కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన సాగు చట్టాలు రైతులకు ప్రయోజనం కలిగించేవే కానీ, నష్టంచేసేవి కావని భారతీయ కిసాన్‌ ‌సంఘ్‌ (‌బీకేఎస్‌) ‌జాతీయ కార్యదర్శి  కె. సాయిరెడ్డి అన్నారు. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమానికి బీకేఎస్‌ ‌మద్దతిచ్చిందన్నది అవాస్తమని చెప్పారు. రైతులకు మేలు చేసే ఈ చట్టాలను తాము స్వాగతించామని చెప్పారు. సాయిరెడ్డితో జాగృతి జరిపిన ముఖాముఖీ వివరాలు పాఠకుల కోసం..

రైతు చట్టాలు పార్లమెంట్‌లో మెజారిటీతో ఆమోదంతో రూపొందినవి కదా? భారతీయ కిసాన్‌ ‌యూనియన్‌, అఖిల భారత కిసాన్‌ ‌సమితి ప్రతిఘటనకు అర్ధం ఏమైనా ఉంటుందా?

పార్లమెంట్‌ ఆమోదం పొందిన చట్టాలను రద్దు చేయాలనడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే. భారతీయ కిసాన్‌ ‌యూనియన్‌ ‌పంజాబ్‌లోని మాల్వా భాగంలోను, ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌ ‌ప్రాంతంలోను విస్తరించింది. భారతీయ కిసాన్‌ ‌సమితి కేవలం పంజాబ్‌లోని కొంత భాగానికే పరిమితం. అంటే ఈ రెండు రైతు సంఘాలు ఒకటి, రెండు రాష్ట్రాకే పరిమితం  తప్ప దేశమంంతటా లేవు. అలాంట ప్పుడు సాగు చట్టాలు రద్దు చేయాలన్న వీరి డిమాండ్‌ను దేశంలోని రైతులంతా ఎందుకు స్వాగతిస్తారు? అందుకే సాగు చట్టాలకు వ్యతిరేకంగా వీరు చేస్తున్న ఉద్యమానికి దేశవ్యాప్త మద్దతు  లేదు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ మూడు చట్టాల వల్ల రైతులకు చాలా ప్రయోజనం ఉంది. కాబట్టి భారతీయ కిసాన్‌ ‌సంఘ్‌ (‌బీకేఎస్‌) ‌వాటిని స్వాగతిస్తు న్నామనే చెప్పింది. అయితే కొన్ని సవరణలు కోరాం. ఈ సవరణలు తప్పకుండా పరిగణనలోనికి తీసుకోవాలని ముందు మేమే చెప్పాం. ఈ మేరకు 450 జిల్లాలలోని 20 వేల గ్రామాల నుండి గ్రామ కమిటీలు తీర్మానం చేసిన ప్రతులను కేంద్ర ప్రభుత్వానికి పంపాం. కానీ నేడు జరుగుతున్న రైతుల ఉద్యమం కేవలం రైతులలో అస్థిరత్వాన్ని సృష్టించ డానికే. దేశ వ్యాప్తంగా ఈ సాగుచట్టాలను రైతులు స్వాగతిస్తున్నారు.

బీకేఎస్‌ ‌రైతుల ఉద్యమానికి మద్దతు ఇస్తున్నట్లు, స్వదేశీ జాగరణ మంచ్‌ ‌చట్టాల ఉపసంహరణ కోరినట్లు వస్తున్న వార్తల్లో నిజమెంత?

బీకేఎస్‌, ‌స్వదేశీ జాగరణ మంచ్‌ ఈ ఉద్యమానికి మద్దతు తెలపడం లేదు. ఈ చట్టాలను స్వాగతిం చాయి. అయితే బీకేఎస్‌ ఆ ‌చట్టంలో కొన్ని మార్పులను కోరడాన్ని తప్పుగా అర్థంచేసుకొని మేం కొత్త చట్టాలను వ్యతిరేకిస్తున్నామని ప్రచారం చేస్తున్నారు.

కేంద్రాన్ని మేం కోరిన సవరణలు:

– ఎంఎస్సీ (కనీస మద్దతు ధర) గ్యారంటీ, అంటే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ధర కన్నా తక్కువకు కొనుగోలు చేయరాదు.

– ఏదైనా వివాదం వస్తే ఆర్‌డీఓ, కలెక్టర్‌ 30 ‌రోజులలోగా పరిష్కరించి రైతుకు న్యాయం చేయా లన్నది ప్రస్తుతం అమల్లో ఉన్న విధానం. ఈ పద్ధతిలో వివాదం పరిష్కారం జాప్యమయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్రత్యేకంగా వ్యవసాయ ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేయమని కోరాం.

–  కొనుగోలు చేసేవారికి ఒక పోర్టల్‌ ఏర్పాటు చేయాలని చెప్పాం. దీనివలన అసలైన కొనుగోలు దారు ఎవరన్నది రైతుకు తెలుస్తుంది.

పై సవరణలన్నిటినీ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్‌ ‌తోమర్‌ అం‌గీకరించారు కూడా. ఈ ఉద్యమానికి సంబంధించిన ప్రజాప్రయోజనాల వ్యాజ్యం విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు రైతు సంఘాలతో కమిటీ వేస్తామని చెప్పింది. ఆ ప్రకారంగా ఈ కేసులో బీకేఎస్‌ ‌కూడా ఇంప్లీడ్‌ అయి సాగు చట్టాలను కోర్టులోనే స్వాగతించింది. చర్చలతో పరిష్కరించుకోకుండా ఉద్యమాల బాట పట్టి రోడ్లెక్కి ప్రజాజీవనానికి అంతరాయం కలిగించడాన్ని బీకేఎస్‌ ‌వ్యతిరేకిస్తుంది. తాజా చట్టాల ద్వారా దళారీ వ్యవస్థకు చోటుండదనే ఉద్దేశంతో కొందరు కావాలనే ఈ ఉద్యమాన్ని ప్రోత్సహిస్తున్నారు.

ఆత్మనిర్భర భారత్‌ ‌కాదు, ఆత్మనిర్భర కిసాన్‌ ‌కావాలన్న నాబార్డ్ ‌చైర్మన్‌ ‌గోవిందరాజుల ఉద్బోధ నను ఎలా చూడాలి?

రైతు ఉత్పత్తిదారుల సంఘాలను(ఖీశీ) దేశమంతటా 10 వేలకు పైగా ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించి ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నది. కొన్ని గ్రామాలను క్లస్టర్లుగా చేసుకొని ఏర్పాటుచేసే ఖీశీలో మూడువందల మంది రైతులు సభ్యులుగా ఉంటారు. వీరంతా ఒక సంఘంగా ఏర్పడి వ్యవసాయ ఉత్పత్తులను సేకరించి ప్రాసెసింగ్‌ ‌చేసి అమ్ముకోవడానికి కావలసిన మౌలిక సదుపాయాల కోసం 3 సంవత్సరాల కోసం 48 లక్షల రూపాయల సబ్సిడీతో 2 కోట్ల రూపాయల వర్కింగ్‌ ‌కాపిటల్‌ను బ్యాంక్‌ ‌గ్యారంటీ లేకుండా కేంద్ర ప్రభుత్వం నాబార్డ్ ‌ద్వారా ఇస్తున్నది. ఇది రైతు ఆత్మనిర్భర పథకమే కదా! ఆత్మనిర్భర భారత్‌లో రైతును కూడా ఆత్మ నిర్భరత వైపుకు ప్రభుత్వం నడిపిస్తున్నది కదా! ఖీశీలకు తోడు ఇదివరకే అమలులో ఉన్న ప్రాథమిక వ్యవసాయ సొసైటీలను కేంద్రం కొనసాగిస్తూనే ఉంది. తెలంగాణలో ముల్కనూరు సొసైటీ అత్యంత పేరెన్నికగన్నది. ఖీశీల పని, సొసైటీల పని ఒక్కటే అయినా సొసైటీలను రద్దుచేయకుండానే ఖీశీ లను కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహించడం రైతులను, వ్యవసాయాన్ని బలోపేతం చేయడానికే.

ప్రస్తుతం రైతు ఉద్యమానికి పట్టుగొమ్మలైన పంజాబ్‌, ‌హరియాణా రైతుల వాస్తవ పరిస్థితులు ఏమిటి? అక్కడ బీకేఎస్‌ ‌రైతులకు ఏ విధంగా  బాసటగా నిలుస్తున్నది?

నూతన సాగుచట్టాల వ్యతిరేక ఉద్యమంలో ఆ రెండు రాష్ట్రాల్లోని •కేవలం కొంతమంది రైతులే  పాల్గొన్నారు. అందులోనూ కమ్యూనిస్టు ప్రభావంలో ఉన్న కిసాన్‌ ‌యూనియన్‌ ఆధ్వర్యంలోని రైతులు మాత్రమే ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. మిగిలిన రైతులు వాస్తవాలను గ్రహిస్తున్నారు. అందువలన ఉద్యమం పెరగడం లేదని చెప్పగలను. అంతేకాదు, కొత్త చట్టాల గురించి రైతులకు అవగాహన కల్పించేం దుకు బీకేఎస్‌ అనేక కార్యక్రమాలను చేపడుతున్నది.

రైతు ఉత్పత్తి సంఘాల ఏర్పాట్లు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయి?

రైతు ఉత్పత్తిదారుల సంఘాలు (ఖీశీ) ఇప్పటి వరకు ఆంధప్రదేశ్‌లో 20, తెలంగాణలో 20 ప్రారంభం అయ్యాయి. వీటివలన రైతులకు ఎంతో ప్రయోజనం. ఈ ఖీశీ లలో రైతులు ఐకమత్యంగా వుండి ప్రభుత్వం ఇచ్చే గ్రాంటును సద్వినియోగం చేసుకొంటే రైతులు తమ కాళ్లమీద తాము నిలబడగలరు. సభ్యులు క్రియాశీలకంగా వుంటూ రాజకీయాలకు అతీతంగా ఖీశీ ను నడిపిస్తుంటే రైతులు బంగారు బాట పడతారు.

రైతులకు చేదోడుగా కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు ఎలా ఉంది?

పనికి ఉపాధి హామీ పథకం, రైతు వేదికలు (2,3 గ్రామాలకు కలిపి), చెట్లు నాటడం, వర్మి కంపోస్టు ఎరువు తయారీ యూనిట్‌, ఇం‌కుడు గుంతల తవ్వకం మొదలైన రైతుకు ప్రయోజనం చేకూర్చే పథకాల అమలు దేశవ్యాప్తంగా చాలా బాగుంది. అయితే ఈ విషయంలో తెలంగాణ కాస్త వెనకబడి ఉంది. ఉదాహరణకు మధ్యప్రదేశ్‌లో 60 లక్షల ఇళ్లు, బెంగాల్‌లో 7 లక్షల ఇళ్లు పేద రైతులకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కట్టించాయి. తెలంగాణలో దీనిని అమలు చేయకుండా డబుల్‌బెడ్‌ ‌రూంల స్కీమ్‌లో కలిపేయడం ద్వారా రైతులు లబ్ధి పొందడం లేదు. ఆంధప్రదేశ్‌లో మాత్రం పేదరైతులకు 10 లక్షల ఇళ్లు కట్టించాలని ప్రభుత్వం సంకల్పించింది. ఆ దిశలో పని ప్రారంభం అయింది. గత 2,3 సంవత్సరాలుగా చెట్లు నాటే పని వేగంగా నడుస్తున్నా 20 లేదా 25 శాతం కన్నా ఎక్కువ బతకడం లేదు. ఈ సంవత్సరం కాస్త మెరుగయింది. ఎక్కువ చెట్లు బ్రతికాయి. వర్మి కంపోస్టు తయారీ యూనిట్‌ ‌దేశం అంతా ప్రారంభం అయినా తెలంగాణ ప్రభుత్వ సహకారం పెద్దగా లేనందున ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. కొన్ని గ్రామాల సర్పంచ్‌లు ముందుకొచ్చి అప్పులుచేసి మరీ రైతు వేదికలను నిర్మించినా ప్రభుత్వం నుండి నిధులు రావడంలేదు. ఈ అప్పుల బాధ తట్టుకోలేక ముగ్గురు సర్పంచ్‌లు ఆత్మహత్య చేసుకున్నారని కూడా వార్తలు వచ్చాయి. పనికి ఉపాధి హామీ పథకం కోసం కేంద్రం నుండి నిధులు వస్తున్నా సక్రమంగా అమలుచేయడం లేదు. ఉపాధి హామీ కూలీలను వ్యవసాయ పనులకు అనుసంధానం చేసి 50శాతం కూలి ప్రభుత్వం చెల్లించాలని బీకేఎస్‌ ‌డిమాండ్‌ ‌చేస్తున్నది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం చట్టం చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించాలి. అలా చేయకపోతే రైతు కూలీలు దొరకక రైతులు వ్యవసాయానికి దూరమవుతారు. ప్రస్తుతం కూలీల కొరత కారణంగా మెట్టపంటలు వేయడంలేదు.

రెండు తెలుగు రాష్ట్రాలలో రైతుల ప్రగతి కోసం బీకేఎస్‌ ఏ ‌విధంగా పని చేస్తున్నది?

సంవత్సరాల తరబడి రైతులకు జరుగుతున్న అన్యాయాలను గుర్తించి వాటిని పరిష్కరించే దిశగా బీకేఎస్‌ అడుగులు వేస్తున్నది. విద్యుత్‌ ‌వినియోగానికి ఆ విభాగంలో ఏ పని కావాలన్నా లంచం ఇవ్వాలి, నెలల తరబడి ఎదురుచూడాలి. గత కొన్ని సంవత్స రాలుగా విద్యుత్‌ ‌వినియోగదారుల ఫోరంలో బీకేఎస్‌ ‌కార్యకర్తలు చేరి ఈ సమస్య నుండి రైతులకు విముక్తి కలిగిస్తున్నారు. రెవెన్యూ విభాగం నుండి రైతు పాస్‌బుక్‌ ‌సంపాదించుకోవడం కూడా ఇబ్బందిగా ఉండేది. ఇటువంటి విషయాలు బీకేఎస్‌ ‌దృష్టికి వచ్చినప్పుడు మా కార్యకర్తలు పరిష్కరిస్తున్నారు. సేంద్రియ వ్యవసాయం చేసే రైతులను ప్రోత్స హిస్తున్నాం. వారి సంఖ్య కూడా పెరిగింది. యువ రైతులు ముందుకొస్తున్నారు. పండించిన ఉత్పత్తులను అమ్మే విక్రయ కేంద్రాలను కూడా బీకేఎస్‌ ఏర్పాటు చేస్తున్నది. ఆంధప్రదేశ్‌లో విక్రయకేంద్రాలు విజయవాడ, తాడేపల్లిగూడెం, నెల్లూరుతో సహా 20 స్థలాల్లో ఏర్పాటయ్యాయి. తెలంగాణలో నిజామాబాద్‌ ‌హైదరాబాద్‌లో ఉన్నాయి.

వ్యవసాయం నష్టదాయకం కాదని రాబోయే తరాలవారికి  చెప్పేలా అవగాహన కార్యక్రమాలు బీకేఎస్‌ ‌ద్వారా జరుగుతున్నాయా?

వ్యవసాయాన్ని వృత్తిగా స్వీకరించడం ద్వారా నష్టాల్లో కూరుకుపోతామనే భావన ఉన్న నేటి సమాజంలో, ముఖ్యంగా యువకుల్లో సేద్యం పట్ల అవగాహన కల్పించి ఆత్మవిశ్వాసాన్ని నింపే పనిని బీకేఎస్‌ ‌చేస్తున్నది. నేడు చాలామంది యువకులు వ్యవసాయం వైపు ఆకర్షితులవుతున్నారు కూడా. వ్యవసాయరంగంలో ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి ఆందోళనలు చేపట్టడం సరైన మార్గం కాదు. ఆందోళన పేరుతో ప్రజలకు ఇబ్బందులు కలిగించడం, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయడం వంటి పనులకు బీకేఎస్‌ ఎప్పుడూ దూరమే. వ్యవసాయం మన భారతీయ సంస్కృతిలో భాగం. ఈ విషయాన్ని రాబోయే తరాలకు చెప్పి, వారిని వ్యవసాయాన్ని కూడా ఒక ప్రధాన వృత్తిగా స్వీకరించేలా ప్రేరేపించడమే బీకేఎస్‌ ‌లక్ష్యం.

రైతుబంధు, రైతు భరోసా పథకాలు సత్ఫలితాలను ఇస్తున్నాయా?

కేంద్ర ప్రభుత్వం ప్రతి రైతు అకౌంటులో నేరుగా ఆరు వేల రూపాయలను జమ చేస్తున్నది. తెలంగాణలో ఐదు వేలు ఇస్తున్నారు. అయితే తెలంగాణలో ఈ పథకం సద్వినియోగం కంటే దుర్వినియోగమే ఎక్కువని చెప్పాలి. ఎలా అంటే, ఈ పథకం వంద ఎకరాల భూమి ఉన్న రైతుకూ వర్తిస్తున్నది, సాగు చేయని ఎకరాల కొద్ది భూములున్న రైతుకూ వర్తిస్తున్నది. కాబట్టి ప్రత్యేకంగా చిన్న, సన్నకారు రైతులకు పెద్దగా ఒరిగిందేమీ లేదు. రైతుబంధును సన్న, చిన్నకారు రైతులకు, లేదా పది ఎకరాల లోపు వ్యవసాయ భూమి ఉన్న  రైతులకే వర్తింపచేయాలన్న డిమాండ్‌ ఎప్పటినుంచో ఉన్నది. ఒకవైపు రైతుబంధు పథకాన్ని అమలు చేస్తూనే మరోవైపు రైతులు తీసుకొనే రుణాలపై తెలంగాణ ప్రభుత్వం కట్టాల్సిన 4 శాతం వడ్డీని బ్యాంకులకు చెల్లించడంలేదు. అది రైతే చెల్లించాల్సి వస్తుంది. కేంద్రం మాత్రం తాను కట్టాల్సిన 3 శాతం వడ్డీని చెల్లిస్తున్నది. పంటల బీమా పథకం తెలంగాణలో పూర్తిగా విఫలమైందని చెప్పవచ్చు.

ఇంటర్వ్యూ : దండు కృష్ణవర్మ,  సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE