పది మాసాల పాటు కరోనా విలయం గురించి భయపడిన ప్రపంచం, ఇవాళ ఆ మహమ్మారి మీద జరిపిన సమరం, అందులోని విజేతల వీరగాధల గురించి చర్చించే దశకు చేరుకోగలిగింది. అగ్ర రాజ్యం అమెరికాలోనే ఫిబ్రవరి 1 లెక్కల ప్రకారం 4,52,279 మంది కరోనాతో మరణించారు. రానున్న కొద్ది రోజుల్లో ఈ సంఖ్య భారీగానే పెరుగుతుందని కొత్త అధ్యక్షుడు జో బైడన్ ఇప్పటికే వెల్లడించారు. కరోనా వెల్లడి కాగానే భారత్ సాక్షాత్తు అగ్ని పర్వతం మీద కూర్చునుందన్న అభిప్రాయాలు వ్యక్తమయినాయి. జనం పిట్టల్లా రాలిపోతారన్నారు. ఇక్కడి పరిస్థితులను బట్టి కరోనా మరణాలు కోట్లలోనే ఉంటాయన్న భయాలు ఉండేవి. కానీ వాస్తవం ఏమిటి? భారత్ గురించి పలువురు విశ్లేషకులు, దేశాధి నేతలు చెప్పిన మాటలు చిలక జోస్య కన్నా హీనంగా మారాయి. ప్రపంచ వ్యాప్తగా వాటిల్లిన కరోనా మరణాల్లో 25 శాతం అమెరికాలో సంభవించాయి. ఇగ్లండ్‌లో పరిస్థితి మరీ దారుణం. ఐరోపాలో మొత్తం వైద్యరంగమే యుద్ధ భూమిలో ఉందని నిపుణులు చెపుతున్నారు. ఈ నేపథ్యంలో కరోనా వ్యతిరేక సమరంలో విజయం సాధించిన ప్రజల, ప్రభుత్వాల ఘనతను గురించి మాట్లాడుకోగలగడం విశేషం. ఆ మాటల్లో భారత్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
కరోనా ధాటికి తాళలేక భారత్ కుదేలైపోగలదన్న వారి అచంనాలకు భిన్నంగా భారత్ తట్టుకుని నిలబడ్డది. 130 కోట్ల జనాభా కలిగిన భారత్‌లో ప్రజలందరికీ వ్యాక్సిన్ ఇప్పిచండానికి భారత్ సమాయత్తం కావడం ప్రపంచానికి ఆశ్చర్యం కలిగిస్తోంది. మేలైన వ్యాక్సిన్ తయారు చేసిన భారత్ కొన్ని దేశాలకు ఉచితంగాను, మరికొన్ని దేశాలకు వారి అవసరాలకు తగినట్లు అందిస్తోంది. భారత్ శక్తి ప్రపంచాన్ని నివ్వెర పరుస్తోంది. 1998 మే 13న పోఖ్రాన్‌లో భారత్ అణుపరీక్షలు విజయవంతంగా జరిపినప్పుడు కూడా ప్రపంచం ఇలాగే నివ్వెరపోయిది. అగ్రరాజ్యాల్లో అగ్రగామిగా వెలుగొందుతున్న అమెరికా ఉలిక్కిపడ్డది. తమ కళ్లు కప్పి భారత్ అణు పరీక్షలు ఎలా జరపగలిగింది అని పెద్దన్న దిమ్మెరపోయాడు. ఆటంబాబు కలిగిన దేశాల జాబితాలో భారత్‌ను చేర్పించిన ఘనుడిగా దేశ ప్రజలు, ప్రపంచ దేశాలు వాజపేయిని శ్లాఘిచడం చరిత్ర. వాజపేయి ప్రధాని కాగానే సమర్ధులైన శాస్త్రవేత్తలను ప్రోత్సహించి హఠాత్తుగా అణుబాంబు తయారు చేయమని ఆదేశించలేదు. వారు అప్పటికప్పుడు అణుబాంబు తయారు చేయనూ లేదు. అణుబాంబు తయారీకి కావలసిన శాస్త్ర పరిజ్ఞానాన్ని భారత శాస్త్రవేత్తలు ఎప్పటి నుండో సేకరిస్తూనే ఉన్నారు. వారి కృషి ఫలితంగా 1974 మే 18న పోఖ్రాన్‌లో తొలిసారి అణుపరీక్షలు జరిగాయి. ఒక రకంగా అణుబాంబును సిద్ధం చేశారు కూడా! పరీక్షించమని ప్రభుత్వం ఎప్పుడు ఆదేశిస్తుందా అని శాస్త్రవేత్తలు ఎదురు చూస్తుండేవారు. సుమారు పాతికేళ్ల పాటు సాగిన వారి నిరీక్షణ 1998 నాటికి ఫలించింది. తగిన సమర్థత గల రాజకీయ నాయకత్వం వాజపేయి ప్రభుత్వ రూపంలో భారత శాస్త్రవేత్తలకు దొరికింది. భారత్ అణు పరీక్ష జరిపి విజయం సాధించింది. 1972లో బంగ్లా విముక్తిని సమర్ధిస్తూ భారత్ పాకిస్తాన్‌తో జరిపిన యుద్ధంలో భారత సైనికదళాలు సాధించిన విజయం నాటి ప్రధాని ఇందిర ఖాతాలో పడ్డది. నాడు విపక్ష నేతగా ఉన్న వాజపేయి ప్రధాని ఇందిరను అభినందిస్తూ అపర దుర్గ అని అభివర్ణించారు. ఇది భారత రాజకీయాల్లో ఆదర్శ నేతలు నెలకొల్పిన ఉత్తమ సంప్రదాయం. ప్రపంచం అంతా కరోనా విలయానికి తాళలేక కుదేలైపోయిన తరుణంలో భారత్‌ను శక్తిశాలిగా నిలిపిన రాజకీయ నాయకత్వాన్ని అభినందించడం రాజకీయ మర్యాద.
ఊరందరిదీ ఒక దారి అయితే ఉలిపి కట్టెది మరో దారి అన్నట్లు మన విపక్షాలు వ్యవహరిస్తుంటాయి. సకాలంలో సరైన నిర్ణయం గైకొని లాక్‌డౌన్ వంటి చర్యలను కట్టుదిట్టంగా అమలు చేయిచి అపార ప్రాణనష్టం జరక్కుండా నివారించిన మోదీ ప్రభుత్వాన్ని అభినందిద్దామనే భావన విపక్షాల ఆలోచనల్లో పొడసూపడం లేదు. శాస్త్రవేత్తలను ప్రోత్సహించి, మంచి వ్యాక్సిన్ తయారు చేయించి భారత్ ప్రతిష్ఠను ఇనుమడింపజేసిన మోదీ నాయకత్వం ప్రతిభను ప్రశంసించాలనే ధ్యాసే విపక్షాల ఆలోచనల్లో లేదు. దేశ రాజకీయాల్లో విపక్షాలుగా ఉన్న కాంగ్రెస్, కమ్యూనిష్టులతో సహా విపక్షాల ఆలోచన ఒకటే. గత పోకడలను కొనసాగిస్తూనే ఈ బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే దారుల గురించి ఆలోచించాయి. దారి తప్పిన పంజాబ్ రైతుల ఉద్యమాన్ని సమర్ధిస్తూ మాట్లాడాలా, ఎర్రకోట ప్రతిష్ఠను కాపాడ్డంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించాలా అని మల్లగుల్లాలు పడ్డాయి.
లోకం అంతా అసహ్యించుకునే బురద గుంటలో పొర్లాడ్డం పందులకు ఆనందం కావచ్చు. ఫలితం రాదని తెలిసీ ఉచ్చగుంటల్లో చేపలు పట్టాలని ప్రయత్నించి కొందరు ఆనందించవచ్చు. లోకో భిన్న రుచిః అన్నట్లు రాజకీయాల్లో కూడా ఎవరి శైలి వారిది కావచ్చు కానీ రాజకీయ మర్యాద, విలువలను పాటించడం అవసరం. భారత రాజకీయ సంస్కృతికి దాపురించిన ఈ హీనత్వాన్ని దేశ ప్రజలు తిరస్కరిస్తారో, దింపుకళ్లం ఆశతో ప్రతిపక్షాలు ఎదురు చూస్తున్నట్టు ఇదే వైవిధ్యం అనుకుంటూ ఆమోదిస్తారో, కాలమే నిర్ణయించాలి!