మధ్యయుగాల నాటి మతోన్మాదుల అరాచకాలను తలపిస్తూ ఆంధప్రదేశ్‌లో ఇటీవలికాలంలో హిందూ దేవాలయాల మీద జరిగిన దాడులు ఒక్క హిందువులనే కాదు, సరిగా ఆలోచించే వారందరినీ కలత పెట్టాయి. ఈ దురాగతం మీద మత పెద్దల, సాధు సంతుల గళం బిగ్గరగా వినిపించాలని సాధారణ హిందువులంతా మనసారా కోరుకున్నారు. మొత్తానికి ఆ శుభ ముహూర్తం వచ్చింది. ఫిబ్రవరి మొదటి వారంలో తిరుపతి సమీపంలో తమిళనాడుకు చెందిన పోన్పాడి గ్రామంలో ధర్మాచార్యులు ‘సనాతన ధర్మపరిరక్షణ సదస్సు’ అలాంటిదే. ‘పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్। ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే।।’ (సజ్జనుల సంరక్షనార్థం, దుష్టజన శిక్షణ కోసం, ధర్మస్థాపన కోసం ప్రతి యుగంలోనూ నేను అవతరిస్తూనే ఉంటాను) అన్న కృష్ణభగవానుని వాక్కును గుర్తుచేసుకుని సాధుసంతులు, ధర్మాచార్యులు సనాతన ధర్మ సంరక్షణ అనివార్య సంగ్రామానికి శ్రీకారం చుట్టారు.
నిత్యం ఏదో ఒకచోట ఆలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసం, ఆలయాల ఆస్తులను కొల్లగొట్టే కుట్రల వరకు అనేక విధాలుగా హిందూధర్మం లక్ష్యంగా దాడులు, దౌర్జన్యాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఈ పరిస్థితి ఒక్క ఏపీలోనే కాదు, ఇతర రాష్ట్రాల్లో, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో అన్యమత రక్షకులు హిందూధర్మంపై ప్రత్యక్ష, పరోక్షయుద్ధం సాగిస్తున్నారు. చాపకింద నీరులా విస్తరించే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇలాంటి సమయంలో మన ప్రముఖ మఠాధిపతులు సమావేశమై ప్రభుత్వాలను హెచ్చరించారు.
ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్న ఇలాంటి సంఘటన లకు, ఆంధప్రదేశ్‌లో జరుగుతున్న దుర్ఘటనలకు మధ్య కొంత వ్యత్యాసం ఉంది. ముఖ్యమంత్రి వ్యక్తిగత, కుటుంబ మతవిశ్వాసాలను సంతృప్తిపరిచే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. హిందూమతం పట్ల వివక్ష చూపుతోంది. ఇది ఆరోపణ కాదు, అక్షర సత్యం. పాస్టర్లకు ఖజానా నుంచి జీతాలు చెల్లించాలని వైసీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పుడే అసలురంగు బయటపడింది.
ప్రాథమిక స్థాయిలోనే ఇంగ్లిష్ మీడియం, సంక్షేమం ముసుగులో మత మార్పిళ్లను ప్రోత్స హించడం వంటి క్రైస్తవ ఎజెండాను అమలుచేసే ప్రయత్నాలు ప్రభుత్వం చేసింది. ఆ అండ చూసుకుని క్రైస్తవ మత సంస్థలు బహిరంగంగా మత ప్రచారం సాగిస్తున్నాయి. మతమార్పిళ్లకు పాల్పడుతున్నాయి.ఈ వాతావరణమే హిందూ వ్యతిరేక శక్తులకు ఊతం ఇచ్చింది. రాష్ట్రంలో దేవాలయాలపై జరుగుతున్న దాడులకు ఇతర కారణాలు ఉంటే ఉండవచ్చు గానీ, అన్యమతాలకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహమే ప్రధాన కారణమన్నది కాదనలేని నిజం.
ఆలయాల మీద దాడులు ఒకటి, వాటి మీద ప్రభుత్వ స్పందన, మంత్రుల వ్యాఖ్యలు మరొకటి. అవన్నీ హిందువుల మనోభావాలను మరింతగా గాయపరిచాయి. అయినా హిందూ సమాజం, హిందూధర్మ పరిరక్షణ సంస్థలు, ధర్మాచార్యులు సహనమే చూపారు. అయితే రామతీర్థంలో గుర్తుతెలియని వ్యక్తులు హిందువుల ఆరాధ్య దైవం శ్రీరామచంద్రమూర్తి విగ్రహం తలను తొలగించడం, ఈ సంఘటన నుంచి రాజకీయ లబ్ధిని పొందేందుకు అధికార (వైసీపీ), ప్రతిపక్ష (తెలుగుదేశం) పార్టీలు సాగించిన అరాచక రాజకీయం హిందువులు మేల్కొనేలా చేసింది. రాజకీయాలకు, కులాలకు అతీతంగా ఏకమై సనాతన ధర్మాన్ని రక్షించుకోవలసిన అగత్యాన్ని కొంచెం ఆలస్యంగానే అయినా హిందూ సమాజం గుర్తించింది.
ఈ నేపథ్యంలో హిందూ ధర్మం మీద దాడికి నిరసన కోసం ఫిబ్రవరి మొదటివారంలో నిర్మాణాత్మ కంగా తొలి అడుగు పడింది. తిరుపతి సమీపంలో తమిళనాడుకు చెందిన పోన్పాడి గ్రామంలో ధర్మా చార్యులు ‘సనాతన ధర్మపరిరక్షణ సదస్సు’ నిర్వహిం చారు. రామజన్మభూమి అయోధ్యలో శ్రీరామచంద్రు డికి దివ్యమైన గుడి కట్టేందుకు యావత్ హిందూ సమాజం దీక్షాబద్ధమైన సమయాన రాముడు నడయాడిన పుణ్యభూమి (రామతీర్థం)లో రాముల వారి విగ్రహ శిరశ్ఛేదానికి తెగబడటం సహించరాని, క్షమించరాని దురాగతం అని ధర్మాచార్యుల సదస్సు అగ్రహం వ్యక్తంచేసింది. అటువంటి దుష్కృత్యాలకు పాల్పడిన దుండగులను రాష్ట్ర ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా శిక్షించాలని డిమాండ్ చేసింది.
గతంలోనూ ఇలాంటి ప్రయత్నాలు జరిగినా ఈ సదస్సులో హిందూ సమాజాన్ని ఏకతాటిపై నడిపే లక్ష్యంతో విభిన్న మార్గాలలో హిందూధర్మ యాత్ర సాగిస్తున్న ధర్మాచార్యులు అందరూ ఏకమయ్యారు. సనాతన ధర్మాన్ని అనుసరించే విభిన్న శాఖలకు, సంప్రదాయాలకు ప్రాతినిధ్యం వహించే పలువురు ధర్మాచార్యులు సదస్సులో పాల్గొన్నారు. అలాగే, రానున్న రోజుల్లో కంచి కామకోటి జగద్గురువు శంకర పీఠాధీశ్వరులు శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతీ మహా స్వామి సారథ్యంలో హిందూధర్మ రక్షణకు చేపట్ట వలసిన చర్యలపై చర్చించి భవిష్యత్ కార్యా చరణను రూపొందించేందుకు తిరుపతిలో విస్తృత స్థాయిలో సాధుసంతుల సభ జరపాలని నిర్ణయించారు.
సదస్సులో కంచి కామకోటి జగద్గురువు శంకర పీఠాధీశ్వరులు శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతీ మహాస్వామి, శృంగేరి జగద్గురు పీఠాధీశ్వరులు శ్రీశ్రీశ్రీ భారతీతీర్థ మహాస్వామి వారి ప్రతినిధిగా శృంగేరి శారదా పీఠం పాలకులు శ్రీ గౌరీశంకర్, పెజావర్ మఠాధిపతి శ్రీశ్రీశ్రీ విశ్వప్రసన్న తీర్థ మహాస్వామి, హంపి విద్యారణ్య మహా సంస్థాన పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విద్యారణ్య భారతీ మహాస్వామి, పుష్పగిరి పీఠాధీ శ్వరులు శ్రీశ్రీశ్రీ విద్యాశంకర భారతీ మహాస్వామి, తుని సచ్చిదానంద తపోవన పీఠాధీశ్వరులు శ్రీశ్రీశ్రీ సచ్చిదానంద సరస్వతీ మహాస్వామి, అహోబిల మఠాధీశ్వరులు శ్రీమతే శ్రీవన్ శఠగోప రంగనాథ యతీంద్ర మహాదశికన్ మహాస్వామి వారి ప్రతినిధి, శ్రీ భువనేశ్వరీ మహాపీఠ ఉత్తరాధికారి శ్రీశ్రీశ్రీ కమలానందభారతి మహాస్వామి, శ్రీ ముముక్షుజన మహా పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ ముత్తీవి సీతారాం గురువర్యులు తదితరులు ఉన్నారు.
ఈ సదస్సు సూచనల రూపంలోనే అయినా, మృదువుగానే అయినా ప్రభుత్వానికి స్పష్టమైన మార్గ నిర్దేశనం చేసింది. అంతే సున్నితంగా హెచ్చరికలు చేసింది. రాష్ట్రంలో ఒక పథకం ప్రకారం అన్యమత విశ్వాసకులు దేవాలయాలపై సాగిస్తున్న దాడులను, దేవీదేవతల విగ్రహాలను ధ్వంసం చేసే, హిందూవుల మనోభావాలను కించపరిచే ధోరణిని ఇలాగే ఉపేక్షిస్తే అది వినాశనానికి దారి తీస్తుందని ధర్మాచార్యులు పాలకులను హెచ్చరించారు. దేవాలయ వ్యవస్థను రక్షించటం, దైవాపచారాలకు పాల్పడే దుండగులను కఠినంగా శిక్షించటం ప్రభుత్వ కర్తవ్యమని సదస్సు గుర్తుచేసింది. ధర్మానికి గ్లాని కలిగినప్పుడు ధర్మాచార్యులు తమకేమీ పట్టనట్టు మిన్నకుండజాలరని హెచ్చరించారు. రాజ్యాంగాన్ని అపహసించి, ఒక మతం పట్ల పక్షపాతంతో హిందూ మతాన్ని మట్టుపెట్టే వినాశకర ధోరణిని పాలకులు తక్షణం విడనాడాలని ధర్మాచార్యులు హితవు చెప్పారు.
దేవాలయాలపై జరుగుతున్న దాడుల విషయం మాత్రమే కాదు, దేవాలయాల ఆస్తుల పరిరక్షణ, భక్తులు కానుకల రూపంలో సమర్పించిన సొమ్మును ప్రభుత్వం దుర్వినియోగం చేస్తున్న తీరును కూడా ఈ సదస్సు చర్చించింది. మైనారిటీల మెప్పు కోసం హిందూ ఆలయాల సొమ్ము విచ్చలవిడిగా దుర్విని యోగం అవుతున్నదని ఆక్షేపించింది. దేవస్థానాల పరిపాలనలో హైందవేతరుల, హిందూ మత వ్యతిరేకుల పెత్తనం పెరిగిందని, అనుచిత ప్రలోభాలతో, ఒత్తిళ్లతో అక్రమ మతాంతరీకరణలు ముమ్మరమయ్యాయని ఆగ్రహం వ్యక్తంచేసింది. మత మార్పిళ్లు రాష్ట్రమంతటా బాహాటంగా సాగుతున్నా యని, ఫిర్యాదులు చేసినా అధికార యంత్రాంగం లక్ష్యపెట్టటం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. అంతేకాదు, ఆంధప్రదేశ్ సహా కేరళ, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలలో సనాతన ధర్మం, హిందూ సంస్కృతి, విశ్వాసాల మీద వివిధ దిశలలో జరుగుతున్న దాడులపై సదస్సు ఆవేదనను వ్యక్తం చేసింది.
ప్రస్తుత ప్రభుత్వం హయాంలో జరుగుతున్న సంఘటనలనే కాదు, గత ప్రభుత్వ హయాంలో కృష్ణ పుష్కరాల సందర్భంగా దేవాలయాలను తొలగించిన తీరును ధర్మాచార్యులు తీవ్రంగా తప్పుపట్టారు. హిందూ దేవస్థానాల పరిసరాలలో, దేవాలయ ప్రాంగణాలలో అన్యమత ప్రచారాలు, అన్యమత చిహ్నాల ప్రదర్శనలు నిరాఘాటంగా సాగుతున్నాయి. తిరుమల, శ్రీశైలం, సింహాచలం వంటి పవిత్ర పుణ్య క్షేత్రాలలో అన్యమతస్తుల ఆగడాలకు అంతులేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం సనాతన హిందూధర్మంపై దాడులకు, తీరని అపచారాలకు బాధ్యులైన వారిని వెంటనే గుర్తించి శిక్షించాలని ప్రభుత్వానికి కర్తవ్యబోధ చేశారు. దేవాలయాల నిధులను ధార్మికేతర కార్యక్ర మాలకు మళ్లించరాదని స్పష్టంచేశారు. ఆ నిధుల్ని దేవాలయాల అభివృద్ధికీ ధర్మ ప్రచారానికీ మాత్రమే వెచ్చించాలని ప్రభుత్వానికి హితబోధ చేశారు.
దేవాలయ వ్యవస్థపై ప్రభుత్వ నియంత్రణ, దేవదాయ ధర్మదాయశాఖ పనితీరు, దేవుడి అస్తుల, ఆభరణాల భద్రత, అర్చకుల సంక్షేమం, భక్తుల సౌకర్యాలు వంటి అనేక అంశాలకు సంబంధించి ఉత్పన్నమైన వివాదాలను, అభియోగాలను, విజ్ఞుల సూచనలను అధ్యయనం చేసి పరిస్థితిని చక్కదిద్దే మార్గాన్ని సూచించేందుకు రిటైర్డ్ న్యాయముర్తి అధ్యక్షతన ఒక ఉన్నతస్థాయి కమిటీని నియమించాలి. పీఠాధిపతులు, విజ్ఞుల సలహాలతో వివిధ రంగాలకు చెందిన నిపుణులను ఆ కమిటీలో సభ్యులుగా నియమించాలని సదస్సు డిమాండ్ చేసింది.
దేవాలయ ఆస్తుల, సంప్రదాయాల, ఆచారాల పరిరక్షణ నిమిత్తం ఆలయాలలో భక్త సంఘాలు ఏర్పర్చాలని, ఆర్కియాలజీ పరిధిలోని ప్రాచీన దేవాలయాల్లో పూజలకు అనుమతులివ్వాలని సదస్సు సూచించింది. అలాగే దేశవ్యాప్తంగా అనేక ప్రాచీన దేవాలయాల్లో ఆర్కియాలజీ విభాగం ఏకపక్ష ధోరణి వల్ల ఆయా దేవాలయాల్లో ధూప, దీప, నైవేద్యాలు లేకుండా పోయాయని ఆందోళన వ్యక్తంచేసింది. అధికారులు ధర్మాచార్యులతో సంప్రదింపులు జరిపి గర్భ గృహంలో పూజలు జరిగేలా, ఆయా దేవాల యాల ప్రాచీనతను కాపాడడంలో ఆర్కియాలజీ వారి నియమాలను పాటించే విధంగా ఒక సమన్వయ మార్గాన్ని కేంద్ర సాంస్కృతికశాఖ రూపొందించాలని ధర్మాచార్యులు సూచించారు. ప్రభుత్వాన్ని నడిపేవారు రాజ ధర్మాన్ని విస్మరించినప్పుడు ధర్మ సంరక్షణకు ప్రజలే సిద్ధం కావాలి. సనాతన ధర్మాన్ని, హిందూ మతాన్ని కాపాడుకోవటానికి నిరంతరం జాగరూకత చూపాలి. హిందువులందరూ దీర్ఘకాలిక ధర్మ పోరాటానికి సమైక్యంగా కదలాలని సదస్సు పిలుపు నిచ్చింది.
అయితే వైసీపీ ప్రభుత్వం ధర్మాచార్యుల ధర్మవాక్కును ఏ మేరకు స్వీకరిస్తుందో, ఎలా స్పందిస్తుందో, ఎలాంటి దిద్దుబాటు చర్యలు తీసుకుం టుందో చూడవలసి ఉంది. అలాగే ఈ సమావేశం రహస్యంగా జరిగిందని కొన్ని వార్తా సంస్థలు చెప్పడం సరికాదు.
– రాజనాల బాలకృష్ణ, సీనియర్ జర్నలిస్ట్