డిసెంబర్‌ 16 ‌నుంచి ధనుర్మాసం ప్రారంభం

శ్రీమహావిష్ణువుకు ప్రీతికరమైనది మార్గశిరం. ‘మాసానాం మార్గ శీర్షోహం’ అని శ్రీకృష్ణ భగవానుడే చెప్పారు. ‘మార్గ’మంటే దారి అని, శీర్షమంటే ముఖ్యమైనది. భగవంతుని చేరేందుకు ముఖ్య ‘దారి’ని ఉపదేశించడం వల్ల ఆ పేరు వచ్చిందని పెద్దలు చెబుతారు. ప్రత్యక్ష నారాయణుడు సూర్య భగవానుడు వృశ్చిక రాశి నుంచి ధనూరాశిలోకి ప్రవేశించే కాలాన్ని ధనుస్సంక్రమణం, ధనుర్మాసం అనీ అంటారు. ధనుర్మాసంలో చంద్రుడు పౌర్ణమినాడు మృగశిర నక్షత్రంలో ఉంటాడు కాబట్టి మార్గశీర్ష, మార్గళీ మాసం అని అంటారు. ఈ పుణ్యకాలంలో ధనుర్మాసవ్రతం లేదా శ్రీవ్రతం నిర్వహిస్తారు. ఈ నెలంతా వైష్ణవ ఆలయాల్లో వేకువ జామునుంచే పెద్దఎత్తున అర్చనాదులు నిర్వహిస్తారు. సుప్రభాతం బదులు ‘తిరుప్పావై’ దివ్య ప్రబంధాన్ని ఆలపిస్తారు.

శాస్త్రీయంగా ఆలోచించినా ఈ మాసానికి విశిష్టత ఉంది. ఈ నెలంతా ముగ్గులతో కళకళలాడే లోగిళ్లు, ప్రాంగణాలు, వీధులు చలికాలంలో విజృంభించే సూక్ష్మజీవులు ఇళ్లలోకి రాకుండా నిలువరిస్తాయి. అలాగే ముగ్గులో కలిపిన బియ్యం పిండిలాంటివి చీమలు తదితర ప్రాణులకు ఆహారమవుతాయి.


‘కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీ కాననోద్భవామ్‌

‌పాండ్యే విశ్వంభరా గోదామ్‌ ‌వందే శ్రీరంగనాయకీమ్‌!!

‌విష్ణుపత్ని త్రేతాయుగంలో జనకమహారాజుకు నాగలి చాలులో సీతాదేవి కుమార్తెగా లభించినట్లు ఈ యుగంలో విష్ణుచిత్తుడు అనే ప్రసిద్ధ వైష్ణవ భక్తుడికి గోదాదేవిగా దొరికింది. నేటి తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరులోని వటపత్రశాయి ఆలయంలో ఆయన అర్చకత్వం నిర్వహించేవారు. చిత్తంతో (మనసు పెట్టి) విష్ణువును పిలిస్తే పలికేవాడట. అందుకే విష్ణుచిత్తునిగా పేరు వచ్చిందంటారు. ఆయనకు పెరియాళ్వార్‌ (‌పెద్ద ఆళ్వార్‌) అనే గౌరవం ఉండేది. ర•ంగని సేవకే జీవితాన్ని అంకితం చేసి, ఆయన పూజ కోసం ప్రత్యేకంగా పెంచుతున్న తులసి వనంలో చిన్నారి కనిపించింది. ఆయన ఆమెను చేరదీసి ‘కోదై’ (పూలదండ)అని పేరుపెట్టారు. అదే వ్యవహారంలో ‘గోదా’గా మారింది. ఉద్యానవనంలో లభించిన చిన్నారికి ‘గోదై’ అని విష్ణుచిత్తుల వారు నామకరణం చేశారు. ‘గో’ అంటే వేదప్రతిపాదితమైన పరమాత్మతత్వం, అదే శ్రీతత్వం. ‘దా’ అంటే ఇచ్చునది. ఈ కోణంలో చూస్తే ‘గోదా’ అంటే తత్త్వదాయిని, జ్ఞాన ప్రదాయినీ అని భాష్యకారులు చెబుతారు. విష్ణుచిత్తుడు కారణజన్ముడని, గరుడాంశ సంభూతుడని చెబుతారు. శ్రీమహావిష్ణువుకు ప్రథమ సేవకుడిగా ఉన్న గరుడుడు ఆయనకే కన్యాదాత కావాలని ద్వాపరయుగంలో ఆశపడ్డారని, ఈ యుగంలో అది నెరవేరేలా వరం పొందాడని, సాక్షాత్తు భూదేవినే కూతురుగా పొందారని పురాణగాథ.

శిఖర సమానం

భారతీయ భక్తి సాహిత్యంలో అత్యంత ప్రముఖమైన స్థానాన్ని అలంకరించేవి ఆళ్వార్‌ ‌దివ్యప్రబంధాలు. వాటిలో గోదాదేవి విరచితమైన ముప్పయ్‌ ‌పాశురాల ‘తిరుప్పావై’ శిఖర సమానంగా వెలుగొందుతోంది. దీని విశిష్టతను ‘వేదం అంతటికీ గోదాదేవి ద్రవిడ ప్రబంధం విత్తు’ (వేదమ్‌ అసైత్తుక్కుమ్‌ ‌విత్తుకుమ్‌) అని అభిజ్ఞులు కీర్తించారు. వేదరాశి ఒక వృక్షమైతే దానికి బీజం వంటిది తిరుప్పావై. అంటే వేదంలోని సారమంతా కలిగి ఉందని అర్థం. ఈ ద్రవిడ ప్రబంధాన్ని వేదంగా పరిగణిస్తారు. ‘తిరు’ అనేదానికి శ్రీ, లక్ష్మి, సంపద, శ్రేష్ఠం, ఐశ్వర్యం, మోక్షం అనే అర్థాలు ఉన్నాయి. ‘పావై’ అంటే వ్రతం. పాటలతో కూర్చిన మాల అని భావం. ‘తిరుప్పావై’ అంటే మోక్షసాధనకు భక్తిగీతాలతో కూడిన మాలతో చేసే వ్రతమని చెప్పుకోవాలి.

మధురభక్తితో మాధవసన్నిధి చేరవచ్చని నిరూపించారు. పూర్వజన్మ సంస్కారం కారణంగా శ్రీమన్నారాయణుడే భర్తగా లభించాలని గోదాదేవికి కోరిక కలిగింది. దాంతో దీక్ష బూని రోజుకొక పాశురం రాసి, గానం చేస్తూ విష్ణువును సేవించింది. ఆ పాశురాలే తిరుప్పావైగా ప్రసిద్ధమయ్యాయి. దక్షిణ భారతదేశంలో ధర్మ ప్రబంధాలై నిలిచాయి. తిరుప్పావై అని తమిళపదానికి శ్రీవ్రతం లేదా సిరినోము అంటారు. ముప్పయ్‌ ‌పాశురాల సంపుటిని తమిళవేదంగా ఆరాధిస్తారు. ఇది తమిళంలో ఉన్నా అన్ని దేశీయ భాషల్లోకి అనువదితమైంది. వివిధ రకాల పూలను ఏకం చేసేది ఒకే దారం అన్నట్లు పాటపాటకు భావం మారినా ఫలితం మాత్రం ఒకటే. అదే మోక్షం. పన్నెండు మంది వైష్ణవ ఆళ్వార్లలో ఏకైక మహిళ గోదాదేవి 8వ శతాబ్దంలో రామానుజుడికి ముందే భక్తిని ఉద్యమంలా సమాజపరం చేసిన సంస్కారవాది. అందుకే రామానుజాచార్యులు గోదాదేవిని ‘అక్కా’ అని ఆప్యాయంగా పిలిచేవారట. ఆయనకు తిరుప్పావై పాశురాలంటే ఎంతో మక్కువ. నిత్యం ముప్పయ్‌ ‌పాశురాలు పారాయణం చేసేవారు. ఆమె పట్ల ఆప్యాతానురాగాలు చూపుతూ, తమిళదేశంలోని ప్రతి వైష్ణ్వాలయంలో గోదాదేవి సన్నిధిని ఏర్పరచి ఆమెకు, పాశురాలకు విశిష్ట స్థానం కల్పించారు. ఆ సంప్రదాయం ఏవత్‌ ‌దేశానికి విస్తరించింది. తిరుమలలో ఈ సంప్రదాయం విశేషంగా కొనసాగుతోంది. ధనుర్మాసమంతా తిరుమలేశుని సన్నిధిలో సుప్రభాతానికి బదులు తిరుప్పావై పఠనం చేస్తారు. మామూలుగా అయితే భోగ శ్రీనివాసుడు అందుకునే మేలుకొలుపును ఈ నెలరోజుల పాటు శ్రీకృష్ణుడు అందుకుంటాడు.

పరమార్థం

గోదాదేవి తాను రంగనాథుడికి సతి కావాలన్న కోరికతో తిరుప్పావై పాడిందని సామాన్యంగా చెప్పుకునేది. కానీ అసలు అంతరార్థం ఇంకొకటి. భగవంతుడి ఆలోచనలు, సంకల్పాలు వేరుగా ఉంటాయి. కలియుగంలో సంసార సాగరంలో మునిగి దుఃఖపూరితులవుతున్న మానవులను చూచి మనసు ద్రవించిన శ్రీమన్నారాయణుడు వారు మోక్షం పొందేందుకు సులభోపాయాన్ని అమ్మవారికి వివరించారు. ఆయన ఉపదేశానుసారం ఆమె మానవరూపంలో నలనామ సంవత్సరం (శ్రావణ శుద్ధ చతుర్థి) మంగళవారం పూర్వ ఫల్గుణి నక్షత్రంలో తులసీ వనంలో అవతరించారు. అలా మానవజాతిని రక్షించడానికి వచ్చింది కనుకనే ‘ఆండాళ్‌’ (ఆం‌డాళ్‌ అం‌టే రక్షణ అనే అర్థం) అనే దివ్యనామం స్థిరపడి పోయింది.

శ్రీరంగనాథ అర్చన కోసం తండ్రి విష్ణుచిత్తుడు తయారు చేసిన పూలమాలను ధరించి తన బింబాన్ని చూసుకొని తిరిగి మాలను యథాస్థానంలో ఉంచేది. ఒకరోజు ఆ దృశ్యం కంటపడి కలతచెందిన విష్ణుచిత్తుడు ఆ నాటికి స్వామికి మాల సమర్పించలేదు. అదేరోజు రాత్రి స్వప్న సాక్షాత్కారం చేసిన రంగనాథుడు ‘గోదా ధరించి విడిచిన మాలికయే నాకు ప్రీతిపాత్రమైనది. నిత్యం ఆమె ధరించిన మాలనే నాకు సమర్పించు’ అని పలికాడట. అలా మాలను ధరించి విడచడం వల్ల ‘ఆముక్తమాల్యద’ అని ‘శూడికొడుత్త నాచ్చియార్‌’ అని పేరెన్నకగన్నారు.

సమాజహితైషి

సమాజానికి హితం కలిగించేదే సాహిత్యమని ఆలంకారికులు అన్నట్లు, ఆమె రాసి, పాడిన పాశురాలలో సమాజ శ్రేయస్సు కనిపిస్తుంది. కేవలం రంగనాథుని కోసమే ఈ వ్రతం చేయలేదు. తన సాహిత్యం ద్వారా సమాజ హితాన్ని కోరిన సౌజన్యమూర్తి సాక్షాత్కరిస్తుంది. కేవలం వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాకుండా సమష్టి లబ్ధి చేకూరాలన్న తపన ఇందులో వ్యక్తమవుతుంది. ఇతరులు కూడా తన మాదిరిగా భగవదనుగ్రహం, మోక్షం పొందాలన్న భావనతో ఆసక్తిపరులను వ్రతానికి ఆహ్వానించింది. ‘ఏకః స్వాదు నభుంజీత’ అని విదురనీతి. మంచి ఫలితాన్ని ఒక్కరే ఆస్వాదించ రాదనే గొప్పనీతిని అనుసరిస్తూ, ధనుర్మాసవ్రతాన్ని సర్వులూ ఆచరించాలనుకోవడం సాంఘిక నైతిక సందేశంగా చెబుతారు. ఈ వ్రతాన్ని ఆచరించేందుకు మత, కుల, లింగ, వయో విచక్షణ లేదు. మోక్షాన్ని కోరే సర్వ జనులు ఎల్లకాలం దీనిని ఆచరించవచ్చునని సమతామూర్తి రామానుజాచార్యులు ఆనాడే ఉద్భోదించారు. కృష్ణప్రేమ కోసం భాగవతంలో గోపికలు కాత్యాయనీ వ్రతం చేస్తే ఇక్కడ గోదాదేవే గోపిక వేషధారణలో ఇంటింటికి వెళ్లి గోపికలను నిదురలేపి కృష్ణుని ఆలయానికి తీసుకు వెళ్లి అర్చించ సాగింది. ‘ఏడాదికి మూడు పంటలు పండాలి. గోవులు సమృద్ధిగా పాలు ఇవ్వాలి. సరిపడినంత వర్షం కురవాలి. ఏ సందర్భంలోనూ ‘లేదు’ అనే మాట వినిపించకూడదు’ అని ఒక పాశురంలో ఆకాంక్షిస్తారు.

శ్రీరంగనాథుడిని వలచిన ఆమె ఆయనను చేరడానికి నవవిధ భక్తిమార్గాలలో గాన మార్గాన్ని ఎంచుకున్నారు. భగవత్‌ ‌సాక్షాత్కారం కోసం యుగధర్మం ప్రకారం, కృతయుగంలో ధ్యానం, త్రేతాయుగంలో యజ్ఞం, ద్వాపరంలో అర్చన, కలియుగంలో సంకీర్తన విధానాలను ఆచరిస్తారు. ఆ ప్రకారమే గోదాదేవి సంకీర్తన (గాన) భక్తిని అనుసరించింది. భగవంతుడిని భక్తితో కీర్తిస్తే ఆయనను తప్పక పొందగలరని, అందుకు దేశకాలాలతో నిమిత్తం లేదని రుజువు చేశారు. సంకల్పశక్తి, చిత్త శుద్ధి ఉంటే భగవంతుడి హృదయాన్నే గెలుచుకోవచ్చని నిరూపించారు.

– డా।। ఆరవల్లి జగన్నాథస్వామి, సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE