బీజేపీ ఈ మధ్య గొప్ప హేతుబద్ధమైన ప్రశ్న ఒకటి సంధించింది. ఈ ప్రశ్నకు సమాధానం గురించి భారత జాతి యావత్తు వెతకవలసిందే కూడా. ఈ దేశంలో, బహుశా స్వతంత్ర భారతదేశంలో- ఏ ప్రాజెక్టు ఎక్కడ కట్టినా, ఏ మూలన ఏ భవనం నిర్మించినా, ఏ విశ్వవిద్యాలయం ప్రతిష్టించినా దానికి కచ్చితంగా ప్రథమ ప్రధాని నెహ్రూ పేరు పెట్టవలసిందేనని శాసించే ఒప్పందం ఏదైనా అఘోరించిందా? ఇదీ, బీజేపీ ప్రశ్న. ఇప్పుడయినా బీజేపీ వేసింది. విశ్వవిద్యాలయాలు, విమాశ్రయాలు, వేదశాలలు, పాఠశాలలు, బస్టాండ్‌లు, డ్యామ్‌లు ఒకటేమిటి- ఏది నిర్మించినా ఒకే ఒక్క పేరు సిద్ధంగా ఉండేది. రోడ్లు, పార్కులు, ఆఖరికి వీధులు అన్నింటికి ఆ పేరే – నెహ్రూ. జనం మరీ విసుక్కుంటారేమోనని కాంగ్రెస్‌ ‌నేతలు పొరపాటున మొహమాట పడితే ఆ కుటుంబంలోదే ఇంకొక పేరు సిద్ధం. కాంగ్రెస్‌ ‌పార్టీ కొన్నేళ్లుగా అధికారానికి ఆమడ దూరంలో ఉంది కనుక సరిపోయింది. లేకపోతే ఇంకా ఎన్ని ప్రాజెక్టులు, రోడ్లు, కాలవలు ఆ పేర్లే తగిలించుకోవలసి వచ్చేదో!

ఇటీవల తిరువనంతపురంలో నిర్మాణం పూర్తి చేసుకున్న బయోటెక్నాలజీ కేంద్రం కొత్త విభాగానికి ఆర్‌ఎస్‌ఎస్‌ ‌రెండో సరసంఘచాలక్‌ ‌డాక్టర్‌ ఎంఎస్‌ ‌గోల్వాల్కర్‌ (‌గురూజీ) పేరు పెట్టాలని కేంద్రం నిర్ణయించింది. తిరువనంత పురంలోనే ఉన్న రాజీవ్‌గాంధీ సెంటర్‌ ‌ఫర్‌ ‌బయోటెక్నాలజీ (ఆర్‌జీబీసీ) సంస్థలో సిద్ధమైన రెండో ప్రాంగణమది. డిసెంబర్‌ ఐదున కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ ‌హర్షవర్ధన్‌ ‌కేంద్రం నిర్ణయం గురించి వెల్లడించారు. దీనితో రగడ మొదలు. మొదట దు:ఖపడినది సీపీఎం కేరళ శాఖ. తరువాత ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ ‌విలాపం మొదలయింది. ఆ నేపథ్యంలోనే దేశంలో దేనికి ఏ పేరు పెట్టాలన్నా నెహ్రూ పేరు తప్ప మరొకటి కనిపించడం లేదా; లేదా ఇంకో పేరేదీ శోభించదా ఏమిటి అంటూ బీజేపీ నిలదీయవలసి వచ్చింది. ఆ రెండు పార్టీల జెండాలు వేరు గాని, అజెండాలు ఒక్కటే కదా!

జాతీయ కాంగ్రెస్‌ ‌కేరళ నేత రమేశ్‌ ‌చెన్నితల అమోఘమైన సలహా పడేశారు. ‘ఏం? మొదటి ప్రాంగణానికి రాజీవ్‌గాంధీ పేరు ఉంటేనేం? రెండో ప్రాంగణానికి కూడా ఆయన పేరే పెట్టవచ్చు. తప్పా!’ అని పరమ జుగుప్సాకరంగా తమ బానిసబుద్ధిని చాటుకున్నారు. ఈ మేరకు ఆయన ప్రధాని మోదీకి లేఖ కూడా సంధించారు. దేశంలో ఎన్నో మత ఘర్షణలకి కారణమైన సంస్థకు సిద్ధాంతకర్తగా ఉన్న వ్యక్తి పేరు పెట్టడం అసంబద్ధం అంటూ చెన్నితల తల లేకుండా తేల్చేశారు. అసలే ఈ మధ్య సోనియాగాంధీ భజన కాస్త తగ్గించి, స్వల్పంగా దయను కోల్పోయి బాధల్లో ఉన్న కాంగ్రెస్‌ ఎం‌పీ శశి థరూర్‌ ‌కూడా, పార్టీలో పునర్‌ ‌వైభవం కోసం కాబోలు డాక్టర్‌ ‌గోల్వాల్కర్‌ ‌పేరా! వద్దంటే వద్దు అంటూ గళం విప్పారు.

ఈ దేశంలో కాంగ్రెస్‌ ‌పార్టీ సిద్ధాంతాలు, నెహ్రూ ఆశయాలు పాత వాసన కొడుతున్నాయని జనం ఎప్పుడో నిర్ణయించుకున్నారు. ఉష్ట్రపక్షుల్లా కాకుండా కాస్త, బయటి ప్రపంచాన్ని చూస్తే కాంగ్రెస్‌ ‌వాళ్లకి ఈ సంగతి అర్థమవుతుంది. ఆర్‌ఎస్‌ఎస్‌ ‌మతకల్లోలాలు సృష్టించింది అనేది కాంగ్రెస్‌ ‌కల్పన తప్పితే మరొకటి కాదు. అత్యవసర పరిస్థితి కాలంలో ఆ పార్టీ చేసిన ఘోర కృత్యాలు ఆ పార్టీ వీర విధేయులు మరచిపోయినట్టు నటిస్తున్నా, ప్రతి ఎన్నికల వేళ జనం గుర్తుకు తెచ్చుకుంటూనే ఉన్నారు. ఇందిర చనిపోయినప్పుడు ఢిల్లీలో వేలమంది సిక్కులను ఊచకోత కోసిన పార్టీ ఏది? అలాంటి క్లిష్ట పరిస్థితులలో ఇంగితం మరచి, ఆ రక్తపాతం గురించి ఆమె కుమారుడు రాజీవ్‌ ‌స్పందన ఏమిటి? గుర్తు లేదా?

 ఒక భారతీయుడి పేరు, అందులోను హిందూ ఐక్యతకు జీవితాన్ని అంకితం చేసిన వారి పేరు, భారతీయత గురించి మాట్లాడేవారి పేరు ఒక సంస్థకు పెడితే సీపీఎం పార్టీ జీర్ణించుకోగలదా? దాని నేతలు యావన్మందీ ఉగ్గుపాలతో సహా కక్కేసుకోరా? కారల్‌మార్కస్ ‌రోడ్డు, ఏంగెల్స్ ‌భవనం, లెనిన్‌ ‌మార్గ్, ‌స్టాలిన్‌ ‌సర్కిల్‌ ‌వంటి పేర్లు వినడానికి అలవాటు పడిన ఆ చెవులు ఆర్‌ఎస్‌ఎస్‌ ‌మాజీ అధినేత పేరు పెట్టిన సంగతిని విని తట్టుకోగలవా? ఆఖరికి తమ సంతానానికి కూడా లెనిన్‌, ‌స్టాలిన్‌, ‌కృశ్చేవ్‌ ‌వంటి పేర్లు తగిలించుకుని తమ అంతర్జాతీయ స్థాయి బానిస బుద్ధిని చూసుకుని, అదేదో అంతర్జాతీయ దృష్టి అనుకుని మురిసిపోయే కమ్యూనిస్టులకు ఇలాంటి పరిణామం రుచిస్తుందని ఎవరూ అనుకోవడం లేదు. ముస్లింలీగ్‌, ‌పీఎఫ్‌ఐలని చంకనేసుకుని తిరిగే ఈ పార్టీ ఒక మహోన్నత జాతీయవాది పేరును ఎలా అంగీకరించగలదు పాపం! ఏమి? కామ్రేడ్‌లకి ఇక్కడే పుట్టి పెరిగిన మహోన్నత విప్లవకారులు గుర్తుకు రారేమి? అల్లూరి శ్రీరామరాజు, బీర్సా ముండా, భగత్‌సింగ్‌, ‌సుఖదేవ్‌, ‌చిట్టగాంగ్‌ ‌వీరులు – వీరిలో ఏ ఒక్కరి పేరు ఎందుకు గుర్తుకు రాదు? కనీసం ఎంఎన్‌ ‌రాయ్‌, ‌డాంగే వంటివారి పేర్లయినా ఆ బుర్రలకు తట్టవెందుకు? గోల్వాల్కర్‌ ‌సేవ ఏదైనా ఉన్నదీ అంటే అది విద్వేషం, విభజన అని కేరళ సీపీఎం నేత ఎంఏ బేబీ వాక్రుచ్చారు. సుభాష్‌ ‌చంద్రబోస్‌ను దేశద్రోహి అన్న నోళ్లు కావూ ఇవి! దొంగ బంగారం కేసులో పీకల్లోతు కూరుకుపోయినా కూడా కేరళ సీపీఎం నోటి నుంచి ఇలాంటి సుద్దులు వినవలసి రావడమే వికారం కలిగిస్తుంది. మరీ చిత్రం- మైసూరు పాలక వంశీకుల ఆస్థాన వైద్యుడు డాక్టర్‌ ‌పల్పు పేరు పెట్టాలని కూడా కేరళ సీపీఎం నాయకమ్మన్యులు చెబుతున్నారు.

కమ్యూనిస్టులు ఈ దేశ జనజీవన స్రవంతికి దూరమైపోవడానికి కొన్నివేల ‘చారిత్రక తప్పిదాలు’ ఉన్నాయి. అవి మళ్లీ మళ్లీ పునావృతమవుతూనే ఉన్నాయి. అది వాటికి పుట్టుకతో వచ్చిన బుద్ధి. చెత్తబుట్ట అనే పుడకల మీదకు ఆ పార్టీలను నెట్టడానికి ప్రజలు సిద్ధంగానే ఉన్నారు. దానికి ఎంతో దూరం కూడా లేదు.

About Author

By editor

Twitter
YOUTUBE