కర్ణాటక, మహారాష్ట్రల మధ్య మరోసారి సరిహద్దు వివాదం రాజుకుంది. ప్రశాంత వాతావరణాన్ని భగ్నం చేయడమే లక్ష్యంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్‌ ‌ఠాక్రే కందిరీగల తొట్టెను కదిపారు. ప్రస్తుతం కర్ణాటకలో ఉన్న బెల్గాంతో పాటు నిప్పాణి ప్రాంతాన్ని మహారాష్ట్రలో విలీనం చేసుకుంటామని ప్రకటించారు. ఇందుకు ప్రతిగా కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప స్పందించారు. తమ రాష్ట్రంలోని ఒక్క అంగుళం భూమిని కూడా వదులుకోబోమని ప్రకటించారు. అసలు బెల్గాం వివాదం ఏమిటి, రెండు రాష్ట్రాలు ఎందుకు ఇంత పట్టుదలకు పోతున్నాయో తెలుసుకోవాలంటే చరిత్రలోకి వెళ్లాల్సిందే..

65 ఏళ్లుగా రగులుతున్న చిచ్చు ఇది. 1956లో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు తర్వాత కూడా చిక్కుముళ్లు ఇంకా కొనసాగుతున్నాయని చెప్పేందుకు బెల్గాం వివాదం చక్కని ఉదాహరణ. మహారాష్ట్ర, కర్ణాటకల మధ్య సరిహద్దు వివాదాలు రాజకీయ ఎజెండాలుగా మారాయి. దాదాపు 800 మరాఠీ గ్రామాలు మహారాష్ట్రలో కలపాలని మరాఠాల వాదన. ఈ వాదనను వ్యతిరేకించే కన్నడవాదులు అంతే పట్టుదలగా ఉన్నారు. ఉద్రిక్త వాతావరణం ఏర్పడినప్పుడల్లా ఇరు రాష్ట్రాల మధ్య బస్‌ల రాకపోకలు నిలిచిపోతాయి. అటు కన్నడ సినిమాలు, ఇటు మరాఠా సినిమాలు ఆగిపోతాయి. రెండు రాష్ట్రాల సీఎంల దిష్టిబొమ్మల్ని కాల్చడం, బంద్‌లు పాటించడం లాంటివి సర్వసాధారణం. ఈ అంశంపై రాజకీయ అవసరాల కోసం జాతీయ పార్టీల నాయకులు కూడా తమ రాష్ట్రాల వాదనను బలపరచక తప్పడంలేదు. బెల్గాం వివాదాన్ని పరిష్కరించేందుకు గతంలో కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు.

కర్ణాటకలో ఉత్తరభాగంలో ఉన్న జిల్లా బెల్గాం.. కన్నడలో బెళగావి అని, మరాఠీలో బెల్గాం అని పిలుస్తారు. దాదాపు 50 లక్షల జనాభా ఉండే ఈ జిల్లాలో 73 శాతం కన్నడ మాట్లాడతారు. అయితే బెల్గాం నగరం, ఖానాపూర్‌, ‌నిప్పాణి, ఉగర్‌ ‌తదితర ప్రాంతాల్లో మరాఠీ మాట్లాడేవారు అధికం. ఉర్దూ, కొంకణి, హిందీ భాషలు కూడా ఇక్కడ ఉనికిలో ఉన్నాయి. మొత్తానికి ఈ జిల్లా బహు భాషానిలయం. సుప్రసిద్ధ ఆలయాలు, పర్యాటక ప్రాంతాలకు పెట్టింది పేరు.

బెల్గాం గత చరిత్ర ఎంతో ఘనం.. బ్రిటిష్‌వారిని ఎదురించిన వీర వనిత కిత్తూరు రాణి చెన్నమ్మ ఇక్కడివారే. బెల్గాం ఒకప్పటి పేరు వేణుగ్రామ. అంటే వెదురుగ్రామం. కదంబులు, చాళుక్యులు, రాష్ట్రకూటులు, యాదవులు పాలించారు. ఢిల్లీ సుల్తానుల ఆక్రమణ తర్వాత విజయనగరరాజులు తిరిగి స్వాధీనం చేసుకున్నారు. తర్వాత బహమనీలు వచ్చారు. ఔరంగజేబు బీజాపూర్‌ ‌సుల్తానులను ఓడించి దీనిని మొఘల్‌ ‌సామ్రాజ్యంలో కలుపుకున్నాడు. అనంతరం మైసూర్‌ ‌రాజు హైదర్‌ అలీ స్వాధీనంలోనికి వెళ్లింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో బెల్గాంతో పాటు చుట్టు పక్కల జిల్లాలు కూడా మరాఠా వీరుడు మాధవరావు పీష్వా పాలనలోకి వెళ్లాయి.
మరాఠాలు అప్పట్లో తమ సామ్రాజ్యాన్ని పుణే నుంచి కన్నడ ప్రాంతాల మీదుగా తమిళ ప్రాంతాలైన తంజావూరు, పుదుచ్చేరి వరకూ విస్తరించారు. విజయనగర సామ్రాజ్య పతనం తర్వాత కన్నడనాట చాలా ప్రాంతాలపై భోంస్లేల పట్టు పెరిగింది. ఛత్రపతి శివాజీ తండ్రి షహజీ భోంస్లే దక్షిణ భాగంలో ఉన్న బీజాపూర్‌కు 20 ఏళ్లపాటు సేనాధిపతిగా ఉన్నారు. అప్పుడు కోలార్‌, ‌హోస్పేట్‌, ‌దొడ్డబల్లాపేర్‌, ‌సిర ప్రాంతాలతో పాటు 1638లో బెంగళూరును కూడా ఆక్రమించారు. అప్పట్లో బెంగళూరు ఆధునిక నగరంలా రూపొందడానికి షహజీయే కారణం అని చెబుతారు. కన్నడ, మరాఠా మిశ్రమ సంస్కృతులు దశాబ్దాల పాటు వైభవంగా కొనసాగాయి. మరాఠా, కన్నడల సాంస్కృతిక కూడలిగా బెల్గాం వెలుగొందింది. పీష్వాల పాలనలోనే 1835లో బెల్గాం జిల్లాగా ఏర్పడింది.


బెల్గాంను స్వాధీనం చేసుకుంటాం: ఉద్దవ్‌

‌మహారాష్ట్రలో బెల్గాం విలీనం కోసం పోరాడి 1956 జనవరి 17న ప్రాణాలర్పించిన వారికి నివాళులర్పిస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్‌ఠాక్రే కార్యాలయం చేసిన ట్వీట్‌ ‌కలకలం రేపింది. ‘కర్ణాటక అధీనంలో ఉన్న మరాఠీ మాట్లాడే, తమ సంస్కృతిని ఆచరించే ప్రాంతాలను తిరిగి మహారాష్ట్రలో కలపడమే అమరవీరులకిచ్చే నిజమైన నివాళి. అందుకు మేం కట్టుబడి ఉన్నాం. అమరవీరుల గౌరవ సూచకంగా ఈ వాగ్ధానం చేస్తున్నా’ అంటూ సీఎంవో ట్వీట్‌ ‌చేసింది. అంతేకాదు, కర్ణాటక ఆక్రమణలోని మరాఠా భూములను కలిపేసుకుంటామని కూడా ఉద్దవ్‌ ‌ప్రకటించడం కలకలం రేపింది.


వివాదానికి ఆజ్యం

1956లో భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడినప్పుడు బొంబాయి రాష్ట్రంలోని బీజాపూర్‌, ‌ధార్వాడ, ఉత్తర కెనరాలతో పాటు బెల్గాం జిల్లాను కూడా మైసూరు రాష్ట్రం (కర్ణాటక)లో విలీనం చేశారు. రాష్ట్రాల పునర్విభజన కమిటీ (ఎస్సార్సీ) చేసిన సిఫార్సులే ఇందుకు కారణం. ఈ ప్రాంతాల్లో కన్నడ ప్రజలు అధికంగా ఉన్నందున మైసూర్‌లో చేర్చాలని ఎస్సార్సీ సూచించింది. 1956 జనవరి 17న ఈ ప్రాంతాలను మైసూర్‌లో కలిపారు.
బెల్గాం, బీజాపూర్‌, ‌ధార్వాడ, ఉత్తర కెనరా జిల్లాలను కర్ణాటకలో విలీనం చేయడంపై మహారాష్ట్ర ఏకీకరణ ఆందోళన్‌ ‌సమితి మొదటి నుంచి వ్యతిరేకిస్తోంది. ముఖ్యంగా బెల్గాం విషయంలో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. 1948లో ఏర్పాటు చేసిన ఈ సమితి విలీనం రోజైన 1956 జనవరి 17న ఆందోళనకు పిలుపునివ్వగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ సందర్భంగా జరిగిన అల్లర్లలో పది మంది ప్రాణాలు కోల్పోయారు. బొంబాయి రాష్ట్రం మహారాష్ట్రగా, మైసూరు కర్ణాటకగా మారిపోయినా సమస్య అలాగే ఉంది. బెల్గాంలోని మరాఠాలు ఏటా జనవరి 17న అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరుపుతున్నారు. ఈ ప్రాంతంలో ఎక్కువగా మరాఠీయే మాట్లాడుతారు కాబట్టి మహారాష్ట్రలో కలపాలన్నది మహారాష్ట్ర ఏకీకరణ ఆందోళన్‌ ‌సమితి డిమాండ్‌.

మహాజన్‌ ‌కమిషన్‌ ‌నివేదిక

భాష ప్రాతిపదికన సరిహద్దులను గుర్తించేటప్పుడు బొంబాయి రాష్ట్రం నుంచి మైసూర్‌ ‌రాష్ట్రంలోకి 50 శాతానికి పైగా కన్నడ మాట్లాడే జనాభా ఉన్న తాలూకాలను చేర్చాలని రాష్ట్రాల పునర్విభజన కమిషన్‌ ‌సిఫార్సు చేయడాన్ని వ్యతిరేకిస్తూ అక్కడ నివసించే మరాఠీలు ఆందోళనకు దిగారు. విలీనం పూర్తయినా ఆందోళనలు ఆగలేదు. ఈ నేపథ్యంలో బొంబాయి ప్రభుత్వ అభ్యర్థన మేరకు కేంద్ర ప్రభుత్వం వివాద పరిష్కారం కోసం అక్టోబర్‌ 1966‌లో జస్టిస్‌ ‌మెహర్‌చంద్‌ ‌మహాజన్‌ ఆధ్వర్యంలో కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఆగస్టు 1967లో ఈ కమిషన్‌ ‌తన నివేదికను సమర్పించింది. 264 గ్రామాలను మహారాష్ట్ర (పాత బొంబాయి)కు బదిలీ చేయాలని, బెల్గాం పట్టణంతో పాటు 247 గ్రామాలు కర్ణాటకలోనే ఉండాలని సిఫారసు చేసింది. దీనిని కర్ణాటక స్వాగతిస్తే మహారాష్ట్ర వ్యతిరేకించింది. అప్పటి నుంచీ పునఃసమీక్షకు మహారాష్ట్ర డిమాండ్‌ ‌చేస్తున్నా కేంద్రం పట్టించుకోలేదు.


అం‌గుళం కూడా వదులుకోం: యడియూరప్ప

ఉద్దవ్‌ఠాక్రే చేసిన వ్యాఖ్యలపై కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప ఆగ్రహం వ్యక్తంచేశారు. తమ రాష్ట్రంలోని అంగుళం భూమిని కూడా వదులుకోబోమని తేల్చిచెప్పారు. ఈ మేరకు ట్విట్టర్‌ ‌వేదికగా మహారాష్ట్ర సీఎం ఠాక్రేకు బదులిచ్చారు. సరిహాద్దు అంశంపై ఉద్దవ్‌ ‌వ్యాఖ్యలు అనుచితమని, సమాఖ్య వ్యవస్థకు విరుద్ధమని చెప్పారు. కర్ణాటక, మహారాష్ట్ర ప్రజలు సోదరభావంతో కలిసి మెలిసి జీవిస్తున్నారని ఆయన గుర్తుచేశారు. ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా ఠాక్రే వ్యాఖ్యలు ఉన్నాయని విమర్శించారు.


న్యాయ పోరాటం

మహారాష్ట్రలోని విలాస్‌రావు దేశ్‌ముఖ్‌ ‌ప్రభుత్వం 2004లో రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 131 (‌బి) ప్రకారం సరిహద్దు వివాదం పరిష్కారం కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. బెల్గాంతో పాటుగా సరిహద్దులో కర్ణాటకలో భాగంగా ఉన్న 814 గ్రామాలను విలీనం చేసుకునేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం తన వాదనలను ఎప్పటినుంచో కొనసాగిస్తోంది. గుల్బర్గా, ధార్వాడ్‌, ‌బెల్గాం జిల్లాల్లో మరాఠా భాష మాట్లాడే గ్రామాలున్నాయని వాదిస్తోంది. సహజంగానే కర్ణాటక దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఆ కేసు ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉంది. ఏనాటికైనా బెల్గాం, నిప్పాణి ప్రాంతాలు మహారాష్ట్రకే దక్కుతాయని ప్రస్తుత సీఎం ఉద్దవ్‌థాక్రే పట్టుదలతో ఉన్నారు. మరాఠా ప్రజల ఆందోళనలను మహాజన్‌ ‌కమిషన్‌ ‌పట్టించుకోలేదని ఉద్దవ్‌ అసెంబ్లీలో పేర్కొన్నారు. సరిహద్దు వివాద కేసు విషయాలను పర్యవేక్షించేందుకు మంత్రులు ఏక్‌నాథ్‌ ‌షిండే, ఛాగన్‌ ‌భుజ్‌బల్‌లతో కమిటీని నియమించారు. బెల్గాంను మహారాష్ట్రలో కలపాలని, అలా చేయలేని పక్షంలో కేంద్రపాలిత ప్రాంతంగా గుర్తించాలన్నది ఉద్దవ్‌ ‌డిమాండ్‌. ‌మరాఠీ మాట్లాడేవాళ్లు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతర భాషీయుల పాలనలో ఉండకూడదని ఆయన వాదన.

కర్ణాటక రెండో రాజధాని.. బెళగావి

బెల్గాం విషయంలో కర్ణాటక ప్రభుత్వం కూడా పట్టుదలగానే ఉంది. ఒకప్పుడు కన్నడిగులు అధికంగా ఉండే ఈ ప్రాంతంలో మరాఠాల పాలనలో జనాభా తారుమారైందని, ఇప్పటికీ ఆ ప్రాంతంలో తమ భాష మాట్లాడేవారే అధికంగా ఉన్నారని కర్ణాటక నవ నిర్మాణసేన వాదిస్తోంది. ఈ వివాదం కొనసాగుతుండగానే కర్ణాటక ప్రభుత్వం బెల్గాం పేరును ‘బెళగావి’గా మార్చేసింది. కర్ణాటక రాష్ట్రం ఏర్పడి 50 ఏళ్లైన సందర్భంగా 2007లో నాటి ముఖ్యమంత్రి కుమారస్వామి బెళగావిని రాష్ట్ర రెండో రాజధానిగా ప్రకటించారు. రాష్ట్ర స్వర్ణోత్సవాల సందర్భంగా అక్కడ ‘సువర్ణ విధాన సౌధ’ పేరుతో రెండో అసెంబ్లీ భవనానికి శంకుస్థాపన చేశారు. దీన్ని 2012లో అప్పటి రాష్ట్రపతి ప్రణబ్‌ ‌ముఖర్జీ ప్రారంభించారు. విధానసభ నిర్మాణానికి రూ. 500 కోట్లు, ప్రారంభోత్సవానికే రూ.15 కోట్లు ఖర్చయ్యాయి.

బెల్గాంను స్వాధీనం చేసుకుంటామని ఉద్దవ్‌ ‌చేసిన ట్వీట్‌ ‌రాజకీయ అవసరాల కోసమేనన్నది స్పష్టంగా చెప్పవచ్చు. ఈ అంశంపై ఎప్పటినుంచో వివాదం నడుస్తున్నా ఎన్డీయేలో ఉన్న సమయంలో ఉద్దవ్‌ ‌పెద్దగా స్పందించలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజా తీర్పును గౌరవించకుండా బీజేపీకి దూరమమైంది శివసేన. కాంగ్రెస్‌, ఎన్సీపీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఉద్దవ్‌ ‌తన రాజకీయ అస్థిత్వం కోసం బీజేపీతో కోరి మరీ వివాదాలు తెచ్చకుంటున్నారు. బీజేపీని ఇరకాటంలో పెట్టేందుకే ఆయన ఈ రెచ్చగొట్టే ప్రకటన చేశారన్నది సుస్పష్టం. ఉద్దవ్‌ ‌ప్రకటనను నిరసిస్తూ బెంగళూరుతో పాటు కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో ఆయన దిష్టి బొమ్మను దగ్ధం చేశారు.

– క్రాంతిదేవ్‌ ‌మిత్ర, వ్యాసకర్త : సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE