– డాక్టర్‌ ఆరవల్లి జగన్నాథస్వామి

ప్రతి ఒక్కరికి ఆశలు, ఆశయాలు ఉండడం సహజం. మనిషి మనుగడకు అవి అవసరం కూడా. వాటి సాధనకు సహనం, ఓర్పు, కృషి ప్రధానం. ఈ త్రిశక్తిధారణం విజయానికి పునాది అవుతుంది. ఆత్మవిశ్వాసం, ఆత్మస్థైర్యం, పట్టుదల, అంకిత భావం కార్యసాధకుల లక్షణాలుగా చెబుతారు. ఆత్మవిశ్వాసం, ఆత్మాభిమానం కలవారికి సహజంగానే గుండెధైర్యం ఉంటుంది. అవసరమైనప్పుడు ఎవరినైనా ఎదిరించగలరు, ఏమైనా చేయగలరు. నిజమైన కార్యసాధకుడు కబుర్లతో కాక్షేపం చేయడు. మీనమేషాలు లెక్కించడు. లక్ష్యసాధనలో జయాపజయాలను, సుఖదుఃఖాలు, కష్టసుఖాలను సమదృష్టితో చూస్తాడు. తలపెట్టిన కార్యాన్ని ఎలాగైనా సాధించాలనే తపన, పట్టుదల ఉన్నప్పుడు ఫలితాలు అనుకూలంగానే ఉంటాయి.

ముఖ్యంగా ఒక కార్యం తలపెట్టినప్పుడు సానుకూల దృక్పథం కలిగి ఉండాలి. అవరోధాలు, అపజయాలు సహజం. ఏదైనా సాధించాలనుకున్నప్పుడు అవి సవాళ్లు విసురుతూ ముందు వరుసలో నిలుస్తాయి. అలా అని వెనుకంజ వేయకుండా సాగిపోయే వారే నిజమైన కార్యసాధకులు. సంకల్పబలం, పట్టుదల, అంకితభావం లోపించినప్పుడు వాటిదే పైచేయి కావచ్చు. సమయస్ఫూర్తి, నైపుణ్యం, సానుకూల దృక్పథంతో వాటిని అధిగమించగలగాలి. పుటం పెడితే బంగారం నిగ్గు తేలినట్లు అవాంతరాలను అధిగమించినప్పుడే విజయంలోని ఆనందం, ఉన్నతి తెలుస్తుంది.


ఎప్పుడూ ఏదో పనిలో నిమగ్నమయ్యే వారిని కార్యవాది అంటారు. అలాంటి వారి లక్షణాలను భర్తృహరి తమ నీతి శతకంలో…

‘ఒకచో నేలను పవ్వళించునొకచో

నొప్పారు బూసెజ్జపై

నొకచో శాకము లారగించు నొకచో

నుత్క ృష్ట శాల్యోదనం

బొకచో బొంత ధరించు నొక్కక తఱిన్‌

‌యోగ్యాంబర శ్రేణి లె

క్కకు రానీయడు కార్యసాధకుడు

దుఃఖంబున్‌ ‌సు•ంబున్‌ ‌మదిన్‌’ అని వివరించారు. అనుకున్నది సాధించాలనుకునే వారు సుఖదుఃఖాలను సమానంగా భావించాలి. ఒకసారి కటిక నేల మీద పడుకోవలసి రావచ్చు. మరోసారి హంసతూలిక తల్పంపై నిద్రించవచ్చు. ఒకచోట పచ్చి కూరగాయలతో కడుపు నింపుకోవలసి ఉంటుంది. ఇంకొక చోట పంచభక్ష్యపరమాన్నం ఆరగించవచ్చు. ఒకచోట బొంతతో సరిపెట్టుకుంటే మరో సందర్భంలో పట్టు పీతాంబరాలు ధరించవచ్చు. కార్య సంకల్పులకు సుఖదుఃఖాలతో నిమిత్తం లేదు. అందుకే ‘కార్యాతురాణాం న నిద్ర న సుఖం’ అన్నారు పెద్దలు.

భర్తృహరే అన్నట్లు ప్రారంభించిన పని పూర్తవుతుందో లేదో అనే శంకతో కొందరు అసలు పనినే ప్రారంభించరు. మరికొందరు ఆరంభ శూరత్వంలో పని మొదలు పెట్టి మధ్యలో వదిలేస్తారు. మూడవ కోవకు చెందిన వారు జయాపజయాలకు అతీతంగా రంగంలో దిగుతారు. ఈ మూడు రకాల వారిని ‘నీచులు, మధ్యములు, ఉత్తములు’ అని వ్యాఖ్యా నించారు భర్తృహరి. అడ్డంకులు ఎదురవుతాయనే భయంలేకపోగా, ఒకవేళ అవాంతరాలు వచ్చినా అధిగమించగలమనే ధైర్యం మనిషికి కొత్త శక్తిని ఇస్తుంది. ఆ ధైర్యం విజయానికి సాధనం, మనిషికి భూషణమవుతుంది. అలాంటి లక్షణాలు కలవారి వల్లే సత్కార్యాలు, ఘనకార్యాలు సిద్ధిస్తాయి.

కార్యసాధనాసక్తిపరుల్లో నిరాశ, నిస్పృహ, భయాందోళనలు ప్రమాదకరం. అవి ఆత్మవిశ్వాసాన్ని హరించి, కలవరపెడతాయి. లక్ష్య సాధనలో ఎంతటి క్లిష్ట పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సంసిద్ధులై ఉండాలి. జీవితమనే వైకుంఠపాళిలో ‘ఎగరేసే నిచ్చెనలే కాదు పడదోసే పాములు’ ఉంటాయన్న సత్యాన్ని గుర్తెరగాలి. ఎగుడుదిగుడు దారిలో ముళ్లూ, రాళ్లూ, కాలు తీసి కాలువేసేలోగా కాటేసే విషనాగులు ఉండవచ్చు. అయినా వజ్ర సంకల్పం ముందు అవన్నీ తీసికట్టే. వజ్రాన్ని వజ్రంతోనే ఛేదించాలన్నట్లు సంకల్పాన్ని సంకల్ప బలంతోనే సాధించాలి.

‘రేపటి ఈ రోజు, ఈ రోజు పనిని ఇప్పుడే చేయాలి’ అనే సూక్తి కూడా కార్యసాధకుడికి వర్తిస్తుంది.

ఉత్తమ కార్యసాధకుడికి ఏదీ అసాధ్యం కాదు. అన్నీ సానుకూలంగానే కనిపిస్తాయి. లక్ష్య సాధన మార్గంలో ఎదురయ్యే ఆటంకాలను ఎదుర్కొనే విధం తెలుసుకుంటే గమ్యం చేరిక సులువవుతుంది. అలాంటి వారికి మహాసముద్రం పిల్లకాలువలా, మేరు పర్వతం చిన్న రాయిగా, మృగరాజు సింహం జింక పిల్లగా, మహా విషసర్పం పూమాలగా, కాలకూట విషం అమృతంలా అనిపిస్తాయట. సంకల్ప బలం ముందు గొప్పగొప్ప ప్రమాదాలు, సమస్యలు అల్పంగా అనిపిస్తాయట. అంటే ఎంతటి ఘనకార్యాన్నయినా సాధించగల దృఢచిత్తులు ఉత్తమ కార్యసాధకులని కవి భావన. ప్రతి పనిని తనకు నచ్చినట్లు చేసుకోగల వారే ధీమంతులు. మనస్సుకు నిరాశ, నిస్పృహలు సోకకుండా జాగ్రత్త పడి, సానుకూల దృక్పథంతో సాగితే విజయతీరాలు చేరవచ్చు. ఆత్మ విశ్వాసంతో, ఇష్ట దైవంపై నమ్మకంతో అడుగు వేస్తే వారి విశ్వాసం, నమ్మకాలను పదిల పరిచేందుకు దైవం పది అడుగులు వేస్తాడని ఆస్తికుల భావన. అయితే మొదటి అడుగు మాత్రం మనిషిదే కావాలి.

అద్భుతాల సృష్టికి మాయలు మంత్రాలు ఉండవు. కళ్లు మూసుకొని కూర్చుంటే అద్భుతాలు జరిగిపోవు. యోధులై కదలాలి. తన ముందు వారి, సమకాలికుల విజయాలను స్ఫూర్తిగా తీసుకోవాలి. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలి.

పురాణ పురుషులలో హనుమను కార్యదీక్షకు మారుపేరుగా చెబుతారు. విద్యాభ్యాసం నుంచి రావణ సంహారం వరకు ఆయన చూపిన అంకిత భావం, చొరవ చిరస్మరణీయం. సీతాన్వేషణలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా అధిగమించాడు. మేఘనాథుడి శరధాటికి మూర్ఛిల్లిన సౌమిత్రి ప్రాణ రక్షణకు, మైరావణుని బారినుంచి రామలక్ష్మణులను రక్షించేందుకు తన శక్తియుక్తులను ఉపయోగించాడు. ఆయన బుద్ధిబలం, అవగాహన, సమయస్ఫూర్తి, వేగం, చాకచక్యం తనకు ఎదురైన అవరోధాలను తునా తునకలు చేసింది. అయినా దానిని తన గొప్పతనంగా భావించలేదు. ఏయే దిక్కులలో ఏమున్నాయో సమగ్ర అధ్యయన, అవగాహనతో ముందుకు కదిలాడు. లంకలో సీతామాత దర్శనం తరువాత చేసిన ‘కోతి చేష్టల’లో వ్యూహం ఉందంటారు. లంకానగరంలోని విశేషాలతోపాటు రావణుని బలగాన్ని పరిశీలించడం కూడా ఆయన ‘అల్లరి’లో భాగంగా చెబుతారు. నేటి పరిభాషలో చెప్పాలంటే హనుమ ‘రెక్కీ’ నిర్వహించాడు. ఒక పని కోసం వెళ్లి మరో పనిని చక్కబెట్టుకు రావడం లాంటిది.

సముద్ర ఉల్లంఘన సమయంలో మిన్నకున్న హనుమలోని నిజశక్తిని మేలుకొలిపారు వానర యోధులు. కురుక్షేత్ర సంగ్రామంలో యుద్ధ విముఖుడై ఆయుధ విసర్జన చేసిన అర్జునుడికి గీ(హి)తోపదేశం ద్వారా ‘సుముఖుడి’ని చేశాడు శ్రీకృష్ణ భగవానుడు. హనుమార్జునులు కార్యసాధకులుగా నిలిచారు.

క్రమశిక్షణ

గొప్ప కార్యాలు సాధించాలని, ఉన్నత స్థితికి ఎదగాలని కోరుకుంటారు. కలలుకంటారు. ఆ కోరికలు నెరవేరడానికి, కలలు సాకారం కావడానికి కార్యసాధకుని క్రమశిక్షణ మరో ముఖ్య లక్షణం. కార్యదీక్షకు క్రమశిక్షణ తోడైతే పూవుకు తావి అబ్బినట్లేనని, దీనిని పాటిస్తే కొంత వరకు విజయం సాధించినట్లేనని అంటారు అనుభవజ్ఞులు.

ఉన్నత లక్ష్య సాధన కోసం ప్రణాళికా రచన, దాని అమలుకు క్రమశిక్షణ ఎంతో ఉపకరిస్తుంది. చిన్నపామునైనా పెద్ద కర్రతో కొట్టాలన్నట్లు లక్ష్యం చిన్నదైనా, పెద్దదైనా క్రమశిక్షణతోనే దానిని సులువుగా సాధించగలుగుతారు. క్రమశిక్షణ మనిషిని నియంత్రించి పనుల విషయంలో, వ్యవహార శైలిలో దిశానిర్దేశం చేస్తుంది. చరిత్రను పరిశీలిస్తే గొప్ప విజయాలు అందుకున్న మహనీయులంతా ఎన్నో కష్టనష్టాలు ఎదుర్కొన్నవారే. అపురూప, అపూర్వ వియాలు సాధించిన వారిలో అత్యధికులు మధ్యతరగతి, ఆర్థికంగా బలహీనవర్గాలకు చెందిన వారే. బడిలో రుసుం కట్టలేక, కడుపునిండా తిండికి నోచక కష్టపడినా వారి కార్యసాధనకు పేదరికం అడ్డుకాలేదు. క్రమశిక్షణ, పట్టుదల, అంకితభావం వారి లక్ష్యసాధనకు పెట్టుబడి. అలా తమతమ రంగాలలో ప్రతిభను చాటి ధ్రువతారలై నిలిచారని చరిత్ర చెబుతోంది. అన్ని రకాల విజయాలకూ ఆర్థిక అండే ప్రధానం కాదని అనేకుల విషయంలో, అనేక సందర్భాలలో రుజువైంది.

క్రమశిక్షణ కేవలం ఒక లక్ష్యసాధనకే కాదు, నిత్యజీవితంలోనూ ఎంతో అవసరం. ఉదాహరణకు, పనిచేసే ప్రదేశానికి సకాలంలో చేరుకోవడం, విధులను సక్రమంగా నిర్వర్తించడం, సంస్థ ప్రతిష్ఠను కాపాడడం లాంటివి క్రమశిక్షణ కిందికే వస్తాయి. అలాగే చెప్పిన సమయానికి హాజరు కాగలగాలి. లేని పక్షంలో అవతలి వ్యక్తి రెండు విధాలుగా నష్టపోయే అవకాశం ఉంది. విధులను సక్రమంగా నిర్వహిస్తూ, సమయపాలనను పాటించగలిగితే వాటిలో గొప్పదనం అతి త్వరలో అవగతమవు తుందని అనుభవజ్ఞులు చెబుతారు.

– డా।। ఆరవల్లి జగన్నాథస్వామి, సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE