మనిషే అయితే, మనసంటూ ఉంటే- సాటివారి వ్యాధులూ బాధలూ చూసి కళ్లు చెమర్చాలి. ప్రాణాంతక రీతిలో ఆవరించే మృత్యుభీతి నుంచి ఎంతో పదిలంగా ఆవలకు చేర్చి, వారందరి వెన్నుదన్నుగా నిలవాలి. అంత చేయాలంటే ఎంత మంచి మనసుండాలి, అంతకుమించి ఎంతెంత గుండె దిటవును తన సొంతం చేసుకోవాలి? కొన ప్రాణాలకు అన్నీ తానై ఊపిరులూదే ఆ వ్యక్తిని దైవశక్తిగా భావించి సంభావిస్తుంది లోకం. డాక్టర్ శాంతను ప్రధానంగా క్యాన్సర్ విముక్తులంతా అందుకే తమ ఏకైక దేవతగా ఆరాధించి మది కోవెలలో స్థాపించుకున్నారు. వైద్య రంగంలో ఆణిముత్యమైనా, జాతీయ స్థాయి మణిరత్నమైనా ప్రతిఒక్కరి మనో మందిరంలోనూ ఆమే సర్వం, సమస్తం! భౌతికంగా కనుమరుగైనా, భారతదేశంలోని ఎందరెందరికో ఈ క్షణానికీ తానే సదా సర్వదా ఆశాజ్యోతి-శాశ్వత ఖ్యాతి!
డాక్టర్ అనే పవిత్ర పదానికి సకల విధా గుర్తింపు, గౌరవం తెచ్చిన కరుణామూర్తి శాంతది 93 ఏళ్ల జీవిత యాత్ర. కంతి రూపంలో చుట్టుముట్టిన మహమ్మారి పలువురి ఉసురుతీస్తుండటం చూసి విద్యార్థినిగా ఉండగానే చలించిపోయారు. పరమ అసహాయ స్థితిలో విసిగి వేసారుతూ, ప్రాణరక్షణకు వేడుకుంటూ, మౌన రోదన సాగించే వ్యధార్త భరితులకు అప్పటినుంచే తోడూనీడా అయ్యారు. దరిదాపు 28 సంవత్సరాల యౌవన ప్రాయంలో (1955) క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ ఆరంభించింది మొదలు… అదే అడయార్ వైద్య సంస్థగా విశ్వకీర్తి సాధించిన తదుపరి వరకు అలుపూ సొలుపూ లేని సేవ ఆమెది. అస్వస్థతతో చెన్నై ఆస్పత్రికి చేరిన కొన్ని గంటలకే తిరిగిరాని లోకాలకు తరలివెళ్లడం యావత్ జాతిని శోకసాగరంలో ముంచింది. అడయార్ అమ్మ ఇక లేరన్నది నిజం కాకుంటే బాగుండునని అనుకున్న వారెందరో.
జీవితమంతా అంకితం
ఆ వైద్య నిపుణురాలు సాగిన పథమే కాదు- తన నేపథ్యం ఘనమే. మనసా వాచా కర్మణా పేదల చికిత్సలోనే తరించారు. తెల్లవారక ముందే ఆరంభించే సేవ అర్ధరాత్రి దాటినా ఇంకా కొనసాగు తూనే ఉండేది. ఎక్కడ ఏ కొత్త విధానం, పరికరం వచ్చినా అధ్యక్షురాలి హోదాలో సొంత సంస్థకు వర్తింపచేసేవారు. వ్యాధి పీడితుల్లో ఎవరు ఎప్పుడు తల్లడిల్లినా, తల్లిలా ఆదరించి సేదతీర్చే మాటలతో ఊరడించి ‘నేను ఉన్నా కదా, ధీమాగా ఉండు’ అనేవారు. చికిత్స కన్నా ఆ ధైర్య ప్రదానమే అందరికీ కొండంత అండ అయింది. వృత్తిగా ఉండాల్సిన వైద్యం చివరకు వ్యాపార కళగా రూపాంతరం చెందిన ఇప్పటి వాతావరణంలో… ఆమె నిఖార్సయిన వెలుగు కిరణం. అసాధారణ ప్రతిభా సంపత్తులతో అత్యంత ప్రతిష్ఠాత్మక నోబెల్ పురస్కారాలందుకున్న సర్ సీవీ రామన్, సుబ్రహ్మణ్య చంద్రశేఖర్‌ల కుటుంబం నుంచి వచ్చినవారు. నిత్యం వైద్య చికిత్సలోనే, నిరంతరం పేదల సేవతోనే జీవితమంతా గడపాలన్న దృఢ నిర్ణయంతో శాంత అవివాహితగానే ఉండిపోయారు. ప్రపంచంలో ఎందరికి ఉంటుందీ అంకితభావం?
భారత రత్నమే
నవీన పరిశోధనపైనే ఆశ, వైద్యాలయ అభివృద్ధి గురించే ధ్యాస. రెండేళ్ల క్రితం ఆ సంస్థను దర్శించి వచ్చిన ప్రధాని మోదీ- నాటి జ్ఞాపకాలను గుర్తుతెచ్చు కుంటూ శాంత స్మరణ చేశారు. వ్యాధి నిర్ధారణ, నివారణ- రెండింటిలోనూ ఆమె నెలకొల్పిన విలువలు అమూల్యమన్నారు. అవును… ఆ మహనీయ సేవాతత్పరతకు ఇప్పటికే ఆరున్నర దశాబ్దాల వయసు. తమిళనాటనే కాక ఉభయ తెలుగు ప్రాంతాలూ, ఇతర రాష్ట్రాలవారికీ ఆమే దివిటీ. వైద్యంలో మానవతను రంగరించిన ఫలితంగా కేంద్ర ప్రభుత్వ సముదాత్త పురస్కారం ‘పద్మవిభూషణ్’ అందుకున్న చరితార్ధ. శాంత మరణానంతరం- గణతంత్ర దినోత్సవ సందర్భంలో ‘భారత రత్న’ ప్రకటన సమాచారమంటే- అత్యుత్తమ సేవను అత్యున్నత పౌర పురస్కృతి వరించినట్లే. ఇదివరలోనే రామన్ మెగసెసే అవార్డు విజేత. క్యాన్సర్ సంబంధిత సలహా సంఘం (ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యం) సభ్యురాలిగా ఉన్నారు. భారత వైద్య పరిశోధనా మండలి కమిటీలలో కూడా ప్రతినిధి. జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో వందకు పైగా విస్తృత పరిశోధనా పత్రాల సమర్పకురాలు. రాసిన పుస్తకాలు, చేసిన ప్రసంగాలు, పాల్గొన్న సదస్సులు అసంఖ్యాకం. ప్రయోగ శీలత మెండుగా ఉన్న యువ పరిశోధకులను వివిధ వేదికల ద్వారా పరిచయం చేసి చికిత్సారంగ విస్తరణకు మూల కారకులయ్యారు. ఏడేళ్ల కిందటే మదర్ థెరిసా స్మారక అవార్డు స్వీకరించారామె.
అన్నింటికన్నా మిన్న
వైద్య చికిత్సలో అవిశ్రాంత కృషికి అర్ధం చూపిన డాక్టర్ శాంత పలు మార్పుచేర్పుల ఆవిష్కర్త. అలనాడు 12 పడకలతో ప్రారంభించిన వైద్యాలయాన్ని చిరకాల సేవాభావంతో దక్షిణ భారతాన ప్రాంతీయ క్యాన్సర్ కేంద్రంగా మలచిన ఘనురాలు.
పునరావాస వసతికీ అంతే ప్రాధాన్యమిచ్చిన కార్యనిర్వహణ దక్షురాలు. పద్మశ్రీ సహా 33 పురస్కారాలు తననే వరించి వచ్చినా, నిగర్వమే ఆభరణంగా ధరించిన క్రియాశీలి. దేశ తొలి ప్రధాని నెహ్రూ నోటిమీదుగా అభినందన, 15 సంవత్సరాలనాడే ‘నోబెల్’కు నామినేట్ అయిన వనితామణి కావడం, మెగసెసె పురస్కృతి మొత్తాన్ని క్యాన్సర్ చికిత్స వైద్యశాలకు వితరణ చేయడం… ఈ అన్నీ ఆ వైద్యురాలి కీర్తి కిరీట ధగధగలే! ఆమె అజరామర.