– సాయిప్రసాద్
ఒకప్పుడు మన దేశంలో విద్యుత్ కొరత తీవ్రంగా ఉండేది. కాబట్టి విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం పెంచుకోవటానికి అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఉత్పత్తి సామర్థ్యం పెరగాలంటే పెట్టుబడులు అవసరం. ప్రభుత్వాల వద్ద తగినన్ని వనరులు లేవు. కాబట్టి ప్రైవేటు రంగాన్ని పెట్టుబడులు పెట్టటానికి ప్రోత్సహించారు. అందుకు తగిన విధానపరమైన మార్పులు చేశారు. దాంతో మన దేశంలో విద్యుత్‌రంగంలో ప్రైవేటు పెట్టుబడులు పెరిగాయి. ప్రైవేటు పెట్టుబడులు పెరగటం వల్ల నియంత్రణ పద్ధతులకం, నిబంధనలకు పదును పెట్టవలసి వచ్చింది. వేగంగా ఉత్పత్తి సామర్థ్యం పెంచుకోవాలని ప్రభుత్వాలు, వీలైనంత త్వరగా ఉత్పత్తి మొదలు పెట్టి ఆదాయం ఆర్జించాలని పెట్టుబడిదారులు అనుకోవటం వల్లనే దేశంలో ధర్మల్ విద్యుత్ ప్లాంట్లు ఎక్కువగా ఏర్పడినాయి. ఎందుకంటే ఇతర ఉత్పత్తి సాధనాల కంటే ధర్మల్ విద్యుత్ కేంద్రాలను నెలకొల్పటం కొంత తేలిక. కాబట్టి ప్రైవేటు విద్యుత్ ఉత్పత్తిదారులు, భారీ పెట్టుబడులతో ధర్మల్ విద్యుత్ ప్లాంట్లను ఎక్కువగా ఏర్పాటు చేశారు.
దేశ అవసరాలు పెరుగుతుంటాయి. కాబట్టి వాటికి తగినట్లుగా విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం పెంచుకోవాలని నూతన ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చారు. ఉత్పత్తి సామర్థ్యం పెరగటం వల్ల విద్యుత్ లభ్యత పెరిగింది. లభ్యత పెరిగింది కాబట్టి ధరలు తగ్గాయి. క్రమంగా విద్యుత్ లభ్యత పెరగటంతో 2017 నుంచి మనదేశం విద్యుత్ మిగులు దేశంగా పెరుగాంచింది. విద్యుత్ మిగులు దేశం అయితే కొన్ని రాష్ట్రాలో ఇంకా విద్యుత్ కోతలు ఎందుకు ఉంటున్నాయనే సందేహం కలగవచ్చు. దానికి సమాధానం చెప్పటం కష్టమేమీ కాదు. అనేక రాష్ట్రాలలో విద్యుత్ పంపిణీ సంస్థలు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులలో ఉన్నాయి. అందుకు ఆ పంపిణీ సంస్థలు ఉత్పత్తిదారులకు ధరలు చెల్లించే స్థోమత లేక విద్యుత్ కోతలు విధించవలసిన పరిస్థితి వచ్చింది. అంతేకాదు, ఆర్థిక ఇబ్బందుల వల్ల విద్యుత్ పంపిణీ సంస్థలు ఉత్పత్తిదారులకి సకాలంలో చెల్లింపులు చేయలేని పరిస్థితి నెలకొన్నది. పంపిణీ సంస్థలు ఉత్పత్తి దారులకి సకాలంలో చెల్లింపులు చేయలేకపోవటం వల్ల ప్రైవేటు విద్యుత్ ఉత్పత్తి సంస్థలు ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చింది. అందువల్ల ప్రైవేటు సంస్థలు చేయవలసిన చెల్లింపులు చేయలేక పోయినాయి. ముఖ్యంగా ప్రైవేటు విద్యుత్ ఉత్పత్తి సంస్థలు బ్యాంక్ ఆర్థిక సంస్థలకు చెల్లించవలసిన బకాయిలు చెల్లించలేకపోయాయి. బకాయిలు సకాలంలో చెల్లించలేకపోవటంవల్ల బ్యాంకులు, ఆర్థిక సంస్థలకి మొండి బాకీలు, నిరర్థక ఆస్తులు పెరిగి పోయాయి. ఈ ప్రైవేటు విద్యుత్ సంస్థల నుంచి రావలసిన మొండి బాకీలు 2 లక్షల కోట్ల రూపాయలు దాటిపోయాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉన్నదో ఊహించవచ్చు. విద్యుత్ సరఫరా చేసినందుకు విద్యుత్ సంస్థలు విద్యుత్ చార్జీలు వసూలు చేస్తూనే ఉన్నాయి కద, అలాగే ప్రజలకి ఉచిత విద్యుత్ వంటివి అందించినందుకు రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్ పంపిణీ సంస్థలకు నగదు చెల్లిస్తూనే ఉన్నాయి కదా. అలాగే ప్రతి రాష్ట్రంలో విద్యుత్ నియంత్రణ మండళ్లు, ప్రతి సంవత్సరం విద్యుత్ చార్జీలు నిర్ణయిస్తూనే ఉన్నాయి కద. అటువంటప్పుడు ఆ పంపిణీ సంస్థలు ఆర్థిక ఇబ్బందులలో ఎందుకు కూరుకుపోయాయి? ఈ సంస్థలు ప్రభుత్వ అధీనంలో ఉన్నవే, అవి ఆర్థిక ఇబ్బందులలో కూరుకుపోయి, వ్యవస్థలో కీలక బ్యాంకింగ్ రంగంపై ప్రభావం చూపే స్థితికి చేరుకున్నప్పుడు ప్రభుత్వం తగు దిద్దుబాటు చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు. ధర్మల్ విద్యుత్ కేంద్రాల వల్ల వ్యయం అవుతుంది కదా, వాటి బదులు ప్రత్యామ్నాయంగా సాంప్రదాయేతర ఇంధనంతో ఉత్పత్తి అయ్యే విద్యుత్‌కి ప్రాధాన్యం ఇస్తే ప్రభుత్వరంగ విద్యుత్ పంపిణీ సంస్థలపై భారం తగ్గుతుందా?
మనది విద్యుత్ మిగులు దేశం అయినప్పుడు కొత్త విద్యుత్ సంస్థలకి అనుమతులు ఎందుకిస్తున్నారు? గతంలో జల విద్యుత్‌కి ప్రాధాన్యం ఇచ్చేవారు కద, ఇప్పుడు కేవలం సోలార్, ధర్మల్, విండ్, బయోగ్యాస్, న్యూక్లియార్ విద్యుత్ గురించే ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నారంటే మన దేశంలో జల విద్యుత్ సామర్థ్యం పూర్తిగా వాడుకున్నట్టే భావించవచ్చా? విద్యుత్ పంపిణీ సంస్థల ఆర్థిక స్థితి సరిగా లేకపోవడంవల్ల మనం జల విద్యుత్‌ను అవకాశం ఉన్న మేరకు ఉత్పత్తి చేయలేక పోతున్నామా? జల విద్యుత్ ఉత్పత్తి వ్యయం తక్కువగా ఉంటుంది కదా, అయినా మనం జలవిద్యుత్‌ను తగినంత ఉత్పత్తి చేయలేకపోవటానికి ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణమని చెప్పగలమా? ఇప్పుడు కేంద్రం విద్యుత్ సంస్ఖరణల విషయంలో రాష్ట్రాలపై ఒత్తిడి పెంచటానికి విద్యుత్ సంస్థల ఆర్థిక స్థితే కారణమా? గతంలో అమలు జరిపిన ఉదయ్ పథకం వల్ల విద్యుత్ సంస్థలకు ప్రయోజనం చేకూరలేదా? వంటి అనేక అనుమానాలు సామాన్యుడికి కలగటం సహజమే. విద్యుత్ చట్టాల ప్రకారం విద్యుత్ నియంత్రణా మండళ్లు విద్యుత్ చార్జీలను నిర్ణయించాలి. ఆ పక్రియ జరుగుతున్నట్టు కనిపిస్తున్న ప్పటికి వాస్తవానికి విద్యుత్ సంస్థల ఆర్థిక పరిపుష్టిని చేకూర్చే విధంగా చార్జీల నిర్ణయం జరగ•ం లేదు. చట్ట ప్రకారం విద్యుత్ సంస్థలు నిర్దేశిత మిగులు ఆర్జించే విధంగా చార్జీలను నిర్ణయించి వాటిని వసూలు చేసేలా చేసి, విద్యుత్ సంస్థలు ఆర్థికంగా బలపడేవిధంగా చూడాలి. కాని అది అలా జరగటం లేదు.
అనేక కారణాలవల్ల విద్యుత్ సంస్థల ఆర్థిక కార్యకలా పాలు పారదర్శకత లేకుండా జరుగుతున్నాయి. ప్రభుత్వాలు విద్యుత్ సంస్థల ఆర్థిక ప్రయోజనాలను పట్టించుకోకుండా తమ ఆదేశాలను వాటిచేత అమలు జరిపిస్తున్నాయి. రాజకీయ ప్రయోజనాల కోసం అనేక రాయితీలు, ఉచిత పథకాలు ప్రకటించి, వాటికి అయ్యే ఖర్చును సక్రమంగా మదింపు వేసి విద్యుత్ సంస్థలకి చెల్లించటం లేదు. ఇది చాలదన్నట్టు సంస్థల కార్యక లాపాలలో అనవసర జోక్యం, అర్హతకూ, యోగ్యతకూ ప్రాధాన్యం లేకుండా తమ ఆశ్రితులను సంస్థల కీలక స్థానాలలో నియోగించటం, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలలో మతలబులు, అవినీతి, నిర్వహణ వ్యయం పెరిగిపోవటం, చార్జీలను పూర్తి స్థాయిలో వసూలు చేయలేకపోవటం వంటి అనేక కారణాలవల్ల విద్యుత్ పంపిణీ సంస్థలు ఆర్థిక ఇబ్బందులలో కూరుకు పోయాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు క్రమంగా సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇచ్చాయి. అందువల్ల ఉన్న నిధులలో సంక్షేమానికి ఎక్కువ కేటాయింపులు చేస్తున్నారు. నిధుల కేటాయింపులు, ఖర్చు చేయటంవంటి వాటిలో సమతౌల్యం పాటించటం ప్రభుత్వాలకు కష్టంగా మారింది.
సంక్షేమంవల్ల ఉన్న ప్రయోజనాలు పాలకులకి బాగా అర్థం అయ్యింది. అందుకని దాని ప్రాధాన్యం పెంచుతూ పోయారు. దాంతో మిగిలిన అంశాలకి, ముఖ్యంగా మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వాలు నిధులు కేటాయించలేని పరిస్థితి వచ్చింది. నిధులు కేటాయించలేని స్థితిలో ప్రభు త్వాలు ఉన్నాయని మౌలిక సదుపాయాలు కల్పించకుండా ఉండలేరు. అందుకని మౌలిక సదుపాయాల కల్పనలో ప్రైవేటు భాగస్వామ్యం పెంచాల్సి వచ్చింది. ప్రైవేటు పెట్టుబడులు రావాలంటే అందులో ప్రతిఫలం వచ్చేలా చేయాలి. దానివల్ల మౌలిక సదుపాయాల కల్పనలో ప్రజలు రుసుము చెల్లించాల్సి వచ్చింది. విద్యుత్ కూడా అటువంటిదే కాబట్టి అందులో ప్రైవేటు పెట్టుబడులు పెంచాల్సిన పరిస్థితి వచ్చింది.
ప్రైవేటు రంగం వేగంగా విద్యుత్ కేంద్రాన్ని స్థాపించి, విద్యుత్ ఉత్పత్తి చేసి తమ పెట్టుబడిపై తగిన ప్రతిఫలం ఆర్జించాలని ప్రణాళికల్ని రూపొందించి అమలు చేశాయి. అందువల్ల విద్యుత్ రంగంలో జల విద్యుత్ విభాగంలో పెట్టుబడులు తగ్గాయి. దాంతో మన విద్యుత్ వినియోగంలో జల విద్యుత్ వాటా క్రమంగా తగ్గుతూ వచ్చింది. స్వాతంత్య్రం వచ్చినప్పుడు మన విద్యుత్ వినిమయంలో 37శాతం జల విద్యుత్ నుంచి వచ్చేది. ఆ తరువాత మనం బారీ ప్రాజెక్టుల నిర్మించుకోవడం వల్ల ఆ వాటా 1962-63 నాటికి 50.63 శాతానికి పెరిగింది. ఆ తదుపరి మనం జల విద్యుత్‌రంగంలో పెట్టుబడి పెట్టటం తగ్గించాం. దాని పర్యవసానం ఈ వాటా బాగా తగ్గుతూ వచ్చి ప్రస్తుతం 13 శాతానికి చేరుకుంది. ప్రస్తుతం మన దేశంలో 45,400 మె.వా. జల విద్యుత్ ఉత్పత్తి, స్థాపిత సామర్థ్యం ఉంది. ఇందులో కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో 15,047 మె.వా, రాష్ట్ర ప్రభుత్వాల అధీనంలో 27వేల మెగావాట్లు మిగిలినది ప్రైవేటు సంస్థల అధీనంలో ఉన్నది. ప్రైవేటు సంస్థలు జల విద్యుత్‌రంగంలో కూడా పెట్టుబడులు పెట్టటానికి ముందుకు వచ్చినా, అనేక సమస్యల కారణంగా వారికి కేటాయించిన ప్రాజెక్టులలో చాలావరకు పనుల మొదలే కాలేదు. కొన్నిచోట్ల పనుల మొదలైనా పూర్తి కాకుండా ఆగిపోయాయి. ఇంకా కనీసం లక్ష మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం సాధించే అవకాశం ఉన్నా ఆ లక్ష్యాన్ని చేరుకోలేక•పోతున్నాము.
2030 కల్లా మన దేశంలో ఉద్గారాలు తగ్గించా లని అంతర్జాతీయ ఒప్పందాలు ఉండటంవల్ల ప్రభుత్వం జల విద్యుత్ అభివృద్ధికి మళ్లీ ప్రాధాన్యం ఇవ్వాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు. అందులో భాగంగా పార్లమెంటు స్థాయీ సంఘం ఈ రంగం లోని సమస్యలను అధ్యయనం చేసింది. హరిబాబు అధ్యక్షతన ఏర్పడిన ఈ సంఘం ఇటీవల తన నివేదిక ఇచ్చి అందులో కొన్ని సూచనలు చేసింది. ప్రభుత్వం ఆ సంఘం చేసిన సిఫార్సులను ఆమోదించి తగిన చర్యలు చేపట్టింది. ఆ చర్యలు ఫలించి క్రమంగా మన విద్యుత్ వినియోగంలో జల విద్యుత్ వాటా నియమిత 40శాతానికి చేరుకోవాలని ప్రభుత్వాలు ఆశపడుతున్నాయి. విద్యుత్ విషయంలో 2017 నుంచి భారత్ మిగులు దేశం అయినప్పటికి తలసరి విద్యుత్ వినియోగంలో ఇతర దేశాలతో పోల్చినప్పుడు తక్కువగా ఉన్నది. ఈ తలసరి విద్యుత్ వినియోగం క్రమంగా పెరిగినా మనకు విద్యుత్ కొరత ఉండకూడదనే సంకల్పంతో ఉత్పత్తి సామర్థ్యం పెంచటానికి ముఖ్యంగా పునరుత్పత్తి ఇంధనాలతో విద్యుత్ ఉత్పత్తి కొనసాగించాలని ప్రభుత్వం కృషి చేస్తున్నది. దేశాభివృద్ధిలో ఈ రంగం కీలకమైనది కాబట్టి దీనిని పటిష్టపరచటానికి ప్రభుత్వాలు కృషి చేస్తున్నప్పటికి, ఈ రంగంలోని సమస్యలు ముఖ్యంగా ప్రభుత్వ విద్యుత్ సంస్థల ఆర్థిక పరిస్థితి ఆశించిన మేరకు మెరుగుపడటం లేదు. ఆర్థిక స్థితి మెరుగుపరచటానికి గతంలో చాలా ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు ఆ ప్రయత్నాలను కేంద్రం మరింత గట్టిగా చేస్తున్నది. అందులో భాగంగానే ఆత్మనిర్భర్ భారత్‌లో ప్రకటించిన అదనపు రుణ సదుపాయం రాష్ట్ర ప్రభుత్వాలు పొందాలంటే విద్యుత్‌రంగంలో సంస్కరణలు అమలుచేయాలని ప్రభుత్వం షరతు విధించింది. గతంలో అమలు జరిపిన ఉదయ్ పథకంలో విద్యుత్ సంస్థల అప్పులు రాష్ట్ర ప్రభుత్వాలకి బదిలీ అయినాయి. అయితే విద్యుత్ సంస్థలు ఆశించిన మేరకు సమర్థవంతంగా పని చేయలేక పోయాయి. సంస్థల అప్పులు రాష్ట్ర ప్రభుత్వాలకు బదిలీ అవ్వటంవల్ల ఆ సంస్థలకు వడ్డీల భారం తగ్గి కొంత ఆర్థిక వెసలుబాటు వచ్చి ఆర్థికంగా మెరుగుపడతాయని అనుకొన్నారు. అలా వడ్డీ భారం తగ్గినప్పటికి సంస్థలు ఆర్థికంగా మెరుగు పడలేదు. అందుకు విద్యుత్ చార్జీలను హేతుబద్ధంగా క్రమంగా సవరించకపోవటం, పంపిణీ చేసిన విద్యుత్‌కి పూర్తిస్థాయిలో చార్జీలు వసూలు చేయలేకపోవటం, ఖర్చులను నియంత్రించలేకపోవటం, ఆదాయం పెంచుకోలేకపోవటం వంటివి కారణాలు.
ప్రస్తుతం దేశంలో చాలా విద్యుత్ కేంద్రాలు పూర్తిస్థాయి సామర్థ్యంతో పనిచేయటంలేదు. గతంలో దీర్ఘకాల విద్యుత్ ఒప్పందం కుదుర్చుకోలేకపోయిన ఉత్పత్తి సంస్థలు ప్రస్తుతం ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటు న్నాయి. అనేక సంస్థలలో వార్షిక నిర్వహణ కూడా సక్రమంగా చేయలేకపోతున్నారు. ఈ రంగంలో చాలావరకు సమస్యలు సంస్థల ఆర్థికస్థితితో ముడిపడి ఉన్నాయి. అందుకే ఈ సంస్థల ఆర్థికస్థితిపై వాస్తవాలు వెల్లడించి, పారదర్శకంగా దిద్దుబాటు చర్యలు తక్షణం చేపట్టాలి. నిరుపయోగంగా మిగిలిన విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని వినియోగించుకొని ఆదాయం పెంచుకోవ టానికి మార్గం వెతకాలి. మరోమారు గట్టిగా సంస్కరణలు అమలు జరిపితే కాని పరిస్థితి మెరుగుపడే అవకాశం లేదు. ఆ సంస్కరణలు అమలు చేయాలంటే రాజకీయ సంకల్పం, గట్టి నాయకత్వం అవసరం. వర్తమాన పరిస్థితులలో ఈ సంస్కరణలు సమర్థవంతంగా అమలు జరుగుతాయని ఆశిద్దాం.
వ్యాసకర్త : ఆర్థికరంగ నిపుణులు