రామో విగ్రహవాన్‌ ‌ధర్మః – అంటే, శ్రీరాముడు ధర్మానికి ప్రతిరూపం. ఆయన నడిచిన మార్గం అనుసరణీయం. ఆయన జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శం. అటువంటి ఉత్తమ పురుషుని జన్మ స్థలమైన అయోధ్యలో రామమందిర నిర్మాణం ప్రతిఒక్క హిందువు కల.

ఎన్నో శతాబ్దాల పోరాటం, సుమారు నాలుగున్నర లక్షల మంది ఆత్మబలిదానం ఫలితంగా నేడు ఆ కల సాకారమైనది. ఈ ఏడాది ఆగష్టు 5న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయోధ్యలో భూమిపూజ చేశారు. ఆ విధంగా రామజన్మ భూమిలో దివ్యమైన, భవ్యమైన మందిర నిర్మాణ పనులు వేగంగా జరుగుతన్నాయి.

అయితే, సహజంగానే ఈ మహత్కార్యంలో పాలుపంచుకోవాలని, మందిర నిర్మాణానికై తన వంతు కృషి చేయాలని ప్రతిఒక్కరూ భావిస్తారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘ ‘శ్రీరామ జన్మభూమి మందిర నిర్మాణ ధన సంగ్రహ అభియాన్‌’ అనే ఒక చక్కటి జనజాగరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దేశవ్యాప్తంగా ప్రతిఒక్కరు ఇందులో భాగస్వాములయ్యేలా ప్రణాళిక రూపొందించింది. అయితే, ఇది కేవలం ధన సమీకరణ కోసం చేసే ఉద్యమం కాదు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం సామాన్యుడిని కూడా మందిర నిర్మాణంలో భాగస్వామ్యం చేయడం, తద్వారా వారికి అయోధ్య చరిత్ర, స్థల విశిష్టత వంటి విషయాలు గుర్తుచేయడం. ఈ పవిత్ర కార్యక్రమం శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఆధ్వర్యంలో జరగనున్నది.

ఈ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం నుంచి ఒక్క పైసా కూడా స్వీకరించరు. సామాన్యుడు సమర్పించేది ఎంత చిన్న మొత్తమైనా దానిని స్వీకరి స్తారు. వారు ఎంత ఇవ్వగలిగితే అంత ఇవ్వొచ్చు. ఆ విధంగా పది, వంద, వెయ్యి రూపాయల కూపన్లు రూపొందిస్తున్నారు. రెండు వేలకు పైన సమర్పించిన వారికి రశీదులు ఇస్తారు. అదనంగా ఎటువంటి పన్నులు చెల్లించాల్సిన అవసరం ఉండదు.

2021 జనవరి 15 (సంక్రాంతి)న ప్రారంభించి.. మాఘ పూర్ణిమ (ఫిబ్రవరి 28) వరకు.. సుమారు నలభై రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని ఒక యజ్ఞంలా  నిర్వహించనున్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ సంస్థల కార్యకర్తలు, సంత్‌ ‌మహాత్ములు, వివిధ ధార్మిక సంస్థలవారు, దేశవిదేశాల్లో ఉన్న హిందూ బంధువులు.. ఇంకా అనేకమంది ఇందులో భాగస్వామ్యులు కానున్నారు.

కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా నాలుగున్నర లక్షల గ్రామాలలో పర్యటించనున్నారు. సుమారు పదకొండున్నర లక్షల కుటుంబాలను కలుస్తారు. ఒక కుటుంబానికి కనీసం ఐదుగురు సభ్యులున్నా.. సుమారు 55 కోట్ల మందిని కలవొచ్చని అంచనా వేస్తున్నారు.

ధన సేకరణ సమయంలో ఇచ్చే కూపన్లను కేవలం ఒక కాగితం ముక్కలా కాకుండా.. దానిని చూడగానే రామ జన్మభూమి.. అయోధ్య స్ఫురణకు వచ్చేలా రూపొందిస్తున్నారు. స్వామి వివేకానంద శిలా స్మారకం సమయంలో ప్రతిఒక్కరం ఎలాగైతే ఒక్కరూపాయి కూపన్లను ఇప్పటికీ దాచుకున్నామో.. అలాగే ఈ కూపన్లు కూడా చాలా కాలం నిలిచిపోయేలా తయారుచేస్తున్నారు. కాబట్టి ఇదొక చారిత్రాత్మకమైన ధన సమర్పణ అనే భావన ప్రతిఒక్కరిలో కలుగుతుంది. లక్ష, ఆపైన సమర్పించే వారికి ఒక ఫోల్డర్‌తో కూడిన శ్రీరాముడి చిత్రపటాలు అందజేస్తారు.

అయితే, ఈ ఆలోచన వెనుక ఒక గొప్ప ఉద్దేశం ఉన్నది. అయోధ్య చరిత్ర గురించి ఇప్పటికీ చాలా మందికి తెలీదు. మనదేశంలో ఇంకా రామాలయాలు లేవా? మనమంతా అక్కడికే పోవాలా? అని అనుకునేవారు కూడా ఉన్నారు. అయితే అలాంటి వారికి చరిత్రను గుర్తుచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయోధ్య- శ్రీరాముడు నడయాడిన నేల. సుమారు పన్నెండు వేల సంవత్సరాలు (త్రేతాయుగంలో) ఆయన ధర్మ పాలన ఇక్కడి నుంచే సాగిందనే విషయం అందరకీ తెలిసిందే. శ్రీరాముడు పాలించిన రాజ్యం రామరాజ్యంగా పరిఢవిల్లింది. దిగ్విజయ యాత్రలో భాగంగా ఈ భూమండలం మొత్తాన్ని ఆయన చుట్టివచ్చారు. ఆ విధంగా ఆయన రాజ్యం ప్రపంచ కీర్తినందుకున్నది.

ఒక వ్యక్తి ఎలాంటి ధర్మాన్ని నిర్వర్తించాలి, ప్రతిఒక్కరు ఎవరికి వారు తమ ధర్మాన్ని చక్కగా నిర్వర్తిస్తే సమాజానికి ఎటువంటి మేలు కలుగుతుందో తాను ఆచరించి, ఇతరులకు కూడా బోధించిన మహనీయుడు శ్రీరాముడు. అవతార పురుషుడిగా ఈ భూమ్మీద జన్మించినా సామాన్య మానవుడిగానే జీవించాడు. ఎన్నో కష్టాలను అనుభవించాడు. అయినా తన సంకల్పాన్ని ఎన్నడూ మరువలేదు. మనిషి ఏ విధంగా జీవిస్తే, మాధవుడిగా మిగిలిపోతాడో తెలిపేందుకు శ్రీరాముడి జీవితమే ఒక చక్కటి ఉదాహరణ.

ఈ కార్యక్రమంలో శ్రీరాముడి ఆదర్శజీవితం, అయోధ్యలో రామమందిరం నిర్మాణం కోసం జరిగిన పోరాట చరిత్ర, ఈ స్థల పురాణం, ఇక్కడ నిర్మిస్తున్న మందిరం ఏ విధంగా ప్రత్యేకమైనది వంటి విషయాలు ప్రతిఒక్కరికీ తెలియజేస్తాము. తద్వారా ప్రతిఒక్కరిలో తన ధర్మాన్ని నిర్వర్తిస్తూనే ఈ సమాజానికి మేలు చేయాలనే భావన కలుగుతుంది. ఇదే ఈ కార్యక్రమం ఉద్దేశం.

ఇప్పటికే సామాన్యుడి నుంచి అనేక కార్పొరేట్‌ ‌సంస్థలు, నిర్మాణరంగ సంస్థలు  కూడా తమకు డబ్బు వద్దని, మందిర నిర్మాణంలో పాలుపంచుకునే భాగ్యం కల్పిస్తే చాలని కోరుతున్నారంటే ఈ మందిర నిర్మాణం సమాజంలో ఎలాంటి స్ఫూర్తిని తెచ్చిందో అర్థంచేసుకోవచ్చు.

మందిర నిర్మాణ పనుల గురించి చెప్పాలంటే.. అయోధ్య ప్రపంచంలోనే ఒక గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా రూపొందనుంది. వేల సంవత్సరాలకు పైగా చెక్కుచెదరకుండా ఆలయ నిర్మాణం చేపడుతున్నారు. భక్తులకు సకల సౌకర్యాలు ఏర్పాటుచేస్తున్నారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసమై పరితపించిన, ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఈ పోరాటంలో పాల్గొని ఆత్మబలిదానం చేసిన మహానుభావుల దివ్యస్మృతులు, ఇక్ష్వాకు సామ్రాజ్యం గొప్పతనాన్ని ప్రతిబింబించే విధంగా నిర్మాణాలు, ఆధ్యాత్మికత ఉట్టిపడేలా.. ఇంకా అనేక  నిర్మాణాలు చేపడుతున్నారు. ఈ పనులన్నీ మూడు సంవత్సరాల్లో పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఈ సృష్టిలోని ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో శ్రేష్టమైనది మానవజన్మ అని చెబుతారు. ఎన్నో జన్మల పుణ్యఫలంగా మనం ఈ జన్మను దక్కించుకున్నాం. అలాగే, మానవజాతి మొత్తానికి మార్గదర్శనం చేసిన గొప్పకేంద్రం అయోధ్య అని చెప్పవచ్చు.  కాబట్టి ఈ జనజాగరణ కార్యక్రమంలో భాగస్వామ్యులు కావడం ద్వారా తమ జన్మ ధన్యమవుతుందని చాలా మంది భావిస్తున్నారు. ఈ సందర్భంగా జాతికి స్ఫూర్తి కేంద్రమైన రామమందిర నిర్మాణం కోసం మనం ఇచ్చేటటువంటి ధనరాశి (సమర్పణ) రాబోయే తరాలకు కూడా స్ఫూర్తిని ఇస్తుందని చెప్పవచ్చు. కాబట్టి ఈ ధన సేకరణ ఉద్యమంలో ప్రతిఒక్కరు పాల్గొంటారని, అలాగే సాధ్యమైనంత మందిని ఈ పవిత్ర కార్యంలో భాగస్వామ్యుల్ని చేస్తారని ఆశిస్తున్నాను.

– వై. రాఘవులు, విశ్వహిందూ పరిషత్‌

‌జాతీయ ప్రధాన కార్యదర్శి

About Author

By editor

Twitter
YOUTUBE