నవంబర్ 9, 2019- రామభక్తులకు, నిజానికి హిందువులకు ఆ తేదీ పవిత్రమైనదనవచ్చు. అయోధ్యలోని రామ జన్మభూమి శ్రీరామునిదే, అంటే హిందువులదే అంటూ భారత అత్యున్నత న్యాయ స్థానం ఏర్పాటు చేసిన ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పు ఇచ్చిన రోజు అదే. చారిత్రాత్మకమైన ఆ తీర్పు రావడం వెనుక పదహారో శతాబ్దం నుంచి హిందువులు చేసిన పోరాటం ఉంది. సాధుసంతులు చేసిన ధార్మిక సమరం ఉంది. ఇంకా, ఏడు లేదా ఎనిమిది దశాబ్దాల న్యాయ పోరాటం ఉంది. అంతిమంగా హిందువుల సహనం గెలిచింది. తీర్పు శ్రీరామునికి అనుకూలంగా వచ్చింది. ఇప్పుడు అయోధ్య రామ జన్మభూమిలో భవ్య మందిర నిర్మాణం చేపట్టాలని హిందువులు ముందుకు కదులుతున్నారు. రామ జన్మభూమి తీర్ధ క్షేత్ర ట్రస్ట్ నాయకత్వంలో ఈ ధార్మిక యజ్ఞం జరుగుతున్నది. ఇది ఉత్తర ప్రదేశ్‌లోని అయోధ్యలో జరిగే ధార్మిక కార్యక్రమమే అయినా, దేశం మొత్తం, హిందూ సమూహం మొత్తం ఈ నిర్మాణం వెనుక నిలబడుతున్నది. ఈ నేపథ్యంలోనే ఆ అంశం గురించి క్లుప్తంగానే అయినా మరొకసారి తెలియ చేయడానికి ఉద్దేశించిన పుస్తకమే ‘రాజిల్లు రామభూమి శ్రీరామ జన్మభూమి: రామ మందిర చరిత్ర, ఉద్యమం’. సంవిత్ ప్రకాశన్ ప్రచురణ ఇది.
భారతదేశంలో 1206లో ముస్లిం పాలన ఆరంభమైంది. పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్టు 1526లో మొగలుల పాలన మొదలయింది. ఈ వంశానికి చెందినవాడే బాబర్. ఇతడి సేనాని మీర్ బాకి. ఈ ఇద్దరి మతోన్మాదం హిందువుల గుండెల మీద కొట్టిన దెబ్బ ఫలితమే అయోధ్య రామ జన్మభూమి వివాదం. దాదాపు 1528 ప్రాంతంలో ఇక్కడి రామాలయాన్ని ధ్వంసం చేసి, మసీదు నిర్మించినట్టు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ఇవి ఏదో ఒక వర్గం ఏకపక్షంగా చేస్తున్న వాదన కాదు. ఇది చారిత్రక సత్యమని చరిత్రకారులు చెప్పారు. దానిని సుప్రీంకోర్టు ధ్రువీకరించింది. అప్పటి నుంచి 1857, 1946, 1986, 1990, 1992.. ఇలా కొన్ని మైలురాళ్లుగా రామ జన్మభూమి కోసం ఉద్యమం సాగింది. ఈ వివరాలను పరిచయ మాత్రంగా చెప్పే పుస్తకమే రాజిల్లు రామజన్మభూమి.
అయోధ్య-చారిత్రక సాహిత్య ఆధారాలు అనే అంశంతో ఈ పుస్తకం మొదలవుతుంది. మందిరం మీద విదేశీదాడి, మందిర విముక్తికోసం సాగిన పోరాటం అనే అధ్యాయాలలో గతం గురించి వివరణ ఉంది. రామ జన్మభూమి విముక్తి పోరును విశ్వహిందూ పరిషత్, సాధుసంత్‌లు స్వీకరించారు. ఇందుకు బీజేపీ తోడుగా నిలిచింది. ఆర్‌ఎస్‌ఎస్ స్ఫూర్తిని ఇచ్చింది, ఇస్తున్నది. గడచిన నాలుగు దశాబ్దాలుగా రామ జన్మభూమి అంశమే భారత రాజకీయాలను శాసిస్తున్నదంటే అతిశయోక్తి కాదు. ఒకపక్క భారతదేశం మీద విదేశీ భావజాలంతో రుద్దిన సెక్యులరిజం ముసుగు తీసే పని సాగింది. మరొక పక్క అయోధ్య మీద హిందువులకు ఉన్న హక్కును స్థిరం చేసుకునేందుకు తాత్విక పోరాటం జరిగింది.
అయోధ్య ఉద్యమాన్ని దేశ వ్యాప్తం చేయడానికి జరిగిన సన్నాహాలు ఏమిటి? కరసేవ అంటే ఏమిటి? అయోధ్యలోని వివాదాస్పద కట్టడం ఎలా కూలింది? ఎందుకు కూలింది? వంటి విషయాలన్నీ ఈ పుస్తకంలో చర్చించారు. అయోధ్యలో బాబ్రీ మసీదు పేరుతో పిలుస్తున్న ఆ కట్టడం కూల్చడం వెనుక స్వాభిమానమే తప్ప, దుండగీడుతనం లేదు. దేశంలో మరెక్కడా ఆ సమయంలో మసీదులు కూలినట్టు, ముస్లింల మీద దాడులు జరిగినట్టు దాఖలాలు లేవు. కానీ ఈ అంశాన్ని బయటి వ్యక్తులు వాస్తవికంగా చెప్పకపోవడంతో చాలా చిక్కులు ఎదురయ్యాయి. కాంగ్రెస్, కమ్యూనిస్టులు, కుహనా సెక్యులరిస్టులు ఇప్పటికీ అయోధ్యను ఒక మత అంశంగానే చూస్తున్నారు తప్ప, మెజారిటీ ప్రజల మనోభావానికి సంబంధించిన అంశంగా చూడడం లేదు. కరసేవలో జరిగినదేమిటి? అప్పటి ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం కరసేవకుల మీద జరిపిన దమన కాండ ఎలాంటిది? వంటి విషయాలు పాఠకులకు ఈ పుస్తకం చదివితే ఒక అవగాహన కలుగుతుంది. కరసేవల వివరాలు, ప్రభుత్వాలకీ, అయోధ్య ఉద్యమకారులకీ మధ్య జరిగిన సంప్రదింపులు, అంతిమంగా భారత సమున్నత న్యాయస్థానం తీర్పు, తీర్ధక్షేత్ర ట్రస్ట్ వంటి విషయాల మీద ఈ పుస్తకం పాఠకుల చేత విహంగ వీక్షణం చేయిస్తుంది. సుప్రీంకోర్టు తీర్పు తరువాత భారత ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్యలో భూమి చేసిన అద్భుత దృశ్యం, నేపథ్యం గురించి కూడా ఈ పుస్తకం పరిచయం చేస్తుంది. ఈ పుస్తకం చివరన ప్రశ్నలు-జవాబుల రూపంలో ఇచ్చిన సమాచారం చాలా విలువైనది. రాముడిని హిందు వులు ఎందుకు అంత ఆరాధిస్తారు? ఆ ప్రదేశం లోనే రామాలయం ఉందని చెప్పే ఆధారాలు ఉన్నాయా? 1528లో ఆ ఆలయాన్ని కూల్చినట్టు చెప్పే సాక్ష్యాధారాలు ఎక్కడ ఉన్నాయి? ముస్లింలు అక్కడ ఆరాధనలు ఆపేసి ఎంతకాలం అయింది? వంటి కీలకాంశాలను ఈ అధ్యాయంలో చేర్చారు.
ఈ పుస్తకం చదివిన తరువాత అయోధ్య ఉద్యమం గురించి ఒక స్పష్టమైన అవగాహన రావడం తథ్యం. అంతేకాదు, ఈ చరిత్రలోకి ఇంకాస్త లోతుకు వెళ్లి అధ్యయనం చేయాలన్న కాంక్ష కలుగు తుంది. నిజానికి దేశంలో హిందూ సమాజంలో కొత్త దృష్టిని తీసుకువచ్చినది అయోధ్య ఉద్యమం. సెక్యులరిజం పేరుతో హిందువులకు జరిగిన అన్యాయం, బుజ్జగింపు ధోరణితో ముస్లింలలో ఏర్పడిన ఆధిపత్య వైఖరి వంటి అంశాలు తెలుసుకో వాలన్న ఆసక్తి కలుగుతుంది. సుప్రీంకోర్టు తీర్పు తరువాత కూడా మళ్లీ అక్కడ మసీదు వెలియడం ఖాయం అంటూ కొందరు ముస్లిం మతోన్మాదులు ప్రకటించడంలోని ఆంతర్యం ఏమిటి? సుప్రీంకోర్టు తీర్పు తమకు సమ్మతం కాదు అనే వారి ధోరణిని ఏమని పిలవాలి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానా లను విశ్వహిందూ పరిషత్ అందిస్తే చాలా మంచిది. ఈ పుస్తకం రామభక్తులుగానో, స్వాభిమానంతోనో చదవడం ఒక ఎత్తు. చరిత్రను దాచిపెట్టి హిందువులను ద్వితీయ శ్రేణి పౌరులుగా ఉంచాలన్న కుట్ర ఎలా జరుగుతున్నదో ఒక అవగాహనకు రావడం మరొక ఎత్తు. ఈ విధంగా చూసిన ఈ చిన్న పుస్తకాన్ని మనమంతా చదవాలి. ఇతరుల చేత చదివించాలి కూడా!
రాజిల్లు రామభూమి శ్రీరామ జన్మభూమి
రామ మందిర చరిత్ర, ఉద్యమం
సంవిత్ ప్రకాశన్ ప్రచురణ,
ప్రతులకు: సాహిత్య నికేతన్,
బర్కత్‌పుర, హైదరాబాద్,
ఫోన్ : 040-27563236
పేజీలు 104, వెల: రూ.100/-