనం పేదవాళ్లం కదా పని లేకపోతే తిండి ఎక్కడి నుంచి వస్తుంది?’’ అన్నారు కొందరు.

‘‘మన అందరిదీ ఒకటే సమస్య. ఆ నాలుగు జిల్లాల వాళ్లమే కదా ఇక్కడ పని చేసేది. అందరి ఇళ్లలోనూ ఆడవాళ్లు ఉన్నారు. వారికి ఇవే సమస్యలు ఉన్నాయి. ఇదే కొనసాగితే!? మన వంశాలు అంతరించిపోవా! ఆలోచించండి ఇది మన ఒక్కరిదే కాదు, మన తరతరాలకి సంక్రమించే సమస్య. దీనిని మనం పరిష్కరించాలి. కొంతకాలం ఇబ్బంది పడతాము, అయినా పరవాలేదు. సునామీ వచ్చి పంట కొట్టుకుపోతే…పని లేక ఆ సంవత్సరం గడుపుకోలా. అలాగే గడుపుకుందాం. ఇక్కడకు పనికి ఎవరిని రానీయొద్దు. వచ్చేవాళ్లని అడ్డుకుందాం. మన సమస్య చెప్పి మనకు సహకరించమని వేడుకుందాం. మనము రాము కాబట్టి వాళ్లే పిలిచి పని ఇస్తారు.’’ ధైర్యం చెప్పింది భివారా.

ఎంతో కాలంగా ఈ సమస్యను ఎదుర్కొంటున్న అందరికీ భివారా చెప్పింది నచ్చింది.

‘‘కూలీలకు క్వార్టర్స్ ఇవ్వాలని, గర్భసంచి తొలగించుకోవాలన్న షరతు తీసేయాలని, పిల్లల చదువులకు తగిన ఏర్పాట్లు చేయాలని’’ డిమాండ్‌ ‌చేశారు. పనులకు వెళ్లకుండా అందరూ బైఠాయించారు. కులమతాలకతీతంగా ఉద్యమించారు. వీరి వెనుక మహిళా సంఘాల వాళ్లు కూడా తోడుగా నిలబడ్డారు.

ముందు భూస్వాములు అంగీకరించలేదు. కడుపు కాలితే వాళ్లే వస్తారనుకున్నారు. కానీ ఈ ఉద్యమం ఊపందుకుని, ఎన్నో ప్రజా సంఘాలు, ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోవడంతో వారి షరతులకు అంగీకరించి పనిలో పెట్టుకున్నారు భూస్వాములు.

 మహిళా సమస్యలు తీర్చి, ఫ్యూడల్‌ ‌వ్యవస్థను రూపు మాపిన భివారాబాయి గాంగే పేరు మార్మోగిపోయింది.

ఏ సమస్యనైనా చూసి భయపడకుండా ఎదిరించి పోరాడాలి. అప్పుడే తగిన ఫలితం పొంద గలుగుతామన్న గురువుల మాటలు గుర్తు తెచ్చుకొని ఆనందంతో ఇంటిదారి పట్టింది భివారాబాయి గాంగే.

About Author

By editor

Twitter
YOUTUBE