– ఆకురాతి భాస్కర్‌చంద్ర
వాకాటి పాండు రంగరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది
సుబ్రహ్మణ్యస్వామికి నోట మాటరాలేదు.
మనవరాలు వెలుగు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయాడు.
అమెరికాలో పెరుగుతున్న తన మనవరాలు అసలు ఆ ప్రశ్న వేస్తుందని కూడా అతను ఊహించలేదు.
సుబ్రహ్మణ్యస్వామికి వివేకానంద ఒక్కగానొక్క కొడుకు. అమెరికాలో ఉంటాడు. మంచి ఉద్యోగం చేస్తున్నాడు. అంతకుమించి తనకు దగ్గరగా వున్న భారతీయులందరికీ ఎటువంటి సాయం కావాల్సి వచ్చినా తను ముందుండి వాళ్లకు ఇబ్బంది కలగకుండా చేసేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తాడు. అందువల్ల వివేకానంద అంటే శాన్‌ఫ్రాన్సిస్కోకు వెళ్లిన చాలామంది తెలుగువాళ్లు గుర్తుపడతారు.
వివేకానంద కూతురే వెలుగు. పద్నాలుగేళ్ల వయసులో ఇరవై యేళ్ల పిల్లలా ఉంటుంది. తండ్రిలా బాగా ఎత్తరి. తల్లిలా బాగా తెలివైంది. వెలుగు కూడా తను చదువుతున్న స్కూల్ ఎలాంటి సామాజిక కార్యక్రమాలు చేపట్టినా ముందు వుంటుంది. తనకు తెలిసిన భారతీయులందరికీ వ్యక్తిగతంగా మెయిల్స్ పంపి క్రిస్టమస్ రోజుల్లో తమకు సమీపంలో ఉన్న ఇళ్లులేని వాళ్లకు మంచి ఆహారం, బట్టలు అందే విధంగా చేస్తుంది. నడవలేని ముసలివాళ్లను హాస్పిటల్‌కు తీసుకువెళ్లటం, వాళ్లకు మందులు తెచ్చి ఇవ్వటం వంటివి చేయటం సరదా అంటుంది. చాలా పొడగరి అవటం వల్ల స్కూల్ బాస్కెట్ బాల్ టీమ్‌కి నాయకత్వం వహిస్తుంది. అక్కడే పుట్టటం వల్ల అమెరికన్ పౌరసత్వం ఉన్నా గుండెల నిండా భారతీయత నింపుకుని ఉంటుంది. మన దేశ స్వాతంత్య్ర పోరాటానికి సంబంధించిన వీరుల గురించి, అనేక సంఘటనల గురించీ చాలా ఉత్సాహంగా చెబుతుంది. స్నేహితులతో నాటకాలు వేయిస్తుంది. రుతుకాలం వర్తించని నదిలా గలగలా నవ్వుతూ ఉంటుంది. అలాంటి వెలుగు ప్రస్తుతం సెలవులకని ఇండియా వచ్చింది. సహజంగా ఈ దేశం మీద ఉన్న ఉత్సాహం కొద్దీ – అమ్మా నాన్నా ఆఫీసు పనులతో బిజీగా ఉన్నా – ఒంటరిగా తాతను, నాయనమ్మను చూసేందుకు ఇండియా వచ్చేసింది. ఇక్కడకు వచ్చిన తర్వాత తాత సుబ్రహ్మణ్యస్వామిని క్షణం కూర్చోనివ్వలేదు. హైద్రాబాద్ ఒక్కటే కాకుండా వరంగల్, హన్మకొండ ఇంకా వాటి చుట్టూ ఉన్న చారిత్రాత్మక ప్రదేశాలన్నీ చుట్టపెట్టింది. సుబ్రహ్మణ్యస్వామి తిరగలేను మొర్రో అన్నా వదిలిపెట్టలేదు.
అమెరికా నుంచి వచ్చిన ముద్దుల మనవరాలిని కాదనలేని అశక్తత సుబ్రహ్మణ్యస్వామిని కూర్చోనిచ్చిందికాదు. ఎక్కడకు బయల్దేరినా చూడబోయే ప్రదేశాల గురించి ముందుగానే ఇంటర్‌నెట్‌లో చూసి అనేక ప్రశ్నలు పోగుచేసి పెట్టుకునేది వెలుగు. దారిపొడుగునా సుబ్రహ్మణ్యస్వామి శరీరమంతా వెలుగు వేసిన ప్రశ్నలతో అంపశయ్య మీద పడిపోయినట్టుగా అయిపోయేది. తనకు తెలిసిన వాటిని కాస్త ఎక్కువగా చెప్పి తెలియని వాటినుంచి తెలివిగా తప్పించేసుకునేవాడు సుబ్రహ్మణ్యస్వామి. అలా ఒక రోజున అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేక గతుక్కుమన్నాడు.
ఇంతకూ వెలుగు అడిగిన ప్రశ్న ఏమిటంటే ‘‘తాతయ్యా.. మనకు స్వాతంత్య్రం వచ్చింది 1947లో. జపాన్ మీద రెండవ ప్రపంచ యుద్ధంలో బాంబు దాడి జరిగి సర్వనాశనం అయిపోయింది 1945లో. అంటే మనదేశం కంటే ఎంతో దుర్భరమైన స్థితిలో ఉండే పరిస్థితి. అటువంటి జపాన్ అన్ని రంగాలలోనూ ఎంతో అభివృద్ధి చెంది ప్రపంచ నాగరికతకే తలమానికంగా తయారైంది. కానీ మనమెందుకు ఇక్కడే వున్నాం.. ఎందువల్ల?’’
సుబ్రహ్మణ్యస్వామి మనవరాలి ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయాడో లేక చెప్పకుండా తప్పించుకున్నాడో చెప్పటం కష్టం. ఎందుకంటే సుబ్రహ్మణ్యస్వామి మామూలు వాడు కాదు. ఉద్యోగం చేసే రోజుల్లో యూనియన్ నాయకులను ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసేవాడు. అధికారిక సర్క్యులర్‌లోని బొక్కలు వెతకటంలో అతనికి పెట్టింది పేరు. కోడిగుడ్డు మీద కనీసం పదికి తక్కువ కాకుండా ఈకలు పీకుతాడని మిత్రులంతా జోకులు వేసుకునేవాళ్లు. ఆ తర్వాత కొన్నాళ్లకి యూనియన్ విషయాల్లో వేలు పెట్టి పాత నాయకులందరికీ తాటాకుమంట పెట్టి మరీ వెళ్లగొట్టాడు సుబ్రహ్మణ్యస్వామి. అలాగని అతను ప్రజల బాగోగుల కోసం పాటుపడే నిజమైన నాయకుడేం కాదు. తన ఎదుగుదలకి ప్రజలను ఎలా వాడుకోవాలో తెలుసుకున్న నాయకుడు. ఆ విధంగా నాయకత్వంలోని లాభాలు కూడా అనుభవించేసాక – ఉద్యోగులందర్నీ కట్టకట్టి యాజమాన్యానికి అమ్మేసి రిటైరయిపోయి ఇప్పుడు విశ్రాంత జీవితాన్ని అనుభవిస్తూ అప్పుడప్పుడూ పత్రికల్లో నిజమైన నాయకుడి లక్షణాల గురించి వ్యాసాలు రాస్తూ ఉంటాడు. అంత చరిత్ర కలిగిన సుబ్రహ్మణ్యస్వామి కేవలం పద్నాలుగేళ్ల మనవరాలు అడిగిన దానికి సమాధానం చెప్పలేకపోయాడంటే నమ్మశక్యం కాదు.
ఉదయాన్నే వాకింగ్ కోసం తయారై మొదటి అంతస్థు నుంచి కిందకు దిగాడు సుబ్రహ్మణ్యస్వామి. అప్పటికే వెలుగు ట్రాక్ షూ వేసుకుని రెడీగా ఉంది. వీడియో కాల్‌లో తన స్కూల్ ఫ్రెండ్‌తో కబుర్లు చెబుతూ మధ్య మధ్యలో వాళ్లుండే కమ్యూనిటీని చూపిస్తోంది. అవతలపక్క తెల్లమ్మాయ్ మాటిమాటికీ కళ్లు పెద్దవి చేస్తూ ఆశ్చర్యపోతూ ఉంది.
సుబ్రహ్మణ్యస్వామి కిందకు చేరుకునే సరికి దాదాపు ఓ పదిమంది వరకూ అతని కోసమే ఎదురుచూస్తున్నారు. ఒకరికొకరు విషెస్ చెప్పుకున్నాక అక్కడే ఉన్న సిమెంట్ చప్టాలమీద కూర్చున్నారు. సుబ్రహ్మణ్యస్వామి చేతుల్లో ఏదో కాగితం పెట్టి షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. వాళ్ల తీరు చూస్తుంటే ఏదో విజయం సాధించిన సంతోషం వాళ్ల ముఖాల్లో కనిపిస్తూంది. ఐదు నిమిషాల తర్వాత ‘‘ఓకే.. సార్.. మీ మనవరాలు మీ కోసం ఎదురుచూస్తోంది.. సాయంత్రం కలుద్దాం’’ అని వెళ్లిపోయారు. సుబ్రహ్మణ్యస్వామి వెలుగుతో కలిసి నడక మొదలుపెట్టాడు. వెలుగు వెంటనే ప్రశ్న వేసింది ‘‘ఎవరు తాతా వాళ్లు?’’
‘‘వాళ్లంతా మన కమ్యూనిటీలో ఉండేవాళ్లే’’ అన్నాడు సుబ్రహ్మణ్యస్వామి.
‘‘నువ్వు వాళ్లకి లీడర్’’ అని గుప్పిట గాల్లోకి లేపి తాతకు ఎదురుగా పెట్టింది. సుబ్రహ్మణ్యస్వామి కూడా పిడికిలి బిగించి చిన్నగా కొట్టాడు.
‘‘నా పేరే సుబ్రహ్మణ్యస్వామి కదా.. అంటే దేవతలందరికీ నాయకుడు. ఇక్కడ నేను కూడా అంతే..’’
‘‘మీరందరూ దేవతలా?.. నాకు తెలిసి దేవతలెవ్వరూ ఒక్కడు కూడా మంచి పని చేయడు.. తపస్సు చేసుకునే వాళ్లను చెడగొట్టటం.. బలవంతుడైన రాక్షసుల్ని మోసంతో చంపడం.. మీరూ అంతేనా?’’ అంది వెలుగు కిలకిలా నవ్వుతూ.
సుబ్రహ్మణ్యస్వామి మళ్లీ గతుక్కుమన్నాడు. భారతదేశం గురించి ఎక్కువ సమాచారం అందిస్తున్న ఇంగ్లిష్ రచయితలందర్నీ మనసులోనే తిట్టిపోసాడు.
‘‘చెప్పండి.. తాతా.. ఇంతకీ మీరేం చేసారు?’’
సుబ్రహ్మణ్యస్వామి చెప్పటం మొదలుపెట్టాడు.
‘‘మన కమ్యూనిటీలో దాదాపు 850 కుటుంబా లుంటాయి. ఒక ఇంట్లో సుమారు ముగ్గురు చొప్పున వేసుకున్నా దాదాపు 2550 మంది ఉంటారన్నమాట. నువ్వు చూసావుగా ఇక్కడ అన్ని వయసుల వాళ్లకీ అవసరమైన అన్ని సదుపాయాలు ఉంచారు. పసివాళ్లు ఆడుకునే చిన్న పార్క్ నుంచీ నాలాంటి సీనియర్ సిటిజన్స్ కూర్చుని కబుర్లు చెప్పుకునే రచ్చబండల వరకూ ఉన్నాయి. ఇందులో కొంతమందికి ఈ మధ్య ఒక కొత్త ఆలోచన వచ్చింది. మన పార్కింగ్ తెలుసుగా..’’
‘‘యా.. మల్టీ లెవల్ పార్కింగ్’’ అంది వెలుగు ఆ బిల్డింగ్ వైపు చేయి చూపిస్తూ.
‘‘యస్.. అదే.. అది సిక్స్ ఫ్లోర్స్.. ఆ పైన మొత్తం ఖాళీ.. ఇప్పుడీ మధ్య టెర్రస్ గార్డెనింగ్ అనే కాన్సెప్ట్ వచ్చింది కదా..’’
‘‘యా.. యా.. ఐ నౌ’’ అంది వెలుగు.
‘‘కొంతమంది కలిసి.. ఆ పార్కింగ్ బిల్డింగ్ టెర్రస్ మీద ఇది మొదలుపెట్టారు’’
‘‘ఓహ్.. బ్యూటిఫుల్.. మనం అక్కడకు వెళదాం’’ అంది తెగ సంతోషపడిపోతూ.
‘‘వెళదాం.. మన వాకింగ్ లాస్ట్ స్ట్రెచ్ అయ్యాక..’’
‘‘ఆ.. ఆ.. చెప్పండి.. ఆ టెర్రస్ మీద..’’
‘‘ముఖ్యంగా రామనారాయణ అనే ఆయనకు అగ్రికల్చర్ అంటే.. ముఖ్యంగా పూలు, కూరగాయలు పెంచటం అంటే చాలా ఇష్టమట. ఆయన మరో నలుగుర్ని పోగుచేసుకుని అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి కొంతమంది ప్రొఫెసర్లను తీసుకొచ్చి టెర్రస్ పైన పూలు, కూరగాయలు ఎలా పెంచాలో నేర్చుకుని దానిని బాగా డెవలప్ చేసాడు’’
‘‘గుడ్ గాడ్.. మరి మన కమ్యూనిటీలో అందరూ ఆ పనికి హెల్ప్ చేస్తారా?’’
‘‘అందరూ ఎందుకు వెళతారమ్మా.. మహా అయితే ఓ ఇరవైమంది వరకూ రోజూవారీగా డ్యూటీలు వేసుకుని వెళ్లి అక్కడ గార్డెనింగ్ చేస్తుంటారు’’
‘‘మీరు మన కమ్యూనిటీలో 2550 మంది ఉన్నారని చెప్పారు’’
‘‘అవును’’
‘‘అందులో కేవలం ఇరవైమంది వెళతారు. అంటే వన్ పెర్సంట్ కంటే తక్కువ’’ అంది వెలుగు ఆశ్చర్యంగా.
‘‘అక్కడకు రోజూ వెళ్లి రెండు మూడు గంటలు పని చేయటం కాక నెలకు వెయ్యి రూపాయల వరకూ ఖర్చు చేయాల్సి ఉంటుంది’’ అన్నాడు సుబ్రహ్మణ్య స్వామి.
‘‘దేనికి?’’
‘‘మొక్కలు కొనడానికి, మట్టి కొనడానికి, మొక్కలు వేస్తే వాటికి చీడ రావటం మామూలేకదా.. ఎరువులు, మందులు కొనటానికి. క్రీపర్స్ కోసం తీగలు, పందిళ్లు వేయటానికి, అప్పుడప్పుడూ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి ప్రొఫెసర్లను తెచ్చి చూపించటానికి.. ఇవన్నీ ఖర్చులేగా..’’
‘‘మీ అసోసియేషన్ ఏమీ ఇవ్వదా?’’
‘‘దానికేమిటి సంబంధం? ఇది వ్యక్తిగతమైన ఆసక్తి కదా..’’
‘‘ఇన్ ది బిగినింగ్.. ఇట్ మే బీ.. బట్.. ఇప్పుడు వాళ్లు ఆ గార్డెన్ డెవలప్ చేసారు కదా.. ఇప్పుడది కమ్యూనిటీ టేకప్ చేస్తే అదొక యాక్టివిటీ మాదిరిగా ఉంటుంది కదా.. పైగా పనిచేసేవాళ్లకి ఖర్చులు తగ్గుతాయి కూడా’’
‘‘నువ్వు చెప్పింది నిజమే కానీ.. ఎక్కువమంది ఉత్సాహం చూపించలేదు. పైగా నువ్వన్నావే.. వన్ పెర్సంట్ కంటే తక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్న యాక్టివిటీ కోసం ఖర్చు పెట్టటానికి ఎవరూ సుముఖంగా లేరు’’
‘‘తాతయ్యా.. రెండ్రోజుల క్రితం గుళ్లో పూజలు, ప్రసాదాలు చేసారు కదా.. వాటి ఖర్చు ఎవరికివాళ్లే పెట్టుకున్నారా?’’
‘‘అది గ్రూప్ కార్యక్రమం.. కాబట్టి అసోసియేషన్ పెట్టుకుంటుంది’’
‘‘గ్రూప్ యాక్టివిటీ అని మీరెలా డిసైడ్ చేస్తారు.. గుడికి రాని వేరే మతం వాళ్లు కూడా ఉంటారుకదా.. అటువంటప్పుడు వాళ్ల షేర్ మీరు ఖర్చు పెట్టుకున్నట్టేగా?’’
సుబ్రహ్మణ్యస్వామి గొంతులో వెలక్కాయ పడ్డట్టుగా అయిపోయాడు. అసలీ తెలివితేటలన్నీ కోడలిపిల్లవే అయ్యుంటాయ్. కొడుకైతే ఇన్ని ప్రశ్నలు వేయడు.
‘‘ఓకే.. వాటీజ్ ది లేటెస్ట్.. స్టేటస్ ?’’ అంది వెలుగు నవ్వుకుంటూ.
‘‘లేటెస్టుగా వాళ్లేం చేసారంటే.. వాళ్లు పండించిన కూరగాయలు, పూలు అమ్మకానికి పెడుతున్నారు. అలా వచ్చిన ఆదాయాన్ని గార్డెన్ మీద ఇన్వెస్ట్ చేయటం వల్ల వాళ్లిప్పటివరకూ నెలనెలా పెట్టు కుంటున్న ఖర్చు తగ్గించుకున్నారు’’ అన్నాడు సుబ్రహ్మణ్యస్వామి.
‘‘గుడ్ థింగ్’’
‘‘ఇక్కడే మీ తాతయ్య తెలివితేటలు వాడాడు. తెలుసా?’’ అన్నాడు గర్వంగా సుబ్రహ్మణ్యస్వామి. ‘‘వాళ్లు పండించే స్థలం కామన్ ఏరియాకు సంబంధించింది కాబట్టి వాళ్లు ఆ స్థలాన్ని గార్డెన్‌గా వినియోగించుకుంటున్నందుకు కొంత అద్దె ఇవ్వాలి లేదా వాళ్లు పండించిన కాయగూరలు, పూలు కమ్యూనిటీలో ఉన్నవాళ్లందరికీ ఉచితంగా ఇవ్వాలి అని వాళ్లమీద కేసు వేసాను. కోర్టు ఈ విషయం తేలేవరకూ ఆ గార్డెన్‌లో ఎవరూ ఏ పనులూ చేయకూడదని మనకు అనుకూలంగా స్టే విధించింది. అదే మనవాళ్లు ఇందాక నాకిచ్చిన కాయితం’’ అని మనవరాలికి అందించాడు సుబ్రహ్మణ్యస్వామి గర్వంగా. వెలుగు ఆ కాగితాన్ని అందుకోలేదు. స్వామికి కొంచెం నిరుత్సాహం కలిగింది.
ఇంతలో వాళ్లు టెర్రస్ మీద అడుగుపెట్టారు.
అక్కడి వాతావరణం చూడగానే వెలుగుకు మనసంతా హాయిగా అనిపించింది. రకరకాల పూల మొక్కలు గాలికి తలలూపుతూ వాళ్లకి స్వాగతం చెబుతున్నట్టుగా అనిపించింది.
తాతయ్యను పట్టించుకోకుండా ముందుకు వెళ్లింది వెన్నెల. వంకాయలు, టొమాటాలు, చిక్కుళ్లు, మిర్చి, కొత్తిమీర, బెండకాయలు, సొరకాయలు, బీరకాయలు.. చెట్లకు, తీగెలకు వేలాడుతూ ముచ్చటగా కనిపిస్తున్నాయి. వాళ్లు అలా నడుస్తుండగానే ఒక పెద్దావిడ ఉలిక్కిపడి పొదల నుండి బయటకు వచ్చింది. ఆవిడ చేతిలో మొక్కలకు నీళ్లుపోసే ప్రెషర్ పంప్ ఉంది. ఆవిడ ఆ వయసులో కూడా ఉత్సాహంగా ఆ పంప్‌తో మొక్కలను నీళ్లతో తడపటంలో ఆనందం అనుభవిస్తున్నట్టుగా ఉంది. ఆ పెద్దావిడ వెలుగును చూసి చిరునవ్వు నవ్వింది. కానీ వెనుకనే నడుస్తూ వస్తున్న సుబ్రహ్మణ్యస్వామిని చూసి కొద్దిగా కంగారుపడింది. తప్పుచేసిన దానిలా వణికిపోయింది.
‘‘ఏం లేదు సారూ.. మొక్కలు ఎండకు ఎండిపోతుంటే.. నీళ్లు కొట్టనీకి వచ్చిన.. ఏం చేస్తలేను.. రామనారాయణ సార్ చెప్పిండు.. ఈ తోటలో పని నిలపమని చెప్పిన్రంటగదా.. తెల్వకచ్చిన.. ఎండదెబ్బ తగిలి.. ఆకులు గాజులెక్క గలగలమంటున్నయ్.. సారూ.. నీళ్లు చల్లితే మెత్తబడుతాయని అచ్చిన.. గంతెనె..’’ అని ఇంకా అక్కడే ఉంటే ఏం జరుగుతుందో అని భయంతో ఊగిపోతూ ముందుకు వెళ్లిపోయింది.
మామూలుగా అయితే సుబ్రహ్మణ్యస్వామి మీసం మెలితిప్పి తన ప్రతాపాన్ని మనవరాలికి చూపించేవాడే. కానీ వెలుగు వేరేలా ఉండటంతో ఏం మాట్లాడలేకపోయాడు. వెలుగు కాసేపు అక్కడే తిరిగి తాను కూడా కొన్ని మొక్కలకు నీళ్లు పోసింది. సరిగ్గా అదే సమయంలో ఆకాశంలో మబ్బు పట్టి చినుకులు రాలాయి. వెలుగు మొహంలో వెలుగునిండింది. ఒక్క వర్షం కురిస్తే కనీసం రెండు మూడు రోజులు ఈ మొక్కల ప్రాణం నిలుస్తుంది. ఆకాశం వంక చూసింది కృతజ్ఞత చెబుతున్నట్టుగా.
ఆ రోజు ముభావంగానే రాత్రి గడిపింది వెలుగు. మనవరాలు ఎందుకలా ఉందో తెలీక అయోమయంగా ఉండిపోయింది సుబ్రహ్మణ్యస్వామి భార్య. అమ్మానాన్నా గుర్తుకొచ్చారేమో అనుకుని దగ్గరకు తీసుకుంది. సోఫాలో కూర్చున్న తాతను చూసి ‘‘ఐ గాటిట్ తాతయ్యా..’’ అంది వెలుగు.
‘‘ఏ విషయం?’’ అన్నట్టుగా తల గాల్లోకి ఊపాడు సుబ్రహ్మణ్యస్వామి. చదువుతున్న పేపర్ని పక్కన పెట్టి తాతయ్య పక్కనే కూర్చుంది వెలుగు. ‘‘జపాన్ ముందుకు వెళ్లటానికి, మనమింకా ఇక్కడే ఉండటానికి కారణం అడిగాను కదా.. అది..’’ అంది వెలుగు.
సుబ్రహ్మణ్యస్వామి పెదాలు నవ్వుతున్నట్టుగా పెట్టాడు గానీ నవ్వు రాలేదు. వెలుగు చెప్పింది ‘‘మనకు స్వాతంత్య్రం వచ్చిన సమయంలో జపాన్ బాంబు దాడులతో సర్వనాశనం అయిపోయినా ఇప్పుడు ఇంత టెక్నాలజీతో ప్రపంచంలోనే ముందుకు వెళ్లిపోతూ ఉండటానికి కారణం.. వాళ్ల పౌరులందరికీ దేశం పట్ల గౌరవం, బాధ్యత ఉన్నాయి. అందువల్లే ప్రతి పౌరుడు వాళ్ల కుటుంబం ఎలా ఉన్నా, ఎన్ని ఇబ్బందులు పడినా వాళ్ల దేశం ముందుకు వెళ్లాలని కలలు కన్నారు. ఆ కలలు నిజం చేసుకోవటానికి దశాబ్దాలపాటు శ్రమను ధారపోశారు. ఫలితంగా నెంబర్ వన్ కాగలిగారు.
కానీ మనదేశంలో సమస్య ఏమిటంటే.. అసలు మన స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న వాళ్లే 20 శాతం మంది ప్రజలు. అంటే మిగిలిన 80 శాతం మంది ప్రజలకు స్వాతంత్య్రం పట్ల ఇష్టత లేదు లేదా పాలకులుగా ఎవరున్నా వాళ్లకి అభ్యంతరం లేదు. అందువల్లే వాళ్లు దేశస్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనలేదు. అంటే మన స్వాతంత్య్రం కేవలం 20 శాతం మంది దేశభక్తుల రక్తతర్పణంతో వచ్చింది. కానీ దేశాన్ని అప్పటినుంచీ పాలించింది మిగిలిన 80 శాతంలోని వాళ్లే. వాళ్లకు దేశం పట్ల అంకితభావం లేదు. కేవలం లాభాపేక్ష, కీర్తికాంక్ష తప్ప. అందువల్ల దేశం ముందుకు వెళ్లాలన్న లక్ష్యంతో కాకుండా తాము ధనవంతులయ్యేందుకు దేశాన్ని వినియోగించుకున్నారు. పౌరులను మూర్ఖులుగా తయారుచేసారు. సాంకేతికతను అందుబాటులోకి రానివ్వకుండా అడ్డుకున్నారు. కేవలం రకరకాల పథకాల పేర్లతో డబ్బు వాళ్లకు అందించి సోమరులుగా తయారుచేసారు తప్ప దేశం పట్ల బాధ్యతను పెంచలేదు.
మన కమ్యూనిటీలో కేవలం 20 మంది ఎంతో కష్టపడి పెంచుకున్న గార్డెన్‌లోని ఫలాలను ఇప్పుడు మీరంతా కలిసి అనుభవించాలని అడిగినట్టే జరిగింది. ఇప్పటివరకూ పడిన వాళ్ల కష్టం నాశనం అయిపోతుందని బాధపడే ఆ ముసలమ్మలాంటి వాళ్లు మనసు చంపుకోలేక వాళ్ల విధిని నిర్వర్తిస్తూ ఉంటారు. మీలాంటి వాళ్లు న్యాయం పేరుతో లిటిగేషన్లు డెవలెప్ చేసి అది మీ తెలివితేటలని చంకలు కొట్టుకుంటారు. మీకు గార్డెన్ నాశనం అయిపోయినా పెద్ద బాధ ఉండదు. ఎందుకంటే ఆ వృద్ధిలో మీ శ్రమ లేదు కాబట్టి. రేపు కోర్టు మీ పక్షం తీర్పు చెబితే ఊరికే వచ్చే పూలూ, కాయగూరలు అనుభవిస్తారు. లేదంటే ఈ లోపు గార్డెన్ నాశనం అయిపోతే ఆ పనిని నిలపగలిగినందుకు జబ్బలు చరుచుకుంటారు. మీరు ప్రజలను ముందుకు తీసుకువెళ్లకపోయినా నష్టం లేదు కానీ వెనక్కులాగకండి. మనమెందుకు ఇక్కడే ఉండిపోయామన్న సంగతి వాళ్లకు తెలీకుండా చేయకండి’’ అంది.
సుబ్రహ్మణ్యస్వామికి మనవరాలి మాటలకు కళ్లలో నీళ్లు తిరిగాయి. వెన్నెలను దగ్గరకు తీసుకొని తనివితీరా కౌగిలించుకున్నాడు. అతని చేతిలో కాగితం ముక్కలైపోయింది. తాతా మనవరాలి మధ్య అసలేం జరిగిందో తెలీని అతని భార్య అయోమయంగా వాళ్లవైపు చూస్తూ ఉండిపోయింది.