పంజాబ్‌లో జాతీయ భావాలుగల రైతు సంఘాలు లేవని, అక్కడి రైతు నాయకులు వామపక్ష భావజాలంతో పనిచేస్తున్నారని, అందుకే నూతన వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ ఉద్యమం చేస్తున్నవారిలో ఆ రాష్ట్రానికి చెందిన రైతులే ఎక్కువగా ఉన్నారని స్వదేశీ జాగరణ్ మంచ్ అఖిల భారత సహ సంఘటనా కార్యదర్శి సతీష్ కుమార్ అన్నారు.
జాగృతి జరిపిన ముఖాముఖీలో సతీష్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా కొన్ని వామపక్ష రైతు సంఘాలు రైతులను తప్పుదారి పట్టించి ఈ ఉద్యమంలోకి నెడుతున్నాయని అన్నారు. వారి లక్ష్యం సమస్యను పరిష్కరించడం కాదని, కేంద్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడమేనని చెప్పారు. దేశద్రోహం కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తున్న వారిని విడుదల చేయాలని డిమాండ్ చేయడం వెనక మరో షాహిన్‌బాగ్ కుట్రలేదని కొట్టిపారేయలేమన్నారు. అంతేకాదు, రైతు ఉద్యమానికి కెనడా, యూకే, అస్ట్రేలియా ఇంకా ఇతర దేశాల నుండి కోట్లాది రూపాయలు అందుతున్నాయని కూడా సతీష్ ఆరోపించారు. పంజాబ్‌లోని దళారులు (మండీ ఏజెంట్లు) ఈ ఉద్యమానికి నిధులు సమకూరుస్తున్నారని కూడా చెప్పారు. ఢిల్లీకి చెందిన సతీష్ పంజాబ్ సహ ప్రాంత ప్రచారక్‌గా పనిచేశారు.
ముఖాముఖీ పూర్తి వివరాలు పాఠకుల కోసం..
భారతదేశంలో సాగులేని ప్రాంతం దాదాపు లేదు. కానీ, ఎన్‌డీఏ ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ సంస్కరణ చట్టాలకి పంజాబ్‌లోనే మొదట ఎందుకు నిరసన మొదలయింది? వీరు ప్రత్యేకంగా నష్టపోయేది ఏమైనా ఉందా?
రైతుల ఆదాయం 3 రెట్లు ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో మూడు ఆర్డినెన్స్‌లు ప్రవేశపెట్టింది. 2024కి ముందు రైతుల ఆదాయం రెట్టింపు కావాలని ఈ ప్రధానమైన మూడు చట్టాలను తీసుకొని వచ్చింది. కాని పంజాబ్‌లో, ముఖ్యంగా మాల్వా ప్రాంతంలో వీటిని తీవ్రంగా వ్యతిరేకించారు. దీనికి కారణం అక్కడ 32 రైతు సంఘాలు ఉన్నాయి. అందులో 14 సంస్థలు వామపక్ష భావజాలానికి చెందినవి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ మూడు చట్టాల వల్ల కనీస మద్దతు ధర రైతులకు లభించదు. ఇవి కేవలం భారీ పరిశ్రమలకు మేలు చేసేందుకే అని కమ్యూనిస్టు రైతు సంఘాల వారు విస్తృతంగా ప్రచారం చేశారు. అక్కడ జాతీయభావాలు గల రైతు సంఘాల ప్రభావం పెద్దగా లేదు. అందువల్ల వాళ్లు చెప్పిన విషయాలను సాధారణ ప్రజలు చాలా సులువుగా నిజమని నమ్మారు. ఉదాహరణకు ఒప్పంద వ్యవసాయం (కాంట్రాక్ట్ ఫార్మింగ్) గురించి, దీనివల్ల పెద్దసంస్థలు మీ భూమిని హస్తగతం చేసుకుంటాయని అపోహలు సృష్టించారు. నిజానికి ఈ ఒప్పందం కేవలం వ్యవసాయం గురించే తప్ప భూమికి సంబంధించింది కాదు. కానీ సాధారణ రైతులు ఈ చట్టాల వల్ల తమ భూమి ఇతరుల వశం అయిపోతుందని విశ్వసించారు. అంతేకాదు ఈ చట్టాల వల్ల కనీస మద్దతు ధర (msp) ఇచ్చే విధానం ఉపసంహరించు కోనున్నారని, వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీ (Agricultural produce market committee) లను రద్దు చేయనున్నారని ప్రచారం చేశారు. కేంద్ర ప్రభుత్వం దీనిపై చాలా స్పష్టంగా ప్రకటన ఇచ్చింది. స్వయంగా ప్రధానమంత్రి టీవీ చానళ్లలో, పార్లమెంట్‌లో కూడా రైతులకు భరోసా కల్పిస్తూ మాట్లాడారు. పంజాబ్‌లో జాతీయ భావాలు గల రైతు సంఘాల ప్రభావం లేకపోవడం వల్ల సాధారణ ప్రజలు వీరి మాటలను విశ్వసిస్తున్నారు. వాటి పరిణామాలనే నేడు మనం చూస్తున్నాం. ఇప్పుడు ఢిల్లీలో రైతుల పేరుతో ధర్ణాలు చేస్తున్న వారంతా వామపక్షవాదులే. అయితే హరియాణాలో కొంత భిన్నమైన వాతావరణం ఉంది. అక్కడ బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో జాతీయ భావాలు గల రైతు సంఘాల ప్రభావం కూడా అధికంగా ఉంది. దీనివల్ల అక్కడ ఈ ఉద్యమం ప్రభావం పెద్దగా లేదు. కానీ ఎంఎస్‌పిపై భారతీయ కిసాన్ సంఘ్ లిఖిత పూర్వకమైన హామిని కోరుతున్నది. ఏపీఎంసీని బలోపేతం చేయాలని డిమాండ్ చేసింది. ప్రభుత్వం వీటిని అంగీకరించింది. ఏపీఎంసీకి విధించే రుసుముకు సమానమైన పన్ను విధించాలని చెప్పింది. దాన్ని కూడా ప్రభుత్వం ఒప్పుకుంది. రైతులకు మేలు చేసే విధానాల అమలు, వారి అనుమానాలను నివృత్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించినప్పటికి కేవలం ఆ ప్రాంతానికి చెందిన రైతులు మాత్రమే ధర్ణా చేస్తున్నారు. అందుకు మరో కారణం ఉంది.
పంజాబ్‌లో అంతటా వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకత ఉన్నదా? లేకుంటే కేంద్రం తెచ్చిన మూడు చట్టాలు రైతులకు ప్రయోజనం చేకూరుస్తాయని నమ్మేవారు కూడా అక్కడ ఉన్నారా?
పంజాబ్‌లో మూడు ప్రధాన కేంద్రాలు ఉన్నాయి. అందులో అతి పెద్దది మాల్వా. ఈ ఉద్యమం మూల స్వరూపం అక్కడే ఉంది. రెండవది మాఝా, అమృతసర్ పరిసరాల్లోని ప్రాంతం. ఇక్కడ ప్రభావం కొంతమాత్రమే ఉంది. మూడోది దోబా ఈ ప్రాంతంలో ఉద్యమ ప్రభావం అసలు లేదు. కానీ ఈ చట్టాలను సమర్థిస్తూ ఎవరూ బయటకు రావడం లేదు.
ఎంఎస్ స్వామినాథన్ కమిటీ సిఫారసులు పరిగణనలోకి తీసుకోలేదని రైతు నాయకులు వాదించడంలో వాస్తవం ఎంత ?
చూడండి. నేను ప్రభుత్వ అధికార ప్రతినిధిని కాదు. కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వమే చెప్పాలి. కానీ స్వామినాథన్ రిపోర్టు ప్రకారం కనీస మద్దతు ధర (వీఱఅఱఎబఎ •బజూజూశీతీ• తీఱమీవ) ఒకటిన్నర రెట్లు అధికంగా ఇవ్వాలి. ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం దీన్ని అమలు చేస్తున్నది. అంటే స్వామినాథన్ చెప్పిన వాటిని యథాతథంగా అమలు పరుస్తున్నట్లే కదా!
ఆందోళనకు దిగిన వారి వైఖరి, దీనిని సమర్థిస్తున్నవారి ధోరణి చూస్తుంటే భారతీయ సేద్యంలో యథాతథస్థితి కొనసాగాలన్న తిరోగమన పంథాయే కనిపించడం లేదా ?
ఉద్యమం చేస్తున్నవారు ఈ చట్టాలవల్ల ఉపయోగంలేదని భావిస్తున్నారు. గతంలో ఉన్న వ్యవసాయ చట్టాలే కొనసాగాలని వారు కోరుకుంటు న్నారు. వాస్తవానికి ప్రస్తుత పరిస్థితులేవి రైతులకు మేలు చేసేవిగా లేవు. కానీ రైతు సంఘాల నేతలు ఈ మార్పులు అమలు జరగాలని కోరుకోవడం లేదు. మాకు అవసరం లేని చట్టాలు చేయడానికి మీరెవరని అర్థంలేని వాదన ముందుకు తెస్తున్నారు.
గతంలో ఇవే సంస్కరణలు తెస్తామని ఎన్నికల ప్రణాళికలలో పేర్కొన్నవారే ఇప్పుడు ఎన్‌డిఏ వాటికి చట్టరూపం ఇస్తే వ్యతిరేకిస్తున్నారని మోదీ చెబు తున్నారు. రైతులు ఈ అంశం గ్రహించలేక పోతున్నారా?
అకాలీదళ్, కాంగ్రెస్, ఆప్ ఈ మూడు పార్టీలు తమ ఎన్నికల ప్రణాళికలో (మ్యెనిఫెస్టో) రైతు చట్టాల సవరణలు జరగాలని ప్రస్తావించాయి. ఈ చట్టాల రూపకల్పన కోసం కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీలో పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్, కాంగ్రెస్ నేత, హరియాణా మాజీ ముఖ్యమంత్రి భూపేంద్ర సింగ్ హుడా, అకాలీదళ్ పార్టీ నుండి నాటి కేంద్రమంత్రి హర్ సిమ్రత్ కౌర్ కూడా ఉన్నారు. చట్టాలు ప్రవేశపెట్టే సమయంలో ఎవరూ వీటిని వ్యతిరేకించలేదు. ఆప్ బహిరంగంగా మద్దతు తెలిపింది. వామపక్ష సంఘాలు ఉద్యమం లేవనెత్తగానే అకాలీదళ్ మద్దతు ఉపసంహరించుకుంది. వారితో కాంగ్రెస్ జతకట్టింది. ఇక ఆప్ ఆ రెండు పార్టీలు అటువైపు ఉంటే తన ఓటుబ్యాంకు ఎక్కడ జారిపోతుందో అని భయంతో ప్లేటు ఫిరాయించింది. వాస్తవానికి అకాలీదళ్ కేందప్రభుత్వంలో భాగస్వామి. చట్టాల రూపకల్పలనలో పాలుపంచుకొంది. కానీ ఉద్యమం మొదలయిన పది పదిహేను రోజుల తర్వాత కేంద్రమంత్రి పదవికి హర్ సిమ్రత్ కౌర్ రాజీనామా చేశారు. ఇది కేవలం ఓటుబ్యాంకు రాజకీయమని స్పష్టం అవుతుంది.
పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ రైతులను రెచ్చగొట్టి, తరువాత వెనక్కి తగ్గడం వెనుక ఆ పార్టీ కేంద్ర అధిష్టానం ఉన్నదని చెప్పవచ్చునా?
నిజమే, ఆయన ప్రకటనలు ప్రదర్శనకారులను రెచ్చగొట్టే విధంగానే సాగాయి. ఎప్పుడైతే పరిస్థితి చేయిదాటిపోయి శాంతిభద్రతల సమస్య తలెత్తిందో అప్పుడు ఆయన కొంత మెత్తబడ్డారు. రైతు ఉద్యమం కొన్ని రోజులపాటు ఉంటుంది. ఆతర్వాత సర్దుకుంటుంది. వారివైపు ఉన్నాడు కనుక రైతుల ఓట్లు తన పక్షానే ఉంటాయని భావించారు. కానీ అలా జరగలేదు. పరిస్థితి దారుణంగా మారింది. అందులో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. దీంతో మరొరకంగా ప్రకటనలు ఇచ్చారు. రోడ్లు, రైలు, రవాణా సౌకర్యాలకు ఇబ్బందులు కల్గించరాదని విజ్ఞప్తి చేశారు. కేందప్రభుత్వం రైతులను ఢిల్లీకి పిలిపించి చర్చలు జరపాలని కోరారు. ఒక్కసారిగా అమరీందర్ సింగ్ తన వైఖరిని మార్చుకోక తప్పలేదు.
మద్దతు ధర (ఎంఎస్‌పి) గురించి లిఖిత పూర్వకంగా రాసి ఇస్తామని కేంద్రం చెప్పినా రైతులు ఆందోళన ఆపడం లేదు ఎందుకు ?
ఉద్యమ ప్రారంభంలో రైతులు రెండు నెలల పాటు ఎంఎస్‌పి శాశ్వతంగా ఉంటుందని లిఖిత పూర్వకంగా రాసి ఇవ్వండి చాలు అన్నరీతిలో మాట్లాడారు. ఆ తర్వాత ఏపీఎంసీ ఉంటుందని కూడా రాసి ఇవ్వమన్నారు. అనంతరం మరికొన్ని డిమాండ్లు ముందుకొచ్చాయి. పంటలు పండించిన తర్వాత మిగిలిపోయే వ్యర్ధాలు కాలిస్తే పర్యావరణం కలుషితం అవుతుంది. దానివల్ల ఉత్తరభారత ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతారు. అందుకు ప్రభుత్వం ఐదువేల రూపాయలు జరిమానా విధిస్తుంది. దాన్ని తొలగించమన్నారు. అలాంటి ఐదారు షరతులు విధించారు. వీటికి ప్రభుత్వం ఒప్పుకోలేదు. కానీ ఎప్పుడైతే ఈ ఉద్యమం ఢిల్లీ వరకు వచ్చిందో అప్పుడు ప్రభుత్వం ఈ ప్రతిష్టంభన తొలగించాలనుకుంది. వారి షరుతులకనుగుణంగా లిఖిత పూర్వకంగా రాసి ఇచ్చేందుకు అంగీకరించింది. ప్రభుత్వం కొంత తగ్గగానే వామపక్ష భావజాలంతో నడిచే ఈ సంఘాలవారు మరిన్ని డిమాండ్లు ముందుకు తెచ్చారు. వారి లక్ష్యం సమస్యను పరిష్కరించడం కాదు. ప్రభుత్వాన్ని మరింత ఇరకాటంలో పెట్టడమే. ప్రభుత్వంపట్ల వ్యతిరేకత, అసంతృప్తిని రగల్చడమే వామపక్షవాదుల ఏకైక ఎజెండా. అందుకు తగ్గట్లుగా ఈ ఉద్యమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ రైతుల పేరుతో జరుగుతున్న ఉద్యమాన్ని మరింత సమస్యాత్మకంగా తయారు చేస్తూ అదనంగా కొత్త డిమాండ్లు చేరుస్తున్నారు. ఇప్పుడు ఏకంగా ఈ చట్టాలను రద్దుచేయమని డిమాండ్ చేస్తున్నారు.
చర్చల పక్రియకు రైతులు సుముఖంగా ఉన్నారా? అదే నిజమైతే అవును లేదా కాదు అని మాత్రమే చెప్పాలంటూ కేంద్రానికి ఆంక్షలు ఎందుకు విధిస్తున్నారు?
వారికి బిల్లులో ఉన్న లోపాలు తొలగించి సవరణ చేయాలనే ఉద్దేశం లేదు. ప్రభుత్వం అందుకు సిద్ధంగా ఉన్నప్పటికి వారి ఉద్దేశం మరొరకంగా ఉంది. గతంలో ఉన్న డిమాండ్ల కంటే మరిన్ని పెంచు తున్నారు. ఇప్పుడు ఏకంగా చట్టాలనే రద్దుచేయమని కోరుతున్నారు.
చట్టాలలోని రైతు సంక్షేమం గురించి దేశ ప్రజలకు తెలియచేయడంలో కేంద్రం, బీజేపీ, ఇతర మిత్రపక్షాల వైఫల్యం ఉన్నదా?
దేశవ్యాప్తంగా వీటి పట్ల వ్యతిరేకత లేదు. ప్రదర్శనలు జరగడం లేదు. కేవలం పంజాబ్‌లో ఒకభాగం, హరియాణా, ఉత్తరప్రదేశ్‌లో మారుమూల ప్రాంతంలో మాత్రమే కొంత ప్రభావం ఉంది. దేశంలోని ప్రజలందరికి ఈ ఉద్యమం గురించి తెలుస్తోంది. ఈ ప్రదర్శనకారులు రెండుమార్లు దేశ వ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చారు. కానీ దాని ప్రభావం ఎక్కడా కనిపించలేదు. టోల్ గేట్లు మూసివేతకు పూనుకున్నారు. కానీ ఎవరూ స్పందించలేదు. అవి యథాతథంగా నడుస్తున్నాయి. రైల్వే బంద్ జరపాలను కున్నారు. అక్కడా విఫలమయ్యారు. జనజీవనాన్ని ప్రభావితం చేసే రంగాల బంద్‌కు మద్దతు కూడగట్ట లేకపోయారు. వారు ఢిల్లీ ప్రజల సానుభూతిని కూడా పొందలేకపోతున్నారు. ప్రదర్శనకారులకు ఆహార సామాగ్రి కేవలం పంజాబ్‌లోని ఆ ఒకప్రాంతం నుండి వస్తోంది. మిగితా చోట్ల నుండి కనీస పలకరింపులు లేవు. కానీ కెనాడా, యూకే, అస్ట్రేలియా, ఇతర విదేశాల నుండి కోట్లాది రూపాయలు ఈ ఉద్యమం నిర్వహించేందుకు పుష్కలంగా అందు తున్నాయి. వాటి కారణంగానే ఈ ఉద్యమం నడుస్తోంది.
పంజాబ్‌లో బాదల్ కుటుంబం, మహారాష్ట్రలో శరద్‌పవార్ వంటి వారికి, వారి కుటుంబాలకి అయాచితంగా వచ్చే కమీషన్లు ఈ చట్టంతో పోతాయన్న అక్కసుతోనే మద్దతు ఇస్తున్నారన్న అభిప్రాయం మాటేమిటి?
లేదు. ఆ కుటుంబాలకు ఎటువంటి కమీషన్లు అందడం లేదు. ఆ అభిప్రాయం పూర్తిగా నిరాధారమైంది.
మరి ఎందుకని రైతు ఉద్యమాలను ప్రోత్సహి స్తున్నారు? ఇటీవల ఈ రెండు కుటుంబాలకు చెందిన వ్యక్తులకు అనేక కమీషన్లు అందినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
ఇవి నిజం కాదంటారా ?
బాదల్, పవార్ రెండు కుటుంబాలు అవినీతికి పెట్టింది పేరు. కానీ వారికి నేరుగా రైతు సంఘాల నుండి కమీషన్లు చేరుతున్నాయని చెప్పడానికి అవకాశం లేదు. అటువంటి వ్యవస్థ కూడా లేదు. రైతులందరూ వ్యతిరేక ర్యాలీలు నిర్వహిస్తుంటే వీరు మౌనంగా ఉంటే వారి ఓటు బ్యాంకు దెబ్బతింటుంది కదా. అందుకే ఈ ఉద్యమానికి మద్దతుగా నిలుస్తున్నారు.
ఢిల్లీ సరిహద్దులలో, నగరంలో ఆందోళనలో ఉన్నది నిజమైన రైతులు కాదన్న అభిప్రాయం ఉంది. అక్కడ ఆందోళన చేస్తున్నవారు దళారులేనని అంటున్నారు. ఇది నిజమేనా?
పంజాబ్‌లోని దళారులు (మండీ ఏజెంట్లు) ఈ ఉద్యమానికి నిధులు సమకూరుస్తున్నారు. వారు ఈ పరిస్థితి ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నారు. అయితే ఉద్యమంలో అత్యధికులు రైతులే ఉన్నారు. కాని వారంతా వామపక్ష భావజాలం, ఖలిస్తానీ అనుకూలవాదులు. సమస్య పరిష్కారం దిశగా ఆలోచించేవారు అందులో ఎవరూ లేరు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్లో అసంతృప్తిని రగల్చడమే వామపక్షవాదుల మూల సూత్రం. రతన్ సింగ్ ఉగ్రహా ఈ రైతు ఉద్యమానికి ముఖ్య నేత మార్క్సిస్టువాది. డాక్టర్ దర్శన్ పాల్ సింగ్ బీమాకోరేగావ్ కుట్రకేసులో అభియోగం ఎదుర్కొంటున్న వ్యక్తి, మూడవ నేత రజోవాన్ ఇతను కూడా మార్క్సిస్టువాది. ఈ ముగ్గురు వామపక్షనేతలు రైతు ఉద్యమంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. వాస్తవానికి మొత్తం ముఫ్పైరెండు మంది కీలక నేతల్లో పద్నాలుగు, పదిహేనుమంది వామపక్షవాదులే ఉన్నారు.
సోషల్ మీడియాలో ఉద్యమంలో రైతులు ఎవరు లేరు అనే వదంతులు వినిపిస్తున్నాయి కదా!
రైతులు ఎనభై శాతం వరకు ఉండొచ్చు. మిగితావారంతా ఒప్పంద కార్మికులు, రైతుకూలీలు ఉన్నారు. వారు పొలంలో లేదా మరెక్కడ పని చేసినా రోజువారి కూలి వస్తే చాలనుకుంటారు. అలాంటి వారు కూడా ఉద్యమంలో ఉన్నారు.
గతంలో అనేకమంది రైతులు ఆత్మహత్యలు చేసుకొన్నారు. వాటి గురించి ఎవరూ ఉద్యమించ లేదు. కానీ నేడు ఈ ధర్ణాలు నిర్వహించడం ఎంతవరకు సబబు అంటారు.
రైతు ఉద్యమనేత రతన్ సింగ్ ఉగ్రహా మాకు ఈ రైతు చట్టాల అవసరమే లేదు. గతంలో ఉన్న చట్టాలే చాలు అంటూ ప్రకటించారు. నిజమే గతంలో ఉన్న చట్టాలు ప్రయోజనం కలిగించేవే అయితే రైతులు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన అవసరం ఏముంది? మహారాష్ట్ర (విదర్భ) తర్వాత అత్యధికంగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న రాష్ట్రం పంజాబ్. కానీ అప్పుడు ఈ నాయకులు నోరు మెదపలేదు. దీనిని బట్టి ఈ ఉద్యమం వెనక ఎవరున్నారో అర్థం చేసుకోవచ్చు.
మరొక షాహిన్‌బాగ్‌ను తయారు చేసేందుకు యత్నిస్తున్నారన్న ఆరోపణలు ఇప్పుడు నిజమయినట్టే ఉన్నాయి ? వీటి వెనుక ఎవరు ఉన్నారు ?
షాహిన్‌బాగ్ పరిణామాలే నేడు పునరావృతం అవుతున్నాయనడంలో ఎటువంటి సందేహం అక్కరలేదు. కేంద్ర ప్రభుత్వం రైతులు చెప్పిన డిమాండ్లు తీర్చడానికి సిద్ధంగా ఉంది. అలాంట ప్పుడు పోరాటం చేయవలసిన అవసరం ఏముంది? కానీ ఇది వారికి ఇష్టం లేదు. సమస్య అలాగే ఉండాలని కోరుకుంటున్నారు. అంతేకాదు వారి డిమాండ్లు చాలా విచిత్రంగా ఉన్నాయి. గతంలో దేశద్రోహ కేసుల్లో ఇరుక్కొని జైలు శిక్ష అనుభవిస్తున్న వారిని కూడా విడుదల చేయాలని రెండు యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి. భింద్రెకవాలె, ఖలిస్తానీ అనుకూలవాదులు తమ చిహ్నాలను ఈ ఉద్యమంలో బహిరంగంగా ప్రదర్శిస్తున్నారు. వీరంతా పంజాబ్ లోని మాల్వా ప్రాంతానికి చెందినవారే. ఈ ప్రాంతంలోని వారంతా సంపన్న రైతులు. పైగా విదేశీ ధన సహాయం అందుతోంది. కాబట్టి ఎన్ని రోజులైనా రోడ్డుమీద బైఠాయించి ధర్ణాలు చేయగలరు. ఎనిమిది మంది పార్లమెంటు సభ్యులు మాల్వా ప్రాంతం నుండి ఎన్నికవుతున్నారు.
ఖలిస్తాన్‌వాదులు, వామపక్ష ఉగ్రవాదులు అంటే అర్బన్ నక్సల్స్, తమిళ ప్రాంతం నుంచి వేర్పాటు వాదులు రైతు ఆందోళనను దారి మళ్లించారన్న ఆరోపణ బలంగా ఉంది. దీనిని రైతులు గుర్తించారా లేదా?
సాధారణ ప్రజల మనసులో నేడు ఈ బిల్లు కారణంగా మా భూమి లాక్కుంటారు అనే భ్రమ వ్యాపించి ఉంది. మాకు మద్దతు ధర లభించదు. పండిన పంటను రోడ్లపై పారేయాలి లేదా పారిశ్రామిక వర్గాలు దోపిడిచేసి దోచుకుంటాయి. అనే దుష్ప్రచారం విస్తృతంగా వ్యాపించింది. వాస్తవ విషయాలను ఇప్పుడిప్పుడే రైతులు అర్థం చేసుకొంటున్నారు.
ఈ ఉద్యమం ఇంకా పెరుగుతుందా ? తగ్గుతుందా ?
లేదు.. ఈ ఉద్యమం ఇంకా పెరగకపోవచ్చు. అలా అని వెంటనే తగ్గుతుందని కూడా చెప్పలేం. వారు ఆశించిన రీతిలో ఉద్యమం ఉగ్రరూపం దాల్చడంలేదు. రెండు మార్లు బంద్‌కు పిలుపు నిచ్చారు. సరైన స్పందన రాలేదు. టోల్‌గేట్ల వ్యవహారం అపహాస్యం పాలైంది. హరియాణాలో ఎంఎల్‌ఏలు మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని చెప్పారు. అదీ జరగలేదు. రాబోయే రోజుల్లో ఈ ఉద్యమానికి ప్రజామద్దతు తగ్గుతుంది. రాష్ట్రాలవారిగా రైతులు కూడా ఆసక్తి కనబరచకపోవచ్చు. కానీ ఉద్యమం మాత్రం అప్పుడే సమాప్తం కాదు. ఎందుకంటే దీన్ని నిర్వహిస్తున్న వారంతా పిడివాదులని చెప్పవచ్చు. షాహిన్‌బాగ్ వలె ఈ ఉద్యమాన్ని పొడగించాలనే మొండి వైఖరి వారిలో స్పష్టంగా కనిపిస్తుంది.