– గోపరాజు విశ్వేశ్వరప్రసాద్
కాంగ్రెస్ పార్టీది వందేళ్లకు పైగా చరిత్ర గల సుదీర్ఘ ప్రస్థానం. 1964లో సీపీఐ నుంచి విడిపోయి కొత్తగా ఆవిర్భవించిన సీపీఎంది దాదాపు ఆరు దశాబ్దాల చరిత్ర. ఈ రెండు పార్టీల విధానాలు, సిద్ధాంతాలు వేర్వేరు. తొలి రోజుల్లో కత్తులు దూసుకునేవి. కాంగ్రెస్‌కు తామే ప్రత్యమ్నాయమని సీపీఎం ఢంకా బజాయించి చెప్పేది. కాంగ్రెస్ కూడా వామపక్షాలను ముఖ్యంగా సీపీఎంను గట్టి శత్రువుగా భావించేది. కాలక్రమంలో అవసరాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి ఈ రెండు పార్టీలు రాజీ పడ్డాయి. దానికి ఏదో ఒక సాకు చూపేవి.
2004లో కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ సర్కారుకు సీపీఎం బయటి నుంచి మద్దతు ఇవ్వగా, సీపీఐ నేరుగా సర్కారులోనే చేరిపోయింది. ఇలాంటి అవకాశవాద పొత్తులకు, రాజకీయాలకు రెండు పార్టీలు ఎప్పుడూ సిద్ధమే. రాజకీయ అవసరాన్ని బట్టి విడిపోవడం కూడా కాంగ్రెస్, సీపీఎంలకు అలవాటే. ఉదాహరణకు 2016 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, సీపీఎం కలసి పోటీచేశాయి. మళ్లీ 2019 లోక్‌సభ ఎన్నికల్లో బెంగాల్లో కత్తులు నూరుకున్నాయి. ఇప్పుడు రెండు పార్టీలు మరోసారి అవకాశవాద రాజకీయాలకు తెరదీశాయి. ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో జరగనున్న బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తుకు సిద్ధమయ్యాయి. ఈ మేరకు ఢిల్లీ స్థాయిలోని రెండు పార్టీల అధిష్టానాలు సైతం పచ్చజెండా ఊపాయి. అదే సమయంలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీలు కత్తులు దూయనుండటం అవకాశవాద రాజకీయాలకు నిలువెత్తు నిదర్శనం. అంటే ఏక కాలంలో ఒక రాష్ట్రంలో పోరాడే పార్టీలు, మరో రాష్ట్రంలో కలిసి ప్రయాణించడం వాటి ద్వంద్వ వైఖరిని ఎండగడుతోంది. దీనికి ఆయా పార్టీలు ఎంత సుదీర్ఘ వివరణలు ఇచ్చినప్పటికీ ప్రజలను నమ్మించడం అసాధ్యం. ప్రజలను పక్కనపెడితే క్షేత్రస్థాయిలోని ఆయా పార్టీల శ్రేణులకు కూడా ఈ నిర్ణయం మింగుడుపడటం లేదు. అక్కడక్కడా నిరసన స్వరాలు వినిపిస్తున్నప్పటికీ, పైకి మాత్రం పార్టీల నిర్ణయాన్ని గౌరవిస్తామన్న ప్రకటనలు వెలువడుతున్నాయి. కాస్త లోతుగా విశ్లేషిస్తే హస్తం, సీపీఎం చిత్తశుద్ధి ఏమిటో తెలుస్తుంది.
ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమబెంగాల్, కేరళ, అసోం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ అయిదింటిలో అందరి చూపు పెద్ద రాష్ట్రమైన పశ్చిమ బెంగాల్ పైనే ఉంది. 294 అసెంబ్లీ, 42 పార్లమెంటు సీట్లతో బెంగాల్ దేశంలోనే అతి పెద్ద రాష్ట్రాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. బెంగాల్లో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఒక బలమైన రాజకీయ శక్తి. ఎవరు కాదన్నా, ఔనన్నా ఇది అందరూ అంగీకరించాల్సిన వాస్తవం. 2019 పార్లమెంటు ఎన్నికల్లో మొత్తం 42కు గాను 18 సీట్లను గెలుచుకున్న కమలం పార్టీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ముచ్చెమటలు పట్టించింది. ఈ ఊపుతో రేపటి అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీని గద్దెదించి కోల్‌కతా కోటను స్వాధీనం చేసుకునే దిశగా వేగంగా ముందుకు సాగుతోంది. దీంతో అధికార టీఎంసీతో పాటు, గతంలో సుదీర్ఘకాలం రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్, సీపీఎం కలవరపాటుకు గురయ్యాయి. మమతను అడ్డుకోవడం కన్నా భాజపా ఎదుగుదలను నియంత్రించడమే వాటి లక్ష్యంగా కనపడుతోంది. మమత కన్నా భాజపానే అవి ప్రధాన శత్రువుగా పరిగణిస్తున్నాయి. ఎక్కడైనా అధికార పార్టీని గద్దెదించడానికి విపక్ష పార్టీలు ఏకతాటిపైకి వస్తాయి. కానీ బెంగాల్ పరిస్థితి భిన్నం. బహుశా దేశంలో ఎక్కడా ఇలాంటి పరిస్థితి కనపడదు.
కాంగ్రెస్, వామపక్ష పార్టీలు కలసి పోటీ చేయడానికి బలమైన కారణాలే ఉన్నాయి. 2019 పార్లమెంటు ఎన్నికల్లో రెండు పార్టీలు విడివిడిగా పోటీ చేసి దారుణంగా దెబ్బతిన్నాయి. సీపీఎంకు కనీసం ఒక్క స్థానం కూడా రాలేదు. మొత్తం 42 సీట్లకుగాను ఒక్క జాదవ్‌పూర్ నియోజకవర్గంలోనే ఆ పార్టీకి డిపాజిట్ లభించింది. మిగిలిన 41 సీట్లలో దారుణమైన పరాభవాన్ని చవి చూసింది. జాదవ్‌పూర్ ఒకప్పటి సీపీఎం అగ్రనేత, యూపీఏ హయాంలో లోక్‌సభ స్పీకర్‌గా పనిచేసిన సోమనాథ్ ఛటర్జీ సొంత నియోజకవర్గం. ఇక కాంగ్రెస్ రెండు సీట్లతో సరి పెట్టుకుంది. ప్రస్తుత ఆ పార్టీ లోక్‌సభా పక్షనేత అధీర్ రంజన్ చౌధురి (మెదినిపూర్), అబుల్ హసీంఖాన్ చౌధురి (మల్దా దక్షిణ) మాత్రమే ఎన్నికయ్యారు. ఇది ఒకప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించిన, రైల్వేమంత్రిగా పనిచేసిన అబ్దుల్ ఘనీఖాన్ చౌధురి సొంత నియోజకవర్గం. ప్రస్తుత ఎంపీ ఆయన కుమారుడే. బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉండే ఈ నియోజకవర్గంలో ముస్లింలు ఎక్కువ. బంగ్లాదేశ్ నుంచి వచ్చే అక్రమ ముస్లిం వలసదారులకు ఇది కేంద్రం. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మమతను 2019లో 22కి భాజపా పరిమితం చేసింది. అంతకుముందు పరిమిత బలం గల భాజపా తన బలాన్ని 18 సీట్లకు పెంచుకుంది. దీంతో తాము విడివిడిగా పోటీ చేస్తే ఓట్లు చీలి చతుర్ముఖ పోటీలో ఎక్కడ భాజపా లబ్ధి పొందుతుందేమోనన్న ఆందోళనే సీపీఎం, కాంగ్రెస్ పొత్తుకు అసలు కారణమన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఈ రెండు పార్టీల ప్రధాన ఓటుబ్యాంకు ముస్లింలే కావడం గమనార్హం. అదేవిధంగా పార్లమెంటు ఎన్నికల్లో మాదిరిగా ఒంటరిగా పోటీచేస్తే మనుగడే ఉండదన్న భయం కూడా మరో కారణం.
సీపీఎం, కాంగ్రెస్ అవకాశవాద రాజకీయాలు కొత్తేమీ కాదు. 2016 అసెంబ్లీ ఎన్నికల్లోనూ రెండు పార్టీలు కలిసే పోటీ చేశాయి. నాటి ఎన్నికల్లో టీఎంసీ 211, కాంగ్రెస్ 46, సీపీఎం 26 సీట్లు సాధించాయి. అప్పుడు కూడా మమతను గద్దెదించడమే తమ లక్ష్యమని ప్రకటించాయి. ఇప్పుడు కూడా పైకి అదే విషయం చెబుతున్నప్పటికీ అసలు ఉద్దేశం భాజపాను అడ్డుకోవడం. ఆ పార్టీని ఏ రకంగా అయినా అధికారానికి దూరంగా ఉంచడం. రేపటి ఎన్నికల్లో ఒకవేళ మమతా బెనర్జీకి సీట్లు తగ్గితే ఈ రెండు పార్టీలు మద్దతు ఇవ్వవని అనుకోలేం. ఒకప్పుడు కాంగ్రెస్‌వాది అయిన మమతకు మద్దతు ఇవ్వడానికి కాంగ్రెస్ సహజంగానే ముందుకు వస్తుంది. ఇక భాజపాను అడ్డుకునే పేరుతో మమతకు బయటి నుంచి లేదా షరతులతో మద్దతు ఇవ్వడానికి కూడా సీపీఎం వెనుకాడబోదు. టీఎంసీకి మద్దతు ఇవ్వాలని ఆ పార్టీకి చెందిన డమ్ డమ్ ఎంపీ సౌగత్ రాయ్ ఇప్పటికే ఆ రెండు పార్టీలను కోరారు. భాజపాను అడ్డుకునే పేరుతో కాంగ్రెస్, సీపీఎం ఎలాంటి సంకోచం లేకుండా వాస్తవాలకు వక్రభాష్యాలు చెప్పగలవు. మసి పూసి మారేడు కాయ చేయగలవు. ఇది వాటికి వెన్నతో పెట్టిన విద్య. పార్టీల వైఖరులు ఎలా ఉన్నప్పటికీ రేపటి ఎన్నికల్లో భాజపా విజయాన్ని అడ్డుకోవడం అసాధ్యం. కాంగ్రెస్, సీపీఎం, మమత పాలనను చూసిన బెంగాలీయులు నరేంద్రమోదీ నాయకత్వంలోని కమలం పార్టీకి ఈసారి మద్దతు ఇస్తారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ మూడు పార్టీల అవినీతి పాలనతో ప్రజలు విసిగిపోయారు. పరిశుద్ధులమని చెప్పుకునే సీపీఎం పాలనలోనూ బెంగాల్ ల్యాంప్స్ కుంభకోణం వెలుగు చూసిన విషయం విదితమే. నాటి ముఖ్యమంత్రి జ్యోతిబసు కుమారుడు చందన్ బసు దీనికి సూత్రధారన్న ఆరోపణలు అప్పట్లో వచ్చాయి. అందువల్ల కాంగ్రెస్, సీపీఎం, టీఎంసీలకు బదులు ఈసారి భాజపాకు అవకాశాలు ఉన్నాయన్న రాజకీయ పరిశీలకుల అంచనాను తోసిపుచ్చలేం.
బెంగాల్లో కలసి పనిచేస్తున్న కాంగ్రెస్, సీపీఎం దక్షిణాది రాష్ట్రమైన కేరళలో కత్తులు దూస్తుండటం విశేషం. ఇక్కడ సీపీఎం అధికారంలో ఉండగా కాంగ్రెస్ విపక్ష పాత్ర పోషిస్తోంది. ఈ వైరుద్ధ్యాలపై రెండు పార్టీలు ఇస్తున్న వివరణలు వాటి దివాలాకోరుతనాన్ని బట్టబయలు చేస్తున్నాయి. బెంగాల్లో మతతత్వ శక్తులను కట్టడి చేసేందుకు లౌకిక, ప్రజాస్వామ్యశక్తులు ఏకం కావాల్సిన అవసరం ఉందని, అందుకే అనివార్యంగా కనీస ఉమ్మడి కార్యక్రమం ప్రాతిపదికన పని చేస్తున్నామన్న ఆ రాష్ట్ర కాంగ్రెస్, సీపీఎం నాయకుల వాదనలో ఏ మాత్రం హేతుబద్ధత కనపడటం లేదు. అదే సమయంలో కేరళలో ఎందుకు పోరాడుతున్నారన్న ప్రశ్నకు సమాధానం లేదు. ప్రశ్నలకు సమాధానాన్ని పక్కనపెడితే కనీసం పార్టీ శ్రేణులకు సర్దిచెప్పడం కూడా కష్టమవుతోంది. అధికారంలో ఉన్న పార్టీ ఓడిపోవడం, విపక్షంలో ఉన్న పార్టీకి అధికారాన్ని అప్పగించడం కేరళలో గత కొన్నేళ్లుగా సంప్ర దాయంగా వస్తోంది. ఈ కోణంలో చూస్తే విపక్ష కాంగ్రెస్ తిరువనంతపురం పీఠాన్ని అందుకోవాలి. మొన్నటిదాకా ఇదే ఆశతో ఉంది. ఇందుకు బలమైన కారణం కూడా ఉంది. ఎందుకంటే 2019 పార్లమెంటు ఎన్నికల్లో హస్తం పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం 20 సీట్లకు గాను కాంగ్రెస్, దాని మిత్రపక్షం ఐయూఎంఎల్ (ఇండియన్ యూనియన్ ఆఫ్ ముస్లింలీగ్) 19 సీట్లలో విజయఢంకా మోగించాయి. స్వయంగా పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ వయనాడ్ నుంచి గెలుపొందారు. సీపీఎం ఒక్క అలప్పుజ స్థానాన్ని మాత్రమే కైవసం చేసుకోగలిగింది. ఈ నేపథ్యంలో సహజంగానే సీపీఎంలో దైన్యం నెలకొంది. కాంగ్రెస్‌లో ధీమా ఏర్పడింది. అయితే ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల ఫలితాలతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఈ ఎన్నికల్లో ముఖ్యమంత్రి పినరయి నాయకత్వంలోని వామపక్ష ప్రజాతంత్ర కూటమి (ఎల్‌డీఎఫ్ – లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్) మంచి మెజారిటీ సాధించడంతో కాంగ్రెస్ శ్రేణులు నిరాశతో ఉన్నాయి. అంతర్గత కలహాలే ఈ పరిస్థితికి కారణమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అదేవిధంగా పార్లమెంటు ఎన్నికల ఫలితాలతో కుంగిపోయిన వామపక్ష నాయకులకు స్థానిక సంస్థల ఫలితాలు ఊపిరి పోశాయి. అయినా అంతిమ ఫలితాలు ఎలా ఉంటాయోనన్న ఆందోళన పార్టీలో లేకపోలేదు.
2016 అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్‌డీఎఫ్ కూటమి 80కి పైగా స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ నాయకత్వంలోని ఐక్య ప్రజాతంత్ర కూటమి (యూడీఎఫ్- యునైటెడ్ డెమొక్రటిక్) 40కి పైగా సీట్లు గెలుచుకుంది. ఇందులో కాంగ్రెస్ 22, ఐయూఎంఎల్ 18 సీట్లు గెలుచుకున్నాయి. కలసికట్టుగా పనిచేసి విజయం సాధిస్తామని పీసీసీ చీఫ్ ముళ్లపల్లి రామచంద్రన్, సీఎల్పీ నేత రమేష్ చెన్నితాల, మాజీ సీఎం ఊమెన్ చాందీ చెబుతున్నారు. పార్లమెంటు, స్థానిక ఎన్నికల భిన్నమైన ఫలితాల నేపథ్యంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు ఆసక్తి కలిగిస్తున్నాయి. సీపీఎం, కాంగ్రెస్ ద్వంద్వ విధానాలను ప్రజలు ఎలా అర్థం చేసుకుంటారో చూడాలి. కేరళ కన్నా బెంగాల్ పైనే అందరూ ఆసక్తి చూపుతున్నారు.
వ్యాసకర్త : సీనియర్ జర్నలిస్ట్