– ఎం. రమేశ్‌కుమార్‌

‌వాకాటి పాండు రంగరావు స్మారక దీపావళి కథల పోటీలో విశిష్ట బహుమతి పొందినది.


ఆరోజు ఉదయం నిద్రలేచేసరికి నాకు ఒంట్లో ఏదో తేడాగా అనిపించింది. కళ్లు తెరిచి చూసేసరికి గది మొత్తం తిరగడం ప్రారంభించింది. గది తిరుగుతోందా..? నా తల తిరుగుతోందా..? కళ్లు మూసుకున్నాను. అయినా అనీజీగానే ఉంది. ఇబ్బందికరమైన ఫీలింగ్‌. అలాగే ఉండిపోయాను. నిజానికి ఈ అనుభవం ఈరోజే జరిగింది కాదు.. గత మూడురోజులుగా ఇదేరకంగా జరుగుతోంది. తల తిరగడం.. మధ్యాహ్నం వరకూ అనీజీగా ఉండటం.. ఇదే పరిస్థితి!  కాకపోతే ఈరోజు కొంచెం తీవ్రంగా వచ్చింది.

కాసేపటికి కాస్త నెమ్మదించాక పక్కమీద నుంచి లేచాను. మా ఆవిడకి విషయం చెప్పాను. మూడు నాలుగురోజులుగా ఇలా అవుతున్నా చెప్పనందుకు ఆవిడ నామీద కాస్త కోప్పడి వెంటనే డాక్టరు దగ్గరకు వెళ్దామంది. నాక్కూడా అదే బెటరనిపించింది. ఆ వెళ్లేదేదో న్యూరో ఫిజీషియన్‌ ‌దగ్గరికే వెళ్దామని అంది.

‘‘ఈ మాత్రం దానికే అక్కడికి ఎందుకూ.. ఎవరైనా జనరల్‌ ‌ఫిజీషియన్‌కి చూపిద్దాం..’’ అన్నాను.

 కానీ ఆవిడ ఒప్పుకోలేదు. అక్కడికి వెళ్తే బ్రెయిన్‌ ‌స్కాన్‌ ‌టెస్ట్ ‌రాసేస్తారేమో అని నా భయం. అది చేయించుకోవాలంటే నాకు దడ. నిజానికి ఇంజక్షన్లు, టెస్టులు అంటే నాకు మొదట్నుంచీ భయమే! కానీ మా ఆవిడతో పాటు మా వీధిలో వుండే కాంపౌండర్‌ ‌కూడా అదే సలహా ఇవ్వడంతో అక్కడికే వెళ్లక తప్పలేదు. ఆఫీస్‌కు సెలవు పెట్టి హాస్పిటల్‌కు బయలుదేరాం.  వెళ్లే ముందే టోకెన్‌ ‌బుక్‌ ‌చేశాను.

రిసెప్షన్‌లో మా టోకెన్‌ ‌నెంబర్‌ ‌సరిచూసుకుని హాల్లో ఉన్న కుర్చీల్లో కూర్చున్నాం. పరీక్ష పేపర్‌ ‌చేతికొచ్చే ముందు విద్యార్థుల మనసులో ఉండే ఆందోళన లాంటిది కలిగింది నాకు. ఒకసారి అక్కడున్న అందర్నీ పరిశీలించాను. లోపలికి వెళ్తే ఏం చెప్తారో.. ఎలాంటి టెస్ట్‌లు రాస్తారో అన్న టెన్షన్‌ ‌చాలామంది మొహాల్లో కనిపిస్తోంది. మా వంతు వచ్చాక లోనికెళ్లాం. డాక్టర్‌ ‌గారికి విషయం చెప్పాను.

 ‘‘ఈమధ్య ఏ విషయంలోనైనా ఏంగ్జయిటీ లేదా డిప్రెషన్‌ ‌లాంటి ఫీలింగ్స్ ‌కలిగాయా..?’ అని అడిగాడాయన.

 లేదని చెప్పాక మరికొన్ని ప్రశ్నలు వేశారు. తల తిరగడం అనిపించినప్పుడు ఇంకా ఎలాంటి లక్షణాలు ఉంటాయి..? వాంతి వచ్చినట్టు అనిపిస్తుందా..? ఈ మధ్య జలుబు చెయ్యడం.. చెవి నొప్పి రావడం లాంటివి జరిగిందా? లాంటి ప్రశ్నలకు నేను జవాబు చెప్పాక ‘‘ఇది వెర్టిగో కావచ్చు. అంటే శరీరంలో ఒక ఇన్‌ ‌బాలెన్స్ ఏర్పడటం లాంటిది. ఇది కొన్ని రకాలుగా వస్తుంది. చెవిలో ఇంటర్నల్‌గా సమస్య రావడం అనేది ఒక కారణం. అదే కాకుండా మరికొన్ని కారణాలు ఉన్నాయి. గత మూడు రోజులుగా ఇలా ఉందంటున్నారు.. బహుశా ఇది ఇన్‌ ‌ఫెక్షన్‌ ‌వాళ్ల వచ్చిందే కావచ్చు.. అని చెప్తూ ‘‘ఎందుకైనా మంచిది. ఎమ్‌ ఆర్‌ ఐ ‌బ్రెయిన్‌ ‌తీయించండి.. కొన్నిసార్లు బ్రెయిన్‌ ‌నెర్వస్ ‌లో చిన్న చిన్న క్లాట్స్ ఏర్పడటం వల్ల కూడా ఇది జరగొచ్చు. అలాంటప్పుడు ముందే జాగ్రత్త పడాలి. లేదంటే తర్వాత అది తీవ్ర పరిణామాలకు దారితీయొచ్చు..’’ చెప్పాడు డాక్టర్‌.

 ‌బ్రెయిన్‌ ‌స్కాన్‌ అనగానే నా గుండె దడదడ లాడింది. నేను భయపడిందే జరుగుతోంది.

‘‘మొదట కొన్ని రోజులు మందులు వాడి తగ్గకపోతే తర్వాత స్కాన్‌ ‌తీయించుకోవచ్చు కదా సార్‌ ..’’ అడిగాను.

‘‘మీ అంతట మీరు రిస్కు శాతాన్ని పెంచుకోవడం ఎందుకు..? అసలు స్కాన్‌ ‌చేయిస్తే అందులో భయపడాల్సింది ఏమీ రాలేదనుకోండి. అప్పుడు మీరు ప్రశాంతంగా ఉండొచ్చు కదా. ఒకవేళ ఏదైనా తేడా ఉన్నా వెంటనే ట్రీట్‌మెంట్‌ ‌తీసుకుంటే ఇబ్బందేమీ ఉండదు..’’ డాక్టర్‌ ‌నవ్వుతూ చెప్పాడు.

 మా ఆవిడ కూడా ‘‘ఆయన అలాగే అంటారు డాక్టర్‌. ‌స్కాన్‌ ‌తీయించుకోవడమే మంచిది కదా.. రాసేయండి.. తీయించుకుంటారు’’ అంది.

 ఇక తప్పని పరిస్థితి వచ్చింది. బెడ్‌ ‌మీద పడుకున్నమనిషి మొత్తం స్కానింగ్‌ ‌యంత్రంలోకి వెళ్లాక అక్కడే చాలాసేపు ఉండి చేయించుకోవాల్సిన టెస్ట్ అది. అసలు అలాంటి యంత్రాన్ని చూస్తేనే నాకు భయం. కానీ ఏంచేస్తాం..? అక్కడికి కొద్ది దూరంలో ఉన్న స్కాన్‌ ‌సెంటర్‌కి వెళ్లాం.

స్కానింగ్‌ ‌గది లోపలకు వెళ్లగానే నాకు భయం ఎక్కువైంది. అక్కడ పడుకోబెట్టిన తర్వాత తల కదలకుండా స్ట్రాప్‌ ‌లాంటిది నుదుటికి బిగించారు.

 ‘‘లోపలకు వెళ్లాక శబ్దాలు వినిపిస్తాయి. ఏం ఫర్వాలేదు.. ప్రశాంతంగా ఉండండి. ఏమాత్రం కదలడానికి ప్రయత్నించకండి. మీరు కదిలితే స్కాన్‌ ‌సరిగ్గా రాదు. అందువల్ల మీకే నష్టం..’’ చెప్పాడు ఆ స్కాన్‌ ‌తీసే ఆపరేటర్‌.

 ‌యంత్రాన్ని ఆన్‌ ‌చెయ్యగానే నా బాడీ మొత్తం లోపలికి వెళ్లిపోయింది. కళ్లు మూసుకున్నాను. లోపల కాస్త దడ మొదలైంది. మనసును కంట్రోల్‌లో ఉంచుకోవడానికి ప్రయత్నించాను. ఏవో శబ్దాలు వినిపిస్తున్నాయి.

ఏదైనా వేరే విషయం ఆలోచించడానికి ప్రయత్నించాను. నేను ఈ మధ్య కాలంలో చదివిన ఓ మంచి కథను గుర్తు చేసుకుని దాని మంచి చెడ్డలు మనసులోనే విశ్లేషించడం మొదలుపెట్టాను. అయితే అలా ఎంతోసేపు సాగలేదు. నేను మిషన్లో ఉన్నానన్న భావన మళ్లీ చుట్టుముట్టింది. కనీసం ఇరవై నిముషాలు పడుతుందని చెప్పాడు.

 అంతసేపు ఆలోచనల్ని ఎలా కంట్రోల్‌ ‌చేసుకోవాలి..? ఈ మిషన్‌లో ఇరుక్కుపోయి ఉండిపోను కదా.. కొన్ని క్షణాలు ఊపిరాడని ఫీలింగ్‌..! ‌మళ్లీ నా ఆలోచనల్ని పక్కకు మళ్లించడానికి ప్రయత్నించాను. దేనిమీదా ఏకాగ్రత కుదర్లేదు.

ధడ్‌.. ‌ధడ్‌.. ‌మనే శబ్దాలు ఎక్కువయ్యాయి. అసలు నిజంగా మిషన్లో ఇలాంటి శబ్దాలు వస్తాయా..? లేక మిషన్‌ ‌చెడిపోయిందా..? అన్న అనుమానం వచ్చింది. మనసును కంట్రోల్‌ ‌చేసు కుంటూ అసలేమీ ఆలోచించకుండా ప్రశాంతంగా ఉందామని ప్రయత్నించాను. సరిగ్గా అలా అనుకున్న ప్పుడే లక్ష ఆలోచనలు బుర్రలో గిర్రున తిరిగాయ్‌.

ఆ ‌యంత్రంలో ఉన్నంతసేపూ క్షణమొక యుగంలా గడిచింది. మొత్తానికి స్కాన్‌ ‌పూర్తయి యంత్రం బైటికి వచ్చాను.

 స్కానింగ్‌ ‌రిపోర్ట్ ‌వచ్చాక అది పట్టుకుని డాక్టర్‌ ‌దగ్గరకెళ్లాం. ఆయన రిపోర్ట్‌నూ, స్కానింగ్‌ ‌ఫిల్మస్‌నూ పరిశీలించి ‘‘పెద్దగా ఇబ్బందేమీ లేదు. ఇదే మీకు చిన్న మెదడులో ఎయిత్‌ ‌నెర్వ్‌లో గనక బ్లడ్‌ ‌క్లాట్‌ ఉన్నట్టయితే అప్పుడు ఖచ్చితంగా జాగ్రత్త పడాలి. ప్రస్తుతానికైతే అలాంటి ఇబ్బంది ఏమీలేదు. ఇది చిన్న ఇన్ఫెక్షన్‌ ‌వలన వచ్చింది.. అంతే.. మందులు రాస్తాను. పదిరోజుల తర్వాత మళ్లీ ఓసారి రండి..’’ అన్నాడు.

 రెండు రోజులు సెలవు పెట్టి రెస్ట్ ‌తీసుకున్నాక కొంచెం బాగానే అనిపించడంతో ఆరోజు ఆఫీస్‌కు వెళ్లాను. వెళ్లగానే తెలిసిందొక వార్త! అదేమిటంటే ప్రమోషన్స్ ‌తీస్తున్నారు..! ప్రమోషన్‌ ‌లిస్టులో మా బ్రాంచ్‌ ‌నుంచి నా పేరు కూడా ఉంది. ప్రమోషన్‌ ‌వస్తుందని ముందు నుంచీ అనుకుంటున్నదే కానీ ఆ వార్త తెలిసేసరికి ఆనందం అనిపించింది. అయితే ప్రమోషన్‌ ఇచ్చాక నన్ను ఏ సెక్షన్‌లో వేస్తారు..? ఏ బ్రాంచికి ట్రాన్స్‌ఫర్‌ ‌చేస్తారు..? అన్న ఆలోచనలు మొదలయ్యాయి. ఈ విషయంలో నేను మా బ్రాంచ్‌ ‌హెడ్‌ ‌విశ్వనాధం గురించే ఆలోచిస్తున్నాను.

ప్రమోషన్‌ ‌పోస్ట్ ఏ ‌సెక్షన్‌లో కేటాయించాలన్నది ఆ బ్రాంచ్‌ ‌హెడ్‌ ‌సిఫార్సు మీదే ఆధారపడి చేస్తారు. విశ్వనాధం మా బ్రాంచ్‌ ‌హెడ్‌ ‌మాత్రమే కాదు.. లంచాలకి కూడా హెడ్‌ ‌లాంటివాడు. ఆయన బ్రతుకుతున్నది జీతం మీద ఆధారపడి కాదు.. లంచాలని నమ్ముకుని! ఈ సంగతి మా డిపార్ట్ ‌మెంట్‌లో చాలామందికి తెలిసిన విషయం!

 నేను డిస్పాచ్‌ ‌సెక్షన్‌లో ఉన్నందున మా సెక్షన్‌లో లంచాల గోల ఉండదు. ఆ విధంగా ఇప్పటివరకూ నేను చాలా సుఖంగా ఉన్నాననే చెప్పాలి. నేను లంచం తీసుకోవడానికి వ్యతిరేకిని. కానీ మా ఆఫీసులో అది చాలా కామన్‌గా జరిగే తంతు. ఇప్పుడు ప్రమోషన్‌ ‌కారణంగా నన్ను వేరే సెక్షన్‌కి మార్చవచ్చు. లేదా వెయ్యాలనుకుంటే అదే సెక్షన్‌లో కూడా ప్రమోషన్‌ ‌పోస్టులో అపాయింట్‌ ‌చెయ్యొచ్చు. నేను మనసులో బలంగా కోరుకుంటున్నది ఒకటే..! వేరే బ్రాంచ్‌కి ట్రాన్స్‌ఫర్‌ ‌చేసినా ఫర్వాలేదు గానీ అదే డిస్పాచ్‌ ‌సెక్షన్‌లో ప్రమోషన్‌ ‌పోస్ట్ ‌కేటాయించా లని..! అది కాకుండా ఇంక ఏ సెక్షన్‌కి వెళ్లినా ఖచ్చితంగా లంచాల గోల తప్పదు. అది నా ఒంటికి ఏమాత్రం సరిపడని విషయం. అయితే విశ్వనాధం ఎంతమాత్రం నాకు అనుకూలంగా పోస్టింగ్‌ ఇవ్వడనీ, ఖచ్చితంగా నన్ను ఇబ్బంది పెట్టడానికే ప్రయత్నిస్తా డనీ నాకు తెలుసు.

 నేనిలా అనుకోవడానికి కారణం ఉంది. నేను ఒకటి రెండు సార్లు విశ్వనాధం అవినీతి గురించి మా కొలీగ్స్ ‌దగ్గర విమర్శిస్తూ మాట్లాడాను. సహజంగా బ్రాంచ్‌ ‌హెడ్‌కి ఒక భజన టీమ్‌ ఉం‌టుంది కాబట్టి అలాంటి వాళ్లెవరో ఆ మాటల్ని విశ్వనాధానికి మోసేశారు. అది మాత్రమే కాదు.. ఒకసారి లంచవర్లో నేను, నా కొలీగ్‌ ‌దేవుడి గురించీ, భక్తి గురించీ మాట్లాడుకున్నాం. ఆ సంభాషణలో భాగంగా నేను ‘కొంతమంది తెల్లారిలేస్తే నిష్ఠగా దేవుణ్ణి పూజిస్తారు. కానీ చేసే తప్పులన్నీ చేస్తూనే ఉంటారు. అసలు అలాంటివాళ్ల ఉద్దేశం ఏమిటి..? వీళ్లు చేసే పనులు దేవుడు గమనించడనా..? గమనించినా తాము చేసే పూజల కారణంగా అవన్నీ మాఫీ చేసేస్తాడనా..? లేక ఆ వచ్చిందాంట్లో కొంత భగవంతుడి హుండీలో వేసేస్తేనో అదీ కాకపొతే పుణ్య నదుల్లో మునిగితేనో ఆ పాపాలు అన్నీ పోతాయనా..? తప్పు అని తెలిసి కూడా నిరంతరం తప్పుడు మార్గంలోనే వెళ్లేవాళ్లు దేవుడికి ఎన్ని పూజలు చేస్తే మాత్రం ఏం లాభం..? అలాంటి వాళ్లు ఎప్పటికీ తమ మనసుకి సమాధానం చెప్పుకోలేరు..’’ అన్నాను.

నేనీ మాటలన్నీ ఆరోజు మేం మాట్లాడుకుంటున్న టాపిక్‌లో భాగంగా జనరల్‌గానే అన్నాను తప్ప ఎవరిని ఉద్దేశించి అనలేదు. ఆ సమయంలో విశ్వనాధం నా వెనుకనే గోడ పక్కన ఉన్నాడన్న విషయం తర్వాత ఎవరో చెప్తే నాకు తెలిసింది. అతడు పరమశివుడికి మహాభక్తుడు. పూజలు, వ్రతాలు, అభిషేకాలు అనేవి అతను నిత్యం ఆచరించే విషయాలు. ఈ మాటలన్నీ నేను తన గురించే అన్నానని భావించాడేమో అన్న అనుమానం కలిగింది.

రోజూ పూజలు చెయ్యడం.. ఆఫీసు కొచ్చేసరికి యధావిధిగా అవినీతి పనులు చెయ్యడం ఆయనకి నిత్యకృత్యం కాబట్టి నేనన్న మాటలు తప్పకుండా తనకి అన్వయించుకునే ఉంటాడని అనిపించింది. అసలు మొదట్నుంచీ నేనంటే ఆయనకు పడదు కాబట్టి ఇప్పుడు ఆ వ్యతిరేక భావం మరింత ఎక్కువై ఉంటుంది అనుకున్నాను.

ఇవన్నీ తలచుకుంటే ఇప్పుడు నాకు ప్రమోషన్‌ ‌పోస్టుకి సంబంధించి సెక్షన్‌ ‌కేటాయించే విషయంలో ఆయనకొక అవకాశం వచ్చింది కాబట్టి ఏదోవిధంగా నన్ను కార్నర్‌ ‌చేస్తాడేమో అనిపించింది. సరే.. అలా ఏదైనా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తే అప్పుడు చూసుకుందాంలే అనుకున్నాను.

ఇంకాసేపట్లో లంచవర్‌ అనగా మా బ్రాంచ్‌ ‌హెడ్‌ ‌విశ్వనాధం పిలుస్తున్నాడని కబురొచ్చింది. చేస్తున్న పని పక్కన పెట్టి అతని ఛాంబర్‌కు వెళ్లాను.

‘‘కూర్చోండి..’’ చెప్పాడు విశ్వనాధం.

నేను కూర్చున్నాక ‘‘చూడండి శేఖర్‌.. ‌ప్రమోషన్స్ ‌తీస్తున్నట్టు హెడ్డాఫీస్‌ ‌నుంచి ఇన్ఫర్మేషన్‌ ‌వచ్చింది. ఈసారి లిస్టులో మన బ్రాంచ్‌ ‌నుంచి మీ పేరు కూడా ఉంది.. అది మీకు తెలుసు. పోస్టింగ్‌ ఏ ‌బ్రాంచ్‌లో అన్నది మాత్రం ఇంకా తెలీదు.. ఇక సెక్షన్‌ ‌విషయం చెప్పాలని మిమ్మల్ని పిలిచాను..’’ అదో రకంగా నవ్వుతూ చెప్పాడు.

విశ్వనాధం నవ్వు అచ్చం చిన్నప్పుడు నేను కథల్లో చదువుకున్న జిత్తులమారి నక్క నవ్వులా అనిపించింది. అసలు నక్కెలా నవ్వుతుందో నాకు తెలీదు గానీ విశ్వనాధాన్ని చూస్తే మాత్రం ఇలాగే నవ్వుతుంది అని ఆ క్షణంలో అనిపించింది. అతను ఏం చెప్తాడా అని ఆత్రుతగా చూస్తున్నాను.

‘‘మిమ్మల్ని అప్రూవల్‌ ‌సెక్షన్‌లో ఇంచార్జిగా వేస్తున్నారు. వచ్చేవారం ఆర్డర్స్ ‌మీ చేతికొస్తాయి. సెక్షన్‌ ‌విషయంలో మన ఎం.డి భవానీశంకర్‌ ‌గారు చెప్పిన ప్రకారమే చెయ్యాల్సి వచ్చింది..’’ సూటిగా చెప్పాడు. నా గుండెల్లో రాయి పడింది. ఆ సెక్షన్‌లో ఇన్‌చార్జ్ అం‌టే లంచాలకి సంబంధించిన లావాదేవీలు, వాటిలో పై ఆఫీసర్లకు పంచవలసిన వాటాలు.. లోపాయికారీ ఒప్పందాలు.. మొత్తం ఒక మురిగ్గుంటలో దిగిపోయినట్టే..! నాకు అస్సలు నచ్చని, ఇష్టం లేని బాధ్యత..! విశ్వనాధం కావాలనే ఇలా చేస్తున్నాడనడంలో సందేహమేమీ లేదు. ఇందులో తన ఇంట్రెస్ట్ ఏమీ లేదని చెప్పడానికీ, సెక్షన్‌ ‌మార్చమని నేను రిక్వెస్ట్ ‌చేసే అవకాశం లేకుండా చెయ్యడానికి ఎం.డి గారి పేరు చెప్తున్నాడు. అసలు హెడ్‌ ఆఫీస్‌లో ఉండే ఎం.డి. గారు ఈ విషయం గురించి చెప్పే అవకాశం లేదు. ఆరోజు నేనన్న మాటలు గుర్తుపెట్టుకుని ఇప్పుడు ప్రతీకారం తీర్చు కుంటున్నాడన్న విషయం కూడా నాకు అర్థమౌతూనే ఉంది..! సరేనని చెప్పి అక్కణ్ణుంచి వచ్చేశాను.

నాలుగు రోజులు పోయాక ఆఫీస్‌కి ప్రమోషన్‌ ఆర్డర్స్ ‌వచ్చాయి. విశ్వనాధం చెప్పినట్టు నాకు అప్రూవల్‌ ‌సెక్షన్‌లో కాకుండా నా డిస్పాచ్‌ ‌సెక్షన్‌ ‌లోనే ప్రమోషన్‌ ‌పోస్టు కేటాయించారు. అంతేకాకుండా ట్రాన్స్‌ఫర్‌ ‌కూడా లేకుండా అదే ఆఫీసులో ఉంచారు. ఆ సెక్షన్‌లో ప్రస్తుతం పనిచేస్తున్న సెక్షన్‌ ఇన్‌ఛార్జిని లాంగ్‌ ‌స్టాండింగ్‌ ‌కారణంగా మరో దగ్గరికి బదిలీ చేసి ఆ స్థానంలో నన్ను వేశారు. అసలు నా విషయంలో ఈ మార్పు ఎలా జరిగిందో అర్థం కాక విశ్వనాధం బుర్ర బద్దలు గొట్టుకుని ఆలోచించాలి గానీ అలా ఆలోచించడానికి కూడా విశ్వనాధానికి ఇప్పుడు సమయం లేదు.

ఎందుకంటే అతనికి హెడ్డాఫీస్‌కు ట్రాన్స్‌ఫర్‌ అవడంతో బాటు అక్కడ లంచాలకు ఏమాత్రం అవకాశం లేని పోస్టు కేటాయించారు. ఇది ఆయనకు ఊహించని షాకింగ్‌ ‌న్యూస్‌! ఈ ‌విషయం నాక్కూడా ఆశ్చర్యంగానే అనిపించింది.

 నా విషయంలో మార్పు ఎలా జరిగిందో మాత్రం నాకొక్కడికే తెలుసు.. నా సెక్షన్‌ ‌సంగతి విశ్వనాధం చెప్పాక నేను రిక్వెస్ట్ ‌చేసినా అతను తన నిర్ణయం మార్చుకుంటాడనే నమ్మకం నాకు లేదు కాబట్టి ముందు అనుకున్న ప్రకారం హెడ్డాఫీస్‌కు వెళ్లి ఒకసారి ఎం.డి.గారిని కలిసి ప్రయత్నం చేద్దామని నిర్ణయించుకున్నాను.

 ఒకరోజు రోజు సెలవు పెట్టి హెడ్డాఫీస్‌కు వెళ్లాను. ఎం.డి.భవానీశంకర్‌ ‌గారి గురించి అందరూ చెప్పే విషయం ఏమిటంటే ఆయన కొన్ని విషయాల్లో చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారనీ, ఏదైనా అనుకుంటే అది చేసే వరకూ వదిలిపెట్టరని అంటారు.

మా ఎం.డి. గారికి యాభై ఏళ్ల వయసుంటుంది గానీ అంత వయసులా కనిపించరు. నన్ను చూసి వచ్చిన కారణమేమిటో కనుక్కున్నారు. ఆయన మాట తీరు చాలా సౌమ్యంగా ఉంటుంది.

‘‘ఈ విషయం కోసమయితే నా వరకూ రానవసరం లేదే..! మీ బ్రాంచ్‌ ‌హెడ్‌తో చెప్తే సరిపోతుంది కదా..’’ అన్నారాయన.

‘‘ఈసారి సెక్షన్‌ ‌కేటాయింపు మీరు చెప్పినట్టుగానే చేశానని ఆయన చెప్పారు. అందువల్ల మీ దగ్గరకు వచ్చాను సార్‌..’’ అన్నాను.

‘‘అలా చెప్పాడా..!?’’ ఆయన మోహంలో ఆశ్చర్యంతో పాటు చిన్న అసహనం కూడా కనిపించింది. నిజానికి విశ్వనాధం మీద పైస్థాయిలో ఎవరికీ సదభిప్రాయం లేదన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే..!

‘‘అవును సార్‌.. ఇప్పుడు నేను చేస్తున్న డిస్పాచ్‌ ‌సెక్షన్‌లో ఎలాంటి అవకతవకలకు ఆస్కారం ఉండదు.. అది మీకూ తెలుసు. నాకు అందులోనే ఉండాలనుంది సార్‌. ‌కానీ విశ్వనాధం గారు నన్ను ఇబ్బంది పెట్టడానికే అన్నట్టు అప్రూవల్‌ ‌సెక్షన్‌కి నన్ను సిపార్సు చేసినట్టు చెప్పారు సార్‌. అది కూడా మీ నిర్ణయం ప్రకారమే జరిగిందని అన్నారు.. నన్ను డిస్పాచ్‌ ‌సెక్షన్‌కి వెయ్యమని మిమ్మల్ని రిక్వెస్టు చెయ్యడానికే వచ్చాను సార్‌..’’ అన్నాను.

ఆయన నవ్వి.. ‘‘అలాగే వేద్దాం లెండి. మీకు తెలుసో లేదో గానీ ఎంతోమంది పై సంపాదన వచ్చే పోస్టులకు తమ బ్రాంచ్‌ ‌హెడ్‌ల ద్వారా సిఫార్సు చేయించుకుంటారు. అలాంటి పోస్టులకు పోటీ ఎక్కువైన సందర్భంలో అందుబాటులో ఉన్న ఖాళీలను బట్టి ఒకోసారి మేము ఇక్కడ మార్పు చెయ్యాల్సి వస్తుంది కూడా. కానీ మీరేమో అందరూ డ్రైగా భావించే డిస్పాచ్‌ ‌సెక్షన్‌కి అడుగుతున్నారు. అది అసలు పోటీ లేని సెక్షన్‌! అం‌దువల్ల మిమ్మల్ని ఆ సెక్షన్‌లో వేసేందుకు ఎలాంటి అభ్యంతరం లేదు.. విశ్వనాధం మిమ్మల్ని ఏ సెక్షన్‌కి సిఫార్సు చేసినా నేను మీ ఆర్డర్‌లో మాత్రం మీరు కోరుకున్న సెక్షనే కేటాయిస్తాను.. సంతోషమేనా..?’’ అడిగారు. ‘‘చాలా సంతోషం సార్‌..’’ అని ఆయనకు ధన్యవాదాలు చెప్పి తేలిక పడ్డ మనసుతో ఆరోజు అక్కణ్ణుంచి వచ్చేశాను. ఆ తర్వాత భవానీ శంకర్‌గారు నా పోస్టింగ్‌ ‌విషయంలో విశ్వనాధం ఇచ్చిన సిఫార్సును మార్చి నన్ను డిస్పాచ్‌ ‌సెక్షన్‌కు కేటాయించడంతో పాటు పోస్టింగ్‌ ‌కూడా ఈ బ్రాంచ్‌లోనే ఇచ్చారు. విశ్వనాధం విషయంలో కూడా ఎం.డి. గారే స్వయంగా నిర్ణయం తీసుకుని ఉంటారనిపించింది.

విశ్వనాధం మెడికల్‌ ‌లీవ్‌ ‌పెట్టి వెళ్లాడు. ఆయన మళ్లీ మంచి పోస్టు కోసం ప్రయత్నాలు చేస్తున్నాడని తెలియవచ్చింది. అయితే ఆ ప్రయత్నాలేమీ సక్సెస్‌ ‌కాలేదని కూడా తెలిసింది.

నెల రోజులు గడిచినా విశ్వనాధం తన కొత్త పోస్టులో జాయిన్‌ ‌కాలేదు. వేరే పోస్టు కోసం చేసిన ప్రయత్నాలన్నీ బెడిసి కొట్టాయనీ, అతను డిప్రెషన్‌లో ఉన్నాడనీ, అసలు బైటికే రావడం లేదనీ ఎవరో అన్నారు. ఆయన తనకు పై సంపాదన ఉందనే ధీమాతో వీలైనన్ని లోన్లు తీసుకున్నాడు. లోపాయికారీ ఒప్పందాలతో ఫ్లాట్లు కొని వాళ్లకు నెల నెలా కొంత మొత్తం తన అవినీతి సంపాదనలో నుంచి కట్టేవాడనీ, అవతలి వాళ్లకు కూడా ఇతని లంచాల దందా గురించి తెలుసు కాబట్టి డబ్బు కట్టేస్తాడనే ధీమాతో అలాంటి ఆఫర్లు ఇచ్చేవారనీ తెలిసింది. ఇప్పుడు జీతం నుంచే అవన్నీ మేనేజ్‌ ‌చెయ్యాలంటే ఇబ్బంది అవుతుంది. అది అలా ఉంచితే ఈయన అవతలి వాళ్లకి పని చేసి పెడతానని అప్పటికే లంచం తీసుకుని ఉన్న కేసులు కొన్ని ఉన్నాయి. ఈయన బదిలీ విషయం తెలియగానే డబ్బులు తీసుకున్నారు గాబట్టి మా పని మాత్రం ఎలా అయినా చేసి పెట్టాలని సతాయిస్తు న్నారన్న వార్తలు కూడా వచ్చాయి. ఈ విధంగా మొత్తానికి విశ్వనాధం ఊహించని ఉపద్రవంలోనే చిక్కుకున్నాడు.

పది రోజులు గడిచాక మళ్లీ నేను డాక్టర్‌ ‌దగ్గరకు వెళ్ల్లాను. ఆయన ‘ఈ మధ్య మళ్లీ ఎప్పుడైనా తల తిరుగుతున్నట్టు లేదంటే అనీజీగా ఉన్నట్టు ఫీలింగ్‌ ఏమైనా వచ్చిందా..?’ అనడిగాడు.

అప్పట్నుంచీ మళ్లీ రాలేదని చెప్పాను. ‘సరే.. మీరింక మందులు వాడనవసరం లేదు. ఒకవేళ మళ్లీ ఎప్పుడైనా అలా అనిపిస్తే మాత్రం ప్రిస్కిప్షన్‌లో నేను పైన రాసిన టేబ్లెట్‌ ‌వాడండి.. చాలు..’’ అన్నాడు.

సరేనని చెప్పి ‘‘సార్‌.. ‌నా ముందు బైటికి వెళ్తున్నాడే ఒకతను.. ఆయనకు ఏమిటి ప్రాబ్లెమ్‌..?’’ అడిగాను.

డాక్టర్‌ ‌నవ్వి ‘మీకొచ్చిన సమస్యే..! వెర్టిగో..! కాకపోతే ఇతనిది సైకోజెనిక్‌ ‌వెర్టిగో.. లేదా ఎమోషనల్‌ ‌వెర్టిగో అని కూడా అనొచ్చు. ఏదైనా తీవ్రమైన మెంటల్‌ ‌డిస్ట్రబెన్స్, ఏం‌గ్జయిటీ, డిప్రెషన్‌ ‌లాంటి వాటివలన కూడా వెర్టిగో వస్తుంది.. ఇది అలాంటిది! ఇంతకూ ఆయన మీకు తెలుసా..?’’ అడిగాడు.

‘‘తెలుసు డాక్టర్‌.. ఆయన పేరు విశ్వనాధం. మా బ్రాంచ్‌ ‌హెడ్‌..’’ ‌చెప్పాను.

బైట విశ్వనాధం కూర్చొని ఉన్నాడు. బహుశా అతనితో వచ్చిన వాళ్లు మందులు కొనడానికి వెళ్లుంటారు అనుకున్నాను. ఆయన కూడా నన్ను చూసినట్టే అనిపించింది కానీ ఇద్దరం పలకరించు కోలేదు.

తర్వాత వారంరోజులకు విశ్వనాధం హెడ్డా ఫీసులో జాయిన్‌ అయ్యాడన్న వార్త తెలిసింది. ఆర్నెల్లు గడిచాయి. విశ్వనాధం గురించి నేను కొన్ని కొత్త విషయాలు విన్నాను. అవి ఎంతవరకు నిజమో తెలీదు. ఒకసారి నేను కొన్ని ఫైల్స్ ‌తీసుకుని హెడ్డాఫీస్‌కు వెళ్లవలసి వచ్చింది. అక్కడ నా పని చూసుకుని తిరిగి వస్తుంటే విశ్వనాధం ఎదురుపడ్డాడు. నవ్వి విష్‌ ‌చేశాను. ఆయన కూడా నవ్వి నన్ను తన ఛాంబర్‌కు ఆహ్వానించాడు. సరేనని వెళ్లాను. నాతో మాట్లాడుతూ ‘‘ఒకసారి నువ్వు అన్న మాటలు నాకిప్పటికీ గుర్తున్నాయి. నువ్వు చెప్పింది కరెక్ట్. అప్పుడు నేను ఆ మాటల్ని నెగెటివ్‌గా తీసుకున్నాను. కానీ తర్వాత అర్థమైంది.. దేవుణ్ణి పూజించినంత మాత్రానే మనశ్శాంతి రాదు. మన చేతలు కూడా బాగున్నప్పుడే మనం మన మనసుకు సమాధానం చెప్పుకోగలుగుతాం.

అప్పట్లో ఎన్ని పూజలు చేస్తున్నా, ఎంతగా దైవకార్యాల్లో మునిగినా ఏదో అసంతృప్తి, ఆందోళన నన్ను నిత్యం వెంటాడేవి. అది ఎందుకనేది ఇప్పుడే అర్థమైంది. ఇక్కడికొచ్చాక లంచాల్లేవ్‌.. అవినీతి లేదు.. ఎప్పుడు ఏమౌతుందో అనే భయం, ఆందోళన అసలే లేవు..! ప్రశాంతంగా ఉన్నాను. ఇప్పుడు ఆ దేవుణ్ణి ‘నన్ను నిత్యం రక్షించే పూచీ నీదే స్వామీ..’ అని భయంగా వేడుకోవడం లేదు. ‘నన్ను ఎప్పుడూ ఇలా మంచి మార్గంలోనే నడిపిస్తూ ప్రశాంతంగా బ్రతికేట్లు చెయ్యి స్వామీ’ అని ఆనందంగా ప్రార్థిస్తున్నాను.. ఇదంతా నీకు చెప్పడానికి నేనేమీ చిన్నతనంగా ఫీలవడం లేదు..’’ అన్నాడాయన.

‘‘మంచిది సార్‌.. ‌చాలా సంతోషం.. మీరింకా ఉన్నతమైన స్థాయిలోకి వెళ్లాలని, ఇలాగే ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను..’’ ఆయనకి షేక్‌ ‌హాండ్‌ ఇస్తూ మనస్ఫూర్తిగా అన్నాను.

‘‘ఇంకో విషయం చెప్పాలి నీకు. నాకు వచ్చిన వెర్టిగో పూర్తిగా తగ్గిపోయిందయ్యా.. ఇప్పుడెలాంటి సమస్యా లేదు..’’ నవ్వుతూ చెప్పాడాయన. ఆయన నవ్వులో ఇప్పుడెలాంటి జిత్తులమారితనం కనిపించలేదు. పసిపిల్లల నవ్వులా స్వచ్ఛంగా అనిపించింది.

About Author

By editor

Twitter
YOUTUBE