ఎన్నికల పక్రియ ముగిసి ఫలితాలు ప్రకటించిన రెండు నెలల, ఏడు రోజుల తర్వాత గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు ఎన్నికైన కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేశారు. అదేరోజు జీహెచ్‌ఎంసీ మేయర్ ఎన్నిక కూడా పూర్తయింది. ఫలితాలు ప్రకటించిన తర్వాత ప్రమాణస్వీకారానికి, మేయర్ ఎన్నికకు ఇంతకాలం సమయం తీసుకోవడం చాలా అరుదైన పరిణామం. ప్రిసైడింగ్ అధికారి కలెక్టర్ శ్వేతా మహంతి కార్పొరేటర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం ముగియగానే మేయర్ ఎన్నిక కోసం ప్రకటన చేశారు. మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు మేయర్ ఎన్నిక జరుగుతుందని ప్రకటించారు. దీంతో, కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారోత్సవానికి, మేయర్ ఎన్నికకు మధ్య సరిగ్గా గంట సమయం దొరికింది. ఆ సమయంలోనే అసలు వ్యవహారం నడిచింది. టీఆర్‌ఎస్ అభ్యర్థి మేయర్‌గా ఎన్నికయ్యేందుకు అవసరమైన వ్యూహాలు, ఒప్పందాలు ఖరారయ్యాయి.
వాస్తవానికి జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మేయర్ పదవిని దక్కించుకునేందుకు అవసరమైన మేజిక్ ఫిగర్ ఏ పార్టీకీ రాలేదు. మొత్తం 150 డివిజన్ల లెక్కన చూస్తే.. మేయర్ పీఠాన్ని చేజిక్కించుకునేందుకు అవసరమైన మేజిక్ ఫిగర్ 76. ఎక్స్ అఫీషియో సభ్యులను కలుపుకుంటే అది 102. కానీ, ఆ మేజిక్ ఫిగర్లు అందుకునే స్థానాలు ఒంటరిగా ఏ పార్టీ దక్కించుకోలేదు. దీంతో, ఈ రెండు నెలల కాలంలో రకరకాల ఊహాగానాలు వినిపించాయి. అనేక రకాల ప్రచారాలు జరిగాయి. పలు పుకార్లు షికార్లు చేశాయి. చివరకు మేయర్, డిప్యూటీ మేయర్ పీఠాలను టీఆర్‌ఎస్ కైవసం చేసుకుంది. ఆ పార్టీ తరఫున బంజారాహిల్స్ డివిజన్ నుంచి ఎన్నికైన గద్వాల విజయలక్ష్మికి మేయర్ కుర్చీ దక్కింది. తార్నాక డివిజన్ నుంచి గెలుపొందిన మోతె శ్రీలతా డిప్యూటీ మేయర్‌గా ఎన్నికయ్యారు.
గద్వాల విజయలక్ష్మి టీఆర్‌ఎస్ సెక్రెటరీ జనరల్ కె.కేశవరావు కుమార్తె. ఆమె కార్పొరేటర్‌గా ఎన్నికవడం ఇది రెండోసారి. శ్రీలతారెడ్డి కూడా రెండోసారి కార్పొరేటర్ పదవి చేజిక్కించుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు విజయలక్ష్మి తండ్రి కేశవరావు అత్యంత ఆప్తుడిగా పేరొందారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కేశవరావు కుమార్తెకు కేసీఆర్ తనకున్న సాన్నిహిత్యం మేరకు మేయర్ పదవిని కట్టబెట్టారు. మోతె శ్రీలత భర్త రంజిత్‌రెడ్డి కేసీఆర్‌కు, కేటీఆర్‌కు ఆప్తుడిగా పేరుంది. అందుకే వీళ్లిద్దరికీ జీహెచ్‌ఎంసీ ముఖ్య పదవులు దక్కాయని చెబుతున్నారు.
మేయర్ ఎన్నికకు సంబంధించి చాలా రోజులుగా ఉత్కంఠ నెలకొంది. మేయర్‌గా ఏ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తారు? ఎవరెవరు వెనక్కి తగ్గుతారన్న విషయంలో చాలా చర్చ జరిగింది. తెలంగాణ రాష్ట్రసమితి మొదటినుంచీ మేయర్, డిప్యూటీ మేయర్ స్థానాలు దక్కించుకునేందుకు తనదైన వ్యూహాలు అనుసరించింది. ఎవరిని పోటీకి దించుతారో అనే విషయంలో స్పష్టత ఇవ్వకున్నా.. అత్యంత పకడ్బందీగా వ్యూహాలను నడిపించింది.
భారతీయ జనతాపార్టీ మేయర్ ఎన్నిక బరిలో ఉంటుందా? ఉండదా? అనే అంశంలోనూ తీవ్ర చర్చ జరిగింది. కానీ, ఆ పార్టీ కూడా మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు పోటీ చేస్తామని ప్రకటించింది. ఈ ప్రకటన తర్వాత అందరి దృష్టి ఎంఐఎం మీదకు మళ్లింది. ఎంఐఎం పోటీ చేస్తుందా? లేదంటే టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇస్తుందా? కాదంటే.. సమావేశానికి గైర్హాజరై పరోక్షంగా టీఆర్‌ఎస్‌కు సహకరిస్తుందా? అనే విశ్లేషణలు కొనసాగాయి. అయితే, ఎంఐఎం కూడా రెండు రోజుల ముందు మేయర్ స్థానానికి పోటీ చేస్తామని ప్రకటించింది. ఈ మూడు ప్రధాన పార్టీలు మేయర్ ఎన్నికకు తప్పక హాజరు కావాలంటూ తమ సభ్యులకు విప్‌లు కూడా జారీచేశాయి.
మేయర్ ఎన్నిక రోజు అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. జీహెచ్‌ఎంసీ మేయర్‌గా ఎన్నికైన అభ్యర్థిని ప్రిసైడింగ్ అధికారి ప్రకటించగానే సభలో ‘భారత్‌మాతాకీ జై’ అంటూ బీజేపీ కార్పొరేటర్లు, ఎక్స్అఫీషియో సభ్యులు పెద్ద పెట్టున నినదించారు. గెలిచింది టీఆర్‌ఎస్ అభ్యర్థి. కానీ నినదించింది మాత్రం బీజేపీ సభ్యులు. అయితే దీని వెనక కారణం లేకపోలేదు. జనం మధ్య ఓ తీరుగా, నాలుగ్గోడల మధ్య ఇంకో తీరుగా వ్యవహరించిన రెండు పార్టీల (ఎంఐఎం, టీఆర్‌ఎస్) రహస్య వ్యూహం బయట పడిందని, టీఆర్‌ఎస్ భాగోతం బట్టబయలయిందని, ఎంఐఎం కుటిలబుద్ధి తేటతెల్లమయిందని.. అందుకే భారత్‌మాతాకీ జై అంటూ నినాదాలు చేశామని చెప్పారు.
మేయర్ ఎన్నికకు ముందు తాము కూడా పోటీలో ఉంటామని ఎంఐఎం ప్రకటించింది. అందరూ అదే జరుగుతుందని ఊహించారు. ఎందుకంటే మేయర్ ఎన్నిక జరిగే రోజు ఉదయాన్నే దారుస్సలాంలో ఎంఐఎం తరపున విజయం సాధించిన కార్పొరేటర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఉదయం తొమ్మిది గంటల నుంచి పది గంటల దాకా కొత్త కార్పొరేటర్లు సభలో అనుసరించాల్సిన వ్యూహం గురించి చర్చించారు. అంటే, ఎంఐఎం పోటీ చేస్తున్నందున సభ్యులందరికీ అవగాహన కల్పించారని, తమ పార్టీ తరపున పోటీచేసే అభ్యర్థులు ఎవరో ప్రకటించి ఉంటారని అందరూ భావించారు. కానీ, కథ అడ్డం తిరిగింది. సభలో ఎంఐఎం తరపున అభ్యర్థిని పోటీలో నిలబెట్టలేదు. అంతేకాదు, టీఆర్‌ఎస్ అభ్యర్థికి మద్దతు తెలుపుతూ ఎంఐఎం సభ్యులు, ఎక్స్అఫీషియో మెంబర్లు అందరూ చేతులెత్తారు.
మేయర్ ఎన్నిక పూర్తయిన తర్వాత టీఆర్‌ఎస్, ఎంఐఎం పొత్తు గురించి గానీ, మేయర్ ఎన్నికలో సహకారానికి సంబంధించిన విషయం గురించి గానీ ఆ పార్టీలు నోరు మెదపలేదు. కానీ, బీజేపీకి మరో అస్త్రం దొరికింది. ఎన్నికల సమయంలో, ప్రచారంలో పచ్చి అబద్ధాలు చెప్పిన టీఆర్‌ఎస్, ఎంఐఎం అసలు రూపమేంటో జీహెచ్‌ఎంసీ సాక్షిగా బయటపడిందని ఆ పార్టీ విమర్శించింది.
జీహెచ్‌ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్లుగా గెలుపొందన టీఆర్‌ఎస్ అభ్యర్థులకు ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ ట్విట్టర్‌లో శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాదు, తాము మేయర్ అభ్యర్థికి మద్దతు ఇస్తే డిప్యూటీ మేయర్‌గా తమకు అవకాశం ఇస్తామని టీఆర్‌ఎస్ పార్టీ ఆఫర్ ఇచ్చిందని, ధన్యవాదాలంటూ అసద్ ట్వీట్ చేశారు. దీంతో రెండు పార్టీల లోపాయికారీ ఒప్పందం బట్టబయలయింది.
జీహెచ్‌ఎంసీ ఎన్నికల పర్వం మొదలుకొని నామినేషన్ల దాఖలు, ప్రచారం, పోలింగ్ ఘట్టాలు అన్నింటిలోనూ టీఆర్‌ఎస్, ఎంఐఎం విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకున్నాయి. ఎవరికి వారు ఒంటరిగానే పోటీ చేస్తున్నామని ప్రకటించాయి. ఎంఐఎం మద్దతు తీసుకోవడం లేదని టీఆర్‌ఎస్, టీఆర్‌ఎస్ మద్దతు తీసుకోవడం లేదని ఎంఐఎం బాహాటంగా ప్రకటనలు చేశాయి. అంతేకాదు, టీఆర్‌ఎస్, ఎంఐఎం నాయకులు ఒకరిపై ఒకరు అనుచిత వ్యాఖ్యలు, సవాళ్లు, ప్రతి సవాళ్లు కూడా విసురుకున్నారు. కానీ, సమావేశ మందిరానికి మాత్రం రెండు పార్టీలు తమ ముసుగులను బయటే వదిలేసి వచ్చాయి. రెండు పార్టీలూ అలయ్ బలయ్ అని ఉమ్మడిగా చేతులెత్తాయి. తమ రహస్య అంగీకారాన్ని సమయం చూసి, ఎన్నిక సమయంలో బయటపెట్టుకున్నాయి.
ఎన్నికల ప్రచార సమయంలో ఎవరికి వారే అన్నట్లుగా నమ్మించిన టీఆర్‌ఎస్, ఎంఐఎం తమ అసలు వైఖరులను కప్పిపుచ్చుకున్నాయి. ఫలితంగా రెండు పార్టీలు వేర్వేరుగా తమ ఇలాకాల్లో, ఆయా ప్రాంతాల్లో గెలుపొందాయి. అయినా, అధికార టీఆర్‌ఎస్ చావుతప్పి కన్ను లొట్టపోయిన చందంగా బలవంతంగా తన ప్రాభవాన్ని కాపాడుకుంది. పరువు దక్కించుకుంది. ఎంఐఎంది కూడా అదే పరిస్థితి. ఇక భారతీయ జనతా పార్టీ ఊహించని రీతిలో స్థానాలను గెలుచు కుంది.
బయటపడిన రహస్య ఒప్పందం: సంజయ్
టీఆర్‌ఎస్-ఎంఐఎంల రహస్య ఒప్పందం మరోసారి బహిర్గతమయిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారం సమయంలో బీజేపీ చెప్పిన విషయమే మేయర్ ఎన్నిక సమయంలో తేటతెల్ల మైందని తెలిపారు. టీఆర్‌ఎస్ – ఎంఐఎం చీకట్లో ప్రేమించు కుంటూ బయటకు వేర్వేరు అని అబద్ధాలు చెప్పాయని.. రెండు కలిసి పోటీ చేస్తే సింగిల్ డిజిట్ కూడా వచ్చేది కాదన్నారు. టీఆర్‌ఎస్ పక్కా మతతత్వ పార్టీ అయిన ఎంఐఎంకు చెంచా అని విమర్శించారు. జీహెచ్‌ఎంసీలో టీఆర్‌ఎస్ స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉండటం ఖాయ మన్నారు. సిగ్గులేకుండా ఎన్నికల్లో మేము వేర్వేరని ప్రచారం చేసుకున్నారని మండిపడ్డారు. రెండు పార్టీలు కలిసి భాగ్యనగరాన్ని దోచుకునే కుట్ర చేస్తున్నా యన్నారు. అయితే, బీజేపీ కార్పొరేటర్లు హైదరా బాద్‌ను కంటికి రెప్పలా కాపాడుకుంటారన్నారు. పైసా అవినీతికి పాల్పడినా, అంగుళం జాగా కబ్జాచేసినా ఆ రెండు పార్టీలను బజారుకు లాగుతామన్నారు. ప్రజలు టీఆర్‌ఎస్ నీచ రాజకీయాలను గమనిస్తున్నా రని, అవకాశం వచ్చిన ప్రతీసారీ కర్రు కాల్చి వాత పెట్టినా బుద్ధి రావడం లేదని విమర్శించారు.
– సుజాత గోపగోని, 6302164068, సీనియర్ జర్నలిస్ట్