ఆంధప్రదేశ్‌లో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎప్పుడో గత మార్చిలో జరగవలసిన ఎన్నికలు కరోనా కారణంగా వాయిదా పడ్డాయి. ఆ వాయిదా వివాదంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి మధ్య వాయిదా చిచ్చుగా మారింది. అప్పటి  నుంచి ఇప్పటివరకు ఆ చిచ్చు రగులుతూనే ఉంది. వివాదం రూపాన్ని మార్చుకుంటూ కొనసాగుతూనే ఉంది. రాష్టంలో గత, ప్రస్తుత ప్రభుత్వాల హయాంలో కొనసాగిన, కొనసాగుతున్న అరాచక పాలన నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు ప్రజాధనాన్ని బూడిదపాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం, ఎన్నికల సంఘానికి కొమ్ము కాసిన ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం, ఇరు వర్గాలను సమర్థించే మీడియా అగ్గిలో ఆజ్యం పోశాయి. ఇంకా పోస్తూనే ఉన్నాయి.

సరే, అదలా ఉంచి.. పంచాయతీ ఎన్నికల వివాదం విషయంలోకి వస్తే, అలా మొదలైన… వివాదం ఒక దశలో చిలికిచిలికి గాలివానగా మారింది. రాజ్యాంగ సంస్థల మధ్య తలెత్తిన రాజకీయ వివాదం గడపదాటి రాజ్యాంగ సంక్షోభానికి దారితీస్తుందా? అన్నంతగా పరిస్థితులు దిగజారాయి. కోర్టులు, కేసులు, విచారణలు, తీర్పులు ఇలా ఒకటని కాదు అనేక మరకల మలుపులు తిరిగాయి. చివరకు సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుతో గత నెలలో ఎన్నికల పక్రియ ప్రారంభమైంది. ఇప్పటికి రెండు విడతల పోలింగ్‌ ‌జరిగింది. మరో రెండు విడతల పోలింగ్‌ ‌జరగవలసి ఉంది.

అసలే కోతి. ఆపైన కల్లు తాగింది అన్నట్లుగా దిగజారుడు రాజకీయాలకు పెట్టింది పేరుగా పరిపాలన సాగిస్తున్న వైసీపీ ప్రభుత్వం అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమాలకు పాల్పడుతోందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. సామ, దాన, భేద, దండోపాయాలు ప్రయోగించి సాధ్యమైన మేరకు ‘సర్కార్‌ ‌వారి పాట’తో ఏకగ్రీవాలు కానిచ్చేస్తోంది.

ఎన్నికల క్రతువును ‘మమ’ అనిపించి ఫలితాలను తమ ఖాతాలో కలిపేసుకుంటోంది. పార్టీ నాయకులు 80 నుంచి 90 శాతం గ్రామ పంచాయతీలలో అధికార వైసీపీ బలపరిచిన అభ్యర్ధులు గెలిచారని డప్పు కొట్టుకుంటున్నారు. నిజానికి పంచాయతీ ఎన్నికలు పార్టీ ప్రాతిపదికన జరిగేవి కాదు. ఈ ఎన్నికలలో పార్టీ ప్రమేయం అనేది ఉండనే ఉండదు. పార్టీలు, జెండాలు, గుర్తులు ఇవేవీ పంచాయతీ ఎన్నికలలో కనిపించవు. కనిపించకూడదు. అయినా, వాపుచూసి బలుపనుకుంటున్నారో ఏమో గానీ, ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అద్భుత పాలనను చూసి ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టారని అధికార పార్టీ నాయకులు ముఖ్యమంత్రిని భ్రమల్లో ముంచెత్తు తున్నారు. నిజానికి స్థానిక సంస్థల ఎన్నికలలో ఘనవిజయం సాధించిన తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విఫలమైన అనుభవం అన్ని పార్టీలకు, మరీ ముఖ్యంగా వైకాపాకు ఉంది.

ఇక ప్రతిపక్ష పార్టీలు పంచాయతీ ఎన్నికల్లో అనేక అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్నాయి. అది సహజం అని అనుకున్నా.. చిత్రంగా ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం ఓ వైపు ఈ ఎన్నికలతో వైసీపీ పతనం ప్రారంభమైందని అంటూనే మరోవైపు ఎన్నికల అక్రమాలపై ఇటు రాష్ట్ర ఎన్నికల సంఘానికి, అటు కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదులు చేస్తోంది. టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏకంగా రాష్ట్రపతి రామనాథ్‌ ‌కోవింద్‌, ‌కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు లేఖలు రాశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతోందని కేంద్ర అధికారులు, బలగాలతో స్థానిక ఎన్నికలు నిర్వహించాలని కేంద్రాన్ని కోరారు.

తాను అధికారంలో ఉన్నప్పుడు  రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ సంస్థలు కాలే పెట్టరాదన్న చంద్రబాబు ఇప్పుడు ఏకంగా కేంద్రమే పంచాయతీ ఎన్నికలను నిర్వహించాలని గొప్ప ‘యూటర్న్’ ‌నిర్ణయం తీసుకున్నారు.

మరోవైపు బీజేపీ, జనసేన పార్టీలు కూడా ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, జరుగుతూనే ఉన్నాయని ఆరోపిస్తున్నాయి. ‘ఆంధప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలు ఏకపక్షంగా, ప్రజాస్వామ్య విరుద్ధంగా జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం, పోలీసు వ్యవస్థ పనిచేస్తున్న తీరు తీవ్ర అభ్యంతకరంగా ఉంది. ఎన్నికల్లో పోలీసు, రెవెన్యూ, పంచాయతీరాజ్‌శాఖ అధికారులు, ఉద్యోగులు ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయాన్ని మేం కేంద్ర హోం మంత్రి దృష్టికి తీసుకుపోతాం’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. అలాగే, పంచాయతీ ఎన్నికలు ప్రజాస్వామ్యాన్ని అవమానపరిచే విధంగా సాగుతున్నాయని జనసేన నాయకులు పవన్‌ ‌కల్యాణ్‌, ‌నాదెండ్ల మనోహర్‌ ఆరోపించారు. ఇదే విషయాన్ని కేంద్రం దృష్టికి కూడా తీసుకెళ్లారు.

సుమారు సంవత్సరం పాటు సాగిన ఏపీ పంచాయతీ ఎన్నికల ప్రహసనం చివరి అంకంలో కేంద్రం కోర్టుకు చేరింది. అయితే, వాస్తవంగా చూస్తే ఇందులో కేంద్ర జోక్యం చేసుకునే అవకాశం గానీ, అవసరం గానీ లేవని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. నిజానికి, మరో రెండు వారాలు గడిచి, మిగిలిన రెండు విడతల క్రతువు పూర్తయితే, ఇక ఆ తర్వాత పంచాయతీ ఎన్నికల పంచాయతీ మరుగున పడిపోయి, మరో కొత్తవివాదం తెర మీదకు వస్తుంది. ఇంచుమించుగా గత రెండేళ్లుగా సాగుతున్న ప్రాంతీయ పార్టీల తీరు చూసిన ఎవరికైనా ఇది అర్థమవుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అంతేకాదు ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు, రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభం, మత పరంగా రగులుతున్న చిచ్చు, క్రైస్తవీకరణ వంటి కీలక అంశాలు ఎన్నికల సందర్భంగా చర్చకు రాకుండా అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల కమిషన్‌ను అడ్డుపెట్టుకుని షాడో బాక్సింగ్‌ ‌చేశాయనే అభిప్రాయం కూడా లేకపోలేదు.

ఎన్నికల క్రతువు ఇలా సాగుతున్న సమయంలోనే రాష్ట్రానికి సంబంధించిన మరో కీలక అంశం కేంద్రం దృష్టికి చేరింది. అధికార పార్టీ అసమ్మతి నాయకుడు, నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాజధాని మార్పు మొదలు విశాఖ స్టీల్‌ ‌ప్లాంట్‌ ‌ప్రైవేటీకరణ, దేవాలయాలపై దాడులు ఇలా అనేక విషయాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. హిందూ దేవుళ్లపై పాస్టర్‌ ‌ప్రవీణ్‌ ‌వ్యాఖ్యలు, అరెస్టుతో పాటు దళితులు.. క్రైస్తవులుగా మారి ఎస్సీ రిజర్వేషన్లు పొందుతుడడం వంటివి వివరించినట్లు చెప్పారు. రాష్ట్రంలో సాగుతున్న మతమార్పిడులపై ప్రధాన మంత్రికి 25 పేజీల నోట్‌ను కూడా అందించారు.

కొన్ని గ్రామాల్లో అధికారికంగా ఒక్క క్రిస్టియన్‌ ‌లేకపోయినా, పదుల కొద్దీ చర్చిలు ఉన్నాయని వివరించినట్లు పేర్కొన్నారు. అయితే అన్ని విషయాలను సావదానంగా విన్న ప్రధానమంత్రి, రాష్ట్రంలో చర్చిల నిర్మాణాలకు ప్రభుత్వం టెండర్లు పిలవడానికి సంబంధించి మరిన్ని వివరాలను కోరినట్లు స్వయంగా కృష్ణంరాజు చెప్పారు. ఈ విషయాలను తెలియచేసే సమయంలో ప్రధానమంత్రి ‘చర్చిల నిర్మాణానికి టెండర్లా?’ అని ఆశ్చర్యానికి గురయ్యారని, ప్రభుత్వమే టెండర్లు పిలవడం ఎలా సాధ్యమని మోదీ అన్నారని రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి ప్రధానమంత్రి కోరిన విధంగా మరిన్ని వివరాలను త్వరలోనే ప్రధానమంత్రి కార్యాలయానికి అందచేస్తానని కృష్ణంరాజు తెలిపారు.

నిజానికి, పంచాయతీ ఎన్నికల అక్రమాల కంటే కూడా, రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అండతో సాగుతున్న మత మార్పిడులు, దీర్ఘ కాలంలో సమాజంపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉంది. ఇప్పటికే, అడిగేవారు లేరన్నట్లుగా ప్రభుత్వం, మరెక్కడా లేనివిధంగా చర్చిల నిర్వహణ (పాస్టర్లకు జీతాలు) నిర్మాణం కోసం ప్రభుత్వ (టెండర్లు) సొమ్మును యథేచ్చగా ఖర్చు చేస్తోంది. కాబట్టి, కేంద్ర ప్రభుత్వం కృష్ణంరాజు ఫిర్యాదుపై స్పందించి చర్యలు తీసుకోవలసిన అవసరం ఉంది.

మరోవైపు రాజమహేంద్రవరం సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో స్వామివారి విగ్రహ ధ్వంసంపై విచారణ జరిపిన స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ ‌టీమ్‌ (‌సిట్‌) ‘‌చక్కని’ తీర్పును ఇచ్చింది. విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేయలేదని, హిందూ బంధువు లకు క్రైస్తవ సోదరులు ఇచ్చిన నూతన సంవత్సర కానుక కానే కాదని.. ఆలయ పూజారి ఎం. వెంకట మురళీకృష్ణ, ఆయన సోదరుడు, మరో వ్యక్తి ఈ పనికి పాల్పడ్డారని సిట్‌ ‌తేల్చేసింది. ఆ వెంటనే పూజారిని, మరో ఇద్దరినీ పోలీసులు అరెస్ట్‌చేసి రాజమండ్రి సెంట్రల్‌ ‌జైలుకు పంపారు. ఇంకా నయం, స్వామి వారే స్వయంగా తల నరుక్కున్నారని ‘సిట్‌’ ‌చెప్పకపోవడం సంతోషించవలసిన విషయం. అయితే, సిట్‌ ‌తన నివేదికలో పూజారి డబ్బుకు ఆశపడి ఈ పని చేశారని పేర్కొంది. కానీ, పూజారికి డబ్బు ఎర వేసింది ఎవరు? అనేది మాత్రం పట్టించుకోలేదు.అదీ విషయం. సిట్‌ ఎం‌త చక్కగా పనిచేసిందో, ప్రభుభక్తిని ఏ విధంగా రుజువు చేసుకుందో వేరే చెప్పనవసరం లేదు.

రాష్ట్రంలో ఎన్నికల క్రతువు సాగుతున్న సమయం లోనే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వివాదం కూడా తెరమీదకు వచ్చింది. నిజానికి, దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుందా, లేదా? అనే విషయంలో స్పష్టత లేదు. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌, ‌ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఇలా అనుకుంటే అలా అయిపోయే పక్రియ కాదని, అందుకు ఆచితూచి అడుగులు వేయవలసి ఉంటుందని, అలా వేసే ప్రతి అడుగులో అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అలాగే, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ కూడా ఇందుకు సంబంధించి పునరాలోచన చేయాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. మరోవైపు ఆందోళన జీవులు వీధుల కెక్కి వీరంగం వేస్తున్నారు. ఢిల్లీ తమాషా ముగింపుకు చేరుకుంటున్న నేపథ్యంలో ఆందోళన జీవులు విశాఖను తదుపరి వేదిక చేసుకునే ప్రయత్నం చేసినా చేయవచ్చు. అయితే, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయంతో ప్రభుత్వ, ప్రైవేటురంగ సంస్థల పనితీరు, మంచిచెడుల మీద విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఈ మొత్తం వ్యవహారంలో ఇదొక శుభ పరిణామం. వీటన్నిటినీ గమనిస్తే ఆంధప్రదేశ్‌లో జరుగుతున్న పరిణామాల విషయంలో కేందప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టవలసిన సమయం ఆసన్నమైందనిపిస్తోంది. అయితే ఇప్పటికిప్పుడు కేంద్రం జోక్యం చేసుకుంటుందా, లేదా వేచి చూడాలి.

– రాజనాల బాలకృష్ణ, సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE