అయోధ్యాకాండ-5
1990వ దశకంలో దేశంలో మారుమోగిన పదం, కరసేవ! అయోధ్య ఉద్యమం ఒక్కొక్క అడుగు వేస్తున్న క్రమంలో ఇదొక దశ. కీలకమైన దశ. ఉద్యమాన్ని మలిదశకు తిప్పిన ఘటన. ఆ క్రమాన్ని గమనించవలసిందే. హిందువుల మనోభావాలకు పెద్దగా విలువ ఇవ్వరాదన్న కుహనా సెక్యులరిస్టులను జాతి యావత్తు ఏ విధంగా గర్హించినది ఈ క్రమంలోనే తెలుస్తుంది.
అయోధ్యకు కేవలం తాళాలు తొలగించారు. ఇదే ముస్లింలకు ఆగ్రహం కలిగించింది. కశ్మీర్‌లో హిందూ దేవాలయాలపై దాడి జరిగింది. ముస్లిం ఎంపీలు బెదిరింపులకు దిగారు. జనవరి 26, 1987 రిపబ్లిక్ డేను బహిష్కరిస్తామంటు హెచ్చరికలు చేశారు. అటు తాళలు తెరవడంతో హిందూ సమాజంలో ఉత్సాహం ఉప్పొంగింది. 1986 ఫిబ్రవరి 1న అయోధ్యలో సమావేశమైన హిందూ ధర్మాచార్యులు, సాధు సంతులు శ్రీరామజన్మభూమి దేవాలయంతోపాటు, పరిసర ప్రాంతాలను పునరుద్ద రించి అభివృద్ధి చేసేందుకు శ్రీరామ జన్మభూమి న్యాస్ (ట్రస్టు)ను ఏర్పాటు చేశారు. సమాజంలో శాంతిని కాపాడు కుంటూనే ఉద్యమాన్ని ముందుకు తీసుకెళతామని విశ్వ హిందూ పరిషత్ నేత అశోక్ సింఘాల్ ప్రకటించారు.
నాటి ప్రధాని రాజీవ్ గాంధీ కూడా ఉదారవాద హిందుత్వాన్ని అంగీకరిస్తాననే సంకేతాలు పంపాడు. ఈ క్రమంలోనే రాజీవ్ గాంధీ మధురలోని దేవరహ బాబాను కలిశారని అంటారు. అయోధ్య మందిర నిర్మాణానికి సహకరించాలని రాజీవ్ గాంధీకీ ఆయనే సూచించినట్లు చెబుతుంటారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూడా తన THE TURBULENT YEARS-1980-90లో గ్రంథంలో ఈ విషయా లను ప్రస్తావించారు. ఇటు అశోక్ సింఘాల్‌తో పాటు యూపీ మాజీ డీజీపీ ఎస్సీ దీక్షిత్ తదితరులు కూడా దేవరహ బాబాను కలిశారు.
నవంబర్ 9,1989న అయోధ్యలో రామాలయం నిర్మాణానికి శంకుస్థాపన (శిలాన్యాసం) జరిగింది. రాజీవ్ ప్రభుత్వం కూడా చూసి చూడ నట్లుగా వ్యవహారించింది. అంతలోనే బోఫోర్స్ కుంభకోణం వెలుగులోకి రావడం…, సోనియా గాంధీ సన్నిహితుడు, ఇటలీ పారిశ్రామికవేత్త ఒట్టావియో ఖత్రోచీ పేర్లు ఈ కుంభకోణంలో వినిపించడం దేశాన్ని కుదిపివేసింది. 1989 డిసెంబర్‌లో తొమ్మిదో లోక్‌సభకు సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. కేంద్రంలో వీపీ సింగ్ నేతృత్వంలో నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మొదట శిలాన్యాసం జరిగిన కొద్ది రోజులకే కరసేవ నిర్వహించాలని విశ్వహిందూ పరిషత్ పెద్దలు భావించారు. కొత్త ప్రభుత్వం సమస్య పరిష్కారానికి నాలుగు నెలల సమయం అడగటంతో ఆ నిర్ణయాన్ని వాయిదా వేశారు. ఈ వ్యవధిలో సమస్య పరిష్కారానికి వీపీ సింగ్ చర్యలు తీసుకోలేదన్న విమర్శలు ఉన్నాయి. ఆయన ప్రాథమ్యాలు వేరు. చర్చలకు రావడం లేదని బాబ్రీ యాక్షన్ కమిటీ తెగేసి చెప్పడంతో సమస్య మొదటికి వచ్చింది. దాంతో తదుపరి కార్యాచరణ కోసం హరిద్వార్‌లో సమావేశం కావాలని హిందూ ధర్మాచార్యులు నిర్ణయం తీసుకున్నారు.
వీపీ సింగ్ ప్రభుత్వానికి విశ్వహిందూ పరిషత్ ఇచ్చిన నాలుగు నెలల గడువు ముగింపునకు వచ్చింది. సాధుసంతులు 1990 జూన్ 23-24 తేదీల్లో హరిద్వార్‌లో సమావేశం అయ్యారు. 1990 అక్టోబర్ 30వ తేదీన కరసేవ ప్రారంభించాలని ఆదేశించారు. అంటే, మందిర నిర్మాణమే లక్ష్యంగా ముందుకు వెళ్లడం! అయోధ్య ఉద్యమంలో భాగంగా 1990 సెప్టెంబర్ నెలలో నిర్వహించిన శ్రీరామజ్యోతి కార్యక్రమం.. అటక్‌నుంచి కటక్‌వరకు, కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారత జాతిని సమైక్యం చేసింది.
సెప్టెంబర్ 18, 1990న అయోధ్య నుంచి బయలుదేరిన శ్రీరామజ్యోతులు నెల తర్వాత అక్టోబర్ 18న, దీపావళి పర్వదినాన లక్షలాది గ్రామాల్లోని కోట్లాది మంది హిందూగృహాలకు చేరుకున్నాయి. ప్రతి గ్రామం నుంచి కరసేవ కోసం రామభక్తులు కదిలారు. వారికి అవసరమైన అన్ని ఏర్పాట్లను హిందూ సమాజమే చూసుకుంది. రొట్టెలు, రవాణా ఖర్చులు, అల్పాహారం అందించేందుకు హిందూ ప్రజానీకం పోటీపడ్డారు. అయోధ్య పోరాటానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ బీజేపీ తీర్మానం చేసింది. జనసంఘ్ సిద్ధాంతకర్త, బీజేపీకి స్ఫూర్తి ప్రదాత దీనదయాళ్ ఉపాధ్యాయ జన్మదినం సెప్టెంబర్ 25వ తేదీ నుంచి అప్పటి బీజేపీ అధ్యక్షుడు లాల్ కృష్ణ అడ్వాణి రథయాత్రను ప్రారంభించారు. గుజరాత్‌లోని సోమనాథ్ నుంచి ప్రారంభమైన ఈ రథయాత్ర ప్రధాన లక్ష్యం, అయోధ్యకు సంబంధించిన వాస్తవా లను, పరిణామాలను దేశ ప్రజలకు తెలియజెప్పడం. రామ మందిర నిర్మాణం ఒక జాతీయ స్వాభిమా నానికి సంబంధించిన అంశమని వివరించడం! సెక్యులరిజం ముసుగు తొలగించడం కూడా. ఈ రథయాత్ర అయోధ్య ఉద్యమాన్నే కాదు, భారతీయ వ్యవస్థనే మలుపు తిప్పింది.
కరసేవకులు ఒకవైపు. అడ్వాణి రథయాత్ర మరోవైపు. అయోధ్యలోకి పిట్టను కూడా రానివ్వ నంటూ నాటి సీఎం ములాయం సింగ్ యాదవ్ పట్టుదల మరొక కీలకాంశం.
అక్టోబర్ 24వ తేదీ నుంచి యూపీలోని వేలాది మంది ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ, విశ్వహిందూ పరిషత్ కార్యకర్తల అరెస్టుల పర్వం మొదలైంది. అక్టోబర్ 24వ తేదీన దాదాపు లక్షన్నర మందిని యూపీ ప్రభుత్వం అరెస్టు చేసి తాత్కాలికంగా ఏర్పాటు చేసిన జైళ్లకు తరలించింది. 29వ తేదీనాటికి అరెస్టైనవారి సంఖ్య ఏడున్నర లక్షల•. బిహార్ సరిహద్దుల్లో లాలూ ప్రసాద్ ప్రభుత్వం దాదాపు 50 వేల మంది కరసేవకులను అరెస్ట్ చేసింది. ఆజ్, స్వతంత్ర భారత్, దైనిక్ జాగరణ్, మొదలైన ప్రతులు ప్రజలకు చేరకుండా పోలీసులే అడ్డుకునేవారు. చాలా మంది రిపోర్టర్లను సైతం అరెస్టు చేసి జైళ్లలో పెట్టింది ప్రభుత్వం! యూపీలోని 2వేల పాఠశాలలు, కళాశాలలు, సత్రాలు అన్ని తాత్కాలిక జైళ్లుగా మారాయి. ములాయం ప్రభుత్వం కొనసాగిస్తున్న దమనకాండతో హిందువుల్లోనూ పట్టుదల పెరిగిపోయింది. అయినా తీవ్ర నిర్బంధాలను, పోలీసు హింసను, దిగ్బంధనాన్ని ఛేదించుకుని అయోధ్యకు చేరుకున్నారు కరసేవకులు.
పావపావ్ వద్ద అక్టోబర్ 24వ తేదీన జోతిష్య పీఠం శంకరాచార్యులను పోలీసులు నిర్బంధించారు. ఆ సమయంలో వారి వెంట దాదాపు 40 వేల మందికి పైగా కరసేవకులు ఉన్నారు. వారిని అరెస్టు చేయడం పోలీసులకు అలవిగాని పని అయింది. ముందు పెద్దసంఖ్యలో మహిళలు, వృద్ధులు ఉన్నారు. వారిని చెదరగొట్టాలని సీఆర్పీఎఫ్ పోలీసులను కోరింది జిల్లా యంత్రాగం. వారందుకు తిరస్కరించారు. దాంతో యూపీ పోలీసులు లాఠీ చార్జీ చేశారు. అనేక మంది మహిళలు తీవ్రంగా గాయపడి ఆసుపత్రుల పాలయ్యారు.
అక్టోబర్ 27 తేదీ నాటికి ఢిల్లీ, హర్యానా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, బీహార్‌ల నంఉచి వెల్లువలా కరసేవలకు యూపీలోకి ప్రవేశించారు. ఆ ఒత్తిడిని తట్టుకోలేక యూపీ ప్రభుత్వం ఉక్కిరి బిక్కిరి అయ్యింది. ఆరోజున విశ్వహిందూ పరిషత్ అగ్రనాయకులను అందర్ని అరెస్టు చేసింది యూపీ ప్రభుత్వం. ఢిల్లీ సరిహద్దుల్లోని ఘజియాబాద్ వద్ద వేలాది మంది కరసేవకులతో వస్తున్న బీజేపీ నేత మదన్ లాల్ ఖురానాను అరెస్టు చేసింది. అటు అదే రోజున బిహార్ నుంచి సుశీల్ మోడీ, బీజేపీ యువనేత అశ్వనీ కుమార్ నాయకత్వంలో అయోధ్యకు బయలుదేరిన 15వేల మంది కరసేవకులపై బిహార్ పోలీసులు దమనకాండను కొనసాగించారు. పార్లమెంటు సభ్యుడు సుశీల్ మోడీ, అశ్వనీ కుమార్‌లను రైఫిల్ మడమలతో కొట్టారు. సుశీల్ కుమార్ మోడీయే తర్వాత కాలంలో బిహార్ ఉప ముఖ్యమంత్రి అయ్యారు. పోలీసుల నిర్బంధం కొనసాగుతున్న బిహార్‌లోని హజారీబాగ్, సాసారం తదితర ప్రాంతాల నుంచి దాదాపు 35వేల మంది కరసేవకులు యూపీలో ప్రవేశించగలిగారు.
అక్టోబర్ 28వ తేదీన మధ్యప్రదేశ్‌లోని చిత్రకూట్ వద్ద బీజేపీ నేత రాజమాత విజయరాజె సింధియాను అరెస్టు చేశారు. ఆమె నేతృత్వంలో దాదాపు 50 వేల మంది కరసేవలకు యూపీలో ప్రవేశించారు. అటు బీజేపీ అగ్రనేత మాజీ ప్రధాని అటల్ బీహార్ వాజ్‌పేయి, కేధార్‌నాథ్ సహానీలు విమానంలో లక్నోలో చేరుకోగానే పోలీసులు అరెస్టు చేశారు. దక్షిణ భారతం నుంచి వచ్చిన కరసేవకులకు బీజేపీ నేత ఏ.నరేంద్ర నాయకత్వం వహించారు. ఆయన నాయకత్వంలో దాదాపు 50 వేల మందికి పైగా కరసేవకులకు యూపీలో ప్రవేశించారు.
అక్టోబర్ 29వ తేదీన హఠాత్తుగా 2 వేల మంది కరసేవకులు కర్ఫ్యూను ధిక్కరించి అయోధ్యలో ప్రవేశించేసరికి ములాయం ప్రభుత్వం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇది కరసేవకులు సాధించిన మొదటి విజయం! ఉద్యమనేత విశ్వహిందూ పరిషత్ నాయకుడు అశోక్ సింఘాల్ పోలీసులు, గూఢచారుల కళ్లుగప్పి అయోధ్యలో ప్రవేశించినట్లు వర్తమానం అందడంతో అంతా ఖిన్నులయ్యారు.మొదటిసారి జరిగిన కరసేవను అడ్డుకునేందుకు ములాయం ప్రభుత్వం రెండున్నర లక్షల మంది భద్రతాదళాలను మోహరించారు. అయోధ్యకు వెళ్లే అన్నిదారులను కట్టుదిట్టం చేశారు. కరసేవకులు రెండు లక్షల వరకు రావొచ్చనే అంచనాతోనే ప్రభుత్వం ఏర్పాట్లు చేసుకుంది.
అశోక్ సింఘాల్ అయోధ్యలోనే ఉన్నారనే విషయంతో ములాయం ప్రభుత్వం ఉలిక్కిపడింది. అయోధ్యలోని వివిధ మఠాల్లో, అఖాడాలో ఉండే సాధువులను మహంత్‌లను అరెస్టు చేయాలని ఆదేశించారు. అక్టోబర్ 29వ తేదీ రాత్రి యూపీ పోలీసులు ఆపరేషన్ అశోక్ సింఘాల్ పేరుతో మహంత్ నృత్యగోపాల్ దాస్ జీ నివాసమైన మణిరాం ఛావనీపై దాడి చేశారు. ఆయన్ను అరెస్టు చేసేందుకు యత్నించడంతో రామభక్తులు అడ్డుకున్నారు. మరిన్ని బలగాలను రప్పించి ఆయనతోపాటు ఛావనీలో ఉన్న కరసేవకులందర్ని అరెస్టు చేసే ప్రయత్నం చేశారు. పట్టణంలో అన్నిచోట్లా ఇదే దమనకాండ కొనసాగింది. అంతా చేసిన వారికి అశోక్ సింఘాల్ చిక్కలేదు.
అక్టోబర్ 30వ తేదీ తెల్లవారు జామున 3 గంటల సమయంలో సరయూ వంతెన వద్ద బలగాలకు, కరసేవకులకు సమరం ప్రారంభమైంది. గోండా జిల్లా నుంచి వేల సంఖ్యలో కరసేవకులు అయోధ్యలో ప్రవేశించడానికి సరయూ వంతెన వద్దకు రాసాగారు. ఉదయం ఆరు గంటలు అయ్యేసరికి 30 వేల మందికి పైగా కరసేవకులు అక్కడికి చేరుకున్నారు. వారిని నిలువరించడం పోలీసులకు అసాధ్యంగా మారింది. లాఠీచార్జీ మొదలు పెట్టారు. ఆ తర్వాత కాల్పులు సాగించారు. ఈ గందర గోళంలో చాలా మంది కరసేవకులు సరియూ నదిలో దూకారు. వారిలో కొంతమంది మహిళలు కూడా ఉన్నారు. క్రింద నదిలో పడవలపై ఉన్న పోలీసులు దొరికినవారిని ఆ నీటిలోనే మళ్లీ కొట్టారు. దాంతో చాలా మంది కరసేవకులు నదిలోనే మునిగి పోయారు. కొందరు ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకోగలిగారు. మూడు గంటలపాటు సరయూ వంతెనపై జరిగిన భీకర సంగ్రామమే నడిచింది. ములాయంసింగ్ ప్రభుత్వం జరిపించిన కాల్పుల్లో సరియా వంతెన వద్ద ఎంత మంది కరసేవకులు మరణించారో ఎవరు కూడా లెక్క చెప్పలేకపోయారు. ఎందుకంటే ఆ తరువాత సరియూ నదిలో శవాలు దొరుకుతూనే ఉన్నాయి!
1990 అక్టోబర్ 30న జరిగిన మొదటి కరసేవ… భారత దేశ చరిత్రలోనే ఒక మరుపురాని ఘట్టం. చివరి మూడు రోజులు అత్యంత కీలకమైనవి. ఆ తర్వాత నవంబర్ 2న నిరాయుధులైన కరసేవకులపై పోలీసులు జరిపిన కాల్పులు ఘటన జలియన్‌వాలా బాగ్‌ను తలపించింది.
తరువాత : పిడికిలెత్తిన భక్తకోటి