తెలుగువారి ముఖ్యమైన పండుగ సంక్రాంతి. గ్రామీణ ప్రాంతాల్లో సంక్రాంతి శోభ కనుల పండుగగా సాక్షాత్కారిస్తుంది. ప్రతి ఇంటి ముంగిట రంగురంగుల వర్ణశోభలతో చిత్రవిచిత్రమైన రంగవల్లులూ, గొబ్బియలూ కనువిందు చేస్తాయి. వేదకాలం నుండి ఆధునిక కాలంవరకు ముగ్గుల ప్రాశస్త్యం కనిపిస్తుంది. ముద్దుగుమ్మల మునివేళ్లమాటు నుంచి భూమాత నుదుటికి అందాల సింద•రాల్లా ముగ్గులు అలరారుతుంటాయి. భోగి, సంక్రాంతి, కనుమ పండుగల రోజుల్లో వేసే ముగ్గుల్లో వైవిధ్యం కనిపిస్తుంది. ధనుర్మాసం ప్రారంభమైనప్పటి నుండి నాగబంధం, గుమ్మడిపండ్లు, చేపలు, కలువలు, పద్మాలు, తులసికోటలు, చెరుకు గడల రూపాల్లో మహిళలు కళాత్మకంగా ముగ్గులు తీర్చిదిద్దుతారు. రాతిపిండి ముగ్గులూ, బియ్యపుపిండి ముగ్గులూ వేస్తారు. ప్రపంచీకరణ ప్రభావంతో మహిళలకు ముగ్గులువేసే తీరిక లేక, ఆధునిక నాగరికత ఫలితంగా రంగురంగుల రసాయనిక పొడి ముగ్గులూ, ప్లాస్టిక్‌ ‌ముగ్గులు వచ్చాయి. సంక్రాంతి నెల ప్రారంభం నుండి నెలరోజులు ముగ్గులు వేస్తారు. కనుమ రోజు ముగ్గుతో వీడ్కోలు పలుకుతారు. ముగ్గులు వేసే ముందు ఇంటి ప్రాంగణాన్ని పేడనీళ్లతో శుభ్రం చేస్తారు. పేడ, సున్నంలోని కాల్షియం వల్ల క్రీమికీటకాలు నశిస్తాయి. గొబ్బిళ్లలో బంతిపూలు, సంపెంగలు సుగంధాలు వెదజల్లుతాయి. హరిదాసుల కీర్తనల భక్తి పారవశ్యం, ఆధ్యాత్మిక భావాలు పారవశ్యాన్ని కలిగిస్తాయి. రైతుల లోగిళ్లలో ప్రకాశించే బంగారు రంగు ధాన్యం, కొత్తబెల్లం, పండు మిరపకాయలు పంటల పండుగగా ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. సంక్రాంతి రాకతో ఆయురారోగ్యం ఐశ్వర్యాల ఆనందాల అద్వైతతత్త్వం అంతర్లీనంగా గోచరిస్తుంది.

తెలుగుకవులు సంక్రాంతి శోభకు హేతువులైన ముగ్గులను ముచ్చటగా వర్ణించారు. ప్రాచీన, ఆధునికకవుల సంక్రాంతి వర్ణనలను పరిశీలించడమే వ్యాస ముఖ్యోద్దేశం.


ఆదికవి నన్నయ మహాభారతం, ఆదిపర్వంలో పాండవులు వారణావతంలో లక్క ఇంటికి వస్తున్న సందర్భంలో ఆ వీధులను కస్తూరి, మంచిగంధం కలిపిన నీళ్లతో కళ్లాపి చల్లి శుభ్రపరిచినట్టు, కర్పూరంతో రంగవల్లులు తీర్చిదిద్దినట్టు రాశాడు. ‘అంగళుల నొప్పి కర్పూర రంగవల్లులు’ అని వర్ణించాడు.

నన్నెచోడుడు ‘కుమార సంభవం’లో శివపురంలో రంగ వల్లులను ‘చిత్రవర్ణాతిశయ నూత్న రత్న చిత్రి / తాంగ రంగవల్లి సురగాంగణముల / గలిగి విశ్వంబునకు తన వెలుగు వెలుగు సేయు తేజోమయంబగు శివపురంబు’ అంటూ రంగు రంగుల రంగవల్లికలతో వెలుగొందుతున్న శివపురాన్ని పాఠకులకు సాక్షాత్కారింపజేశాడు. శ్రీనాథుడు ‘పలనాటి వీరచరిత్ర’లో సంక్రాంతి  సందర్భంగా  తీర్చిదిద్దిన రంగువల్లులనూ, ప్రజల జీనవనశైలినీ వర్ణిస్తూ ‘కస్తూరి చేతను కలియగనలికి / ముత్యాల తోడ ముగ్గులు బెట్టి / కర్పూర ముదకంబు కలిపి ముంగిటన్‌’ – ‌నలగామరాజు కొలువు ముందర ప్రాంగణంలో కర్పూరం కలిపిన కళ్లాపి చల్లి, కస్తూరితో అలికి ముత్యాలముగ్గులతో తీర్చిదిద్దారని వర్ణించాడు.

పోతన భాగవతంలో రంగవల్లుల ప్రస్తావన ఉంది. బసవపురాణం, శుకసప్తతి, హంస వింశతి కావ్యాల్లో ముచ్చటైన ముగ్గుల ప్రస్తావనను ఔచిత్యంగా వర్ణించారు కవులు. తాళ్లపాక అన్నమాచార్యులు పదకవితల్లో ‘గొబ్బియల’ వర్ణన చేస్తూ ‘గొబ్బియల్లో గొబ్బియల్లో / మన సీతాదేవి వాకిట వేసిన గొబ్బియలు / వాకిళ్లముందు నవరత్నాల ముగ్గులు వేసి ముగ్గుల మీద మల్లెపూల గొబ్బియలూ, మొగిలిపూల గొబ్బియలు, సంపెంగల గొబ్బియల’తో తీర్చిదిద్దినట్లు వర్ణించారు. భూదేవంత ముగ్గుల్లో నక్షత్రాల గొబ్బియలు అమర్చారని రమ్యంగా వర్ణించారు. జానపద రామాయణంలో జనక మహారాజు, సీతాదేవి చేత ‘ఆవుపేడతో అలికించి ముత్యాల ముగ్గులు వేయించినట్లు’ వర్ణించారు.

 సాహితీ సమరాంగణా సార్వభౌముడైన శ్రీకృష్ణదేవరాయలు ఆముక్తమాల్యదలో ముగ్గులను వర్ణిస్తూ ‘కోరకిత నారికేళ / క్ష్మారుహముల రత్నకుట్టిమంబుల దోపన్‌’ – ‌రాయల కాలం నాటి విలాసవంతమైన సామాజిక జీవనానికి తగిన విధంగా కొబ్బరిచెట్ల తెల్లిమొవ్వలు రత్నాల గచ్చులో ప్రతిబింబించి ముగ్గులు పెట్టినట్లుగా ఉందని ఉత్ప్రేక్షించి అప్పటి సంపత్సమృద్ధిని వర్ణించాడు.

ఆధునిక కవులు రాయప్రోలు, తుమ్మల, జాషువ, కరుణశ్రీ, ఆరుద్ర వంటివారు సంక్రాంతి ముగ్గుల ప్రాధాన్యాన్నీ, గ్రామీణ శోభనూ గొప్పగా వర్ణించారు. వాటిని పరిశీలిద్దాం. రాయప్రోలువారు సంక్రాంతి వర్ణనలో ముగ్గుల ప్రస్తావన ముచ్చటగా చేశారు. ‘బూజు దులిపిపూరి యిండ్లను / వెల్లవేసిన వీధి గోడలు / అలికిమ్రుగ్గుల నిడిన అరుగులు / అందగించెను పల్లెలిన్‌/’ అలికి ముగ్గులు పెట్టిన అరుగుల్లో, బూజు దులిపి వెల్ల వేసిన వీధిగోడల్లో గ్రామీణ సంక్రాంతి శోభ వెల్లివిరుస్తుందని ముత్యాల సరాల గేయ ఛందస్సులో వర్ణించారు. అభినవ తిక్కన తుమ్మలవారు పరిగపంట కావ్యంలో ‘సంక్రాంతి ముచ్చట్లు’ ఖండికలో, సంక్రాంతి తలపులు ఖండికలో తెలుగుదేశపు గ్రామీణ శోభను రమణీయంగా చిత్రించాడు. రైతుల పండుగైన సంక్రాంతి రైతు జీవితాన్ని సమన్వ యించి గొప్పగా వర్ణించాడు. గాంధీ మహాత్ముడి పుణ్యాన సాధించుకొన్న స్వతంత్ర భారతదేశంలో ప్రభుత్వం పంటకాల్వలు తవ్వించి, మంచి విత్తనాలు, ఎరువులు పంచిపెట్టి, పంటతెగులు అరికట్టి మందులు పంపిణీ చేసి స్వల్పమైన వడ్డీలతో రుణాలు ఇప్పించి రైతు సంక్షేమానికి సహకరించి నందున పంటలు పుష్కలంగా పండాయని ప్రశంసించాడు. ‘భూదేవిని నమ్మి కొలుచు కాపుల పొలాలు వరహాల కాపు గాచె’ – గతంకంటే మిన్నగా ఎకరానికి రెండుపుట్ల ధాన్యం పండుతుందని మెచ్చుకున్నాడు.

ఈ కవిగారు ‘సుబ్బయ్య’ అనే రైతు ఇంటికి సంక్రాంతినాడు వెళ్లి ఆ యింటి సంక్రాంతి శోభను ‘ఎన్ని ముగ్గులు! తోరణాలెన్ని! యెన్ని యెన్ని పూలదండలు! పండుగెల్ల వచ్చి నీటుగా/ నేడు మీ యింట పీట బెట్టి / గోటుగా నేడు మీ యింట కొలువుదీరె’నని అభినందించాడు. సంక్రాంతి ఖండికలో సంక్రాంతి లక్మీశోభను, గ్రామీణ ప్రాంతపు పైరుపంటలను అలంకరించుకొని, కొసరి నూరిన పచ్చి పసుపు పూత మొగానికి పూసుకొని, మిర్యపుపండు బొట్టుకొని, నునుమంచు తెల్లచీర సింగారించుకొని ‘కదలివచ్చెను భాగ్యాల కడలివోలె మకర సంక్రాంతి లక్ష్మి హేమంతి వీధి’ అంటూ ప్రకృతి శోభను చక్కగా సమన్వయించి సంక్రాంతి లక్ష్మిని అద్భుతంగా వర్ణించాడు. గ్రామీణ సంక్రాంతి సంబరాల్లో జరిగే కోడిపందాలను జాతీయస్థాయి శౌర్యానికి సంకేతాలుగా వర్ణించాడు. తెలుగు ముంగిళ్లలో సంక్రాంతి ముగ్గులు మహిళామణుల కళాత్మకదృష్టికి నిదర్శనాలన్నాడు. గొబ్బిముద్దలు తెలుగుతల్లి ధర్మదీక్షానిరతికి ప్రతీకలుగా వర్ణించాడు. రుచికరమైన పాయసాన్నాలు లేత జంటల తొలికారు వలపునకు చవులు పుట్టిస్తాయన్నాడు ‘వింత లొలకించు కలికి సంక్రాంతినిట్లు / తెలుగుదన మింటనింట మూర్తీభవించె’నని- ఇంటింట సంక్రాంతి లక్ష్మిమూర్తీ ఉద్భవించిందని ఆధునిక కవులందరికంటే మిన్నగా సంక్రాంతి వైభవాన్ని తుమ్మలవారు వర్ణించారు.

మహాకవి జాషువ సంక్రాంతి పండుగను సమస్త లోకానికి ఆహ్లాదం కలిగించే ‘పర్వరాఙ్మిమణిగా’ వర్ణించాడు. రేయింబవళ్లు పొలం దున్ని స్వేద బిందువులు చిందించిన కర్షకాళికి దీర్ఘ కష్టఫలితంగా ధాన్యరాసులు లభిస్తున్నాయి. అటు వంటి రైతులకు విశ్రాంతిని కలిగించే సంక్రాంతికి నమోవాకాలు సమర్పించాడు. సామాజిక ప్రయోజనాన్ని సంక్రాంతి పండుగతో సమన్వయించి ‘చలితో రేగిన రోగ బీజముల దోషంబెల్ల నీ భోగిమంటలతో దగ్ధము జేసి జీవితపు తోటల్‌ ‌శుద్ధిగావించి రాగల సంవత్సర మెల్ల దేశమున సౌఖ్యశ్రీలు వర్ణించి నిర్మల ధీశక్తులొ సంగుమమ్మ శుభసంక్రాంతీ! దిగంతముల్‌’.

‌సంక్రాంతి కేవలం తెలుగువారి పండుకే కాదు. జాతీయ పండుగ. అందుకే విశ్వకవి సమ్రాట్‌ ‌జాషువ దిగంతాల ప్రజలకు రాగల సంవత్సరంలో సౌఖ్యం సంపదలను, స్వచ్ఛమైన బుద్ధిని ప్రసాదించమని శుభ సంక్రాంతిని కోరుకున్నాడు. సంక్రాంతి విశిష్టతను ‘మానవులకె కాదు మహినెల్ల సృష్టికి తలప నీదు రాక సెలవు రోజు / ప్రణతులమ్మ సంకురాతిరి యింటింట / అడుగు మోపి విందు గుడిచిపొమ్ము’- సంక్రాంతి పండుగ మానవాళికే కాక సృష్టిలో జీవరాశులన్నింటికీ ఆహ్లాదం కలిగించే సెలవురోజు. కనుమ పండుగ రోజున పశువులకు విశ్రాంతి నిచ్చి అలంకరించి మంచి దాణాతో సంతృప్తి కలిగిస్తారు. సంక్రాంతి లక్ష్మిని ప్రతి యింట అడుగు మోపి విందు ఆరగించి పొమ్మని జాషువ స్వాగతించాడు.

మధురకవితాశ్రీ కరుణశ్రీ ‘స్వర్ణ సంక్రాంతి’ ఖండికలో సంక్రాంతి శోభను గొప్పగా వర్ణించాడు. ఉత్తరాయణ పుణ్యకాలంలో ‘కనుల పండుగ పూచెను గుమ్మడిపూలు/ఆదిత్య బంగారు అర్ఘ్యపాత్రములట్లు’ – సూర్యుడికి అర్ఘ్యం సమర్పించే బంగారుపాత్రల్లా గుమ్మడిపూలు పూచాయని గొప్ప భావుకతలో ఉత్ప్రేక్షించాడు. బంగారుపంటలతో పుడమితల్లి పులకించిందనీ, గోమాత పాడిపంటలతో విలసిల్లిందనీ వాస్తవిక దృష్టితో వర్ణించాడు. సంక్రాంతికి ఇంటికి వచ్చిన కూతుళ్లు అల్లుళ్లను చూసి తెలుగుతల్లులు పులకించారట. బంతిపూల సోయగాలతో ద్వారబంధాలు బంగారుకాంతులతో విలసిల్లాయని రాశాడు. పండుగకు వచ్చిన కూతురుని తల్లి ఆశీర్వదిస్తూ ‘వచ్చే సంక్రాంతికి గుమ్మడిపండు వంటి కొడుకు నెత్తుకొమ్మని’ పలికింది. వెంటనే స్పందించిన అల్లుడు నవ్వుతూ ‘కొడుకుపై ప్రేమతో కురురాజు చెడిపోయెను / కొడుకుపై మమతచే కుమిలిపోయెను కైక’ – అబ్బాయి వద్దండి అమ్మాయి కావలెనండి’ అంటాడు.

సంక్రాంతి ముగ్గులను వర్ణిస్తూ ‘అలరె సంక్రాంతి ముగ్గుల నడుమ గొబ్బెమలు / కవితలో అక్కడక్కడ యతిప్రాసల్లా’ అని చమత్కరించాడు. అందం, ఔచిత్యం తెలియని కొన్ని దున్నపోతులు గొబ్బిళ్లను తొక్కుతున్నాయని అధిక్షేపించాడు.

సంక్రాంతికి విరబూసిన బంతిపూలు, మిరప పండ్లు భూమాతకు పసుపు కుంకుమల్లా ఉన్నాయని ఉత్ప్రేక్షించాడు. భోగిమంటలను, బావామరదళ్ల సరసాలను, సంక్రాంతి బొమ్మలకొలువులను కరుణశ్రీ కడు రమ్యంగా వర్ణించాడు. ప్రముఖ సినీ కవి ఆరుద్ర ముత్యాలముగ్గు సినిమాలో ముగ్గుల సౌభాగ్యాన్ని గొప్పగా వర్ణించాడు.

‘ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ’ పాటలో ‘అరనైదోతనము అరుగులలికే వారి అరచేతిలో నుండు / తీరైన సంపద దినదినము ముగ్గున్న లోగిళ్లనుండు/ ముద్దు మురిపాలొలుకు ముంగిళ్లు / మూడుపూవులూ ఆరుకాయలు’గా అలరారుతాయని ముగ్గుల ప్రాధాన్యాన్ని చెప్పాడు. ముత్తైదువల ఐదోతనాన్ని పెంచే ముగ్గులు ఇల్లాలికి సౌభాగ్యాన్ని, ఇంటిల్లిపాదికీ వైభోగాన్ని ఇస్తాయన్నది తరతరాల సంప్రదాయం.

తెలుగుకవులు సంక్రాంతి గ్రామీణశోభను రైతుల ఇంటి సౌభాగ్యాన్ని సంక్రాంతి వేడుకలైన గంగిరెద్దుల ఆటలను, కోడిపందాలను బొమ్మలకొలువులను  తనివి తీరా వర్ణించారు. ప్రపంచీకరణ ప్రభావంతో సంప్రదాయపు వేడుకలు తరిగిపోవడం బాధాకరం.

– డా।। పి.వి.సుబ్బారావు 9849177594

వ్యాకసర్త : రిటైర్డ్ ‌ప్రొఫెసర్‌ & ‌తెలుగు శాఖాధిపతి, సి.ఆర్‌. ‌కళాశాల, గుంటూరు.

About Author

By editor

Twitter
YOUTUBE