జనవరి 6, 2021…

అమెరికా చరిత్రలో చీకటిరోజు.

క్యాపిటల్‌ ‌భవంతి మీద ఆ రోజు అత్యంత అవమానకరంగా దాడి జరిగింది.

సెప్టెంబర్‌ 11, 2001‌న ముస్లిం మతోన్మాదంతో అమెరికాలోని ట్విన్‌ ‌టవర్స్ ‌మీద దాడి జరిగింది. ఇప్పుడు ట్రంప్‌ ఉన్మాదం ఫలితంగా దాడి జరిగింది. నాడు టవర్స్ ‌కూలాయి. ఇప్పుడు దేశ ప్రతిష్ట కుప్పకూలింది. అంతే తేడా.

రాజధాని వాషింగ్టన్‌ ‌డీసీలో క్యాపిటల్‌ ‌భవంతిగా పిలుచుకునే ఆ చరిత్రాత్మక భవనం, ఠీవిగా నిలబడి ఉండే ఆ నిర్మాణం అమెరికా ప్రభుత్వానికే ప్రతీక. ఎగువ, దిగువ చట్టసభలకు వేదిక.

అమెరికా అత్యున్నత న్యాయస్థానం కొలువై ఉండేది కూడా అక్కడే.

1800 సంవత్సరం నుంచి చరిత్ర ప్రసిద్ధులైన ఎందరో అధ్యక్షులను చూసిన ఈ భవనం డొనాల్డ్ ‌ట్రంప్‌ అనే ఈ అధ్యక్షుడి దుశ్చర్యకు ఖిన్నురాలైపోయింది.


ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మగా అమెరికా నిలుస్తున్నది. అలాంటి ప్రజాస్వామ్యానికి ఆయువుపట్టు క్యాపిటల్‌ ‌భవంతి. దేశానికి కొత్తగా ఎన్నికైన అధ్యక్ష, ఉపాధ్యక్ష (జోబైడెన్‌, ‌కమలా హ్యారిస్‌) ‌ఫలితాలను అధికారికంగా నిర్ధారించడానికి ఉభయసభలు సమా వేశమై ఉండగా ఆ దాడి జరిగింది. అమెరికన్లకు, ప్రజాస్వామ్య ప్రియు లకు క్షోభను మిగిల్చింది. ప్రజా స్వామ్యానికి సాక్షీభూతంగా నిలిచే క్యాపిటల్‌ ‌భవంతి భవ నంపై దాడి ప్రజాస్వామ్యం మీద జరిగిన దాడే. అందుకే ఆ ఆవేదన. ప్రపంచానికి ప్రజాస్వామ్య పాఠాలు చెప్పే అగ్రరాజ్యంలో చోటుచేసుకున్న ఘటనలు అక్కడి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాల్జేశాయి.

తన అహంకారానికీ, పదవీ దాహానికీ, తెంపరితనానికీ ట్రంప్‌ ‌నిస్సందేహంగా పెద్ద మూల్యమే చెల్లించ బోతున్నారు. ఆయన పదవీకాలం తొమ్మిది రోజులే ఉందనగా అభిశంసన తీర్మానం పెట్టడానికి అంతా సిద్ధమైపోయింది. అంటే జనవరి 11న ఆయన మీద ఆ తీర్మానం ప్రవేశపెట్టాలన్న నిర్ణయం ఏకగ్రీవంగా వచ్చింది. ఈ అభిశంసన నుంచి ఆయన బయటపడితే పడవచ్చు. కానీ చరిత్ర మాత్రం ఆయనను అభిశంసించక తప్పదు.

ఈ దాడి అధ్యక్షుడు డొనాల్డ్ ‌ట్రంప్‌ ‌నాయకత్వం లోని రిపబ్లికన్‌ ‌పార్టీ మూకలు చేయడమే పెను విషాదం. నాలుగు గంటల పాటు సాగిన ఆ విధ్వంసం రెండువందల ఏళ్ల అమెరికా చట్టసభల చరిత్రకు కళంకం తెచ్చి పెట్టింది. నరేంద్ర మోదీ (భారత్‌), ‌బోరిస్‌ ‌జాన్సన్‌ (‌బ్రిటన్‌), ‌మెక్రాన్‌ (‌ఫ్రాన్స్), ఏం‌జెలా మెర్కల్‌ (‌జర్మనీ), జస్టిన్‌ ‌ట్రుడో (కెనడా) క్యాపిటల్‌ ‌భవంతిపై దాడిని ఎలాంటి శషభిషలు లేకుండా ఖండించారు. డెమొక్రటిక్‌ ‌పార్టీకి చెందిన మాజీ అధ్యక్షులు జిమ్మీ కార్టర్‌, ‌బిల్‌ ‌క్లింటన్‌, ‌బరాక్‌ ఒబామా ఈ వికృత చర్యను తప్పు పట్టడంలో ఆశ్చర్యమే లేదు. సమర్ధనీయమే కూడా. ట్రంప్‌ ‌పార్టీ వాడే అయిన రిపబ్లికన్‌, ‌మాజీ అధ్యక్షుడు జార్జి బుష్‌ ‌సైతం నిరసించారు. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి గుటెరస్‌ ‌ఖండించారు. ట్రంప్‌ ‌రెచ్చగొట్టే వ్యాఖ్యలే దాడికి కారణమని ప్రపంచవ్యాప్తంగా మీడియా కోడై కూస్తోంది. దేశానికి ఆయన పెద్ద బెడద అని స్థానిక మీడియా ఘాటుగా స్పందించింది. ఆయనపై ప్రాసిక్యూషన్‌ ‌చేపట్టాలని ‘ద న్యూయార్క్ ‌టైమ్స్’ ‌సంపాదకీయంలో స్పష్టం చేసింది. ఘటనకు ట్రంప్‌ ‌దే బాధ్యతని మరో ప్రముఖ పత్రిక ‘వాషింగ్టన్‌ ‌పోస్ట్’ ‌వ్యాఖ్యానించింది.

ఏం జరిగింది?

నిజానికి క్యాపిటల్‌ ‌భవంతిపై దాడి వెనుకంతా కుట్ర కోణమే ఉంది. ఆ కుట్రకు కేంద్ర బిందువు ట్రంప్‌, ‌దేశాధ్యక్షుడు. ఘటన జరగడానికి నాలుగు రోజుల ముందే ఆ ఎన్నికలకు సంబంధించి కొన్ని వాస్తవాలు బయటపెడతాననీ, రిపబ్లికన్‌ ‌పార్టీ వారంతా రావాలనీ ట్రంప్‌ ‌పిలుపునిచ్చాడు. అయితే ట్రంప్‌ ఆ ‌రోజు అక్కడకు వచ్చినప్పటికీ, బీభత్సాన్ని చూసి తిరిగి శ్వేతసౌధానికి వెళ్లిపోయారు. రిపబ్లికన్‌ ‌పార్టీ కార్యకర్తలు కావచ్చు, ట్రంప్‌ అభిమానులు కావచ్చు. అప్పటికే అక్కడ ట్రంప్‌ ‌జెండాలు పట్టుకుని నినాదాలు చేస్తున్నారు. ‘ట్రంప్‌ ‌గెలిచారు’ అంటూ ఊగి పోతున్నారు. తరువాత భవనంలోకి దూసుకెళ్లేందుకు యత్నించారు. గోడలు ఎక్కారు. కిటికీ అద్దాలు పగలగొట్టారు. పోలీసుల మీద తిరగబడ్డారు. దీనితో లోపల ఉన్న ఉభయ సభల సభ్యులను వేరు మార్గాల ద్వారా సురక్షిత ప్రాంతాలకు పంపారు. ఉపాధ్యక్షుడు మైక్‌ ‌పెన్స్ (‌రిపబ్లికన్‌) ‌సభను నిర్వహిస్తుండగానే ఇదంతా జరిగింది. డెమొక్రటిక్‌ ‌పార్టీతోపాటు రిపబ్లికన్‌ ‌పార్టీలోని ట్రంప్‌ అభిమానులు సైతం ఈ ఘటనను జీర్ణించుకోలేకపోతున్నారు. జరగాల్సిన నష్టం జరిగాక, అయిదుగురు అమాయక పౌరులు మరణించాక చింతిస్తున్నట్లు ప్రకటించడం ట్రంప్‌ ‌తెంపరితనానికి నిదర్శనం.

ఈ చరిత్రాత్మక పరిణామాలకు తాత్వికతను అందించిన చర్చలకు ఆలవాలంగా ఉన్న క్యాపిటల్‌ ‌భవంతి మీదా ఇలాంటి తలవంపులు తెచ్చే ఘటనలు చోటుచేసుకోవడం ఆందోళనకరం. ఒక్క మాటలో చెప్పాలంటే జరిగింది క్యాపిటల్‌ ‌భవనంపై దాడి అయినప్పటికీ ప్రజాస్వామ్య సౌధంపై జరిగిన దాడిగానే ప్రజాస్వామ్యవాదులు భావిస్తున్నారు. క్యాపిటల్‌ ‌బిల్డింగ్‌ అం‌టే మన దేశంలోని పార్లమెంటు భవనం వంటిది. ఇక్కడ లోక్‌సభ, రాజ్యసభ కొలువు దీరుతాయి. క్యాపిటల్‌ ‌బిల్డింగ్‌లో అక్కడి రెండు సభలు-హౌస్‌ ఆఫ్‌ ‌కామన్స్, ‌సెనెట్‌ ‌సమావేశ మవుతాయి.

ప్రజాస్వామ్యమే ప్రాణంగా రెండు శతాబ్దాల క్రితం ప్రస్థానం ప్రారంభించిన అమెరికా అంతర్గతంగా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా అదే ఊపిరిగా ముందుకు సాగింది. ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రజాస్వామ్యాన్ని పాదుగొల్పేందుకు, దానిని కాపాడేందుకు ప్రయత్నం చేసింది. కొందరు నియంతల పాలననను, ఏకపక్షంగా ఉండే కమ్యూనిస్టు తరహా ప్రజస్వామ్యాన్ని నిరసించేందుకు ఏనాడూ వెనకాడలేదు. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదంపై పోరాడింది. రెండు శతాబ్దాల క్రితం బ్రిటన్‌ ‌నుంచి స్వాతంత్య్రం పొందిన అమెరికా సంపూర్ణ ప్రజా స్వామ్య పాలనకే ఓటేసింది. ఎలాంటి రాచరిక వాసనలు లేని, పూర్తిగా ప్రజల ప్రమేయం గల పాలనకే మొగ్గుచూపింది. అమెరికా విధానాలలో కొన్ని విపరీత ధోరణులను కొందరు చూడవచ్చు. కానీ అదొక స్వేచ్ఛాసమాజమన్న వాస్తవాన్ని ఎవరూ కాదనరు. చట్టబద్ధ పాలన, మానవహక్కులు, స్వేచ్ఛ, సమానత్వం, శాంతి, ప్రజాస్వామ్యం దిశగా అమెరికా ముందుకు సాగాలని ఆనాడే నిర్ణయించుకుంది.

జార్జి వాషింగ్టన్‌ ‌ముందుచూపు

వారసత్వమే ఉండరాదని అమెరికా రాజ్యాంగ కర్తలు బలంగా తలపోశారు. ప్రధాని, అధ్యక్ష తరహా రెండు వ్యవస్థలు ఉండరాదని భావించారు. అందువల్లే పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి బదులు అధ్యక్ష తరహా వ్యవస్థకు తెరదీశారు. అమెరికా సంయుక్త రాష్ట్రాల ఆవిర్భావం నుంచి వరుసగా రెండు దఫాలు (ఎనిమిది సంవత్సరాలు) అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించిన జార్జి వాషింగ్టన్‌ ‌ప్రజాస్వామ్యమే ప్రాణంగా బతికారు. ఏ అధ్యక్షుడు రెండు పర్యాయాలకు మించి ఎన్నిక కారాదన్న సంప్రదాయం ఆయన ప్రవేశపెట్టినదే. స్వతంత్ర న్యాయవ్యవస్థ, శాంతియుతంగా అధికార మార్పిడి, ఎన్నికల్లో ప్రజల తీర్పును గౌరవించడం, దానిని తు.చ. తప్పకుండా పాటించడం వంటి మంచి విధానాలకు ఊపిరి పోశారు. పార్టీలు రాజకీయ ప్రయోజనాల కోసం అదేపనిగా కొట్లాడుకుంటే ప్రజాస్వామ్యం అచేతన మవుతుందని, అరాచకత్వం రాజ్యమేలుతుందని, అప్పుడు ప్రజలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకునే రాజకీయ నాయకుడు పుట్టుకొస్తాడని అమెరికా తొలి అధినేత జార్జి వాషింగ్టన్‌ ‌రెండు శతాబ్దాల క్రితమే హెచ్చరించారు. అది ఇప్పుడు ట్రంప్‌ ‌విషయంలో రుజువైంది. కొంతకాలం ఉపాధ్యక్షుడిగా, తరవాత దేశ మూడో అధ్యక్షుడిగా పనిచేసిన థామస్‌ ‌జెఫర్సన్‌, ‌హ్యామిల్టన్‌ ‌తమ పాలనలో ప్రజాస్వామ్యాన్ని మరింత పటిష్టపరిచారు. దుష్ప్రవర్తన గల పాలకులను ప్రజలు భరించాల్సిన అవసరం లేదని, వారిని దించివేయ వచ్చని కూడా జఫర్సన్‌ ‌ప్రతిపాదించారు. ప్రజల చేత ఎన్నికైనవారు పాలనలో పూర్తిగా జవాబుదారీగా ఉండాలని, లేనట్లయితే వారిని పదవి నుంచి తొలగించడానికి తగిన అవకాశాలు ఉండాలని ఆయన తలపోశారు. సక్రమంగా పనిచేయని వారికి పదవి అప్పగిస్తే వారు ప్రపంచాన్ని ప్రమాదంలో పడవేస్తారని చెప్పేవారు. జెఫర్సన్‌ ‌గొప్ప రాజ నీతిజ్ఞుడు, తత్వవేత్త, న్యాయవాది, దౌత్యవేత్త. 1801 -1809 మధ్యకాలంలో దేశ మూడో అధ్యక్షుడిగా పనిచేశారు. అంతకుముందు 1797 నుంచి 1801 వరకు ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. రెండు శతాబ్దాల అమెరికా ప్రస్థానంలో పార్టీలు వేరైనప్పటికీ, విధానాలు విభిన్నమైనప్పటికీ అధికార పగ్గాలు చేపట్టిన అధ్యక్షులు ప్రతి ఒక్కరూ ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు, దాని ప్రతిష్ట పెంచేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నించారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ ప్రజాస్వామ్య పంథాను వీడలేదు. శాంతియుతంగా అధికార మార్పిడికి సహకరించారు. తద్వారా అమెరికా ప్రజాస్వామ్య ప్రతిష్ట అంతర్జాతీయంగా వెలుగులీనింది.

 దేశంలోని రెండు ప్రధాన పార్టీలు డెమొక్రటిక్‌, ‌రిపబ్లికన్‌ల విధానాలు వేరైనప్పటికీ ప్రజాస్వామ్యం, చట్టబద్ధపాలన, మానవహక్కులు, స్వతంత్ర న్యాయ వ్యవస్థ, క్రమం తప్పని ఎన్నికలకు పెద్దపీట వేస్తాయి. అధికారంలో ఉన్నా, లేకపోయినా ఈ విధానాల నుంచి వైదొలగేవి కావు. అలాంటి దేశంలో చోటుచేసుకున్న ఘటనలు అమెరికన్లనే కాక ప్రపంచ ప్రజాస్వామ్య వాదులను ఆవేదనకు గురిచేశాయి. ఇది కేవలం క్యాపిటల్‌ ‌బిల్డింగ్‌పై దాడిగా చూడ లేమని, అమెరికా ప్రజాస్వామ్య మౌలిక విలువలపై దాడి అని సీనియర్‌ ‌నేతలు అభివర్ణించారు. ఇవేమీ పట్టని అధ్యక్షుడు డొనాల్డ్ ‌ట్రంప్‌.

 ఏమిటి తేడా?

 బ్రిటన్‌, ‌జపాన్‌‌లో పార్లమెంటరీ ప్రజా స్వామ్యమే ఉన్నా, నేటికీ రాచరిక ఆనవాళ్లను వీడలేదు. బ్రిటన్‌ ‌పాలనలో రాణి ప్రత్యక్ష ప్రమేయం లేనప్పటికీ నామమాత్ర రాచరికం అమల్లో ఉంది. ఇప్పటికీ ఇలాంటి వ్యవస్థలు ఉన్నాయి. అనేక దేశాల్లో రాచరికం, నియంతల పాలన ఉన్నాయి. కొన్ని దేశాల్లో కర్ర ఉన్నవాడిదే గొర్రె… మాదిరిగా పాలన కొనసాగు తున్నది. మరికొన్ని దేశాల్లో సైనిక పాలనలు కొనసాగు తున్నాయి. అనేక ఆఫ్రికా, ఆసియా దేశాల్లో కుటుంబ పాలనలు ఉన్నాయి. కమ్యూనిస్టు దేశాల్లో పేరుకు ప్రజాస్వామ్యం ఉన్నప్పటికీ అక్కడ వ్యవస్థల కన్నా వ్యక్తుల ప్రాబల్యమే ఎక్కువ. నాయకుడు చెప్పిందే వేదం. ప్రజల మాటకు పూచికపుల్ల పాటి విలువ ఉండదు. ఇందుకు చక్కని ఉదాహరణ చైనా. ఇవి కాకుండా మతం, సైనిక ఆధిపత్య దేశాలు ఇంకొన్ని. పాకిస్తాన్‌ ఇం‌దుకు నిదర్శనం. ప్రచ్ఛన్న యద్ధకాలంలో (1945-1990) అమెరికా, నాటి సోవియట్‌ ‌యూనియన్‌ (‌నేటి రష్యా) మధ్య తీవ్ర వైరం ఉండేది. కమ్యూనిస్టుల పాలనలోని సోవియట్‌ ‌యూనియన్‌లో పేరుకు ప్రజాస్వామ్యం ఉండేది. అది నేతి బీర చందమే. ప్రచ్ఛన్న యుద్ధకాలంలో కొన్ని దేశాలకు నాయకత్వం వహించిన సోవియట్‌ ‌యూనియన్‌ ఆయా దేశాల్లో ప్రజాస్వామ్యం బలోపేతానికి పెద్దగా చేసిందేమీ లేదన్నది నిష్టురసత్యం. అదే సమయంలో మరికొన్ని దేశాలకు సారథ్యం వహించిన అమెరికా ప్రజాస్వామ్యం కోసం పాటుపడింది.

అమెరికాలో నల్లవారు, తెల్లవారు అన్న వివక్ష నిజం. కానీ అబ్రహాం లింకన్‌ ‌కాలంలో అదే వివక్ష కారణంగా దేశం విడిపోయే పరిస్థితి నుంచి బయటపడి చాలా దేశాలకు అది ఆదర్శంగా నిలిచింది. ప్రజాస్వామ్య పునాదులు గల అమెరికా హింసకు వ్యతిరేకమే. అది ఎక్కడ, ఏ రూపంలో ఉన్నా దానిని ఖండించేది, గర్హించేది. ఇది ఆయా దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యంలో కనపడేది కూడా. అమెరికా ఉగ్రవాదాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తు న్నది. అది ఎక్కడ, ఏ రూపంలో ఉన్నా దానిని ఉమ్మడిగా అంతర్జాతీయ సమాజం ఎదుర్కో వాలని పిలుపునిచ్చింది. అమెరికా విధానాలను విమర్శించే హక్కు ఆ దేశపౌరులకు ఎంతో ఉంది.

ఆది నుంచి వివాదాస్పదుడే

ట్రంప్‌ ‌తీరు మొదటి నుంచీ ఇలానే ఉంది. 2016లో అమెరికా ఫస్ట్ అన్న నినాదంతో ప్రజలను రెచ్చగొట్టి ఎన్నికల్లో నెగ్గారన్న విమర్శను ఎదుర్కొన వలసి వచ్చింది. గత నాలుగేళ్లుగా వీసాలు, మెక్సికో గోడ, ఆరోగ్య బీమా వంటి అంశాల మీద ఒంటెత్తు పోకడలకు పోయి అంతర్జాతీయంగా అమెరికాను నవ్వులపాలు చేశారు. ప్రపంచానికి పొంచి ఉన్న పది ఘోర ప్రమాదాల్లో ట్రంప్‌నకు అధ్యక్ష పదవి దఖలు పడటం ఒకటని నాలుగేళ్ల క్రితమే ప్రపంచ ప్రఖ్యాత పత్రిక ‘ది ఎకానిమస్ట్’ ‌సర్వే వెల్లడించిం దంటేనే ఆయన వ్యక్తిత్వాన్ని, రాజకీయ ధోరణిని అర్ధం చేసుకోవచ్చు. క్యాపిటల్‌ ‌బిల్డింగ్‌పై దాడితో ఆ సర్వే నిజమైందని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటిదాకా ప్రజాస్వామ్యం, శాంతి, చట్టబద్ధ పాలన, మానవ హక్కులు, స్వేచ్ఛ, సమానత్వం గురించి ప్రపంచానికి అదేపనిగా పాఠాలు వల్లించే పెద్దన్న పరిస్థితి తల కిందులైంది. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ప్రజాస్వామ్యం గురించి చెబుతుందని విమర్శకులు ప్రశ్నిస్తున్నారు.

ఇకపై చైనా వైఖరి ఏమిటి?

 అమెరికా పరిణామాల పట్ల శత్రుదేశాలు లోలోన సంతోషిస్తున్నాయి. చైనా అయితే నేరుగా విమర్శలను సంధించింది. ‘అది చూడచక్కని దృశ్యం’ అంటూ తన పైశాచికానందాన్ని ఏమాత్రం దాచుకో కుండా బహిరంగపరిచింది డ్రాగన్‌. ‌హాంకాంగ్‌లోని సిటీ లెజిస్లేటివ్‌ ‌కౌన్సిల్‌ ‌భవనాన్ని ఆక్రమించు కునేందుకు 2019లో ఆందోళనకారులు దూసుకు వచ్చినప్పుడు అమెరికా వ్యంగ్యంగా స్పందించింది. అది అందమైన ప్రజాస్వామ్యం అంటూ అమెరికా హౌస్‌ ఆఫ్‌ ‌కామన్స్ ‌స్పీకర్‌ ‌నాన్సీ పెలోని వ్యాఖ్యా నించారు. ఇప్పుడు చైనా కూడా అదేవిధంగా ప్రతిస్పందించింది. క్యాపిటల్‌ ‌బిల్డింగ్‌ ‌ఘటనను సైతం అందమైన ప్రజాస్వామ్యం అని బదులు తీర్చుకుంది. ఈ మేరకు ప్రభుత్వ అధికార పత్రిక ‘గ్లోబల్‌ ‌టైమ్స్’ ‌ప్రతిస్పందించింది. ఇప్పటికే చైనా నుంచి అనేక సవాళ్లను ఎదుర్కొంటున్న అమెరికా ఇప్పుడు ఈ ఘటనతో ఆ దేశం దృష్టిలో పలచన యిందన్న వాదన వినపడుతోంది. ఇప్పటివరకు ప్రజాస్వమ్యానికి తానే ఏకైక ప్రతినిధి అని అంతర్జాతీయ వేదికలపై బల్లగుద్ది వాదించే వాషింగ్టన్‌ ఇకపై ఏ ముఖం పెట్టుకుని మాట్లాడ గలదన్నది ప్రశ్న. మున్ముందు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే నైతిక హక్కు కోల్పోయిందని అమెరికన్లే అంటున్నారు.

భారత్‌ను చూసి నేర్చుకోవాలి!

 విభిన్న మతాలు, కులాలు, సామాజిక వర్గాలు, భాషలు, ప్రాంతాలతో వందకోట్లకు పైగా జనాభా గల భారత్‌ ‌భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనమని, నిజమైన ప్రజాస్వామ్యానికి ప్రతినిధి అని, అక్కడ అధికార మార్పిడి ఎంత సాఫీగా, ఎంత శాంతి యుతంగా జరుగుతుందో గ్రహించాలని అమెరికన్లు తమ నేతలకు సూచిస్తున్నారు. ఎంతటి గొప్ప నాయకులైనప్పటికీ ప్రజాతీర్పును గుర్తించడం, గౌరవించడం, వినమ్రంగా అంగీకరించడం, హుందాగా వ్యవహరించడం భారత్‌లోనే సాధ్యమవు తుందని గుర్తు చేస్తున్నారు. కానీ చాలాచోట్ల అధికార మార్పిడి సజావుగా సాగడం లేదనేది ఒక నిజం. 2013లో ఈజిప్టు సైనిక అధినేత అబ్దుల్‌ ‌ఫతా అల్‌ ‌సిసి ప్రధాని మహమ్మద్‌ ‌మోర్సీని గద్దె దించారు. 2016లో టర్కీలో అధినేత రెసిప్‌ ఎర్డోగాన్‌పై సైనిక తిరుగుబాటు జరిగింది. పాకిస్తాన్‌లో ఇటువంటి ఘటనలకు లెక్కేలేదు. బంగ్లాదేశ్‌ ఇం‌దుకు మినహాయింపు కాదు. మాల్దీవుల పరిస్థితి కూడా దాదాపు అంతే. 80వ దశకంలో మాల్దీవుల అధ్యక్షుడు మౌముల్‌ అబ్దుల్‌ ‌గయూమ్‌ ‌ప్రభుత్వంపై తిరుగుబాటు జరగ్గా భారతీయ సైనికులు వెళ్లి దానిని విజయవంతంగా తిప్పికొట్టారు. అధికారం కోసం నేపాల్‌ ‌రాజకుటుంబంలో ఏకంగా హత్యలే జరిగాయి. ఇప్పుడు వాషింగ్టన్‌ ‌ఘటనలు ఆ కోవలో నివి కావని ఎవరైనా ఎలా చెప్పగలరన్నదే ప్రశ్న.

అధికారాంతమందు…

 చేయాల్సిందంతా చేశాక ఇప్పుడు ట్రంప్‌ ‌దాడిని ఖండిస్తున్నట్టు నాటకమాడుతున్నారు. ఇప్పుడు సొంత పార్టీలోనే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. శ్వేతసౌధంలో ఆయన నియమించుకున్న వారంతా తీవ్ర మనస్తాపంతో పదవులు వీడి వెళ్లిపోయారు. ‘అందరు అమెరికన్ల మాదిరిగానే నేనూ అల్లర్లపై ఆందోళన చెందాను. నేషనల్‌ ‌గార్డులు,ఫెడరల్‌ అధికారులను పిలిపించి భవనానికి అదనపు భద్రత కల్పించాను. కొత్త ప్రభుత్వాన్ని కాంగ్రెస్‌ ‌ధ్రువీకరించింది. జనవరి 20న అది బాధ్యతలు చేపడుతుంది. అధికార మార్పిడి సాఫీగా జరుగుతుంది’ అని ట్రంప్‌ ‌పేర్కొనడం ఆయనకే చెల్లింది. నన్ను నేను క్షమించు కుంటానంటూ ట్రంప్‌ ‌సరికొత్త నాటకానికి తెరదీశారు. తన తప్పిదాలపై కొత్త ప్రభుత్వం దర్యాప్తు చేయ కుండా ఉండాలన్న ఉద్దేశంతోనే ఈ ఎత్తుగడ వేస్తున్నారన్న వాదన వ్యక్తమవుతోంది. పదవి నుంచి దిగిపోయే ముందు అమెరికా అధ్యక్షులు తమ సన్నిహితులు, పార్టీ నాయకులను కాపాడుకోవడానికి క్షమాభిక్ష పెడుతుంటారు. కుమార్తె ఇవాంకా, అల్లుడు కుష్నర్‌, ‌కుమారుడు ఎరిక్‌, ‌వ్యక్తిగత న్యాయవాది రూడీ గియులియానిలను కాపాడుకునేందుకు, వారికి క్షమాభిక్ష ఇవ్వాలని ట్రంప్‌ ‌నిర్ణయించినట్లు సమాచారం. రాజ్యంగపరంగా దీనికి గల అవకాశా లపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. గతంలో రిచర్సడ్ ‌నిక్సన్‌ ‌క్షమాభిక్ష పొందారు. వాటర్‌గేట్‌ ‌కుంభకోణం కారణంగా నిక్సన్‌ ‌పదవి నుంచి వైదొలడంతో ఉపాధ్యక్షుడు గెరాల్డ్ ‌ఫోర్డ్ అధ్యక్షు డయ్యారు. ఈ సందర్భంగా నిక్సన్‌ ‌చేసిన తప్పు లన్నింటినీ క్షమించారు.

రెండో అభిశంసనకు దగ్గరగా…

 అధ్యక్షునిగా జనవరి 20 ట్రంప్‌ ఆఖరిరోజు. అంతకు ముందే ఆయనను పదవినుంచి తొలగించాలని డెమొక్రట్లు పట్టుబడుతున్నారు. అధ్యక్షుడిని పదవి నుంచి తొలగించాలంటే రెండు మార్గాలున్నాయి. ఒకటి అభిశంసన, రెండోది 25వ సవరణ ద్వారా తొలగించడం. 2019లోనే ట్రంప్‌ను ప్రతినిధుల సభ అభిశంసించింది. అయితే సెనెట్‌లో రిపబ్లికన్లు అధికంగా ఉండటంతో అది వీగిపోయింది. అధ్యక్ష పదవి నిర్వహణ, రాజీనామా, మరణం, వారసుడి ఎంపిక తదితర అంశాలను 25వ సవరణ ప్రస్తావిస్తోంది. అధినేత మరణించినా, రాజీనామా చేసినా, పదవిని నిర్వహించే పరిస్థితి లేకున్నా ఉపాధ్యక్షుడు అధ్యక్ష పదవిని చేపడతారు. 25వ సవరణలోని నాలుగో అంశం ప్రకారం అధ్యక్షుడు తన అసమర్థతను స్వయంగా ప్రకటించుకోలేని పరిస్థితిలో ఉపాధ్యక్షుడు, కేబినెట్‌ ‌కలసి ఈ నిర్ణయం తీసుకోవచ్చు. అప్పుడు ఉపాధ్యక్షుడు అధ్యక్షుడవుతారు. అయితే అమెరికా చరిత్రలో ఇంతవరకు ఏ ఉపాధ్యక్షుడూ ఈ అధికారాన్ని ఉపయోగించలేదు. ఈ నేపథ్యంలో రిపబ్లికన్‌ ‌పార్టీకి చెందిన ఉపాధ్యక్షుడు మైక్‌ ‌పెన్స్ ఈ ‌విషయంలో ఎంతవరకు ముందడుగు వేస్తారన్నది వేచి చూడాలి. మరో వారంలో ట్రంప్‌ ‌పదవీకాలం ముగియనున్న తరుణంలో ఇంతటి తీవ్ర చర్యకు పెన్స్ ఎం‌తవరకు ముందుకు వస్తారన్నది ప్రశ్నార్థకమే. అయితే పెన్స్ ‌నిబద్ధతపై ఎవరికీ ఎలాంటి సందేహం లేదు. స్వయంగా అధ్యక్షుడు ట్రంప్‌ ‌నుంచి సందేశం వచ్చినప్పటికీ రిపబ్లికన్‌ ‌పార్టీ నేత అయిన ఉపాధ్యక్షుడు పెన్స్ ఎన్నికల ఫలితాల ధ్రువీకరణలో నిష్పక్షపాతంగా వ్యవహరించి అందరి మన్ననలు అందుకున్నారు. సభ గౌరవాన్ని పెంచారు. హుందాగా వ్యవహరించి అందరి మన్ననలు అందుకున్నారు. అందువల్ల ట్రంప్‌ ‌తొలగింపు వంటి తీవ్ర నిర్ణయం ఉండకపోవచ్చన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా.

క్యాపిటల్‌ ‌భవంతి…

అమెరికా అత్యున్నత చట్టసభలు కొలువయ్యే ప్రతిష్టాత్మక భవంతి అది.  రాజధాని వాషింగ్టన్‌ ‌డిసిలో ఉంటుంది. దీనినే క్యాపిటల్‌ ‌భవంతి అని అంటారు. అమెరికా అధ్యక్షుని నివాసం శ్వేతసౌధానికి తూర్పు దిశగా ఈ చరిత్రాత్మక భవంతి ఉంది. చరిత్రలోని అత్యంత కీలక ఘట్టాలకు, ఉత్సవాలకు ఇది ప్రత్యక్ష సాక్షి. సెప్టెంబర్‌ 18,1793‌లో ఈ భవంతి నిర్మాణం ఆరంభమైంది. తొలి అధ్యక్షుడు, అమెరికా స్వాతంత్య్ర పోరాటయోధుడు  జార్జి వాషింగ్టన్‌ ‌పునాదిరాయి వేశారు. ఆ సందర్భంగా ఈ దేశంలో దీనికి మించిన భవనం వేరొకటి ఉండరాదు అన్నారాయన.

మొదట ఈ ప్రదేశాన్ని జెంకిన్స్ ‌హిల్‌ ‌లేదా జంకిన్స్ ‌హైట్స్ అనేవారు. ఫ్రెంచ్‌ ఇం‌జనీర్‌ ‌పిరె ఎల్‌ ఎన్‌ఫాంట్‌ ‘‌కాంగ్రెస్‌ ‌హౌస్‌’ ‌నిర్మాణం కోసం దీనిని ఎంపిక చేశాడు. తరువాత ఎందరో ఇంజనీర్లు నిర్మాణంలో పాలు పంచుకున్నారు. దాదాపు ఆరువందల గదులతో రాజధాని నగరం వైపు ముఖం పెట్టి నిర్మించారు. తరువాతి కాలంలో ఒక్కొక్కటిగా  అదనపు భవనాలు నిర్మించారు. అందులో సుప్రీం కోర్టు భవనం ఒకటి. ఈ ప్రదేశానికి క్యాపిటల్‌ ‌భవంతి అని పేరు మార్చిన వారు థామస్‌ ‌జఫర్సన్‌.ఈ ‌భవంతిలో ఉండే క్యాపిటల్‌ ‌విజిటర్‌ ‌సెంటర్‌ ‌సమాచారం ప్రకారం మొదటిసారి 1800 సంవత్సరంలో ఇక్కడ సమావేశాలు జరిగాయి. అప్పటిదాకా ఫిలడెల్ఫియాలో ఉన్న రాజధాని అప్పుడే వాషింగ్టన్‌ ‌డిసికి మారింది.1812లో జరిగిన యుద్ధం సమయంలో ఇంగ్లండ్‌ ఈ ‌భవంతికి కొంత నష్టం కలిగించింది. అమెరికా దళాలు వలస కెనడా రాజధానిని దగ్ధం చేసినందుకు ప్రతీకారంగా బ్రిటన్‌ ఈ ‌చర్యకు పాల్పడింది. అప్పుడే శ్వేతసౌధం కూడా కొంత ధ్వంసమైంది. అప్పటికి భవంతి నిర్మాణం పూర్తిగా జరగలేదు. దీనితో కొందరు కాంగ్రెస్‌ ‌సభ్యులు రాజధానిని మళ్లీ ఫిలడెల్ఫియాకు తరలించాలని వాదించారు.1826లో భవన నిర్మాణం పూర్తయింది. కానీ దేశ విసీర్ణం పెరిగే కొద్దీ ఎక్కువ చోటు కావలసి వచ్చింది. ఆ విస్తరణ పనులు 1850 నాటికి పూర్తి చేశారు. 1793 సంవత్సరానికీ 1830 ప్రాంతానికి పోల్చుకుంటే అమెరికా ఒక దేశంగా రెట్టింపయింది. అప్పుడు ముప్పయ్‌ ‌మంది సెనేటర్లు ఉండగా, తరువాత వారి సంఖ్య రెట్టింపునకు చేరింది. ప్రతినిధులు సభలో 69 మంది సభ్యులు ఉండేవారు. తరువాత ఆ సంఖ్య 233కు చేరుకుంది.

   జనవరి 30, 1835న నాటి అమెరికా అధ్యక్షుడు ఆండ్రూ జాక్సన్‌ ‌మీద రిచర్డ్ ‌లారెన్స్ అనే బ్రిటిష్‌ ‌జాతీయుడు హత్యాయత్నం చేసినది కూడా ఈ భవంతిలోనే. 1856లో అంతర్యుద్ధానికి సంబంధించిన వాదోపవాదాలతో ఏర్పడిన తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కూడా ఇందులోనే ఏర్పడినాయి. దక్షిణ కరోలినా ప్రతినిధి ప్రెస్టన్‌ ‌బ్రూక్స్, ‌మసాచుసెట్స్ ‌ప్రతినిధి, సెనేటర్‌ ‌చాల్స్ ‌సమ్నర్‌ను ఒక కర్రతో చావగొట్టింది కూడా ఇందులోనే. తరువాత బ్రూక్స్ ‌రాజీనామా చేయవలసి వచ్చింది. 1915 జూలైలో హార్వర్డ్ ‌యూనివర్సిటీ ఆచార్యుడు ఎరిక్‌ ‌ముయెంటర్‌ ‌సెనేట్‌ ‌రిసెప్షన్‌ ‌గదిలో మూడు డైనమైట్‌ ‌స్టిక్‌లు పేల్చాడు. మొదటి ప్రపంచ యుద్ధంలో అమెరికా వ్యాపారులు బ్రిటన్‌కు పెట్టుబడులు పెట్టడం ఆయనకు నచ్చలేదట. 1954లో ప్యుర్టొ రికాన్‌ అనే ఉగ్రవాది హౌస్‌ ‌గ్యాలరీలోకి చొరబడి విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఐదుగురు గాయపడ్డారు.  అమెరికా స్పెయిన్‌ను ఆక్రమించడం (1898) అతడికి నచ్చలేదు. మార్చి 1, 1971న  ఒక స్నానాల గదిలో బాంబు పేలింది. ఎవరూ మరణించలేదు. 1983, 1998లో కూడా ఈ ప్రాంగణంలో హింసాత్మక ఘటనలు జరిగాయి.

–  గోపరాజు విశ్వేశ్వరప్రసాద్‌, సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE