ఢిల్లీలో అత్యంత భద్రత ఉండే ప్రాంతమది. అంతకు మూడు రోజుల క్రితమే గణతంత్ర దిన వేడుకలు జరిగాయి. రైతులుగా చెప్పుకుంటున్న కొందరు అరాచకవాదులు అదేరోజు భారీ హింసకు పాల్పడ్డారు. పరిస్థితులు కుదుట పడుతున్న సమయంలో జనవరి 29న బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనతో దేశమంతా ఉలిక్కిపడింది. సాధారణ పేలుడు అయినా దాని వెనుక, ముందు పరిణామాలు ఆందోళనకరంగా కనిపిస్తున్నాయి. ఈ ఘటనకు పాల్పడిన వారి లక్ష్యం ఇజ్రాయెల్‌ ‌రాయబార కార్యాలయం అయినా, దాని వెనుక అంతర్జాతీయ పరిణామాల మూలాలు సుస్పష్టం. ప్రాథమిక ఆధారాల ప్రకారం ఇది ఇరాన్‌ ‌పనే అంటున్నారు. ఈ చర్యకు కారకులెవరైనా దాని మూలాలపై లోతుగా దర్యాప్తు చేస్తున్నాయి కేందప్రభుత్వ బృందాలు.

ఢిల్లీలో విజయ్‌చౌక్‌ ‌దగ్గర బీటింగ్‌ ‌రిట్రీట్‌ ‌వేడుకలు జరుగుతున్నాయి. గణతంత్ర వేడుకలకు ముగింపుగా ప్రతి ఏటా ఆనవాయితీగా జరిగే ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ ‌కోవింద్‌, ‌ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్‌ ‌షా సహా మంత్రులు, త్రివిధ దళాల అధిపతులు పాల్గొన్నారు. వేడుకలు ముగింపు దశకు వస్తుండగా అక్కడికి కేవలం 1.4 కిమీ దూరంలోనే ఉన్న అబ్దుల్‌ ‌కలాం రోడ్డులో పేలుడు చోటు చేసుకుంది. ఇజ్రాయెల్‌ ‌రాయబార కార్యాలయం వద్ద జరిగిన ఈ ఘటనతో భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి. తక్కువ తీవ్రత ఉన్న ‘ఐఈడీ’ని గుర్తు తెలియని వ్యక్తులు పేల్చినట్లు కనుగొన్నారు.

కార్యాలయం వద్ద పూల కుండీలో బాంబు ఉంచినట్టు గుర్తించారు. ఘటనా స్థలిలో బాంబును అనుసంధానం చేసే వస్తువులను ఫోరెన్సిక్‌ ‌నిపుణులు కనుగొన్నారు. తీగలు, బాల్‌ ‌బేరింగులు, ఇతర వస్తువులు లభ్యమయ్యాయి. అలాగే ఘటనా స్థలిలో నిందితులు ఓ లేఖను వదిలివెళ్లారు. ఇంగ్లిష్‌లో ఉన్న ఈ లేఖను ఇజ్రాయెల్‌ ‌రాయబారిని ఉద్దేశించి రాశారు. ఇది ట్రైలర్‌ ‌మాత్రమేనని, మరింత ప్రతీకారం తీర్చుకుంటామని ఇజ్రాయిల్‌ ‌రాయబారిని బెదిరించారు

ఈ పేలుడు ఘటనలో ఎవ్వరూ గాయపడలేదు. మూడు కార్ల అద్దాలు మాత్రం పగిలిపోయాయి. అయినా దేశ రాజధాని నడిబొడ్డున, ఇజ్రాయెల్‌ ‌దౌత్య కార్యాలయం ముందు జరిగిన ఈ పేలుడును తీవ్రంగా పరిగణించక తప్పదు. కేంద్ర ప్రభుత్వం దీనిని సీరియస్‌గా తీసుకుంది. హోంమంత్రి అమిత్‌ ‌షా అత్యవసర సమావేశం నిర్వహించి దర్యాప్తును జాతీయ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ (ఎన్‌ఐఏ)‌కి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేశారు.

ఇరాన్‌ ‌పాత్ర ఎంత?

ఇజ్రాయెల్‌ ‌రాయబార కార్యాలయం ముందు జరిగిన పేలుడు వెనుక ఇరాన్‌ ‌పాత్ర ఉందని ప్రాథమిక ఆధారాలు కనిపించినట్లు తెలుస్తోంది. అయితే ఇరాన్‌ ‌కోపం భారత్‌ ‌మీద మాత్రం కాదు, దాని లక్ష్యం ఇజ్రాయెల్‌.. ‌పశ్చిమ ఆసియాలో ఒకనాటి శత్రువులు కలిసిపోవడం, దాని వెనుక అమెరికా ప్రయత్నాలు ఇరాన్‌కు నచ్చడం లేదు. ఇజ్రాయెల్‌తో దాని చిరకాల శత్రువులు సౌదీ అరేబియా, యూఏఈ సంబంధాలు ఏర్పరచుకోవడం ఇరాన్‌కు ఆగ్రహం తెప్పిస్తోంది. అందునా అమెరికా జోక్యం పెరగడం ఆ దేశానికి అసలు ఇష్టం లేదు. ప్రతీకారం తీర్చుకునేందుకు ఏ దేశంలో అయినా, ఏ అవకాశమైనా వదులుకోదలచుకోలేదు. ఈ నేపథ్యంలో ఢిల్లీ ఘటనలో ఇరాన్‌ ‌పాత్ర ఎంత అనే అంశంపై దర్యాప్తు ప్రారంభమైంది.

 ప్రపంచ వ్యాప్తంగా తమ దౌత్య కార్యాలయాలపై దాడులు జరిగే అవకాశం ఉందని ఇజ్రాయెల్‌కు ముందుగానే సమాచారం ఉన్నందున ఢిల్లీ ఘటన ఆ దేశానికి పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదు. పశ్చిమాసియా, ఇస్లామిక్‌ ‌ప్రపంచంలో తమకు ప్రతికూలంగా ఉన్న కొన్ని శక్తులు దీని వెనుక ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేసింది. ఈ ఘటన జరిగిన వెంటనే భారత విదేశాంగమంత్రి ఎస్‌. ‌జయశంకర్‌ ఇ‌జ్రాయెల్‌ ‌విదేశాంగ మంత్రి గబీ ఏష్కనాజీతో ఫోన్లో మాట్లాడారు. మరోవైపు ఆ దేశ ప్రధాని బెంజిమన్‌ ‌నెతాన్యాహు ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడారు. దర్యాప్తు చేపడుతున్నామని.. బాధ్యులను తప్పకుండా శిక్షిస్తామని  నెతన్యాహుకు ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. అంతేకాకుండా దౌత్యవేత్తలు, రాయబార కార్యాలయాల భద్రతకు భారత్‌ ‌కట్టుబడి ఉందని తెలిపారు.

సులేమానీ హత్యకు ప్రతీకారం?

ఢిల్లీలోని ఇజ్రాయెల్‌ ‌రాయబార కార్యాలయంపై దాడి తమ పనే అని జైష్‌ ఉల్‌ ‌హింద్‌ అనే ఉగ్రవాద సంస్థ ప్రకటించుకుంది. ఇందుకు కారణం సులేమానీ హత్యకు ప్రతీకారమని చెప్పింది. మరోవైపు ఘటనా స్థలం వద్ద ‘ఇండియా హిజ్బుల్లా’ పేరుతో ఉన్న ఒక లేఖలో ఇజ్రాయెల్‌ ‌రాయబారి రాన్‌ ‌మాల్కాను బెదిరిస్తూ రాసిన వాక్యాలపై దర్యాప్తు సంస్థలు దృష్టి పెట్టాయి. ‘రోజులు లెక్కపెట్టుకోండి. పెద్ద ప్రతీకారం కోసం సిద్ధంగా ఉండండి’ అని అందులో రాసి ఉంది. ‘ఇజ్రాయెల్‌ ‌రాయబారి కదలికలను పరిశీలిస్తున్నట్లు, ఇరాన్‌ అణు శాస్త్రవేత్త మొహ్సేన్‌ ‌ఫఖ్రిజాదే, ఇరాన్‌ ‌కమాండర్‌ ‌ఖాసిం సులేమానీతో సహా కొంతమంది ఉన్నత ఇరానియన్ల హత్యకు ప్రతీకారం తీర్చుకుంటాం’ అని స్పష్టం చేశారు. ‘మీ ప్రతి క్షణం మాకు తెలుసు. మీరు మీ చివరి రోజులను లెక్కించడం ప్రారంభించండి. మీరు మాత్రమే కాదు, మీ భాగస్వాములు కూడా మా రాడార్‌లో ఉన్నారు. ఇది ట్రైలర్‌ ‌మాత్రమే’ అని ఆ లేఖలో హెచ్చరించారు.

గత సంవత్సరం ఇరాన్‌ ‌రివల్యూషనరీ గార్డస్ ‌చీఫ్‌ ‌జనరల్‌ ‌ఖాసీం సులేమానీ, అణుశాస్త్రవేత్త మొహ్సేన్‌ ‌ఫక్రిజాదేలు హత్యకు గురయ్యారు. రెండు వేర్వేరు ఘటనల్లో అమెరికన్‌ ‌డ్రోన్‌ల దాడిలో మరణించారు. చంపింది అమెరికా అయినా, క్షేత్ర స్థాయిలో దీని అమలు బాధ్యతలను ఇజ్రాయెల్‌ ‌చూసుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అమెరికా అధ్యక్షునిగా డొనాల్డ్ ‌ట్రంప్‌ అధికారం చేపట్టిన తర్వాత అంతకు ముందు ఒబామా ప్రభుత్వం ఇరాన్‌తో కుదుర్చుకున్న అణు ఒప్పందాన్ని రద్దు చేయడంతో పాటు ఆ దేశంపై ఆంక్షలను కఠినతరం చేశారు. ఈ కారణం వల్లే అమెరికా, ఇజ్రాయిల్‌ల మీద ఇరాన్‌ ‌ప్రతీకారం కోసం రగిలిపోతోంది.

భారత్‌ ‌ప్రయోజనాలపై ప్రభావం ఎంత?

భారత్‌, ఇ‌జ్రాయెల్‌ ‌మధ్య సంబంధాలు అత్యంత ఉన్నత స్థితిలో ఉన్నాయి. భారత్‌ను అత్యంత ఆప్త దేశంగా గౌరవిస్తోంది ఇజ్రాయిల్‌. ఇరు దేశాల మధ్య పూర్తిస్థాయి దౌత్య సంబంధాలు ఏర్పడి 28 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వార్షికోత్సవాలను జరుపుకుంటున్న సమయంలోనే ఈ దాడి జరగడం యాధృచ్ఛికం కాదని, కుట్రపూరితంగానే ఇది జరిగిందని ఇజ్రాయెల్‌ ఎం‌బసీ వర్గాలు చెప్తున్నాయి. భారత్‌కు ఈ అంశం సునిశితంగా మారింది. దేశ చమురు అవసరాలు తీర్చే పశ్చిమ ఆసియా దేశాలతో సంబంధాలు మనకు చాలా కీలకం. అదే సమయంలో ఉగ్రవాదంపై పోరులో అమెరికా, ఇజ్రాయెల్‌ ‌సహకారం కూడా చాలా ముఖ్యం.

పాకిస్తాన్‌లోని గద్వార్‌ ఓడ రేవు వరకూ చైనా చేపట్టిన ఎకనామిక్‌ ‌కారిడార్‌ (‌సీపీఈసీ)కి ప్రతిగా మనదేశం ఇరాన్‌లోని చాబహార్‌ ఓడరేవు అభివృద్ది ప్రాజెక్టు చేపట్టింది. అరేబియా సముద్రంలో చైనా, పాకిస్తాన్‌ ఆగడాలను కట్టడి చేయడంతో పాటు పశ్చిమాసియాతో వ్యాపార సంబంధాలకు ఈ ప్రాజెక్టు అవసరం చాలా ఉంది. అమెరికా, ఇరాన్‌ల మధ్య దెబ్బతిన్న సంబంధాల ప్రభావం దీనిపై పడింది. ఇరాన్‌ ఈ ‌ప్రాజెక్టు నుంచి తప్పుకుంటున్నట్లు వార్తలు వచ్చినా ఆ తర్వాత ఆచి తూచి అడుగులు వేస్తోంది.

భారత్‌తో ఇరాన్‌కు శతాబ్దాలుగా దౌత్య సంబంధాలు ఉన్నా అంతర్జాతీయ పరిణామాలు కొంత మేర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఒక రకంగా అమెరికా-ఇజ్రాయెల్‌-ఇరాన్‌ ‌దేశాలపై భారత్‌ ‌చాలా లౌక్యంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఆయా దేశాలు తమ ప్రయోజనాలను చూసుకున్నట్లే, భారత్‌ ‌కూడా జాతీయ ప్రయోజనాలను కాపాడుకునేందుకే ప్రాధాన్యం ఇస్తోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఇజ్రాయెల్‌ ‌కార్యాలయంపై దాడి కేసు కాస్త ఆసక్తి కలిగించడం సహజమే.

– క్రాంతిదేవ్‌ ‌మిత్ర : సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE