మయన్మార్‌కు మిలటరీ పాలన కొత్తేమీ కాదు. దశాబ్దాల తరబడి ఈ ఆగ్నేయాసియా దేశం సైనిక పదఘట్టనల కింద నలిగిపోయింది. ఏడు దశాబ్దాలకు పైగా ప్రస్థానంలో అప్పు డప్పుడూ ప్రజాస్వామ్య ప్రభుత్వాలు అధికారం చేపట్టినప్పటికీ అవి పూర్తిగా సైన్యం కనుసన్న ల్లోనే పనిచేశాయి. అవి అర్ధాయుష్క, అల్పాయుష్క ప్రభుత్వాలే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మయన్మార్ ప్రజలకు ప్రజాస్వామ్యం కలగానే మిగిలిపోతోంది. ఒకప్పుడు బర్మాగా అంతర్జాతీయ సమాజానికి సుపరిచితమైన ప్రస్తుత మయన్మార్‌లో ఆందోళనలను అణచివేసేందుకు సైన్యం సన్నద్ధంగా ఉంది. సైనిక పాలకులు యావత్ దేశాన్ని తమ గుప్పెట్లో పెట్టుకున్నారు. మయన్మార్‌లో మెజారిటీ ప్రజలు బౌద్ధమతాన్ని ఆచరిస్తారు. క్రైస్తవ, ముస్లిం, హిందూ మతాల ప్రజలు ఉన్నప్పటికీ వారి సంఖ్య నామ మాత్రమే. భారత్‌తో దాదాపు 1468 కిలో మీటర్ల సరిహద్దులను పంచుకుంటోంది. అందువల్ల మయన్మార్ పరిణామాలను భారత్ విస్మరించజాలదు.
అధికార నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ (ఎన్‌ఎల్‌డీ) అధినేత అంగ్ సాన్ సూకీ, దేశ అధ్యక్షుడు విన్ మింట్ సహా ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకులను సైన్యం అనూహ్యంగా నిర్బంధించింది. ఎంపీలనూ అరెస్టు చేసింది. ఏడాదిపాటు అత్యవసర పరిస్థితిని విధించింది. దేశ రాజధాని నేపిడా నగరం సహా దేశవ్యాప్తంగా మొబైల్, అంతర్జాలసేవలను నిలిపివేసింది. టెలివిజన్ ప్రసారాలను నిషేధించింది. విమానాశ్రయాలను మూసివేసింది. ట్విటర్, ఇన్‌స్టాగ్రమ్ వంటి సమాచార సాధనాలపై వేటు వేసింది. సైన్యం దాష్టీకాన్ని మయన్మార్ ప్రజానీకం నిరసిస్తోంది. రోడ్లపైకి వచ్చింది. మిలటరీ నిరంకు శత్వం నశించాలంటూ నినదిస్తోంది. చేతికి గల అయిదు వేళ్లలో బొటన వేలు, చిటికెన వేలు మడిచి మిగిలిన మూడు వేళ్లను పైకెత్తి చూపుతూ రాజధాని నేపిడా, యాంగూన్ నగరాల్లో ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. పొరుగున ఉన్న థాయ్‌లాండ్‌లో నిరసన వ్యక్తం చేయడానికి ప్రజలు ఈ పద్ధతిని పాటిస్తారు. యాంగూన్‌గా రూపాంతరం చెందిన రంగూన్ ఒకప్పటి దేశ రాజధాని. ఇది దేశంలోనే అతిపెద్ద నగరం. 1989 ప్రాంతంలో నాటి సైనిక పాలకులు బర్మాను మయన్మార్‌గా, నాటి రాజధాని నగరం రంగూన్‌ను యాంగూన్‌గా మార్చారు.
సూకీ అరెస్ట్ అనంతరం ఉపాధ్యక్షుడు మయింట్ స్వెని తాత్కాలిక అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఆయన వెంటనే సైన్యాధిపతి మిన్ అంగ్ లయాంగ్‌కు సర్వాధికారాలను బదలాయించారు. అత్యవసర పరిస్థితుల్లో అధికారాల బదలాయింపునకు రాజ్యాంగం అనుమతిస్తుంది. అధికారాలు దఖలు పడిన వెంటనే లయాంగ్ 11 మంది మాజీ సైనికాధి కారులతో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసినట్లు సైన్యం ఆధీనంలోని ‘మ్యావద్దీ’ టెలివిజన్ ప్రకటించింది.
ఎన్నికల అనంతరం పార్లమెంటు తొలి సమావేశం జరగనున్న ఈనెల ఒకటో తేదీ తెల్లవారుజామున సైన్యం తిరుగుబాటు చేయడం గమనార్హం. మూడు నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో ఓటర్ల జాబితాలో భారీగా అక్రమాలు జరిగాయని, అందుకే అనివార్యంగా ముందుకు వెళ్లినట్లు సైన్యం బుకాయిస్తోంది. అక్రమాలు జరగలేదని ఓ పక్క ఎన్నికల సంఘం నిర్దిష్టంగా చెబుతున్నా వినిపించుకునే పరిస్థితిలో లేదు సైన్యం. ఏడాదిపాటు అత్యవసర పరిస్థితి కొనసాగుతుందని, తరువాత ఎన్నికలు నిర్వహించి విజేతలకు అధికారం అప్పగిస్తామని సైన్యాధిపతి చిలకపలుకులు పలుకుతున్నారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అధికారాన్ని హస్తగతం చేసుకునే అవకాశం రాజ్యంగంలోని కొన్ని నిబంధనలు తమకు కల్పించాయని సైన్యం అడ్డంగా వాదించింది. దేశాన్ని, సైన్యాన్ని విడదీసి చూడలేమని పేర్కొంది. సైన్యం తిరుగుబాటును రాజ్యాంగ వ్యతిరేక చర్యగా అంగ్ సాన్ సూకీ అభివర్ణించారు. ఆమె మొన్నటిదాకా స్టేట్ కౌన్సిలర్ హోదాలో ఉన్నారు. ఈ పదవి భారత్‌లో ప్రధాని పదవికి సరిసమానమైనది. విదేశీ వ్యక్తిని వివాహమాడిన మహిళ ప్రధాని పదవి చేపట్టడానికి వీల్లేదంటూ సైనిక పాలకులు రాజ్యాంగానికి చేసిన సవరణ కారణంగా ఆమె స్టేట్ కౌన్సిలర్ పదవి చేపట్టాల్సి వచ్చింది.
గత ఏడాది నవంబరులో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో సూకీ నాయకత్వంలోని నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ (ఎన్‌ఎల్‌డీ) మొత్తం 476కు గాను 396 సీట్లతో ఘన విజయం సాధించడం సైన్యానికి కంటగింపుగా మారింది. అదే సమయంలో సైన్యం మద్దతు గల ప్రతిపక్ష యూనియన్ సాలిడారిటీ అండ్ డెవలప్‌మెంట్ పార్టీ కేవలం 33 సీట్లు సాధించి ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఆ పార్టీ పూర్తిగా ప్రజల తిరస్కారానికి గురైంది. ఇది సైన్యానికి ఇబ్బందిగా మారింది. ప్రజల మద్దతు గల సూకీ వచ్చే అయిదేళ్లలో మరింత ప్రజాభిమానం పొంది పాతుకుపోతారని, అప్పుడు ఆమెను ఏమీ చేయలేమన్న అభిప్రాయానికి సైన్యం వచ్చింది. అందువల్ల ఆమెను కట్టడి చేయడానికి ఇదే సరైన సమయమన్న నిర్ణయానికి వచ్చింది. ఇందులో భాగంగానే తిరుగుబాటుకు పాల్పడింది. ప్రస్తుత సైన్యాధిపతి ఈ ఏడాది జులైలో పదవీ విరమణ చేయాల్సి ఉంది. ఈలోగానే తిరుగుబాటు చేసి అధికారాన్ని హస్తగతం చేసుకుంటే తనకు తిరుగుండదని భావించి ఈ దారుణానికి పాల్పడ్డారు.
మయన్మార్‌లో చోటుచేసుకున్న పరిణామాలను అంతర్జాతీయ సమాజం ఖండించింది. ఐరాస సహా అనేక పాశ్చాత్య దేశాలు సైన్యం చర్యను తప్పుబట్టాయి. మయన్మార్‌లోని ఐరాస ప్రత్యేక రాయబారి క్రిస్టినీ షార్నర్ బర్గనర్ సైనిక పాలకులతో చర్చలు జరిపినా పెద్దగా ఫలితం లేకపోయింది. గత నెలలో బాధ్యతలు చేపట్టిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తదితర దేశాల అధినేతలు ఆందోళన వ్యక్తం చేశారు. కఠిన ఆంక్షలు విధిస్తామని అగ్రరాజ్యాధినేత బైడెన్ హెచ్చరించారు. నిర్బంధించిన నేతలను విడుదల చేయాలని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ కోరారు. మయన్మార్‌కు మిత్రదేశమైన చైనా మాత్రం నంగినంగిగా మాట్లాడింది. అది ఆ దేశ అంతర్గత వ్యవహారమని, అక్కడి రాజకీయ పరిస్థితుల్లో వచ్చిన మార్పుగానే ఈ ఘటనను చూడాలంటూ వక్రభాష్యం చెప్పింది. కంబోడియా, థాయ్‌లాండ్, ఫిలిప్పైన్స్ వంటి సరిహద్దు దేశాలు సైతం అది ఆ దేశ అంతర్గత వ్యవహారమంటూ దూరం పాటించాయి. ఐక్యరాజ్య సమితి మాత్రం ఎప్పటిలాగే ఖండనలు, వినతులకే పరిమితమైంది. ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ఘటనను తీవ్రంగా ఖండించారు. నేతలను నిర్బంధం నుంచి విడుదల చేయాలని, ప్రజాస్వామ్య పక్రియను తక్షణమే పునరుద్ధరించాలని భారత్ కోరింది.
మయన్మార్ మొదటినుంచీ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సైన్యం కనుసన్నల్లోనే నడుస్తోంది. మధ్యమధ్యలో ప్రజా ప్రభుత్వాలు కొలువుదీరినా అవి ఎంతకాలం మనుగడ సాగిస్తాయో ఎవరికీ తెలియని పరిస్థితి. ఫలితంగా మయన్మార్ ప్రజాస్వామ్య దేశం బదులు సైనికస్వామ్య దేశంగా మారింది. 1948లో బ్రిటన్ నుంచి స్వాతంత్య్రం పొందిన మయన్మార్‌లో పుష్కర కాలానికే 1962లో సైనిక తిరుగుబాటు జరిగింది. 1988లో స్వదేశానికి వచ్చిన సూకీ సైన్యానికి వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించింది. దీంతో ఆమెను మరుసటి ఏడాది గృహ నిర్బంధానికి తరలించారు. 1990 ఎన్నికల్లో సూకీ సారథ్యంలోని ఎన్‌ఎల్‌డీ ఘన విజయం సాధించినప్పటికీ అధికారాన్ని అప్పగించేందుకు సైన్యం తిరస్క రించింది. దేశంలో ప్రజాస్వామ్యం కోసం సూకీ చేసిన అలుపెరగని పోరాటానికి గుర్తింపుగా 1991లో నోబెల్ శాంతి బహుమతి వరించింది. చివరికి 2010లో నిర్బంధం నుంచి ఆమెకు విముక్తి లభించింది. 2015 నాటి ఎన్నికల్లో సూకీ పార్టీ ఘన విజయం సాధించినప్పటికీ అధికారం అప్పగించేందుకు సైన్యం ససేమిరా అంది. మధ్యే మార్గంగా ఆమె స్టేట్ కౌన్సిలర్‌గా ఉంటూ సర్కారును నడిపేందుకు అనుమతిచ్చింది. 2017లో సైన్యం అవుట్ పోస్టులపై తీవ్రవాదులు దాడులు చేశారు. దీనికి ప్రతిగా రఖైనా రాష్ట్రంలోని రోహింగ్యా ముస్లింలపై దాడులకు దిగింది. దీంతో వారు బంగ్లాదేశ్‌కు తరలిపోయారు. ఇంత జరిగినా రోహింగ్యాల విషయంలో సైన్యం తప్పేమీ చేయలేదని సూకీ 2019లో అంతర్జాతీయ కోర్టులో సమర్థించారు. ఇది వివాదాస్పదమైంది. మానవ హక్కులు, ప్రజాస్వామ్యం కోసం దశాబ్దాల తరబడి పోరాటం చేసిన సూకీ వాస్తవాలను విస్మరించారన్న విమర్శలను ఎదుర్కొన్నారు. దీంతో అంతర్జాతీయంగా అప్పటివరకు ఆమెకు గల పేరు, ప్రతిష్ఠలు దెబ్బతిన్నాయి. వాస్తవానికి సూకీ అభిప్రాయం అది కాదని, మిలటరీ మద్దతు కోసం అనివార్యంగా మనసు చంపుకుని మాట్లాడారన్న అభిప్రాయం అప్పట్లో వ్యక్తమైంది. అనంతరం గత ఏడాది నవంబరులో జరిగిన ఎన్నికల్లో మయన్మార్ ప్రజలు మరోసారి సూకీకి అధికారం అప్పగించి ఆమె పట్ల పూర్తి విశ్వసనీయతను కనబరిచారు.
ఇండోనేసియా, బంగ్లాదేశ్, చైనా, లావోస్, థాయ్‌లాండ్, భారత్ సరిహద్దులు గల మయన్మార్ ఆసియాన్ (అసోసియేషన్ ఫర్ సౌత్ ఈస్ట్ ఆసియన్ నేషన్స్) సభ్యత్వ దేశం. అయిదుకోట్లకు పైగా గల జనాభా, సువిశాలమైన తీరప్రాంతం గల దేశంలో సహజ వనరులకు లోటులేదు. పంటలు విస్తారంగా పండుతాయి. ఆసియాలో పదో పెద్దదేశం. ఈశాన్య భారతంలోని మిజోరామ్, మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు మయన్మార్‌తో సరిహద్దులు కలిగి ఉన్నాయి. మయన్మార్ వెళ్లడానికి ఈశాన్య భారతం గేట్ వే లాంటిది. మణిపూర్‌లోని మోరె, అరుణాచల్‌ప్రదేశ్‌లోని డిపుపాస్, మిజోరామ్ లోని జోరిన్‌పుయి వద్ద ఉభయదేశాల చెక్ పోస్టులు ఉన్నాయి. ముఖ్యంగా మణిపూర్ రాష్ట్రంలోని మోరె మయన్మార్‌కు సమీపంలో ఉంది. మయన్మార్ పరిణామాలను న్యూఢిల్లీ నిశితంగా గమనిస్తోంది. అక్కడి భారతీయులకు అనేక జాగ్రత్తలు, సూచనలు చేసింది. గత కొన్నేళ్లుగా మయన్మార్ పూర్తిగా చైనా వైపు మొగ్గు చూపుతోంది. భారత వ్యతిరేకతను విధానంగా మార్చుకున్న చైనా సహజంగానే మయన్మార్‌ను వెనకేసుకు వస్తోంది. ఈశాన్య భారతంలోని కొన్ని తీవ్రవాద, వేర్పాటువాద సంస్థలకు గతంలో మయన్మార్ స్వర్గధామంగా ఉండేది. మయన్మార్ కేంద్రంగా ఆయా సంస్థలు ఈశాన్య రాష్ట్రాల్లో శాంతిభద్రతలకు తరచూ విఘాతం కలిగించేవి. అవాంఛనీయ ఘటనలకు పాల్పడేవి. అసోంను ప్రత్యేక దేశంగా ప్రకటించాలని దశాబ్దాలుగా డిమాండ్ చేస్తోన్న ఉల్ఫా (యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోం) మయన్మార్ కేంద్రంగా కొంతకాలం తీవ్రవాద కార్యకలాపాలు సాగించింది. భారత్‌ను వ్యతిరేకించే చైనా ఈశాన్య భారతంలో అశాంతికి పరోక్షంగా మయన్మార్‌ను వాడుకునేది. తరవాతి రోజుల్లో మయన్మార్ తన విధానాన్ని మార్చుకుంది. తన భూభాగంలో తీవ్రవాద సంస్థలకు ఆశ్రయం ఇవ్వడానికి నిరాకరించింది. అంతేకాక ఉగ్రవాద కార్యకలాపాలను అణచివేసేందుకు భారత్‌తో చేయి కలిపింది. ఒక సమీప పొరుగు దేశంగా మయన్మార్‌లో ప్రశాంత పరిస్థితులు నెలకొనాలని, సూకీని నిర్బంధం నుంచి తక్షణం విడుదల చేయాలని కోరుకుంటోంది. అదేవిధంగా అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా వీలైనంత త్వరలో అక్కడ ప్రజా ప్రభుత్వం కొలువుదీరాలనీ ఆశిస్తోంది.
– గోపరాజు విశ్వేశ్వరప్రసాద్, సీనియర్ జర్నలిస్ట్