నిస్సందేహంగా గాంధీజీ ఈ దేశ భవిష్యత్తు గురించి తపనపడ్డారు. బాగా ఆలోచించారు. ఎంతో మథనపడి, అద్భుత వాస్తవికతతో మహోన్నత సలహా ఒకటి ఇచ్చారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత భారత జాతీయ కాంగ్రెస్‌ను రద్దు చేయమన్నదే ఆ సలహా. ఆయన జీవించి ఉన్న సమయంలో కాంగ్రెస్ ఒక ఉద్యమ సంస్థ. తరువాత ఒక రాజకీయ పక్షం. కాంగ్రెస్ సంస్థ జాతీయ భావాల మీద, దేశ గౌరవం పట్ల ఆ సంస్థ చిత్తశుద్ధి మీద గాంధీజీకి స్పష్టమైన అవగాహన ఉండే అలాంటి సలహా ఇచ్చారని అనిపిస్తుంది. ఆయన అంచనా తప్పు కాదు.
పొరుగుదేశం పాకిస్తాన్ సరిహద్దులలో ఉన్న బాలాకోట్ మీద భారత సైనిక దళాలు ఫిబ్రవరి 26, 2019న సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించాయి. ‘ఔను, ఇలాంటి దాడి చేయవలసి వచ్చింద’ని నాడు మన సైనికాధికారులు బాహాటంగానే చెప్పారు. దాడా! అసలక్కడ చిన్న చిగురుటాకు కూడా కదల్లేదే! ఇక సర్జికల్ స్ట్రైక్స్ ఏమిటి హాస్యాస్పదంగా! అంటూ పాకిస్తాన్ బుకాయించింది. పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ మరింత దీటుగా సర్జికల్ స్ట్రైక్స్ ఉట్టిదే అని బల్లగుద్ది చెప్పారు. చిత్రంగా పాకిస్తాన్ సైన్యం, ఆ సైన్యం ప్రతిష్టించుకున్న దిష్టిబొమ్మ ఇమ్రాన్‌ఖాన్ వాదనలను అక్షరం పొల్లుపోకుండా సమర్ధించింది నాడు కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ మీద కాస్త కూడా నమ్మకం, గౌరవం లేకపోయినా, తల్లికుక్క మొరిగితే పిల్లకుక్కలన్నీ బొయ్యోమంటూ రాగం అందుకున్నట్టు కమ్యూనిస్టులు, మాయావతి, చంద్రబాబు తదితర చిల్లర పార్టీలు కూడా ఎన్‌డీఏ ప్రభుత్వం కోతలు కోస్తున్నదంటూ స్వైర విహారం చేశారు. కానీ వాస్తవాలు దాగవు. సమయం పడితే పట్టవచ్చు. సత్యమే గెలుస్తుంది. ఇప్పుడూ అదే జరిగింది.
‘భారత్ అంతర్జాతీయ సరిహద్దు దాటి వచ్చి, యుద్ధాన్ని మరిపిస్తూ సైనిక చర్యకు పూనుకుంది. సైన్యానికి చెందిన 300 మంది చనిపోయారు’ అంటూ ఈ నెల 8, 9 ప్రాంతాలలో ఆగా హిలేలీ అనే ఆయన కుండబద్దలు కొట్టి చెప్పాడు. ఈయన బీజేపీ సభ్యుడో, అమెరికా అభిమానో అనుకోనక్కరలేదు. పాకిస్తాన్ మాజీ దౌత్యవేత్త. తరచూ పాకిస్తాన్ టీవీ చర్చలలో దర్శనమిస్తూ ఆ దేశ సైన్యం చర్యలనూ, నిర్ణయాలనూ సమర్ధిస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తి ఇంత స్పష్టంగా ఇవాళ్టికి అసలు గుట్టు బయటపెట్టాడు. ఒక ఉర్దూ చానల్ చర్చలలోనే ఈ వాస్తవాన్ని భళ్లుమన్నాడు. అంటే- బాలాకోట్ దాడుల గురించి మా సైన్యం చెప్పినదంతా అబద్ధమే. మా ప్రధాని ఇమ్రాన్ చెప్పినదీ అబద్ధమే అని ఆగా హిలేలీ నిర్ద్వంద్వంగా ఈ ప్రపంచానికి చాటినట్టే. మరి అవే వాదనలతో సాగిన మన విపక్ష విషగళాల నోటి నుంచి వచ్చినది మాత్రం నిజమెలా అవుతుంది? పాక్ ప్రబుద్ధుల ఎంగిలి అబద్ధాలని వీళ్లు స్వీకరించి, ఈ దేశం మీద రుద్దే ప్రయత్నం చేశారేతప్ప వాస్తవాలు తెలిసికాదు అనడానికి ఇక అభ్యంతరం ఎందుకు? కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు కాని అధ్యక్షుడు రాహుల్ అనే రాజకీయ అజ్ఞాని ఆనాటి దుష్ప్రచారానికి నడుం బిగించిన సంగతిని మరచిపోరాదు.
ఇంతకీ బాలాకోట్ దాడులు ఎందుకు? ఫిబ్రవరి 14, 2019 నాటి పుల్వామా దాడికీ, అందులో 40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లను బలి తీసుకున్నందుకు ప్రతీకార చర్య. పుల్వామా దాడి మా ఘనతేనంటూ జైష్ ఏ మహ్మద్ ప్రకటించు కోవడం, బాలాకోట్‌లో ఆ సంస్థ స్థావరం ఉండడం, అదే లక్ష్యంగా దాడి జరగడం వాస్తవం. అంతేకానీ అవి భారత ప్రభుత్వం వీరత్వాన్ని ప్రదర్శించడానికి చేసిన దాడులు కానేకావు. కానీ పాకిస్తాన్‌తో అనివార్యమవుతున్న ప్రతి సంఘర్షణకు విపక్షం బీజేపీనే బోనులో నిలబెట్టే నీచమైన ప్రయత్నం చేసింది. ఇప్పుడు వాస్తవం తెలిసిన తరువాత కాంగ్రెస్‌ను, అప్పుడు దానిని సమర్థించిన ఈ పార్టీలను ఏ పేరుతో పిలవాలి? అసలు పుల్వామా దాడిలోనే పాక్ ప్రభుత్వం పాత్ర ఉందంటూ కొద్దివారాల క్రితమే ఆ దేశ మంత్రి ఒకరు జబ్బలు చరుచుకోలేదా? ఆ రక్తపాతాన్ని పాకిస్తాన్, అక్కడి ప్రజలు, ప్రధానంగా ముస్లిం మతోన్మాదులు ఘనకార్యంగానే భావిస్తున్నారు. బాలాకోట్‌లో ఉన్న జైష్ ఏ మహ్మద్ శిబిరాల మీద భారత సైనికుల దాడి నిజం, నలుగురు చనిపోయారని మాకు సమాచారం ఉంది అని నాడు ఇండియా టుడే వంటి చానళ్లు చెప్పినా పట్టించుకున్నవాళ్లు లేరు. బాలాకోట్ దగ్గరే ఒక మసీదులో పనిచేసే వ్యక్తి ఇచ్చిన సమాచారం ఇదీ అని ఆ చానల్ ఘోషించినా విపక్షాలు బధిర్వం నటించాయి. పాకిస్తాన్‌కు దొరికిన మన వింగ్ కమాండర్ అభినందన్‌ను భారత్ అంటే భయంతోనే విడుదల చేశారని పాక్ ముస్లింలీగ్ (ఎం) నాయకుడు అయాజ్ సిద్దికి చెప్పలేదా? ఆ రోజు పాక్ విదేశాంగ మంత్రి ఖురేషీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారనీ, ఆ సమావేశ మందిరంలోకి దాదాపు వణికిపోతూ వచ్చిన సైనిక దళాల అధిపతి బాజ్వా, ఆ రాత్రి తొమ్మిది గంటలకి దాడి చేయడానికి ఇండియా సిద్ధపడుతోంది, అభినందన్‌ను వదిలిపెట్టాల్సిందే అని చెప్పాడనీ సిద్దికి సదరు దేవరహస్యం బట్టబయలు చేశారు. ఖురేషీకి మాత్రం విడిచిపెట్టే ఉద్దేశం లేదట.
వాస్తవాలన్నీ ఇలా ఉంటే భారత ప్రతిపక్షాలు ఇలా కళ్లూ చెవులూ మూసుకుని మోదీ మీద దాడికి దిగడం విజ్ఞతేనా? ఈ ఉష్ట్రపక్షుల బుర్రలకు ఆ వాస్తవాలు ఎలా వెళతాయి! భారతీయ జనతా పార్టీ మీద విమర్శకీ, భారతదేశం మీద విమర్శకీ మధ్య పాటించాల్సిన సంయమనం విషయంలో అయినా అవి ఇంగిత జ్ఞానం కోల్పోతే ఎలా? అయోధ్య, పుల్వామా, బాలాకోట్, కశ్మీర్, సీఏఏ అల్లర్లు, ఇప్పుడు రైతుల పేరిట జరుగుతున్న అరాచకం-ఏదైనా, విపక్షం వైఖరి చూస్తుంటే వాటికి గట్టి పాఠం అవసరమనే అనిపిస్తుంది. ఆ విమర్శలు నీచమైన అబద్ధాలని తేలినా ఇప్పటికీ జాతికి క్షమాపణ చెప్పాలన్న కనీస జ్ఞానం, మర్యాద పాటించడం లేదు.