కరోనా మహమ్మారి మళ్లీ కలకలం రేపుతోంది. ఇటీవల కాలంలో కాస్త తగ్గిందని యావత్ మానవాళి ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో కొత్తగా వ్యాప్తిలోకి వచ్చిన బ్రిటన్ తరహా కొత్త కరోనా (స్ట్రెయిన్)తో ప్రపంచం వణుకుతోంది. ఇది ఏ విపరీత పరిణామాలకు దారితీస్తుందోనని ఆందోళన చెందుతోంది. ఇప్పటికే కరోనా ప్రపంచవ్యాప్తంగా 18 లక్షల మందికి పైగా ప్రజలను పొట్టన పెట్టుకుంది. నేటికీ అమెరికా, బ్రిటన్, దక్షిణాఫ్రికా వంటి దేశాలలో మరణ మృదంగం మోగిస్తోంది. ఇప్పటివరకు డెన్మార్క్, నెదర్లాండ్స్, ఇటలీ, స్పెయిన్, కెనడా, జపాన్, స్వీడన్, జర్మనీ, లెబనాన్, సింగపూర్, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో కొత్తరకం కరోనా కేసులను గుర్తించారు. ఆయా దేశాల్లో వైద్యశాలల్లో చేరే వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. పాతదానితో పోలిస్తే కొత్తరకం వైరస్ 70 శాతం వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉంది. దీంతో భారత్ సహా పలు దేశాలు అప్రమత్తమయ్యాయి. అనేక ముందు జాగ్రత్త చర్యలతో మహమ్మారిని ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధమయ్యాయి. ముఖ్యంగా నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర సర్కారు అనేక ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టింది.
నవంబరు 25 నుంచి డిసెంబరు 23 వరకు భారత్‌కు చేరుకున్న దాదాపు 33 వేల మంది ప్రయాణికులకు విమానాశ్రయాల్లోనే కరోనా పరీక్షలు నిర్వహించింది. వీరిలో 114 మందికి పాజిటివ్‌గా తేలింది. కొత్తరకం కరోనాను ఎదుర్కొనే విషయమై కొవిడ్-19 నేషనల్ టాస్క్ ఫోర్స్ కీలక సమావేశం నిర్వహించి సమీక్షించింది. కొత్త వైరస్‌ను గుర్తించడం, వ్యాప్తిని అడ్డుకోవడం, పరీక్షలు, చికిత్సా విధానంలో మార్పులు తదితర అంశాలపై లోతుగా చర్చించింది. ఇందుకోసం ప్రత్యేకంగా నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ఆధ్వర్యంలో జన్యు పర్యవేక్షణ కన్సార్టి యమ్‌ను ఏర్పాటు చేసింది. కొత్త వైరస్‌ను సమర్థంగా ఎదుర్కోగలమని, ప్రస్తుత చికిత్సా విధానంలో మార్పులు అక్కర్లేదని నేషనల్ టాస్క్ ఫోర్స్ పేర్కొంది. మరోపక్క మహారాష్ట్ర, కేరళ, ఢిల్లీ తదితర రాష్ట్రాల్లో కొత్త కేసులు వెలుగు చూస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.
ఈ సమయంలో కొవిడ్ తక్షణ నివారణ చర్యల్లో భాగంగా హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్ తయారు చేసిన కొవాగ్జిన్, పుణెలోని సీరం సంస్థ తయారుచేసిన కొవిషీల్డ్ టీకా అత్యవసర వినియోగా నికి భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ) అనుమతి ఇవ్వడం హర్షించదగ్గ పరిణామం. ఈ టీకాలను అత్యవసర పరిస్థితుల్లో, షరతులతో కూడిన వినియోగానికి మాత్రమే అనుమతి ఇచ్చారు. క్యాడిలా హెల్త్ కేర్ సంస్థ వ్యాక్సిన్‌పై మూడోదశ క్లినికల్ ప్రయోగాల నిర్వహణకూ అనుమతి ఇవ్వడం తాజా పరిణామం. దేశవ్యాప్తంగా కొవిడ్ సన్నాహక వ్యాక్సిన్ ట్రయల్ రన్ (డ్రై రన్) విజయవంతం చేసేందుకు కేంద్రం అనేక చర్యలు తీసుకుంది. నాలుగు రాష్ట్రా ల్లోని రెండేసి జిల్లాల్లో ఎంపిక చేసిన వారికి టీకాలను అందజేసేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. దేశవ్యాప్తంగా గల దాదాపు 29 వేల కోల్డ్ చైన్ కేంద్రాల్లోని సుమారు 86 వేల శీతల ఉపకరణాల్లో వ్యాక్సిన్లను భద్రపరుస్తారు. దీనిని విజయవంతం చేసేందుకు 23 మంత్రిత్వ శాఖలు సమన్వయంతో పని చేస్తున్నాయి. 681 జిల్లాల్లో సుమారు 50వేల మంది సిబ్బందికి శిక్షణ పూర్తయింది. 1994లో పల్స్ పోలియోను విజయవంతం చేసిన తీరులో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, ఇందులో ప్రజలను భాగస్వాములను చేయాలని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్దన్ పిలుపునిచ్చారు. కరోనాపై ముందుండి పోరాడిన వారు దాదాపు రెండు కోట్ల మంది ఉంటారని అంచనా. 50 సంవత్సరాలు పైబడిన వారు, అంతకంటే చిన్న వయసున్న వారైనా దీర్ఘకాల జబ్బులు ఉన్నవారు 28 కోట్ల మంది ఉంటారని అంచనా. టీకా పంపిణీలో వీరికి ముందుగా ప్రాధాన్యం ఇస్తారు. వ్యాక్సినేషన్ కార్యక్రమం 2023 వరకు కొనసాగుతుందని భావిస్తున్నారు. వ్యాక్సిన్ సరఫరాకు 35 కోట్ల సూదులు, టీకా సీసాల కొనుగోలు కోసం కేంద్రం ఆర్డర్లు ఇచ్చింది. ఇంతకు ముందిచ్చిన 23 కోట్ల సిరంజిల కొనుగోలు ఆర్డర్లకు ఇది అదనం. మొత్తం 58 కోట్ల డోసుల టీకా పంపిణీకి చర్యలు చేపట్టారు. తొలిదశలో 30 కోట్ల మందికి టీకాలు వేస్తారు. ఇందుకోసం ఆటో డిజేబుల్డ్ సిరంజిలను వినియో గిస్తారు. అవి చాలకపోతే సాధారణ సిరంజిలను వాడతారు. 2.40 కోట్ల చిన్నారులకు రకరకాల వ్యాక్సిన్లు ఇచ్చేందుకు సుమారు 30 కోట్ల సిరంజిలను సిద్ధం చేస్తున్నారు. ఔషధ పరికరాల తయారీ దిగ్గజ సంస్థ హిందుస్తాన్ సిరంజెస్ అండ్ మెడికల్ డివైజెస్‌కు కేంద్ర సర్కారు మూడు ఆర్డర్లు ఇచ్చింది. 17.70 కోట్ల సిరంజీలను ఇది అందించనుంది.
టీకాల తయారీకి దేశంలోని వివిధ బయోటెక్ సంస్థలు గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. కొవిడ్ టీకా కొవాగ్జిన్ తయారీలో హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ సంస్థ భారత్ బయోటెక్ చేపట్టిన క్లినికల్ పరీక్షలు విజయవంతమయ్యాయి. మొదటి రెండు దశలు విజయవంతమయ్యాయి. తాజాగా కీలకమైన మూడోదశ కొనసాగుతోంది. కొవాగ్జిన్ మొదటి దశ పరీక్షలు గత ఏడాది జులైలో ప్రారంభమయ్యాయి, రెండోదశను అక్టోబరు మొదటి వారంలో ప్రారంభిం చారు. ఈ రెండింటిలో మంచి ఫలితాలు రావడంతో మూడోదశకు ముందుకు సాగుతోంది. వచ్చే రెండు నెలల్లో ఈ పరీక్షలు పూర్తయ్యే అవకాశం ఉంది. కరోనా వైరస్ పరివర్తన చెందినప్పటికీ తాము తయారుచేసే కొవాగ్జిన్ రక్షణ కల్పిస్తుందని భారత్ బయోటెక్ భరోసా ఇస్తుంది. టీకా అభివృద్ధి, తయారీ నిమిత్తం హైదరాబాద్‌కు చెందిన బయలాజికల్ ఇ- లిమిటెడ్ నార్వే కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న సీఈపీఐ (కొయిలేషన్ ఫర్ ఎపిడమిక్ ప్రిపేర్డ్ నెస్, ఇన్నొవేషన్స్) తో ఒప్పందం కుదుర్చుకుంది. దాదాపు పది కోట్ల డోసుల తయారీకి అవసరమైన ఆర్థిక సాయాన్ని బయోలాజికల్ ఇ-లిమిటెడ్‌కు నార్వే సంస్థ అందజేస్తుంది. బయోలాజికల్ సంస్థ చేపట్టిన మొదటి, రెండో దశ క్లినికల్ పరీక్షల ఫలితాలు త్వరలో వెల్లడి కానున్నాయి. పుణెలోని సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా, జైడెస్ క్యాడిలా సంస్థలు టీకా కోసం అహర్నిశలు పని చేస్తున్నాయి. తమ వ్యాక్సిన్ తొలి, రెండో దశ ప్రయోగాలను విజయ వంతంగా పూర్తి చేశామని, మూడోదశ ప్రయోగాలకు అనుమతులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరినట్లు క్యాడిలా సంస్థ తాజాగా వెల్లడించింది. అనుమతి లభించాక 30వేల మందిపై ప్రయోగాలు నిర్వహించేందుకు సన్నద్ధమవుతోంది. టీకా తయారీకి అమెరికాలోని న్యూయార్క్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న యునైటెడ్ బయో మెడికల్ ఇంక్ అనే సంస్థకు అనుబంధ సంస్థ అయిన కొవాక్స్‌తో హైదరాబాద్‌కు చెందిన అరబిందో ఫార్మా ఒప్పందం కుదుర్చుకుంది. టీకాపై ప్రస్తుతం మొదటిదశ ప్రయోగాలు పూర్తయ్యాయి. రెండు, మూడు దశల ప్రయోగాలను ఈఏడాది తొలి మూడు నెలల్లో అమెరికా, లాటిన్ అమెరికా, ఆసియా దేశాల్లో నిర్వహించాలని సంస్థ భావిస్తోంది. బ్రెజిల్, ఈక్వెడార్, పెరూ తదితర దేశాలకు 14 కోట్ల డోసులను సరఫరా చేసేందుకు కొవాక్స్ సంస్థ ఒప్పందాలు కుదుర్చుకుంది.
ప్రస్తుతం దేశ, విదేశాల్లో తయారవుతున్న టీకాలు బ్రిటన్, దక్షిణాఫ్రికాల్లో కనిపించిన కొత్తరకం కరోనా వైరస్ స్ట్రెయిన్ పైనా పని చేస్తాయి. ఈ విషయంలో ఎవరూ ఎలాంటి ఆందోళనా చెందాల్సిన అవసరం లేదని కేందప్రభుత్వ శాస్త్ర సాంకేతిక ముఖ్య సలహాదారు విజయ్ రాఘవన్ వెల్లడించారు. బ్రిటన్‌లో వెలుగుచూసి ప్రస్తుతం యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కొత్తరకం కరోనా వైరస్ ఇతర వైరస్‌ల కంటే 71శాతం వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉన్న మాట వాస్తవమే. అయితే అదే సమయంలో రోగులపై దాని ప్రభావం తక్కువేనని హైదరాబాద్ లోని సీసీఎంబీ (సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ) సంస్థ సంచాలకులు రాకేశ్ మిశ్రా వెల్లడించారు. బ్రిటన్ నుంచి వచ్చిన కొందరు ప్రయాణికుల నమూనాల్లో ఉన్నది కొత్త వైరసేనని పరిశోనధన సంస్థలు వెల్లడించాయి. అయితే ముప్పు లేనప్పటికీ కరోనా విషయంలో జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి అని రాకేష్ మిశ్రా స్పష్టం చేశారు. ఆయన వెల్లడి చేసిన ఈ అంశం ప్రభుత్వ వర్గాలకు, ప్రజలకు ఎంతో ఉపశమనాన్ని ఇచ్చింది. టీకాల నిల్వ, సరఫరా కోసం అత్యంత శీతల ఉష్ణోగ్రత (70 డిగ్రీల సెల్సియస్) సదుపాయం గల రిఫ్రిజిరేటర్లను ఆవిష్క రించేందుకు గోద్రెజ్ సంస్థ సన్నాహాలు చేస్తోంది. ఫైజర్ కొవిడ్ టీకా నిల్వకు 70 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత అవసరం. వీటి తయారీ పరీక్షల దశలో ఉంది. ప్రస్తుతం 20 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత కలిగే రిఫ్రిజిరేటర్లను సంస్థ తయారు చేస్తోంది. ఒకపక్క నివారణ చర్యలు చేపడుతూనే మరో పక్క కరోనా పట్ల ఉదాసీనంగా వ్యవహరించే ప్రజలకు ప్రభుత్వాలు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. ప్రజలకు అవగాహన కలిగించడంతో పాటు మాస్కులు ధరించని వారి నుంచి జరిమానాలు కూడా వసూలు చేస్తున్నాయి. గుజరాత్ సర్కారు జరిమానాల రూపంలో ప్రజల నుంచి దాదాపు రూ.115 కోట్లు వసూలు చేసింది. ఇటీవల హైకోర్టుకు సమర్పించిన నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. ఒకపక్క వ్యాక్సిన్ తయారీని ముమ్మరం చేస్తూనే మరోపక్క కేంద్రం పకడ్బందీ నివారణ చర్యలను చేపట్టింది. ముందుగా అంతర్జాతీయ విమానాల రాకపోకలపై ఈ నెలాఖరు వరకు నిషేధాన్ని విధించింది. బ్రిటన్ నుంచి విమానాల రాకపోకలపై డిసెంబరు 22 నుంచే నిషేధాన్ని విధించింది. అయితే పరిస్థితిని బట్టి కొన్ని ఎంపిక చేసిన మార్గాల్లో అనుమతులు ఇస్తుంది.
హైదరాబాద్ నుంచి టీకా సరఫరాకు ఏర్పాట్లు
హైదరాబాద్‌లోని జీఎంఆర్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు కొవిడ్ టీకా సరఫరాకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ మేరకు జీఎంఆర్ కార్గోతో విమానసేవల సంస్థ స్పైస్ జెట్ ఒప్పందం కుదుర్చుకుంది. ముంబయికి చెందిన ముదితా ఎక్స్‌ప్రెస్ అనే రవాణా సంస్థ సైతం టీకా రవాణా కోసం స్పైస్ జెట్‌తో ఒప్పందం కుదుర్చు కుంది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్, బయెలాజికల్ ఇ-లిమిటెడ్, డాక్టర్ రెడ్డీస్ లేబరేటరీస్, అరబిందో ఫార్మా టీకా తయారు చేసి జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లకు సరఫరా చేసేందుకు సిద్ధపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఒప్పందం కుదిరింది. టీకా పంపిణీకి తెలంగాణ ప్రభుత్వం చర్యలను వేగవంతం చేసింది. రాష్ట్రంలో తొలిదశ కింద 70 నుంచి 80 లక్షల మందికి టీకాలు వేసేందుకు ప్రణాళికలు రచించింది. వైద్య, ఆరోగ్య, పోలీసు, పురపాలక, అగ్నిమాపక సిబ్బందితోపాటు వయసు పైబడిన వారికి టీకాను ముందుగా అందజేస్తారు. టీకా వేసేందుకు పదివేల మంది సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. ఒక్కొక్కరు రోజుకు వందమందికి వ్యాక్సిన్ వేసినా రోజుకు పది లక్షల మందికి వేయవచ్చు. తొలి డోసు ఇచ్చిన 28 రోజుల్లో రెండో డోసు ఇస్తారు.
ప్రపంచ దేశాల సన్నద్ధత
మహమ్మారిని తక్షణం అరికట్టే చర్యల్లో భాగంగా ఫైజర్ టీకా వినియోగానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతి ఇచ్చింది. ఇప్పటికే ఐరోపా, ఉత్తర అమెరికాలో ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. అమెరికా ఔషధ తయారీ సంస్థ ఫైజర్, జర్మనీ సంస్థ బయో ఎన్ టెక్ ఈ టీకాను అభివృద్ధి చేశాయి. ఈ టీకా అత్యవసర వినియోగానికి బ్రిటన్ డిసెంబరు 3న అనుమతి ఇచ్చింది. డిసెంబరు 9న కెనడా, 11న అమెరికా, 21న ఐరోపా ఔషధ సంస్థ దీనికి అనుమతులు మంజూరు చేశాయి. అమెరికా బయోటెక్ సంస్థ మోడెర్నా రూపొందించిన టీకా వ్యాధిని అరికట్టడంలో 94.1 శాతం విజయవంతమైంది. దీనిపై జరుగుతున్న మూడోదశ క్లినకల్ ప్రయోగాలపై నిర్వహించిన ప్రాథమిక పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. ఈ వివరాలు తాజాగా ‘ద న్యూ ఇంగ్లండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్’లో ప్రచురితమయ్యాయి. డిసెంబరు 19న అమెరికా, అదే నెల 23న కెనడా దీని వినియోగానికి ఆమోదం తెలియజేశాయి. అమెరికాలో ఇప్పటికే మోడెర్నా, ఫైజర్ టీకాల పంపిణీ కార్యక్రమం మొదలైంది.
1918-20 మధ్య కాలంలో స్పానిష్ ఫ్లూ ప్రపంచాన్ని వణికించింది. దాదాపు 50 కోట్లమందికి వ్యాధి సోకింది. అప్పటి ప్రపంచ జనాభాలో అది మూడో వంతు. అయిదు నుంచి దాదాపు పది కోట్లమంది బలయ్యారు. నాటి స్పానిష్ ఫ్లూతో పోలిస్తే ప్రస్తుత కరోనా ప్రభావం తక్కువే. అంతమాత్రాన అలసత్వం తగదు. మహమ్మారిని నివారించే కార్యక్రమాలు ముమ్మరంగా ముందుకు సాగాల్సిందే. అంతర్జాతీయ సమాజం ఒక్కటై పని చేయాల్సిందే.
– గోపరాజు విశ్వేశ్వరప్రసాద్