ఈమధ్య  దేవాలయాలలో అర్చామూర్తులుగా కొలువైన దైవాల మీద దాడులు, అపచారాలు పెరిగిపోయినాయి. దీనితో స్వధర్మాన్ని ప్రేమించే వారు, దేవాలయాల పట్ల దేవుళ్ల పట్ల భక్తి భావం కలిగిన అశేష ప్రజానీకం, ఆలయాల ప్రాధాన్యం తెలిసినవారు తీవ్ర మనస్తాపానికి గురవు తున్నారు. భగవంతుడిని అర్చామూర్తిగా కనులారా చూసి మనసారా సేవించి తరిస్తున్న అశేష భక్తకోటి తల్లడిల్లిపోతున్నది. ఇకపై ఈ అనాగరిక చర్యల• జరగకుండా చూస్తామని గొంతెత్తి  ప్రకటించాల్సిన వ్యవస్ధలు స్వచ్ఛందంగా మౌనం దాల్చడం పెద్ద విషాదం. పాలకులు, ఆలయాలను కాపాడాల్సినవారు కావాలని ఉపేక్షించడం, వాళ్లే ఒక రకమైన నిస్సహాయ స్థితిలో మాట్లాడటం, ప్రేక్షకపాత్ర వహించడం ఖండించదగ్గ అంశం.

మీడియాలో ‘ఈ దారుణాలు’ (విగ్రహాల విధ్వంసం) అని రాస్తున్నారు. దానికి తగినట్టుగానే నాయకులు మాట్లాడుతున్నప్పుడు విగ్రహాల విధ్వంసం అనే అంటున్నారు. ఈ మాటలు ఎలా ఉన్నాయంటే- అవి విగ్రహాలు, విగ్రహం పోతే కొత్తది చెక్కించవచ్చు. చెయ్యి విరిగితే చెయ్యి, కాలు విరిగితే కాలు చెయ్యిం చొవచ్చు. శంఖుచక్రాలు ధ్వంసమైతే తిరిగి చేయించు కోచ్చు. రథం దగ్ధమైతే మరో రథం, బంగారురథమే చేయిస్తాం అన్నట్టు మాట్లాడుతున్నారు. మీడియాలో, రాజకీయవర్గాల్లో, ఆధ్యాత్మికవేత్తల మాటలతో సహా ఈ మొత్తం చర్చలో కీలక అంశం ప్రాధాన్యం కోల్పోయింది.

ఇక్కడే ఒక ప్రశ్న. సనాతన ధర్మం మేరకు దేవాల యాలలో చేస్తున్న పూజలు, పాటించే ఆచారాలు కేవలం విగ్రహాల కోసమేనా? అవి విగ్రహాలన్న భావనతోనా?

ఈ ప్రశ్నకి సహేతుకమైన సమాధానం కావాలంటే ముందు వేయేళ్ల నాటి భారత చరిత్రలోకి వెళ్లాలి. ఈ దేశంలోనే ఎన్నో పంథాలకు చెందిన తాత్త్వికులు, ధార్మికులు, పండితులు పుట్టారు. ఈ దేశంలో జనించిన ఆలోచనలని పలు దేశాలకు పరిచయం చేశారు. ఈ దేశం మీద దండెత్తి వచ్చిన శకులు, పహ్లావులు, పార్థియన్లు, గ్రీకులు, యవనులు మొదలైన వారంతా ఈ దేశ సంస్కృతితో మమేకమై, సాంస్కృతిక మూలాల్లో భాగమైపోయారు. తరువాత వచ్చిన రెండు విదేశీ ధర్మాల వాళ్లు మాత్రం ఒకే ప్రామాణిక గ్రంథం, గుణ విశేషాలున్న ఒకే దైవం అని చెప్తున్నారు. వీరు హిందువుల గురించి మాట్లాడుతున్నప్పుడు విగ్రహారాధన గురించి ముఖ్యంగా ప్రస్తావిస్తుంటారు. అది కూడా నిందిస్తూ. ‘విగ్రహారాధన భగవంతుడిని చేరుకోవడానికి, అడ్డువస్తుంది. మనని పక్కదోవ పట్టిస్తుంది. ఇది భ్రమతో కూడినది’ అంటారు. అక్కడితో ఆగకుండా హిందూదేవుళ్లను ‘సైతాను రూపాలు’ అని దూషిస్తుంటారు.

విగ్రహారాధన మహాపరాధం, పాపం వంటి అభిప్రాయం బలపడేట్లు చేసినవారు ఈ విధర్మీయులే. ఈ దేశ తాత్త్వికచింతన ఎంత బలమైందో, హేతుబద్ద మైనదో ఈ అంగుష్టమాత్రులకు తెలియదు. కానీ ఆ మతాల్లోనే కొన్ని శాఖలవారు కొన్ని ప్రతీకలు పెట్టుకుని పూజలు చేస్తారు. అందుకు పెద్ద పెద్ద కట్టడాలను కట్టుకుంటారు. వాటిని సందర్శించడానికి లక్షలాదిమంది వస్తుంటారు. వాళ్లకు అది విగ్రహా రాధన అనిపించదు. హిందూధర్మంలోనిదే విగ్రహా రాధన. ఇంగ్లీష్‌ ‌వాళ్లు భారతదేశాన్ని పరిపాలించి నప్పుడు, వదిలివెళ్లాక కూడా రెండు పదాలు ఱ•శీశ్రీ••తీ•, ఱ•శీశ్రీ••వతీ-రుద్దారు. ఐడల్‌ ‌వర్షిప్‌ ‌చేసే వాడు ఱ•శీశ్రీ••వతీ. విగ్రహారాధనను ఱ•శీశ్రీ••తీ• అంటారు. ఈ రెండూ విశ్వాసులు చెయ్యకూడదని సిద్ధాంతం తెచ్చారు. ఇందులో విగ్రహం, విగ్రహా రాధన అన్న మాటలు వీలైన మేరకు చొప్పించడం వలన మనం మన మూలాల్ని మర్చిపోయాం. ఇన్నేళ్ల తరువాత కూడా మనం గుడిలో మూర్తిని విగ్రహం అని మాత్రమే సంబోధించడం తప్పు అని నేను భావిస్తున్నాను.

బానిస భారతదేశాన్ని తయారుచేసేందుకు కలలుగని విద్యా, కర్మాగారాలు ఆరంభించిన మెకాలే తండ్రికి రాసిన లేఖలో, ‘మన విద్యాప్రణాళిక అమలు పరచడం జరిగితే, ముప్పై సంవత్సరాలలో బెంగాల్‌లో విగ్రహారాధకుడు అనేవాడు ఉండడు. మతాంతరీకరణకు పూనుకోకుండానే ఈ ప్రయోజనం నెరవేరుతుంద’ని పేర్కొన్నాడు. కలకత్తా జర్నల్‌ ‌ప్రచురించిన ఒక వ్యాసంలో ఇలా ఉంది, ‘సమాజాన్ని కలుషితం చేసి హేయమైన విగ్రహారాధన ఆచారాన్ని పాటిస్తున్నవారు ఈ ఆధునిక విద్య ద్వారా నిజమైన భగవంతుడ్ని గురించీ, ఆయన తన దూతగా పంపిన ఏసుక్రీస్తు గురించీ జ్ఞానప్రాప్తి పొందుతారు.’

విగ్రహారాధన గురించి మన ధర్మం ఏం చెబుతు న్నది? మన ధర్మంలోని ప్రతి అంశంలో మౌలికమైన తాత్త్వికచింతన కన్పిస్తోంది. ఈ సృష్టిలోనివన్నీ పరమాత్మ దివ్య స్వరూపాలుగానే మనకు గోచరి స్తాయి. చిన్నప్పుడు పిల్లవాడు ఒక కాగితాన్ని తొక్కితే, దాన్ని సరస్వతి రూపం అని కళ్లకు అద్దుకోవడం కనిపిస్తుంది. నదీమతల్లి అంటూ నమస్కరించి నదిలోకి దిగుతాం, కొండలు ఎక్కేటప్పుడు కొండకు మొక్కి వెళ్తాం. ఉదయం నిద్ర లేచినప్పుడు నన్ను క్షమించు భూమితల్లి, నీ మీద పాదం మోపుతున్నాం అని నమస్కరిస్తాం. అంటే మట్టిలో, నీటిలో, చెట్లల్లో, పుట్లల్లో ఈ అనంత ప్రకృతిలో ప్రతీచోట భగవంతుడి చైతన్య శక్తిని చూస్తుంటాం.ఈ చైతన్య శక్తిని గురించి వివరించేదే మన దైవభావన.

అలాంటి దైవ భావనలో మూడు తిరుగులేని మౌలికసూత్రాలు ఉంటాయి. మొదటిది- మన దైవం ఎక్కడో కొండల్లో, గుట్టల్లో, అంతరిక్షంలో కూర్చుని మనం చేస్తున్న పాపాలు, పుణ్యాలు లెక్కపెడుతూ కూర్చునే దైవం కాదు. మన దైవం ఆఖరిరోజున తీర్పు చెప్పేది కాదు. మన దైవం మనతో కలసి నడిచే బంధువు, సోదరుడు, ఆప్తుడు, మార్గదర్శి. రెండవది- భగవంతుడు సర్వాంతర్యామి అని చెప్పారు. ఇందుగలడందులేడని సందేహము వలదు అన్న ప్రహ్లాదుడు, భగవాన్‌ ‌వ్యాసమహర్షి లాంటి వారు అన్నింటిలోనూ భగవంతుడు ఉన్నాడని చెప్పారు. మూడవది-ఆత్మీయుడైన చెలికానిగా ఉంటానని భగవంతుడే చెప్పాడు. అందుకే గీతలో కృష్ణ పరమాత్మ ‘ప్రతి ఒక్కరి మనసులో ఉన్నది నేను. ప్రతి జీవుడిని యంత్రం తిప్పినట్టు తిప్పుతున్నాను. ఈ రకంగా లోకం అంతా కూడా నేను నడుపుతున్నాను’ అన్నాడు.

ఇన్ని రూపాల్లో ఉన్న భగవంతుడి అనంత వైభవ గుణాలని చెప్పడానికి రెండు పద్ధతులున్నాయి. ఎవరికి వాళ్లు దీనిని గ్రహించడం ఆరాధించడం ఒక పద్ధతి అయితే: సామాజిక ధర్మంలో, భక్తి తాత్పర్యంతో అందరూ కలిసి సహానుభూతి చెందుతూ, అందరూ కలసి మెలిసి జీవించడం అనేది మనకు ఉన్నటువంటి ఆదర్శం. ఈ ఆదర్శం పునాదిగా ఏర్పడిన వ్యవస్థే గుడి. గుడిలో మూర్తిని మనం అర్చామూర్తి అని పిలుస్తాం. మూర్తులు ఐదు రకాలు. గుడిలో ఆరాధించే దైవం సమస్త జీవకళలతో నిండి ఉంటాడని మనం భావిస్తాం. మనం గుడికి వెళ్తున్నప్పుడు భదాద్రిలో రాముడిని చూడటానికి వెళ్తున్నాం, యాదగిరిలో నరసింహస్వామిని చూడటానికి వెళ్తున్నాం, ఏడుకొండలవాడిని చూడటానికి వెళ్తున్నాం అంటాం. అంతేకానీ ఏడుకొండలవాడి విగ్రహాన్ని చూడటానికి వెళ్తున్నామని చెప్పం. అంటే అక్కడ కనపడుతున్నది శిల కాదు, శిల్పం కాదు, సాక్షాత్తు దైవం… దైవమే.

ఆధునిక విద్యావిధానంలో ఈ భావనని మనం ఎక్కడో పోగొట్టుకున్నాం. ఎందుకంటే మన సంస్కృతి మీద దాడి ప్రత్యక్షంగా, పరోక్షంగా జరుగుతూనే ఉంది. మన భజనరూపాలు, కళారూపాలు, భాగవతాలు అన్నీ అంతరించిపోవడం వలన జనంలో ఆధ్యాత్మికత జ్ఞానం తగ్గుతూ వస్తోంది. అందుకే మన ఆరాధనా పద్ధతులలోని ఔన్నత్యాన్ని గుర్తించే స్థితిలో ఇప్పుడు మనం లేం. ఈ రోజున మనం గొంతెత్తి చెప్పాల్సిన అవసరం ఉంది. మేము కొలిచే దైవం, తలిచే దైవం మమ్మల్ని తరింప చేసే దైవం, మా పరమాత్మ, మా పరంధాముడు, మమ్మల్ని అనుగ్రహించి, మా గుడిలో అర్చామూర్తిగా వచ్చి నిలిచాడు. అనుగ్రహించి అర్చామూర్తిగా మా ఊర్లో ఉంటాడు, ఈ రోజున మీరు తలపెట్టిన ధ్వంసం మా దైవం పట్ల మీరు చేస్తున్న అపచారం, నేరం, ఘోరం అని కుండ బద్దలుకొట్టినట్టు చెప్పవలసిన అవసరం ఉన్నది. ఇది విగ్రహారాధనకు సంబంధించినది కాదు. కాలు తీస్తే కాలు పెడతాం, చెయ్యి తీస్తే చెయ్యి పెడతాం అనడం కాదు, ఇది మా ధర్మం మీద, మా రామచంద్రుడి మీద, మా కాశీవిశ్వేశ్వరుడి మీద జరిగిన దాడి అని నిక్కచ్చిగా చెప్పాలి.

 చాలా దేశాల్లో విగ్రహాలు అంటే ఏ అర్ధంలో వాడతారంటే, శిల్పం, కొన్ని చోట్ల సౌందర్య ఆకృతులు అనే అర్ధంలో వాడతారు. మన దేశంలో అలా చూడం. కోవెలలో కొలువై ఉన్నది- సాక్షాత్తు శ్రీ మహా విష్ణువు, పరమేశ్వరుడు, రామచంద్రమూర్తి, అమ్మవారు. ఇప్పటికీ గొంతు విప్పకపోతే తప్పు. చాలామంది ఆధ్యాత్మికవేత్తలు కూడా ముఖ్యమైన రెండు అంశాలను గట్టిగా ప్రస్తావించడం లేదు. మూల మూర్తులు కేవలం శిల్పాలు కాదు. ఆలయం నిర్వహణ విషయాలన్నింటిని ఆగమశాస్త్రం నిర్దేశిస్తుంది. ఆ శాస్త్రం రెండు భాగాలుగా ఉంటుంది. ఒకటి, దేవాలయ నిర్మాణం గురించి చెప్తుంది. రెండు, దేవాలయంలో దేవుడు ఎలా కొలువవుతాడో చెప్తుంది. ఎలా కొలువవుతాడు అని చెప్పేదానిని ప్రతిష్టా విధానం అంటారు. ఈ ప్రతిష్టా విధానంలో 18 రకాలైన క్రియలని పాటించాలి. ఇవే అష్టాదశ పక్రియలు. మృత్‌ ‌సంగ్రహణం (దగ్గరలో ఉన్న చెరువుకి వెళ్లి పుట్టమట్టి తీసుకురావడం) మొదలు అంకురార్పణ దగ్గర నుంచి, గ్రామ ప్రదక్షిణం, వాస్తుపూజ, జలాధి వాసం వంటి 18 రకాల అంశాలను ఇది చెబుతుంది. దీనికి చాలా విస్తృత ప్రాతిపదిక ఉన్నది. ఈ ప్రాతిపాదిక పూర్తయిన తరువాత స్వామియందు కళాన్యాసం జరుపుతారు. కళాన్యాసంతో స్వామి దివ్య తేజస్సు అందులో ప్రవేశిస్తుందని ఆ శాస్త్రం చెబుతుంది. ఇక అక్కడున్నది సాక్షాత్తు పరదైవమైన స్వామి. అందుకే ధూప దీప నైవేద్యాలు ఎల్లకాలం కొనసాగాలన్నది మన పెద్దల అభీష్టం. దానికి విఘ్నం జరుగుతున్నది అంటే మనం పెద్ద అపచారం చేస్తున్నామనే అర్ధం. ఈ విశేషాలను చెబుతూ దేవాలయాల గురించి మన పెద్దలు ఏమన్నారో తెలుసుకుందాం. ‘ప్రాసాదం పురుషం మత్వా అర్చయేత్‌’ – అం‌టే, గుడి నిర్మాణం మొత్తం కూడా స్వామి శరీరంగా భావించాలి. మరి లోపల కొలువై ఉన్న స్వామి? ఈ ప్రశ్నకి ఏమని చెప్పారంటే, ‘ఆలయంతు శరీరం స్యాత్‌ ‌ప్రతిమా తత్‌ ‌జీవముచ్యతే’. అంటే ఆలయం శరీరం అవుతుంది. అందులో ఉన్నటువంటి అర్చామూర్తి జీవుడు -జీవం అవుతుందని ఆగమశాస్త్రాలు చెప్పాయి. అన్ని దేశాల్లో, అనేక స్థాయిల్లో మానవ స్థావరాలు ఏర్పడటం, అవి భౌతిక అవసరాలు, సుఖాలు పెంపొందించడానికి అనేక రకాలైన మార్గాలు ఏర్పరుచుకోవడం మనం చూశాం. మన దేశం వరకు ఏ పల్లెకైనా మూలం, కుదురు గుడి. గుడి అంటేనే గుండ్రని ఆకారం కలిగినది. వృత్తాకారం. గుడి కేంద్రంగా గ్రామాభివృద్ధి జరుగుతుందని అర్ధం. గుడి ప్రాధాన్యం గురించి తిరువయ్యారు గొప్ప మాట చెప్పారు. ‘ప్రశాంత జీవనానికీ, సమాజంలో సామరస్యానికీ దేవుడిని పూజించడం తప్ప వేరే మార్గం లేదు’. అలాగే తిరునావక్కరసు నాయనారు చెప్పిన ఒక అద్భుతమైన మాట, ‘ఎక్కడైతే మనిషి ఫాలభాగం భగవంతుడి పవిత్ర విభూతి రేఖలు అలుముకుని ఉండదో, ఎక్కడైతే భక్తులు భగవంతుడి నామ సంకీర్తనలో ఓలలాడుతూ, సంపూర్ణ భక్తి భావనతో ప్రార్ధనలు సలుపరో… ఎక్కడైతే శంఖధ్వనితో ఆలయంలో పూజాదికాలు ప్రారంభించి ఆచరణాయుతంగా నిర్వహించరో, ఎక్కడైతే ఆలయ వార్షికోత్సవాలు నియమబద్ధంగా జరగవో, ఎక్కడైతే శోభాయమానంగా వాడలన్నీ రంగవల్లులతో అలంకృతమై సుందర పూలమాలలు దేవదేవుడికి స్వాగతం పలకవో, ఎక్కడైతే స్థానిక భక్తులు స్వచ్ఛమైన పుష్పాలతో దేవుడిని కొలిచి, ఆయనకు అర్పించకుండా ఆహారాన్ని స్వీకరిస్తారో ఆ నివాసం నివాసం కాదు…అది వన్యమృగాలు తిరిగే అడవితో సమానం.’

ఇప్పుడు జరుగుతున్నది కేవలం విగ్రహ విధ్వంసం కాదు. మన దైవం మీద, మన ధర్మం మీద, మన సంప్రదాయం మీద, మన పరంపర మీద, మనదనుకుంటున్న మన వారసత్వం మీద జరుగుతున్న మాయా యుద్ధం. ఈ ఒక్క అంశం గుర్తిస్తే హైందవ జాతి మేలుకున్నట్టే.

– నందివెలుగు ముక్తేశ్వరరావు 9390230885, విశ్రాంత ఐఏఎస్‌ అధికారి

About Author

By editor

Twitter
YOUTUBE