సెప్టెంబర్ 17.. ఈ తేదీకి అవిభక్త ఆంధప్రదేశ్ చరిత్రలో ఒక ప్రత్యేకత ఉంది. తెలంగాణ విమోచన దినం. దేశానికి 1947 ఆగష్టు 15న స్వాతంత్రం వచ్చినా హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేసేందుకు నిజాం నవాబ్ మీర్ ఉస్మాన్ ఆలీఖాన్ అంగీకరించలేదు. తనకు తాను స్వాతంత్య్రం ప్రకటించుకున్నారు. ఆ సమయంలో భారత తొలి హోంమంత్రి, సర్దార్ వల్లభభాయి పటేల్ 1948 సెప్టెంబర్ 13న ఆపరేషన్ పోలో పేరిట భారత సైన్యాన్ని రంగంలోకి దించారు. నాలుగే నాలుగు రోజుల ‘పోలీస్ యాక్షన్’తో సెప్టెంబర్ 17న నిజాం నవాబు లొంగిపోయారు. హైదరాబాద్ సంస్థాన ప్రజలకు నవాబు పాలన నుంచి విముక్తి లభించింది. ఆ విధంగా సెప్టెంబర్ 17వ తేదీ చరిత్రలో తెలంగాణ విమోచన దినంగా మిగిలిపోయింది.
అలాగే, విభజిత ఆంధప్రదేశ్ చరిత్రలో డిసెంబర్ 17వ తేదీ.. ఇంకో విధంగా ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ప్రస్తుతం ఆంధప్రదేశ్ రాష్ట్రంలో రావణ కాష్టంలా రగులుతున్న రాజధాని వివాదానికి 2019 డిసెంబర్ 17వ తేదీనే అంకురార్పణ జరిగింది. అదే రోజున అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఒక సంచలన ప్రకటన చేశారు. సంవత్సర కాలంగా సాగుతున్న రాజధాని రగడ చిత్రానికి శాసనసభలో క్లాప్ కొట్టారు. ఆ రోజు ఆయన శాసనసభలో అధికార వికేంద్రీకరణ పేరిట ఒక ప్రకటన చేశారు. మూడు రాజధానుల ముచ్చటను బయట పెట్టారు. ‘రాష్ట్రంలో అధికార వికేంద్రీకరణ అవసరమ’ంటూ మొదలుపెట్టి ‘దక్షిణ ఆఫ్రికాలోలాగా మనకు మూడు రాజధానుల అవసరం రావచ్చని, విశాఖలో కార్యనిర్వాహక రాజధాని ఉండొచ్చు, ప్రభుత్వ యంత్రాంగం అక్కడినుంచే పనిచేయవలసి రావచ్చు.. అమరావతి శాసనపరమైన రాజధానిగా కొనసాగవచ్చు.. కర్నూల్‌లో న్యాయ రాజధాని రావచ్చు.. ఆంధ్ర రాష్ట్రానికి బహుశా మూడు రాజధానులు వస్తాయేమో.. వచ్చే పరిస్థితి కనిపిస్తోంది’ అంటూ అదేదో తమ చేతుల్లో లేని విషయంలాగా, తమకు సంబంధం లేని అంశం అన్నట్లుగా, తాను నిమిత్తమాత్రుని అన్నట్లుగా రావచ్చు… కావచ్చు.. అంటూ ముక్తాయింపునిచ్చారు. ఒకవిధంగా ‘స్థిత ప్రజ్ఞత’ ప్రదర్శించారు. అయితే అది ఆయనకు సంబంధంలేని విషయం కాదు. అలా అయితే, ఇంత రగడ జరిగేదే కాదు. లెక్కలన్నీ చూసుకుని, పక్కా వ్యూహంతోనే ఆయన శాసన సభలో మూడు రాజధానుల ప్రకటన చేశారు. అమరావతిలో రాజధాని నిర్మాణం పూర్తి చేయాలంటే, లక్షల కోట్లు కావాలని అదే విశాఖలో అంత ఖర్చు ఉండదని లెక్కలు చెప్పారు.
అలా ఆయన శాసన సభలో ప్రకటన చేశారో లేదో.. ఇలా అమరావతిలో రాజధాని నిర్మాణానికి (34 వేల ఎకరాల) భూమి ఇచ్చిన రైతులు ఆందోళనకు దిగారు. గత ప్రభుత్వం హయాంలో, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చూపిన ఆశలకు ఆకర్షితులై భూ సమీకరణలో భాగంగా భూములు ఇచ్చిన రైతులు కట్టుకున్న కలల సౌధాలు జగన్ ప్రకటనతో కుప్పకూలిపోయాయి. దీంతో, అమరావతిలో ఆందోళన అగ్గి రాజుకుంది. రైతులు ముఖ్యమంత్రి చేసిన మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఇక అక్కడి నుంచి వెలగపూడి కేంద్రంగా వివిధ రూపాల్లో రాజధాని రైతుల పోరాటం సాగుతోంది. అందుకు, తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం అనుకూల మీడియా మద్దతు ప్రకటించడంతో ఉద్యమం, ఎప్పటికప్పుడు కొత్త రూపం సంతరించుకుంటూ.. కొత్త కొత్త ఎత్తులు, పైఎత్తులతో నిర్విఘ్నంగా కొనసాగుతోంది. రైతుల ఆందోళనను ఒక్క అధికార వైసీపీ మినహా మిగిలిన అన్ని పార్టీలు సమర్ధిస్తున్నాయి. ఇప్పుడు రైతుల ఆందోళనకు సంవత్సరం పూర్తి కావడంతో రాజధాని రగడ పతాక శీర్షికలకు చేరింది. సరే.. ఉద్యమం, పోరాటం విషయంలో ఎవరికుండే అనుమానాలు వారికున్నాయి. పెయిడ్ ఆర్టిస్టులు, కులం పేరిట దూషణలు, ఇతరత్రా ఆరోపణలు, ప్రత్యారోపణలు ఇలా చాలా కథ నడిచింది. ఇంకా నడుస్తూనే ఉంది.
అయితే, ఇప్పుడు ఈ వివాదం లోతుల్లోకి వెళ్లి చూస్తే, ఇది కేవలం రాజధానికి సంబంధించిన అంశం కాదని, ప్రాంతీయ పార్టీల ఉమ్మడి ప్రయోజనాలు సహా ఇంకా చాలా అంశాలతో ముడిపడిన వ్యవహారమని అర్థం చేసుకోవడం కష్టం కాదు. అందుకే, సమస్యకు పరిష్కారం కనుచూపు మేరలో కనిపించడం లేదు. నిజానికి రాష్ట్ర రాజకీయా లపై ప్రాంతీయ పార్టీల పట్టు కొనసాగాలంటే, ఆ రెండు పార్టీల మధ్య ఏదో ఒక వివాదం ఇలా సాగుతూనే ఉండడం ఇరు పార్టీలకు అవసరం. అందుకే వైసీపీ, తెలుగుదేశం పార్టీలు అమరావతి అగ్నిగుండం చల్లారకుండా జాగ్రత్త పడుతున్నాయని పిస్తుంది. ఓ వైపు ఇలా రాజకీయం సాగుతుంటే మరోవైపు కోర్టులలో కేసులు, విచారణలు సాగుతున్నాయి. కాబట్టి ఈ వివాదం, ఈ సమస్య ఇప్పట్లో తేలే అవకాశం లేదని అందరికీ అర్థమవుతూనే ఉంది. అయినా అధికార పార్టీ, ప్రభుత్వం అధికార వికేంద్రీకరణ, మూడు రాజధానులు తమ విధానం అని ప్రకటించుకుని మెట్టు దిగడం లేదు. అంతేకాదు, తెలుగుదేశం ప్రభుత్వం భూ సమీకరణ పేరిట ఇన్‌సైడ్ ట్రేడింగ్‌కు పాల్పడిందని ఎన్నికల ముందు నుంచి వైసీపీ చేస్తూ వచ్చిన ఆరోపణలపై జగన్ ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘం విచారణ జరిపించింది. కొందరు తెలుగుదేశం పార్టీ నాయకులు రాజధాని ప్రకటనకు ముందే ఆ ప్రాంతంలో భూములు కొని అవి భూ సమీకరణ పరిధిలోకి రాకుండా చేసుకుని ధరలు పెంచుకున్నారని మంత్రి వర్గ ఉపసంఘం నిర్ధారించింది. ఏసీబీ కేసుల వరకు కథ నడిచింది. అలాగే, జీఎస్ రావు కమిటీ, బోస్టన్ గ్రూప్ పేరిట ప్రజాభిప్రాయ సేకరణ తంతును జరిపించింది. చివరకు మూడు రాజధానుల నిర్ణయానికి అవసరమైన అధికార హంగులను సిద్ధంచేసుకుంది. అయినా ఇది ఇప్పట్లో తేలే సమస్య కాదు. మరోవైపు వైజాగ్ విషయంలో తెలుగుదేశం పార్టీ వైసీపీ మీద అవే ఆరోపణలు చేస్తోంది. ముఖ్యమంత్రి, ఆయన కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులు వైజాగ్‌లో భూములు కొనుగోలు చేశారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. కాబట్టి ఈ పరిస్థితులను గమనిస్తే ఇప్పుడే కాదు, రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్నంత వరకూ ఒక్క రాజధాని సమస్య మాత్రమే కాదు, విభజన అనంతరం తలెత్తిన సమస్యలు ఏవీ పరిష్కారం కావు సరి కదా.. కొత్త సమస్యలు పుట్టుకొస్తూనే ఉంటాయి.
ఇప్పటికే రాష్ట్ర విభజన జరిగి ఏడు సంవత్సరాలైంది. అయినా రాజధానికి ఒక రూపం అంటూ రాలేదు. తెలుగుదేశం ప్రభుత్వం కట్టిన తాత్కాలిక భవనాలు తప్ప ఇంకేమీ లేదు. అంతేకాదు, రాజధాని నిర్మాణానికి కేంద్రం చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే 2500 కోట్ల రూపాయలు ఇచ్చింది. కేంద్రం ఇచ్చిన నిధులతోనే చంద్రబాబు ప్రభుత్వం తాత్కాలిక భవనాలు కట్టింది. అందులో పెద్దఎత్తున అవినీతి జరిగిందన్న ఆరోపణలున్నాయి. రాజధాని నిర్మాణానికి కేంద్రం నిధులు సమకూరుస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కోరితే తప్ప రాజధాని ఎక్కడ, ఏమిటి అనే విషయాల్లో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకునే అవకాశం చట్టం కల్పించడం లేదు. అందుకే, కేంద్ర ప్రభుత్వం రాజధాని నిర్ణయాధికారం రాష్ట్ర ప్రభుత్వానిదే అని రాష్ట్ర హైకోర్టులో దాఖలుచేసిన అఫిడవిట్‌లో స్పష్టంగా పేర్కొంది. అదే సమయంలో రాష్ట్ర బీజేపీ అమరావతే రాజధాని. అక్కడే సచివాలయం, అక్కడే శాసనసభ, హైకోర్టు మాత్రం కర్నూల్‌లో ఏర్పాటు చేయాలని, అదే తమ విధానమని స్పష్టం చేసింది. పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు, ఇతర నాయకులూ ఇదే ఇషయాన్ని పదే పదే స్పష్టం చేశారు. రాజధాని రైతుల ఉద్యమానికి మద్దతుగా బీజేపీ, జనసేన నాయకులు వివిధ రూపాల్లో ఆందోళనలు నిర్వహిస్తున్నారు.
ప్రాంతీయ పార్టీలు మాత్రం ఈ విషయం పరిష్కారం అయితే, తమ రాజకీయ మనుగడ దెబ్బతింటుందని సమస్యను సమస్యగానే ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటు వైసీపీ, అటు టీడీపీ ఇప్పుడు రాజధాని విషయంలో ప్రజాభిప్రాయం (రెఫరెండం) పేరిట సవాళ్లు, ప్రతిసవాళ్లు చేసుకుంటున్నారు. అలాగే తిరుపతి లోక్‌సభ స్థానానికి త్వరలో జరగనున్న ఉపఎన్నికల్లో రాజధాని అంశాన్ని ప్రధాన అజెండా చేసేందుకు వైసీపీ, టీడీపీ ఒకటై కుట్ర చేస్తున్నాయి. చంద్రబాబు వైసీపీ ఎమ్మెల్యేలు 151 మంది రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలని అంటే, వైసీపీ నాయకులు తెలుగుదేశం ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ప్రజాభిప్రాయం కోరాలని డిమాండ్ చేశారు. చివరకు మంత్రి పెద్దిరెడ్డి అదీ ఇదీ ఎందుకు, తిరుపతి ఉపఎన్నికనే రాజధాని రెఫరెండంగా తీసుకోవాలని, ఓడిపోతే చంద్రబాబు రాజకీయ సన్యాసం తీసుకోవాలని సవాలు విసిరారు. అయితే, రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలను అడ్డుకునేందుకు ఉభయ ప్రాంతీయ పార్టీలు ‘మ్యాచ్ ఫిక్సింగ్’ సవాళ్లు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులే కాదు, సామాన్య ప్రజలు కూడా గుర్తించారు.
ముఖ్యంగా రాష్ట్ర విభజన అనంతరం గడచిన ఆరున్నర, ఏడు సంవత్సరాల కాలంలో ప్రాంతీయ పార్టీల ప్రభుత్వాలు అవినీతికి నిలయాలుగా మారి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేశాయి. అందుకే, ప్రజల దృష్టిని ప్రాంతీయ పార్టీల జోడీ వైఫల్యాల నుంచి మరల్చేందుకు, రాజధాని వివాదాన్ని తిరుపతి ఉపఎన్నికల ముందు పెద్దఎత్తున తెరమీదకు తెచ్చేందుకు ఉమ్మడి వ్యూహంతో పావులు కదుపు తున్నాయి. ప్రజలు అమాయకులేమీ కాదు. అన్నీ గమనిస్తున్నారు. సరైన సమయం చూసి దెబ్బ కొడతారు.
– రాజనాల బాలకృష్ణ, సీనియర్ జర్నలిస్ట్