– గున్న కృష్ణమూర్తి, సీనియర్ జర్నలిస్ట్
త్యాగనిరతిని పాటించడం, భౌతికమైన ఆడంబ రాలకు దూరంగా ఉండడం, శాంతి, సహనం, సృష్టిలోని సర్వ జీవుల పట్ల ఆదరణ హిందూ జీవన విధానంలో అంతర్భాగాలు. మన సంస్కృతికి ఆధారాలు. త్యాగపూర్వకమైన భోగాన్ని ఆస్వాదించమంటాయి ఉపనిషత్తులు. ఆధ్యాత్మికతను నిర్మించే తాత్త్వికతను జీవితపథ మంతా పరచడమే మన ఆలయాలు, ప్రార్థనా మందిరాల పరమోద్దేశం. అటువంటి ధార్మిక కేంద్రాలపైన శతాబ్దాలుగా దాడులు జరుగు తున్నాయి. ప్రశాంతంగా ఉండే ఆధ్యాత్మిక కేంద్రాల్లో మంటలు రాజేసే పని ఇవాళ్టికీ జరుగుతోంది. విజయనగరం జిల్లా, నెల్లిమర్ల మండలం శ్రీరామతీర్థం మహా పుణ్యక్షేత్రంలో తాజాగా జరిగింది ఇదే. శ్రీరామతీర్థం పుణ్యక్షేత్రం విశిష్టత, చరిత్రను తెలుసుకోవడం ఇవాళ భారతీయుల కర్తవ్యం. అప్పుడే హిందు వుల ఆవేదనకు మూలాలు అర్థమవుతాయి.
ఉత్తరాంధ్రలోని విజయనగరం జిల్లా కేంద్రానికి సరిగ్గా 12 కిలోమీటర్ల దూరంలో రామతీర్థం ఉంది. చంపావతి నది సమీపంలో ఈ క్షేత్రం వెలసింది. స్థానికుల పరిభాషలో రామతీర్థాలు. ఇక్కడి నీలాచలం, దీనికి అనుకుని ఈ పురాతన శ్రీకోదండరామస్వామి దేవాలయం ఉన్నాయి. ఆ ప్రదేశమే బోడికొండ. అక్కడ అంతా రామమయమే. ఒక భక్తుని కోరిక తీర్చడానికి సీతారామలక్ష్మణులు ఈ ప్రాంతానికి వచ్చారని స్థల పురాణం. ఇప్పటి కోవెలలో ఉన్న కోదండరామస్వామి విగ్రహాలు నీటిలో లభ్యం కావడం వల్ల ఈ క్షేత్రం శ్రీరామతీర్థంగా ప్రసిద్ధి చెందిందని చెబుతారు. ఇక్కడ అంతా భద్రాచలం సంప్రదాయాన్ని అనుసరిస్తారు. శివకేశవ అభేదాన్ని చూడకుండా శివరాత్రికి ఈ వైష్ణవ క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతుంది. ఈ కోదండరాముని చూస్తే ముక్కంటిని చూసినట్టేనని భక్తుల భావన.
పురాణ ప్రాశస్త్యం
ఒకప్పుడు అదంతా అడవి. అక్కడే నీలాచలం కొండ. ఈ గిరికి త్రేతాయుగం, ద్వాపరయుగాల పురాణపురుషులతో బాంధవ్యం ఉంది. ఈ కొండమీద సీతారాముల ఆనవాళ్లు ఉన్నాయని భక్తుల విశ్వాసం. రామపాదుకలు, సీతమ్మ చీరలు ఆరవేసిన స్థలం వంటివి ఇక్కడ ఉన్నాయి. అరణ్యవాసం కోసం బయలుదేరిన సీతారామలక్ష్మణులు కళింగం మీదుగా ఇక్కడకు వచ్చారని, ఇక్కడ నుంచే భద్రాచలం వెళ్లారని చెబుతారు. ఈ ఆలయంలో ఇంకొక ప్రత్యేకత ఉంది. ఆంజనేయస్వామి ఇక్కడ కనిపించడు. అప్పటికి సీతారాములకు మారుతి తారసపడలేదు.
పాండవులు అరణ్యవాసానికి బయలుదేరుతూ, ఎల్లవేళలా తమపట్ల అనుగ్రహాన్ని కలిగి ఉండమని కృష్ణుడిని ప్రార్థిస్తారు. దాంతో ఆయన తాను రామావతారంలో సంచరించిన ఆ ప్రాంతంలో అరణ్యవాసాన్ని సాగించమని చెప్పి పాండవులకు సీతారాముల ప్రతిమలను ఇచ్చినట్టు పురాణాలు చెబుతున్నాయి. ఆ ప్రతిమలను నిత్యం పూజిస్తే రక్షణ లభిస్తుందని కృష్ణభగవానుడు చెప్పాడు. అలా పాండవుల చేత విశేష పూజలు అందుకున్న ఈ ప్రతిమలు ఆ తరువాత కాలంలో కనిపించకుండా పోయాయి. మహాభారత గాథకు కూడా ఈ కొండతో బంధం ఉందని చెప్పడానికి భీముని గుహను సాక్ష్యంగా చూపుతారు. ఇక్కడే భీముడు తపస్సు చేశాడని అంటారు. జైనం, బౌద్ధం బలపడిన తరువాత హిందువుల విగ్రహాలకు భద్రత కరువైంది. ఆ సమయంలో వేదగర్భుడు అనే వైఖానస అర్చకస్వామి ఆ విగ్రహాలని నీటి మడుగులో దాచిపెట్టాడు. వాటిని సాక్షాత్తు పాండవులే ఇచ్చారని ప్రతీతి. తరువాత ఒక మూగ స్త్రీకి వాటి గురించి తెలిసింది. ఆమెకు శ్రీరాముడు కనిపించి తన జాడను తెలిపాడు. అదే సమయంలో ఈ ప్రాంతాన్ని పాలిస్తున్న రాజుకి కూడా కలలో కనిపించి తనకి ఆలయాన్ని నిర్మించమని ఆదేశించాడు. అలా ఇక్కడి రాముడు వెలుగులోకి వచ్చినట్టు స్థలపురాణం చెబుతోంది. పాండవులు పూజాభిషేకాలు చేసిన ప్రతిమలతో అలరారుతున్న క్షేత్రమే శ్రీరామతీర్థమని భక్తుల విశ్వాసం. అందుకే ఈ క్షేత్రం శ్రీరామచంద్రుడి మహిమాన్విత క్షేత్రాల్లో ఒకటిగా పేరుగాంచింది. అక్కడ ఉన్న కోనేరును భాస్కర పుష్కరిణి అంటారు. ఆలయ ధ్వజస్తంభాన్ని తాకితే సర్వపాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం.
ఆధ్యాత్మిక పరంపరకు హాని
దేవాలయాలపై దాడులు ప్రాచీన ఆధ్యాత్మిక పరంపరకు హాని కలిగిస్తున్నాయి. మనదేశం ధార్మిక సూత్రాలపై దాడి దేశానికి మంచిది కాదు. జరిగిన సంఘటనలు విచారకరం. దోషులను కఠినంగా శిక్షించాలి. ఇకముందు ఇటువంటివి జరగకుండా సమగ్రమైన కార్యాచరణ అవసరం. అధిక సంఖ్యాకుల మనోభావాలు దెబ్బతినకూడదు. ప్రభుత్వాలు దోషుల పట్ల కఠినంగా వ్యవహరించాలి.
– డాక్టర్ పులఖండం శ్రీనివాసరావు, ఆధ్యాత్మిక ప్రవచనకర్త, శ్రీకాకుళం.
వనవాస రాముడు
ఇక్కడి శ్రీరాముల వారికి వనవాస రాములని పేరు. సీతారామప్రభువులను గురించి ‘విష్ణు భక్తిసుధాకరం’ అనే గ్రంథంలో ప్రస్తావన ఉన్నది. ఆ గ్రంథకర్త పూసపాటి విజయ రామ రాజు (రేగులవలస). పద్మనాభంలో కుంతీమాధవ స్వామివారి విగ్రహం ప్రతిష్ఠ చేసిన పాండవాగ్రజుడు ధర్మరాజే వనవాస రాముల వారి విగ్రహం కూడా ప్రతిష్టించాడని ప్రతీతి. కాలక్రమేణ అడవి ఆవరించి పుట్టలుపెరిగి రాములవారి విగ్రహం కనుమరుగైనది. తర్వాత కొంతకాలానికి శ్రీరాముల వారే పూసపాటి సీతారామ చంద్రులవారి కలలో కనబడి తన ఉనికిని ప్రకటించా డని కథనం. ఆ విగ్రహాలు కనుగొని ఆలయం నిర్మించి ప్రతిష్టించారని చెప్పుకుంటారు.
మరో కథ
శ్రీరామతీర్థం విజయనగర సంస్థానంలోనిది. పూసపాటిరాజులు విజయనగరాన్ని నిర్మించక మునుపే వారి రాజధాని కుంభిలాపురం (కుమిలె) రాజధానిగా ఉన్నపుడు పూసపాటి సీతారామ రాజు (1650-1696) రాజ్యాపాలనలో లేదా తరువాత వచ్చిన వేంకటమహీపతి (ఉషాభ్యుదయకర్త) కుమారులైన సీతారామచంద్రసార్వభౌముల కాలంలో (1696-1717) కాని శ్రీరామతీర్థస్వామి ప్రతిష్ఠ జరిగివుంటుందని గంటి సూర్యనారాయణశాస్త్రి (సింహాచలం) ‘శ్రీరామతీర్థ చరిత్ర’ గ్రంథంలో పేర్కొన్నారు.
కార్మికేల్ ప్రఖ్యాత విశాఖ మండల చరిత్రలో ఈ ఆలయం పూసపాటి రాజులు నడిపే వైష్ణవ ఆలయమని ప్రస్తావించాడు. దగ్గరలో జైన ఆలయం, జైనతీర్థంకరుల విగ్రహాలు ఉన్నాయని, ఒక విగ్రహం పాము పడగ కింద ఉన్న జైన తీర్థంకరునిదని, రెండో విగ్రహం వెనుక చాళుక్య విజయాదిత్యుని (1011 -1022, రాజరాజ నరేంద్రుని తండ్రి) శాసనం ఉందన్న సంగతి కూడా ఆ ఆంగ్లేయుడు రాశాడు. దీనిని బట్టి రామతీర్థం ఎంత ప్రాచీనమో చెప్ప వచ్చును. ఇంత విశిష్టత కలిగిన శ్రీరామతీర్థంపై ద్రోహుల కళ్లుపడ్డాయి. ఎంతో అద్భుత శిల్పకళతో ఉండే రామయ్య విగ్రహం శిరస్సును డిసెంబర్ 29న దుండగలు ఖండించారు. ఆ తలను సమీపంలోని కోనేరులో పడవేశారు. ఈ ఘటన ఆంధప్రదేశ్ అంతటా తీవ్ర సంచలనం రేపింది. ఆలయాన్ని అపవిత్రం చేశారన్న సమాచారంతో రామతీర్థం గ్రామస్తులు బోడికొండపైకి పరుగులు పెట్టారు.
రామతీర్థాన్ని రాష్ట్రంలోని హిందూ సంఘాలు సందర్శించాయి. ఆందోళన చేశాయి. రాష్ట్ర బీజేపీ యువమోర్చా అధ్యక్షుడు సురేంద్రమోహన్, ఏబీవీపీ విశాఖ విభాగ్ సంఘటన కార్యదర్శి జగదీష్, జాతీయ కార్యవర్గ సభ్యుడు ఇప్పిలి మూర్తి తదితరుల ఆధ్వర్యంలో ఆందోళనలు జరిగాయి.