‘‌దేవుడు చేసిన మనుషుల్లారా! మనుషులు చేసిన దేవుళ్లారా! మీ పేరేమిటి?’ అని ప్రశ్నించాడు మహాకవి గురజాడ అప్పారావు. ఇప్పుడు, ఘనత వహించిన ఈ సెక్యులర్‌ ‌భారతంలో హిందూదేవుళ్ల స్థానం ఎక్కడ? ఈ పుణ్యభూమిలో ఇప్పుడు వారెవరు? అని మనను మనమే ప్రశ్నించుకోవాలి. హిందువుల ఆరాధ్యదైవాల స్థానం కొన్ని శతాబ్దాలుగా చెరసాలేనన్నది ఆ ప్రశ్నకు సమాధానం. మొన్న ముస్లిం పాలకులు, నిన్న ఆంగ్లేయులు, ఇప్పుడు సెక్యులర్‌ ‌ప్రభుత్వాలకు హిందూదేవస్థానాలు ఆయాచితంగా వచ్చిన ఏటీఎంలుగా మారిపోయాయి. ధర్మకర్తల పేరుతో రాజకీయ నిరుద్యోగులు దేవస్థానాలలో చొరబడి సర్వభ్రష్టం చేస్తారు. పుణ్యక్షేత్రాలు రాజకీయ పునరావాసాలుగా మారిపోయాయి. హిందూధర్మం మీద గౌరవం లేనివారు ధర్మకర్తలుగా రావడమే పెను విషాదం. వాటి ఆస్తులను ఇష్టారాజ్యంగా వినియోగించేది వీళ్లే. దేవాలయ భూములు ఇళ్లస్థలాలుగా పంచాలంటుంది ఒక పార్టీ. కొవిడ్‌ ‌కోసం డబ్బులు ఇమ్మంటుంది మరొక పార్టీ. ఆలయాలను కొవిడ్‌ ‌వార్డులుగా మార్చమంటారు. అయితే మసీదులలో, చర్చ్‌లలో మాత్రం సెక్యులర్‌ ‌ప్రభుత్వాలకు ప్రవేశం నిషిద్ధం. వాటి నుంచి ఒక్క రూపాయి తీసుకోవడానికి కూడా ప్రభుత్వాలకు ధైర్యం లేదు. హిందూ దేవాలయాల మీద మాత్రం కోట్ల రూపాయలు పన్నుల రూపంలో దండుకుంటాయి. కానీ నిజం ఏమిటి? రాజ్యాంగం ఏం చెబుతోంది? దేవస్థానాలలో ప్రభుత్వ జోక్యం ఉంటే అది సెక్యుల రిజం కాబోదు. అయినా ఇక్కడి ప్రభుత్వాలు ఏడు దశాబ్దాలుగా సెక్యులర్‌ ‌ప్రభుత్వాలుగా చెలామణి అయిపోతున్నాయి. లక్షల ఎకరాలు, కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి. అందుకే మా దేవుళ్లకు సెక్యులరిస్టు ప్రభుత్వాల రక్షణ అవసరం లేదని ఇప్పుడు హిందువులు ఎలుగెత్తి చాటుతున్నారు.

‘‌చర్చ్‌ల మీద, మసీదుల మీద ప్రభుత్వ అజమాయిషీ లేనప్పుడు హిందూ దేవాలయాల మీద మాత్రం ఎందుకు ఉండాలి?’ ఇప్పుడు ఇది అందరూ వేసుకుంటున్న ప్రశ్న. ఇందుకు కారణం పలు రాష్ట్ర ప్రభుత్వాలే. ఇంకా చెప్పాలంటే ఘనత వహించిన సెక్యులర్‌ ‌ప్రభుత్వాలే కూడా. సెక్యులరిజం మీద శాశ్వత హక్కులు ఉన్నాయని చెప్పుకునే రాజకీయ పార్టీల వైఖరి, ఆ పార్టీల అత్యుత్సాహం, హిందువుల మనోభావాలను ఖాతరు చేయక్కరలేదన్న అహంకారం కూడా ఇలాంటి ప్రశ్నకు పదును పెట్టాయి. కరోనా నేపథ్యంలో ఒక కాంగ్రెస్‌ ‌నాయకుడికి అమోఘమైన ఆలోచన వచ్చింది. గుళ్లల్లో మూలుగుతున్న టన్నుల కొద్దీ బంగారం మూటగట్టుకొచ్చి కొవిడ్‌ ‌నివారణకి ఉపయో గించండి అంటూ పిలుపునిచ్చేశాడాయన. కొవిడ్‌ ‌నివారణకు డబ్బులు ఇవ్వవలసిందేనని ఇంకొక రాష్ట్ర ప్రభుత్వం ఆలయాలను దాదాపు ఆదేశించింది. తాజాగా తమిళనాడు అసెంబ్లీకి జరగనున్న ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వ చెర నుంచి ఆలయాల విముక్తి అంశం ఊపందుకుంటున్నది. ఆంధప్రదేశ్‌లో పరిస్థితులు చూసినా ప్రభుత్వ అధీనంలో హిందూ దేవాలయాలు ఉండడం ఎంత ప్రమోదకరమో అందరికీ అర్ధమైంది.

భారతదేశంలో అంతో ఇంతో ప్రసిద్ధిగాంచిన హిందూ దేవాలయాలు 9 లక్షలని అంచనా. వీటిలో నాలుగు లక్షలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల చెరలో ఉన్నాయి. ప్రభుత్వాల అధీనంలో లేదా అజమాయిషీలో ఉన్నాయనడం ఇక్కడ చిన్న మాటే అవుతుంది. కానీ చర్చ్‌ల మీద, మసీదుల మీద సెక్యులర్‌ ‌ప్రభుత్వాలకు అధికారం లేదు. కాబట్టే ది హిందు రెలిజియస్‌ అం‌డ్‌ ‌చారిటబుల్‌ ఎం‌డోమెంట్స్ (‌హెచ్‌ఆర్‌సీఈ) చట్టం, 1951ని సవరించవలసిందేనన్న వాదన, ఆలయాల మీద ప్రభుత్వ అజమాయిషీ ఎందుకన్న ప్రశ్న బలపడుతున్నాయి. భారత అత్యున్నత న్యాయస్థానం తీర్పు ప్రకారం ఏ ప్రభుత్వమైనా హిందూ దేవాలయాలను తాత్కాలికంగానే అజమాయిషీ చేయవచ్చు. ఇందుకు విరుద్ధమైన వాతావరణాన్ని కల్పిస్తున్నది 1951 నాటి చట్టమే. దీని ప్రకారం ప్రభుత్వం తలుచుకుంటే ఏ హిందూ దేవాలయం మీదనైనా అజమాయిషీ చేయవచ్చు. వాటి ఆస్తులను చేతుల్లోకి తీసుకోవచ్చు.

హిందూ దేవుళ్లకు చెర

హిందూ దేవస్థానాలను మాత్రమే తమ చెరలో పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వాలు భారతదేశంలో పదిహేను ఉన్నాయి. కానీ, గుళ్లూ గోపురాలనూ ప్రభుత్వాలు ఊరికే ఏమీ చెరలో ఉంచుకోవడం లేదు. చెరలో భద్రంగా ఉంచేందుకూ, దాని నిర్వహణకు 13 నుంచి 18 శాతం సేవా రుసుముగా కూడా తీసుకుంటున్నాయి. ఇలా తీసుకోవడం హిందువుల హక్కులను హరించడమేనన్నది ఎప్పటి నుంచో ఉన్న విమర్శ. అంతేకాదు, చాలా ప్రభుత్వాలు, వాటిని నడిపే పార్టీలు ఘనంగా ప్రవచించే సెక్యులర్‌ ‌వ్రతానికి ఇది పరమ విరుద్ధం. అయినా ఆయా రాష్ట్రాలలో యథేచ్ఛగా సాగిపోతోంది, ఈ దుండగీడుతనం. అందుకే ఈ విధానానికీ, అలనాటి ముస్లిం దురాక్రమణదారుల పరమత అసహనానికీ, ఆంగ్లేయుల దోపిడీ శైలికీ తేడా ఏమిటని ఇప్పుడు చాలామంది హిందువులు నిగ్గదీస్తున్నారు. 1951 నాటి హెచ్‌ఆర్‌సీఈ అమలు ఆరంభమైనది ప్రథమ ప్రధాని, ఈ దేశ సెక్యులర్‌వాద పితామహుడు నెహ్రూ హయాంలోనే. ‘సంప్రదాయకంగా చూస్తే భారతదేశంలో ఏ చక్రవర్తి, పాలకుడు కూడా దేవాలయాల మీద అజమాయిషీ చేయలేదు. ఇప్పుడు చర్చ్‌లను, మసీదులను వదిలిపెట్టి హిందూ దేవాలయాల మీదనే ప్రభుత్వం ఆధిపత్యం చెలాయించడాన్ని మేం వ్యతిరేకిస్తున్నాం. 1951 నాటి చట్టాన్ని సవరించాలని చెబుతున్నాం’ అని సుప్రీంకోర్టు న్యాయవాది జె. సాయిదీపక్‌ ‌బల్లగుద్ది వాదిస్తున్నారు. హిందూ దేవాలయాల మీద అజమాయిషీ దక్కింది కదా అని, వాటి ఆస్తులను ఆధ్యాత్మిక కార్యక్రమాలకు తప్ప వేరొక విధంగా ఉపయో గించడం రాజ్యాంగంలోని 25,26 అధికరణాలకు విరుద్ధమని ఆయన గుర్తు చేశారు.

సుప్రీంకోర్టు తీర్పు ఏం చెబుతోంది?

గమనించవలసిన అంశం ఏమిటంటే, హిందూ దేవాలయాల మీద ప్రభుత్వ అజమాయిషీ గురించి భారత అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఆఖరి మూడు తీర్పులు కూడా, ఆయా దేవస్థానాల నిర్వహణ బాధ్యత ఆయా వర్గాలకు అప్పజెప్పండనే ఆదేశిస్తున్నాయి. ఏ ఒక్క ప్రభుత్వం ఆలయాలను అప్పగించడానికి ఇంతవరకు ముందుకు రాలేదు. ఇలాంటి ప్రభుత్వాల సంగతేమిటో చెప్పాలని కోరుతూ మరొక రెండు వ్యాజ్యాలు ప్రస్తుతం అత్యున్నత న్యాయస్థానం విచారణ కోసం వేచి ఉన్నాయి. ఇందులో ఒక వ్యాజ్యం ఉద్దేశం- మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ ‌ప్రముఖుడు పృథ్వీరాజ్‌ ‌చవాన్‌ ‌ప్రకటనకు చెందినది. ఆయన అన్నాడు, దేవస్థానాలలో మూలుగుతున్న ఒక ట్రిలియన్‌ ‌డాలర్ల విలువ చేసే (ఒకటి పక్కన పద్దెనిమిది సున్నాలు) బంగారు నిల్వలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని కొవిడ్‌ 19 ‌నివారణకు ఉపయోగించాలి అని. ప్రభుత్వం స్వాధీనం చేసుకోగలిగింది చర్చ్‌లూ, మసీదుల ఆస్తులు కాదు. ఎందుకంటే, వాటిమీద సెక్యులర్‌ ‌ప్రభుత్వాల పెత్తనం సాగదు. ఉన్నదల్లా హిందూ దేవాలయాల మీదే. పైగా బంగారపు కానుకలు తమ దేవుళ్లకు భక్తిగా సమర్పించుకునేది కేవలం హిందువులే. కాబట్టి చవాన్‌ ‌గారి దివ్య సందేశం హిందూ దేవుళ్ల బంగారం యావత్తూ కొల్లగొట్టుకు రమ్మనే! హిందువుల గుడులు, అంతో ఇంతో గురుద్వారాలకే చవాన్‌ ‌గారి పిలుపు వర్తిస్తుంది. ఈ పిలుపే దేశంలో చాలామంది హిందువులను తమ గుళ్లు, దేవుళ్ల పరిస్థితి గురించి ఆలోచించే టట్టు చేస్తోంది.

ఇవీ లెక్కలు

‘ఒక్క ఆంధప్రదేశ్‌ ‌ప్రభుత్వాన్నే కాదు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సహా దేశంలోని అన్ని సెక్యులర్‌ ‌ప్రభుత్వాలను ఈ ప్రశ్నలు అడుగుతున్నాను. రాష్ట్ర ప్రభుత్వాలు ఆలయాల వార్షికాదాయంలో 23.4 శాతం పన్నుగా వసూలు చేస్తున్నాయి. ఇందులో ధర్మాదాయ శాఖ పాలనావ్యయం కోసం తీసుకునే పన్ను (15 శాతం), ఆడిట్‌ ‌రుసుము (2 శాతం), కామన్‌ ‌గుడ్‌ఫండ్‌ (2 ‌శాతం) ఉన్నాయి. అర్చక సంక్షేమ నిధి కోసం, ఇతర అవసరాలకు కూడా ఆలయాల నుంచే డబ్బు తీసుకువెళుతున్నారు. కానీ ఒక్క రూపాయి ఏ చర్చ్ ‌నుంచి కానీ, ఒక్క రూపాయి ఏ మసీదు నుంచి కానీ వసూలు చేయడం లేదు. మరి ఒక్క హిందూ దేవాలయాల మీదే ఎందుకు పన్ను విధిస్తున్నారు? రాజ్యాంగంలోని 26వ అధికరణం మేరకు ధార్మిక సంస్థల నుంచి పన్ను వసూలు చేసే అధికారం ప్రభుత్వాలకు లేదు. అయినా ఎందుకు హిందూ దేవాలయాలు చెల్లించాలి?’ అని అడుగుతున్నారు చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్‌ (‌నవంబర్‌ 25, 2019, ఇం‌డియన్‌ ఎక్స్‌ప్రెస్‌, ‌చిలుకూరు బాలాజీ ఆలయం- తెలంగాణ, ప్రధానార్చకులు రంగరాజన్‌ ‌పెట్టిన ఒక వీడియోను పవన్‌ ‌కల్యాణ్‌ ‌షేర్‌ ‌చేశారు). దీనికి సమాధానం రాకపోవచ్చు. కానీ ప్రజలను ఇది ఆలోచింప చేస్తోంది. దేశంలో ప్రభుత్వాల అధీనంలో ఉన్న హిందూ దేవాలయాల మీద ఎక్కడైనా గానీ ఇలా ఒకే విధమైన భారం మోపుతున్నారు. 23.4 శాతం ప్రభుత్వం పన్ను రూపంలో తీసుకుంటోంది. ఇక 70 శాతం ఆదాయం ఆలయ పరిపాలనా వ్యయంగా మారుతోంది. కేవలం రెండు లేదా మూడు శాతమే ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు, ధూపదీప నైవేద్యాలకు ఖర్చు పెడుతున్నారు. స్పష్టమైన ఒక ఉదాహరణ చూద్దాం! తమిళనాడులోని పళనిలో ఉన్న దండాయుధపాణి ఆలయం హుండీలో పడిన సొమ్మంతా నిర్దేశించుకున్న బ్యాంకులో జమ చేస్తారు. ఇందులో 14 శాతం పరిపాలనా వ్యయంగా తీసుకుంటారు. నాలుగు శాతం ఆడిట్‌ ‌రుసుముగా పోతుంది. 25 నుంచి 40 శాతం ఉద్యోగుల జీతభత్యాల కోసం వెచ్చిస్తారు. 1 నుంచి 2 శాతం పూజాదికాలకి ఇస్తారు. 4 నుంచి 10 శాతం కామన్‌ ‌గుడ్‌ఫండ్‌. ‌మిగిలిన సొమ్మును ప్రభుత్వం నిర్వహించే ఉచిత భోజన పథకం వంటి వాటికి మళ్లిస్తారు. అంటే దేవుడి సొమ్ములో 65 శాతం నుంచి 70 శాతం దేవాలయేతర కార్యకలాపాలకే ఖర్చు చేస్తున్నారు. దేవుడిని కనిపెట్టుకుని ఉండే అర్చకులకు ఇచ్చే జీతాలు కూడా చాలా తక్కువ. కొన్నిచోట్ల అది కూడా లేదు.‘శ్రీరంగం రంగనాథ ఆలయం నిర్వహణ కింద ప్రభుత్వానికి రూ. 18.56 కోట్లు పన్నుగా చెల్లించింది (2010-2011).’ అని బీజేపీ ఎంపీ డాక్టర్‌ ‌సుబ్రమణ్య స్వామి ఒక వ్యాసంలో రాశారు. అయితే ‘ఉత్సవాల సమయంలో వేద పఠనం చేసే వారికి, మంత్రాలు చదివేవారికి మాత్రం జీతాలు లేవు. అర్చన టిక్కెట్ల ద్వారా వచ్చిన డబ్బులే వారికి ఇస్తారు’ అని కూడా డాక్టర్‌ ‌స్వామి రాశారు. అంటే శతాబ్దాలుగా భక్తులూ, దాతలూ ఏ ఉద్దేశంతో దేవుళ్లకు తమ ధనాన్ని సమర్పించుకున్నారో, ఆ ఆశయం ఇంత దారుణంగా భగ్నమవుతోంది.
హిందూ ఆలయాల సొమ్ము

సెక్యులర్‌ ‌సర్కార్ల పాలు

రాజుల సొమ్ము రాళ్లపాలు అనేవారు. ఆధునిక కాలంలో ఏం జరుగుతోంది? తమిళనాడులో 38,000 గుళ్లు, 56 మఠాలు, వీటికి చెందిన 4,78,000 ఎకరాలు ప్రభుత్వం గుప్పెట్లో ఉన్నాయి. డీఎంకే, అన్నాడీఎంకే నేతలు ఎవరికి ఎవరూ తీసిపోకుండా ఆలయ ఆస్తులను తస్కరిస్తూనే ఉన్నారు. దుర్వినియోగం చేస్తూనే ఉన్నారు. ఆంధప్రదేశ్‌లో (34,000) కూడా అత్యధికంగా హిందూ దేవాల యాలు ప్రభుత్వం చెరలో ఉన్నాయి. అటు శ్రీకూర్మం, అరసవల్లి, సింహాచలం, అన్నవరం, విజయవాడ దుర్గ, ద్వారకా తిరుమల, అంతర్వేది.. వందలాది దేవాలయాలు.. ఒకటి రెండు తప్ప మిగిలిన వాటి పాలన గురించి ఎవరూ మంచిమాట చెప్పలేరు. దేవస్థానాల ఉద్ధరిస్తామని తీసుకున్న ప్రభుత్వం కనీసంగా తన కర్తవ్యం నిర్వహించడం లేదని చెప్పడానికి ఇప్పుడు జరుగుతున్నదే సాక్ష్యం. తిరుమల బంగారం తాకట్టు వ్యవహారం, దుర్గగుడి రథం వెండి సింహాల మాయం, రామతీర్థంలో దుర్ఘటన, అంతర్వేది రథం దగ్ధం ఇవన్నీ ప్రభుత్వ అధికారుల హయాంలోనే జరిగాయి. ఒక్క హైదరాబాద్‌ ‌నగరంలోనే 445 ఆలయాలు ఉన్నాయి. చిలుకూరు బాలాజీ దేవాలయం, బాసర, యాదగిరిగుట్ట, కీసర, వేములవాడ వంటి గొప్ప క్షేత్రాలు తెలంగాణలో ఉన్నాయి.

లక్షల ఎకరాలు అన్యాక్రాంతం

చెన్నై భక్త సంఘం అధ్యక్షుడు టీఆర్‌ ‌రమేశ్‌ ఇచ్చిన వివరాలు చూద్దాం. 1986- 2005 మధ్య 47,000 ఎకరాల తమిళనాడు ఆలయాల భూమి అన్యాక్రాంతమైందని ఆయన లెక్క చెప్పారు. ఎంతో విలువ చేసే కోటి చదరపుటడుగుల స్థలాలు కూడా కబ్జాలో ఉన్నాయని అన్నారు. తమిళనాడులోని హిందూ దేవాలయాలకు 4,78,000 ఎకరాల భూమి, 2.44 చదరపు అడుగుల కోట్ల విలువచేసే స్థలాలు ఉన్నాయి. వీ•న్నిటి మీద రాష్ట్ర దేవాదాయ శాఖ పొందుతున్నది కేవలం ఏడాదికి రూ. 58 కోట్లు. ఇక దేవాదాయ శాఖ అధీనంలో ఉన్న ఆలయాల నుంచి అదృశ్యమైన అద్భుత కళాఖండాలు ఎన్నో! కేరళ పరిస్థితి కూడా దాదాపు ఇంతే. హిందూధర్మం మీద గౌరవం లేని కమ్యూనిస్టుల పాలనలో అక్కడి హిందూ దేవాలయాలు ఎలాంటి దుస్థితికి లోనవుతున్నాయో అయ్యప్ప ధర్మసేన అధ్యక్షుడు రాహుల్‌ ఈశ్వర్‌ ‌చెప్పారు. ‘కేరళలో నాలుగు దేవస్థానాలు ఉన్నాయి. గురువాయుర్‌, ‌మబార్‌, ‌తిరువనంతపురం, కొచ్చిన్‌. ‌ప్రతి దేవస్థానా నికి సభ్యులను ప్రభుత్వమే నియమిస్తుంది. కమ్యూ నిస్టులు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ల పార్టీ సభ్యులతో దేవస్థానం బోర్డులను నింపుతారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉంటే ఎజువాలు, నాయర్ల మధ్య సమతౌల్యం పాటిస్తుంది. ఇదంతా ఓటు బ్యాంకు రాజకీయాల ప్రాతిపదికగానే జరుగుతుంది’ అన్నారాయన. హుండీల ద్వారా వచ్చిన ధనాన్ని సనాతన ధర్మానికి గాని, పేద హిందువుల కోసం గాని, ఆసుపత్రుల కోసం గాని, అనాథాశ్రమాల కోసం గాని వినియోగించరు. కానీ ఖర్చు మాత్రం కనిపిస్తుందని కూడా చెప్పారాయన. కర్ణాటకలో 34,500 ఆలయాలు ప్రభుత్వ అధీనంలో ఉన్నాయి. హిందూత్వం మీద నమ్మకం లేని కమ్యూనిస్టులు, ద్రవిడ పార్టీలు ఆలయాల వ్యవహారాలలోకి చొరబడుతున్నారంటే దండుకోవడానికి తప్ప మరొక ఉద్దేశంతో కానేకాదు.

కొవిడ్‌ 19 ‌కోసం దేవుడి డబ్బా!

ఏప్రిల్‌ 22, 2020‌న తమిళనాడులోని అన్నాడీఎంకే ప్రభుత్వం ఒక ఆదేశం పంపించింది. కొవిడ్‌ 19‌ని ఎదుర్కొనడానికి రాష్ట్ర ప్రభుత్వ నిధుల సేకరణకు సంబంధించిన దివ్య సందేశమది. ఈ సందేశం మీద, హిందూ దేవాలయాలను లక్ష్యంగా చేసుకోవడం మీద రెండువారాలు మాటల యుద్ధం జరిగిన తరువాత, ఎవరో ఆ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించిన మీదట ప్రభుత్వం మొత్తానికి వెనక్కి తగ్గింది. ప్రభుత్వం చెరలో ఉన్న 47 హిందూ దేవాలయాలకు కూడా ఆ సందేశం వెళ్లింది. కొవిడ్‌ 19‌తో పోరు కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 10 కోట్లు అందచేయమని ఆ సందేశం సారాంశం. కానీ ఈ సందేశం చర్చ్‌లకీ, మసీదులకీ వెళ్లలేదు. ఇంకొక మార్పును కూడా ఈ సందేశం విషయంలో గమనించాలి. గతంలో అయితే ద్రవిడ పార్టీల ప్రభుత్వాలు కోర్టులకి ఎక్కి తమ ఆశయాలు ఎంత గొప్పవో వాదించేవి. కానీ ఈసారి మాత్రం ప్రస్తుత ప్రభుత్వం ఆ సందేశాన్నే ఉపసంహరించు కుంది. ఈ తాజా పరిణామం కూడా అసలు హిందూ దేవాలయాలు ప్రభుత్వాల చెరలో ఎందుకు ఉండాలి అన్న ప్రశ్నకు పదును పెట్టింది.

అదేం కర్మమో తెలియదు కానీ, తమిళ ప్రాంత హిందువులు మత విశ్వాసాల పట్ల చాలా అనురక్తితో ఉంటారు. అయినా అక్కడ హిందూధర్మానికీ, హిందూ ఆలయాలకీ, దేవతామూర్తులకూ జరిగినంత అవమానం ఎక్కడా జరగలేదంటే అతిశయోక్తి కాదు. ఇందుకు బూటకపు ద్రవిడ ఉద్యమం కారణం. అక్కడ రాజకీయాలు కూడా హిందూ వ్యతిరేకతే కేంద్ర బిందువుగా సాగుతూ ఉంటాయి. అన్నా డీఎంకే ఈ తిక్క నుంచి కొంచెం బయటపడినా, డీఎంకే మాత్రం ఇంకా ఆ తలతిక్కతోనే బతుకుతోంది. ప్రజలలో హిందూధర్మం పట్ల వైయక్తికమైన చింతనే తప్ప, సమైక్య శక్తిగా ఆవిర్భవించాలన్న దృష్టి కనిపించదు. కరుణానిధి అనే డీఎంకే నాయకుడు హిందూ ధర్మాన్నీ, హిందూ దేవుళ్లనీ అంతగా కించపరిచినా ఆయనకే ప్రజలు ‘పూజలు’ చేయడం కనిపిస్తుంది. అక్కడ రాజకీయాలు, పాలకులు హిందూ ద్వేషంతో నడిచాయి. అందుకే ఆలయాల రక్షణకు తరచుగా కోర్టులను ఆశ్రయించవలసిన పరిస్థితి.

ధర్మానికి చెర ఇక్కడి నుంచే

పాలకుల అధీనంలోకి హిందూ దేవాలయాలు, వాటి ఆస్తులు వెళ్లడం తమిళ ప్రాంతంలోనే ఆరంభమైంది. 1789లో ఈస్టిండియా కంపెనీ బోర్డ్ ఆఫ్‌ ‌రెవెన్యూను ఏర్పాటు చేసి ఇలాంటి ప్రమాదకర మైన ధోరణిని ప్రవేశపెట్టింది. మద్రాసు ప్రెసిడెన్సీ అంతా అంటురోగంలా అంటించింది. అంతవరకు స్థానికంగా ఉండే భక్తులు, వర్గాలే ఆలయాల నిర్వహణ చూసుకునేవి. చాలా దేవాలయాలు సమాజ శ్రేయస్సుకు ఉపకరించే కార్యక్రమాలు సహజంగానే నిర్వహించేవి. ధర్మశాలలు, గోశాలలు, పాఠశాలలు ఆలయాల ద్వారా అందుబాటులో ఉండేవి. మరి ఇప్పుడేవి? ఈస్టిండియా కంపెనీ ఈ దేశానికి ఒక చేత్తో కత్తితో, ఒక చేత్తో బైబిల్‌ ‌పట్టుకునే వచ్చింది. కొద్దికాలానికి బైబిల్‌ ఇక్కడి వాళ్ల చేతికి వచ్చి, భూమి వాళ్ల చేతుల్లోకి పోయింది. కంపెనీ లక్ష్యాలలో క్రైస్తవ విస్తరణ ఒకటి. కానీ హిందూ దేవాలయాలను ఆక్రమించుకున్నా అంతా తామే చక్కబెట్టడం లేదనీ, హిందువుల ధార్మిక వ్యవహారాలలో చొరబడడం లేదనీ నమ్మించడానికి స్థానిక పూజారులు, అర్చకులు, వేదపండితులు వంటివారిని ఆలయాల వ్యవహారాల లోకి అనుమతిస్తూ ఉండేది. నెమ్మదిగా 1840 ప్రాంతానికి ఆలయాల బాధ్యత మఠాలకు, ఆశ్రమా లకు వచ్చింది. ఇందుకు కారణం లేకపోలేదు. హిందూదేవుళ్ల ఆస్తుల బాధ్యత కంపెనీ స్వీకరించడం మిషనరీలకు నచ్చలేదు. అందుకే గుడుల మీద, మఠాల మీద కంపెనీ అజమాయిషీ ఎనభయ్‌ ‌సంవత్సరాల కంటే సాగలేదు. బ్రిటిష్‌ ‌రాణి పాలనలో, అంటే 1863లో ది రెలిజియస్‌ ఎం‌డోమెంట్స్ ‌యాక్ట్ ‌వచ్చింది. దీని ఉద్దేశం కూడా అధికారుల చేతిలో ఉన్న దేవాలయాల నిర్వహణ ధర్మకర్తలకు అప్పగించడమే. తరువాత, బ్రిటిష్‌ ‌తొత్తు జస్టిస్‌ ‌పారీ తెల్లవాళ్లను మించి హిందూధర్మానికీ, ఆ ధర్మానికి కేంద్రంగా ఉండే దేవాలయాలకీ కీడు తలపెట్టింది. మద్రాస్‌ ‌హిందూ రెలిజియస్‌ ఎం‌డోమెంట్స్ ‌యాక్ట్, 1925 ‌జస్టిస్‌ ‌పార్టీ పైత్యమే. దీని ప్రకారం ఏర్పడినదే హిందూ రెలిజియస్‌ ఎం‌డోమెంట్‌ ‌బోర్డ్. ఇక్కడే ఒక సంగతి గుర్తు చేసుకోవాలి. మొదట ఈ చట్టం పరిధిలోకి చర్చ్‌లనీ, మసీదులనీ తెచ్చారు. కానీ ఆ రెండు వర్గాలు పెద్ద ఎత్తున తిరగబడడంతో వాటిని మినహాయించి హిందూ ఆలయాలను మాత్రం లక్ష్యంగా చేసుకున్నారు. ఇక్కడ ఇలా జరిగితే దేశంలోని గురుద్వారాల గురించి ఆంగ్ల ప్రభుత్వం ఇంకొక చట్టం చేసింది. దాని ప్రకారం గురుద్వారా లను ఎంపికైన ధర్మకర్తల మండళ్లు నిర్వహించు కుంటాయి. అంటే హిందువులకు ఒక న్యాయం, సిక్కులు, ముస్లింలు, క్రైస్తవులకు ఒక న్యాయం.
రంజాన్‌కు కోట్లు,

హిందూ దేవుళ్ల కైంకర్యాలకు తూట్లు

ఆలయాల మెరుగైన నిర్వహణ, అక్రమాల నిరోధం వంటి కారణాలు చెప్పి 1936 నాటికి చాలా దేవస్థానాల మీద ఈ బోర్డు ఆధిపత్యం సంపాదిం చింది. 1940 వరకు ఈ చట్టానికి చాలా మార్పులు చేశారు. 1959లో మళ్లీ నాటి కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం హిందూ రెలిజియస్‌ అం‌డ్‌ ‌చారిటబుల్‌ ఎం‌డోమెంట్స్ ‌యాక్ట్‌ను తీసుకువచ్చింది. దీనికి సంప్రదాయ హిందువుల నుంచి తీవ్ర ప్రతిఘటనే వచ్చింది. ఆ తరువాత మరొక విధ్వంసక పరిణామం జరిగింది. 1967లో వచ్చిన డీఎంకే ఆ చట్టానికే ఇంకొన్ని సవరణలు చేసింది. తాజాగా కొవిడ్‌ 19 ‌నేపథ్యంలో అన్నాడీఎంకే ప్రభుత్వం జారీ చేసిన నిధుల సందేశం కూడా ఎంజీ రామచంద్రన్‌ 1983‌లో చేసిన సవరణ ఫలితమే. ఆలయ అదనపు నిధుల నుంచి ఇలాంటి అవసరాలకు ప్రభుత్వం ధనం తీసుకోవచ్చునని ఆ సవరణ చెబుతోంది. పేదలకు ఆహారం అందించ డానికి దేవాలయాల సొమ్ము ఇచ్చే అధికారం ఈ చట్టం ధర్మకర్తలకు ఇస్తున్నది. నేటి అన్నాడీఎంకే ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాన్ని సవాలు చేస్తూ ‘దినమలార్‌’ ‌పత్రిక ప్రచురణకర్త ఆర్‌ఆర్‌ ‌గోపాల్‌, ‌మరికొందరు హైకోర్టుకు వెళ్లారు. ఆర్‌ఎస్‌ఎస్‌ ‌పత్రిక ఆర్గనైజర్‌ (ఏ‌ప్రిల్‌ 27) ‌దీనిని జిజియా పన్ను పేరుతో విమర్శించింది. మరొక ముచ్చటైన సంగతిని కూడా ఆర్గనైజర్‌ ‌బయటపెట్టింది. ఆ సమయంలోనే వచ్చిన రంజాన్‌ ‌పండుగ కోసం అన్నాడీఎంకే ప్రభుత్వం రూ. 22 కోట్లు అలవోకగా ఇచ్చేసింది. నిజానికి 1967 నుంచి, అంటే పచ్చి హిందూ వ్యతిరేక వాదులైన ద్రవిడవాదుల పాలన ఆరంభం నుంచే అక్కడ హిందువులు ఆలయాల రక్షణ కోసం పోరాడుతున్నారు. 2016 ఎన్నికల సమయంలో బీజేపీ ఒక అద్భుతమైన హామీ ఇచ్చింది. ఇది భవిష్యత్తులో ఆలయాల విముక్తికి నాంది కాగలదని అనిపిస్తుంది. బీజేపీ అధికారంలోకి వస్తే ఆలయాల మీద ప్రభుత్వ అజమాయిషీని తొలగిస్తాం అన్నదే ఆ హామీ. చిత్రం ఏమిటంటే, ఆలయాల నుంచి సేకరించిన డబ్బులు పేదల ఆహారం, వసతి కోసం వినియోగిస్తామన్నది నోటి మాటే తప్పితే, జీవోలో ఆ ప్రస్తావనలేదు. ఎప్పటిలాగే ఇలాంటి సంక్షోభ సమయంలో దేవాలయాల ధనం పేదలకు ఉపయోగిస్తే తప్పేమిటని యథాప్రకారం కొందరు వీరంగం వేశారు. అది తప్పని ఎవరన్నారు? గతంలో ఆలయాలలో జరిగినదీ, ఇప్పటికీ కొన్ని దేవస్థానా లలో జరుగుతున్నదీ అది కాదా! కానీ ప్రజా సంక్షేమం కోసం హిందూ దేవాలయాల డబ్బే ఎందుకు? చర్చ్‌లు, మసీదులకు సైతం కోట్లాది రూపాయల ఆదాయాలు ఉన్నాయి. వందల ఎకరాల ఆస్తులు ఉన్నాయి. వాటి నుంచి ఎందుకు తీసుకోరు? తమిళనాడు బీజేపీ నాయకుడు ఎస్‌ఆర్‌ ‌శేఖర్‌ ‘‌కొవిడ్‌లో పేదలకు ఆహారం కోసం డబ్బులు కావాలంటూ మసీదులనీ, చర్చ్‌లనీ ఎందుకు అడగడం లేదు?’ అని ప్రశ్నించారు. తమిళనాడులో రాష్ట్ర ప్రభుత్వాలకు దేవస్థానాల సొమ్మును దారి మళ్లించడం ఒక అలవాటుగా మారిందని కూడా ఆయన విమర్శించారు. మరొక ప్రశ్న కూడా వచ్చింది. కొవిడ్‌ 19 ‌సమయంలో నెలల తరబడి ఆలయాలు మూతపడ్డాయి. ఇక మిగులు నిధులు ఎక్కడ నుంచి వస్తాయి? అంటే ధర్మకర్తలను ప్రభావితం చేసి ఆలయాల స్థిరాస్తులను బయటకు తేవడమే ప్రభుత్వం ఉద్దేశం. తమిళనాడుకు చెందిన రాజకీయ విశ్లేషకుడు అళి సెంథిల్‌నాథన్‌ ఒక విషయం అంగీకరించారు. ‘ప్రభుత్వం ఈ జీవో వెనక్కి తీసుకోవడానికి కారణం, హిందుత్వ వర్గాలు ఒత్తిడి తెచ్చినందుకే’ అన్నారాయన. రాముని విగ్రహం శిరస్సును కోసేసినా, నరసింహస్వామి రథం దగ్ధం చేసినా, అమ్మవారి రథం వెండిసింహాలు ఎత్తుకు పోయినా, కళ్లెదురుగా 140 చోట్ల హిందూ దేవతామూర్తులకు అపచారం జరిగినా హిందువులు ఇంకా మౌనం దాల్చడం సాధ్యమా?

‘ఆలయాలను వారికే అప్పగించండి’

ఏప్రిల్‌ 8, 2019‌న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు గమనించదగినది. ఆలయాల పాలన భక్తులకు అప్పగించవలసిందేనని ఆ తీర్పులో సుప్రీంకోర్టు పేర్కొన్నది. ఆలయాలను స్వాధీనం చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఎక్కడిదని కూడా నిలదీసింది. ఇది కూడా నటరాజ ఆలయం (చిదంబరం) వివాదంలో ఇచ్చినదే. జనవరి 6, 2014లో కూడా అత్యున్నత న్యాయస్థానం ప్రాథమిక హక్కును కాలరాస్తూ ఆలయాలతో ఆటలాడవద్దు అని తీవ్రంగానే హెచ్చరించింది. ఆలయాలను పరిరక్షించదలుచుకుంటే తాత్కాలికంగానే వాటిని స్వాధీనం చేసుకోవాలని కూడా తెలియచెప్పింది.
హిందూ దేవాలయాలను ప్రభుత్వాల చెర నుంచి విడిపించాలని కోరుతూ డాక్టర్‌ ‌సత్యపాల్‌ ‌సింగ్‌ అనే సభ్యుడు లోక్‌సభలో నవంబర్‌ 22, 2019‌న బిల్లును ప్రవేశపెట్టారు. నిజానికి ఇదే బిల్లును ఆయన 2017లో కూడా ప్రవేశపెట్టారు. మెజారిటీలు, మైనారిటీల హక్కులు దేశంలో ఒకే విధంగా ఉండాలన్న ఉద్దేశంతోనే ఈ బిల్లును ప్రవేశపెట్టినట్టు సత్యపాల్‌ ‌చెప్పారు.

About Author

By editor

Twitter
YOUTUBE