ఫిబ్రవరి 19 రథసప్తమి

సమస్త లోకాలకు కర్మసాక్షిగా అనంతమైన శక్తికిరణాలతో వెలుగును, తేజస్సును ప్రసాదిస్తున్న ఆదిత్యుడు ఆదితి కశ్యప ప్రజాపతి కుమారుడిగా విశాఖ నక్షత్రంలో ఆవిర్భవించినట్లు బ్రహ్మాండ పురాణ కథనం. సూర్యభగవానుడు నిత్యానుసంధాననీయుడు. మరీ ముఖ్యంగా మాఘమాసంలోని ఆదివారాలలో ఆయన అర్చనకు మరింత ప్రత్యేకత ఉందని చెబుతారు. ఆదివారాలలో సూర్యనమస్కారాలు చేసి పాలను నివేదిస్తే సకల శుభాలు కలుగుతాయని విశ్వాసం. ‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అన్నట్లు పరమోన్నతమైన ఆరోగ్యభాగ్యాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఆయన పుట్టినరోజు రథసప్తమిని ‘ఆరోగ్య సప్తమి’ అనీ అంటారు. ఆ రోజు చేసే స్నాన, ధ్యాన, నమస్కారాది పక్రియలు శారీరక రుగ్మతలను దూరం చేయడంతో పాటు మానసిక ప్రవృత్తులను సన్మార్గంలో పెడతాయి. మాఘస్నానం, పొంగలి నివేదనం, అర్ఘ్య సమర్పణతో ఆరోగ్యం చేకూరుతుందని చెబుతారు.

సూర్యుడికి వివస్వతుడు అని మరో పేరు ఉంది. ఆయన కుమారుడే ఏడవ మనువు వైవస్వతుడు. రథసప్తమి నాడే ఆయన మన్వంతరం ప్రారంభమైందని చెబుతారు. కాలానికి ఆదిత్యుడే కొలమానం. సమస్త జీవరాశికి ఆధారభూతుడు. కాబట్టే వేదాలు ఆయనను త్రిమూర్తి స్వరూపుడిగా ఆభివర్ణించాయి. ఆదిత్యుడి ఆధారంగా మకర సంక్రాంతి, రథసప్తమి పండుగలు జరుపుకుంటారు. సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణ పుణ్యకాలంలోకి అడుగుపెట్టిన సందర్భంగా మకర సంక్రాంతిని, ఆయన పుట్టిన రోజు రథసప్తమి (మాఘశుద్ధ సప్తమి)ని వేడుకగా జరుపుకుంటారు.మాఘ శుక్ల సప్తమినాడు సూర్యుడు రథాన్ని అధిరోహించడం వల్ల ‘రథసప్తమి’ అని పేరు వచ్చిందని మత్స్యపురాణం పేర్కొంటోంది. దీనినే మహాసప్తమి, భానుసప్తమి, అచలాసప్తమి అనీ వ్యవహరిస్తారు. ‘అచలాసప్తమి’ వ్రతం వల్ల స్త్రీ రూపవతి, సౌభాగ్యవతి, పుత్రవతి అవుతుందని శ్రీకృష్ణుడు ధర్మజుడికి వివరించాడు.

ఏడాదికి వచ్చే 24 సప్తమి తిథుల్లో రథసప్తమికి విశిష్టత ఉంది. మన్వంతర ప్రారంభంలో మాఘశుద్ధ సప్తమి నాడే సూర్యుడు తొలిసారి కిరణాలను ప్రసరింపచేశాడట. అందుకే ఈ తిథి ‘సూర్య జయంతి’గా స్థిరపడిపోయింది. ఏడాదిలో వచ్చే రెండు అయనాలలో దక్షిణాయణం పితృదేవతలకు, ఉత్తరాయణం దేవతలకు ప్రీతికరం. సూర్యుడు మకరరాశిలో ప్రవేశించడంతో ఉత్తరాయణం మొదలవుతుంది. దక్షిణం వదిలి ఉత్తర దిక్కుకు పయనిస్తాడు.

రథసప్తమి నాడు సూర్యోదయానికి ముందు నక్షత్ర సమాహారం రథాకారంలో ఉంటుందంటారు. ఏకచక్ర రథాన్ని సప్త అనే అశ్వం లాగుతుంది. సూర్యరశ్ములే (కిరణాలే) అశ్వరూపాలు. ఆదిత్యుడి నుంచి వెలువడే కిరణాలలో ఏడవది ‘సప్త’ పేరుతో లోకాన్ని ఉద్దీపింపచేస్తోందని, మిగిలిన ఆరు కిరణాలు ఆరు రుతువులుగా కాలచక్రాన్ని నడుపుతున్నాయని వేదవాక్కు.

‘సప్తలోక ప్రకాశాయ సప్తసప్త రథాయచ
సప్త ద్వీప ప్రకాశయ భాస్కరాయ నయోనమః’…

‘ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్‌’ (ఆరోగ్యం కోసం భాస్కరుని ఆరాధించాలి) అంటారు. సూర్యారాధన సర్వరోగాలను హరించి ఆరోగ్యాన్ని, బలాన్ని, తేజస్సును ప్రసాదిస్తుంది.
సర్వం సూర్యమయం జగత్‌ అన్నట్లు సకల జగత్తు ఆయన తేజస్సుతో చైతన్యం పొందుతోంది. సమస్త ప్రాణకోటి ఆయనపైనే ఆధారపడి ఉంది. ‘నమస్కార ప్రియోభానుః’ అని ఆర్యోక్తి. కేవలం వందనంతోనే ప్రసన్నుడై ఆరోగ్య విజ్ఞానాలను ప్రసాదించే ప్రత్యక్ష భగవానుడు సూర్యదేవుడు. ఉదయాస్తమయ వేళల్లోని సూర్యకిరణాలు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయని ఆయుర్వేదం చెబుతోంది. యోగ్యత అయోగ్యతలతో నిమిత్తం లేకుండా సర్వ జీవకోటికి సమానంగా వెలుగులు (కాంతులు) పంచే భగవానుడు. సృష్టి స్థితిలయాలు సూర్యుని ప్రమేయంతోనే జరుగు తున్నాయని (సూర్యాద్భవంతి భూతాని సూర్యేణ పాలితానిచ/సూర్యే లయం ప్రాప్నువంతి య సూర్యః సోహ మేవచ) ‘సూర్యోపనిషత్తు’ పేర్కొంది.
రథసప్తమి నాటి ప్రత్యేకత
స్నానం, దీపం, అర్ఘ్యం, అర్చనం, తర్పణం రథసప్తమి నాటి ప్రత్యేక ధర్మాలు. ముందురోజు (షష్ఠి) నిరాహారంగా ఉండి మరునాడు శాస్త్రోక్తంగా రథసప్తమి వ్రతం ఆచరించడం వల్ల ఆరోగ్యం సిద్ధించడంతో పాటు ఏడేడు జన్మల పాపాలు నశిస్తాయని ‘ధర్మసింధువు’ పేర్కొంటోంది. శారీరక, ఆధ్యాత్మికంగా తేజస్సు కలిగి శమదమాది సద్భావనలు పెంపొందుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈరోజు సూర్యునికి 12సార్లు అర్ఘ్యం ఇవ్వాలి. ఆదిత్య హృదయం పారాయణం చేసి పరమాన్నం నివేదిస్తారు. ప్రత్యక్ష భగవానుడు పరమాన్నప్రియుడు. అందునా ఆవు పాల పాయసం మరింత శ్రేష్ఠంగా చెబుతారు. తులసికోట వద్ద కళాపిజల్లి రంగవల్లులు తీర్చి ఆవు పిడకల మంటపై చెరకు ముక్కతో కలుపుతూ పాయసాన్ని తయారు చేస్తారు. ధనుర్మాసంలో పెట్టిన గొబ్బి పిడకలపై ఈ మధుర పదార్థాన్ని తయారు చేయాలని చెబుతారు. చిక్కుడు కాయలతో అలంకరించిన రథంలో సూర్యుడిని ఆవాహన చేసి, ఎర్రచందనంతో కలిపిన అక్షతలతో అర్చిస్తారు. క్షీరాన్నాన్ని మొత్తం పదిహేను ఆకుల్లో ఉంచి అగ్నిదేవుడు, తులసికోటకు, సూర్యుడికి సమానంగా నైవేద్యం సమర్పిస్తారు. ఎరుపు సూర్యునికి ప్రీతికరమైనది కనుక ఆయన జయంతి నాడు శక్తి మేరకు ఎర్రటి వస్త్రం, గోధుమలు, సువర్ణం, ఎర్రటి పూలు దానం చేయాలని పెద్దలు చెబుతారు.

మామూలుగానే త్రిమూర్తి స్వరూపుడైన సూర్యనారాయణమూర్తికి త్రిసంధ్యాకాలాల్లో అర్ఘ్యం సమర్పిస్తారు. రథసప్తమి నాటి అర్ఘ్యం మరింత ప్రత్యేకత కలిగి ఉంటుందని చెబుతారు. ఈ పర్వదినాన భాస్కరోపాసన, ధ్యానస్నాన సూర్య నమస్కారాలు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యకరంగా ఉంచుతాయని చెబుతారు.

‘సప్త సప్త మహాసప్త సప్తద్వీపా వసుంధరా
సప్త జన్మకృతం పాపం మకరే హంతుసప్తమీ
యద్యత్‌ ‌జన్మకృతం పాపం మయాసప్తసు జన్మనుతన్మోరోగం చ శోకం చ మకరే హంతు సప్తమీ’

(ఏడు గుర్రాల సూర్య రథం, ఏడు ద్వీపాల విస్తృతి గల సమస్త భూమండంలోని ఏడు జన్మల పాపాలను, వ్యాధులను, శోకాలను పోగొట్టుగాక) అనే శ్లోకాన్ని చదువుతూ తలపై జిల్లేడు ఆకు, రేగిపండు పెట్టుకొని స్నానం ఆచరించాలి. ఒక్కొక్కకాలంలో ఒక్కొక్క వనమూలికలో ఔషధగుణాలు అధికంగా ఉంటాయి. మాఘంలో జిల్లేడు, రేగుకు ఆ శక్తి ఉంటుందని చెబుతారు. అర్కపత్రం (జిల్లేడు)తో పాటు చిక్కుడు ఆకులు, చిక్కుడు పూలు, రేగుకాయలు సూర్యుడికి ప్రీతిపాత్రమైనవి. వీటిని తలపై ఉంచుకొని స్నానమాచరిస్తారు. రథసప్తమికి ముందు నాటి పండుగ భోగినాడు చిన్నారులకు భోగిపండ్లు పోస్తారు. వారికి ఏమైనా పీడలాంటిది ఉంటే దాంతో తొలగిపోతుందని, ఆనాడు భోగిపండ్ల వల్ల పిల్లలకు కలిగే ప్రయోజనం లాంటిదే రథసప్తమినాడు అర్కపత్ర, బదరీఫల స్నానంతో సర్వులకూ సిద్ధిస్తుందని విశ్వాసం. ఆ రోజున ఆదిత్య హృదయం, సూర్యాష్టకం వంటివి ప్రత్యేకంగా పారాయణం చేస్తారు.

రథసప్తమి నాటి స్నానపక్రియ ప్రత్యేకత గురించి ‘వ్రతచూడామణి’ పేర్కొంది. దాని ప్రకారం, ఆరోజు సూర్యోదయానికి ముందే నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించి నదీతీరంలో కాని, చెరువులో కానీ వదిలి, జిల్లేడు ఆకులు, రేగుపండ్లు తలమీద ఉంచుకుని స్నానమాచరించాలి. ఇలా చేయడం వల్ల ఆరోగ్య ఐశ్వర్యం తేజస్సు పెంపుతో పాటు చర్మరోగాలు నశిస్తాయని, జన్మాంతర సప్తవిధ పాపాలు (ప్రస్తుత, గత జన్మల పాపాలు, మాట, మనసు, శరీరంతో చేసిన పాపాలు, తెలిసీ తెలియక చేసినవి) నశిస్తాయని, రథసప్తమి నాడు సూర్యోదయ సమయ స్నానంతో సూర్యగ్రహణం నాటి స్నానమంత ఫలితం లభిస్తుందని విశ్వాసం.

సూర్యారాధన

సూర్యారాధన అనాదిగా వస్తున్నదే. దేవతలు, మానవులే కాదు, అవతారపురుషులు శ్రీరామ, శ్రీకృష్ణుడు లాంటి వారు ఆయనను అర్చించారని ఐతిహ్యం. శ్రీరామచంద్రుడు ఆగస్త్య మహర్షి అనుగ్రహంతో పొందిన ఆదిత్య హృదయస్తోత్ర పఠనంతోనే లంకేశ్వరుడిపై విజయం సాధించాడని, నవమ బ్రహ్మగా వినుతికెక్కిన హనుమ సూర్యోపాసన ద్వారానే సర్వవిద్యలు అభ్యసించినట్లు పురాణ కథనం. కుష్ఠువ్యాధి పాలైన శ్రీకృష్ణుడి కుమారుడు సాంబుడు సూర్యారాధనతో ఆ వ్యాధి బాధ• నుంచి విముక్తుడయ్యాడట. ధర్మరాజు వనవాస కాలంలో సూర్యారాధనతోనే ‘అక్షయపాత్ర’ను పొంది ఆకలిదప్పులను జయించగలిగాడు. కురుక్షేత్ర సంగ్రామానికి ముందు శ్రీకృష్ణుడు ధర్మజునితో సూర్యవ్రతం చేయించినట్లు భవిష్యోత్తర పురాణం పేర్కొంటోంది. దివాకరుడిని ప్రసన్నం చేసుకునే సత్రాజిత్‌ ‘‌శ్యమంతకమణి’ని పొందాడు.

తిరుమలలో

తిరుమలలో ఇతర పండుగల మాదిరిగానే రథసప్తమినీ నిర్వహిస్తారు. అయితే ఎన్నడూ లేని విధంగా ఆ ఒక్కరోజే శ్రీవారు ఏడు రథాలపై వివిధ అలంకారాలలో ఊరేగి కనువిందు చేయడం ప్రత్యేకం. సూర్యప్రభ వాహనంతో తిరువీధి ఉత్సవం మొదలై చిన్నశేష, గరుడ, హనుమంత, కల్పవృక్ష, సర్వభూపాల, చందప్రభ వాహనాలతో ముగుస్తుంది. దీనిని అర్థ బ్రహ్మోత్సం అంటారు.

రథసప్తమికి మరో ప్రత్యేకత ఉంది. నోములు ప్రారంభించేందుకు ఇది అనువైన రోజని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈరోజు మొదలుపెట్టిన కైలాసగౌరీ, పదహారుఫలాలు లాంటి నోములను ఏడాదిలోపు ఎప్పుడైనా ముగించవచ్చని, ఒకవేళ రథసప్తమినాడు నోము ఆరంభానికి వీలుకుదరకపోతే శివరాత్రి నాడు చేపట్టవచ్చని చెబుతారు.

– ఎ. రామచంద్ర రామానుజ, సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE