– డాక్టర్ ఆరవల్లి జగన్నాథస్వామి
‘ఆడితప్పని వాడు అవనిలోనే అధికుడు’ అని పెద్దల మాట. మాట ఇవ్వడం, దానిని నిలుపుకోవడంలోనే వారి విశిష్టత వెల్లడవుతుంది. మనిషికి మాటే తరగని ఆభరణం. ఆ మాటే అజరామరుడిని, మనిషిని ‘మనీషి’ని చేస్తుంది. మాట పాటింపు ముందు సకల సంపదలు క్షణికమైనవే. మాట తప్పకపోవడం ధర్మాచరణేనని చెబుతారు. ‘దైవాధీనంతు జగత్సర్వం… సత్యాధీనంతు దైవం’ (సర్వ జగత్తు దైవాధీనం కాగా దైవం సత్యాధీనం) అని సూక్తి. ఇక్కడ మాట తప్పకపోవడం అంటే అన్ని వేళాల అన్నీ నిజాలు చెబుతారని కాకపోయినా, ఇచ్చిన మాటను త్రికరణశుద్ధిగా ఆచరించగలగడం అనే అర్థంలో వ్యాఖ్యానించుకోవచ్చు.
మానవుడిని తీర్చిదిద్దేందుకు రామాయణ, భాగవత, భారతం, పురాణేతిహాసాలలో సత్యవాక్పరి పాలనపై కథనాలు ఎన్నో ఉన్నాయి. ఎందరో సాహితీమూర్తులు కథలుగా రాశారు. మనిషికి, ఇతర పశుపక్ష్యాదులకు గల ప్రధాన భేదం ధర్మాచరణే నంటూ…
‘ఆహార నిద్రాభయమైథునం చ సమాన మేతత్ పశుభిర్నరాణామ్ ।
ధర్మోహి తేషా మధికోవిశేషః ధర్మేణ హీనాం పశుభిస్సమానాః ।।
(ఆహారం, నిద్ర, భయం, సంతానాన్ని పొందడం అనే అంశాలలో మానవులకు, పశుపక్ష్యాదులు సమానం. కానీ ధర్మాచరణ కారణంగానే మనిషి వాటికంటే విశిష్టుడు)అని భర్తృహరి పేర్కొన్నారు.
అలాంటి ధర్మానికి, మాటకు కట్టుబడి అరణ్యవాసం చేశాడు కనుకే శ్రీరామచంద్రుడు ‘ఒకే మాట, ఒకే బాణం, ఒకే భార్య’ అని ఆదర్శ పురుషుడయ్యాడు. ‘మనుషులందరికి స్థిరమైన నడవడి ఉండాలి. అనుకున్న దానికి, ఆడినదానికి కట్టుబడాలి. ఏవేవో కోరికలు, ఆకాంక్షలతో మాట మారిస్తే లోకులు పరిహసించరా? లోకుల దాకా ఎందుకు? ఆత్మసాక్షి అంగీకరిస్తుందా?’ అని రాజ్యం తిరిగి తీసుకోవాలని తనకు నచ్చచెప్ప జూచిన తమ్ముడు భరతుడికి హితవు చెప్పాడు. ఇచ్చిన మాటకు కట్టుబడడం వంశగౌరవాన్ని పెంచుతుందని కూడా ఆయన మాటలలో వెల్లడైంది. అందుకే ‘రాజ్యచాపల్యంతో తండ్రి దశరథుని మాట పక్కన పెడితే ఆయనకు అపకీర్తి కాదా?’ అనీ ప్రశ్నిస్తాడు. అంటే వ్యక్తి వ్యవహారశైలి తనతో పాటు వంశ గౌరవ, పరువు, ప్రతిష్టలతోనూ ముడిపడి ఉందని భావించాలి. ధర్మాచరణలో స్వ, పర భేదం లేకుండా అందరినీ ఆకర్షించాడు. శరణుకోరిన విభీషణుడికి అభయం ఇచ్చాడు తప్ప రావణ సంహారంతో అవసరం తీరిపోయినట్లుగా ఆయనను వదిలివేయ లేదు. లంకా రాజ్యాన్నీ ఆక్రమించలేదు. అందుకే ‘రామాదివత్ వర్తితస్య న రావణాదివత్’ (శ్రీరామ చంద్రుడు వంటి ఆదర్శప్రాయుల మాదిరిగా జీవించాలని, దుర్గుణ భరితులైన రావణాదుల మాదిరిగా కాదు) అని రామాయణం చెబుతోంది.
ఇక్ష్వాకు చక్రవర్తి, వారి పూర్వీకుడు హరిశ్చం ద్రుడు ఇచ్చిన మాట కోసం ఎన్నో కష్టాలను ఎదుర్కొ న్నాడు. అయితే మాట నిలబెట్టుకోవడం ముందు అవి లెక్కింపదగినవే కాదని భావించారు. తాను నమ్మిన సత్యపథాన్ని, నిబద్ధతను అనుసరించి సాగిపోయాడు. భగవంతుని ఆశీర్వాదఫలంగా లభించిన జన్మను ఆయనకే అంకితం చేశాడు. సత్యసాధన లక్ష్యంలో దుర్బలత్వాన్ని దూరంగా ఉంచాడు. తనకు ఎదురైన కష్టనష్టాలను భగవత్ సంకల్పంగానే భావించాడు తప్ప ‘యాగం కోసం మీరు కోరిన ధనాన్ని సమకూర్చలేకపోతున్నాను’ అని విశ్వామిత్రుడితో హరిశ్చంద్రుడు అనలేదు. గురువు విశ్వామిత్రుడి సూచనపై అలా చెప్పించాలనే నక్షత్రకుడూ విఫలయత్నం చేశాడని పురాణ కథనం. సత్యమార్గంలో నడిచేవారికి తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులు ఎదురుకావచ్చు కానీ అంతిమ విజయం మాత్రం సత్యసంధులదేనని హరిశ్చంద్ర ఉదంతంతో నిరూపితమైంది.
యాచనకు వచ్చిన వటుడికి బలి చక్రవర్తి అనంత సంపదలను దానమీయ దలచినా ఆ వటుడు మూడడుగుల నేలనే కోరాడు. అడిగేటప్పుడు దాత స్థాయినైనా గుర్తెరగాలి కదా? అన్న బలి మాటలకు ‘నేను కోరిన నేలే నాకు బ్రహ్మాండంతో సమానం’ అన్న వటుని మాటలను ఆలకించిన రాక్షస గురువు శుక్రాచార్యుడు, ఆతడిని సాక్షాత్తు శ్రీమహావిష్ణువుగా గుర్తించాడు. దాన వాగ్దానాన్ని ఉపసంహరించు కోవాలని రాజుకు సలహా ఇచ్చినప్పుడు బలి అన్న మాటలు ఆయన సత్యసంధతకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచాయి. ‘వారిజాక్షులందు వైవాహికములందు ప్రాణ విత్త మాన భంగమందు..’ అని అసత్యమాడడానికి, మాటతప్పడానికి గల సందర్భాలను గురువు గుర్తుచేసినా, శిష్యుడు లక్ష్యపెట్టలేదు. పైగా తన నిర్ణయం వల్ల ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా ‘ఒకసారి మాట ఇచ్చిన తరువాత నా జిహ్వ ఇక వెనుకకు తిరుగదు’ అని తన దృఢ నిశ్చయాన్ని ప్రకటించి, అనుకున్నది నెరవేర్చాడు.
పాండవులు కూడా మాటకు కట్టుబడే అరణ్య, అజ్ఞాతవాసాలు చేశారు. రాజ్యాన్ని, సర్వసంపదలను వదులుకున్నా ధర్మాన్ని మాత్రం వదలుకోనని ధర్మరాజు స్పష్టం చేశారు. దాయాది దుర్యోధనుడు మాత్రం ద్యూత నియమాన్ని కాదని పాండవులకు ‘సూదిమొన మోపినంత చోటు కూడా ఇవ్వను’ అని ప్రకటించాడు. అహంభావం, మాట నిలుపుకోనితనం శోభించలేదు. ఆయన వైఖరి చెడ్డపేరుతో పాటు వంశక్షయానికి దారితీసింది.
మాట నిలుపుకోవడమే ధార్మిక స్వభావమని చెప్పడానికి ఒకప్పటి దొంగల తీరునూ ఉదాహరణగా చెబుతారు. పూర్వకాలంలో కొందరు దొంగలు నేరంలోనూ నియమాలను పాటించేవారట. చోరవృత్తిని అరవై నాలుగు కళల్లో ఒకటిగా గుర్తించి తమకు అవసరమైన వాటినే తీసుకువెళ్లేవారట. స్త్రీల అపహరణం, వేధింపులకు పాల్పడేవారుకాదట. అంటే హీనంగా పరిగణించే దొంగలలోనే నియమాలను పాటించే పద్ధతి ఉన్నప్పుడు సభ్య సమాజంలో ఉన్నతులుగా చలామణి అవుతున్నవారు ధర్మాచరణలో ఇంకెంత అప్రమత్తంగా వ్యవహరించాలో తెలిపేందుకే దీనిని ఉదహరిస్తారు.
‘భోజరాజీయం’లోని ఆవు-పులి కథలో ఆవు పాటించిన ధర్మనిరతి తెలిసిందే. అడవికి మేతకు వెళ్లిన ఆవులలో ఒకదానిని భుజించేందుకు పులి సిద్ధపడింది. ‘నా రాకకోసం ఇంటి వద్ద ఎదురు చూస్తున్న ‘తువ్వాయి’ (బిడ్డ)ను కడసారి చూసి వచ్చి నీకు ఆహారమవుతాను’ అని బతిమిలాడుకున్న ఆవుకు పులి అపనమ్మకంతోనే అనుమతిస్తుంది. ఇంటికి చేరిన ఆవు బిడ్డకు అన్ని జాగ్రత్తలు చెప్పి, తోటి ఆవులకు అప్పగింతలు పెట్టి పులి దగ్గరకు తిరిగి వెళుతుంది. మాట తప్పని ఆవు పట్ల అంతటి క్రూరజంతువు కరుణ కురిపిస్తుంది. జంతుపాత్రలతో కూడిన కథే అయినా ‘సత్యవాక్పరిపాలన’ విలువను చెబుతుంది.
పాలకుల నుంచి పాలితుల దాకా ఏదో ఒక సందర్భంలో ఇచ్చిన మాటను విస్మరిస్తున్న సంఘటనలు వర్తమానంలో కోకొల్లలు. మాట నిలబెట్ట్లుకోలేనప్పుడు, నిలబెట్టుకునే ఉద్దేశం లేనప్పుడు సమయానుకూల ‘మాట’ను ఇవ్వకపోవడమే ఉత్తమంగా భావించాలి. పాలకులను బట్టే పాలితులు ఉంటారన్నది సహజంగా చేసే వ్యాఖ్య. ఒక్కొక్కసారి పాలితులే భిన్నంగా ఉండవచ్చు. చెప్పిన దానిని ఆచరించలేని ఏలికలు, త్యాగాలకు సంసిద్ధులు కావాలని ప్రజలకు పిలుపునివ్వడం ఏపాటి ధర్మ నిర్వహణ అవుతుందో ఆత్మపరిశీలన అవసరం.
– డా।। ఆరవల్లి జగన్నాథస్వామి, సీనియర్ జర్నలిస్ట్