ఫిబ్రవరి 4 క్యాన్సర్‌ ‌డే

క్యాన్సర్లు ఎక్కువ శాతం మన అలవాట్ల వల్లే వస్తాయని.. ఆహారం, తాగునీటి విషయంలో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు, అశ్విన్స్ ‌సూపర్‌ ‌స్పెషాలిటీ హాస్పిటల్స్ ‌డైరెక్టర్‌ ‌డాక్టర్‌ ‌సూర్యనారాయణరాజు.
ఈయన నిమ్స్‌లో సర్జికల్‌ ఆం‌కాలజీ (క్యాన్సర్‌ ‌సర్జరీ అధ్యయన శాస్త్రం) విభాగంలో సీనియర్‌ ‌ప్రొఫెసర్‌గా, విభాగ అధిపతిగా సుమారు ముప్ఫయ్‌ ఏళ్లు సేవలందించారు.
క్యాన్సర్‌ ‌డే సందర్భంగా డాక్టర్‌ ‌సూర్యనారాయణరాజుతో జాగృతి ముఖాముఖీ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొగాకు ఏ రూపంలో శరీరంలోకి వెళ్లినా నష్టమే అన్నారు. క్యాన్సర్‌ ‌నివారణకు భారతదేశంలో అన్ని రకాల ఆధునిక వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉన్నప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో కూడా క్యాన్సర్‌ ఆసుపత్రులు ఏర్పాటు చేయాలని చెప్పారు. క్యాన్సర్‌కి జన్యుపరమైన విశ్లేషణ ఆధారంగా చికిత్స అందించే విషయంలో మనం ఇంకా విదేశాల మీదనే ఆధారపడి ఉన్నామని, ఈ పరిస్థితి మారాలన్నారు.

ఇటీవల దేశంలో క్యాన్సర్‌ ‌రోగుల సంఖ్య పెరుగుతోంది. అసలు భారతదేశంలో క్యాన్సర్‌ ‌పెరుగుదల అనేది ఎప్పటి నుంచి మొదలయింది? ఇందుకు కారణాలు ఏమిటి?

పారిశ్రామిక దేశాల్లో, అణ్వాయుధాలు ఎక్కువగా ఉపయోగించే దేశాల్లో క్యాన్సర్లు సోకే ప్రమాదం చాలా ఎక్కువ. ఏ రకం క్యాన్సర్‌ అయినా ప్రధానంగా కాలుష్యం ద్వారానే వస్తుందని చెప్పవచ్చు. వాయు కాలుష్యం, నీటి కాలుష్యం, ఆహార కాలుష్యం వంటివి దీనికి ప్రధాన కారకాలు. ఆహారపు అలవాట్ల వల్ల కూడా క్యాన్సర్లు వస్తాయి. కొన్ని దేశాల్లో (భారత్‌లో కూడా) అధిక ఉత్పత్తిని సాధించేందుకు సాగులో పురుగుమందులు విపరీతంగా వాడుతున్నారు. అధిక మాంసోత్పత్తి కోసం కోళ్లు, గొర్రెలకు హార్మోన్‌ ఇం‌జక్షన్లు ఇస్తున్నారు. ఈ విధంగా తయారైన ఆహారం తీసుకున్నవారు ప్రధానంగా ఊబకాయం, క్యాన్సర్ల బారిన పడుతున్నట్లుగా అధ్యయనాలు నిరూపిస్తున్నాయి. ముఖ్యంగా ఇది పశ్చిమ దేశాలైన యూరప్‌, అమెరికాల్లో ఎక్కువగా గమనించవచ్చు. భారతదేశంలో చూస్తే.. స్వాతంత్య్రం వచ్చిన ముప్పయ్‌, ‌నలభై ఏళ్ల దాకా.. అంటే 1980ల వరకు కూడా క్యాన్సర్ల గురించి మనకు పెద్దగా తెలియదు. క్యాన్సర్ల కంటే మలేరియా, కలరా వంటి వాటితోనే మనం ఎక్కువగా బాధపడేవాళ్లం. పాశ్చాత్య జీవన శైలి ప్రభావం భారతీయుల మీద పడిన తర్వాత మన ఆహారపు అలవాట్లు కూడా పూర్తిగా మారిపోయాయి. జంక్‌ఫుడ్స్, ‌ఫాస్ట్‌ఫుడ్స్ ‌వాడకం పెరిగింది. కృత్రిమంగా తయారయ్యే ఆహారం మీద ఎక్కువగా ఆధారపడుతున్నారు. వ్యవసాయంలో క్రిమిసంహారక మందుల వాడకం బాగా పెరిగి పోయింది. ప్రస్తుతం భారతదేశానికి, పశ్చిమ దేశాలకు పెద్దగా తేడా లేదు. ఇరవై ఏళ్ల క్రితం గర్భసంచి క్యాన్సర్లు, నోటి క్యాన్సర్లు మనదేశంలో ఎక్కువగా వచ్చేవి. ప్రస్తుతం బ్రెస్ట్ (‌రొమ్ము) క్యాన్సర్‌, ఊపిరితిత్తుల క్యాన్సర్‌ ‌సోకుతున్నవారి సంఖ్య పెరిగిపోతోంది. దీనికి కారణం ఆహారపు అలవాట్లే. వ్యాయామం చేయకపోవడం, అధిక బరువు వల్ల కూడా క్యాన్సర్లు వస్తాయి.

అన్ని వయసుల వారికి క్యాన్సర్‌ ‌సోకుతున్నప్ప టికీ, ఏ వయసు వారు ఎక్కువగా గురవుతున్నారు?

క్యాన్సర్‌ ‌వయసు రీత్యా వచ్చే వ్యాధి. అయితే చిన్నపిల్లలకు క్యాన్సర్‌ ‌రాదా? అంటే వస్తుంది. పుట్టిన ఒక సంవత్సరంలోపలే క్యాన్సర్‌ ‌బారినపడిన చిన్నారులు కూడా ఉన్నారు. ఇలా ఎందుకు జరుగు తుందంటే తల్లిదండ్రులు లేదా ఆ కుటుంబంలో ఎవరికైనా జన్యుపరమైన లోపాలు ఉంటే ఆ ప్రభావం పుట్టిన పిల్లలమీద పడే అవకాశం ఉంది. అయితే ఇటువంటి కేసులు చాలా అరుదు. బహుశా ఐదు శాతం కంటే తక్కువనే చెప్పాలి. ముఖ్యంగా క్యాన్సర్లు నలభై ఏళ్లు దాటిన వారిలో ఎక్కువగా వస్తాయి. అది రొమ్ము క్యాన్సర్‌ ‌గానీ, నోటి క్యాన్సర్‌ ‌గానీ లేదా ఊపిరి తిత్తుల క్యాన్సర్‌ ‌గానీ.. ఏదైనా గానీ వయసును బట్టే వస్తుంది. వయసు పెరిగేకొద్దీ శరీరంలో కణాల పనితీరు బలహీనపడుతుంది. అప్పుడు ఈ క్యాన్సర్లు బయటపడ తాయి. భారతదేశంలో ప్రస్తుతం సుమారు పధ్నాలుగు లక్షలమంది వివిధ కాన్సర్లతో బాధపడుతు న్నారు. అయితే జన్యుపరమైన లోపాలతో, వంశ పారంపర్యంగా వచ్చే క్యాన్సర్లు పదిశాతంలోపే ఉంటాయి.

ప్రస్తుతం క్యాన్సర్‌ ‌నివారణకు భారతదేశంలో అందుబాటులో ఉన్న వైద్యం ఎలా ఉంది?

క్యాన్సర్‌ ‌నివారణకు భారతదేశంలో అన్ని రకాల ఆధునిక వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. నిపుణులైన వైద్యులు కూడా ఉన్నారు. అయితే ఈ సౌకర్యాలన్నీ కేవలం పట్టణాలకే పరిమితమయ్యాయి. అదొక్కటే సమస్య. గ్రామీణ ప్రాంతాల్లో కూడా క్యాన్సర్‌ ఆసుపత్రులు ఏర్పాటు చెయ్యాలి. ఈ విషయంపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాల్సి ఉంది.

ఆధునిక పద్ధతులకీ, రెండు మూడు దశాబ్దాల క్రితం అనుసరించిన వైద్య విధానానికీ తేడా ఏమిటి?

మొట్టమొదటిసారిగా, అంటే సుమారు వందేళ్ల క్రితం క్యాన్సర్‌ ‌సోకినవారికి ఆపరేషన్‌ ‌చేసేవారు. ఏ భాగానికైతే క్యాన్సర్‌ ‌సోకిందో ఆ భాగానికి ఆపరేషన్‌ ‌చేసి దాన్ని తొలగించేవాళ్లు. తర్వాత రేడియేషన్‌ ‌చికిత్సా విధానం అందుబాటులోకి వచ్చింది. అయితే – గత రెండు మూడు దశాబ్దాల కాలంలో సైన్స్ ఎం‌తో అభివృద్ధి చెందింది. ఎన్నో క్లినికల్‌ ‌ట్రయల్స్ అనంతరం జన్యుపరమైన విశ్లేషణ (జెనటిక్‌ అనాలసిస్‌) ఆధారంగా ప్రస్తుతం క్యాన్సర్‌ ‌చికిత్స చేస్తున్నారు. క్యాన్సర్‌ ఎం‌దుకు వచ్చింది? ఏ రకమైన క్యాన్సర్‌కి, ఎటువంటి చికిత్స చేయాలి? ఏ చికిత్స చేస్తే వ్యాధి తొందరగా నయమవుతుంది వంటి విషయాలు అధ్యయనం చేసి చికిత్స అందిస్తున్నారు. ఇదివరకైతే క్యాన్సర్‌ ‌సోకినవారందరికీ ఆపరేషన్‌ ‌లేదా రేడియేషన్‌ ‌చికిత్స చేసేవారు. అన్ని క్యాన్సర్లకు రేడియేషన్‌ ‌పనిచేయదు. కొన్నింటికి ఆపరేషన్‌ ‌చేయాల్సి వస్తుంది. కొన్నింటిని మందులతోనే తగ్గించవచ్చు. ఈ విషయాలన్నీ జన్యుపరమైన విశ్లేషణల ఆధారంగా తెలుసుకోవచ్చు.

వైద్యం పేదలకు, మధ్యతరగతివారికి అందు బాటులో ఉందా? ప్రభుత్వ ఆసుప్రతులు ఎంతవరకు సాయపడగలుగుతున్నాయి?

మనదేశంలో క్యాన్సర్‌ ‌బారిన పడినవారు ఎక్కువ మంది ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే చికిత్స పొందు తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో, ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో ఒకేరకమైన చికిత్స అందుబాటులో ఉంది. చాలా తక్కువమంది మాత్రమే ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటారు, ఎందుకంటే అక్కడ ఖర్చు ఎక్కువ. అయితే ప్రభుత్వ ఆసుపత్రులకు ఎక్కువమంది వెళ్లడం ద్వారా రద్దీ పెరుగుతుంది. అక్కడ క్యూలో నిలబడే ఓపిక, సమయం లేనివారు ప్రైవేట్‌ ఆసుపత్రులకు వెళుతున్నారు.

దేశంలో క్యాన్సర్‌ ‌వ్యాధి పెరిగిపోతున్న తరుణంలో ఆ వ్యాధి నివారణకు ఇక్కడ జరుగుతున్న పరిశోధన ఏ స్థాయిలో ఉంది? ఎంతవరకు విదేశాల మీద ఆధారపడి ఉన్నాం?

పరిశోధన విషయానికి వచ్చేటప్పటికీ క్యాన్సర్‌కి జన్యుపరమైన విశ్లేషణల ఆధారంగా చికిత్స అందించే విషయంలో మనం అభివృద్ధి చెందిన దేశాల్లో జరిగే పరిశోధనల మీదనే ఎక్కువగా ఆధారపడి ఉన్నాం. అయితే డ్రగ్‌ ‌ట్రయల్స్‌లో గానీ, సర్జికల్‌ ‌స్కిల్స్ (‌శస్త్రచికిత్సా నైపుణ్యం)లో గానీ, ట్రీట్‌మెంట్‌ ‌స్కిల్స్ (‌చికిత్సా నైపుణ్యం) పరంగా గానీ అభివృద్ధి చెందిన దేశాలతో సమానంగా ఉన్నాం.

క్యాన్సర్‌ ‌బారిన పడినవారికి మీరిచ్చే సలహా ఏమిటి?

సాధారణంగా క్యాన్సర్లు మన అలవాట్ల వల్లే వస్తాయి. నూటికి డెబ్భయ్‌ ‌శాతం క్యాన్సర్లు మన జీవనశైలి, ఆహారపు అలవాట్లను బట్టి వస్తాయి. కుటుంబంలో ఒక వ్యక్తికి క్యాన్సర్‌ ‌వచ్చిందని తెలిస్తే, అది ఎందుకు వచ్చిందో వైదున్ని అడిగి తెలుసు కోవాలి. ఆహారం వల్ల వచ్చిందా, నీటి వల్ల వచ్చిందా లేదా ఇతర అలవాట్ల వల్ల వచ్చిందా తెలుసుకోవాలి. ఇటీవల ఏలూరులో వింతవ్యాధి కలవరపెట్టిన విషయం తెలిసిందే. కానీ చివరకు ఏం తేలింది. ఆ నీటిలో పురుగుమందు (పెస్టిసైడ్స్) అవశేషాలు ఉన్నట్లు తేలింది. అటువంటి నీటిలో క్యాన్సర్‌ ‌కారకాలు ఉండే అవకాశం ఎక్కువ. కాబట్టి తాగునీరు, ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది మొదటి సలహా.
రెండో సలహా – ఒకవేళ ఎవరి శరీరంలో అయినా క్యాన్సర్‌ ‌లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి. కానీ కొందరు వైద్యుడిని కలిసేందుకు భయపడుతారు. అది చాలా ప్రమాదం. వ్యాధి ప్రారంభ రోజుల్లోనే గుర్తించి చికిత్స తీసుకోవడం ఉత్తమం. అడ్వాన్స్‌డ్‌ ‌దశకి వెళ్తే చికిత్స చేయడం శ్రమతో కూడినది. ఆర్థికభారం కూడా. జీవనకాలం కూడా తగ్గిపోతుంది. వంశపారం పర్యంగా కూడా క్యాన్సర్‌ ‌వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి మేనరికం వివాహాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఒక కుటుంబంలో ఒక వ్యక్తికి క్యాన్సర్‌ ‌సోకిందనుకుంటే.. మళ్లీ అదే కుటుంబానికి చెందిన వ్యక్తితో మేనరికం వివాహం మంచిదికాదు. ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటే కొంతవరకు క్యాన్సర్‌ని నివారించవచ్చు.

వైద్యపరంగా, ముందు జాగ్రత్తల పరంగా ప్రభుత్వాలు ఇవ్వవలసిన సాయం ఎలా ఉండాలి? ఎలా ఉంది?
క్యాన్సర్‌కి చికిత్స పరంగా, వైద్య సదుపాయాల విషయంలో గానీ ప్రభుత్వాలు సరైన చర్యలే తీసుకుంటున్నాయి. అయితే నివారణ (ప్రివెన్షన్‌) ‌విషయంలో, పరిశోధన విషయంలో ఇంకా చేయాల్సింది చాలా ఉంది.

స్త్రీ, పరుషుల్లో క్యాన్సర్లు ఎవరిలో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది?

సాధారణంగా మగవారికే క్యాన్సర్లు ఎక్కువగా వస్తాయి. బ్రెస్ట్ ‌క్యాన్సర్‌ ‌మహిళలకు వస్తుంది. కానీ సమాజంలో మహిళలకే కాన్సర్లు ఎక్కువగా వస్తాయనే ఒక అపోహ ఉంది. మద్యం, పొగాకు, గుట్కా అలవాట్లన్నీ పురుషులకే ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వారికే క్యాన్సర్లు ఎక్కువగా వస్తాయి. పొగాకు అలవాటు ఉన్నవారికి ఊపిరితిత్తుల క్సాన్సర్‌ ‌వస్తుంది. పొగాకు నమలడం, పీల్చడం వల్ల ఇది వస్తుంది. పాసివ్‌ ‌స్మోకింగ్‌- ‌భర్తకు పొగతాగే అలవాటుంటే ఆ పొగను భార్య పీల్చడం ద్వారా ఆమెకు కూడా క్యాన్సర్‌ ‌సోకే ప్రమాదం ఉంది. పొగాకు ఏ విధంగా శరీరంలోకి వెళ్లినా నష్టమే. ఊపిరితిత్తుల క్యాన్సర్‌ ‌బారిన పడుతున్న వాళ్ల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది. గుట్కా నమిలేవారికి నోటి క్యాన్సర్‌ ‌వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా పొగాకు వల్ల వచ్చే క్యాన్సర్లు 30 శాతం. అలాగే 40 నుంచి 50 లక్షల మంది పొగాకు వల్ల వచ్చే క్యాన్సర్లతో మరణిస్తున్నారు.

ఇంటర్వ్యూ: కోరుట్ల హరీష్‌

About Author

By editor

Twitter
YOUTUBE