గత నాలుగేళ్లుగా జాతీయంగా, అంతర్జాతీయంగా అమెరికా ఎదుర్కొంటున్న సవాళ్లను, సమస్యలను అధిగమించే పక్రియ ప్రారంభమైంది. ఈ దిశగా నూతన అధ్యక్షుడు జో బైడెన్‌ ‌కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 46వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన జనవరి 20నే ఈ నిర్ణయాలను ప్రకటించడం విశేషం. తద్వారా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే పక్రియను మొదలు పెట్టినట్లు అధ్యక్షుడు విలేకరుల సమావేశంలో వెల్లడించారు. అమెరికా సంయుక్త రాష్ట్రాల జాతీయ, అంతర్జాతీయ సంబంధాలు పార్టీలను బట్టి మారే సంప్రదాయం లేదు. మౌలికమైన విధానాలలో దాదాపు మార్పు ఉండదు. అలాగే కొన్ని అంశాల విషయంలో ఒకే పార్టీకి చెందిన వారసుడే వచ్చినా కూడా కొన్ని మార్పులు చోటు చేసుకునే విధానం కూడా ఉంది.


ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే శ్వేతసౌధంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలోనే 17 కీలక అంశాలపై నిర్ణయాలకు సంతకాలు చేసి, పచ్చ జెండా ఊపారు. ఇందులో తొమ్మిది నిర్ణయాలు, తన ముందు పని చేసిన ట్రంప్‌ ‌తీసుకున్న నిర్ణయాలను రద్దు చేసే ఆదేశాలే కావడం విశేషం. పారిస్‌ ‌వాతావరణ ఒప్పందంలో, ప్రపంచ ఆరోగ్య సంస్థలో మళ్లీ అమెరికాను భాగస్వామ్యం చేయడం, మెక్సికో సరిహద్దులో గోడ నిర్మాణం నిలుపుదల, ముస్లిం వలసలపై నిషేధం తొలగింపు వంటివి అధ్యక్షుడి నిర్ణయాల్లో ముఖ్యమైనవి. బైడెన్‌ ‌వెనువెంటనే ఆమోదించిన మెజార్టీ నిర్ణయాలపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. అవి అమెరికా ప్రగతికి దోహదపడతాయని ప్రజలు భావిస్తున్నారు. ముఖ్యంగా వీసా విధానాలలో ఆయన తీసుకున్న లేదా తీసుకోబోతున్న నిర్ణయాల గురించి కూడా చాలా దేశాలలో ముఖ్యంగా భారత్‌ ‌వంటి దేశంలో సానుకూలతే ఉంది కూడా. అంతర్జాతీయంగా దెబ్బతిన్న ప్రతిష్టను ఈ నిర్ణయాలు పునరుద్ధరించగలవన్న ఆశాభావాన్ని పలువురు అమెరికన్లు వెలిబుచ్చుతున్నారు. ముఖ్యంగా పారిస్‌ ‌వాతావరణ ఒప్పందం, ప్రపంచ ఆరోగ్య సంస్థలో మళ్లీ భాగస్వామ్యం పొందడం ద్వారా అంతర్జాతీయంగా పాత వైభవం రాగలదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కరోనా నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అమెరికాను దూరం చేయాలన్న డొనాల్డ్ ‌ట్రంప్‌ ‌నిర్ణయం చాలా వివాదాలకు తావిచ్చింది. ట్రంప్‌ ‌వాదనలో నిజముంది. ఎలాగంటే, కరోనా వైరస్‌ ‌వ్యాప్తికి దోహదపడిన చైనాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ వత్తాసు పలుకుతున్నదని ఆయన ఆరోపించారు. ఊహాన్‌ ఉత్పాతం గురించి ప్రపంచానికి తెలియచేయడంలో చైనాతో ప్రపంచ ఆరోగ్య సంస్థ కుమ్మక్కయిందని కూడా ఆయన బాహాటంగానే విమర్శించారు. కానీ చైనాతో అంటకాగిందన్న కారణంగా, కరోనా నివారణలో లేదా, జాగ్రత్తల విషయంలో ప్రపంచానికి ఇరుసుగా వ్యవహరిస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థను ఆ ప్రమాదకర పరిస్థితులలో బలహీనం చేస్తూ, అమెరికాను దూరం చేయడం ట్రంప్‌ ‌చేసిన తొందరపాటు చర్యగానే పలువురు విమర్శించారు.

ఇవన్నీ ఎలా ఉన్నా, జో బైడెన్‌ ‌తీసుకున్న ఒక నిర్ణయంపై నిరసన స్వరాలు వినపడుతున్నాయి. అదే, ముస్లిం దేశాల నుంచి అమెరికాకు జరుగుతున్న వలసపై ఉన్న నిషేధం తొలగింపు. వివిధ దేశాల నుంచి ముఖ్యంగా కొన్ని సమస్యాత్మక దేశాల నుంచి ముస్లిముల వలసలపై ఉన్న నిషేధాన్ని ఉన్న పళంగా, పూర్తిగా తొలగించడం వల్ల కలిగే లాభాలకన్నా నష్టాలే ఎక్కువన్న వాదన అమెరికన్‌ ‌జాతీయుల నుంచి వినపడుతోంది. కరోనా గురించి పెద్ద పోరాటమే చేయదలిచిన బైడెన్‌ ‌ప్రాధాన్యం మారిందేమోనన్న అనుమానాలు వచ్చాయి. నిశ్చయంగా బైడెన్‌ ‌మొదట పోరాడవలసింది దేశంలో కరోనా తీవ్రత మీదే. దాని మీద ఆయన చర్య తీసుకోలేదని కాదు. కరోనా నివారణకు ఇచ్చిన ప్రాధాన్యం, ముస్లింల మీద నిషేధం ఎత్తివేయడానికి కూడా ఇవ్వడమే కొరుకుడు పడని సంగతి.

బైడెన్‌ ఎం‌దుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు? ఇది కచ్చితంగా చర్చనీయాంశమే. ఇలాంటి ప్రశ్నకు మూలం- అమెరికా గత కొన్నేళ్లుగా సాగిస్తున్న అంతర్జాతీయ ఉగ్రవాదం మీద పోరాటం. బిన్‌లాడెన్‌ ‌వ్యవహారం, ట్విన్‌ ‌టవర్స్ ‌మీద దాడి, అఫ్ఘానిస్తాన్‌, ‌పాకిస్తాన్‌లపై అమెరికా అనుసరిస్తున్న వైఖరి ఇవన్నీ కూడా ఉగ్రవాదంపై పోరుకు సంబంధించినవే. పాకిస్తాన్‌కు అమెరికా సాయం ఆపడం ఈ క్రమంలోనే జరిగిన మరొక తీవ్ర నిర్ణయం. పైగా పాకిస్తాన్‌ ఇప్పుడు చైనా చంకలో దూరింది. బిన్‌ ‌లాడెన్‌ను దాచి పెట్టిన పాకిస్తాన్‌ ‌కంటే, చైనా పంచన చేరిన పాకిస్తానే అమెరికాకు పెద్ద బెడద కాదని అనగలమా? ఇప్పుడు చెప్పుకున్న ఏ పరిణామం కూడా చల్లబడే దిశలో లేదు. పైగా బ్రిటన్‌, ‌ఫ్రాన్స్, ‌స్వీడన్‌ ‌వంటి దేశాలలో జరుగుతున్న ముస్లిం వ్యతిరేక ఆందోళనలు, మతోన్మాద ముస్లింల అరాచకాలు  మొత్తం ప్రపంచాన్నే కలవరపెడుతున్న నేపథ్యంలో బైడెన్‌ ‌ముస్లిం దేశవాసులకు ఎర్ర తివాచీ తిరిగి పరచాలని నిర్ణయించారంటే ఆశ్చర్యం కలిగించే విషయమే అవుతుంది.

అందుకే బైడెన్‌ ‌తీసుకున్న ఈ నిర్ణయం విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆ నిర్ణయం దీర్ఘకాలంలో దేశ ప్రయోజనాలకు అంత మంచిది కాదన్న అభిప్రాయన్ని కొంతమంది విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. దేశానికి ఇంకా ఉగ్రవాద ముప్పు పొంచే ఉందని, ఇలాంటి పరిస్థితుల్లో ముందూ వెనక చూడకుండా తీసుకున్న ఏకపక్ష నిర్ణయం ఫలితాలు ఎలా ఉంటాయోనన్న ఆందోళన కొన్ని వర్గాల ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. ఉగ్రవాదం, తీవ్రవాదం, ఏ వాదమైనా దేశానికి ముప్పేనని, ఆ ప్రమాదం పైకి కనపడినంత తేలిగ్గా ఉండదని చెబుతున్నారు. అందువల్ల నిర్ణయం తీసుకునే ముందు అధినేత ఆచితూచి ఆలోచించాల్సి ఉందని వ్యాఖ్యానిస్తున్నారు. కానీ ఇంకొక కోణం కూడా ఈ అంశానికి ఉంది. చమురు దేశాలను తమ గుప్పెట ఉంచుకోవాలన్న అమెరికా విధానానికి బైడెన్‌ ‌ప్రాణప్రతిష్ట చేయదలుచుకున్నారా? కానీ చమురు ఎగుమతి దేశాలు ఎక్కువగా అమెరికా వైపే ఉన్నప్పుడు మళ్లీ పాత విధానాన్ని యథాతథంగా ఎందుకు తేవడం? ఇరాన్‌, ‌పాకిస్తాన్‌ అమెరికా దారికి వచ్చే అవకాశం ఇప్పుడు ఉందా? బైడెన్‌కు విదేశాంగ విధానం మీద స్పష్టమైన ఊహ ఏదీ లేదనేటంత వరకు కొందరు విమర్శకులు వెళ్లారు. ముస్లిం దేశాల నుంచి వచ్చి, సమస్యగా మారుతున్నవారితో ప్రపంచంలో పలు దేశాలు ఇక్కట్లు పడుతున్న సమయంలో ఇలాంటి నిర్ణయం కొంత కలవరపెడుతున్నది.

ఏడు దేశాల నుంచి ముస్లిముల వలసలపై 2017లో నిషేధం విధించారు. 2016 అధ్యక్ష ఎన్నికల్లో విజేతగా నిలిచిన రిపబ్లికన్‌ ‌పార్టీ అధినేత డొనాల్డ్ ‌ట్రంప్‌ ఈ ‌కీలక నిర్ణయం తీసుకున్నారు. 2017 జనవరి 20న 45వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ట్రంప్‌ ఇరాన్‌, ఇరాక్‌, ‌సిరియా, యెమెన్‌, ‌సూడాన్‌, ‌లిబియా, సోమాలియాల నుంచి ముస్లిముల వలసపై నిషేధం విధించారు. విద్య, ఉద్యోగ అవకాశాల కోసం వచ్చే వారిపై ఈ నిషేధం అమలు చేశారు. ఈ మేరకు అప్పట్లో నెంబరు 13769తో కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీచేశారు. దేశ భద్రత కోసం ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తన నిర్ణయాన్ని గట్టిగా సమర్థించుకున్నారు. విశాల జనహితం కోసం ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని అప్పట్లో ఆయన వ్యాఖ్యానించారు. ఈ ఏడూ సమస్యాత్మక దేశాలని, ఆయా దేశాల్లో అంతర్గత పరిస్థితులు సజావుగా లేవని, అక్కడి నుంచి అమెరికాకు వలస వచ్చే ప్రజలపై దాని ప్రభావం ఉంటుందని, అంతిమంగా దీనివల్ల వాషింగ్టన్‌కు నష్టం వాటిల్లుతుందని ఆయన గట్టిగా వాదించారు. ఈ నిర్ణయం అంతర్జాతీయంగా, ముస్లిం దేశాల్లో, ముఖ్యంగా ఈ ఏడు దేశాల్లో అలజడిని కలిగించింది. ట్రంప్‌ ‌నిర్ణయాన్ని అనేక అరబ్‌, ‌గల్ఫ్ ‌దేశాలు తూర్పారపట్టాయి. ఐరోపా యూనియన్‌ ‌సహా అనేక పాశ్చాత్య దేశాలు నిరసించాయి. ప్రత్యేకంగా ఒక మతంపై, కొన్ని దేశాలపై ముద్ర వేయడం తగదని వాదించాయి. ఐక్యరాజ్య సమితి తన నిరసన స్వరాన్ని వినిపించింది. అమెరికాలోనూ నిరసనలు వ్యక్తమయ్యాయి. దేశభద్రత ముఖ్యమే అయినప్పటికీ, దానికి ఇది పరిష్కారం కాదన్న వాదనలు విననపడ్డాయి. ఇక హక్కుల సంఘాల ఆందోళనలకు లెక్కేలేదు. వీటిని పూర్తిగా బేఖాతరు చేస్తూ ట్రంప్‌ ‌తన నిర్ణయానికి కట్టుబడ్డారు. ఎవరేమను కున్నా అమెరికా అధినేతగా తనకు దేశభద్రత ముఖ్యమని వ్యాఖ్యానించారు.

తరువాత కాలంలో ఈ నిర్ణయంపై అనేకమంది హక్కుల వాదులు న్యాయస్థానాలను ఆశ్రయించారు. 1965 నాటి ఇమ్మిగ్రేషన్‌ ‌చట్టం ప్రకారం సవాల్‌ ‌చేశారు. చివరకు ముస్లిముల వలసలపై నిషేధాన్ని దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు సమర్థించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ‌జాన్‌ ‌రాబర్సట్ 5-4 ‌మెజార్టీతో ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించారు. దీంతో విమర్శకుల నోళ్లకు తాళం పడింది. తరవాత కాలంలో ఇతర దేశాలను కూడా నిషేధం జాబితాలో చేర్చారు. చాద్‌, ఉత్తర కొరియా, వెనెజులా తదితర దేశాలు వీటిలో ఉన్నాయి.2020 నాటికి ఎరిట్రియా, కిర్గిజిస్తాన్‌, ‌మయన్మార్‌, ‌నైజీరియాలపైనా నిషేధాన్ని విధించారు. టాంజానియాకు కూడా వర్తింపజేశారు. ఇవన్నీ (మయన్మార్‌ ‌మినహా) మెజార్టీ ముస్లిం జనాభాగల దేశాలే కావడం గమనార్హం. అంతర్జాతీయంగా చాలా విషయాల్లో ఇవి అగ్రరాజ్యన్ని వ్యతిరేకిస్తాయి. వీలైతే అమెరికాను దెబ్బతీయడానికి కూడా వెనకాడవు. ఈ కారణంతోనే నిషేధాన్ని విధించినట్లు ట్రంప్‌ అప్పట్లో వాదించారు.

తాజాగా ట్రంప్‌ ‌నిర్ణయాన్ని బైడెన్‌ ‌తిరగతోడటంపై అగ్రరాజ్యంలో ఒకింత వ్యతిరేకత వ్యక్తమవుతున్న వాస్తవాన్ని తోసిపుచ్చలేం. అంతర్జాతీయంగా ఉగ్రవాదం ఏ పేరుతో, ఏ రూపంతో ఉన్నా దానిని ఉక్కుపాదంతో అణచివేయడానికి వాషింగ్టన్‌ ‌నాయకత్వం పట్టదలతో ఉంటుంది. శ్వేతసౌధంలో ఎవరు పాగా వేసినప్పటికీ ఈ విధానంలో మార్పుండదు. అలాంటిది వచ్చీరాగానే బైడెన్‌ ‌నిషేధం తొలగించడం పట్ల ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. గత ఏడాది జులైలో జరిగిన సభలో అధికారంలోకి రాగానే వెంటనే నిషేధాన్ని ఎత్తేస్తానని హామీ ఇచ్చానని ఆ మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బైడెన్‌ ‌చెబుతున్నారు. ఆ మాట ఎలా ఉన్నా, కశ్మీర్‌ ‌విధానంలో నరేంద్ర మోదీ నిర్ణయాలకు ఒకింత వ్యతిరేకతతో ఉన్న కమలా హ్యారిస్‌ ఇప్పుడు అమెరికా చక్రం తిప్పుతున్నారన్న వాదన ఉంది. కాబట్టి బైడెన్‌ ఇలాంటి నిర్ణయం తీసుకున్నందుకు భారత్‌ ‌కూడా ఇబ్బంది పడే అవకాశాలు కనిపిస్తాయి. బైడెన్‌ అమెరికా అధ్యక్షుడు. ఆయన కొన్ని నిర్ణయాలు చేశారు. చేస్తున్నారు. కాబట్టి ఇందులో తప్పుపట్టాల్సినది కానీ, అభ్యంతరం చెప్పాల్సింది కానీ ఏమీ లేదు. ఎవరూ చెప్పలేరు కూడా. కానీ ఇంత ఏకపక్షంగా, తొందరగా, హడావిడిగా, ఎలాంటి చర్చ లేకుండా దేశభద్రతకు కీలక అంశంలో నిర్ణయం తీసుకోవడంలోని సహేతుకతను కొందరు అమెరికన్లు ప్రశ్నిస్తున్నారు. భద్రతా సంస్థల అధికారులు, వివిధ పార్టీల ప్రతినిధులతో భిన్నకోణాల్లో చర్చించి, సావధానంగా నిర్ణయం తీసుకోవాలి తప్ప ఇలా కాదన్న వాదన వినపడుతోంది. ఒకటి నిజం. చమురు బావుల మీద ప్రేమ ఉన్నా, మతోన్మాదంతో ఊగిపోతున్న ముస్లిందేశాలను బైడెన్‌ ఎం‌తకాలం భరిస్తారన్న ప్రశ్న ఎప్పుడూ ఉంటుంది.

– గోపరాజు విశ్వేశ్వరప్రసాద్‌, ‌సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE