‘తెలంగాణలో రాజన్న రాజ్యం తేవాలన్నదే నా కోరిక’
ఉమ్మడి ఆంధప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ‘బిడ్డ’, విభజిత ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి చెల్లెలు వైఎస్ షర్మిల ఫిబ్రవరి 9న చేసిన ప్రకటన ఇది. ‘అయితే, పార్టీ ఎప్పుడు పెడుతున్నారు?’ అని అడిగారు విలేకరులు. ‘నేను పార్టీ పెడుతున్నానని మీరే నిర్ణయించేశారా?’ అన్నారు షర్మిల. సమాధానంలో కొంచెం గడుసుదనం లేకపోలేదు. విలేకరులు విస్తుపోయారు. తరువాత రెండు తెలుగు రాష్ట్రాలు జమిలిగా ఆశ్చర్యపోయాయి. ఎందుకంటే రామన్న రాజ్యం కావచ్చు, మరొక రాజ్యం కావచ్చు, ఏ రాజ్యం తేవాన్నా రాజకీయ పార్టీతోనే సాధ్యం. ఆ విషయాన్ని ఎలాంటి శషభిషలు లేకుండా చెప్పడానికి ఆమెకు మిగిలి ఉన్న అనుమానాలు ఏమిటో అర్ధం కావు.
నిజానికి లోటస్‌పాండ్ కేంద్రంగా షర్మిల జరిపిన కొత్త ప్రదర్శన నిండా అనుమానాలే. తెలంగాణలో రాజన్న రాజ్యం అన్న నినాదం మీద ఎవరికైనా అనుమానం వస్తుంది. వాటికన్ సిటీలో వాయనాలు ఇస్తానన్నట్టు ధ్వనించడం లేదూ! హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో నల్లగొండ జిల్లాలోని రాజశేఖరరెడ్డి ‘అభిమానుల’తో ఆమె ఆ రోజు ‘ఆత్మీయ’ సమావేశం జరిపారు. ఆ సందర్భంగా ఇలా మనసులోని మాట చెప్పారు. రాజశేఖరరెడ్డిని అభిమానించే ప్రతి గుండెకు రాజన్న బిడ్డ నమస్కరి స్తున్నది అంటూనే ప్రసంగం ప్రారంభించారు. తెలంగాణలో రాజన్న రాజ్యం తనతోనే సాధ్యమని ఆమె గట్టిగా నమ్ముతున్నారు. తన అన్నగారు ఆంధప్రదేశ్‌కు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం తల్లకిందులుగా తపస్సు చేసినా రాదన్న సత్యం ఆమెకు తెలిసినందుకు సంతోషం. ఆ విధంగా తెలంగాణలో రాజన్న రాజ్య స్థాపనావకాశం తనకే పుష్కలంగా ఉందని ఆమె భావిస్తున్నారేమో! ఎవరి ఆశీర్వాదంతో, దీవెనలతో ఆమె ఇంతటి లక్ష్యాన్ని భుజస్కంధాల మీదకు ఎత్తుకున్నారో తెలియదు. కానీ ఆ ఆశీస్సులు మాత్రం చాలా స్ట్రాంగ్. ఆఖరికి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సజ్జల ఆంధప్రదేశ్‌లో మాదిరిగా తెలంగాణలో కూడా సంక్షేమ పథకాలను అమలు చేయాలన్న అభిలాష షర్మిలకు ఉంది కాబోలు అంటూ ఎత్తుగడగా మాట్లాడారు. అందుకే పార్టీ ఆలోచన వచ్చిందేమోనన్నారు. అంటే షర్మిల రాజకీయ పార్టీ ఏర్పాటు తథ్యమనే సజ్జల చెప్పక చెప్పారు. షర్మిలకూ, జగన్‌కూ ఎలాంటి విభేదాలు లేవనీ, ఉన్నవల్లా కాసిన్ని భేదాభిప్రాయాలేనని అంటూ కుటుంబంలో ఎలాంటి గొడవలు లేవని సున్నితంగా వివరించే ప్రయత్నం చేశారు. వైఎస్ వివేకా హత్యోదంతం, అది వారి కుటుంబంలో రేపిన కలత, వచ్చిన ఆరోపణలు జనం మరచిపోలేదన్న మాట నిజం. అధికార ప్రతినిధులు, వారి అమాత్యులు చెప్పేవన్నీ జనం నమ్ముతారని అనుకోనక్కరలేదు. వచ్చే నవ్వును ఆపుకుంటున్నారంతే.
తెలంగాణలో రాజన్న రాజ్యస్థాపన అంటే తివిరి ఇసుమునుండి తైలమ్ము తీయవచ్చు అన్నట్టే ఉంటుందని చాలామంది వెంటనే నిర్ధారణకి వచ్చేశారు. ఒకవేళ ప్రజాసేవ చేయాలన్న తన ఆకాంక్షను నెరవేర్చుకోవాలంటే సొంత రాష్ట్రం ఆంధప్రదేశ్‌లో చేయవచ్చు కదా అన్నది కూడా ప్రశ్న. అక్కడ జగన్ సంక్షేమ పథకాలతో ఉబ్బితబ్బిబ్బయ్యి, ఇక చాలు మహాప్రభో అని ప్రజలు కాళ్లావేళ్లా పడుతున్నారా? అదేం లేదు. మరెందుకు, ఈమె రాజన్న రాజ్యం నినాదంతో తెలంగాణను ఎంచుకున్నారు? నిజానికి డాక్టర్ వైఎస్‌కి తమిళనాడు, కర్ణాటకలో కూడా అభిమానులు ఉన్నారు. అమెరికాలో అయితే ప్రాణం పెట్టే వాళ్లున్నారు.
అన్నయ్య జైలులో ఉన్నప్పుడు రాష్ట్రమంతా తిరిగి ఓదార్పు యాత్రను కొనసాగించిన ఘనత ఉన్న షర్మిల, తీరా పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత తన ఉనికి కూరలో కరివేపాకు చందంగా మారి పోయిందన్న వేదనతో ఉన్నారన్న వార్తలూ లేకపోలేదు. అసలు జగన్‌కి పార్టీ మీద, ప్రభుత్వం మీద బంధుప్రీతి ముద్ర పడకూడదన్న బలీయమైన ఆశయం ఉందని అస్మదీయులు చెబుతున్నారు. అదేంకాదు, ఇంకెవరికీ వాటా ఇవ్వరాయన అన్న వాదనలు ఉన్నాయి. 2019 ఎన్నికలలో తల్లి విజయమ్మను విశాఖ లోక్‌సభ స్థానానికి నిలిపి ఆమె అడ్డుకూడా తొలగించుకున్నారన్న మాట కూడా వచ్చింది. అది ఓడిపోయే సీటు. గెలిచే అవకాశం ఉన్న మరొక స్థానంలో మాతృమూర్తిని పోటీకి నిలిపితే జగన్‌ను అడ్డుకునేదెవరు? కానీ చేయలేదే! ఆమె పరాజయం సరే. లోక్‌సభకు పంపించి ఢిల్లీ రాజకీయాలు తన చేతికి అప్పగిస్తారన్న ఆశ షర్మిలలో ఉందన్న మాట కూడా వినించింది. జగన్ అదీ చేయలేదు. పోనీ రాజ్యసభ స్థానమైనా సారెగా ఇవ్వలేదు. ఎన్ని విశ్లేషణలు చేసినా తెలంగాణ ద్వారా షర్మిల తన రాజకీయ ఆకాంక్షలను నెరవేర్చుకోగలరని కాస్త రాజకీయ పరిజ్ఞానం ఉన్నవారు సైతం అంగీక రించరు. అందుకే ప్రతికూల అంశాలు శరవేగంగా తెర మీదకు వచ్చేశాయి.
ఈ అంశాలలో మొదటిది- తెరాస కారణంగా రాజకీయ ప్రాధాన్యం కోల్పోయి కిందపడ్డామన్న దిగులుతో ఉన్న ఒక సామాజిక వర్గాన్ని ఏకం చేయడమే లక్ష్యంగా షర్మిల తెలంగాణలో జెండా పాతాలని అనుకుంటున్నారని కొందరు విశ్లేషకులు నమ్ముతున్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో తెరాస గెలిచినవన్నీ ఆంధ్రులు బలంగా ఉన్నచోటనే కాబట్టి, ఆ ఓట్లను పరిరక్షించుకోవడానికి జగన్‌తో కలసి షర్మిలను కేసీఆర్ రంగంలోకి దించారన్న మరొక అస్పష్ట, అధ్వాన, అసంబద్ధ విశ్లేషణ కూడా వెలువడింది. కేసీఆర్ తెలంగాణకు సంబంధించి అసదుద్దీన్ ఒవైసీకి అగ్ర తాంబూలం ఇస్తారు కానీ, క్రైస్తవం ముద్రతోనే బయలుదేరిన షర్మిల పార్టీకి కాదేమో! ఇదంతా ఎందుకు? జగన్ దీవెనలు లేకుండా షర్మిల పార్టీ పెట్టగలరా? అదే నిజమైతే, జగన్‌లో మరొక చంద్రబాబును చూడవచ్చు. చంద్రబాబు 2018 అసెంబ్లీ ఎన్నికలలో హరికృష్ణ కుమార్తెను కూకట్‌పల్లిలో పోటీ పెట్టినట్టే ఉంటుంది. ఓడినది తెలంగాణలోనే అయినా, ఆంధప్రదేశ్‌లో కూడా రాజకీయంగా చెల్లనికాసుగా చెలామణి చేయవచ్చు.
చల్లకొచ్చి ముంత దాచనేల అని, షర్మిల మనసులో ఉన్నది నిజంగా రాజన్న రాజ్యస్థాపనా? ఏసయ్య రాజ్య స్థాపనా? ఇదే చాలామందికి వచ్చిన అసలు అనుమానం. ఆమె నల్లగొండ జిల్లా అభిమా నుల సమావేశానికి తన భర్త, కాకలు తీరిన క్రైస్తవ ప్రచారకుడు బ్ర.అనిల్‌కుమార్‌తోనే కలసి వచ్చారు.‘కరోనాను తొక్కేస్తాం’ అంటూ అనిల్ వీరంగం వేస్తుండగా, షర్మిల, విజయమ్మలు తన్మయంగా చూస్తున్న వీడియో ఒకటి ఈ మధ్యనే బాగా వైరల్ అయింది. ఆ తొక్కుడేదో ఆ చర్చ్‌లో నుంచి బయటకు వచ్చి తన బావ జగన్ ఏలుతున్న ఆంధప్రదేశ్‌లో కరోనా మీద సాగించి ఉంటే బాగుండేదన్న మాటలు వినిపించాయి. నిజమే, అన్ని కోట్లు ఖర్చు పెట్టే కంటే, బ్ర. అనిల్, తదితర క్రైస్తవ్య మహిమాన్విత బోధకుంతా వెళ్లి కరోనాని తొక్కి పారేస్తే బావుండేది. క్రిస్టియన్ అమెరికాలో కరోనాను తొక్కే స్థాయి క్రైస్తవ బోధకులు కరువైతే వీరిని తీసుకెళ్లాలన్న ఆలోచన ట్రంప్‌కు రాలేదెందుకో! ఆ ఆలోచన వస్తే అంతమంది చచ్చేవారే కాదు. అలాగే ఇటలీ, రోమ్‌లలో కూడా ఇలాంటి కరోనా తొక్కుడు కూటములు ఎందుకు నిర్వహించలేదో! ఆంధప్రదేశ్‌లో క్రైస్తవ వ్యాప్తి బాధ్యత అన్నయ్య చూసుకుంటున్నారు కదా, తెలంగాణలో అలాంటి బాధ్యతనే ఇంకా ఆలస్యం చేయకుండా తన భుజస్కంధాల మీద వేసుకోవాలన్న ఆలోచన షర్మిలకు వచ్చిందన్న అభిప్రాయం లేకపోలేదు. కాబట్టి తెలంగాణలో రాజన్న రాజ్యం వచ్చిన తరువాత బ్ర. అనిల్‌కు ఎలాంటి గురుతర బాధ్యత అప్పగిస్తారో అన్న కీలక అంశం మీద ఇప్పటికైనా చర్చ మొదలుకావాలి. అయినా తెరాస ప్రభుత్వం క్రైస్తవులకు ఏం తక్కువ చేస్తోందని! వందకు పైగా చర్చ్‌ల మరమ్మతులకు కోట్లు కేటాయించింది. ఇది చాలదని షర్మిల అభిప్రాయమేమో తెలియదు.
దీనికో కొసమెరుపు. కేఏ పాల్ దైవవాక్య జనిత మిది. ‘క్రైస్తవులను గందరగోళంలో పెట్టడానికి బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ ఇదంతా చేస్తున్నాయి. వాళ్లు చెప్పినట్లల్లా (షర్మిల) ఆడడం దేవునికి ద్రోహం చేయడమే. అనిల్ ప్రోద్బలం కూడా ఇందులో ఉంది.’ కాబట్టి క్రైస్తవ కోణం బలమైంది కాదని ఎలా అనగలం! పాల్ త్యాగం ఎంతటిదంటే, నోబెల్ శాంతి పురస్కారానికి ఆయననే బీజేపీ ప్రభుత్వం ఎంపిక చేసినప్పటికీ షర్మిలది దైవద్రోహమని చెప్పడానికి వెరవలేదు. నోబెల్ పురస్కారానికి ఎన్‌డీఏ ప్రభుత్వం ఎంపిక చేసిన దేవ రహస్యాన్ని ఆయనే వెల్లడించారు.
జైశ్రీరామ్ అన్నందుకు చంపేశారు
‘ఇతడిని ఎందుకు చంపారో తెలుసా? జైశ్రీరామ్ అన్నందుకు.’ తెల్లటి చొక్కాతో, చక్కగా దువ్వుకున్న జుట్టుతో బుద్ధిమంతుడిలా కనిపిస్తున్న ఆ కుర్రాడి ఫొటోతో ఉన్న ఫ్లెక్సీ మీద కనిపించిన అక్షరాలివి. ఫిబ్రవరి 10 తరువాత ఢిల్లీలోని మంగోల్‌పురిలోని ఒక వీధిలో కనిపించిందీ ఫ్లెక్సీ. అతడు ఎవరినైనా జైశ్రీరాం అంటూ పలకరించేవాడు. ఇస్లామిక్ జీహాదీలకు అడ్డాగా ఉపయోగపడుతున్న మంగోల్‌పురిలోనే ఆ హత్య జరిగింది. అతడి పేరు రింకు (25).
అయోధ్య పేరుతో అక్రమ వసూళ్లు జరుగుతున్నాయని దుర్మార్గపు ఆరోపణలు చేస్తున్నవాళ్లు ఇప్పుడు నిధి సేకరణలో పాల్గొంటున్న వారి ప్రాణాలు తీయడానికి సాహసిస్తున్నారు. ఫిబ్రవరి 10వ తేదీన ఢిల్లీలోని మంగోల్‌పురిలో జరిగిన రింకుశర్మ హత్య ఇలాంటిదే. కానీ ఇది వ్యాపార లావాదేవీల గొడవతో జరిగిన హత్య అని మొదట పోలీసులు మసిపూసి మారేడుకాయ చేయడానికి యత్నించడమే దారుణం. ల్యాబ్ టెక్నీషియన్ రింకు బీజేపీ యువమోర్చాలో, విశ్వహిందూ పరిషత్‌లో పనిచేసే వారు. అయోధ్య నిధి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ హత్యకు సంబంధించి ఆ ప్రాంతానికే చెందిన నస్రుద్దీన్, ఇస్లాం, జాహిద్, మెహతాబ్, తాజుద్దీన్ అనే వారిని అరెస్టు చేశారు. ఒక మిత్రుడి జన్మదిన వేడుకులకు హాజరైన రింకు ఆ తరువాత హత్యకు గురయ్యాడు. ఈ హత్యాకాండతో సంబంధం ఉన్నవాళ్లు కూడా అదే వేడుకకు హాజరయ్యారు. రెండు తిను బండారాల దుకాణాల మూతకు సంబంధించి వాగ్వాదం జరిగిందనీ, అదే రింకు హత్యకు దారితీసిందనీ ప్రజలను తప్పుదోవ పట్టించడానికి పోలీసులు చూశారు. కానీ కుటుంబ సభ్యుల, ఆ ప్రాంతవాసుల కథనాలు వేరుగా ఉన్నాయి. తరువాత జరిగిన పరిణామాలు కూడా పోలీసులు చెప్పినది కట్టుకథే అని చెప్పే విధంగా ఉన్నాయి. ఇది ముస్లిం మతోన్మాదుల చర్య. కేసును క్రైమ్ బ్రాంచ్‌కు అప్పగించవలసి వచ్చింది. పొరుగునే ఉన్న నస్రుద్దీన్‌కూ, రింకుకూ కొద్దిరోజుల క్రితం మతానికి సంబంధించి ఘర్షణ జరిగింది. పదో తేదీ రాత్రి నస్రుద్దీన్, మరో ముగ్గురు రింకు ఇంట్లోకి చొరబడి పొడిచి చంపారు. రింకు అయోధ్య నిధి సేకరణ కార్యక్రమంలో ఉన్నందునే హత్యకు గురయ్యాడని విశ్వహిందూ పరిషత్ ఆరోపించింది. ఇంతకీ ఆ వ్యాపార సంస్థల స్థాపన లేదా మూతవేయడంతో రింకుకు సంబంధమే లేదు. సచిన్, జహీర్ అనేవారి మధ్య వ్యాపార సంస్థల గురించి వాదోపవాదాలు చెలరేగి, ఉద్రిక్తతలు ఏర్పడినాయి. పైగా రింకు ఇంట్లోని గ్యాస్ సిలిండర్‌ను తెరచి తామందరిని చంపాలని కూడా చూశారని రింకు సోదరుడు చెప్పారు. ఆ రాత్రి తన సోదరుడు కంగారుగా ఇంట్లోకి వచ్చి తలుపు వేసేయమని చెప్పాడని, చాలామంది కర్రలు, రాడ్లతో తరుముకు వచ్చారని చెప్పాడు. తరువాత రింకును ఇంట్లోంచి ఈడ్చుకు వెళ్లి చంపారు. చనిపోతూ కూడా రింకు అన్న ఆఖరి మాట జైశ్రీరామ్ అనేనని తల్లి రాధాదేవి చెప్పారు. ఆ ప్రాంతంలో ఆ ఐదుగురితో గొడవ పడనివారే లేరని అక్కడి వాళ్లే చెప్పారు. రింకుకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడిన మధ్యప్రదేశ్ ప్రోటెం స్పీకర్ రామేశ్వర్ శర్మను చంపుతామంటూ సామాజిక మాధ్యమాలలో పోస్టులు పెట్టారు.
ముస్లిం మతోన్మాదుల రక్తపిపాసకు బలైనది బీజేపీ లేదా విశ్వ హిందూ పరిషత్ కార్యకర్త కాబట్టి మీడియా అసలు పట్టించుకోలేదు. ఢిల్లీ ముఖ్యమంత్రి కూడా మాట్లాడలేదు. హత్య జరిగిన మంగోల్‌పురి అంతటా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బలగాలను మోహరించవలసి వచ్చింది. విశ్వహిందూ పరిషత్ నిరసన ప్రదర్శన నిర్వహించింది. చిత్రం ఏమిటంటే, రింకు హత్యకు కేంద్ర హోంమంత్రి బాధ్యత వహించాలని ఢిల్లీ హోం మంత్రి చెబుతున్నారు. ఇదంతా చూస్తుంటే, ఈ దేశంలో ముస్లిం చట్టాలను అమలు చేయాలని చూస్తున్న వారి సంఖ్య పెరిగిపోయినట్టు కనిపిస్తున్నది.