– కుంతి
ఉమాపతి ఆఫీసుకు తయారయ్యాడు. ఆఫీసు బ్యాగ్, బండి తాళంచెవి తీసుకున్నాడు. సమయం చూసుకున్నాడు. తొమ్మిదయింది. హెడ్ ఆఫీస్ నుండి పర్యవేక్షణ బృందం వస్తుంది. వారు వచ్చేలోపు తాను ఆఫీసులో ఉండాలి.
తనకు కావలసినవి అన్నీ ఉన్నాయా లేదా మరొకసారి చూసుకున్నాడు.
ఒక్కటి మిస్ అయింది.
వెంటనే హడావుడిగా టేబుల్ సొరుగులు, బుక్‌ర్యాక్స్, అల్మారా, షోకేస్, వార్డ్‌రోబ్‌లు వెదికాడు.
బెడ్‌రూమ్‌లోకి వెళ్లి తాను పడుకునే బెడ్‌పైన, దిండ్ల దగ్గర వెదికాడు.
లివింగ్‌హాల్, బాత్‌రూంలో వెదికాడు.
తన కళ్లను భూతద్దంలా చేసుకొని ఇల్లంతా గాలించాడు.
సమయం మించిపోతుంది. టెన్షన్, అసహనం పెరుగుతుంది.
మళ్లీ మళ్లీ వెదికాడు. మళ్లీ మళ్లీ వెదికిన చోటే వెదికాడు. వెదుకుతునే ఉన్నాడు.
ఊహు….లాభం లేదు.
తనకు అత్యంత అవసరమైన… అవి లేకుంటే క్షణం కూడా జీవితం ముందుకు
కదలని… కళ్లద్దాలు…
కనిపించడం లేదు.
అసహనంతో, టెన్షన్‌తో ఇల్లు అదిరేలా..
‘‘ఒసేయ్ పార్వతీ! నా కళ్లద్దాలు కనిపించడం లేదు. నీవు ఏమైనా చూసావా?’’ అంటూ భార్యను అరుపులాంటి పిలుపుతో అడిగాడు.
ఆరోజు ఉమాపతివాళ్లు ఉండే ఫ్లాట్‌లో నీళ్లు ఆలస్యంగా వదిలారు.
ఇంట్లో అంట్లు మాత్రమే తోమే పనిమనిషి, యధావిధిగా ఆరోజు రానని కబురు పెట్టింది.
సింక్‌లో నిన్నటి తాలూకు ఎంగిలి కంచాలు, గిన్నెలు, మురికి వాసన వస్తూ పడి ఉన్నాయి.
పిల్లలకు, భర్తకు బ్రేక్ ఫాస్ట్‌కు కానీ, క్యారేజీలకు కానీ వంట కాలేదు.
వంట సగంలో ఉండగా గ్యాస్ అయిపోయింది.
అంతకుముందు రోజు ఇంట్లో ఉన్న అదనపు సిలిండర్‌ను పక్కింటి పంకజాక్షి తీసుకువెళ్లింది.
మిగిలిన వంటను ఇండక్షన్ పొయ్యి, ఎలక్ట్రిక్ కుక్కర్‌తో పూర్తి చేసే ప్రయత్నం చేస్తుంది పార్వతి.
అప్పుడే కరెంట్ పోయింది.
ఇన్ని సమస్యల మధ్య రకరకాల అవస్థలు పడుతూ, గృహిణులకు మాత్రమే పరిమితమైన విచిత్రమైన వంటింటి ఆసనాలు వేస్తూ, హడావుడి పడుతున్న పార్వతికి ఆ పిలుపు కర్ణ కఠోరమైన అరుపులా వినిపించింది.
వంటింటి పాత్రల తాలూకు శబ్దాలను నేపధ్య సంగీతంగా వినిపిస్తూ, అసంపూర్తిగా మిగిలిన పనుల వల్ల కలిగిన అసహనంతో శరీరంలో అనేక నృత్య భంగిమలు పొడుచుకు రాగా, ‘‘నాకు తెలియదు బాబూ, నా పనితోనే చస్తున్నాను’’ అంటూ పార్వతి జవాబు ఇచ్చింది.
ఉమాపతికి ఆ సమాధానం మరింత చిరాకు తెప్పించింది.
ఎప్పటిలాగే ప్రతిచిన్న విషయానికి భార్య పైన చిందులు వేసే పనికి నడుం కట్టాడు.
వెంటనే ‘‘ఔను! నీకేం తెలిసి చస్తుంది. అది యేమైనా ‘‘నీలి తరంగాలు’’ టెలీ సీరియల్‌లో మీనాక్షి కట్టుకున్న చీరనా? లేదా పక్కింటి రామాయమ్మ దిగేసుకున్న చంద్రహారమా? ఎదురింటి సోమేశ్వర రావు కొనుక్కున్న కొత్త కారా?’’ అన్నాడు కోపంగా.
పార్వతికి ఆ వ్యంగ్యం తగిలినా మాట్లాడలేదు. తన పని తానే చేసుకుపోతుంది. ఆమె నిశ్శబ్దం అతనికి మరింత కోపాన్ని తెప్పించింది.
‘‘చూడు నాకు ఆఫీసుకు లేట్ అవుతుంది. ఈ రోజు ఆఫీస్‌లో ఇన్‌స్పెక్షన్. అది నీకు తెలుసు. నాకు కళ్లద్దాలు లేకుంటే ప్రపంచమే లేదు. అయినా రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడి పనిచేసి, వేలకు వేలు జీతాలు ఇంటిలో తెచ్చిపోసే మగాడి అవసరాలు భార్యలు చూడకుంటే మరెవరు చూస్తారు?
వంట పనీ, ఇంటి పనీ తప్ప మీకు ఇంకా ఏం పని ఉంటుంది. నీకు తోడుగా పనిమనిషి ఉండనే ఉంది. అప్పుడప్పుడు రానంత మాత్రానా ఇంతగా హైరానా పడాలా?
చుట్టుపక్కల ఆడవాళ్లను పోగేసుకొని చీరలు, నగల గురించి మాట్లాడుకోవడాలు, వాడట్లా పోయాడు, అదిట్లా పోయింది అన్న ముచ్చట్లు తప్ప ఇంకా ఏం రాచకార్యాలు ఏడుస్తాయి.
సమయాన్ని సద్వినియోగం చేస్తూ బాధ్యతగా మిగిలిన విషయాలు కూడా చూస్తే ఈ సమస్యలు ఉండవు కదా?’’ అన్నాడు ఉమాపతి.
‘‘ప్రొద్దున నాలుగు గంటలకు లేచి ఇళ్లు ఊడుస్తాను. ఫ్లోర్ గుడ్డ పెట్టి తుడుస్తాను? వంట వండుతాను? పిల్లలకు, మీకు క్యారేజీలు సర్దుతాను. మీరంతా వెళ్లిన తరువాత బట్టలు ఉతుకుతాను. అవి ఎండిన తరువాత ఇస్త్రీ చేసి, కప్‌బోర్డ్‌లలో సర్దిపెడతాను.
ఇవన్నీ అయిన తరువాత మార్కెట్‌కు పరుగులు పెట్టి కూరా నారా తెస్తాను.
సాయంత్రం మీరంతా ఇళ్లల్లోకి చేరుకునే సరికి వేడివేడి టిఫిన్లు చేస్తాను.
అవి మీరు వంకలు పెట్టి తిన్న తరువాత మళ్లీ రాత్రికి వంట చేస్తాను.
మధ్యలో మీ వాళ్లు వచ్చినా, మీ స్నేహితులు, కొలీగ్స్ వచ్చినా వాళ్లకు తగిన ఆతిధ్యం చేస్తాను. ఇన్ని చేస్తున్నా మీకు అసంతృప్తియే. ఇప్పుడు చెప్పండి నేను చేసిన సమయ దుర్వినియోగం ఏమిటో? మీరు చేస్తున్న సమయ సద్వినియోగం ఏమిటో’’ అన్నది పనుల వల్ల కలిగిన చికాకుతో పార్వతి.
‘‘అసలే కళ్లద్దాలు కనబడక టెన్షన్‌తో చస్తున్నాను. నా పైన వెటకారాలు, వ్యంగ్యాలు కూడానా?
ప్రపంచంలో నీవు ఒక్క దానివే ఇల్లాలివైనట్లు, నీవే అన్నీ చేస్తున్నట్లు ఈ బిల్డప్ వద్దు.
నేను గుమాస్తాగిరీని చేస్తున్నానని కాబోలు ఈ అమర్యాదాకరమైన మాటలు.
అయినా ఎక్కడికి పోతాయి ఆ బుద్ధులు, ఆ అవలక్షణపు కూతలు’’ వెటకారంగా బదులిచ్చాడు ఉమాపతి.
‘‘నేనేమి అన్నానని అన్నిమాటలు అంటున్నారు. నేను ఇంత చేస్తున్నా, నా శ్రమను గుర్తించక నోటికి వచ్చినట్లు అంటారేమిటి? మీ అమ్మగారు, మీ అక్కా చెల్లెళ్లు కూడా ఇలాగే అనేవారు.’’
‘‘ఔను! నేనూ, మా వాళ్లు పనికిమాలిన వాళ్లం. మీ వాళ్లవి మంచి బుద్ధులు. మీవి లక్షణమైన పంచదార పలుకులు. చూస్తూనే ఉన్నానుగా పాతిక సంవత్సరాల నుండి మీ అమ్మా, అక్కాచెల్లెళ్లవి ఎంతమంచి బుద్ధులో, మీరు ఎంత సుభాషిణులో?’’ అని ఉమాపతి అన్నాడు.
కరెంట్ వచ్చింది.
పార్వతి అది చూసి ఒక్కసారిగా మళ్లీ వంట గదిలోకి పరుగెత్తి, వంట అనే ఎపిసోడ్‌ను పూర్తి చేయడానికి ప్రయత్నించగా మళ్లీ కరెంట్ పోయింది.
ఈ రోజు ఇంట్లోవాళ్లకు ఏం పెట్టాలో అన్న టెన్షన్‌లో ఉండగా కిచెన్‌లో నీళ్లు ఆగిపోయాయి.
ఏం చేయాలో దిక్కు తోచని పరిస్థితిలో ఉండగా,
‘‘ఇదిగో పార్వతీ! నేను నీకు చాలా సార్లు చెప్పాను. నీవు మా వాళ్ల గురించి మాట్లాడ వద్దని. మా వాళ్లవి మీ వాళ్లలా అడుక్కు తినే బుద్ధులు కావు. అసలే కళ్లద్దాలు కనబడడం లేదు, నేను చాలా చికాకుగా ఉన్నాను. అయినా సమయం, సందర్భం చూసుకొని మాట్లాడే ఇంగితం ఉండాలి, అది నీకు ఉండి చస్తే కదా’’ అంటూ వంట గదిలోకి వచ్చి, తెలుగు టీవీ సీరియల్‌లో విలన్‌లా అన్నాడు.
‘‘ఔను బాబు! మాకు ఇంగితం ఎక్కడిది’’ అన్నది పార్వతి ఆ సంభాషణను అక్కడికి ఆపేద్దామని.
‘‘అంటే నీ ఉద్దేశం నాకూ నా వాళ్లకు ఇంగితం లేదనా? ఎప్పుడో పెళ్లిచూపుల్లో ‘మైసూర్‌పాకులు, లడ్డూలు బూజుపట్టినవి పెడతారా?’ అని మా నాన్న అడిగినందుకు; పెళ్లిపందిట్లో ‘విడిది బాగాలేదు, వంటలూ, వడ్దనలు బాగా లేవు’ అని మా అమ్మ అన్నందుకు; మీ అమ్మవాళ్లు పెట్టిన చీరలు నాసిరకంగా ఉన్నాయని మా చెల్లెళ్లు పెళ్లిపందిట్లో అలిగినందుకు; పెళ్లి మేమనుకున్న విధంగా చేయలేదని మా మామయ్య అన్నందుకు.. అవన్నీ ఇప్పుడు గుర్తుపెట్టుకొని, వెటకారంగా ‘ఔను! బాబు మాకు ఇంగితం ఎక్కడిది’ అంటావా?’’ అన్నాడు ఉమాపతి.
ఉమాపతి కోపంతో ఊగుతూ అంటున్న మాటలు పట్టించుకోకుండా ఆరోజు వంట గురించి, చేయాల్సిన పనుల గురించి ఆలోచిస్తూ ‘‘ఇప్పుడు ఆ పాత విషయాలు ఎందుకండి’’ అన్నది.
ఆమె మాటలకు ఉమాపతి అడ్డు తగిలి…
‘‘అంటే నేను వ్యర్థాలాపన చేస్తున్నానా? మన పెళ్లి జరిగి పాతిక సంవత్సరాలయింది. మీ వాళ్లు నాకు ఇస్తామన్న స్కూటర్ ఇచ్చారా? ఏ పండగ కైనా అల్లుడూ అని పిలిచి గోచి గుడ్డ అయినా పెట్టారా? ఆ మర్యాదా మన్నన మీ వాళ్లకు ఎక్కడ ఏడ్చాయి. మొదటి కాన్పు మీ వాళ్లు చేయాలి. ‘నా వల్ల కాదు’ అని మీ నాన్న అంటే, కాన్పు ఖర్చు, బారసాల ఖర్చు నేను భరించుకొని, ‘మామయ్యనే ఆ ముచ్చట జరిపించాడు అని’ మా వాళ్లకి చెప్పానా, లేదా?
మన మల్లిక పుట్టినప్పుడు నేను దానికి బంగారు గొలుసు చేయిస్తే, అది మీ నాన్న ‘చూసి ఇస్తాను’ అని తీసుకొని, బారసాల ఫంక్షన్‌లో అందరి ముందు తానే చేయించినట్లు బిల్డప్ ఇస్తూ మల్లిక మెడలో వేయలేదా…? ఇదీ మీ వాళ్ల గొప్పతనం.’’
అస్తమానం తన పుట్టింటి పేదరికాన్ని, తమ తల్లిదండ్రులు తప్పనిసరై చేసిన పొరపాట్లను, పెళ్లిలో జరిగిన లోటుపాట్లను గుర్తు చేస్తూ మాట్లాడే భర్త మాటలకు అలవాటు పడి మౌనంగా ఉండే పార్వతి, ఆరోజు ఎందుకో పనుల వల్ల కలిగిన చిరాకుతోనో, మనసులో రగులుతున్న బాధతోనో..
‘‘మా నాన్న నాకు పెళ్లికి నెక్లెస్ చేయిస్తే అది మీ చెల్లెలికి పెళ్లిలో కానుకగా ఇచ్చారు. మళ్లీ చేయిస్తానని అన్నారు. మీ చెల్లెలు కూతురుకు కూడా పెళ్లి అయింది. ఏదీ నా నెక్లెస్ అని నేనెప్పుడైనా అడిగానా, ఆ విషయం ఎప్పుడైనా తీసానా?’’ అన్నది.
‘‘అది నాకు ఇవ్వాల్సిన డబ్బు కింద మీ నాన్న నీకు నెక్లెస్ చేయించాడు. కాబట్టి అది మా చెల్లెలికి ఇచ్చాను. అయినా నీ గురించి, నీ వాళ్ల గురించి వాదించే సమయం లేదు. నీతో మాట్లాడడం నాదే బుద్ధితక్కువ’’ అంటూ…..
ఆమెతో మాట్లాడడం ఆపి, ‘‘అమ్మా! మల్లికా! నా కళ్లద్దాలు ఏమైనా చూసావా తల్లీ!’’ అని కూతురిని ప్రేమగా అడిగాడు.
‘‘నో డాడీ! నేను చూడలేదు. అయినా నీకు మతిమరుపు ఎక్కువయిపోతుంది. నీవే ఎక్కడో పెట్టి ఇల్లంతా వెదుక్కుంటావు’’ అని పలికి,
‘‘అమ్మా! నాకు కాలేజ్ బస్ వచ్చే టైం అయింది. నాకు తెలుసు ఈ రోజు క్యారేజీ ఇచ్చే పరిస్థితిలో లేవు. నేను కాలేజ్ క్యాంటీన్‌లో తింటాను. నాకు డబ్బులు ఇవ్వు’’ అంటూ బ్యాగ్ తీసుకొని వెళ్ల బోయింది, ఇంజనీరింగ్ రెండవ సంవత్సరం చదువుతున్న మల్లిక.
‘‘మల్లికా! బంగారు తల్లీ! ఇదిగో ఈ డబ్బులు తీసుకో. క్యాంటీన్‌లో భోజనం చేయి. ఆ అడ్డమైన పానీపూరీ, చాట్‌లు తినకు. కడుపు పాడయిపోతుంది. మళ్లీ అవస్థ పడతావు’’ అంటూ చేతిలో డబ్బులు పెట్టాడు ఉమాపతి.
‘‘సారీ! బంగారు! నీకు క్యారేజీ కట్టలేక పోయానురా. ఇదిగో ఈ డబ్బులు తీసుకో. ఏదైనా తిను’’ అంటూ పార్వతీ పోపుడబ్బాలో నుండి కొంత డబ్బు తీసి చేతిలో పెట్టింది.
అమ్మాయి వెళ్లిపోయింది. ఉమాపతి సమస్య తీరలేదు కాబట్టి,
‘‘ఒరేయ్ బాబీ! నా కళ్లద్దాలు చూసావురా’’ అంటూ ఎంబీఏ చదువుతున్న కొడుకును అడిగాడు.
‘‘ఓహ్ డాడీ! పొద్దున్నుండి నా రెఫరెన్స్ మెటీరియల్ కనబడడం లేదు. నా హడావుడిలో నేనున్నాను. ఇంక నీ కళ్లద్దాలు ఎక్కడ చూస్తాను. నీవు పొద్దున్నుండి ఆ పాత పంచాంగాలు దులపక పోతే కొంచెం వెతికితే దొరికేవి కదా. నీ మాటలు ఈ రోజుకు తెగేట్టు కనబడడం లేదు. నాకు సెమినార్ ఉంది. వెళ్లాలి. నాకు కొంత డబ్బు ఇవ్వండి, బయట ఎక్కడైనా తింటాను’’ అన్నాడు బాబీ.
‘‘నాన్న అంటే కేవలం ఏటీఎమ్ అయిపోయాడు. నా కష్టం, సుఖం ఎవరికీ అక్కర లేదు. ఇదిగో ఈ డబ్బులు తీసుకో. సమోసాలు, చాయిలతో గడపకు. మళ్లీ అసీడిటీతో బాధ పడతావు’’’ అంటూ డబ్బులు చేతిలో పెట్టాడు.
‘‘హోటల్‌కు వెళ్లి ఏమైనా తిను నాన్నా’’ అంటూ పార్వతి కూడా కొడుకు చేతిలో డబ్బులు పెట్టింది.
‘‘చూసావా! ఈరోజు పిల్లలు పస్తులతో వెళ్లారు. నా జేబుకు కూడా బాగానే చిల్లు పెట్టారు. ఇదీ నీ నిర్వాకం’’ అని ఉమాపతి అంటూండగా,
‘‘పార్వతి గారూ! కప్పెడు పంచదార ఉంటే పెడతారా? మా ఇంటిలో నిండుకుంది. మళ్లీ సాయంత్రం పట్టుకొచ్చి ఇస్తాను’’ అంటూ పక్కింటి రాంబాయమ్మ రావడంతో,
‘‘కాస్త నెమ్మదిగా మాట్లాడండి’’ అంటూ వంటింట్లోకి వెళ్లి చక్కెర తెచ్చి ఆవిడకు ఇచ్చి, కాసేపు మాట్లాడి ఆవిడను పంపించింది పార్వతి.
పక్కింటి ఆవిడ వెళ్లగానే, ‘‘అంటే నేను నోరు పారేసుకునేవాడిని, నీవు మహా ఇల్లాలివి కదూ’’ అంటూ ఉమాపతి గొణుగుతూ, సణుగుతూ తన అద్దాలు వెదికే పనిని చేస్తుండగా, వంటింటిలో ఏదో పని గుర్తుకు రావడంతో పార్వతి అక్కడి నుండి వెళ్లిపోయింది.
ఇంతలో, ‘‘అంకుల్! నిన్న రాత్రి మీరు ఇచ్చిన షూ క్లీనింగ్ బ్రష్’’ అంటూ, పక్కింటి బంటీగాడు వచ్చాడు.
ఉమాపతి బ్రష్ తీసుకున్నాడు.
‘‘థాంక్యూ అంకుల్! హావ్ ఎ గుడ్ డే’’ అంటూ వెళ్లిపోయాడు.
‘‘ఏం గుడ్ డే నో ఏమో’’ అనుకుంటూ షూ క్లీనింగ్ బ్రష్‌ను షూ ర్యాక్‌లో పెడుతుండగా అక్కడ కనిపించాయి..
…కళ్లద్దాలు…
అప్పుడు గుర్తుకు వచ్చింది ఉమాపతికి రాత్రి జరిగిన సంఘటన. రాత్రి పదిగంటల ప్రాంతంలో ఆఫీసు తాలూకు ఫైళ్లు చూసుకుంటుండగా షూ బ్రష్ కోసం బంటీ వచ్చాడు. తాను ఫైళ్లు సోఫా పైన పెట్టి షూర్యాక్ దగ్గర వంగి, బంటీకి బ్రష్ ఇస్తుండగా కళ్లద్దాలు జారినట్లు అనిపించాయి, ఏదో ఆలోచిస్తూ వాటిని తీసి…. పెట్టాడు.
అంతలో నిద్ర ముంచుకు రావడంతో ఫైళ్లు పక్కనపడేసి వెళ్లి పడుకున్నాడు.
కళ్లద్దాలు పెట్టిన స్థానం తాలూకు సమాచారం, అతడి మస్తిష్కంలో నుండి జారిపోయింది.
తెల్లవారింది. కనబడని కళ్లద్దాల కోసం ఇంత యుద్ధం చేసాడు.
షూర్యాక్‌లో కూర్చున్న కళ్లద్దాలు, కొద్ది నిమిషాల లోనే.. ఎప్పుడెప్పుడు అవకాశం వస్తుందా, ఎప్పుడెప్పుడు బయట పడదామా అనుకునే ఉమాపతి లోపల ఉండే పురుషాహంకారాన్ని బయటికి తీసుకు వచ్చాయి.
విచిత్రమేమిటంటే, పిల్లలు కూడా తాము కాలేజీకి వెళ్లే హడావుడిలో, షూ ర్యాక్‌లో ఉన్న కళ్లద్దాలను గమనించలేదు.
షూర్యాక్ మీద ఒద్దికగా కూర్చున్న కళ్లద్దాలు మాత్రం ఆ ఇంటిలో జరిగిన మరొక మానసిక హింసను ప్రత్యక్ష ప్రసారంగా చూసాయి.
మొత్తానికి ఉమాపతికి కళ్లద్దాలు దొరికాయి.
వెంటనే ఆఫీస్‌కు వెళ్లిపోయాడు.
* * *
మధ్యాహ్నం ఒంటి గంట అయింది. ఇన్‌స్పెక్షన్ వాళ్లు రాలేదు. పెద్దగా పని లేకపోవడంతో ప్రశాంతంగా ఉన్నాడు ఉమాపతి. ఏవో కొన్ని ఫోన్స్ చేసుకున్నాడు. వాట్సాప్ తీసాడు. కూతురు, కొడుకుల నుండి మెసేజ్‌లు ఉన్నాయి. కూతురు రాసిన మెసేజ్ ఓపెన్ చేసాడు. ‘‘నాన్నా! అమ్మ మమ్మల్ని, మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తుంది. మన కోసం పడరాని పాట్లు పడుతుంది. రెక్కలు ముక్కలు చేసుకుంటుంది. అయినా నీవు అస్తమానం అమ్మను అలా ఎందుకు హింసిస్తావు? నన్నూ అన్ననూ ఎంతగానో ప్రేమించే నీవు అమ్మతో ఎందుకు అలా ప్రవర్తిస్తావో మాకైతే అర్థంకాదు. ఈ ఒక్క విషయం తప్ప నీలో ఏ లోపం లేదు. నీ పైన ప్రేమతో చెబుతున్నాను. కొంచెం మారు నాన్నా. మరొక్క విషయం, ఇదంతా చూస్తుంటే రేపు నాకు పెళ్లి అయి, భర్త వచ్చి, అతనూ ఇలాగే చేస్తాడేమోనని భయం వేస్తుంది. భవిష్యత్తులో పెళ్లి చేసుకోవద్దు అనిపిస్తుంది’’
ఎన్నడూ తనతో ఇలా మాట్లాడని మల్లిక అలా మెసేజ్ పెట్టడంతో షాక్ అయ్యాడు.
కొడుకు మెసేజ్ ఓపెన్ చేసాడు.
‘‘నాన్నా! మీరు మీ అమ్మను అంటే, మా నాన్నమ్మను బాగా చూసుకునే వారు. అది చూసి నాకు చాలా గర్వంగా అనిపించేది. కానీ మా అమ్మను ఎందుకు నాన్నా పదే పదే మాటలతో బాధపెడతారు. మీకు ఏమైనా ఫస్ట్రేషన్స్ ఉంటే అన్నేసి మాటలనాలా? పూర్వం మీ మధ్య ఏం జరిగిందో మాకు తెలియదు. మాకు అనవసరం. ఇప్పుడు మన ఫ్యామిలీలో నాకు తెలిసినంత వరకు అమ్మ దేవత. అటువంటి మనిషిని అలా బాధపెడితే నేను తట్టుకోలేక పోతున్నాను. దయచేసి అర్ధం చేసుకోండి. వీలైతే మారండి’’
ఆ మెసేజ్‌తో మరింత షాక్ అయ్యాడు.
పొద్దున ఇంట్లో జరిగిన సంఘటన, తాను అన్న మాటలు గుర్తుకువచ్చాయి. మనసులో మథనం ప్రారంభమయినది. ఆలోచిస్తుంటే తానెంత మూర్ఖుడో అర్థమయింది. తానెందుకలా చీటికీ మాటికీ అనవసరంగా నోరు పారేసుకుంటాడో, దేవత లాంటి ఇల్లాలిని ఎందుకు హింసిస్తాడో తనకే అర్థంకాలేదు. తన తండ్రి పురుషోత్తం కూడా తన తల్లిని ఊరికే ఇలాగే హింసించేది గుర్తుకు వచ్చింది. అప్పుడు తన తండ్రి పైన కోపం వచ్చేది. కాని పెళ్లి అయిన తరువాత తాను కూడా అలాగే మారాడు. ఎన్నోసార్లు అతని ఆంతరంగం తన తప్పులను ఎత్తిచూపేది.
తనలోని పురుషాహంకారం, ‘‘పెళ్లి చేసుకొని వచ్చిన ఆడది మూసుకొని పడి ఉంటుంది తప్ప ఇంకెక్కడికి పోతుంది’’ అన్న భావజాలం తన తప్పులను గుర్తించకుండా చేసింది. ఈ పాతిక సంవత్సరాలు ఎన్నిసార్లు ఇలా హింసించాడో, మరొక్క ఆడదైతే తన ప్రవర్తనకు తానైనా చచ్చేది, తననైనా చంపేది. కాని తన భార్య సహనవతి కాబట్టి తాను సర్దుకుపోయింది తప్ప ఏనాడూ తనను ఎదిరించలేదు’’ అని అనుకుంటుండగా ఏదో ఫోన్ వచ్చింది. ఎత్తాడు.
మళ్లీ ఆలోచనల్ల్లో పడ్డాడు. తాను ఇలాగే ఉంటే తన కొడుకు కూడా ఇలాగే తయారవుతాడు. ఒకవేళ తనకు వచ్చే అల్లుడు ఇలాగే ఉంటే తాను తట్టుకోగలనా? అనుకున్నాడు.
మారాలి. ఇప్పటికైనా భార్యను భార్యగా చూడాలి. ప్రేమను పంచాలి. తనలో వచ్చిన మార్పును కార్యరూపంలోకి మార్చి భార్యను సంతోషపరచాలి అనుకున్నాడు. తక్షణమే కొన్ని ఫోన్లు చేసాడు. ఎవరెవరితోనో మాట్లాడాడు. మనసు తేలికపడింది. ఇక బయటికి వెళ్లి లంచ్ చేద్దాం అనుకుంటుండగా,
ఫోన్ మ్రోగింది. ఫోన్ ఎత్తాడు. పార్వతి నుండి..
‘‘ఇన్‌స్పెక్షన్ అయిపోయిందా? ఇంటి పనుల హడావుడిలో మీ అద్దాల గురించి పట్టించుకోలేదు. మీకు క్యారేజీ కట్టలేకపోయాను. మీరు వెళ్లిన తరువాత కింద వాటాలో ఉన్న రమ గారి దగ్గర నుండి గ్యాస్ సిలిండర్ తెప్పించాను. మళ్లీ ఫ్రెష్‌గా వంట చేసాను. మీకు ఇష్టమని పాలకూర పప్పు, బంగాళా దుంపల వేపుడు చేసాను. వడియాలు, అప్పడాలు వేయించాను. మన అపార్ట్‌మెంట్ వాచ్‌మెన్‌తో క్యారేజీ పంపించాను. బయట ఎక్కడా తినకండి. మీకు పడదు’’
ఆమె మాటలు వింటుంటే అతనికి కన్నీళ్లు వచ్చాయి. వాటిని ఆపుకుంటూ,
‘‘ఇన్‌స్పెక్షన్ వాళ్లు రాలేదు. ఇప్పుడు పని కూడా ఏమీ లేదు. క్యారేజీ రాగానే తింటాను.
అన్నట్లు మన మ్యారేజీ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్‌కు హాలు మాట్లాడాను. క్యాటరింగ్ కూడా మాట్లాడాను. అలాగే మన మ్యారేజీ డే కోసం, సాయంత్రం వస్తూ వస్తూ నీవు ఎప్పుడూ అడిగే షిపాన్ చీర కూడా తెస్తాను. అలాగే నీవు ఆ మధ్య ఒకసారి కన్హయ్యలాల్ షాప్‌లో పట్టీలు చూసి ‘‘బాగున్నాయి’’ అన్నావు కదా అవి కూడా పట్టుకొని వస్తాను.
అన్నట్లు పిల్లలు ఈ రోజు బయట పిచ్చి తిండి తిని వస్తారు.
ఇంటికి రాగానే ఏదైనా వేడివేడిగా మంచి టిఫిన్ చేసి పెట్టు’’ అన్నాడు.
‘‘ఇప్పుడు అవన్నీ ఎందుకండీ? డబ్బులు దండగ’’
‘‘పార్వతీ! ఈ రోజు లేచిన వేళావిశేషం బాగుంది. ఎందుకో ఎప్పుడు కలగని ఆలోచనలు ఈ రోజు నాలో కలిగాయి. నన్ను మారనివ్వు. ఆ ఆనందాన్ని నీతో, పిల్లలతో కలిసి సెలెబ్రేట్ చేసుకోనివ్వు’’
‘‘సెలెబ్రేషన్స్‌తో సంతోషపెట్టడం కాదు, వీలైతే నా ఎమోషన్స్ గుర్తించండి’’ అంది జీర గొంతుతో.
‘‘పార్వతీ ! ఐ స్వేర్. నో మోర్ అగ్రవేషన్. ఒన్లీ రొమాన్స్ అండ్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ లైఫ్’’ అన్నాడు ప్రేమగా.
అతని మాటలలోని నిజాయితీకి సంతోషిస్తూ, ‘‘మీరు ఇలా ఉంటే చాలు. నాకేమీ వద్దు. చేతిలో డబ్బులు ఉంటే మీరొక సూట్ కొనుక్కోండి. అన్నట్లు మీకు ఇష్టమని సాయంత్రానికి మంచూరియాకు సిద్ధం చేసాను. అన్నట్లు హాల్‌లో ల్యాండ్‌లైన్ దగ్గర్ ఒక బాక్స్, బెడ్‌రూమ్‌లో మంచం దగ్గర ఉన్న టేబుల్ దగ్గర ఒక బాక్స్ సిద్ధం చేసాను. బాక్స్‌ల పైన కళ్లద్దాలు అని పేపర్‌పై రాసి అతికించాను కూడా. మీ కళ్లద్దాలు ఇకపై అక్కడ పెట్టుకోండి. బాగా గుర్తు ఉంటాయి.’’
‘‘అలాగే’’ అని ఫోన్ పెట్టేసాడు.
‘‘సార్! అమ్మగారు క్యారేజీ పంపించారు’’ అంటూ వాచ్‌మెన్ రావడంతో క్యారేజీ అందుకోవడానికి కుర్చీలో నుండి లేచాడు ఉమాపతి, తనకు ఇంతకు ముందు పరిచయం లేని ప్రపంచాన్ని పరిచయం చేయడానికి కారణమైన కళ్లద్దాలను టేబుల్‌పైన జాగ్రత్తగా పెడుతూ..