జమ్ముకశ్మీర్‌లో ఏ చిన్న పరిణామం చోటు చేసుకున్నా మీడియా దానికి పెద్ద ప్రాధాన్యమే ఇస్తుంది. ఇవ్వక తప్పదు కూడా. ఆ సరిహద్దు రాష్ట్రంలో, సమస్యాత్మక భూభాగంలో జరిగే రాజకీయ పరిణామానికీ, పాకిస్తాన్ వైఖరికీ సంబంధం ఉంటుంది. లోక్‌సభ ఎన్నికలు కావచ్చు, అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు. ఆయా సందర్భాలలో పాకిస్తాన్ జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించడం నిజం. వాటిలో పాక్ ప్రేరేపిత మూకల ప్రభావం కూడా అంతే వాస్తవం. కాబట్టి జరిగిన ఎన్నికలు స్థానిక సంస్థలకే అయినా ఆ పరిణామం పెద్ద వాస్తవాలను చెప్పేదిగానే ఉంటుంది. ఆ కీలక కేంద్ర పాలిత ప్రాంతం మూడంచెల స్థానిక సంస్థల వ్యవస్థకు ఎన్నికలు జరుపుకున్నది. 280 జిల్లా అభివృద్ధి మండళ్ల (డీడీసీ)కు నవంబర్ 28 నుంచి డిసెంబర్ 19 వరకు ఏడు దశలలో ఎన్నికలు జరిగాయి. వీటికి ఎంపికైన ప్రజాప్రతినిధులకు ఉండే అధికారాలు పరిమితమే. వారు రాష్ట్రంలో రాజ్యాంగబద్ధమైన మార్పులు తేగలిగిన హోదాను పొందిన వారు కానేకాదు. అయినా ఇక్కడ గెలుపోటముల మీద విశేషమైన విశ్లేషణలు చేశారు, రాజకీయ పండితులు. కారణం ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్ముకశ్మీర్‌లో ప్రజా ప్రాతినిధ్యంతో ప్రజాస్వామ్యాన్ని పట్టాలెక్కించడానికి తొలిసారిగా జరిగిన ఎన్నికలివి.
డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ ఆశయాన్ని సాకారం చేస్తూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గత సంవత్సరం జమ్ముకశ్మీర్ రాష్ట్రానికి స్వతంత్ర ప్రతిపత్తిని ఇచ్చే ‘ఆర్టికల్ 370, ఆర్టికల్ 35 ఎ’ లను రద్దు చేయడం సంచలనం సృష్టించింది. అంతే కాకుండా జమ్ముకశ్మీర్, లద్దాఖ్‌లను వేర్వేరు కేంద్ర పాలిత ప్రాంతాలుగా పునర్విభజించింది. ఆ తర్వాత ఇక్కడ వేర్పాటువాదులపై కఠినచర్యలు చేపట్టడంతో పాటు ఉగ్రవాద కార్యకలాపాలను చాలా మేరకు అదుపులోకి తేగలిగింది. కేంద్ర ప్రభుత్వం జమ్ముకశ్మీర్‌ను దేశంలోని ఇతర రాష్ట్రాలతో సమానంగా చూడటంతో పాటు, ఆ రాష్ట్ర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇది 370 అధికరణం అమలులో ఉండగా సాధ్యం కాలేదన్నది నిజం. జమ్ము కశ్మీర్‌లో ఉపాధి అవకాశాలు మెరుగు పరిచేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. కశ్మీరీ పండిట్‌లు అక్కడికి వెళ్లి, నివాసం ఉండడానికి ఒక సోపానం ఏర్పడింది. పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు, ప్రాజెక్టులు, నిధులు మంజూరయ్యాయి. వీటి సంగతి మరుగు పరిచి, కేంద్రంలో బీజేపీ ఏం చేసినా మైనారిటీ వ్యతిరేకతగానే ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఈ ఎన్నికలు జరిగాయి. ఇంకా చెప్పాలంటే పుల్వామా దాడి ఘటన, దానిని ఐఎస్‌ఐ పనిగా పాకిస్తాన్ పార్లమెంట్‌లోనే విపక్షం ఘనంగా చెప్పిన నేపథ్యంలో జరిగిన ఎన్నికలివి.
280 డీడీసీ స్థానాలకు ఎన్నికలు జరిపారు. రెండు తప్ప మిగిలిన ఫలితాలు వెల్లడైనాయి. బీజేపీ సత్తా చాటుకొని విమర్శకుల నోళ్లకు తాళం వేసింది. సొంతంగా 75సీట్ల• గెలిచి అతిపెద్ద పార్టీగా నిలిచింది. అందులో 72 జమ్ము ప్రాంతంలోనివి. మూడు లోయలోనివి. బీజేపీ అనుకూల అప్నీ పార్టీ 12 స్థానాలు గెలుచుకుంది. జమ్ము ప్రాంతంలో ఎప్పుడూ వీచే బీజేపీ గాలి కంటే, లోయలో గెలిచిన మూడు స్థానాల గురించే ఇప్పుడు ఎక్కువ చర్చ జరుగుతున్నది. ఇదొక గుబులు నుంచి వచ్చిన స్పందన. లోయలో బీజేపీ ఎదిగిన తీరును జీర్ణించుకోలేని పాకిస్తాన్ అనుకూల స్థానిక నాయకులు, బీజేపీ వ్యతిరేక మీడియా పడిన కలవరానికి సంకేతం. ఆ రెండు స్థానాల ఫలితాలు వాయిదా పడడానికి కారణం- పాక్ ఆక్రమిత కశ్మీర్‌కు చెందినవారు పోటీ చేసి గెలిచారు.
కశ్మీర్ లోయ బీజేపీని ఇంతవరకు అంటరాని పార్టీగానే పరిగణించింది. ఇప్పుడు ఉత్తర కశ్మీర్‌లోని బండిపోరా జిల్లాలో, మధ్య కశ్మీర్‌లోని శ్రీనగర్ జిల్లా, దక్షిణ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో మూడు స్థానాలు బీజేపీకి రావడం సంచలనమే మరి. అంటే కశ్మీర్‌లోని మూడు ప్రాంతాలలోను బీజేపీ తన ఉనికిని చాటుకోగలిగింది. నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ తదితర పార్టీల గుప్కార్ కూటమికి 110 సీట్లు వచ్చాయి. ఇందులో నేషనల్ కాన్ఫరెన్స్ 67, పీడీపీ 27 సీట్లు పొందాయి. స్వతంత్రులు 50 సీట్ల గెలవగా, కాంగ్రెస్ 9 సీట్లు దక్కాయి. మూడు దశాబ్దాలకు పైగా వేర్పాటువాదుల ఆగడాలతో నలిగిపోయిన ఈ రాష్ట్రంలో తొలిసారిగా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగాయి. గతంలో చోటు చేసుకున్న బహిష్కరణ పిలుపులు, హింసాత్మక ఘటనలు, రిగ్గింగ్ డీడీసీ ఎన్నికల్లో కనిపించలేదు. ప్రతి జిల్లాను 14 ప్రాదేశిక నియోజకవర్గాలుగా ఏర్పాటు చేస్తూ 20 జిల్లాల్లోని 280 సీట్లు ఏర్పాటు చేశారు. 1,427 మంది అభ్యర్థులు పోటీ చేశారు. గత లోక్‌సభ ఎన్నికల్లో 15 శాతం పోలింగ్ నమోదైతే డీడీసీ ఎన్నికల్లో 51 శాతం ఓట్లు పోల్ కావడం విశేషం.
ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ ఒంటరిగా బరిలోకి దిగాయి. ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకిస్తూ ఏర్పాటైన పీపుల్స్ అలయన్స్ ఫర్ గుప్కార్ డిక్లరేషన్ (పీఏజీడీ) ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మొదట ఎన్నికలకు దూరంగా ఉంటామని చెప్పిన ఈ కూటమి, తరువాత నిర్ణయం మార్చుకుంది. ఈ కూటమిలో నేషనల్ కాన్ఫరెన్స్, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ, కాంగ్రెస్, సీపీఐ (ఎం), జమ్ము కశ్మీర్ పీపుల్స్ కాన్ఫరెన్స్, అవామి నేషనల్ కాన్ఫరెన్స్, జమ్ము కశ్మీర్ పీపుల్స్ మూవ్మెంట్ భాగస్వాములుగా ఉన్నాయి. అయితే ఈ కూటమి వేర్పాటువాద ప్రకటలతో ఆందోళన చెందిన కాంగ్రెస్ ఒంటరి పోరుకు మొగ్గు చూపించింది.
ఈ ఎన్నికలతో వెల్లడైన మరొక సత్యం, ప్రజా స్వామ్య పక్రియకు స్థానికులు సుముఖంగా ఉన్నారు. ఎలాగంటే జమ్ముకశ్మీర్‌లో మొన్నటి లోక్‌సభ ఎన్నికల కంటే అధికశాతం ఓట్లు డీడీసీ ఎన్నికల్లో పోలయ్యాయి. ఈ ఎన్నికలను ప్రజాస్వామ్య విజయంగా ప్రధాని మోదీ అభివర్ణించడంలోని అంతరార్ధం అదే. ఈ ఎన్నికల నిజమైన ఫలితం కూడా అదే. వేర్పాటువాదులకు ఎన్నికల ఫలితాలు చెంపపెట్టుగా బీజేపీ వ్యాఖ్యానించింది. ప్రధాని చెప్పినట్టు డీడీసీ ఎన్నికలలో ప్రజాస్వామ్యమే నిజమైన విజేత. ప్రజాస్వామ్యాన్ని విజేతగా నిలిపినది మాత్రం కేంద్రంలోని బీజేపీ/ఎన్‌డీఏ నాయకత్వంలోని మోదీ ప్రభుత్వమే. గవర్నర్ మనోజ్ సిన్హా కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. పరిపాలన మొత్తం తమ చేతులలో ఉన్నది కాబట్టి, భద్రతా బలగాలను మోహరించి ఎన్నికలను భగ్నం చేసి, ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలిగించకుండా కేంద్రం వ్యవహ రించిన తీరును అందరూ హర్షించాలి.
దేశంలో ఎక్కువ స్థానాలు గెలిచిన పార్టీ ప్రజల హృదయాలను గెలుచుకున్నదని చెప్పే నిష్పాక్షిక విశ్లేషణలు తగ్గాయి. గెలుచుకున్న పార్టీని బట్టి విశ్లేషణలు మారిపోతున్నాయి. సూత్రాలకు భాష్యాలు మారుతున్నాయి. ప్రజాతీర్పును ప్రజాతీర్పుగా, నిర్మొహమాటంగా చెప్పగలిగే మీడియా, నాయకులు అరుదుగా ఉన్నారు. అందుకే ఈ ఫలితాలను ఎవరికి తోచిన విధంగా వారు విశ్లేషిస్తున్నారు. విజయం తమదేనని గుప్కార్ కూటమి చెప్పుకుంటోంది. ఇక్కడ ఓటింగ్ సరళిని గమనించినట్లయితే డీడీసీలలో బీజేపీ 28 శాతం ఓట్లు సాధించింది. నేషనల్ కాన్ఫరెన్స్ 26.3 శాతం, పీడీపీ 20.6, కాంగ్రెస్ 20.6 శాతం ఓట్లు సాధించాయి. ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఎప్పటిలాగే జమ్ము ప్రాంతంలో అధిక్యతను సాధించగా, గుప్కార్ కూటమి కశ్మీర్ లోయలో పట్టును నిలుపుకుంది. ఒకటి వాస్తవం- కాన్ఫరెన్స్, పీడీపీ కలసి పోటీ చేసి ఉండొచ్చు. కానీ కాన్ఫరెన్స్ పడిన ఓటు, పీడీపీకి పడిన ఓటు ఒకే ఆశయంతో వేసినవి కావు. దేని ధ్యేయం దానిదే.
కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370 రద్దు చేయడాన్ని, జమ్ము కశ్మీర్ స్వయంప్రతిపత్తిని తొలగించడాన్ని సహజంగానే నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీతో పాటు కాంగ్రెస్ పార్టీకి దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. వీరికి వేర్పాటువాద సంస్థలు తోడయ్యాయి. సొంతంగా బీజేపీను డీ•కొట్టలేమని తెలిసే ఆయా పార్టీలు గుప్కార్ అలయన్స్‌గా ఏర్పడ్డాయి. ఆర్టికల్ 370 పునరుద్దరణే తమ లక్ష్యమని ప్రకటించాయి. కాగా కశ్మీర్ విషయంలో విదేశీ జోక్యాన్ని కోరుతూ ఫరూక్ అబ్దుల్లా (నేషనల్ కాన్ఫరెన్స్) చేసిన ప్రకటన, భారత జాతీయ పతాకంపై మెహబూబా ముఫ్తీ (పీడీపీ) చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. దీంతో ఆందోళనకు గురైన కాంగ్రెస్ ఈ కూటమికి దూరమైంది.
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు ఫలితాలను ఇచ్చేందుకు కొంత సమయం పట్టే అవకాశం ఉన్నా ప్రధాని మోదీ చిత్తశుద్ధిని రాష్టప్రజలు క్రమంగా అర్థం చేసుకుంటున్నారు. కేంద్ర పాలనతో కశ్మీర్‌లో అభివృద్ధి ఊపందుకుంది. కశ్మీర్ ప్రజలు ఒకప్పుడు పాలించిన వారికి, ఇప్పుడు సేవ చేస్తున్న వారికి మధ్య తేడాను చూస్తున్నారు. ప్రజాస్వామ్యంపై వారికి నమ్మకం ఇప్పుడు మరింత పెరిగింది. డీడీసీ ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయాలు కశ్మీర్ ప్రజల్లో వచ్చిన మార్పును ప్రతిబింబిస్తున్నాయనే చెప్పాలి.
దేశంలో ప్రజాస్వామ్యం లేదంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేసి ఉండవచ్చు. ఢిల్లీలో కూర్చుని, ప్రజలతో సంబంధం లేని కొందరు ప్రజాస్వామ్యం గురించి ఊకదంపుడు ఉపన్యాసాలు చేసేందుకు ప్రయత్నిస్తారు. అలాంటి వాళ్లకు జమ్ముకశ్మీర్‌లో డీడీసీ ఎన్నికలు నిర్వహించిన తీరు ప్రజాస్వామ్యానికి చక్కని ఉదాహరణగా చూపిస్తానని ప్రధాని చెప్పడం సత్యదూరం కాదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న పుదుచ్చేరిలో 2011 నుంచి స్థానిక ఎన్నికలు జరగడం లేదు. సుప్రీంకోర్టు తప్పు పట్టినా పట్టించుకోలేదు. కానీ జమ్ముకశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంగా మారిన ఏడాది కాలంలోనే పంచాయతీ స్థాయి ఎన్నికల నిర్వహణ సాఫీగా సాగింది. ప్రజా స్వామ్యానికి నిదర్శనంగా నిలిచింది.
జమ్ముకశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి విషయంలో మళ్లీ పాత పంథాకే వెళతామని నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీలు బాహాటంగానే చెబు తున్నాయి. ప్రపంచంలో పాకిస్తాన్, దానిని సమర్ధిస్తున్న టర్కీ, ఇరాన్‌లు, వెనుక నుంచి నడిపిస్తున్న చైనా తప్ప మరే దేశమూ 370 అధికరణ రద్దు గురించి వ్యతిరేకంగా మాట్లాడడం లేదు. అంటే గుప్కార్ పేరుతో ఏకమైన ఆ పార్టీలు మన రాజ్యాంగం ఇచ్చిన వాక్‌స్వాతంత్య్రం ఆధారంగా పాకిస్తాన్ వాదననే ఇక్కడ వినిపిస్తున్నాయి. ఆ అధికరణం రద్దులో బీజేపీని వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ కూడా డీడీసీ ఎన్నికలలో కొన్ని సీట్లు సాధించింది. ఇప్పుడు ఆ పార్టీ బీజేపీ వాదనను సమర్ధిస్తుందని అనుకోలేం. అలా అని గుప్కార్ కూటమికి వంత పాడగలదా? మళ్లీ కశ్మీర్‌లో 370 అధికరణను పునరుద్ధరిస్తానని భారత ప్రజల ముందు చెప్పగలదా? కశ్మీర్‌లో ఒక మాట, బయట ఒక మాట మాట్లాడగలదా?
మరొక విషయం కూడా చర్చించవలసి ఉంటుంది. స్థానిక ఎన్నికలు చాలా వరకు పార్టీ కంటే, అభ్యర్థుల ప్రభావ శీలత మీద ఆధారపడి ఉంటాయి. ఇది భారతదేశంలో స్థానిక ఎన్నికల సరళి. ఇదే కశ్మీర్‌కు వర్తింప చేయవలసి ఉంటుంది. కాబట్టి కశ్మీర్‌లోయలో కనిపించిన డీడీసీ ఎన్నికల సరళి రేపు అసెంబ్లీ ఎన్నికలలో కనిపిస్తుందా అన్నది అనుమానమే. గుండెల మీద తుపాకీ లేనపుడు ఏ వ్యక్తికయినా వచ్చే ఆలోచన వేరు. ఆలోచనా ధోరణి వేరు. అక్కడ ఇంతకాలం జరిగింది ఇదే. లోయ వరకు, కొంత వరకు జమ్ములో ప్రతి ఎన్నిక పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల తుపాకీ భయం నీడలో జరిగింది. ఇప్పుడు పరిస్థితిలో మార్పు వచ్చింది. మార్పును జీర్ణించుకోవడానికి సమయం తీసుకునే వారు ఉంటారు. అందుకు డీడీసీ ఎన్నికల ఫలితాలే నిదర్శనం. ఇవి కశ్మీర్ ప్రజలను ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడానికి ఎంతో కొంత దోహదం చేశాయని అనిపిస్తుంది. అయినా లోయలో వచ్చిన ఫలితాలతో పాకిస్తాన్ అనుకూల శక్తులకు ఇప్పటికీ కొంత అనుకూల వాతావరణం ఉన్న సంగతిని కూడా వెల్లడిస్తున్నాయి. లోయలో బీజేపీ చాలా స్థానాలలో చెప్పుకోదగిన ఓట్లు సాధించింది. దీనికి బీజేపీయేత రులు ఎలాంటి భాష్యం చెప్పినా, అక్కడ కొంత భారత అనుకూల వాతవరణం బలపడిందనే అనుకోవాలి.
– క్రాంతిదేవ్ మిత్ర, సీనియర్ జర్నలిస్ట్