– పి.వి.బి. శ్రీరామమూర్తి


పాలగిన్నె పట్టుకుని రోడ్డుమీద నిల్చుంది కర్రా సింహలు.

పాల చెంబులు బుట్టలో పెట్టుకుని అటుగా వెళుతున్న మజ్జి సూరమ్మ ‘‘ఏటమ్మా? పాలుగానీ కావాలా? ఏటలా నిలబడ్డారు?’’ అంది.

‘‘అవునే. రోజూ పాలకేన్‌వాడు రాడిక. వాడికి డబ్బులివ్వలేదని.. పాలు పోయలేనని వెళ్లిపోయాడు. పాలడబ్బా అయిపోయింది. తల్లి దగ్గర పాలు లేవు. మనవరాలు తెల్లవారుజాము నుండి ఏడుస్తోంది. ఏం చెయ్యాలో తోచటం లేదు’’ అంది దిగులుగా.

సూరమ్మ నికార్సయిన మనిషి. సమయానికి డబ్బులివ్వలేకపోతే వీధిన పెట్టేస్తుంది. అందుకే నోరువిడిచి అడగలేదు.

‘‘నానిత్తానివ్వండమ్మ’’ అని గడపలో బుట్ట దింపింది సూరమ్మ.

‘‘నా దగ్గర డబ్బుల్లేవే? పంతులుగారు వీధిలోకెళ్లటం లేదు. మాకు దిక్కుమాలిన మైళ్లొచ్చి పడ్డాయి’’ అంది.

‘‘ఏటయిందమ్మా?’’

‘‘ఏం చెప్పమంటావ్‌? ‌మా చిన్న బావగారు కాలం చేసారు. పదిరోజులు గడప దిగడానికి లేదు. శుద్ధి అవుతుందనుకున్న రోజునే మా చిన్నత్తగారు కాలం చేసారు. మళ్లీ పదిరోజులు. ఇవాళే స్నానాలు. అంతకు వారం రోజుల ముందు పంతులు గారికి జ్వరం. కాలు కదపలేకపోయారు. అన్నీ నిండుకున్నాయి’’ అని కళ్ల నీళ్లు పెట్టుకుంది.

‘‘తప్పమ్మా. శుక్కురోరం పూట కళ్ల నీల్లెట్టకు. నా నిత్తాన్లే పాలు. నీకాడున్నపుడియ్యి. రోజూ ఇత్తాన్లే. నానూ పిల్లల దాన్నే. కట్టాలు నాకూ తెలుసు. అవునుగానీ ఈ ‘జగన్‌’ 18,750 ‌రూపాయిలు ఇత్తాన్నాడట. బాబు ఎట్టలేదా కాయితం?’’

‘‘మేం బేమ్మలం కదా? మాకేదీ రాదే’’

‘‘ఆడికి బుద్ధిలేదేమి? డబ్బులేనోడు బేమ్మడేటి, కడజాతోడేటి? రేపొత్తాడంట. అడుగుతాను. నాకేటి బయ్యం? ఇదిగో సింహలమ్మా! ఇయి సిక్కని పాలు. నీళ్లు కలపనేదు. ఏమేనిబ్బందయితే మొగమాటపడకు. డబ్బులిత్తాను వడ్డీ వద్దులే’’ అని బుట్ట నెత్తిమీదకెత్తుకుని కదిలింది.

ఆమె ఒక దేవతలా కనిపించింది.

జపం చేసుకుని కూర్చున్న ఛయన్లు ‘‘సింహలూ! ఓ పిసరు కాఫీచుక్క పోస్తావేంటి’’ అన్నాడు.

‘‘కాఫీ పొడి నిన్నటికే వచ్చింది. ధనియాల కాఫీ పెట్టివ్వనా?’’ అంది.

‘‘ఏదో ఓటివ్వు. తాగేసలా వీధిలోకెళ్తాను.’’

అర్ధగంటలో ధనియాలు దంచి మరిగించి ధనియాల పొడితో కాఫీ చేసి ఇచ్చింది.

తాగేసి ‘‘నేనలా వీధిలో కెళ్లొస్తా. ఆ సంచీ, గొడుగూ పంచాంగం ఇయ్యి’’ అన్నాడు.

పంచాంగం, సంచీ, గొడుగూ ఇచ్చి ‘‘అన్నట్టు చెప్పటం మరిచాను. నారాయణమూర్తి గారు ఫోన్‌ ‌చేసారు. పేపరు చదవటానికి రావద్దన్నారు, మళ్లీ చెప్పిందాకా’’ అంది.

‘‘అయ్యో! ఈ మధ్య వెళ్లలేదని వద్దన్నాడేమో!’’

‘‘అన్నట్టు! ఎక్కడా టిఫిన్‌ ‌చెయ్యకండి గుడిపాటి గుర్రాజు గారింట్లో తద్దినం బోయినానికి చెప్పమని వెంకటేశం రెండుసార్లు ఫోన్చేశాడు. చెప్పటం మరిచాను!’’ అంది.

ఛయనులుకి ప్రాణం లేచొచ్చింది.

చేతిలో చిల్లి గవ్వ లేదెలాగా అనుకుంటున్నాడు. రాత్రల్లా జొరం. సింహలకి చెప్పలేదు. ఏదైతే అదే అవుతుంది. అవకాశం వదులుకోకూడదు. ‘అయిదొందలు!’ – అనుకుంటూ గడపదాటుతుండగా వెంకటేశం ఎదురయ్యాడు. ‘‘నీ దగ్గరకే వస్తున్నా’’ అన్నాడు.

‘‘చెప్పింది సింహలు. పన్నెండు గంటలక్కదా! వచ్చేస్తాను. గుర్రాజు గారిల్లు గురాచారి వీధి కదా!’’

‘‘చంపేశావు. ఇవాళ కాదు రేపు. సిస్టరు పొరపడ్డాది. ఇంకో ఎమర్జెన్సీ కాల్‌’’

‘‘ఇం‌కేమిటి?’’

‘‘రేపే మరో భోజనం పడ్దాది’’

‘‘ఒక రోజు రెండెలా?’’

‘‘గుర్రాజు గారింట్లో పన్నెండుకైపోతుంది. అక్కడ ఒంటిగంట దాటించేద్దాం. అలా మాట తీసుకున్నాను ఇద్దరి దగ్గరా!’’

‘‘తప్పు కదా?’’

‘‘అబద్ధపు పెళ్లికి ముడ్డి వాయిజ్యం. వాళ్లొకటి శ్రద్ధతో పెట్టేడుస్తున్నారేంటి? అయిదుగురన్నదమ్ములు తద్దినానికి తన్నుకోని చేద్దామా, వద్దా అని నిన్నటికి నిర్ణయానికొచ్చారు, ఆరొందలు కిస్తే!’’

‘‘సరే సరే’’

‘‘వస్తా మరిచిపోను’’

ఛయనులకి గొప్ప ఆనందంగా ఉంది.

రేపటికి జ్వరం కూడా తగ్గొచ్చు.

శర్మగారింటి ముందాగి ‘‘అమ్మా.. శ్రావణమాసం లక్ష్మీవారం, దశమి. పన్నెండు గంటల వరకూ వర్జ్యాలు లేవు’’ అన్నాడు.

ఎవరూ పలకలేదు. మళ్లీ అరిచాడు.

ఇంట్లోంచి ఒకామె వచ్చి ముఖానికి మాస్కుతో ‘కరోనా ఇప్పుడేం వెయ్యం వెళ్లండి!’ అంది. ఏ ఇంటికెళ్లినా అదేమాట. ఎవరూ తలుపు తియ్యలేదు.

ఛయనులు ఉదయం ఏడింటికి బయలుదేరి పదివరకూ ఇంటింటికి వెళ్లి దుర్ముహూర్తాలు, వర్జ్యాలు, తిథులు చెప్తాడు. రెండు సంచులు నిండుతాయి. కూరలు, పప్పు దినుసులు, ఒక వంద వరకూ డబ్బులూ దొరుకుతాయి. పది గంటలయ్యాక నారాయణమూర్తి గారింటికెళ్తాడు. ఆయనకు కనిపించదు. ఛయనులు పేపర్లు చదివి వినిపిస్తాడు. చిక్కటి ఫిల్టరు కాఫీ ఇస్తే తాగుతాడు. నెలకాయన అయిదొందలిస్తాడు. ఎందుకు రావద్దన్నాడో కనుక్కుందామని వెళ్తే వాచ్‌మెన్‌ ‌వెళ్లనివ్వలేదు. ‘‘కరోనా బాబూ! ఎవర్నీ పంపొద్దాన్నారయ్యగారు’’ అన్నాడు.

‘‘పోనీ ఓ సారి..’’

‘‘వద్దయ్యా! నన్ను దెబ్బలాడతారు’’ అన్నాడు.

ఛయనులుకేం తోచలేదు. ఛయనులు తొమ్మిది చదువుకున్నాడు. తండ్రి చదివించలేక పోయాడు. పౌరోహిత్యం నేర్చుకుందామంటే కుదరలేదు. వాళ్ల నాన్న వేగరం వడుగు చేసి భోజనానికి ఇబ్బంది లేకుండా తద్దినం భోజనాలకి పంపటం మొదలెట్టాడు. చిన్నప్పట్నించి ఉదయం ఇంటింటికి వెళ్లి పంచాంగం చెప్తాడు. మేనత్త కూతుర్ని చేసుకున్నాడు. సింహలు మంచి పిల్ల. భర్తని దేనికీ కష్టపెట్టలేదు. టవున్లోకి మకాం మార్చి వంటలు కెళ్లటం మొదలెట్టింది. ఒకే కూతురు. రెక్కాడితేనే డొక్కాడుతుంది. దీనికి తోడు ఛయనులు నాలుగైదు అపార్టుమెంటుల వాళ్లేపని చెప్పినా చేస్తే వాళ్లిచ్చిన డబ్బులతో రోజులు వెళ్లబుచ్చుతున్నాడు.

పోనీ –

అపార్ట్‌మెంట్లలో ఎవరైనా పనులు చెప్తే పైసా పరకా వస్తుందని వెళ్లబోతే ‘కరోనా’ కారణంగా ఎవరూ రావద్దన్నారు. పెళ్లానికీ ఏ పనీ లేదు!

రాత్రల్లా నిద్రపట్టలేదు.

రాత్రి మళ్లీ జ్వరం, దగ్గు. పెళ్లానికి చెప్పలేదు. తెల్లార్లేచి స్నానం చేసి, సంధ్యావందనం చేసుకున్నాడు. సింహలు టీ ఇస్తే తాగేసాడు. పదిగంటలకి వెంకటేశం బండి మీదొచ్చి తీసుకెళ్లాడు. డోలో 650 ఒకటి రహస్యంగా వేసుకున్నాడేమో – చెమటెక్కించింది. గుడిపాటి వారింటికెళ్లాడు. సాధారణంగా వాళ్లింట్లో రెండే! కానీ వెంకటేశం తొందర వల్ల వేగరం తెమిలారు. పెద్ద పంతులు అరటి ఆకులిచ్చి డొప్పలు చెయ్యమన్నాడు. ధర్బలిచ్చి విరవమన్నాడు. స్నానం చేసి వచ్చాడు. అగ్నిహోత్రం, మంత్రాలూ అయ్యేసరికి పదకొండున్నరయింది. భోజనాలకి కూర్చున్నారు. వడ్డనలు జరిగాయి. ఛయనులకి గాబరాగా ఉంది. వెంకటేశం జోకులేస్తున్నాడు. ‘ఏంటి ఛయన్లూ, మాట లేదు’ అంటున్నాడు పెద్ద పంతులు. ఏలాగో భోజనాలు ముగిసాయి. తాంబూలం పుచ్చుకున్నాడు. కళ్లు వెలిగాయి అయిదొందల రూపాయిల నోటుని చూసి.

వెంకటేశం తొందర పెట్టాడు పనుందని. అక్కణ్ణుంచి తిన్నగా వడ్డాది వాళ్లింట్లో వాలాడు. వాలిన దగ్గర్నుంచి హడావుడి పెట్టాడు. అయిదుగురన్నదమ్ములు కూర్చున్నారు మండపంలో. వాళ్లలో ఐక్యత ఏమో గానీ ఒకరి ముఖంలోనూ నవ్వులేదు. కార్యక్రమం అరగంటలో ముగిసింది. ఛయనులకి కడుపులో తిప్పుతోంది, చేస్తున్న తప్పు వల్లనో, ఒంట్లో జ్వరం వల్లనో. వడ్డన జరుగుతోంది. వెంకటేశం తినేస్తున్నాడు. ఛయనులకి ముద్ద నోట్లోకెళ్లటం లేదు. వాంతులు అవుతాయేమో భయంగా ఉంది. ‘భగవంతుడా! ఇంకెప్పుడూ తప్పు చేయను క్షమించు!’ అన్నాడు. ఆమె అరటిపండు వేసింది. ఛయనులు తినలేదు. మొత్తం మీద తిండయింది. దక్షిణ తాంబూలం ‘ఆరొందలు’ ఇచ్చారు, కాళ్లకి దణ్ణం పెట్టి. ఆశ్చర్యం. ఛయనులకి ఆకలేసింది.

వెంకటేశం ఛయనుల్ని బండి మీద ఇంటి వద్ద దిగబెట్టాడు. ఇంటికొచ్చేసరికి ఛయనులకి ఒంటిమీద తెలివిలేదు. ఆయాసం! నీరసం! కడుపులో మంట! గుండెలో దడ!

‘‘సింహలూ! గ్లాసుతో నీళ్లు పట్రా!’’

సింహలు వెళ్లింది. పదకొండు వందలూ పెళ్లాం కిద్దామని పట్టుకున్నాడు. సింహలూ నీళ్లు తెచ్చింది. ఛయనుల్లో తప్పు ఇమల్లేదు భళ్లుమన్నాడు. మంచం మీద పడిపోయాడు.

ఇల్లంతా గొల్లుమంది.

‘మా అవసరం నీకు మరి లేదు! అన్నట్లు ఛయన్లు చేతిలో నోట్లు గాలికి ఎగిరిపోతున్నాయి.

About Author

By editor

Twitter
YOUTUBE