ఇటీవల చరిత్రాత్మకమైనదిగా పరిశీలకులు పరిగణించే పరిణామం ఒకటి జరిగింది. నాలుగు ముస్లిం దేశాలు, ఒక బౌద్ధ దేశం ఇజ్రాయెల్‌తో దౌత్యసంబంధాలను పునరుద్ధరించుకున్నాయి. అమెరికా చొరవతో, దౌత్య మధ్యవర్తిత్వంతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహరైన్, సుడాన్, మొరాకోలు ఇజ్రాయెల్‌తో మళ్లీ సంబంధాలను ఏర్పరచుకున్నాయి.
డిసెంబర్ 12న భూటాన్, ఇజ్రాయెల్‌ల మధ్య ఒప్పందం ఈ ప్రాంతంలో చైనా సాగిస్తున్న విస్తరణ ప్రయత్నాలకు అడ్డుకట్టగా భావిస్తున్నారు. భారత్, భూటాన్‌ల మధ్య సంబంధాలు చాలా పాతవి. 1949లో రెండు దేశాల మధ్య స్నేహ ఒప్పందం జరిగింది. ఆ తరువాత 2007లో కొన్ని సవరణలు చేసుకుని రెండు దేశాలు ఆ ఒప్పందాన్ని మరింత పటిష్టపరచుకున్నాయి. ఒకవిధంగా భూటాన్ విదేశాంగ విధానాన్ని భారత్ తీర్చిదిద్దుతుందంటే అతిశయోక్తి కాదు. చిన్నదైన ఈ హిమాలయ దేశాన్ని చైనా కబంధ హస్తాల నుంచి తప్పించి ఇతర దేశాలతో సంబంధాలు ఏర్పరచుకునే విధంగా దిశా నిర్దేశం చేసింది భారత్.
పాలస్తీనాతో తమకున్న వివాదాలకు ప్రత్యక్షంగా సంబంధం లేని సుదూర దేశాలతో కూడా సంబంధాలు ఏర్పరచుకోవడం ఇజ్రాయెల్ అనుసరి స్తున్న విధానం. దీనిలో భాగంగానే మొరాకోతో ఇటీవల ఆ దేశం దౌత్య సంబంధాలు ఏర్పరచుకుంది.
ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నేతన్యాహు, గూఢచారి సంస్థ మోసాద్ ప్రధాన అధికారి యోస్సీల రహస్య పర్యటన తరువాత ఇజ్రాయెల్, అరబ్ ఎమిరేట్స్ మధ్య సంబంధాలు ఎన్నడూ లేనివిధంగా పటిష్టవంతమయ్యాయి. ఈ పర్యటనలు అమెరికా ప్రోత్సాహంతో, సహకారంతో జరిగాయి. అలాగే ఇండోనేషియా, ఒమన్ లతో ఇజ్రాయెల్ సంబంధాలు మెరుగుపడడం మధ్య ప్రాచ్యంలో పెరిగిన ఆ దేశపు ప్రభావాన్ని సూచిస్తోంది. ఈ పరిణామాలన్నింటిని పాకిస్తాన్ కూడా గమనిస్తూనే ఉంది. ఇజ్రాయెల్‌తో సంబంధాలు ఏర్పరచుకోవాలన్న డిమాండ్ అక్కడ కూడా బాగా వినిపిస్తోంది.
పాకిస్తాన్‌లో ‘ఎంపిక చేసిన ప్రధాని’గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఇమ్రాన్ ఖాన్ ‘ఇజ్రాయెల్‌ను అధికారికంగా గుర్తించాలంటూ తమ ప్రభుత్వంపై విపరీతమైన ఒత్తిడి ఉందని’ అక్టోబర్‌లో వెల్లడిం చారు. అయితే ఇలాంటి ప్రకటనలు పాకిస్తాన్‌కు కొత్తేమీ కాదు. ఇజ్రాయెల్ పట్ల అనుసరించాల్సిన విధానం గురించి అక్కడ ఎప్పుడు చర్చలు సాగుతూనే ఉంటాయి.
కశ్మీర్ విషయమై అంతర్జాతీయంగా రచ్చ చేయడానికి, ఇతర దేశాల మద్దతును పొందడానికి చేసిన ప్రయత్నాలు పూర్తిగా విఫలం కావడంతో పాకిస్తాన్ ఇజ్రాయెల్ అంశాన్ని తెరపైకి తెచ్చింది. ప్రభుత్వ మద్దతుదారులైన కొందరు జర్నలిస్ట్‌లతో ఇజ్రాయెల్‌తో సంబంధాల గురించి చర్చలు, గోష్టులు ఏర్పాటు చేయించింది. తద్వారా ఈ విషయంలో ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకు మరోసారి ప్రయత్నించింది. అయితే ముల్లాలు, మతఛాందస వాదుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆ చర్చను పక్కకు పెట్టింది.
అరబ్ ఎమిరేట్స్, ఇజ్రాయెల్‌ల మధ్య దౌత్యసంబంధాలు అధికారిక స్థాయిని చేరడంతో పాకిస్తాన్‌తో సహా అనేక ముస్లిం దేశాలకు దిక్కుతోచని పరిస్తితి ఏర్పడింది. ‘ఇది భవిష్యత్తులో చాలా కీలక పరిణామాలకు దారితీస్తుంది’ అని పాకిస్తాన్ ఆచితూచి ప్రతిస్పందించింది. ‘పాలస్తీనా ప్రజల న్యాయపరమైన హక్కుల పోరాటంలో వారికి పాకిస్తాన్ మద్దతు కొనసాగుతుంది. మధ్య ప్రాచ్యంలో శాంతి నెలకొనాలన్నది పాకిస్తాన్ ప్రధాన ఉద్దేశ్యం’ అని కూడా ప్రకటించింది. ఆ తరువాత నెలరోజులు తిరగ కుండానే బెహరేన్ కూడా ఇజ్రాయెల్‌తో దౌత్య సంబంధాలను ఏర్పరచుకుంటున్నట్లు ప్రకటించింది. సౌదీ అరేబియా అంగీకారం లేకుండా గల్ఫ్‌లో రెండు దేశాలు ఇజ్రాయెల్‌తో సంబంధాలు ఏర్పరచుకోవడం సాధ్యం కాదు.
ముస్లింల ప్రయోజనాలను పరిరక్షించడం తన మతకర్తవ్యంగా భావించే పాకిస్తాన్ ఎప్పుడు పాలస్తీనాకు మద్దతుగానే ఉంది. దీనివల్ల దేశ అవసరాలకు తగినట్లుగా అవసరమైనప్పుడు తన విధానాలను మార్చుకునే వీలును పాకిస్తాన్ కోల్పోయింది. అరబ్ దేశాల నుంచి వచ్చే పెట్రో డాలర్లకు ఆశపడి ముస్లిం మతనాయకులు కొన్ని దశాబ్దాలుగా ఇజ్రాయెల్‌పై విషాన్ని కక్కుతూనే ఉన్నారు. ప్రజలకు తీవ్రమైన మతఛాందసవాదాన్ని నూరిపోస్తూనే ఉన్నారు.
పాకిస్తాన్, ఇజ్రాయెల్‌లు రెండూ మతం ఆధారంగా ఏర్పడినవే. కానీ పాకిస్తాన్ ఎప్పుడు ఇజ్రాయెల్ వ్యతిరేక ధోరణినే అవలంబిస్తూ వచ్చింది. భారత్, ఇజ్రాయెల్ లు రెండు దురాక్రమణకు పాల్పడి భూభాగాలను ఆక్రమించుకున్నాయని ప్రచారం సాగిస్తూ వచ్చింది. ముస్లిం ఐక్యత సిద్ధాంతాన్నే నమ్ముకున్న పాకిస్తాన్ విశాలమైన, సరళమైన, సర్దుబాటు ధోరణిని అవలంబించాలన్న కొందరి సలహాను ఎప్పుడూ పట్టించుకోలేదు.
ఇజ్రాయెల్‌తో సంబంధాలు మెరుగుపరచుకుంటే అత్యాధునిక ఆయుధాలు అందుబాటులోకి రావడంతోపాటు అమెరికాతో సంబంధాలు మరింత దృఢమవుతాయన్న విషయాలు తెలిసినా పాకిస్తాన్ ప్రభుత్వం ఎప్పుడూ సరైన నిర్ణయం తీసుకోలేక పోయింది. కానీ ఇప్పుడు ముస్లిం ఐక్యత, ముస్లిం ప్రపంచం అనే ఆశలు క్రమంగా ఆవిరవుతున్న తరుణంలో పాకిస్తాన్ పరిస్థితి ఇరుకున పడింది.
ప్రస్తుతం మధ్య ప్రాచ్యంలో ఇరాన్, టర్కీలకు సున్నీ దేశాలకు మధ్య తీవ్ర ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. ఒకపక్క ఇరాన్ అణుశక్తి ఆకాంక్షలు, మరోపక్క ఒట్టమాన్ సామ్రాజ్యాన్ని పునరుద్ధరించాలన్న టర్కీ కలల వల్ల ఈ ప్రాంతం అతలాకుతలమవుతోంది. సిరియా, ఇరాక్, లెబనాన్, యెమన్‌లలో ఇరాన్ జోక్యం, ముస్లిం బ్రదర్ హుడ్‌కు టర్కీ మద్దతుతో పాలస్తీనా అంశం మరుగునపడిపోయింది. ఇరాన్ అణు ఆశలను అదుపులో పెట్టడానికి అరబ్ దేశాలు ఇజ్రాయెల్ వైపు చూస్తున్నాయి. ఇటీవల అరబ్ దేశాలు ఇజ్రాయెల్‌తో అధికారిక దౌత్య సంబంధాలను ఏర్పరచుకోవడానికి ప్రధాన కారణం ఇదే.
పాకిస్తాన్ ఏర్పడిన కొత్తల్లో ముస్లిం ఐక్యత పేరుతో ఆ దేశం అరబ్ ప్రపంచానికి బాగా దగ్గరయింది. కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ వేదికల పైకి చేర్చింది. దీనితోపాటు ఆర్ధికపరమైన లాభాలు ఉండడంతో సౌదీ, అరబ్ ఎమిరేట్స్‌లతో సంబంధా లను పటిష్టపరచుకుంది. తమవి సౌదీ సాంస్కృతిక మూలాలేనంటూ పాకిస్తాన్ సాంస్కృతిక గుర్తింపు కోసం తాపత్రయపడింది కూడా. ఇజ్రాయెల్‌తో సంబంధాలు కొషర్(పాపం) అని ముస్లిం దేశాలు భావిస్తున్నప్పుడు ఇదంతా జరిగింది. 1992లో భారత్ పూర్తి స్థాయి దౌత్య సంబంధాలు ఏర్పరచు కున్న తరువాత పాకిస్తాన్ కూడా ఇజ్రాయెల్‌ను అధికారికంగా గుర్తించాలని భావించినా ముస్లిం ప్రపంచాన్ని చెడు చేసుకోవడం ఇష్టం లేక విరమించు కుంది. కానీ దొడ్డిదారిన ఇజ్రాయెల్‌తో సంబంధాలు నెరుపుతూనే ఉంది. పాకిస్తాన్ నెరుపుతున్న ఈ లోపాయికారీ సంబంధాల గురించి ఆ దేశపు విదేశాంగ మంత్రి ఖుర్షీద్ కసూరి తన ‘నైదర్ ఎ హాక్ నార్ ఎ డోవ్’ అనే పుస్తకంలో ప్రస్తావించారు.
మొట్టమొదటసారి 2005లో పాకిస్తాన్ తమ విదేశాంగ మంత్రి ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రితో సమావేశమయ్యారని ప్రకటించింది. కసూరి, ఇజ్రాయెల్ మంత్రి సిల్వాన్ షలోమ్‌తో టర్కీలో చర్చలు జరిపారు. ఆ తరువాత ఐక్యరాజ్యసమితిలో పాక్ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్, ఇజ్రాయెల్ ప్రధాని అరియెల్ షరోన్‌లు సమావేశమయ్యారు. అయితే ఈ సంభాషణల తరువాత కూడా రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడలేదు. ఇజ్రాయెల్ పట్ల అనుసరిస్తున్న విధానాన్ని సమీక్షించుకోవాలని బెనజీర్ భుట్టో, నవాజ్ షరీఫ్ వంటివారు ఎప్పటి నుంచో భావించినా 2003లో ముషారఫ్ మొదటిసారి ఈ విషయమై బహిరంగ చర్చను ప్రారంభించారు. అయినా పరిస్థితి మాత్రం మారలేదు.
ప్రభుత్వాలకు వ్యతిరేకంగా అరబ్ దేశాల్లో చెలరేగిన ప్రజా ఉద్యమాలు(2010)(అరబ్ స్ప్రింగ్), ఆర్ధిక సంక్షోభం, ప్రపంచ మార్కెట్‌లో చమురు ధరల్లో డోలాయమాన స్థితి, భద్రతపరమైన సవాళ్లు పెరిగిపోవడం, తీవ్రవాదపు ముప్పు మొదలైన సమస్యల వల్ల గల్ఫ్ దేశాలకు కొత్త వ్యూహాత్మక సంబంధాలపై దృష్టి సారించవలసి వచ్చింది. దీనితో భారత్‌తో సంబంధాలను పటిష్టపరచుకోవడంతో పాటు ఇజ్రాయెల్‌తో అనధికారిక సంబంధాలు నెరపడానికి ఈ దేశాలు ముందుకు వచ్చాయి. కశ్మీర్‌లో 370 అధికారణాన్ని రద్దు చేసిన తరువాత భారత్‌కు వ్యతిరేకంగా తీర్మానాన్ని ఆమోదించడానికి ఇస్లామిక్ దేశాల సహకార సంస్థ నిరాకరించడం ఈ దేశాల నూతన విధానానికి నిదర్శనం.
ఈ పరిణామాలు పాకిస్తాన్‌కు ఏమాత్రం మింగుడుపడలేదు. అరబ్ దేశాల నుంచి కలిగే ఆర్ధిక లాభాలను కూడా లెక్క చేయకుండా ముస్లిం దేశాలకు సౌదీ అరేబియా ‘సరైన పద్దతిలో’ నాయకత్వం వహించక పోతే నాయకత్వ పగ్గాలు టర్కీకి అప్పగించ వలసివస్తుందని హెచ్చరించింది. ఈ హెచ్చరిక అరబ్ దేశాలతో ఆ దేశానికి ఉన్న సంబంధాలను దెబ్బతీసింది. అంతేకాదు కశ్మీర్ విషయంలో టర్కీ సహాయాన్ని అర్ధించడం, టర్కీ సంస్కృతిని తమ దేశంలో ప్రోత్సహించడం వంటి పాకిస్తాన్ అనాలోచిత చర్యలు ఆ దేశాన్ని అరబ్ దేశాల నుంచి మరింత దూరం చేశాయి.
పాకిస్తాన్‌తో సంబంధాలు ఏర్పరచుకునేందుకు ఇజ్రాయెల్ సుముఖంగా ఉన్నప్పటికి ముస్లిం ఐక్యత అనే విధానానికి కట్టుబడిన పాకిస్తాన్ అందుకు సిద్ధపడటం లేదు. దీని వల్ల ఇజ్రాయెల్ ద్వారా లభించే ప్రయోజనాలను కాలదన్నుకుంటోంది. ఇప్పుడు ఇమ్రాన్‌ఖాన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పాక్ వైఖరి మరింత మొండిగా తయార యింది. మతఛాందసవాదుల పట్టు పెరిగిపోయింది. దీనితో ఇజ్రాయెల్ పట్ల సానుకూలమైన ధోరణిని అవలంబించే అవకాశం మరింత దూరమైపోయింది.
రాజకీయ, ఆర్ధిక సంక్షోభం చుట్టుముట్టడంతో పాకిస్తాన్ ఇప్పుడు దౌత్య విధానం మార్చుకునే వీలు చాలా తక్కువ. ఇది ఆ దేశాన్ని మరింత ఒంటరిని చేసి, ఇబ్బందుల్లో పడవేస్తుంది. ఆ దేశపు విదేశాంగ విభాగం ఇటీవల విడుదల చేసిన ప్రకటన పాకిస్తాన్ దిశను స్పష్టం చేసింది. ‘పాలస్తీనా సమస్యకు న్యాయపరమైన, పాలస్తీనా ప్రజలకు సంతృప్తికరమైన పరిష్కారం లభించనంతవరకు పాకిస్తాన్ అధికారి కంగా ఇజ్రాయెల్‌ను గుర్తించలేదు’ అని ఆ ప్రకటనలో పేర్కొంది. దీనితో పాకిస్తాన్, ఇజ్రాయెల్‌ల మధ్య దౌత్య సంబంధాల తలుపులు ఇప్పట్లో తెరుచుకునే అవకాశం లేదని స్పష్టమైపోయింది.
– డా. రామహరిత