మీరెన్ని చెప్పండి అయోధ్యలో కడుతున్నారే, అది మసీదు అనిపించుకోదు అని తేల్చేశారు అఖిల భారత మజ్లిస్‌ ఇత్తేహాదుల్‌ ‌ముస్లిమీన్‌ అధ్యక్షుడు జనాబ్‌ అసదుద్దీన్‌ ఒవైసీ. పైగా అక్కడ కడుతున్న మసీదులో నమాజ్‌లు వంటివి చేస్తే హరామ్‌, అనగా ముస్లిం సంప్రదాయానికి అపచారం. అని చాలా ముందుగానే ఆయన హెచ్చరించారు. తరువాత గుర్తు చేయలేదని నన్నేమీ అనకండి అన్నట్టు.  గణతంత్ర దినోత్సవం జరిగిన కొన్ని గంటలలోనే ఒవైసీ కర్ణాటకలోని బీదర్‌లో జరిగిన ఒక సభలో ఈ విషయాలు చాలా ఆవేశంగా చెప్పారు. అలాగే, అయోధ్య దగ్గర నిర్మించే మసీదు కోసం చందాలు ఇవ్వండి అంటూ ఎవరైనా వచ్చినా  విరాళాలు గట్రా ఏమీ ఇవ్వకండి! అది కూడా ముస్లిం సంప్రదాయాలకు పరమ విరుద్ధం అని కూడా తెగేసి చెప్పారు.


అంతిమ తీర్పు అంటూ నిరుడు సుప్రీంకోర్టు ఇచ్చిన అయోధ్య తీర్పులో ఒవైసీకి ఒక్క అక్షరం కూడా నచ్చలేదు. ఆ విషయం ఆయన దాచుకోలేదు కూడా. ఎంతమంది జర్నలిస్టులు అడిగితే అంతమందికీ, ఏ వేదిక కుదిరితే ఆ వేదిక మీద ఆయన ఆ విషయమై కుండలు బద్దలుకొడుతూనే ఉన్నారు. అయోధ్యలో కూలినది మసీదే, ఇది నిజం ఇది నిజం ఇది నిజం అని ముందు తరాలకు కూడా చెబుతామని ఆయన ప్రతిన పూనారు. ఇక్కడ కొంచెం స్పష్టత ఇవ్వవలసిన ఆవశ్యకత కనపడుతోంది. ఒవైసీ మాటలోని కూల్చివేత డిసెంబర్‌ 6, 1992‌లో జరిగిన కూల్చివేత అని వేరే చెప్పక్కరలేదు. ఎందుకంటే, 1528లో బాబర్‌ ‌సేనాని మీర్‌ ‌బకీ భక్తి ప్రపత్తులతో సాగించిన కూల్చివేత గురించి ఆయన చెప్పనే చెప్పరు. ఒకసారి ఎక్కడైనా మసీదు అంటూ నిర్మిస్తే, అది ఎప్పటికీ అల్లాకు చెందిన భూమే అవుతుందని కూడా ఒవైసీ తేల్చారు. సుప్రీంకోర్టు తీర్పు స్ఫూర్తిని ఒవైసీ ఖండ ఖండాలుగా నరుకుతున్నంత మాత్రాన ఆయనకి రాజ్యాంగం మీద గౌరవం, భక్తి, నమ్మకం వగైరా వగైరా  లేవని మాత్రం అనుకోవద్దు. ఈ మధ్య ఆయన నోరు తెరిస్తే చాలు అంబేడ్కర్‌ అన్నమాటే వస్తోంది. సీఏఏ వ్యతిరేక ఆందోళనలో మువ్వన్నెల పతాకాన్ని భుజానికి వెల్డింగ్‌ ‌చేయించేసుకున్నారు ఒవైసీ. కానీ జీహెచ్‌ఎం‌సీ ఎన్నికలలో మజ్లిస్‌ ‌వాళ్ల చేతిలో, ప్రచారంలో ఆ జెండా కనిపిస్తే ఒట్టు. దీని వెనుక దేవ రహస్యం ఏమిటో తెలియదు.

అయోధ్య తీర్పులోనే మసీదు కట్టుకోవడానికి ఐదెకరాలు కూడా ఇవ్వాలని అత్యున్నత న్యాయస్థానం చెప్పింది. ఆ మేరకే భూమి (అయోధ్య దగ్గర ధన్నాపూర్‌లో) ఇచ్చారు. ఇప్పుడు దాని మీదే ఒవైసీ బాధంతా. మసీదు నిర్మాణానికి అంటూ విరాళాలు సేకరిస్తున్నవారికీ, అక్కడ ఐదెకరాలు తీసుకుని మసీదు కట్టాలనుకుంటున్నవారికీ తెలుసా? అఖిల భారత ముస్లిం పర్సనల్‌ ‌లా బోర్డు నియమాల ప్రకారం అలాంటి చోట మసీదు కట్టకూడదు. కట్టినా అందులో నమాజు చేయరాదు. మసీదు కూల్చిన చోట మళ్లీ (అయోధ్యలో అన్నమాట) మసీదు కట్టడమే తప్పు, నేను మత పెద్దలను సంప్రదించే చెబుతున్నాను అంటున్నారు ఒవైసీ. వారిని సంప్రదించానని ఒవైసీ చెప్పడం ఆయన వినయ విధేయతలకి నిలువెత్తు నిదర్శనం తప్పితే, ఇస్లాంలో ఆయనకి తెలియని విషయం అంటూ ఏదీ లేకపోవచ్చు.

ఆ మసీదు నిర్మాణంలో తన సహాయ నిరాకరణ ప్రబోధం ఓపిగ్గా విన్నందుకు ఉచితం అన్నట్టు చాలా అదనపు జ్ఞానాన్ని దయచేశారు ఒవైసీ. అసలు అంబేడ్కర్‌ ఏమన్నారు? రాజకీయాలలో వ్యక్తిపూజ వద్దన్నారు. అది ఉత్పాతానికి దారితీస్తుందని నెత్తీనోరు కొట్టుకున్నారు పాపం! కానీ ఏం జరుగుతోంది ఇవాళ? ఎవరిని చూడండి! ప్రతివాడూ మోదీ భక్తుడైపోయె అని కూడా వాపోయారు. నిజమే, ప్రజాస్వామ్య సిద్ధాంతం మీద, దాని ప్రాతిపదికగా నడిచే రాజకీయాల మీద, వీటన్నిటికి ఇరుసు వంటి రాజ్యాంగం మీద ఒవైసీకి ఉన్న భక్తితత్పరత ఎవరికి తెలియనిది? అంతేకాదు, ఒక కొత్త/పాత సమీకరణను కూడా ఆయన పునర్‌ ‌నిర్మించే మహత్తర యత్నంలో కూడా ఉన్నారు. ఎక్కడైనా సరే, ముస్లింలు దళితులతో పోటీ పడవద్దు. వాళ్లని మన వెంట తీసుకువెళ్లాలని చెబుతున్నారు.

ఒవైసీ కొత్త సూత్రాలతో పాపం అయోధ్యలో మసీదు నిర్మాణం పనులు చూస్తున్న ట్రస్ట్- ఇం‌డో ఇస్లామిక్‌ ‌కల్చరల్‌ ‌ఫౌండేషన్‌ ‌సభ్యులకి మూర్ఛ వచ్చినంత పనైంది. కానీ వెంటనే తేరుకుని కాస్త గట్టిగానే సమాధానం ఇచ్చారు. ఒవైసీ ఓ ప్రాంతీయ నాయకుడు. హైదరాబాద్‌ ‌రాజకీయం ఆయనది. ఆయన మాటలు ఆ రాజకీయ ఎజెండాలోవే తప్పితే మరొకటి కావు అని ఫౌండేషన్‌ ‌కార్యదర్శి అతర్‌ ‌హుసేన్‌ ‌కొట్టిపారేశారు. అసలు ఈ భూగోళం మీద ఏ ఖండం కూడా ముస్లిం సంప్రదాయాలకు విరుద్ధం కానేకాదు. అక్కడ అల్లాకి పూజలు చేసినా తప్పేమీ కాదు అని ఘాటుగా స్పందించారు.

హుసేన్‌ ఇం‌కా చాలా విలువైన మాటలు చెప్పారు. కానీ అవి ఒవైసీగారికి బొత్తిగా నచ్చవు. అది వేరే సంగతి. ఒవైసీకి జన్మనిచ్చిన హైదరాబాద్‌ ‌ప్రాంతానికి 1857 నాటి పోరాటంలోని విషాదం పెద్దగా తెలియదు. బ్రిటిష్‌ ‌వాళ్లకి వ్యతిరేకంగా జరిగిన ఆ యుద్ధంలో ఒవైసీ పూర్వీకులు పాల్గొనే అవకాశం లేదు. మేమంతా అయోధ్య ప్రాంతం వాళ్లం. ఇది ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామానికి ఉయ్యాల వంటిది. అందుకే ఫౌండేషన్‌ ‌నిర్మిస్తున్న ఆ కేంద్రానికి ఆ పోరాట వీరుల పేర్లు పెడుతున్నాం. అహమ్మదుల్లా షా అనే ఆయన ఫైజాబాద్‌ను కంపెనీ వాళ్ల నుంచి విముక్తం చేశారు తెలుసా? అని ప్రశ్నిస్తున్నారు. అలాంటి అహమ్మదుల్లా షా పేరు ఈ సముదాయానికి పెడితే అది ముస్లిం వ్యతిరేకమా? అని అడుగుతున్నారు హుసేన్‌.

అసలు అల్లా మీద భక్తి ప్రపత్తులతో ఎక్కడ శిరసు వంచి ప్రార్ధించినా అది అపవిత్రం అనిపించుకోదు. వేలాది మందికి వైద్యసేవలు అందించే స్థలం ముస్లిం వ్యతిరేకం కానేకాదు. ఆకలిగొన్న రెండు వేల మందికి నిత్యం అన్నం పెట్టే ఆ కేంద్రం మత వ్యతిరేకం ఎందుకవుతుందో బోధపడడం లేదని కూడా చెప్పారాయన. ఒక గ్రంథాలయం, మ్యూజియం ఉంటాయి. అందులో ఈ దేశం కోసం ముస్లింలు చేసిన త్యాగాలను తెలియచెప్పే విషయాలు ఉంటాయి, ఇది తప్పా అంటున్నారు హుసేన్‌. అసలు మానవాళికి సేవ చేయాలని భావించడం మత వ్యతిరేకమెలాగవుతుందో మరి! అని కూడా ప్రశ్నించారాయన.

నిజం చెప్పొద్దూ!  ఊరందరిదీ ఒకదారి ఉలిపి కట్టెది ఒక దారి అన్నట్టు,  ఒవైసీ రూటే వేరు. అయినా కాస్త ఓపిగ్గా ఆయన అంతరంగాన్ని పిసరంత అర్ధం చేసుకున్నా అసలు ఉద్దేశం తెలుస్తుంది. అసదుద్దీన్‌ అనుంగు సోదరుడు అక్బరుద్దీన్‌ ‌మాటలు ఆయన తలకి బాగా ఎక్కినట్టున్నాయి. మీర్‌ ‌బకీ కూడా ఆయనను ఆవహించినట్టే ఉన్నాడు. ఇతర మతాల వారి ప్రార్ధనా మందిరాలను కూల్చి దాని మీద ప్రార్ధనా మందిరం కడితే అది పరమ పవిత్రమూ, నిజమైన మతమూ అవుతుందని, అలాంటి ప్రార్ధనా మందిరంలో పూజలు గట్రా చేసుకుంటే సర్వశ్రేష్టమని అసద్‌గారి గట్టి నమ్మకంలా ఉంది. ముస్లింలంతా ఏకమైతే డెబ్బయ్‌ ఏళ్ల నుంచి ఈ దేశాన్ని ఏలుతున్నవారిని కరివేపాకులా పక్కన పెట్టెయ్యగలం సుమా అని కూడా ఆయన వాక్రుచ్చారు. అంటే ప్రధానంగా కాంగ్రెస్‌ ‌వారిని. దురదృష్టవశాత్తు సీట్ల విషయంలో గల్లీ పార్టీ మజ్లిస్‌ ‌కంటే ఆ జాతీయ పార్టీ దిగజారి కుమిలిపోతోంది. కాబట్టి తక్షణ గురి బీజేపీయే. ఈ రెండు పార్టీలు కాకుండా, కేంద్రంలో ఏక్‌దిన్‌ ‌కా సుల్తాన్‌ ‌వైభవం అందుకున్న పార్టీలన్నీ ఇప్పుడు కీర్తిశేషులయ్యాయి. కాంగ్రెస్‌ ‌మీద మజ్లిస్‌కు కోపం ఉండడం సహజం. తమ ఎదుగుదలను మధ్యలోనే వదిలిపెట్టిపోయిందా పార్టీ. ఆ విధంగా చూస్తే మైనారిటీ సోదరులకీ, సెక్యులరిజానికీ కాంగ్రెస్‌ ‌చేసిన ద్రోహం ఎంతటిది? అందుకే ఒవైసీకి ఆ పార్టీ అంటే మంట, ప్రస్తుతానికి. బీజేపీ చెప్పే సెక్యులరిజం అంటే ఒవైసీకి తేళ్లూ, జెర్రులూ పాకినట్టు ఉంటుంది. కానీ జాతీయ స్థాయిలో మజ్లిస్‌ ఎదగడానికి ప్రస్తుతానికైనా మరొక పార్టీ అవసరం. ఎలాగూ తెరాసలో కేటీఆర్‌కు పట్టాభిషేకం ఖాయం అంటూ వార్తలు వెల్లువెత్తుతున్నాయి. కేసీఆర్‌ ‌ఖాళీగా ఉండొచ్చు. కాబట్టి ఆయన సాయం తీసుకుంటే, జాతీయ స్థాయిలో మంచి పార్టీగా మజ్లిస్‌ ఎదిగే అవకాశం కనిపిస్తున్నాయి. బీజేపీ విషయంలో ఎక్కడ ఎగరాలో కాదు, ఎక్కడ తలొగ్గాలో కూడా ఆయనకి బాగా తెలుసు.

About Author

By editor

Twitter
YOUTUBE