జనవరి 12 జాతీయ యువజన దినోత్సవం (వివేకానంద జయంతి)
చేయవలసిన అవసరమే మున్నది? ఆయన అందరికీ సుపరిచితుడు. భారతదేశ చరిత్రలోగాని, సనాతనధర్మం చరిత్రలోగాని ఆయన అవతరణం ఏదో సామాన్యమైన ఘటన కాదు. నరేంద్రుడు అనే ఒక అసాధారణ యువకుని శ్రీరామకృష్ణ పరమహంస గుర్తించారు, ఆధ్యాత్మికంగా తీర్చిదిద్దారు. మేధోపరంగా ఒక అద్భుతమైన ఆయుధంగా మలచి వివేకానందస్వామి పేరున లోకం మీదకు పంపించారు. శ్రీరామకృష్ణ పరమహంస ఎవరు? వివేకానందుని మాటల్లోనే చెప్పాలంటే సనాతనధర్మాన్ని సంరక్షించడానికి అవతరించిన భగవదవతారం. తన ఆలోచనలోని గాఢత, నైశిత్యాలతోనూ మాటల బలంతోనూ హిందూ సమాజాన్ని మేల్కొల్పి చైతన్యవంతం చేయడం ఆయన ఎంచుకున్న సనాతనధర్మ సంరక్షణ మార్గం.
చిరపురాతనమైన హిందూజాతిని ఆనాటి సమకాలీన ప్రపంచంలో అగ్రభాగాన నిలపడానికి అవసరమైన సందేశాన్ని వివేకానందుని జీవితం అందజేసింది. మనదేశంలోనూ, ఇతర దేశాల్లోనూ ఉన్న కోటానుకోట్ల ప్రజల జీవితాలను తీర్చిదిద్దేందుకు ఆ సందేశం ఇప్పటికీ పనిచేస్తూనే ఉంది. వివేకా నందుని పేరు హిందూ సమాజంలో ఎంత లోతుగా వ్యాపించి, నిలిచి ఉందో తలుచుకుంటే ఆశ్చర్యం వేస్తుంది. దేశంలోని అన్ని ప్రాంతాలలోనూ, దాదాపుగా అన్ని పట్టణాలలో, అసంఖ్యాకంగా ఉన్న గ్రామాలలో ఆయన పేరుమీద వెలసిన ఎన్నో వేలసంస్థల ద్వారా, క్షల కార్యకలాపాల ద్వారా అది వ్యక్తమౌతున్నది.
వివేకానందస్వామి తన పలుకుల ద్వారా హిందూ సమాజంలో విద్యుద్దీపకాంతులను ప్రసరింపజేసి తేజోవంతం చేశారని, హిందూజాతిని చైతన్యవంతం గావించారని చరిత్ర ప్రకటిస్తున్నది. వివేకానందుడు ఆ మాటలను పలికిన కొన్ని దశాబ్దాల తర్వాత వాటిని చదివి ఉత్తేజితుడైన పాశ్చాత్య విద్వాంసుడు రోమారోలా అభిప్రాయాలను బట్టి అవి కేవలం శబ్దాలో, మాటలో కావనీ, అనంత జీవనానికి అవసరమైన భావబీజాలనీ గ్రహించవచ్చు. రోమారోలా ఏమని రాశారో చూడండి: వివేకానందుని వాక్యాలు పుస్తకాలలో పొందుపరిచిన వాటిని – ముప్పది సంవత్సరాల అనంతరం నేను చేతిలోకి తీసికొని చూసినపుడు-ఒక విద్యుత్తరంగం నా మేని ద్వారా ప్రసరిస్తున్నట్టుగా గగుర్పాటు అనివార్యంగా కలుగుతున్నది.’ ఆయన ఇలా ప్రశ్నిస్తున్నారు. ‘మరి మన కథానాయకుని పెదవుల వెంట మండుతున్న అగ్నికణాల వలె వెలువడుతున్న సమయంలో అవి ఎటువంటి ప్రభావము ప్రసరింపజేసినవో కదా!’
వివేకానందస్వామి తన గాఢమైన భావనలతో, విద్యుత్తరంగాలను వ్యాపింపచేసే పదాలతో ప్రభావాన్ని ప్రసరింపజేసినది సామాన్య వ్యక్తులపైననే కాదు. ఎంతో మేధో సంపత్తిని కలిగి ఉన్నత పీఠాలను అధిష్టించిన – అంతకుముందు ఏమాత్రం పరిచయం లేని-క్రొత్తవారిని కూడా కదిలించి వేశారు.
అనతికాలంలోనే హిందూదేశంలోని జాతీయోద్య మానికి ప్రధాన రథసారథిగా స్వామీజీ అవతరించారు. ఉద్వేగపూరితమైన ఆయన భావాలు, పదునైన పదాలు జాతీయవాదులను, స్వాతంత్య్రం కోసం పోరాడే యోధులను అందరినీ కదలించాయి, ప్రేరేపించాయి. ఆ రోజుల్లో దేశభక్తి భావనతో కదిలి విప్లవోద్యమ కార్యకలాపాలలో పాల్గొన్నవారు, జీవితాలను బలిదానంచేసినవారూ అందరూ ‘లెక్చర్స్ ఫ్రమ్ కొలంబో టు ఆల్మోరా’ గ్రంథాన్ని ఒక పాఠ్య పుస్తకంగా భావించుకొని కంఠస్థం చేసినవారే. శాంతి యుత రాజకీయ ఉద్యమాల ద్వారా స్వాతంత్య్రం కోసం యత్నించిన నాయకులందరూ ఆయన భావాలను చదివి, ఉత్తేజితులై, ప్రేరితులై, ఆయన చూపిన మార్గంలో నడచిన వారే. ఆనాటి నాయకు లలో సమున్నతులైన కొందరు వివేకానందస్వామి సందేశానికి ఏ విధంగా ప్రేరితులయ్యారో తెలిసికొన డానికి ఈ ఉటంకింపులు ఉపయోగపడగలవు.
గాంధీజీ: నేను వివేకానందస్వామి గ్రంథాలను చదివిన కారణంగా నాకు నా మాతృభూమి పట్ల ఉన్న ప్రేమాభిమానాలు వేయి రెట్లుగా వృద్ధి చెందాయి.
రవీంద్రనాథ ఠాగూర్: మీరు హిందూదేశం గురించి తెలుసుకోవాలనుకుంటే వివేకానందుని అధ్యయనం చేయండి.
నేతాజీ బోస్: ఆధునిక జాతీయోద్యమానికి ఆధ్యాత్మిక జనకునిగా వివేకానందస్వామిని పేర్కొనవచ్చు. ఆయనది పౌరుషాన్ని ప్రకటించే వ్యక్తిత్వం. పోరాడే స్వభావానికి ప్రతిరూపం ఆయన. మన దేశాన్ని సముద్ధరించడానికి మనకు ఏ సిద్ధాంత భూమిక కావాలో, ఆ విధంగా వేదాంతాన్ని వ్యాఖ్యానించి చెప్పారాయన. ఆయన గనుక ఇప్పుడు జీవించివుంటే, నేను ఆయన పాదాల చెంత నిలిచి ఉండేవాడిని.
చక్రవర్తుల రాజగోపాలాచారి: ‘వివేకానంద స్వామి హిందూధర్మాన్ని, హిందూ దేశాన్ని రక్షించారు. ఆయన గనుక లేకపోతే మనం మన ధర్మాన్ని కోల్పోయి ఉండేవాళ్లం. స్వాతంత్య్రం సంపాదించుకోగలిగి ఉండేవాళ్లం కాదు. కాబట్టి మనం ఆయనకు రుణపడి ఉన్నాం.
జాతీయ మహాకవి సుబ్రహ్మణ్యభారతి: హిందూ ధర్మ పునరుజ్జీవనకార్యానికి శుభారంభం చేసినది వివేకానంద స్వామియే.
ఇవి కొన్ని మచ్చుతునకలు. భారతదేశంలో నాయక శ్రేష్ఠులందరూ వివేకానందస్వామి భావాలతో, పలుకులతో ప్రేరితులైనారని చెప్పడానికి ఇంకా ఎన్నైనా ఉదాహరణలీయ వచ్చు. అయితే ఇతరులను ఉత్సాహపరిచి జాతీయోద్య మంలో ముందుకు నడిపించే పాత్రకే ఆయన పరిమితం కాలేదు. ఈ దేశాన్ని విదేశీ దాస్యశృంఖలాల నుండి విడిపించే ప్రయత్నాలకూ చొరవ చూపాడు.
మాతృదేశ విముక్తికై వివేకానందుడు చేసిన ప్రయత్నాలు
మన అందరి గౌరవాలను అందుకొంటున్న స్వాతంత్రో ద్యమ నాయకాగ్రేసరు లందరూ తాము వివేకానందస్వామి పలుకులతో ప్రేరితులమై రంగంలోకి దూకామని చెబుతూ ఉంటారుగదా – ఇటువంటి సందర్భంలో ఒక ప్రశ్న మనలో తలెత్తకుండా ఉండదు – ‘వివేకానంద స్వామి ఈ దిశలో ప్రత్యక్షంగా చేసిన ప్రయత్నాలు ఏవీ లేనే లేవా?’ అని. వివేకానందస్వామి విదేశాలకు చెందిన తన శిష్యులతో మాట్లాడుతూ చెప్పిన విషయాన్ని ఆయన సోదరుడు భూపేంద్రనాథదత్త రాసిపెట్టాడు. మనదేశంలోని రాజ సంస్థానాల పాలకులందరూ కలిసికట్టుగా ఆంగ్లేయులతో సమరం చేయాలన్న దృష్టితో ఆ సంస్థానాల రాజకుమారు లతో స్వామీజీ ఒక సమావేశం ఏర్పరిచారు. అయితే వారి నుండి స్వామిజీ ఆశించిన రీతిలో స్పందన లభించలేదు. విస్మితుడైన స్వామిజీ దేశం చచ్చిపోయిన స్థితిలో ఉందన్న వాస్తవాన్ని ఎంతో ఆవేదనతో అంగీకరించ వలసి వచ్చింది. పైస్థాయిలో జరిగే ప్రయత్నాలు నెరవేరగల పరిస్థితి లేదని గ్రహించిన కారణంగానే క్రింది స్థాయినుండి ప్రయత్నాలను ఆరంభించి జాతిని పునరుజ్జీవింపజేసి, స్వాతంత్య్ర సమరాన్ని కొనసాగించ వలసిన అవసరముందని ఒక స్పష్టమైన అభిప్రాయా నికి వచ్చారు. ఈ దృష్టితో రాజకీయ స్వాతంత్య్ర సాధనకు అవసరమయ్యే ప్రయత్నాల కంటే మరింత విస్తృతమైన ప్రయత్నాలు చేయవలసి ఉంటుందని స్థిరనిర్ణయానికి వచ్చారు.
వివేకానందస్వామిని అందరికంటే బాగా అర్థం చేసుకున్న శిష్యురాలు సోదరి నివేదిత ‘The master as I saw him’ (నా దృష్టిలో మా గురువు) అనే గ్రంథం రచించారు. వివేకానందస్వామి జీవిత లక్ష్యం ఏమిటో, దానిని తరచుగా ఆయన ఎటువంటి మాటల్లో వ్యక్తీకరిస్తూ ఉండేవారో, ఆ గ్రంథంలో పొందుపరిచారామె. ‘హిందూత్వాన్ని సమర శీలమైనదిగా చేయాలి. ఈ దేశాన్ని పూర్వవైభవస్థితికి తీసికొనిపోవాలి. హిందూత్వానికి ఉమ్మడి ఆధారాలను కనుగొని వాటిపట్ల శ్రద్ధ వహించటం ద్వారానే ఈ పనులు సాధ్యమౌతాయి.’
అనేక పర్యాయాలు ఈ దేశ ప్రజానీకాన్ని మేల్కొల్పటం కోసం స్వామీజీ పిలుపునిచ్చారు. ఈ దేశంలో పేద, దళిత, ఉపేక్షిత వర్గాలు ముందుకు రావాలని స్వామీజీ పిలుపు నిచ్చారు. ‘త్యాగం-సేవ’ ఈ రెండూ మన దేశానికి యుగాయుగాలుగా ఉన్న ఆదర్శాలని తెలియజెప్పారు. వ్యక్తి నిర్మాణం, శీల నిర్మాణం, క్రమశిక్షణ, సంఘటనాత్మకతలు తక్షణ అవసరాలని కూడా చెప్పారు. ఆయన పిలుపు ఇది: ‘నేను హిందువునైనందుకు గర్విస్తున్నాను. పరమాత్ముని దయతో, నాదేశ వాసులారా, మీరూ అటువంటి ఆత్మాభిమానం, గర్వం కలిగి ఉండాలని కోరుకొంటున్నాను. మీ పూర్వికుల పట్ల మీకున్న విశ్వాసం మీ రక్తంలో పొంగు లెత్తాలి. అది మీ జీవితాలకు జవసత్వాలు అందజేయాలి. అది ప్రపంచ విముక్తికై మీ చేత పని చేయించాలని నేను కొరుకొంటున్నాను’.
హిందూ జాతీయ పునరుత్థానం గురించి వివేకానందస్వామిలో ఎటువంటి అద్భుత కల్పన ఉందో, దానినే ఆర్.ఎస్.ఎస్. తన లక్ష్యంగా స్వీకరించి పని చేస్తున్నది. సంఘాన్ని స్థాపించిన డా।। కేశవరావ్ బలిరామ్ హెడ్గేవార్ ఏ లక్ష్యాలతో దానిని స్థాపించారో గమనిస్తే, వివేకానంద స్వామి ఆలోచన లోని మౌలిక భావనలన్నీ డా।।హెడ్గేవార్ హృదయం లోనూ, స్వాతంత్య్రం కోసం చేసిన విప్లవోద్యమాలలోనూ, ఇతర ఉద్యమాలలోనూ చాలా చురుకుగా పనిచేశాయని అనిపిస్తుంది. ఐతే ఆనాటి సాంఘిక, రాజకీయ ఉద్యమాలలో వివిధస్థాయిలో పాల్గొం టున్న వారిలో ఉండవలసిన రీతిలో సౌశీల్యం, ఇతర గుణాలూ లేకపోవడం, దేశంకోసం స్వార్థాన్ని త్యజించి పనిచేయాలనే ఉన్నతాశయం లేకపోవడం, సంస్థలు నిర్దేశించిన క్రమశిక్షణను పాటించే గుణం లేకపోవటం – ఈవిధమైన లోటుపాట్లను గ్రహించి డాక్టర్జీ నిరాశ చెందారు. ఈ విషయాలను గురించి ఎంతో లోతుగా ఆలోచించి, తర్కించుకొని – ఈ దేశపు యువకులలో శీలాన్ని పెంపొందించటం, క్రమశిక్షణ నేర్పటం, దేశభక్తిని రగుల్కొల్పటం, హిందూసమాజంలోని వివిధ సముదాయాలలో ఐకమత్యాన్ని సాధించటం, చైతన్యవంతం గావిం చటం లక్ష్యాలుగా డాక్టర్జీ సంఘాన్ని ప్రారంభించారు. వివేకానందస్వామి లోనూ, డా।।హెడ్గేవార్‌లోనూ – వారి ఆలోచనలలో ఆవేదనలలో ఉన్న సారూప్యం నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది.
డా।।హెడ్గేవార్ రూపొందించిన రా.స్వ.సంఘ కార్యంలో వివేకానందస్వామి ప్రేరణదాయకమైన ఆలోచనలను నిత్యజీవితంలో అనుసరించే మార్గంగా తీర్చిదిద్దుకొని వేలాదిగా వివేకశీలురూ సజ్జనులూ దేశవ్యాప్తంగా సమైక్య భావనతో కార్యశీలురవుతూ ఉన్నారు.
వ్యక్తినిర్మాణం, శీలనిర్మాణాలపై దృష్టి సారించిన వ్యక్తి వివేకానందస్వామి. వీటికి ఉపయోగపడే కార్యపద్ధతిని రూపొందించుకొంటూ, ఆ పనిలో తదేక ధ్యానంతో కృషిచేసిన వ్యక్తి డా।। హెడ్గేవార్. ఆయన శ్రీరామకృష్ణ – వివేకానందుల శ్రేణిలోనున్న గురూజీ గోళ్వల్కర్‌ను తన తర్వాత ఈ కార్యాన్ని విస్తరింపజేయ డానికి,అందరికీ అర్థమయ్యేటట్లుగా వివరించడానికి ఎంచుకొన్నారు. శ్రీరామకృష్ణుని కార్యప్రణాళికను అమలుపరచటంలో వివేకానందుని పాత్ర ఎటువంటిదో, డా।। హెడ్గేవార్ ఆలోచనలకు రూపమివ్వటంలో గురూజీ పాత్ర అటువంటిది.
దూరం నుండి చూసేవారికి వివేకానంద ప్రవాహం, డా।। హెడ్గేవార్ ప్రవాహం – రెండూ విడివిడిగా, ఒకదానితో ఒకటి సంబంధం లేనివిగా కనబడవచ్చు. కాని ఈ రెండింటిలో వ్యక్తి నిర్మాణం – శీలనిర్మాణం – అనే సామాన్య లక్ష్యం ఉంది. అటు వివేకానంద స్వామికి, ఇటు డా।। హెడ్గేవార్‌కి మధ్య వారధిగా గురూజీ నిలిచారు.
– కృ.సూర్యనారాయణరావ్: ‘జాతీయ పునరుజ్జీవనము
వివేకానందుని దృష్టి- రా.స్వ.సంఘం కృషి’ పుస్తకం నుంచి