ప్రతిఒక్కరిలో సేవాభావాన్ని పెంపొందించి జాతి పునర్నిర్మాణంలో అందరినీ భాగస్వామ్యం చేయడమే సేవాభారతి లక్ష్యమని చెబుతున్నారు ఆంధప్రదేశ్ ప్రాంత సహ సేవా ప్రముఖ్ కొండారెడ్డి. ఇటీవల జాగృతి జరిపిన ముఖాముఖీలో ఆంధప్రదేశ్‌లో సేవాభారతి నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాల గురించి ఆయన మాట్లాడారు.
కుష్ఠువ్యాధిగ్రస్తుల్లో ఆత్మవిశ్వాసం నింపేందుకు సేవాభారతి ఆధ్వర్యంలో విశేష కృషి జరుగుతున్నట్లు చెప్పారు. ఏళ్ల తరబడి మౌలిక వసతులు లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్న వనవాసీలను ఆదుకోవడమే తమ ప్రధాన కర్తవ్యమని అన్నారు. బాలసంస్కార కేంద్రాల ద్వారా పిల్లల్లో వ్యక్తిత్వ వికాసం పెంపొందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.
కరోనా క్లిష్ట సమయంలో ఆంధప్రదేశ్‌లో సేవాభారతి ఎటువంటి సేవలందించింది?
కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న సమయంలో సేవాభారతి ఆంధప్రదేశ్ ప్రజలకు విశేష సేవలందించింది. లాక్‌డౌన్ విధించినరోజు నుండే రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో సేవా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. 713 స్థలాల్లో 16 రకాల సేవా కార్యక్రమాలు జరిగాయి. సుమారు 5వేల మంది కార్యకర్తలు పనిచేసారు. కాలినడకన, సైకిళ్లపైన, లారీలలో తమ స్వస్థలాలకు వెళ్తున్న వలస కార్మికులకు భోజనం ఏర్పాటు, మజ్జిగ, అరటిపండ్లు, బ్రెడ్, బిస్కెట్‌ల వితరణ వంటివి చేశాం. మరొకవైపు కరోనా పట్ల తీసుకోవలసిన జాగ్రత్తల గురించి సేవాభారతి కార్యకర్తలు అవగాహన కల్పించారు. సేవాభారతి డాక్టర్‌ల బృందం ద్వారా కొవిడ్ హెల్ప్‌లైన్ ఏర్పాటుచేసి హోం క్వారంటైన్, హోం ఐసోలేషన్‌లో ఉన్నవారికి మందులు అందించాం. ప్లాస్మా గ్రూపు ఏర్పాటుచేసి అవసరమైనవారికి ప్లాస్మా దానంచేసే వ్యవస్థను రూపొందించాం. వర్చువల్ మీటింగ్స్ (సమావేశాలు) ద్వారా ప్లాస్మాదాతల అనుభవాలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా రోగులకు తెలియజేసే ప్రయత్నం చేశాం. అభ్యాసికల (ట్యూషన్ సెంటర్) నిర్వాహకుల (టీచర్స్) ద్వారా గ్రామ గ్రామాన, బస్తీలలో కొవిడ్ జాగ్రత్తల గురించి ఇంటింటి ప్రచారం నిర్వహించాం.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవాభారతి ఆధ్వర్యంలో ఎటువంటి కార్యక్రమాలు చేశారు?
గ్రామాల నుండి పట్టణాలలోని ప్రభుత్వ ఆసుపత్రులలో చికిత్స కోసం వచ్చిన రోగుల బంధువులు వసతి, భోజనం విషయంలో చాలా ఇబ్బందులు పడుతుంటారు. ఇది గమనించిన సేవాభారతి, ఆంధప్రదేశ్ కార్యకర్తలు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో, నెల్లూరులో, తాడేపల్లిగూడెంలో రోగుల బంధువులకు భోజనం ఏర్పాటు చేశారు. గుంటూరులో రోజుకి 500 మందికి, తాడేపల్లి గూడెంలో రోజుకి 100 మందికి, నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో 500 మందికి ఉచితంగా భోజనం అందించారు. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా రోజుకి 500 మందికి భోజనం ఏర్పాటు చేసే విధంగా యోజన జరిగింది. అంతేకాదు, సంస్థ ఆధ్వర్యంలో రక్తదాన కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో రక్తదాన సూచీ (బ్లడ్ గ్రూపింగ్) ఏర్పాటుచేసి రక్తగట ప్రముఖ్‌లను నియుక్తి చేశారు. వారి ద్వారా రక్తం అవసరమైన పేదవారికి, ప్రభుత్వ ఆసుపత్రులకు, రెడ్‌క్రాస్ సొసైటీ వంటి సేవా సంస్థలకు అందిస్తున్నాం. సేవాభారతి- ఆంధప్రదేశ్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా రక్త సేవాయాప్‌ను కూడా రూపొందించాం. దీనిని ఆర్‌ఎస్‌ఎస్ సర్ సంఘచాలక్ శ్రీ మోహన్‌జీ ఆవిష్కరించారు. రక్తదాతకు, రక్తగ్రహీతకు దీని ద్వారా అనుసంధానం జరుగుతుంది. అత్యవసర పరిస్థితుల్లో వేగంగా రక్తం అందించవచ్చు. మరొకవైపు అవయవ దానాన్ని కూడా సేవాభారతి ప్రోత్సహిస్తోంది. సక్షమ్ ద్వారా నేత్రదాన ప్రతిజ్ఞా కార్యక్రమంలో కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొని నేత్రదాన ప్రతిజ్ఞ చేశారు. వేలాదిమందితో ప్రతిజ్ఞ చేయించారు. దీర్ఘకాల రోగాలను నయంచేసే ఉద్దేశంతో సేవాభారతి ఆధ్వర్యంలో గోసేవా, గోమూత్రం, యోగా థెరపి వంటివి జరుగుతున్నాయి. మధుమేహముక్త్ భారత్ కోసం జరుగుతున్న ప్రయత్నాల్లో భాగంగా సేవాభారతి ద్వారా ఆంధప్రదేశ్‌లో 12 కేంద్రాలలో యోగా ప్యాకేజీ ద్వారా ప్రశిక్షణ ఇస్తూ అనేకమందిలో మధుమేహ వ్యాధిని తగ్గించే ప్రయత్నం జరుగుతున్నది.
కుష్ఠు వ్యాధిగ్రస్తుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపే పనిలో భాగంగా సేవాభారతి ఎటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తోంది?
కుష్ఠు వ్యాధిగ్రస్తుల పునరావాసం కోసం రాజ మండ్రిలోని బొమ్మూరులో సేవాభారతి ఆధ్వర్యంలో వివేకానంద మహారోగి ఆరోగ్య కేంద్రం నిర్వహణలో గత 30 సంవత్సరాలకు పైగా వివిధ సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం సుమారు 75 మంది రోగులకు పునరావాసం, చికిత్సతో పాటు వారి కుటుంబ సభ్యుల ఆర్థిక స్వావలంబన కోసం కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అంతేగాక వారిలో ఆత్మవిశ్వాసాన్ని, స్వాభిమానాన్ని నింపడం కోసం విశేష కృషి జరుగుతున్నది. అక్కడి సూర్య దేవాలయం ఆధ్వర్యంలో భజన కార్యక్రమాలు, ధార్మిక చింతన కలిగించే ప్రయత్నాలు నిత్యం జరుగుతున్నాయి.
గుడిసెవాసులు, వనవాసుల అభివృద్ధి కోసం ఎటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి?
ఆంధప్రదేశ్‌లోని గుడిసెవాసులు, ఏజెన్సీ ప్రాంతాలలో నివసించే వారి కోసం, సముద్ర తీరప్రాంతంలోని మత్స్యకార గ్రామాల్లో నివసించే వారి సంక్షేమం కోసం సేవాభారతి విద్య, వైద్యం, సామాజిక, స్వావలంబన ద్వారా సుమారుగా 650 గ్రామాలు/బస్తీలలో సేవలందిస్తోంది. అభ్యాసికలు, బాలసంస్కార కేంద్రాలు, మొబైల్ మెడికల్ వ్యాన్‌ల ద్వారా ఈ సేవలు అందిస్తున్నారు. మహిళలకు కుట్టు శిక్షణా కేంద్రాల ద్వారా వారి ఆర్థిక స్వావలంబన దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. వనవాసీ ప్రాంతంలో ఆరోగ్య రక్షక్ కార్యకర్తల ద్వారా వైద్యసేవ లందిస్తున్నాం. చిన్నపిల్లలకు ఉచితంగా పౌష్టికాహారం అందిస్తున్నాం. అంతేగాక వారికి చదువు, ఆరోగ్యం కోసం కృషి చేస్తున్నాం.
పర్యావరణ పరిరక్షణలో సేవాభారతి పాత్ర ఏమిటి?
రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో సేవాభారతి కార్యకర్తలు స్వచ్ఛభారత్ కార్యక్రమాలు విస్తృతంగా చేపడుతున్నారు. నగరాలలోని రద్దీ ప్రాంతాలలో, సేవాబస్తీలలో ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రులు, శ్మశానాలలో నిరంతరం స్వచ్ఛభారత్ పనులు జరుగుతున్నాయి. అంతేగాక గ్రామాల్లో పంచాయితీ నీళ్ల ట్యాంక్‌లను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తున్నారు. చెట్ల సంరక్షణ విషయంలో చర్యలు తీసుకుంటున్నారు. సీడ్ బౌల్స్ తయారు చేసి గ్రామాలలో, బస్తీలలో వితరణ చేస్తున్నారు. తులసి మొక్కల పంపిణీ కార్యక్రమం జరుగుతున్నది. అంతేగాక ప్లాస్టిక్ రహిత సమాజం కోసం, జలసంరక్షణ కోసం అవగాహనా శిబిరాలు నిర్వహిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ పట్ల అవగాహన కల్పిం చేందుకు కరపత్రాలు ముద్రించి ఇంటింటికీ వెళ్లి ప్రజలను చైతన్యవంతం చేస్తున్నారు.
బాలసంస్కార కేంద్రాలు ఎలా పనిచేస్తున్నాయి?
బాల, బాలికల్లో ఉన్నత విలువలు పెంపొందించే దిశగా అనేక ప్రయత్నాలు జరుగు తున్నాయి. బాలసంస్కార కేంద్రాలు, భజన కేంద్రాలు, నైతిక శిక్షణా తరగతుల ద్వారా వారికి మన పురాణాలు, ఇతిహాసాలు, సంస్కృతి, సంప్రదాయాల గురించి తెలియజేస్తున్నాం. వారిలో వ్యక్తిత్వ వికాసం పెంపొందించేలా పలు కార్యక్రమాలు జరుగు తున్నాయి. కుటుంబాల సమ్మేళనాల ద్వారా సమానత్వాన్ని, స్నేహాన్ని, సమరసతా భావాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నాం.
సామాజిక సమరసతా దిశగా సేవాభారతి ఆధ్వర్యంలో ఎటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి?
మనమంతా భరతమాత బిడ్డలం అనే భావనను ప్రతిఒక్కరిలో కలిగిస్తూ కులాల మధ్య ఉన్న అంతరాన్ని తొలగించడానికి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ నిరంతరం కృషి చేస్తుంది. ఆంధప్రదేశ్‌లో క్రైస్తవ ఎన్జీవోల ప్రభావం కొంత ఉన్నప్పటికీ సేవాభారతి తన విస్తృత సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు మరింత దగ్గరవుతోంది. కులాలకతీతంగా అందరూ కలసి వనభోజనాలకు వెళ్లడం వెనక ఉన్న ఉద్దేశం కూడా అదే.
సేవాభారతి ఇతర స్వచ్ఛంద సంస్థలకు ఎలాంటి స్ఫూర్తినిస్తుందనుకోవచ్చు?
స్వచ్ఛంద సంస్థల్లో స్ఫూర్తిని నింపేందుకు రాష్ట్ర స్థాయిలో ఐదేళ్లకోసారి సేవాభారతి ఆధ్వర్యంలో సేవాసంగమం (ఎన్‌జీవోల సమ్మేళనం) జరుగు తుంది. అంతేగాక జిల్లాస్థాయిలో రెండేళ్లకోసారి సేవాసంస్థల సమ్మేళనం నిర్వహించడం ద్వారా రాష్ట్రంలోని ఇతర సేవాసంస్థలకు సేవాభారతి కార్యక్రమాల పట్ల అవగాహన కల్పిస్తున్నారు. ఈ సమ్మేళనాలలో స్వచ్ఛంద సంస్థలకు సేవాభారతి ద్వారా సాంకేతిక, నైతిక సహకారం, ఆర్థిక వనరుల సేకరణ పట్ల అవగాహన, సహకారం అందించే ప్రయత్నం జరుగుతోంది.
సేవాభారతి ప్రస్తుతం ఏ ఏ అంశాల మీద దృష్టిపెట్టింది?
ఆంధప్రదేశ్‌లో సేవాభారతి ప్రస్తుతం పూర్తిస్థాయి కార్యకర్తల నిర్మాణం మీద దృష్టి పెట్టింది. అన్ని జిల్లా కమిటీలు నూతన సభ్యులతో క్రియాశీలకంగా పనిచేసే విధంగా కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తోంది. వ్యక్తిగత సంప్కరం, సంస్థాగత విషయాల పట్ల అవగాహన, ప్రశిక్షణ విషయాల్లో ప్రయత్నం జరుగుతున్నది. సేవాకార్యక్రమాల ఆధారంగా నిర్వహణ జట్టులను కూడా నియుక్తి చేస్తున్నారు. కార్యకర్తలకు సేవాకార్యం ఆవశ్యకతపై అవగాహన కల్పిస్తున్నారు.
సేవాభారతి కార్యక్రమాలకు ఆంధప్రదేశ్‌లో స్పందన ఎలా ఉంది?
ఆంధప్రదేశ్‌లోని అన్ని జిల్లాల్లో సేవాభారతి కార్యక్రమాలు చురుగ్గా సాగుతున్నాయి. సేవ ద్వారా సమాజంలో పరివర్తన తీసుకురావడమే సంస్థ లక్ష్యం. ఆర్థికంగా వెనుకబడిన శ్రీకాకుళం జిల్లాలోని గ్రామీణ ప్రాంతంలో సేవా కార్యక్రమాలు విస్తృతంగా నడుస్తున్నాయి. అనంతపురం, కదిరి, పాడేరు, చింతూరులో కూడా పలు సేవాకార్యక్రమాలు జరుగుతున్నాయి. శ్రీశైలం (నంద్యాల) ఏజెన్సీ గ్రామాలలో విద్య, వైద్యం, వృత్తి శిక్షణ ఇస్తున్నారు. నెల్లూరు జిల్లాలోని ఎస్.టి. యానాదుల అభ్యున్నతికి కృషి జరుగుతోంది. రాయలసీమలోని గ్రామీణ పేదరైతు కుటుంబాలలోని విద్యార్థులకు పలు సేవ లందిస్తున్నారు. ఆవాసాలు (హాస్టల్స్) నిర్వహిస్తున్నారు. భద్రాచలం ఏజెన్సీలోని బాలికలను ఉన్నత విద్యా వంతుల్ని చేసి వారిని ఉద్యోగాల్లో స్థిరపడేవిధంగా ప్రోత్సహిస్తున్నారు.
ప్రస్తుతం సోషల్ మీడియా వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో సేవాభారతి కార్యక్రమాలకు సోషల్ మీడియా ఏ మేరకు తోడ్పడుతున్నది?
ఆంధప్రదేశ్‌లో జరుగుతున్న సేవాకార్యక్రమాలను ఎప్పటికప్పుడు వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్ ద్వారా అందరికీ తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం. చిన్న చిన్న వీడియో క్లిప్పింగ్స్ తయారుచేసి వాటి ద్వారా సేవాభారతి చేస్తున్న సేవలను ప్రజలకు తెలియజేస్తున్నాం. పలు మాధ్యమాల ద్వారా సేవ ఆవశ్యకతను ప్రజలకు, దాతలకు తెలియజేస్తున్నాం.
ఉద్దానం కిడ్నీ బాధితులకు సేవాభారతి ఎటువంటి సహాయం అందిస్తోంది?
దేశంలోనే సంచలనం సృష్టించిన ఉద్దానం కిడ్నీ బాధితులకు వైద్య, ఇతర సహాయం విషయంలో సేవాభారతి ద్వారా విశేష కృషి జరిగింది. ఆర్‌ఎస్‌ఎస్ సహ సర్ కార్యవాహ భాగయ్యగారి చొరవతో, వారి మార్గదర్శనంలో కేంద్రం నుండి వచ్చిన వైద్యుల బృందం ద్వారా జరిగిన పరిశోధన, తద్వారా జరిగిన ప్రయత్నాల ద్వారా ఉద్దానం కిడ్నీ రోగుల సమస్య పరిష్కారం కోసం విశేష ప్రయత్నం జరిగింది. సేవాభారతి ఆధ్వర్యంలో ఈ ప్రాంత ప్రజలకు శుద్ధజలాన్ని అందించేదుకు ఆర్.ఓ. ప్లాంట్ ఏర్పాటు చేసి అనేక గ్రామాలలో ఉచితంగా త్రాగునీరు అందిస్తున్నా.