‘అన్నా! ఆగస్ట్15‌న (2016) మీరు ఎర్రకోట మీద నుంచి ఇచ్చిన ఉపన్యాసంలో బలూచిస్తాన్‌ ‌సమస్య గురించి ప్రస్తావించారు. గడిచిన పదిహేనేళ్లుగా అక్కడ కనిపించకుండా పోయిన వేలమంది హక్కుల కార్యకర్తలు, న్యాయవాదులు, విద్యార్థులు, రాజకీయ కార్యకర్తల కోసం వారి వారి కుటుంబాల వారు ఇప్పటికీ ఆశగా ఎదురు చూస్తూనే ఉన్నారు. ఎర్రకోట మీద నుంచి మాట్లాడినట్టే, బలూచిస్తాన్‌ అరాచకాల గురించి అంతర్జాతీయ వేదికల మీద గొంతు వినిపించండి.’ అని అర్ధించా రామె. అది కూడా రాఖీ పండుగ సందర్భంగా. చివరిగా గుజరాతీ భాషలో, ‘మా పోరాటం మేం చేస్తూనే ఉంటాం! మా ఉద్యమానికి మీరు గొంతునివ్వండి చాలు’ అని కూడా ఆమె కోరారు. ఆమె కరీమా బలోచ్‌.

‌పాకిస్తాన్‌ ‌సైన్యం అరాచకాలతో దశాబ్దాలుగా తల్లడిల్లిపోతున్న బలూచిస్తాన్‌ ‌హక్కుల కార్యకర్త కరీమా బలోచ్‌ (‌కరీమా మెహరబ్‌) ‌డిసెంబర్‌ 22‌వ తేదీన కెనాడాలోని హార్బర్‌‌ఫ్రంట్‌లో శవమై కనిపించారు. డిసెంబర్‌ 20‌న ఆమె ఆచూకి తెలియలేదు. రెండురోజులకు ఆమె భౌతికకాయం టొరంటో లేక్‌షేర్‌కు సమీపంలోని ఒక ద్వీపంలోని హార్బర్‌‌ఫ్రంట్‌లో కనిపించింది. కరీమా అదృశ్యం గురించి ఆమె కుటుంబ సభ్యులు, మిత్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కరీమా 2016లో బలూచిస్తాన్‌ ‌నుంచి తప్పించుకుని వచ్చి కెనడాలో ప్రవాస జీవితం గడుపుతున్నారు. ఆమె హత్య పాకిస్తాన్‌ ‌పనేనని మరుక్షణం ఆరోపణలు వచ్చాయి. టొరంటోకు చెందిన సీనియర్‌ ‌జర్నలిస్ట్ ‌తారెక్‌ ‌పాతా, ‘కరీమా మరణం మీద, అందులో పాకిస్తాన్‌ ‌హస్తం మీద టొరంటో పోలీసులు, కెనాడా భద్రతా వ్యవస్థ సీఎస్‌ఐఎస్‌ ‌క్షుణ్ణంగా దర్యాప్తు జరపాలి. దేశ ప్రధాని ట్రూడో పాకిస్తాన్‌ ‌నిఘా సంస్థ ఐఎస్‌ఐ ఏజెంట్ల పిడికిలి నుంచి కెనడాను విడిపించాలి’ అని భారత్‌ ‌మీడియాతో మాట్లాడుతూ కోరారు. పాకిస్తాన్‌ ‌ప్రభుత్వం బలూచిస్తాన్‌ ‌స్వాతంత్య్ర సమరయోధులు ఎక్కడ ఉన్నా వెంటాడడానికి మొత్తం యంత్రాంగాన్ని ప్రయోగిస్తున్నదని, ముఖ్యంగా మహిళా కార్యకర్తలను లక్ష్యంగా చేసుకున్నదని కూడా కరీమా ఆరోపణ. ఆ ఆరోపణలో ఎంతమాత్రం అబద్ధం లేదన్నట్టే పాకిస్తాన్‌ ఆమెను కెనడాలో ఉన్నప్పటికీ ప్రాణాలు తీసింది.

2016లో పాకిస్తాన్‌ ‌జరిపిన దాడి నుంచి కరీమా బయటపడగలిగారు. ఆపై జర్నలిస్ట్ ‌తారెక్‌ ‌పాతా, ఇతర మిత్రులు, హక్కుల కార్యకర్తల సాయంతో కెనడా చేరుకోగలిగారు. కెనడా పౌరసత్వం కోరుతూ కొద్దికాలం క్రితమే దరఖాస్తు చేసుకున్నారు. పాకిస్తాన్‌ ‌నుంచి బలూచిస్తాన్‌కు స్వాతంత్య్రం రావాలని కోరుతున్న ఉద్యమంలో కరీమాది స్ఫుటమైన గొంతు. చిరకాలంగా ఆమె పాకిస్తాన్‌ ఆ‌క్రమణను, పాకిస్తాన్‌ ‌సైన్యం బలోచీ ప్రజల మీద చేస్తున్న అత్యాచారాలను తీవ్ర స్వరంతో విమర్శిస్తున్నారు. కరీమా మరణంతో తీవ్రంగా కలపరపడిన ‘బలోచ్‌ ‌జాతీయ పోరాటం’ నలభయ్‌ ‌రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది. దీనిని బట్టి కరీమా పట్ల బలోచ్‌లకు ఉన్న గౌరవాభి మానాలు అర్ధమవుతాయి. కరీమా బలోచ్‌ ‌స్టూడెంట్స్ ఆర్గనైజేషన్‌-ఆజాద్‌ అధ్యక్షురాలిగా కూడా పనిచేశారు. ఆమె ఆ పదవిని చేపట్టిన తొలి మహిళ. కరీమా మరణం కొన్ని శతాబ్దాలకు కూడా తీరని లోటేనని ‘బలోచ్‌ ‌జాతీయ పోరాటం’(బీఎన్‌ఎం) ‌నివాళి ఘటించింది. ప్రపంచంలో అత్యంత ప్రభావశీలురైన వందమంది మహిళలలో కరీమాను బీబీసీ (2016) ఎంపిక చేసింది. కరీమా మరణం మీద లోతైన దర్యాప్తు అవసరమని ఆమె భర్త హమ్మల్‌హైదర్‌ ‌కెనడా ప్రభుత్వాన్ని కోరారు. ఆమెకు వచ్చిన బెదిరింపు కాల్స్ ‌గురించి దర్యాప్తు చేయాలని ఆయన కోరుతున్నారు. బలూచిస్తాన్‌ ‌స్వేచ్ఛను కోరుతూ ఆమె చేస్తున్న హక్కుల పోరాటం ప్రపంచ ప్రఖ్యాతమైంది. అందుకే బలోచ్‌ ‌నేషనల్‌ ‌మూవ్‌మెంట్‌ (‌బీఎన్‌ఎం), ‌బలూచిస్తాన్‌ ‌నేషనల్‌ ‌పార్టీ-కెనడా, వరల్డ్ ‌సింధీ కాంగ్రెస్‌ -‌కెనడా, పష్తూన్‌ ‌కౌన్సిల్‌-‌కెనడా, పీటీఎం కమిటి కెనడా కరీమా మరణం వెనుక రహస్యం బయట పెట్టాలని కోరుతున్నాయి.

పాకిస్తాన్‌లో కొనసాగుతున్న లైంగిక వివక్ష గురించి కూడా కరీమా ఐక్యరాజ్యసమితిలో విమర్శిం చారు. మానవహక్కుల కౌన్సిల్‌ 39‌వ సదస్సులో ఆమె మాట్లాడుతూ, ‘పరువు పేరుతో ఒక ముస్లిం యువతిని ఆమె సోదరుడే చంపితే, ఇస్లామిక్‌ ‌చట్టం ప్రకారం హంతకుడు తన కుటుంబ సభ్యులతో సర్దుబాటు చేసుకునే అవకాశం పొందుతున్నాడు. చాలా సందర్భాలలో హంతకుడిని కుటుంబం క్షమిస్తున్నది. అతడు స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. కానీ లైంగిక అత్యాచారాలలో బాధితురాలికి మాత్రం ఏనాడూ న్యాయం అందడం లేదు’ అని ఆమె పాకిస్తాన్‌ ‌న్యాయవ్యవస్థలోని డొల్లతనాన్ని వెల్లడించారు. పాకిస్తాన్‌లో ఈ అన్యాయ చట్టాలకు తోడు దేశ మంతటా మతశక్తులు మహిళల స్వేచ్ఛ మీద దాడులు చేస్తున్నారని, ఆ దాడులు బలూచిస్తాన్‌లో మరీ ఎక్కువ అని కూడా ఆమె కుండబద్దలు కొట్టి చెప్పారు.

కరీమా మృతితో ఏప్రిల్‌ 23, 2019‌న స్వీడన్‌లో జరిగిన సాజిద్‌ ‌హుసేన్‌ ‌మరణాన్ని బలోచ్‌లు గుర్తు చేసుకుంటున్నారు. ఆయన జర్నలిస్ట్. ‌బలూచిస్తాన్‌లో పాకిస్తాన్‌ ‌చేస్తున్న అకృత్యాల మీద వార్తలు రాశారు. దీనితో ఆయనను అక్కడ నుంచి స్వీడన్‌కు వలసపోయేటట్టు చేసి, తరువాత అక్కడే స్టాక్‌హోమ్‌ ఉత్తర ప్రాంతంలో చంపారు. పాక్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటం గురించి ఆయన కథనాలు ప్రచురించారు.ఆ సంవత్సరం మార్చిలో కనిపించకుండా పోయిన సాజిద్‌ ‌నెల తరువాత శవమై కనిపించారు.

పాకిస్తాన్‌ ఒక పేద దేశం. అందులో మరీ పేదరికం అనుభవిస్తున్న ప్రాంతం బలూచిస్తాన్‌. ‌పేదరికానికి అణచివేత అదనం. దీనిని 1948లో పాకిస్తాన్‌ ‌సైన్యం ఆక్రమించింది. అప్పటి నుంచి అక్కడ సైన్యం ఆగడాలు సాగిపోతూనే ఉన్నాయి. అంటే బలోచ్‌ ‌ప్రజలది దాదాపు ఏడు దశాబ్దాల స్వేచ్ఛా పోరాటం. బలోచ్‌లకు దేశ విభజన సమయంలో భారత్‌లో చేరాలని ఉండేది. అది పాక్‌ ‌సైన్యం, ఇక్కడ నెహ్రూ సాధ్యపడనివ్వలేదు. 2006 నుంచి అక్కడ పాక్‌ ‌సైన్యం అరాచకాలు పెచ్చు మీరిపోయాయి. ఆ సంవత్సరం నుంచి నిన్న మొన్నటి వరకు నాలుగు వేల మంది కనిపించకుండా పోయారు. నిజానికి బలూచిస్తాన్‌ ‌గురించి అంత స్థిర గళంతో ప్రస్తావించిన నేత ప్రపంచంలో మోదీ ఒక్కరే. బలూచిస్తాన్‌ ‌ప్రజలు గడిచిన పదిహేనేళ్లుగా పాకిస్తాన్‌ ‌పాలనకు వ్యతిరేకంగా తీవ్రంగా పోరాడుతున్నారు. వీరిది సాయుధ పోరాటమే. ఎన్నో ఉగ్రదాడులు చేశారు. కానీ అంతకు మించి పాకిస్తాన్‌ ‌సైన్యం, ఐఎస్‌ఐ ‌బలోచ్‌ ‌ప్రజలను హింసిస్తున్నాయి.

 భారత రాజధాని ఢిల్లీలో ధర్ణా చేస్తున్న రైతులకు సంఘీభావం ప్రకటించడంలో చూపించిన శ్రద్ధ కెనాడా ప్రధాని ట్రూడో తన దేశంలో అనుమానాస్పద పరిస్థితులలో మరణించిన మహిళ పట్ల చూపడం లేదు. కరీమా మృతిలో నేర కోణం లేకుండా కేసు నమోదు చేయడాన్ని పలు భారతీయ చానెళ్లు తప్పుపడుతున్నాయి. దీనికి తోడు ఆమె భౌతిక కాయానికి పోస్ట్‌మార్టమ్‌ ‌నిర్వహించకపోవడం మరొకటి.


ఈమె ఇలా..

అక్కడ అంతా క్రైస్తవ సన్యాసినులు ఉంటారు. అక్కడే ఒక అత్యాచారం, ఒక హత్య జరిగాయి. న్యాయాన్ని 28 సంవత్సరాల పాటు సిలువ ఎక్కించారు. ఆఖరికి న్యాయం అక్కడే పునరుత్థాన మైంది. ఇతర మతాలను దూషిస్తూ, తామే పరిశుద్ధ ఆత్మలమని ప్రపంచాన్ని మోసగించిన ఒక ‘ఫాదర్‌’, ఒక ‘సన్యాసిని’ దొంగ వ్యవహారం ఒక చిన్న దొంగ చెప్పిన సాక్ష్యంతో లోకానికి తెలిసింది. న్యాయం గెలిచింది.

మార్చి 27, 1992న కొట్టాయంలో ఆ దురాగతం జరిగింది. అక్కడ ఉన్న కాన్వెంట్‌ (‌క్రైస్తవ సన్యాసినుల నిలయం)లో కేథలిక్‌ ‌సన్యాసిని అభయ (21) అనుమానాస్పద స్థితిలో ఆ ప్రాంగణంలోనే ఉన్న బావిలో శవమై తేలింది. మొదట ఇది ఆత్మహత్య అని నమ్మించడానికి చూశారు. ఇంతకాలం ఇదే తంతు నడిచింది. అంటే కేరళను ఏలిన కమ్యూనిస్టులు, కాంగ్రెస్‌లకు కూడా ఇందులో భాగస్వామ్యం ఉంది. ఇప్పుడు తిరువనంతపురం ప్రత్యేక సీబీఐ కోర్టు అది హత్య అని, ఆత్మహత్య కాదని, చంపాలన్న ఉద్దేశం తోనే ఆమె మీద దాడి జరిగిందని తీర్పు చెప్పింది. ఈ దారుణానికి ఒడిగట్టిన ఫాదర్‌ ‌థామస్‌ ‌కుట్టూర్‌, ‘‌సిస్టర్‌’ ‌సెఫిలకు యావజ్జీవకారాగారం, పెద్ద ఎత్తున జరిమానా విధించింది. ఇది అప్పట్లో సంచలనం సృష్టించింది. సంచలనం సృష్టించడం వేరు. బాధితులకు న్యాయం జరగడం వేరు. ఈ ఉదంతంలో సిస్టర్‌ అభయ విషాదాంతం చూస్తే ఎవరికైనా జాలేస్తుంది. అందులో ఆమె తప్పిదం కాస్త కూడా లేదు. ఆ ఫాదర్‌, ఆ ‌సిస్టర్‌లను చూడ కూడని పరిస్థితిలో అనుకోకుండానే చూసినందుకు ఆమెను ఆ ఇద్దరు కలసి చంపేశారు. తరువాత బావిలో పడేసి, ఆత్మహత్యగా, ఆమె మానసిక స్థితి సరిగా లేనిదానిగా చిత్రించారు. ఇందులోనే మరొక నిందితుడు ఫాదర్‌ ‌పుత్రిక్కాయల్‌ను మాత్రం కోర్టు నిర్దోషిగా విడుదల చేసింది.

అదాక్కరాజు

ఈ దుర్ఘటన నేపథ్యం గురించి వింటేనే జుగుప్సా కరంగా ఉంటుంది. అన్యాయంగా మరణించిన సిస్టర్‌ అభయ, ఇప్పుడు దోషులుగా తేలిన ఫాదర్‌ ‌కుట్టూర్‌, ‌సిస్టర్‌ ‌సెఫి ముగ్గురు కొట్టాయంలోనే ననాయ కేథలిక్‌ ‌చర్చి ప్రధాన కేంద్రంలో ఉండేవారు. ఆ కేథలిక్‌ ‌చర్చి నిర్వహించే బీసీఎం కళాశాలలోనే అభయ డిగ్రీ రెండో సంవత్సరం విద్యార్థిని. ననాయలోనే పైయస్‌ ‌టెన్త్ ‌కాన్వెంట్‌ ‌వసతిగృహంలో ఉండేది. అక్కడ 123 మంది ఉండేవారు. అందులో 20 మంది క్రైస్తవ సన్యాసినులు. మొత్తం 49 మంది సాక్షులను సీబీఐ కోర్టు విచారించింది. అందులో చిరు దొంగతనాలు చేసుకునే అదాక్కరాజును విచారించారు. సాక్ష్యాలన్నీ తుడిచిపెట్టేశామని అనుకున్న చర్చి పెద్దలకు న్యాయం ఆ దొంగ రూపంలో వస్తుందని, దోషులను కటకటాల వెనక్కి నెడుతుందని తెలియలేదు. మార్చి 27, 1992న అతడు ఆ కాన్వెంట్‌లో ఏదో ఒకటి దొంగిలించుకుని పోదామని వచ్చాడు. ఒక హత్యను కళ్లతో చూశాడు. చెట్టు ఎక్కి ప్రాంగణంలోకి దిగాలని అనుకుంటున్నప్పుడే ఫాదర్‌ ‌కుట్టూర్‌ ‌మెట్లు దిగిరావడం గమనించాడు. మగ పురుగు కూడా ప్రవేశించకూడని ఆ కాన్వెంట్‌లోకి అతడు ఎలా వచ్చాడన్నదే వింత. అలాగే ఆ రాత్రి కుక్కలేవీ మొరగలేదని కాన్వెంట్‌లో వంట చేసే ఉద్యోగి చెప్పాడు. అంటే తెలిసినవాళ్లే లోపల సంచరించారని తేలిపోయింది.

సిస్టర్‌ ‌సెఫి ఫాదర్‌ ‌కుట్టూర్‌, ‌పుత్రిక్కాయల్‌లతో లైంగిక సంబంధం కలిగి ఉందని సీబీఐ విచారణలో తేలింది. ఆ ఇద్దరు కూడా చర్చి ఆధ్వర్యంలోని కళాశాలలోనే బోధిస్తారు. అభయ మరునాటి పరీక్ష కోసం చదువుతోంది.  ఆమె సహ విద్యార్థిని సిస్టర్‌ ‌షిర్లే వేకువ జామున నాలుగు గంటలకు అభయను చదువుకునేందుకు నిద్రలేపింది. మొఖం కడుక్కోవడానికి వంటశాలలో ఉన్న ఫ్రిజ్‌ ‌నుంచి నీళ్లు తెచ్చుకుందామని అభయ వెళ్లింది. అక్కడే ఆమె ఘోరమైన దృశ్యం చూసింది.

 సిస్టర్‌ ‌సెఫి, ఫాదర్‌ ‌కుట్టూర్‌, ‌ఫాదర్‌ ‌పుత్రిక్కాయాల్‌ ‌చూడకూడని స్థితిలో కనిపించారు. ఆ సమయంలో అభయను అక్కడ గమనించిన ఫాదర్‌ ‌కుట్టూర్‌ ఆమె గొంతు నులిమాడు. సిస్టర్‌ ‌సెఫి ఒక గొడ్డలితో మోదింది. తమ మధ్య ఉన్న ఆ చెడునడత లోకానికి వెల్లడి కాకుండా చేయడానికి ఇంతటి క్రూరమైన చర్యకు ఆ ఇద్దరు పాల్పడ్డారు. తరువాత ముగ్గురు కలసి ప్రాంగణంలోని బావిలో పడేశారు.

ఫాదర్‌ ‌కుట్టూర్‌, ‌సిస్టర్‌ ‌సెఫి

మరునాడు అభయ కనిపించడం లేదని ప్రచారం మొదలుపెట్టి, చివరికి బావిలో శవాన్ని కనుగొన్నట్టు చిత్రీకరించారు. స్థానిక పోలీసులు కేసు విచారించారు. సిస్టర్‌ ‌లీసు (కాన్వెంట్‌ ‌పెద్ద) ఇచ్చిన వాంగ్మూలం మేరకు అది ఆత్మహత్య అని రాసేశారు. తరువాత ఏప్రిల్‌ 13‌న కేసు సీబీఐకి వెళ్లింది. జనవరి, 1993న నివేదిక తయారైంది. వారు కూడా ఇది ఆత్మహత్యగానే తేల్చారు. ఆ సంవత్సరం మార్చిలోనే కేరళ హైకోర్టు ఆదేశం మేరకు సీబీఐ కొచ్చిన విభాగం కేసు దర్యాప్తును స్వీకరించింది. ఇందుకు కారణం లేకపోలేదు. మదర్‌ ‌సుపీరియర్‌గా పిలిచే సిస్టర్‌ ‌బనికాసియా, మరొక 65 మంది క్రైస్తవ సన్యాసినులు నాటి ముఖ్యమంత్రి కె. కరుణాకరన్‌కు వినతిపత్రం సమర్పించారు. కేసును తప్పుదోవ పట్టించారని, అభయది హత్యేనని వారి ఆరోపణ. మళ్లీ దర్యాప్తు మొదలయింది. ఈసారి మాత్రం నిజం బయటకు వచ్చింది. కానీ దోషులెవరో బయటపడలేదు.మరొకసారి దర్యాప్తు మొదలయింది. సంజు పి మాథ్యు అనే ఆయన వాంగ్మూలం డిప్యూటీ ఎస్‌పి నందకుమారన్‌ ‌నాయర్‌  ‌సేకరించాడు. మాథ్యూ అభయ మరణించిన కాన్వెంట్‌కు పక్కనే ఉంటారు. అభయ మరణించిన రాత్రి ఫాదర్‌ ‌కుట్టూర్‌ ఆ ‌కాన్వెంట్‌లోనే ఉన్నారన్న సంగతి వెల్లడించారు. దీనితో కుట్టూర్‌, ‌పుత్రికాయాల్‌, ‌సెఫిలను అరెస్టు చేశారు. ఇప్పుడు తీర్పు వెలువడింది. హత్య జరిగిన వేకువన కుట్టూర్‌, ‌పుత్రిక్కాయాల్‌ ఆ ‌కాన్వెంట్‌ ‌ప్రాంగణంలో కనిపించారని దొంగతనానికి వెళ్లిన అదక్కరాజు సాక్ష్యం ఇచ్చాడు. ఈ కేసు దర్యాప్తు జరుగుతున్నప్పుడు చాలా మంది అతడికి కోట్ల రూపాయలు లంచం ఇవ్వడానికి చూశారు. ఒకదశలో ఆ సమయంలో అదక్కరాజు ఆ ప్రాంగణంలో ఉన్నందుకు హత్యానేరం ఇతడి మీద మోపడానికి ప్రయత్నించారు. చాలామంది అధికారులు దర్యాప్తు పేరుతో చావగొట్టారు. అభయ నా కూతురులా అనిపించింది. అందుకే ఇవన్నీ ఓర్చుకున్నాను. ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు అని అన్నాడతడు. సాక్ష్యాలు బయటపడకుండా ఉండేందుకు అభయ మరణించిన కాన్వెంట్‌ ‌రూపురేఖలను కూడా మార్పించారు. సిస్టర్‌ ‌సెఫి, తన కన్యత్వం చెడిపోలేదని నిరూపించుకోవడానికి హైమనోప్లాస్టీ కూడా చేయించుకుంది.  చిత్రం ఏమిటంటే, ఇప్పటికీ ఫాదర్‌ ‌కుట్టూర్‌, ‌సెఫి నిర్దోషులేనని చర్చి నమ్మించాలని చూస్తోంది. వారి నిర్దోషిత్వాన్ని నిరూపించడానికి కేసును అప్పీలు చేయాలని కూడా చూస్తున్నారు.

కేసు దర్యాప్తు ఎన్నో మలుపులు తిరిగింది. కానీ అభయతో కలసి గదిలో ఉంటున్న ఇద్దరు విద్యార్థినులు, ఒక సీనియర్‌ ‌క్రైస్తవ సన్యాసిని, ఇద్దరు వంటశాల ఉద్యోగులు, ఒక పొరుగు వ్యక్తి కలసి సాక్ష్యం ఇచ్చిన తరువాత కేసు బలపడింది. బీసీఎం కళాశాలలోనే మలయాళ విభాగంలో పని చేసి పదవీ విరమణ చేసిన ప్రొఫెసర్‌ ‌థెరిసమ్మ ఇచ్చిన సాక్ష్యం కూడా బాగా పనిచేసింది. ఫాదర్‌ ‌కుట్టూర్‌, ‌ఫాదర్‌ ‌పుత్రియాక్కాల్‌ల పైత్యం గురించి కూడా ఆమె కోర్టులో సాక్ష్యం చెప్పింది. ఈ ఇద్దరు విద్యార్థినులకు చాలా సందర్భాలలో అసౌకర్యంగా పరిణమించారని ఆమె చెప్పడం విశేషం.

About Author

By editor

Twitter
YOUTUBE